విశ్లేషణ
వారంలో ఎన్ని గంటలు పనిచేయాలి? ఈ మధ్య కాలంలో దేశం మొత్తమ్మీద విపరీతమైన చర్చ లేవనెత్తిన ప్రశ్న ఇది. ఏడాది క్రితం ‘ఇన్ఫోసిస్’ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి దేశం కోసం వారంలో 70 గంటలు పనిచేయాలని సూచించడంతో మొదలైందీ చర్చ. ఇది సద్దుమణిగేలోపు, ‘లార్సెన్ అండ్ టూబ్రో’ (ఎల్ అండ్ టీ) ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ వారంలో 90 గంటలు పని చేయాలని ఇచ్చిన సలహా మళ్లీ దుమారం రేకెత్తించింది.
‘ఆదివారాలు ఎంత సేపని మీ భార్యల ముఖాలు చూస్తూ కూర్చుంటారు, ఆఫీసులకు వచ్చి పనిచేయండి’ అని కూడా ఆయన చతుర్లు ఆడారు. ఈ సరదా వ్యాఖ్య కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. లక్షల జోకులు, మీమ్స్ పుట్టుకొచ్చాయి. నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యన్ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు యథాలాపంగా చేసిన వ్యాఖ్యలను బట్టి వారిని జడ్జ్ చేయడం మంచిది కాదు. కానీ సుదీర్ఘ పనిగంటలను వారు సీరియస్‌గానే ప్రతిపాదిస్తున్నట్టు కనిపిస్తోంది.
వ్యాపార రంగంలో వారిద్దరి నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసు కుని చూస్తే ఆ వ్యాఖ్యలకు మనం విలువ ఇవ్వాలి. దేశంలో ఇన్ఫర్మే షన్ టెక్నాలజీ విప్లవానికి పునాదులు వేసిన వ్యక్తి, ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీని నిలబెట్టిన వ్యక్తి నారాయణమూర్తి. ఎల్ అండ్ టీ చైర్మన్ కూడా ఆషామాషీ వ్యక్తి కాదు. 5,690 కోట్ల డాలర్ల విలువైన, ఫోర్బ్స్ జాబితాలో నమోదైన కంపెనీని నడిపిస్తున్నారు. కాబట్టి వీరి దృష్టి కోణాలకు ప్రాధాన్యం ఉంటుంది.
ఇంటి పని మాటేమిటి?
నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యల నేపథ్యంలో కనిపించే ఒక అంశం ఏమిటంటే... వీరిరువురి భార్యలకు సొంతంగా ఉద్యోగాలేమీ లేకపోవడం. దీనివల్ల మన సంరక్షణ బాధ్యతలు చూసుకునే వ్యక్తులు మన అభివృద్ధిలో ఎంత మేరకు భాగస్వాములో తెలియకుండా పోతుంది. వీరిద్దరు చెప్పినట్లు వారానికి 70 లేదా 90 గంటలు పనిచేశామనుకోండి... మహిళలు ఉద్యోగాలు చేయడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు అంత ఎక్కువ పెరిగిపోతాయి కాబట్టి!
ఉద్యోగాలు చేసే వారి పిల్లల సంరక్షణ కోసం దేశంలో ఇప్పటి వరకూ ఎలాంటి ఏర్పాట్లూ లేవు. ఇలా ఉండి ఉంటే తల్లులు కూడా ఎక్కువ సమయం ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో గడిపేందుకు అవకాశం ఏర్పడేది. వారంలో 70 లేదా 90 గంటలు పనిచేయాలన్న ఆలోచన వెనక ఆ ఉద్యోగి జీవిత భాగస్వామికి ఉద్యోగం ఏదీ లేదన్న నిర్ధారణ ఉండి ఉండాలి. పితృస్వామిక భావజాలం ఎక్కువగా ఉండే భారతదేశ నేపథ్యాన్ని లెక్కలోకి తీసుకుంటే... ఆ జీవిత భాగస్వామి మహిళే అయి ఉంటుంది.
ఈ వ్యవహారంలో భార్య ప్రస్తావన వచ్చేందుకు ఇంకోటి కూడా కారణం. భార్యలు ఇంటిపట్టున తీరికగా ఉన్నారు అన్న అంచనా. ఇంకోలా చెప్పాలంటే... ఇంట్లో పని మొత్తం అంటే ఇల్లూడ్చడం, వంట, పిల్లల మంచిచెడ్డలు, వయసు మళ్లిన వారి బాగోగులన్నీ ఇతరులు ఎవరో చూసుకుంటున్నారన్నమాట. వాస్తవం ఏమిటంటే... ఇలా పనులు చేసిపెట్టే వారు ఏమీ అంత చౌకగా అందుబాటులో ఉండరు.
ఈ దృష్ట్యా చూస్తే... ఈ ఇద్దరు ప్రముఖులు పని అంటే కేవలం ఇంటి బయట చేసేది మాత్రమే అన్న అంచనాతో మాట్లాడటం సమంజసం కాదు. ఇంటి పని కూడా చాలా శ్రమతో కూడుకున్నది, సమయం తీసుకునేదని వీళ్లు గుర్తించి ఉండాల్సింది. పైగా ఇంటి పనులు సాధారణంగా ఆడవారే చేస్తూంటారు. ప్రపంచవ్యాప్తంగా, ఇంకా ముఖ్యంగా భారతదేశంలో ఇదే ధోరణి కనిపిస్తుంది. ఇంట్లో ఆడవాళ్లు చేసే శ్రమ విలువ ఎంతో అర్థం చేసుకోవాలంటే ఆ మధ్య వచ్చిన మలయాళ సినిమా ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’ ఒకసారి చూడాలి.
మహిళ శ్రామిక శక్తి భాగస్వామ్యం ఎంత?
ఈ నేపథ్యంలో దేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం ఎంత అన్న ప్రశ్నకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. అంతర్జాతీయంగా మహిళల భాగస్వామ్యం సగటున 51 శాతం ఉంటే భారత్‌లో గణనీయంగా తక్కువ ఉండేందుకు కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. అయితే, ఇటీవలి కాలంలో ఈ సంఖ్య కొంచెం ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం, మహిళల భాగస్వామ్యం 2017–18లో 23.3 శాతం మాత్రమే ఉంటే, 2023–24లో 41.7 శాతానికి పెరిగింది. పురుషుల భాగస్వామ్యం సుమారుగా 78.8 శాతం ఉండటం గమనార్హం.
ఆర్థికవేత్తలు శమికా రవి, ముదిత్ కపూర్‌లు చేసిన ఒక అధ్యయనం ప్రకారం, దేశంలో శ్రమశక్తిలో పెళ్లయిన మగవారి భాగస్వామ్యం చాలా ఎక్కువ. అదే సమయంలో పెళ్లయిన మహిళల సంఖ్య చాలా తక్కువ. తల్లి లేదా తండ్రి ఉద్యోగస్తుడైతే ఆ యా కుటుంబాల్లో పిల్లలపై ప్రభావాన్ని కూడా పరిశీలించారు. తండ్రి ఉద్యోగస్తు డైతే ఆ ప్రభావం దాదాపు లేకపోయింది. మహిళల విషయానికి వస్తే పిల్లలున్న కుటుంబాల్లోని మహిళలు శ్రామిక శక్తిలో భాగం కావడం కేరళ వంటి రాష్ట్రాల్లో బాగా తగ్గిపోయింది. బిహార్, పంజాబ్, హరి యాణా వంటి రాష్ట్రాల్లో శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం వరుసగా తక్కువగా నమోదవుతున్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది.
అసంఘటిత రంగం మాటేమిటి?
పని గంటలు పెంచాలన్న అంశంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఏమాత్రం నియంత్రణ లేని అసంఘటిత రంగం పరి స్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పని గంటలను అసాధారణంగా పెంచి చిన్న వ్యాపారులు ఉద్యోగుల శ్రమను దోపిడి చేసే అవకాశం ఉంది. నగర ప్రాంతాల్లో గిగ్ ఆర్థిక వ్యవస్థ చాలా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. వీరికి పనివేళలు నిర్దిష్టంగా ఉంటాయి కానీ టార్గెట్లు ఎక్కువ ఇవ్వడం ద్వారా అధిక శ్రమకు గురి చేస్తూంటారు. ఇంటి పని చేసే వారి విషయంలోనూ పనివేళలు, వేత నాలపై ఎలాంటి నియంత్రణ లేదు.
పనిగంటలపై మొదలైన చర్చ ఏయే రంగాల్లో నియంత్రణ వ్యవస్థల అవసరం ఉందన్నది గుర్తించేందుకు ఉపయోగపడవచ్చు. అయితే అసంఘటిత రంగంలో ఉన్న వారు తమంతట తామే పనివేళలను నిర్ధారించుకునే అవకాశం ప్రస్తుతానికైతే లేదన్నది విధాన నిర్ణేతలు గుర్తుపెట్టుకోవాలి.
ఇంకో విషయం వారంలో ఎన్ని గంటలు పనిచేయాలన్న విష యంపై మొదలైన చర్చ కొన్ని సానుకూల అంశాలను తెరపైకి తెచ్చింది. పని చేసే సమయం ముఖ్యమా? చేసిన పని తాలూకూ నాణ్యత ముఖ్యమా అన్నది వీటిల్లో ఒకటి. అదృష్టవశాత్తూ చాలా మంది కార్పొరేట్ బాసులు సమయం కంటే నాణ్యతకే ఓటు వేశారు. ఒక్కటైతే నిజం... నారాయణ మూర్తి, సుబ్రహ్మణ్యన్ వంటి తొలి తరం వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలపై ఏకాగ్ర చిత్తంతో పని చేయడం వల్లనే ఇప్పుడీ స్థితికి ఎదిగారు.
అయితే విజయానికి మార్గాలు అనేకం. రతన్ టాటా వంటి వారు పారిశ్రామికంగా ఎదుగుతూనే ఇతర వ్యాపకాలను కూడా చూసుకోగలిగారు. అభివృద్ధి పథంలో మన సంరక్షకుల పాత్రను కూడా విస్మరించలేము. మొత్త మ్మీద చూస్తే ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలేమిటన్నది సంకుచిత దృష్టితో కాకుండా సమగ్రంగా చూడటం మేలు!
సుష్మా రామచంద్రన్
వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment