Industry sector
-
ఫండ్స్ కొత్త పథకాల జోరు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో నూతన పథకాలు (ఎన్ఎఫ్వో) సెపె్టంబర్ త్రైమాసికంలో పెద్ద మొత్తంలో నిధుల సమీకరించాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం 48 ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లోకి వచ్చాయి. ఇవన్నీ కలసి ఇన్వెస్టర్ల నుంచి రూ.22,049 కోట్ల నిధులను సమీకరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కేవలం 25 కొత్త పథకాలు రాగా, అవి వసూలు చేసిన మొత్తం రూ.5,539 కోట్లుగానే ఉంది. దీంతో పోలిస్తే సెపె్టంబర్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. సాధారణంగా మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడు, బుల్లిష్ సెంటిమెంట్‌ను అనుకూలంగా భావించి ఎన్‌ఎఫ్‌వోలు ఎక్కువగా వస్తుంటాయి. -
అన్ని రంగాల్లో అసాధారణ పురోగతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన స్వల్ప కాలంలోనే అబ్బురపరిచే ప్రగతిని సాధిస్తూ అన్ని రంగాల్లో అసాధారణ పురోగతి సాధిస్తోందని అసెంబ్లీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. అసెంబ్లీలో సోమవారం ఐటీ, పరిశ్రమల రంగంలో ప్రగతిపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్బంగా ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటిపారుదల వ్యవస్థను పటిష్టం చేయడం, మిషన్ కాకతీయతో చెరువుల్ని పునరుద్ధరించటం ద్వారా పంటలు సమృద్ధిగా పండుతుండటం తో రైతులు సుఖంగా ఉన్నారని అక్బరుద్దీన్ చెప్పా రు. దేశమంతా ముక్కున వేలేసుకునే విధంగా 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. కేసీఆర్ ఒకవైపు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తూనే, పారిశ్రామిక రంగా నికి అంతే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పరిశ్ర మలు, ఐటీ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారినందుకు హైదరాబాదీగా గర్వపడుతున్నానన్నారు. ఈ అభివృద్ధిలో హైదరాబాద్ పాతబస్తీని కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు. కేటీఆర్ కృషి అసామాన్యం ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థలు తమ ద్వితీయ క్షేత్రం గా హైదరాబాద్‌ను ఎంచుకోవటం వెనుక మంత్రి కేటీఆర్ కృషి అసామాన్యమైందని అక్బరుద్దీన్ ప్రశంసించారు. గతంలో ఐటీ అంటే బెంగళూరుగా స్థిరపడిపోయిన స్థితిని తిరగరాసి రాష్ట్రం నంబర్ వన్‌గా నిలబడిందని చెప్పారు. ఐటీ టవర్ నిర్మించండి శంషాబాద్ విమానాశ్రయాన్ని ఆనుకుని ఉన్న 50 ఎకరాల వక్ఫ్‌బోర్డు స్థలం కబ్జాదారుల ఆగడాలకు పరాధీనం కాబోతోందని అక్బరుద్దీన్ తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మైనారిటీ యువత కోసం అందులో ఐటీ టవర్ నిర్మించాలని కోరారు. కాగా, ఎస్సీ, ఎస్టీలకు టి ప్రైడ్ కింద ఇన్సెంటివ్స్ ఇస్తున్నట్టే మైనార్టీ ఎంటర్ప్రెన్యూర్లకు సహకరించాలని అక్బరుద్దీన్ కోరారు. హైదరాబాద్‌లో ఫ్రీ వైఫై అన్నారని, కరోనా టైంలో పేద విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు వినేం దుకు నాలుగైదు గంటలు ఫ్రీ వైఫై ఇవ్వాలన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో ఇక్కడి యువతకే 50 శాతం ఉద్యోగాలు వచ్చేలా చేయా లని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు పాతబస్దీలో కూడా నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేయాలని కోరారు. భారీ పెట్టుబడులు వస్తున్నాయ్: వివేకానంద రాష్ట్రంలోని సుస్థిర ప్రభుత్వం, శాంతియుత వాతావరణం వల్ల భారీ పెట్టుబడులు వస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద చెప్పారు. పరిశ్రమలు, అంతకుముందు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై చర్చ కోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని, రాజాసింగ్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. గృహనిర్మాణ సంస్థ, ఉద్యాన వర్సిటీ, పంచాయతీరాజ్, నల్సార్ చట్ట సవరణల బిల్లులను మం త్రులు ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి ప్రవేశపెట్టారు. -
భారత్ ఎందుకొద్దు?
న్యూఢిల్లీ : ఆరేళ్లుగా కీలక రంగాల్లో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో భారత్ పట్ల ప్రపంచ దేశాల దృక్పథం పూర్తిగా మారిపోయిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. గతంలో ఇండియా ఎందుకు? అని ప్రశ్నించిన వాళ్లు ఇప్పుడు ఇండియా ఎందుకొద్దు? అని అడుగుతున్నారని చెప్పారు. తాము చేపట్టిన సంస్కరణ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. ప్రధాని శనివారం ‘అసోచామ్ ఫౌండేషన్ వీక్–2020’ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. వ్యవసాయ సంస్కరణలు, కొత్త చట్టాలతో రైతన్నలు ప్రయోజనం పొందడం మొదలైందని వెల్లడించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... ‘ఎందుకు’ నుంచి ఎందుకొద్దు దాకా.. ‘మనం చేపట్టిన సంస్కరణలు పారిశ్రామిక రంగం ఆలోచనా ధోరణిని మార్చాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో భారత్ ఎందుకు? నుంచి భారత్ ఎందుకొద్దు? అనే దాకా పరిస్థితి మారిపోయింది. గతంలో పారిశ్రామికవేత్తలు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సందేహించేవారు. సంస్కరణలు, వాటి ప్రభావం వల్ల వారు ఉత్సాహం ముందుకొస్తున్నారు. 1,500 పాత, కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశాం. పెట్టుబడుల అంశంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త చట్టాలు తీసుకొచ్చాం. ప్రభుత్వ ముందుచూపునకు ఇదొక ఉదాహరణ. గతంలో పెట్టుబడిదారులు ఇండియాలో ఉన్న అధిక పన్ను రేట్లను ప్రస్తావించేవారు. ఇండియా ఎందుకు? అని ప్రశ్నించేవారు. మన ప్రభుత్వం పన్ను రేట్లను సరళీకరించడంతో ఇప్పుడు ఇండియా ఎందుకొద్దు? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. గతంలో భారత్‌లోని కఠిన నిబంధనలు, నియంత్రణలను చూసి పెట్టుబడిదారులు వెనక్కి తగ్గేవారు. మన ప్రభుత్వం అలాంటి నిబంధనలు, నియంత్రణల భారాన్ని తొలగించడంతో ఇప్పుడు ఇండియా ఎందుకొద్దు? అంటున్నారు’. మా మద్దతును విజయంగా మార్చండి ‘అన్ని రంగాల్లో లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి ఎదగాలి. ఇందుకోసం మిషన్ మోడ్‌లో పని చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు రూపురేఖలు మార్చుకునే భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మనం వేగంగా ప్రతిస్పందించాలి. గ్లోబల్ సప్లై చైన్ విషయంలో జరిగే మార్పులను పసిగట్టడానికి ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం అందించే మద్దతును ఒక విజయంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పారిశ్రామికవేత్తలదే. భారత ఆర్థి క వ్యవస్థను ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. అత్యుత్తమ కార్పొరేట్ పరిపాలనా విధానాలు, లాభాలు పంచుకొనే విధానాలను పారిశ్రామిక రంగం అందిపుచ్చుకోవాలి. ఇక పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ)లోనూ పెట్టుబడులు భారీగా పెరగాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రైవేట్ రంగం చొరవ తీసుకోవాలి’. రైతుల పోరాటం మరింత ఉధృతం న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘాల నేతలు పునరుద్ఘాటించారు. తమ పోరాటాన్ని మరింత ఉధృత చేస్తామన్నారు. తదుపరి కార్యాచరణను వచ్చే రెండు–మూడు రోజుల్లో ఖరారు చేస్తామని తెలిపారు. కొత్త చట్టాలు, పోరాటంపై న్యాయ సలహా తీసుకుంటామని రైతు సంఘం నాయకుడు శివకుమార్ కక్కా శనివారం చెప్పారు. సమస్య పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తామన్న కమిటీలో చేరాలా? వద్దా? అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా పోరాటం విరమించే ప్రసక్తే లేదని మరో నేత బల్బీర్‌సింగ్ తేల్చిచెప్పారు. వేలాది మంది రైతులు ఢిల్లీ శివార్లలోనే గత 23 రోజులుగా నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ పోరాటంలో పాల్గొంటున్నవారిలో ఇప్పటిదాకా 23 మంది రైతులు మరణించారని ఆలిండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) వెల్లడించింది. -
ఎఫ్‌డీఐ... రికార్డులు
న్యూఢిల్లీ: కీలకమైన పెట్టుబడి కేంద్రంగా భారత్ ఆవిర్భవిస్తోందనడానికి సూచనగా గడిచిన ఇరవై ఏళ్లలో భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వెల్లువెత్తాయి. తాజాగా కొత్త మైలురాయి అధిగమించాయి. పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహ విభాగం (డీపీఐఐటీ) గణాంకాల ప్రకారం 2000 ఏప్రిల్ నుంచి 2020 సెప్టెంబర్ మధ్య కాలంలో 500.12 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. వీటిలో 29 శాతం మారిషస్ నుంచి ఉన్నాయి. మిగతావి సింగపూర్ (21 శాతం), అమెరికా, నెదర్లాండ్స్, జపాన్ (తలో 7 శాతం), బ్రిటన్ (6 శాతం) నుంచి వచ్చాయి. మారిషస్ నుంచి అత్యధికంగా 144.71 బిలియన్ డాలర్లు, సింగపూర్ నుంచి 106 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. జర్మనీ, సైప్రస్, ఫ్రాన్స్, కేమ్యాన్ ఐల్యాండ్స్ తదితర దేశాల ఇన్వెస్టర్లు కూడా ఇన్వెస్ట్ చేశారు. 2015–16 నుంచి ఎఫ్‌డీఐల ప్రవాహం గణనీయంగా పెరిగింది. 2019–20లో రికార్డు స్థాయిలో 50 బిలియన్ డాలర్లు వచ్చాయి. సర్వీసులు, సాఫ్ట్‌వేర్‌లో ఎక్కువగా.. సేవల రంగం, కంప్యూటర్ సాఫ్ట్వేర్.. హార్డ్‌వేర్, టెలికమ్యూనికేషన్స్, ట్రేడింగ్, నిర్మాణ రంగం, ఆటోమొబైల్, రసాయనాలు, ఫార్మా తదితర రంగాలు.. అత్యధిక స్థాయిలో ఎఫ్‌డీఐలను ఆకర్షించాయి. 1999లో విదేశీ మారక నియంత్రణ చట్టం (ఫెరా) స్థానంలో విదేశీ మారక నిర్వహణ చట్టాన్ని (ఫెమా) అమల్లోకి తెచ్చినప్పట్నుంచీ ఎఫ్‌డీఐల ప్రవాహం మొదలైందని నాంగియా ఆండర్సన్ ఇండియా పార్ట్నర్ నిశ్చల్ అరోరా తెలిపారు. అప్పట్నుంచీ 500 బిలియన్ డాలర్లు రావడమనేది పటిష్టమైన భారత ఆర్థిక మూలాలు, స్థిరమైన రాజకీయ పరిస్థితులు, 2007–08 నాటి మాంద్యంలోనూ మదుపుదారులకు మెరుగైన రాబడులిచ్చిన ఆర్థిక వృద్ధి సామర్థ్యంపై ఇన్వెస్టర్లకు గల నమ్మకాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏ దేశంలోకైనా ఎఫ్‌డీఐలు రావాలంటే వ్యాపార నిర్వహణ సులభతరంగా ఉండటం, స్థల .. కార్మిక చట్టాలు.. పన్ను రేట్లును సరళతరంగా ఉండటం, నిపు ణుల లభ్యత, లాజిస్టిక్స్, రాజకీయ స్థిరత్వం వంటి అంశాలు కీలకంగా ఉంటాయని డెలాయిట్ ఇం డియా పార్ట్నర్ రజత్ తెలిపారు. భారత్ ఇప్పటికే ఈ విషయాల్లో చాలా మెరుగుపడిందన్నారు. -
15% కార్పొరేట్ పన్ను గడువు పొడిగింపు!
న్యూఢిల్లీ: తయారీ రంగంలో కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలకు 15 శాతం కార్పొరేట్ పన్ను అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించగా.. ఇందుకు సంబంధించిన గడువు పొడిగింపును పరిశీలించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధి కనిష్టాలకు పడిపోవడంతో పెట్టుబడులకు ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పన్నును భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కంపెనీలకు కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి.. అదే విధంగా 2019 అక్టోబర్ 1 నుంచి 2023 మార్చి 31 మధ్య తయారీ రంగంలో ఏర్పాటయ్యే కంపెనీలకు కార్పొరేట్ పన్నును 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తూ కేంద్ర సర్కారు నిర్ణయాలు తీసుకుంది. ‘‘మేము ఏం చేయగలమన్నది చూస్తాం. నూతన పెట్టుబడులపై 15 శాతం కార్పొరేట్ పన్ను నుంచి పరిశ్రమ ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నాను. దీంతో 2023 మార్చి 31 వరకు ఇచ్చిన గడువును పొడిగించడాన్ని పరిగణనలోకి తీసుకుంటాము’’ అని సీతారామన్ ఫిక్కీ సభ్యులను ఉద్దేశించి చెప్పారు. దేశీయ పరిశ్రమలకు, ఆర్థిక రంగ ఉద్దీపనానికి ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. కోవిడ్–19 అత్యవసర రుణ సదుపాయం కేవలం ఎంఎస్ఎంఈలకే కాకుండా అన్ని కంపెనీలకు అందుబాటులో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. లిక్విడిటీ సమస్య లేదు: వ్యవస్థలో లిక్విడిటీ తగినంత అందుబాటులో ఉందని, ఇందుకు సం బంధించి ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తామని సీతారామన్ చెప్పారు. అన్ని ప్రభుత్వ విభాగాలకూ బకాయిలు తీర్చేయాలని చెప్పినట్టు పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపుపై నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్‌దేనని స్పష్టం చేశారు. -
మౌలిక పరిశ్రమలు మునక...
న్యూఢిల్లీ: మౌలిక రంగానికి సంబంధించి ఎనిమిది పారిశ్రామిక విభాగాల గ్రూప్ ఏప్రిల్‌లో దారుణ ఫలితాన్ని చూసింది. ఈ గ్రూప్‌లోని పరిశ్రమల ఉత్పత్తిలో (2019 ఏప్రిల్ ఉత్పత్తితో పోల్చి) అసలు వృద్ధిలేకపోగా –38.1 శాతం క్షీణత నమోదయ్యింది. నిజానికి మార్చిలోనే ఈ గ్రూప్ –9 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. కరోనా నేపథ్యంలో దేశం మొత్తం ఏప్రిల్‌లో పూర్తి లాక్డౌన్లో ఉన్న సంగతి తెలిసిందే. దీనితో ఏప్రిల్‌లో ‘మైనస్’ ఫలితం మరింత తీవ్రమైంది. 2019 ఏప్రిల్‌లో ఈ గ్రూప్ 5.2 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేస్తూ, ‘‘లాక్డౌన్ నేపథ్యంలో బొగ్గు (–15.5 శాతం), సిమెంట్ (–86 శాతం) , స్టీల్ (–83.9 శాతం), సహజ వాయువు (–19.9 శాతం), రిఫైనరీ (–24.2 శాతం), క్రూడ్‌ఆయిల్ (– 6.4 శాతం) వంటి రంగాల్లో ఉత్పత్తి భారీగా దెబ్బతింది’’ అని పేర్కొంది. ఈ రంగాలు కాకుండా ఇంకా విద్యుత్ (–22.8%), ఎరువుల (–4.5 శాతం) రంగాలు ఈ గ్రూప్‌లో ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సూచీలో ఈ ఎనిమిది పరిశ్రమల వాటా 40.27 శాతం. ఐఐపీ ఏప్రిల్ గణాంకాలు జూన్ రెండవ వారంలో వెలువడతాయి. తాజా ఇన్ఫ్రా ఫలితాల ప్రతికూల ప్రభావం మొత్తం ఐఐపీ ఏప్రిల్ గణాంకాలపై తీవ్రంగా పడనుంది. -
పరిశ్రమ వర్గాలతో 26న ఆర్బీఐ గవర్నర్ భేటీ
న్యూఢిల్లీ: వచ్చే నెల పరపతి విధాన సమీక్ష జరపనున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ త్వరలో పరిశ్రమవర్గాలతో భేటీ కానున్నారు. ఈ నెల 26న వాణిజ్య సంఘాలు, రేటింగ్ ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారని, ఇందులో వడ్డీ రేట్లు, ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు తీసుకోతగిన చర్యలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆలిండియా బ్యాంక్ డిపాజిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులను కూడా దీనికి హాజరుకావాలని ఆహ్వానించినట్లు వివరించాయి. ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కావడానికి సరిగ్గా వారం రోజులు ముందు.. ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక విధానాన్ని ప్రకటించనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇదే ఎంపీసీ తొలి సమావేశం కూడా కావడంతో ఈ పరపతి విధాన సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ఎకానమీపై అభిప్రాయాలను, ఆర్బీఐపై అంచనాల గురించి తెలుసుకునేందుకు శక్తికాంత దాస్ ఇప్పటికే బ్యాంకర్లు, ప్రభుత్వ వర్గాలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు మొదలైన వాటితో సమావేశమవుతూనే ఉన్నారు. గతేడాది డిసెంబర్లో ఆర్బీఐ 25వ గవర్నర్‌గా శక్తికాంత దాస్ బాధ్యతలు చేపట్టారు. -
మనసు దోచిన మహానటి
ఆర్తి డెహ్రాడూన్ నుంచి వచ్చింది. మృగాక్షిది హిమాచల్ ప్రదేశ్. అరుణా చద్దా మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు. రేఖాశర్మ ఉత్తరాఖండ్ మహిళ. హైదరాబాద్ కూకట్పల్లి నుంచి ఓల్గా, ఇంకా.. గుజరాత్, బిహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కశ్మీర్, తమిళనాడు, కేరళల నుంచి వచ్చిన మహిళలు శిల్పారామంలో సేంద్రియ ఉత్పత్తులను ప్రదర్శించి, నిన్ననే.. తమ రాష్ట్రాలకు బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. వీళ్లందరూ జీవితంలో ఎదగాలనే తపన ఉన్న వాళ్లు మాత్రమే కాదు.. కష్టపడితే కొత్త అభివృద్ధి పథాన్ని నిర్మించడం సాధ్యమేనని నిరూపించాలనే కృత నిశ్చయం కలిగిన మహిళలు. ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవడం కంటే.. చాలెంజింగ్‌గా ఉండే పరిశ్రమల రంగంలో విజయం సాధించడమే అసలైన గెలుపు అన్నది కంప్యూటర్ కోర్సు చేసిన మృగాక్షి భావన. ఆమె కేవలం హెయిర్ ఆయిల్స్ మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అందుకోసం హిమాచల్ ప్రదేశ్ అడవుల్లోని ఔషధ వృక్షాల నుంచి ఆకులు, బెరళ్లు, వేర్లను సేకరించి, నువ్వుల నూనెలో మగ్గపెట్టి హెయిర్ ఆయిల్స్ చేస్తుంది. ఈ పరిశ్రమ కోసం ఆమె హెర్బల్ ఎడ్యుకేషన్ కోర్సు కూడా చేసింది. ఆర్తి 1990లో డెహ్రాడూన్‌లో అసోసియేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మర్స్ స్థాపించింది. ఈ సంస్థ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 3,800 మంది రైతులతో అనుసంధానమై ఉంది. వాళ్లు సేకరించిన ముడిసరుకుతో కాస్మొటిక్ ప్రోడక్ట్స్‌తోపాటు ఔషధతైలాలు, ఆరోగ్యాన్ని పెంపొందించే చ్యవన్‌ప్రాశ్ వంటి మందులను తయారు చేస్తోందామె. తమ ఉత్పత్తులను తేజస్విని బ్రాండ్‌నేమ్‌తో ఎగ్జిబిషన్లో నేరుగా తానే ప్రదర్శించడంతోపాటు ఆన్లైన్లో మార్కెట్ చేస్తోంది ఆర్తి.ఇక ఉత్తరాఖండ్‌లోని, అల్మోరా కేంద్రంగా పని చేస్తున్న రేఖాశర్మ తన యూనిట్‌ని మహిళలతోనే నడిపిస్తోంది. హ్యాండ్‌మేడ్ సోప్ తయారు చేయడం అంటే ఒక యజ్ఞం వంటిదనీ, సబ్బు తయారీకి మూడు నెలలు పడుతుందని చెప్పింది రేఖ. ‘‘అరోమా ఆయిల్, ఇతర ముడిసరుకులను కలిపి ఆ మిశ్రమాన్ని చెక్క మూసలో పోస్తారు. ఆ మూసలను కదిలించకూడదు. నెల రోజులకు తేమ ఆరిపోయి మిశ్రమం ద్రవ రూపం నుంచి కొద్దిగా గట్టి పడుతుంది. మరో రెండు నెలలకు తేమ పూర్తిగా ఆవిరై పోతుంది. అప్పుడు మూసల్లో నుంచి సబ్బును వేరు చేస్తాం. మిశ్రమం త్వరగా ఆరాలనే తొందరలో మూసలను ఎండకు ఆరబెడితే తేమతోపాటు మిశ్రమంలోని సుగంధం ఆవిరైపోతుంది. నీడలో ఆరబెట్టినప్పుడే సబ్బులో పూల రెక్కల పరిమళం నిలుస్తుంది’’ అని వివరంగా చెప్పింది రేఖ.అరుణ అయితే.. తమ ఉత్పత్తులను కొనమని ఎవ్వరినీ బలవంతం చేయడం లేదు. వచ్చిన వాళ్లందరికీ స్పూన్‌తో తీపి వంటలను రుచి చూపిస్తున్నారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత మధ్యప్రదేశ్, మాండ్లాలో స్థానిక గిరిజనుల కోసం ఆమె ఒక కో ఆపరేటివ్ సొసైటీ స్థాపించారు. ఐదు వేల మంది గిరిజనులకు ముడిసరుకు ఇచ్చి వ్యవసాయం చేయిస్తారు. వారి ఉత్పత్తులను తిరిగి సొసైటీ కొంటుంది. ప్రాసెసింగ్‌లో శిక్షణ ఇచ్చి, వారి చేతనే తయారు చేయిస్తారు. మాండ్లా ఆర్గానిక్ పేరుతో మార్కెట్ చేస్తారు. అరుణ నిర్వహిస్తున్న కో ఆపరేటివ్ సొసైటీలో ఐదు వేల మంది గిరిజనులు మమేకమై ఉన్నారు.పరిశ్రమ నిర్వహించడం ఒక ఎత్తు. అది మెళకువతో కూడిన పని. ఉత్పత్తులను ప్రదర్శించడం మరో ఎత్తు. అది నైపుణ్యంతో కూడిన పని. రేఖాశర్మ, ఆర్తి, మృగాక్షితోపాటు ఆ మేళాలో పాల్గొన్న మహిళలందరిలోనూ ఆ మెళకువ, నైపుణ్యం కనిపించాయి. కొసమెరుపు ఏమిటంటే.. ఈ ఫెస్టివల్లో జ్యూట్ బ్యాగ్ స్టాల్ కూడా ఉంది. జ్యూట్ బ్యాగ్‌ల మీద మహానటి సావిత్రి ఫొటో ముద్రించి ఉంది. ఫెస్టివల్‌ను చూడడానికి వచ్చిన మహిళలు ఆ స్టాల్ దగ్గర గుమిగూడి పోయారు. సావిత్రిని నేరుగా చూసినంత మురిపెంగా ఆ బ్యాగ్‌లను చేతుల్లోకి తీసుకున్నారు. కేంద్ర మహిళాశిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ– తెలంగాణ రాష్ట్ర మహిళశిశు సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఆరు నుంచి పదవ తేదీ వరకు ‘ఉమెన్ ఆఫ్ ఇండియా– ఆర్గానిక్ ఫెస్టివల్’ జరిగింది. హైదరాబాద్, శిల్పారామంలోని సంప్రదాయ వేదిక ప్రాంగణంలో జరిగిన ఈ ఆర్గానిక్ మేళాలో దేశవ్యాప్తంగా ఇరవైకి పైగా రాష్ట్రాల నుంచి మహిళలు వచ్చారు. తొంభైకి పైగా స్టాళ్లలో వెయ్యి రకాలకు పైగా ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రదర్శించారు. రసాయనాలు దేహానికి హాని చేస్తాయని, ఆ హాని నుంచి మనల్ని మనం కాపాడుకోగలిగిన ఏకైక మార్గం సేంద్రియ ఉత్పత్తుల వాడకమేనని చెప్పింది ‘ఉమెన్ ఆఫ్ ఇండియా– ఆర్గానిక్ఫెస్టివల్. -
ఐపాస్‌తో జొష్
ఆత్మకూరు, గీసుకొండ, హసన్‌పర్తి, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, రఘునాథపల్లి, సంగెం, జఫర్‌గఢ్, ములుగు, వెంకటాపురం, నెల్లికుదురు, మహబూబాబాద్, రేగొండ, మరిపెడ, కేసముద్రం, ఖానాపురం, కురవి, గణపురం, చేర్యాలలో పరిశ్రమల స్థాపనకు అనుకులించే స్థలాలు ఉన్నట్లుగా గుర్తించారు. రోడ్డు, రైలు రవాణా మార్గాలు ఉన్న ప్రాంతాలు ప్రామాణికంగా తీసుకున్నారు. - పారిశ్రామిక రంగం.. ఇక పరుగులు - నూతన పారిశ్రమికవేత్తల్లో చిగురిస్తున్న ఆశలు - 20 మండలాల్లో అనువైన ప్రాంతాలగుర్తింపు పోచమ్మమైదాన్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించిన నూతన పారిశ్రామిక విధానం జిల్లాలో పరిశ్రమల రంగానికి ఊతమివ్వనుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ సెల్ఫ్ సర్టిఫికేషన్(టీఎస్ ఐపాస్)తో జిల్లాకు మరిన్ని పరిశ్రమలు రానున్నాయి. ఇప్పటికే రెండో రాజధానిగా విరాజిల్లుతున్న వరంగల్‌లో పారిశ్రామికరంగం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేయడంతో జిల్లాలో దేశీయ పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలో నూతన పరిశ్రమలను నెలకొల్పేందుకు తెలంగాణ రాష్ట్ర పారి శ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టీఎస్ఐఐసీ) సమాయత్తమవుతోంది. ఈ సంస్థ ప్రస్తుతం ఉన్న పారిశ్రామిక ప్రాంతాలకు అదనంగా 20 మండలాల్లో 24,679 ఎకరాల స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ములుగు రోడ్, ఆటోనగర్, మడికొండ, ధర్మసాగర్, జనగామ ప్రాంతాల్లో పరిశ్రమలు కొనసాగుతున్నాయి. ఐపాస్‌తో.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఐపాస్‌ను ప్రవేశ పెట్టింది. ఒకప్పుడు పరిశ్రమను స్థాపించాలంటే అన్ని అనుమతుల కోసం చాలా ఇబ్బందులు పడే వారు. ఇప్పుడు కొత్తగా ఐపాస్ తీసుకరావడంతో ఇబ్బందులు తగ్గా యి. ఒకప్పుడు జిల్లా పరిశ్రమల శాఖ, కాలుష్య ని యంత్రణ మండలి, విద్యుత్ ఇతర శాఖల నుంచి అనుతమలు తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు జిల్లా పరిశ్రమల కేంద్రంలో ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూ ర్తి వివరాలతో కూడిన దరఖాస్తును అందజేయాలి. దీంతో ఆ శాఖ వారు వారంతో రెండు రోజులు ఐపాస్ కోసం ప్రత్యేకంగా అన్ని శాఖ అధికారులను ఒక వేదిక పైకి తీసుకొచ్చి దరఖాస్తులు అందజేసి చి న్న పరిశ్రమ అయితే 15 రోజులు లోపు, పెద్ద పరి శ్రమ అయితే 30 రోజుల లోపు అన్ని పూర్తి చేసి ఇ వ్వాలి. లేనిచో సంబంధిత ఉద్యోగిపై రోజుకు రూ. 1000 చొప్పున కలెక్టర్ జరిమాన విధించనున్నారు. మూడు రకాలుగా గుర్తింపు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించే బాధ్యతను ప్రభుత్వం టీఎస్ఐ ఐసీకి అప్పగించింది. జిల్లా రెవెన్యూ అధికారుల స హకారంతో పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉ న్న ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. జిల్లాలో మూడు గ్రేడ్లుగా స్థలాలను గుర్తించారు. ఏ గ్రేడ్ విభాగంలో 9,259, బీ గ్రేడ్ విభాగంలో 11,091, సీ గ్రేడ్ విభాగంలో 4,329 ఎకరాల స్థలాలను గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వ భూములను టీఎస్ఐసీసీకి బదిలి చేస్తే వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించి ఔత్సాహిక పారిశ్రమిక వేత్తలకు అప్పగించనున్నారు. జిల్లాలో దాదాపు 40 వేలకు పైగా కొత్త పారిశ్రమిక విధానం ద్వారా పరిశ్రమలు స్థాపించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినట్లు అవుతుంది. ఇక వలసలకు సెలవు ఉన్నత చదువులు చదివిన యువతకు జిల్లాలో ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో హైదారాబాద్, బెంగుళూరు, చెన్నయ్, ముంబయి, ఢిల్లీ, కోల్కత్త తదితర ప్రాంతాలతోపాటు అమెరికా, జపాన్, శ్రీలంక, దూబయ్, మలేషియా, ఆస్ట్రేలియా దేశాలకు అప్పులు చేసి వలస వెళ్తున్నారు. ఇంకొంత మంది అంత దూరం వెళ్లలేక జిల్లాలో చిన్నచిన్న సంస్థల్లో పని చేస్తు కాలం వెళ్లదీస్తున్నారు. వీటన్నింటికి సెలవు పెట్టెయోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో జిల్లాకు పూనర్వైభవం రానుంది. ల్యాండ్ బ్యాంక్‌ను ప్రభుత్వంకు అందజేశాం.. జిల్లాలోని రెవె న్యూ అధికారుల సహాయంతో జిల్లాలో రవాణాకు అనుకుల ప్రాంతాలు గుర్తించి పరిశ్రమలు అనువైన ప్రాంతాల మండలాల పేర్లు, సర్వే నంబర్లతో కూడిన ల్యాండ్ బ్యాంక్‌ను ప్రభుత్వంకు అందజేశాం. ప్రభుత్వం కేటాయించగానే వాటిలో మౌలిక వసతులు కల్పించి పరిశ్రమల స్థాపనకు స్థలాలు కేటాయిస్తాం. జిల్లాలో 24,679 ఎకరాల ప్రభుత్వ భూమిని ల్యాండ్ బ్యాంక్‌గా గుర్తించాము. -డి.రవి, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్