న్యూఢిల్లీ : ఆరేళ్లుగా కీలక రంగాల్లో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో భారత్ పట్ల ప్రపంచ దేశాల దృక్పథం పూర్తిగా మారిపోయిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. గతంలో ఇండియా ఎందుకు? అని ప్రశ్నించిన వాళ్లు ఇప్పుడు ఇండియా ఎందుకొద్దు? అని అడుగుతున్నారని చెప్పారు. తాము చేపట్టిన సంస్కరణ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. ప్రధాని శనివారం ‘అసోచామ్ ఫౌండేషన్ వీక్–2020’ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. వ్యవసాయ సంస్కరణలు, కొత్త చట్టాలతో రైతన్నలు ప్రయోజనం పొందడం మొదలైందని వెల్లడించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే...
‘ఎందుకు’ నుంచి ఎందుకొద్దు దాకా..
‘మనం చేపట్టిన సంస్కరణలు పారిశ్రామిక రంగం ఆలోచనా ధోరణిని మార్చాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో భారత్ ఎందుకు? నుంచి భారత్ ఎందుకొద్దు? అనే దాకా పరిస్థితి మారిపోయింది. గతంలో పారిశ్రామికవేత్తలు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సందేహించేవారు. సంస్కరణలు, వాటి ప్రభావం వల్ల వారు ఉత్సాహం ముందుకొస్తున్నారు. 1,500 పాత, కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశాం. పెట్టుబడుల అంశంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త చట్టాలు తీసుకొచ్చాం. ప్రభుత్వ ముందుచూపునకు ఇదొక ఉదాహరణ. గతంలో పెట్టుబడిదారులు ఇండియాలో ఉన్న అధిక పన్ను రేట్లను ప్రస్తావించేవారు. ఇండియా ఎందుకు? అని ప్రశ్నించేవారు. మన ప్రభుత్వం పన్ను రేట్లను సరళీకరించడంతో ఇప్పుడు ఇండియా ఎందుకొద్దు? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. గతంలో భారత్‌లోని కఠిన నిబంధనలు, నియంత్రణలను చూసి పెట్టుబడిదారులు వెనక్కి తగ్గేవారు. మన ప్రభుత్వం అలాంటి నిబంధనలు, నియంత్రణల భారాన్ని తొలగించడంతో ఇప్పుడు ఇండియా ఎందుకొద్దు? అంటున్నారు’.
మా మద్దతును విజయంగా మార్చండి
‘అన్ని రంగాల్లో లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి ఎదగాలి. ఇందుకోసం మిషన్ మోడ్‌లో పని చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు రూపురేఖలు మార్చుకునే భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మనం వేగంగా ప్రతిస్పందించాలి. గ్లోబల్ సప్లై చైన్ విషయంలో జరిగే మార్పులను పసిగట్టడానికి ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం అందించే మద్దతును ఒక విజయంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పారిశ్రామికవేత్తలదే. భారత ఆర్థి క వ్యవస్థను ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. అత్యుత్తమ కార్పొరేట్ పరిపాలనా విధానాలు, లాభాలు పంచుకొనే విధానాలను పారిశ్రామిక రంగం అందిపుచ్చుకోవాలి. ఇక పరిశోధన, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ)లోనూ పెట్టుబడులు భారీగా పెరగాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రైవేట్ రంగం చొరవ తీసుకోవాలి’.
రైతుల పోరాటం మరింత ఉధృతం
న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘాల నేతలు పునరుద్ఘాటించారు. తమ పోరాటాన్ని మరింత ఉధృత చేస్తామన్నారు. తదుపరి కార్యాచరణను వచ్చే రెండు–మూడు రోజుల్లో ఖరారు చేస్తామని తెలిపారు. కొత్త చట్టాలు, పోరాటంపై న్యాయ సలహా తీసుకుంటామని రైతు సంఘం నాయకుడు శివకుమార్ కక్కా శనివారం చెప్పారు. సమస్య పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తామన్న కమిటీలో చేరాలా? వద్దా? అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా పోరాటం విరమించే ప్రసక్తే లేదని మరో నేత బల్బీర్‌సింగ్ తేల్చిచెప్పారు. వేలాది మంది రైతులు ఢిల్లీ శివార్లలోనే గత 23 రోజులుగా నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ పోరాటంలో పాల్గొంటున్నవారిలో ఇప్పటిదాకా 23 మంది రైతులు మరణించారని ఆలిండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) వెల్లడించింది.
భారత్ ఎందుకొద్దు?
Published Sun, Dec 20 2020 3:29 AM | Last Updated on Sun, Dec 20 2020 12:58 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment