న్యూఢిల్లీ: వచ్చే నెల పరపతి విధాన సమీక్ష జరపనున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ త్వరలో పరిశ్రమవర్గాలతో భేటీ కానున్నారు. ఈ నెల 26న వాణిజ్య సంఘాలు, రేటింగ్ ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారని, ఇందులో వడ్డీ రేట్లు, ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు తీసుకోతగిన చర్యలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆలిండియా బ్యాంక్ డిపాజిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులను కూడా దీనికి హాజరుకావాలని ఆహ్వానించినట్లు వివరించాయి.
ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కావడానికి సరిగ్గా వారం రోజులు ముందు.. ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక విధానాన్ని ప్రకటించనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇదే ఎంపీసీ తొలి సమావేశం కూడా కావడంతో ఈ పరపతి విధాన సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ఎకానమీపై అభిప్రాయాలను, ఆర్‌బీఐపై అంచనాల గురించి తెలుసుకునేందుకు శక్తికాంత దాస్ ఇప్పటికే బ్యాంకర్లు, ప్రభుత్వ వర్గాలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు మొదలైన వాటితో సమావేశమవుతూనే ఉన్నారు. గతేడాది డిసెంబర్‌లో ఆర్‌బీఐ 25వ గవర్నర్‌గా శక్తికాంత దాస్ బాధ్యతలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment