RBI Governor
-
సాఫీగానే ఆర్థిక వ్యవస్థ
ముంబై: అంతర్జాతీయంగా ఎన్నో సమస్యలు, సవాళ్లు నెలకొన్న పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా సాగిపోతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వ్యాఖ్యానించారు. బలమైన స్థూల ఆర్థిక మూలాలు, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, విదేశీ మారకం నిల్వలు పటిష్టంగా ఉండడం, నియంత్రణలో కరెంటు ఖాతా లోటు, వస్తు, సేవల ఎగుమతుల వృద్ధిని ప్రస్తావించారు. 682 బిలియన్ డాలర్ల విదేశీ మారకంతో (అక్టోబర్ 31 నాటికి) ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నట్టు గుర్తు చేశారు. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇదే సమావేశంలో భాగంగా కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ రేట్ల కోతకు ఇచ్చిన పిలుపుపై స్పందించలేదు. డిసెంబర్లో జరిగే ఆర్బీఐ ఎంపీసీ సమావేశం కోసం తన వ్యాఖ్యలను రిజర్వ్ చేస్తున్నట్టు దాస్ చెప్పారు. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా స్పందించేందుకు వీలుగా అక్టోబర్ పాలసీ సమీక్షలో తటస్థ విధానానికి మారినట్టు దాస్ చెప్పారు. ద్రవ్యోల్బణం మధ్యమధ్యలో పెరిగినప్పటికీ మోస్తరు స్థాయికి దిగొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్ నెలకు రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 6 శాతం మించిపోయిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. 4 శాతానికి ప్లస్ 2 లేదా మైనస్ 2 శాతం మించకుండా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలన్నది ఆర్బీఐ దీర్ఘకాలిక లక్ష్యం కావడం గమనార్హం. దీర్ఘకాలం పాటు అంతర్జాతీయంగా ఎన్నో సంక్షోభ పరిస్థితుల్లోనూ మన ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరు చూపించినట్టు దాస్ చెప్పారు. కాకపోతే అంతర్జాతీయంగా ప్రస్తుతం కొన్ని ప్రతికూల పవనాలు వీస్తున్నాయంటూ.. బాండ్ ఈల్డ్స్, కమోడిటీ ధరల పెరుగుదలను ప్రస్తావించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల్లోనూ ఫైనాన్షియల్ మార్కెట్లు బలంగా నిలబడినట్టు చెప్పారు. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించాలని.. ఇందుకు ఆహార ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవడం సరికాదన్న స్వీయ అభిప్రాయాన్ని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇదే సభలో వ్యక్తం చేశారు. రూపాయికి లక్ష్యం లేదు.. రూపాయి మారకం విషయంలో ఆర్బీఐకి ఎలాంటి లక్ష్యం లేదని, అస్థిరతలను నియంత్రించేందుకు అవసరమైనప్పుడే జోక్యం చేసుకుంటుందని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. యూఎస్ ఫెడ్ 2022, 2023లో ద్రవ్య కఠిన విధానాలను చేపట్టిన తరుణంలోనూ రూపాయి స్థిరంగా ఉండడాన్ని ప్రస్తావించారు. ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ (ఈసీఎల్) కార్యాచరణకు సంబంధించి ముసాయిదాను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. -
వృద్ధికి సానుకూలతలే ఎక్కువ
ముంబై: దేశ జీడీపీ వృద్ధికి సంబంధించి వస్తున్న గణాంకాలు మిశ్రమంగా ఉన్నాయంటూ.. ప్రతికూలతల కంటే సానుకూలతలే ఎక్కువని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో అంతర్లీనంగా కార్యకలాపాలు మొత్తానికి బలంగానే కొనసాగుతున్నట్టు చెప్పారు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంపై ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దాస్ మాట్లాడారు. ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించే, వెనక్కిలాగే 70 అధిక వేగంతో కూడిన సూచికలను ట్రాక్ చేసిన తర్వాతే ఆర్బీఐ అంచనాలకు వస్తుందని వివరించారు. 2024–25 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ వృద్ధి 6.7 శాతంగా నమోదు కావడం గమనార్హం. 15 నెలల కనిష్ట స్థాయి ఇది. దీంతో వృద్ధిపై విశ్లేషకుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుండడం తెలిసిందే. కానీ, జీడీపీ 2024–25లో 7.2 శాతం వృద్ధిని నమోదు చేస్తుందంటూ ఆర్బీఐ గత అంచనాలను కొనసాగించడం గమనార్హం. ప్రతికూలతల విషయానికొస్తే.. పారిశ్రామికోత్పత్తి సూచీ డేటా (ఐఐపీ), పట్టణాల్లో డిమాండ్ మోస్తరు స్థాయికి చేరినట్టు ఎఫ్ఎంసీజీ విక్రయ గణాంకాల ఆధారంగా తెలుస్తోందని దాస్ అన్నారు. దీనికితోడు సబ్సిడీల చెల్లింపులు కూడా పెరగడం సెపె్టంబర్ త్రైమాసికం జీడీపీ (క్యూ2) గణాంకాలపై ప్రభావం చూపిస్తుందని చెప్పారు. బలంగా ఆటో అమ్మకాలు డిమాండ్ బలహీనంగా ఉండడంతో ఆటోమొబైల్ కంపెనీల ఇన్వెంటరీ స్థాయిలు పెరిగిపోవడం పట్ల చర్చ జరుగుతుండడం తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్ దాస్ ఇదే అంశంపై స్పందిస్తూ అక్టోబర్‌లో ఈ రంగం మంచి పనితీరు చూపించిందని, 30 శాతం వృద్ధి నమోదైనట్టు చెప్పారు. దీనికి అదనంగా వ్యవసాయం, సేవల రంగాలు సైతం మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు వెల్లడించారు. కనుక వృద్ధి మందగిస్తుందని ప్రకటించడానికి తాను తొందరపడబోనన్నారు. భారత్ సైక్లికల్ వృద్ధి మందగమనంలోకి అడుగుపెట్టినట్టు జపాన్ బ్రోకరేజీ సంస్థ నోమురా ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది. ఆర్థిక వ్యవస్థకు పెద్దపులి లాంటి బలం ఉందంటూ, దీనికి ఆర్బీఐ చలాకీతనాన్ని అందిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. అధిక ద్రవ్యోల్బణం.. రేట్ల కోత అక్టోబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం సెపె్టంబర్లో వచ్చిన 5.5 శాతం కంటే అధికంగా ఉంటుందని శక్తికాంతదాస్ సంకేతం ఇచ్చారు. ఈ నెల 12న గణాంకాలు వెల్లడి కానున్నాయి. రెండు నెలల పాటు అధిక స్థాయిలోనే కొనసాగొచ్చన్న ఆర్బీఐ అంచనాలను గుర్తు చేశారు. మానిటరీ పాలసీ విషయంలో ఆర్బీఐ తన విధానాన్ని మార్చుకోవడం (కఠినం నుంచి తటస్థానికి) తదుపరి సమావేశంలో రేట్ల కోతకు సంకేతంగా చూడొద్దని కోరారు. తదుపరి కార్యాచరణ విషయంలో ప్యానెల్‌పై ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. దిద్దుబాటు కోసమే చర్యలు.. నాలుగు ఎన్బీఎఫ్సీలపై నియంత్రణ, పర్యవేక్షణ చర్యల గురించి ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. దేశంలో 9,400 ఎన్బీఎఫ్సీలు ఉండగా, కేవలం కొన్నింటిపైనే చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఆయా సంస్థలతో నెలల తరబడి సంప్రదింపుల అనంతరమే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దీన్ని పర్యవేక్షించడం చాలా కష్టమని అంగీకరించారు. -
ఆర్బీఐలో ఉద్యోగానికి దరఖాస్తులు.. అర్హతలివే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ స్థానంలో పనిచేయడానికి అర్హులైన వారి నుంచి కేంద్ర ఆర్థికశాఖ దరఖాస్తులు కోరుతోంది. ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్ స్థానంలో ఉన్న మైకేల్ పాత్రా పదవీకాలం జనవరి 14, 2025న ముగుస్తుంది. దాంతో తన స్థానంలో మరో వ్యక్తిని నియమించేలా ఆర్థికశాఖ చర్యలు చేపట్టింది. ఈ స్థానంలో పనిచేయబోయే ఆర్థికవేత్తలు విభిన్న విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.ఈ పదవికి ఎంపికైన వ్యక్తి, ద్రవ్యపరపతి విధాన విభాగాన్ని పర్యవేక్షించాలి. కీలక రేట్లపై నిర్ణయాలు తీసుకునే ద్రవ్యపరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యునిగా ఉండాలి. ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత రంగంలో కనీసం 25 ఏళ్ల అనుభవం ఉండాలి. లేదా 25 ఏళ్ల పాటు భారత్ లేదా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలో పని చేసి ఉండాలి. కొత్తగా పదవి చేపట్టే వారు 2025 జనవరి 15 వరకు 60 ఏళ్లకు మించకూడదు.ఇదీ చదవండి: స్విగ్గీకి రూ.35,453 జరిమానా!ఆర్థికశాఖ వేతన నిబంధనల ప్రకారం డిప్యూటీ గవర్నర్‌గా ఎంపికైన వారికి నెలకు రూ.2.25 లక్షల వేతనం, ఇతర అలవెన్స్‌లు ఇస్తారు. ఈ పదవికి దరఖాస్తు చేసుకునేవారి 2024 నవంబరు 30లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. -
మరోసారి ‘శక్తి’మంతుడైన ఆర్బీఐ గవర్నర్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ మరోసారి A+ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా ఘనత సాధించారు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ద్వారా టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా ర్యాంక్ పొందారు. శక్తికాంత దాస్ ఈ అవార్డును గెలుచుకోవడం ఇది వరుసగా రెండో సంవత్సరం.A+ రేటింగ్ పొందిన ముగ్గురు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల జాబితాలో శక్తికాంత దాస్ అగ్రస్థానంలో నిలిచారు. మిగిలిన ఇద్దరిలో డెన్మార్క్‌కి చెందిన క్రిస్టియన్ కెటెల్ థామ్సెన్, స్విట్జర్లాండ్‌కు చెందిన థామస్ జోర్డాన్ ఉన్నారు. గవర్నర్ శక్తికాంత దాస్ సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్స్ 2024లో వరుసగా రెండవ సంవత్సరం A+ గ్రేడ్ అవార్డును అందుకున్నారని ఆర్బీఐ ‘ఎక్స్’లో పేర్కొంది.యూఎస్‌లోని వాషింగ్టన్ డీసీలో శక్తికాంత దాస్‌కు గ్లోబల్ ఫైనాన్స్ ఈ అవార్డును అందించింది. సంక్లిష్ట ఆర్థిక సవాళ్లలో భారతదేశ అపెక్స్ బ్యాంక్‌ను నడిపించడంలో గవర్నర్ శక్తికాంత దాస్ అద్భుతమైన పనితీరు, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఈ సంస్థ గుర్తించింది.గ్లోబల్ ఫైనాన్స్ సంస్థ 1994 నుండి సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్స్ ను ఏటా విడుదల చేస్తుంది. యూరోపియన్ యూనియన్, ఈస్టర్న్ కరీబియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికన్ స్టేట్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ సహా దాదాపు 100 దేశాల కేంద్ర బ్యాంక్ గవర్నర్లకు ఇందులో ర్యాంకులు కేటాయిస్తారు.Governor @DasShaktikanta received the award for A+ grade in Central Bank Report Cards 2024, for the second consecutive year. Presented by Global Finance at an event held today in Washington DC, USA.… pic.twitter.com/uxCgJqfgCJ— ReserveBankOfIndia (@RBI) October 26, 2024 -
వడ్డీ రేట్ల తగ్గింపు తొందరపాటే
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల విషయమై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వడ్డీ రేట్లను ఈ దశలో తగ్గించడం తొందరపాటు నిర్ణయం అవుతుందని, ఇది చాలా చాలా రిస్క్‌గా మారుతుందన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే గరిష్ట స్థాయిలోనే కొనసాగుతోందంటూ, భవిష్యత్ ద్రవ్యపరమైన నిర్ణయాలు డేటా ఆధారంగానే ఉంటాయని సంకేతం ఇచ్చారు. ఈ నెల మొదట్లో జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ భేటీ కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయించడం తెలిసిందే. ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్లను ప్రస్తావిస్తూ, మానిటరీ పాలసీ విధానాన్ని తటస్థానికి సడలించింది. తదుపరి ఆర్బీఐ ఎంపీసీ ద్వైమాసిక భేటీ డిసెంబర్ 6న జరగనుంది. బ్లూంబర్గ్ నిర్వహించిన ఇండియా క్రెడిట్ ఫోరమ్‌లో పాల్గొన్న సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఈ అంశాలను ప్రస్తావించారు. సెపె్టంబర్ నెలకు ద్రవ్యోల్బణం అధికంగా ఉందంటూ, తదుపరి నెల గణాంకాల్లోనూ ఇదే తీరు ఉంటుందని, ఆ తర్వాత మోస్తరు స్థాయికి దిగి రావొచ్చన్నారు. కనుక ఈ దిశలో రేట్ల కోత ఎంతో తొందరపాటు అవుతుంది. ద్రవ్యోల్బణం 5.5 శాతం స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం చాలా చాలా రిస్‌్కగా మారుతుంది’’అని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ పోలీసు మాదిరిగా వ్యవహరించకూడదంటూ.. ఫైనాన్షియల్ మార్కెట్లపై కఠిన నిఘా కొనసాగిస్తూ, అవసరమైనప్పుడు నియంత్రణపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. నవి ఫిన్సర్వ్, ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ తదితర సంస్థలపై తాజాగా ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. -
RBI Monetary Policy: అదుపులో ద్రవ్యోల్బణ ‘గుర్రం’
ముంబై: ద్రవ్యోల్బణ అదుపు చేయడానికి సంబంధించిన ఉదాహరణను పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ‘ఏనుగు’ నుంచి ‘గుర్రం’ వైపునకు మార్చడం విశేషం. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కట్టడిపై ఆయన గతంలో మాట్లాడుతూ, ‘‘ఏనుగు అడవికి తిరిగి వచ్చి అక్కడే ఉండాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించారు. తాజాగా ఇదే అంశంపై మాట్లాడుతూ, ‘‘చాలా కృషితో ద్రవ్యోల్బణం గుర్రాన్ని స్థిరత్వానికి తీసుకురావడం జరిగింది. రెండేళ్ల క్రితం ద్రవ్యోల్బణం పెరిగిన స్థాయిలతో పోలిస్తే ప్రస్తుతం ఈ రేటు ఆమోదయోగ్యమైన లక్ష్యాలకు దగ్గరలో ఉంది’’ అని పేర్కొన్నారు. ‘గుర్రం మళ్లీ అదుపుతప్పే అయ్యే అవకాశం ఉన్నందున గేట్ తెరవడం గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అదుపు కోల్పోకుండా గుర్రాన్ని గట్టిగా పట్టి ఉంచాలి’’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణంతో పోల్చే విషయంలో జంతువును మార్చడంపై అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాదానం ఇస్తూ, ‘‘ఇందుకు కారణం ద్రవ్యోల్బణంపై యుద్ధం. యుద్ధంలో ఏనుగులను గుర్రాలను ఉపయోగించడం జరుగుతుంది’’ అని చమత్కరించారు. అవసరమైతే పౌరాణిక కథానాయకుడు అర్జునుడు (2022 చివర్లో ఆయన ద్రవ్యోల్బణం కట్టడిని అర్జునుడి గురితో పోలి్చన సంగతి తెలిసిందే) కూడా తిరిగి రాగలడని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై సెంట్రల్ బ్యాంక్ నిస్సందేహంగా దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు. కొత్త కమిటీ తొలి భేటీ కేంద్రం ఈ నెల ప్రారంభంలో ముగ్గురు కొత్త సభ్యులను నియమించిన తర్వాత గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరిగిన తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశం ఇది. ఆర్బీఐ తాజా ద్రవ్య పరపతి విధాన కమిటీని ప్రభుత్వం ఈ నెలారంభంలో పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. ఎక్స్టర్నల్ సభ్యులుగా రామ్ సింగ్, సౌగత భట్టాచార్య, నగేష్ కుమార్‌లను కేంద్ర ఈ నెల ప్రారంభంలో నియమించింది. పదవీ కాలం ముగిసిన అషిమా గోయల్, శశాంక భిడే, జయంత్ ఆర్ వర్మ స్థానంలో వీరి నియామకం జరిగింది. గత ద్వైమాసిక సమావేశాల్లో అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మలు రేటు తగ్గింపునకు వోటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నియమితులయిన వారితో పాటు కమిటీలో అంతర్గత (ఆర్బీఐ తరఫున) సభ్యులుగా గవర్నర్ శక్తికాంతదాస్, డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్బీఐ పరపతి విధాన విభాగం) రాజీవ్ రంజన్లు ఉన్నారు. -
రేటు కోతకు వేళాయెనా..!
ముంబై: పశి్చమాసియాలో యుద్ధ వాతావరణంసహా భౌగోళిక ఉద్రికత్తలు, దీనితో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ద్రవ్య పరపతి విధానాన్ని ఆరుగురు సభ్యుల రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) యథాతథంగా కొనసాగించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు రెపోను వరుసగా 10వ పాలసీ సమీక్షలోనూ 6.5% వద్దే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే విధాన వైఖరిని మాత్రం 2019 జూన్ నుంచి అనుసరిస్తున్న ‘సరళతర ఆర్థిక విధాన ఉపసంహరణ’ నుంచి ‘తటస్థం’ వైపునకు మార్చాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది సానుకూలాంశమని, సమీప భవిష్యత్తులో రెపో రేటు తగ్గింపునకు సంకేతమని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్‌సూద్ సహా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణం దిగొస్తుందన్న భరోసాతో పాలసీ వైఖరి మార్పు నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప, రేటు కోతపై మాట్లాడ్డానికి ఇది తగిన సమయం కాదని ఆర్బీఐ గవర్నర్ దాస్ స్పష్టం చేశారు. పాలసీ సమీక్షలో ముఖ్యాంశాలు... → ఆర్బీఐ తాజా నిర్ణయంతో 2023 ఫిబ్రవరి నుంచి రెపో రేటు యథాతథంగా 6.5% వద్ద కొనసాగుతోంది. → 2024–25 ఆర్థిక సంవత్సరం దేశ ఎకానమీ వృద్ధి రేటు అంచనాను యథాతథంగా 7.2 శాతంగా పాలసీ కొనసాగించింది. ఇప్పటికే వెల్లడైన అధికారిక గణాంకాల ప్రకారం ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎకానమీ 6.7 శాతం పురోగతి సాధించగా, క్యూ2, క్యూ3, క్యూ4లలో వృద్ధి రేట్లు వరుసగా 7, 7.4, 7.4 శాతాలుగా నమోదవుతాయని పాలసీ అంచనావేసింది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందన్న గత విధాన వైఖరిలో మార్పులేదు. క్యూ2, క్యూ3, క్యూ4లలో వరుసగా 4.1 శాతం, 4.8 శాతం, 4.2 శాతాలుగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందని, 2025–26 తొలి త్రైమాసికంలో ఈ రేటు 4.3 శాతమని పాలసీ అంచనావేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటుఇటుగా 4 శాతం వద్ద ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే 4 శాతమే లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొంటున్న సంగతి తెలిసిందే. → ఫీచర్ ఫోన్ యూపీఐ123పే పరిమితిని లావాదేవీకి ప్రస్తుత రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచడం జరిగింది. → లైట్ వాలెట్ పరిమితి ప్రస్తుత రూ.2,000 నుంచి రూ.5,000కు పెరిగింది. లావాదేవీ పరిమితి రూ.500 నుంచి రూ.1,000కి ఎగసింది. → తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 4 నుంచి 6వ తేదీల మధ్య జరగనుంది.వృద్ధికి వడ్డీరేట్లు అడ్డుకాదు... ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై సెంట్రల్ బ్యాంక్ నిస్సందేహంగా దృష్టి సారించింది. ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న విశ్వాసంతోనే పాలసీ విధాన వైఖరిని మార్చడం జరిగింది. అయితే రేటు కోత ఇప్పుడే మాట్లాడుకోవడం తగదు. ఇక వృద్ధిపై ప్రస్తుత వడ్డీరేట్ల ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు గత 18 నెలల కాలంలో మాకు ఎటువంటి సంకేతాలు లేవు. భారత్ ఎకానమీ పటిష్ట వృద్ధి బాటలో పయనిస్తోంది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణ నాణ్యతపై అత్యధిక దృష్టి సారించాలి. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ వృద్ధికి దోహదం.. ఆర్బీఐ విధాన ప్రకటన పటిష్ట వృద్ధికి, ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడే అంశం. పాలసీ వైఖరి మార్చుతూ తీసుకున్న నిర్ణయం.. ద్రవ్యోల్బణాన్ని 4% వద్ద కట్టడి చేయడానికి ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటుందన్న అంశాన్ని స్పష్టం చేస్తోంది. – సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్ రియలీ్టకి నిరాశ..హౌసింగ్ డిమాండ్‌ను పెంచే అవకాశాన్ని ఆర్బీఐ కోల్పోయింది. రియలీ్టకి ఊపునివ్వడానికి రేటు తగ్గింపు కీలకం. వచ్చే పాలసీ సమీక్షలోనైనా రేటు తగ్గింపు నిర్ణయం తీసుకోవాలని ఈ రంగం విజ్ఞప్తి చేస్తోంది. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ వైఖరి మార్పు హర్షణీయం.. ఆర్బీఐ పాలసీ వైఖరి మార్పు హర్షణీయం. రానున్న సమీక్షలో రేటు కోత ఉంటుందన్న అంశాన్ని ఇది సూచిస్తోంది. ఎకానమీ పురోగతికి తగిన పాలసీ నిర్ణయాలను ఆర్బీఐ తగిన సమయాల్లో తీసుకుంటుందని పరిశ్రమ విశ్వసిస్తోంది. – దీపక్‌సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ -
అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను ఈసారీ యథాతథంగానే ఉంచుతున్నట్లు ప్రకటించింది. వరుసగా పదోసారి రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో ఉన్న 6.5 శాతం రెపోరేటునే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గుతున్నా ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ తెలిపారు. మూడు రోజుల పాటు సాగిన మానిటరీ పాలసీ సమావేశంలోని ముఖ్యాంశాలను దాస్ వెల్లడించారు.రూపాయి విలువలో ఎక్కువ ఒడిదొడుకులు ఉండకుండా ఆర్బీఐ చర్యలు తీసుకుంది.ప్రధాన ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుంది.ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నాం.ఎన్బీఎఫ్సీలు రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా వృద్ధిని కొనసాగిస్తున్నాయి.సెప్టెంబరులో సీపీఐ గణనీయంగా పెరగవచ్చు.ద్రవ్యోల్బణం: > సీపీఐ ద్రవ్యోల్బణం క్యూ2లో 4.1%గా ఉంటుందని అంచనా.> క్యూ3లో 4.8 శాతానికి పెరగొచ్చు.> క్యూ4లో 4.2 శాతంగా ఉండవచ్చు.> క్యూ1 2026 ఆర్థిక సంవత్సరంలో 4.3 శాతంగా ఉండబోతుంది.2025 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుంది.జీడీపీ 7.2 శాతంగా ఉంటుందని అంచనా.ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో వాస్తవ జీడీపీ 6.7 శాతం పెరిగింది.కూ1లో జీడీపీలో కరెంట్ ఖాతా లోటు 1.1 శాతంగా ఉంది.యూపీఐ లైట్ వాలెట్ లిమిట్‌ను రూ.2000 నుంచి రూ.5000కు పెంచారు.‘యూపీఐ 123పే’ ఐవీఆర్ ఆధారిత లావాదేవీలను రూ.5000 నుంచి రూ.10000కు పెంచారు.పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, దాంతో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాలు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయానికి కారణాలు అయి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు సరళతర రేటు విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ దేశీయంగా ఆర్బీఐ ఆ తరహా నిర్ణయాలు తీసుకోకపోవడం కొంత నిరాశ కలిగించింది. ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయదనే సంకేతాలు గతంలో గవర్నర్ పలు సమావేశాల్లో స్పష్టంగా అందించారు. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ యథాతథంగా 6.5 శాతం రెపో రేటును కొనసాగిస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే, డిసెంబర్లో జరిగే ఎంపీసీ సమావేశంలో రేటు తగ్గింపు ఉండవచ్చని కొందరు అభిప్రాయ పడుతున్నారు.ఇదీ చదవండి: కిక్కెక్కిస్తోన్న ‘క్విక్ కామర్స్’!2024 జులై, ఆగస్టులో ద్రవ్యోల్బణ గణాంకాలు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో (వరుసగా 3.6 శాతం, 3.65 శాతం) నమోదయ్యాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 2-4 శాతం వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అందుకు అనువుగా ద్రవ్యోల్బణం తగ్గుతున్నా కీలక వడ్డీరేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని గవర్నర్ పేర్కొన్నారు. అయితే సరళతర వడ్డీరేట్ల విధానం కోరుతున్న ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని సూచిస్తోంది. కానీ దీనివల్ల ఆర్బీఐ పనితీరుపై ప్రజలకు విశ్వాసం కోల్పోతుందని ఇటీవల రఘురామ్‌రాజన్ తెలిపారు. -
ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా?
ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపే అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇప్పటికే వడ్డీ రేట్ల తగ్గింపు బాట పట్టింది. గత పాలసీ సమీక్షలో 0.5 శాతం వడ్డీ రేటును తగ్గించింది. ఈ ప్రభావం దేశీ కేంద్ర బ్యాంకు ఆర్బీఐపైనా ఉండవచ్చని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ప్రభావితంకానున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. దేశీ స్టాక్ మార్కెట్లు నేటి(7) నుంచి ప్రారంభంకానున్న రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్షా సమావేశాలపై దృష్టి పెట్టనున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) బుధవారం(9న) పరపతి నిర్ణయాలను తీసుకోనుంది. వెరసి ఈ వారం ఇన్వెస్టర్లు ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై అధికంగా దృష్టి సారించనున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. గత నెల18న యూఎస్ ఫెడ్ నాలుగేళ్ల తదుపరి యూటర్న్ తీసుకుంటూ వడ్డీ రేట్లలో 0.5 శాతం కోత పెట్టింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతానికి దిగివచ్చాయి. ఫెడ్ పాలసీ నిర్ణయాల వివరాలు(మినిట్స్) బుధవారం వెల్లడికానున్నాయి. అయితే దేశీయంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు, మధ్యప్రాచ్య అనిశి్చతులు వంటి అంశాల నేపథ్యంలో ఆర్బీఐ యథాతథ పాలసీ అమలుకే మొగ్గు చూపవచ్చని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 6.5 శాతంగా అమలవుతోంది. ఫలితాల సీజన్ షురూ ఈ వారం నుంచి దేశీ కార్పొరేట్ జులై–సెపె్టంబర్ (క్యూ2) ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. ప్రధానంగా ఐటీ దిగ్గజాలు ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2024–25) క్యూ2 ఫలితాల సీజన్‌కు తెరతీయనున్నాయి. జాబితాలో టాటా గ్రూప్ దిగ్గజాలు టీసీఎస్, టాటా ఎలక్సీ 10న క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి. ఈ బాటలో డెన్ నెట్వర్క్స్, జీఎం బ్రూవరీస్, ఇరెడా సైతం ఇదే రోజు ఫలితాలు ప్రకటించనున్నాయి. కాగా.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం సెంటిమెంటుపై ప్ర భావాన్ని చూపగలదని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ నిపుణులు ప్రవేశ్ గౌర్ అంచనా వేశారు. మధ్యప్రా చ్య ఉద్రిక్తతలతో సెన్సెక్స్ 85,000, నిఫ్టీ 26,000 పాయింట్ల మైలురాళ్లను స్వల్ప కాలంలోనే కోల్పోయినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. గత వారం మార్కెట్లు 4 శాతం పతనమైన సంగతి తెలిసిందే. ఇతర అంశాలు కీలకం ఆర్బీఐ పాలసీ సమీక్ష, పశి్చమాసియా ఉద్రిక్తతలతోపాటు.. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు లేదా విక్రయాలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ కదలికలు, చమురు ధరలు వంటి అంశాలు సైతం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా వివరించారు. మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ డైరెక్టర్ పల్కా ఆరోరా చోప్రా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత వారం పశి్చమాసియాలో చెలరేగిన యుద్ధవాతావరణం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు దేశీ మార్కెట్లను దెబ్బతీసిన విషయం విదితమే. సెన్సెక్స్ 3,883 పాయింట్లు(4.5 శాతం) పతనమై 81,688 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 1,164 పాయింట్లు(4.5 శాతం) కోల్పోయి 25,015 వద్ద ముగిసింది. దీంతో గత వారం ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో రూ. 16.25 లక్షల కోట్లు ఆవిరికావడం ప్రస్తావించదగ్గ అంశం! కాగా.. దేశీయంగా లిక్విడిటీ పటిష్టంగా ఉన్నదని గౌర్ పేర్కొన్నారు. ప్రస్తుతం అధిక విలువల్లో ఉన్న రంగాల నుంచి ఆకర్షణీయ విలువల్లో ఉన్న స్టాక్స్‌వైపు పెట్టుబడులు తరలే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలుఇటీవలి యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉన్నట్టుండి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అమ్మకాల బాట పట్టారు. దేశీ స్టాక్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఈ నెల(అక్టోబర్)లో భారీ గా అమ్మకాలకు తెరతీశారు. ఈ నెలలో తొలి మూడు(1–4 మధ్య) సెషన్లలోనే భారీగా రూ. 27,142 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇందుకు ముడిచమురు ధరలు జోరందుకోవడం, చైనాలో సహాయక ప్యాకేజీల ప్రకటనలు సైతం ప్రభావం చూపాయి. అయితే సెపె్టంబర్లో గత తొమ్మిది నెలల్లోనే అత్యధికంగా దేశీ స్టాక్స్‌లో రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు పశి్చమాసియాలో ఉద్రిక్తతలు ఊపందుకోవడంతో అమ్మకాల యూటర్న్ తీసుకున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అమ్మకాలకే ప్రాధాన్యమిచి్చన ఎఫ్‌పీఐలు జూన్ నుంచి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న విషయం విదితమే. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రేటు తగ్గింపునకు తొందరలేదు..!
సింగపూర్: రిటైల్ ద్రవ్యోల్బణం రెండు నెలలుగా పూ ర్తిగా అదుపులోనికి వచి్చనప్పటి కీ, రేటు తగ్గింపునకు తొందరపడబోమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సూచించారు. ఈ దిశలో (రేటు తగ్గింపు) నిర్ణయానికి ఇంకా చాలా దూరం ఉందని ఆయన అన్నారు. సింగపూర్‌లో బ్రెట్టన్ వుడ్స్ కమిటీ నిర్వహించిన ‘ఫ్యూచర్ ఆఫ్ ఫైనాన్స్ ఫోరమ్ 2024’లో దాస్ కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. → 2022లో గరిష్ట స్థాయి 7.8% వద్ద ఉన్న ద్రవ్యోల్బణం ఇప్పుడు 4% లక్ష్యం దిగువకు చేరింది. అయితే ఇందుకు అనుగుణంగా నిర్ణయాలు (రేటు తగ్గింపు) తీసుకోడానికి ఇంకా చాలా దూరం ఉంది. మరోవైపు (సరళతర ద్రవ్య విధానాల వైపు) చూసే ప్రయత్నం చేయలేము. → ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం చాలా వరకు కష్ట నష్టాలను తట్టుకుని నిలబడుతున్నప్పటికీ, ద్రవ్యో ల్బణం చివరి మైలు లక్ష్య సాధన సవాలుగానే ఉందని పలుసార్లు నిరూపణ అయ్యింది. ద్రవ్యోల్బణం సవాళ్లు ఆర్థిక స్థిరత్వ ప్రమాదాలకు దారితీస్తాయి. → ద్రవ్యోల్బణం కావచ్చు... ప్రతిద్రవ్యోల్బణం కావచ్చు. సమస్య తీవ్రమైనది. ఈ పరిస్థితుల్లో ద్రవ్య విధానాన్ని సడలించడంలో జాగ్రత్త అవసరం. కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధాన నిర్వహణలో వివేకం ఉండాలి. మరోవైపు సరఫరా వైపు ప్రభుత్వం చర్యలు చురుకుగా ఉండాలి. అమెరికన్ సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ నుండి సరళతర పాలసీ సంకేతాల నేపథ్యంలో రేటు తగ్గింపులకు సంబంధించి మార్కెట్ అంచనాలు ఇప్పుడు మళ్లీ ఊపందుకుంటున్నాయి. అయితే పాలసీల మార్పు విషయంలో అన్ని విషయాలను విస్తృత స్థాయిలో పరిగణనలోని తీసుకుంటూ, ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రపంచంలోని పలు సెంట్రల్ బ్యాంకులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీనిని అనుసరించని సెంట్రల్ బ్యాంకులు– తమ దేశీయ ద్రవ్యోల్బణం–వృద్ధి సమతుల్యత అంశాలపై నిఘా ఉంచి తగిన పాలసీ ఎంపిక చేసుకోవాలి. భారత్ వృద్ధిలో వినియోగం, పెట్టుబడుల కీలక పాత్ర భారత్ ఆర్థిక వ్యవస్థపై ఆయన వ్యాఖ్యానిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం, ద్రవ్యోలోటు, కరెంటు అకౌంట్ లోటు వంటి అంతర్లీన పటిష్టతను ప్రతిబింబిస్తుందని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ పురోగతిలో – ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులు ప్రధాన పాత్ర పోషిస్తాయని దాస్ విశ్లేíÙంచారు. కోవిడ్–19 మహమ్మారి సవాళ్ల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ బయటకు వచి్చందని, 2021–24 మధ్య సగటు వాస్తవ జీడీపీ వృద్ధి 8 శాతం కంటే అధికంగా నమోదైందని గవర్నర్ పేర్కొన్నారు. ద్రవ్య పటిష్టతతోపాటు ప్రభుత్వ భారాలు తగ్గుతుండడం సానుకూల పరిణామమన్నారు. కార్పొరేట్ పనితీరు పటిష్టంగా కొనసాగుతున్నట్లు వివరించారు. ఆర్బీఐ నియంత్రించే బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల బ్యాలెన్స్ షీట్లు కూడా బలపడ్డాయని గవర్నర్ తెలిపారు. అన్ని స్థాయిల్లో ప్రపంచ దేశాల పరస్పర సహకారం ప్రపంచ పురోగతికి కీలకమని భారత్ భావిస్తున్నట్లు తెలిపారు. 2023లో భారత జీ20 ప్రెసిడెన్సీ, దాని తర్వాత ప్రపంచ దేశాలతో నిరంతర సహకార విధానాలను పరిశీలిస్తే, ఆయా అంశాలు ‘ప్రపంచం ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే న్యూ ఢిల్లీ దృష్టిని ప్రతిబింబిస్తాయని దాస్ వివరించారు. పరస్పర సహకారంతోనే ప్రపంచ పురోగతి 21వ శతాబ్దపు ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి బహుళజాతి అభివృద్ధి బ్యాంకులను (ఎండీబీ) బలోపేతం చేయడం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తేవడం, ఉత్పాదకత లాభాలను సాధించడం, మధ్య–ఆదాయ దేశాలకు రుణ పరిష్కారం వంటివి భారత్ ప్రాధాన్యతలలో కొన్నని గవర్నర్ ఈ సందర్భంగా వివరించారు. ప్రపంచ అభివృద్ధి మెరుగుదల కోసం రాబోయే దశాబ్దాలలో ప్రపంచ క్రమాన్ని పునరి్నర్మించడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మొత్తం మానవజాతి కోసం ఇందుకు సంబంధించి ’ఒక భవిష్యత్తు’ కోసం పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లు ఇటీవలి నెలల్లో సవాళ్లను తట్టుకుని నిలబడగలుగుతోందని అన్నారు. ఈక్విటీ, బాండ్ ఈల్డ్ వంటి అంశాల్లో ఒడిదుడుకులు చాలా తక్కువగా ఉంటున్నాయని వివరించారు. అయితే స్టాక్ మార్కెట్లలో ధరల అసాధారణ పెరుగుదల ఒక అనూహ్య పరిణామమన్నారు. గ్లోబల్ ఫైనాన్షియల్ గవర్నెన్స్‌లో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను అనుసంధానానికి, ఈ విషయంలో అసమతుల్యత పరిష్కారానికి సంస్కరణలు అవసరమని అన్నారు. ప్రపంచ ఆర్థిక భద్రతా వలయాన్ని (జీఎఫ్ఎస్ఎన్) బలోపేతం చేయడంపై కూడా సంస్కరణలు దృష్టి సారించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.బేస్ మాయతోనే ద్రవ్యోల్బణం తగ్గిందా? 2023 జూలై, ఆగస్టుల్లో రిటైల్ ద్రవ్యోల్బణం బేస్ భారీగా (వరుసగా 7.44 శాతం, 6.83 శాతం) ఉన్నందునే 2024 జూలై, ఆగస్టులో ద్రవ్యోల్బణ గణాంకాలు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో (వరుసగా 3.6 శాతం, 3.65 శాతం) కనబడుతున్నాయని కొందరు నిపుణుల చేస్తున్న వాదనను గవర్నర్ శక్తికాంతదాస్ శక్తికాంతదాస్ తాజా వ్యాఖ్యలు (రేటు తగ్గింపుపై) సమరి్థంచినట్లయ్యింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా (మైనస్ లేదా ప్లస్) 4 శాతం వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. ఆర్బీఐ కీలక ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధానానికి ఈ సూచీనే ప్రాతిపదికగా ఉండడం గమనార్హం. రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా గడచిన తొమ్మిది ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాల నుంచి ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలుచేసే రుణ రేటు– రెపో రేటును (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడికి ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని కూడా గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. వృద్ధి లక్ష్యంగా రేటు తగ్గింపును (సరళతర వడ్డీరేట్ల విధానం) కోరుతున్న ప్రభుత్వం– రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని కూడా సూచిస్తోంది. అవసరమైతే పేదలకు ఫుడ్ కూపన్ల జారీ ప్రతిపాదనను సైతం ఆర్థిక సర్వే ప్రస్తావిస్తోంది. అక్టోబర్ 7 నుంచి 9 వరకూ తదుపరి పాలసీ సమీక్షా సమావేశం జరగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఆర్బీఐ పాలసీ విధానంపై ఆసక్తి నెలకొంది. -
మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి
న్యూఢిల్లీ: మహిళలకు మరింత ఉపాధి అవకాశాలను అందించడానికి ఫైనాన్షియల్ రంగం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. మహిళలను ప్రోత్సహించే వ్యాపారాలకు అనుకూలమైన పథకాలను రూపొందించడం ద్వారా లింగ అంతరాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చని ఆయన సూచించారు. సమగ్ర వృద్ధి ప్రాముఖ్యతను ఉద్ఘాటిస్తూ వాస్తవ అభివృద్ధి చెందిన భారతదేశం అంటే.. దేశంలోని ప్రతి పౌరుడు సామాజిక–ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఆర్థిక సేవలను పొందాల్సి ఉంటుందని అన్నారు. అవసరమైన ఆర్థిక అక్షరాస్యతను కలిగి ఉండేలా చూడాలని గవర్నర్ సూచించారు. ఫిక్కీ, ఐబీఏ సంయుక్తంగా నిర్వహించిన వార్షిక ఎఫ్‌ఐబీఏసీ– 2024 ప్రారంభ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, భారత్ శ్రామిక శక్తి భాగస్వామ్యం (మహిళల భాగస్వామ్యం) ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉందన్నారు. బాలికల విద్యను మెరుగుపరచడం, నైపుణ్యాభివృద్ధి, పని ప్రదేశంలో భద్రత, సామాజిక అడ్డంకులను పరిష్కరించడం వంటి కార్యక్రమాల ద్వారా ఈ అంతరాన్ని తగ్గించాల్సిన తక్షణ అవసరం ఉందని అన్నారు. వినియోగం, డిమాండ్ సమిష్టిగా పెరగడంతో భారతదేశ వృద్ధి చెక్కుచెదరకుండా ఉందన్నారు. భూమి, కారి్మక, వ్యవసాయ మార్కెట్లలో సంస్కరణల ద్వారా మరిన్ని మెరుగైన ఫలితాలు పొందవచ్చని సూచించారు. -
బ్యాంకులను హెచ్చరించిన ఆర్బీఐ గవర్నర్!
బ్యాంకులు వినూత్న మార్గాల్లో డిపాజిట్లను సేకరించకపోతే ప్రమాదంలో పడుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. చిన్న మొత్తాల్లో డిపాజిట్లను సేకరిస్తూ కొన్ని బ్యాంకులు పబ్బం గడుపుతున్నాయని చెప్పారు. దీని వల్ల బ్యాలెన్స్‌షీట్లలో అప్పులు-ఆస్తుల మధ్య తారతమ్యం(అసెట్ లయబిలిటీ డిఫరెన్స్) పెరుగుతుందన్నారు.ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో దాస్ మాట్లాడుతూ..‘బ్యాంకు కస్టమర్లు డిపాజిట్ల రూపంలో కాకుండా వివిధ మార్గాల్లో డబ్బు దాచుకుంటున్నారు. ఇతర పెట్టుబడి మార్గాలకు మళ్లిస్తున్నారు. బ్యాంకులు లోన్లు ఇవ్వాలన్నా, భారీగా కార్పొరేట్ రుణాలు జారీ చేయాలన్నా డిపాజిట్లు పెరగాలి. లేదంటే బ్యాలెన్స్ షీట్లలో అప్పులు-ఆస్తుల మధ్య తారతమ్యం ఎక్కువవుతుంది. అది బ్యాంకులకు నష్టం కలిగిస్తుంది. కాబట్టి వినూత్న మార్గాల్లో కస్టమర్ల నుంచి డిపాజిట్లు రాబట్టే ప్రయత్నం చేయాలి. క్రెడిట్ వృద్ధికి అనుగుణంగా డిపాజిట్లను సేకరించేందుకు బ్యాంకులు భారీ బ్రాంచ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉండాలి. చిన్న మొత్తాల్లో డిపాజిట్లను సేకరిస్తూ కొన్ని బ్యాంకులు పబ్బం గడుపుతున్నాయి. ఇవి భవిష్యత్తులో ప్రమాదంలో పడుతాయి’ అన్నారు.ఇదీ చదవండి: రేపు మూడు గంటలు యూపీఐ సర్వీసు నిలిపివేత!ఇదిలాఉండగా, గురువారం జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచారు. ఇలా రెపో రేటును మార్చకపోవడం ఇది వరుసగా తొమ్మిదోసారి. మార్కెట్ వర్గాలు కూడా ఈసారి ఎలాంటి మార్పులుండవనే భావించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు సెప్టెంబర్‌లో జరిగే మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తే, అందుకు అనువుగా ఆర్బీఐ వడ్డీరేట్లలో మార్పు చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. -
బ్యాంకర్లతో ఆర్బీఐ గవర్నర్ భేటీ
బ్యాంకర్లతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక భేటీ జరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో బుధవారం ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు.రుణాలు, డిపాజిట్ వృద్ధికి మధ్య అంతరం, లిక్విడిటీ రిస్క్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మోసాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు వంటి అనేక అంశాలు సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. బ్యాంకుల్లో భద్రతా చర్యలను బలోపేతం చేయడం, సరిహద్దు లావాదేవీల్లో రూపాయి వినియోగాన్ని పెంచడం, ఆర్బీఐ ఆవిష్కరణ కార్యక్రమాలలో బ్యాంకుల భాగస్వామ్యం గురించి కూడా చర్చించారు.తమ పరిధిలోకి వచ్చే బ్యాంకులు, సంస్థల సీనియర్ మేనేజ్మెంట్తో తరచూ ఆర్బీఐ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజా సమావేశం జరిగింది. ఇంతకుముందు భేటీ ఫిబ్రవరి 14న జరిగినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ సమావేశానికి ఆర్బీఐ గవర్నర్‌తోపాటు, డిప్యూటీ గవర్నర్లు ఎం. రాజేశ్వర్ రావు, స్వామినాథన్, ఆర్బీఐ నియంత్రణ, పర్యవేక్షణ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
RBI Governor Shaktikanta Das: ఆర్థికాభివృద్ధి.. ధరల కట్టడే లక్ష్యం
ముంబై: అంతా ఊహించినట్లే రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను (రెపో) వరుసగా ఎనిమిదో సారీ యథాతథంగా ఉంచింది. ఇటు పటిష్టమైన వృద్ధి అటు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని 6.5 శాతం స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) వృద్ధి రేటు గతంలో భావించిన 7 శాతానికి మించి 7.2 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. అలాగే ద్రవ్యోల్బణం 4.5 శాతం స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి బుధవారం నుంచి మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఈ విషయాలు వెల్లడించారు. ఆగస్టు 8న తదుపరి పాలసీ ప్రకటన ఉంటుంది. వడ్డీ రేటును తగ్గించాలని గత సమీక్షలో అభిప్రాయపడిన వారు ఒకరే ఉండగా ఈసారి అది ఇద్దరికి పెరిగింది. ఎక్స్టర్నల్ సభ్యులు (ఆషిమా గోయల్, జయంత్ వర్మ) వీరిలో ఉన్నారు. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటే రెపో. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఈ రేటు య«థాతథంగా ఉంది.బల్క్ డిపాజిట్ల పరిమితి పెంపు బ్యాంకుల అసెట్ మేనేజ్మెంట్ను మెరుగుపర్చేందుకు తోడ్పడేలా బల్క్ ఫిక్సిడ్ డిపాజిట్ల ప్రారంభ పరిమితిని ఆర్బీఐ రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు పెంచింది. సాధారణంగా రిటైల్ టర్మ్ డిపాజిట్లతో పోలిస్తే బల్క్ ఎఫ్డీలపై బ్యాంకులు కొంత అధిక వడ్డీ రేటు ఇస్తాయి. పరిమితులను సవ రించడం సాధారణంగా జరిగేదేనని కొన్నేళ్ల క్రితం ఇది కోటి రూపాయలుగా ఉండేదని, తర్వాత రెండు కోట్లకు పెరిగిందని, తాజా పరిస్థితుల కు అనుగుణంగా దీన్ని రూ. 3 కోట్లకు పెంచామని డిప్యుటీ గవర్నర్ జె. స్వామినాథన్ తెలిపారు. యూపీఐ లైట్ వాలెట్లు, ఫాస్టాగ్‌లకు ఆటోలోడ్ సదుపాయం.. చిన్న మొత్తాలను డిజిటల్‌గా చెల్లించేందుకు ఉపయోగపడే యూపీఐ లైట్ వాలెట్లలో బ్యాలెన్స్ తగ్గినప్పుడల్లా ఆటోమేటిక్‌గా లోడ్ చేసుకునే సదుపాయాన్ని కస్టమర్లకు అందుబాటులోకి తేవాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇందుకోసం దీన్ని ఈ–మ్యాన్‌డేట్ ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. యూపీఐ లైట్ వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడగలదని దాస్ తెలిపారు. ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్సీఎంసీ)లను కూడా ఈ–మ్యాన్‌డేట్ పరిధిలోకి తేవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం యూపీఐ లైట్ రోజువారీపరిమితి రూ. 2,000గా ఉండగా, ఒకసారి గరిష్టంగా రూ. 500 వరకు మాత్రమే చేయడానికి వీలుంది. యూపీఐ లైట్ యాప్‌లో బ్యా లెన్స్ గరిష్టంగా రూ. 2,000కు మించరాదు.బ్యాంకుల సిస్టమ్ వైఫల్యాల వల్లే పేమెంట్స్ అంతరాయాలు.. చెల్లింపు లావాదేవీల్లో అంతరాయాలతో కస్టమర్లకు సమస్యలు ఎదురవడానికి కారణం బ్యాంకుల సిస్టమ్‌ల వైఫల్యమే తప్ప యూపీఐ, ఎన్‌పీసీఐలు కాదని దాస్ చెప్పారు. ప్రతి అంతరాయాన్ని కేంద్రీయ బ్యాంకులో సంబంధిత అధికారులు నిశితంగా అధ్యయనం చేస్తారని, ఈ విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) లేదా ఏకీకృత చెల్లింపుల విధానం ప్లాట్‌ఫాం లోపాలున్నట్లుగా ఏమీ వెల్లడి కాలేదని ఆయన తెలిపారు. టెక్నాలజీకి సంబంధించి బ్యాంకులు గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నాయన్నారు. -
కేంద్రంపై ఆర్బీఐ కనకవర్షం
ముంబై: కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గత ఆర్థిక సంవత్సరానికి (2023–24) భారీగా రూ.2,10,874 కోట్ల డివిడెండ్‌ను అందించనుంది. ఆర్బీఐ చరిత్రలోనే ఇది రికార్డ్ కాగా.. బడ్జెట్ అంచనాలకన్నా రెట్టింపు. జీడీపీలో 0.2% నుంచి 0.3 శాతానికి సమానం. ఎన్నికల అనంతరం అధికారంలోకి రానున్న కొత్త ప్రభుత్వానికి ఆదాయపరంగా ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. ఈ మేరకు గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలో జరిగిన ఆర్బీఐ 608వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం తాజా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ కేంద్రానికి ఆర్బీఐ నుంచి అందిన అత్యధిక నిధుల బదలాయింపు విలువ( 2018–19) రూ. 1.76 లక్షల కోట్లు. తాజా నిర్ణయాలపై ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని ముఖ్యాంశాలు..⇢ 2024–25లో ఆర్బీఐ, ప్రభు త్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.1.02 లక్షల కోట్ల డివిడెండ్లు అందుతాయని ఈ ఏడాది ఫిబ్రవరి బడ్జెట్ అంచనావేసింది. అయితే దీనికి రెట్టింపు మొత్తాలు రావడం గమనార్హం. ⇢ తాజా బోర్డ్ సమావేశం దేశీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించింది. వృద్ధి అవుట్‌లుక్‌కు ఎదురయ్యే సవాళ్లను, తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించింది. ద్రవ్యలోటు, బాండ్ ఈల్డ్ తగ్గే చాన్స్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రానికి వచ్చే ఆదాయం చేసే వ్యయానికి మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు రూ.17.34 లక్షల కోట్లుగా ఉంటుందని ఫిబ్రవరి బడ్జెట్ అంచనావేసింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ తాజా నిర్ణయం కేంద్ర ఖజానాకు పెద్ద ఊరటకానుంది. తాజా నిర్ణయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 4 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గడానికి దోహదపడే అంశం. కేంద్రంపై రుణ భారాన్ని తగ్గిస్తుంది. తద్వారా బాండ్ మార్కెట్ విషయంలో కేంద్రానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. దేశ బెంచ్‌మార్క్ 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్ కూడా 4 శాతం తగ్గి 7 శాతం వద్ద స్థిరపడే వీలుంది.భారీ మిగులుకు కారణం? అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో ఆర్బీఐ ఫారిన్ ఎక్సే్చంజ్ అసెట్స్ ద్వారా లభించిన అధిక వడ్డీ ఆదాయాలు ఆర్బీఐ భారీ నిధుల బదలాయింపులకు ఒక ప్రధాన కారణం. దేశీయ, అంతర్జాతీయ సెక్యూరిటీలపై అధిక వడ్డీరేట్లు, ఫారిన్ ఎక్సే్చంజ్ భారీ స్థూల విక్రయాలు కూడా ఇందుకు దోహదపడ్డాయి. ఎకానమీపై భరోసాతో 6.5 శాతానికి సీఆర్‌బీఐ పెంపు మరోవైపు సెంట్రల్ బ్యాంక్ నిధుల నిర్వహణకు సంబంధించిన కంటింజెంట్ రిస్క్ బఫర్‌ను (సీఆర్బీ) ఆర్బీఐ బోర్డ్ 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 6.50 శాతానికి పెంచింది. భారత్ ఎకానమీ రికవరీని ఇది సూచిస్తోంది. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ మొత్తంలో తన వద్ద ఎంత స్థాయిలో మిగులు నిధులను ఉంచుకోవాలి, కేంద్రానికి ఎంత మొత్తంలో మిగులును బదలాయించాలి అనే అంశంపై మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ ఒక ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. సీఆర్‌బీఐ 5.5% – 6.5 % శ్రేణిలో ఉండాలని ఈ ఫ్రేమ్‌వర్క్ నిర్దేశించింది. దీని ప్రకారమే ఆర్బీఐ మిగులు బదలాయింపు నిర్ణయాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు, కోవిడ్–19 మహమ్మారి వంటి పరిణామాల నేపథ్యంలో 2018–19 నుంచి 2021–22 వరకూ 5.50 శాతం సీఆర్బీ నిర్వహణకు ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. తద్వారా కేంద్రానికి అధిక మిగులు నిధులు అందించి ఆర్థిక పురోగతి, ఎకానమీ క్రియాశీలతకు దోహదపడాలన్నది సెంట్రల్ బ్యాంక్ ఉద్దేశం. ఎకానమీ పురోగతి నేపథ్యంలో 2022–23లో సీఆర్బీని 6 శాతానికి, తాజాగా 6.5 శాతానికి సెంట్రల్ బ్యాంక్ బోర్డ్ పెంచింది. -
ఎన్నికల బాండ్లు.. ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
ముంబై: ఎన్నికల బాండ్ల స్కీమ్ రద్దుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించేందుకు నిరాకరించారు. ఆర్బీఐ ద్వై మాసిక క్రెడిట్ పాలసీ నిర్ణయాన్ని వెల్లడించేందుకు శుక్రవారం(ఏప్రిల్ 5)గవర్నర్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఎన్నికల బాండ్లపై గవర్నర్‌ను ప్రశ్నించగా ‘నో కామెంట్’ అని సమాధానమిచ్చారు. ‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఇటీవల ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించింది. కంపెనీలు తమ నికర విలువ కంటే ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయడం అనే అంశం మా పరిధిలోకి రాదు’అని దాస్ చెప్పారు. రాజకీయ పార్టీలకు వ్యక్తులు లేదా సంస్థలు గుప్త విరాళాలిచ్చే ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల బాండ్లు ఎవరు కొనుగోలు చేశారు, రాజకీయ పార్టీలకు వాటి ద్వారా ఎన్ని విరాళాలు వచ్చాయన్న వివరాలు ఎన్నికల కమిషన్(ఈసీ)కి అందించాలని ఎస్బీఐని సుప్రీం ఆదేశించింది. దీంతో ఎస్బీఐ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘానికి అందించడంతో ఆ వివరాలను ఈసీ తన వెబ్సైట్లో ఉంచి బహిర్గతం చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల బాండ్ల ద్వారా అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా నిలిచింది. ఇదీ చదవండి.. బర్త్ సర్టిఫికెట్ కొత్త రూల్స్.. రూల్స్‌లో కీలక మార్పులు -
ఎన్నికలు అయిపోయాక... ఆర్బీఐ మాజీ గవర్నర్ వార్నింగ్
Raghuram Rajan Warning: ఆర్థిక వృద్ధికి సంబంధించి "హైప్"ను నమ్మి భారత్ పెద్ద తప్పు చేస్తోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. దేశం దాని సామర్థ్యాన్ని చేరుకోవడానికి గణనీయమైన నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన అతిపెద్ద సవాలు శ్రామిక శక్తి, నైపుణ్యాలను మెరుగుపరచడం అని రఘురామ్ రాజన్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఈ సవాలును పరిష్కరించకుంటే యువత ప్రయోజనాలను కాపాడటంలో కష్టాలు పడాల్సి వస్తుందన్నారు. దేశంలోని 140 కోట్ల జనాభాలో సగానికి పైగా 30 ఏళ్లలోపు యువతే ఉన్నారన్నారాయన. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాన్ని ఈ ఆర్బీఐ మాజీ గవర్నర్ కొట్టిపారేశారు. డ్రాప్-అవుట్ శాతం అధికంగా ఉండి పిల్లలలో చాలా మందికి హైస్కూల్ విద్య లేకపోతే ఆ ఆశయం గురించి మాట్లాడటమే వ్యర్థం అన్నారు. భారతదేశంలో అక్షరాస్యత రేట్లు వియత్నాం వంటి ఇతర ఆసియా దేశాల కంటే తక్కువగా ఉన్నాయన్నారు. స్థిరమైన ప్రాతిపదికన 8% వృద్ధిని సాధించడానికే దేశం మరింత ఎక్కువ పని చేయాల్సి ఉందన్నారు. దేశంలో ఉన్నత విద్య కోసం కంటే చిప్‌ల తయారీకి రాయితీలపై ఎక్కువ ఖర్చు చేసేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను రఘురామ్ రాజన్ తప్పుపట్టారు. భారతదేశంలో కార్యకలాపాలను స్థాపించడానికి సెమీ-కండక్టర్ కంపెనీలకు రాయితీల కింద సుమారు రూ. 76 వేల కోట్లు కేటాయించగా ఉన్నత విద్య కోసం రూ. 47 వేల కోట్లనే కేటాయించడాన్ని ఎత్తి చూపారు. -
RBI MPC Meeting 2024: ఆరో‘సారీ’.. తగ్గించేదేలే..!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటును యథాతథంగా 6.5 శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించింది. ముంబైలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో మూడు రోజుల పాటు జరిగిన ఆరుగురు సభ్యుల ఆర్బీఐ ఎంపీసీ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష గురువారం ముగిసింది. సమావేశ వివరాలను గవర్నర్ వివరిస్తూ, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యం, దేశంలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ప్రభుత్వం నిర్దేశిస్తున్న విధంగా 4 శాతానికి దిగిరావాలన్న లక్ష్యం వంటి అంశాల నేపథ్యంలో రెపో రేటును ప్రస్తుతమున్నట్టుగానే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు (రెపో) 6.5 శాతంగా కొనసాగనుంది. ఫలితంగా బ్యాంకింగ్ రుణ రేట్లలో కూడా దాదాపు ఎటువంటి మార్పులూ జరగబోవని నిపుణులు అంచనావేస్తున్నారు. వరుసగా ఆరవసారి ‘యథాతథం’.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోకి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో తాజా సమీక్ష సహా గడచిన ఐదు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. పాలసీలో కీలకాంశాలు... ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023–24లో వృద్ధి రేటు 7.3 శాతంగా అంచనా. ► ఇదే కాలంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4% నుంచి 4.5 శాతానికి డౌన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో 5 శాతం ద్రవ్యోల్బణం నమోదవుతుందని అంచనా. ► నియంత్రణా పరమైన మార్గదర్శకాలను ఎంతోకాలంగా పాటించకపోవడమే పేటీఎంపై చర్యకు దారితీసినట్లు గవర్నర్ దాస్ పేర్కొన్నారు. ఈ చర్యలు వ్యవస్థకు ముప్పు కలిగించేవిగా భావించరాదని కూడా స్పష్టం చేశారు. ► డిజిటల్ రూపాయి వినియోగదారులు ఇకపై పరిమిత ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోనూ లావాదేవీలను త్వరలో నిర్వహించగలుగుతారు. తక్కువ లేదా పరిమిత ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో లావాదేవీల కోసం సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ–రిటైల్(సీబీడీసీ–ఆర్) ఆఫ్‌లైన్ కార్యాచరణను ఆర్బీఐ త్వరలో ఆవిష్కరించనుంది. ► రుణ ఒప్పంద నిబంధనల గురించి కీలక వాస్తవ ప్రకటన (కేఎఫ్ఎస్)ను కస్టమర్లకు అందించవలసి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీని ప్రకారం బ్యాంకింగ్ ఇకపై రిటైల్‌తోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రుణగ్రహీతలకు కూడా కేఎఫ్‌ఎస్‌ను అందించాల్సి ఉంటుంది. ► తదుపరి పాలసీ సమీక్ష ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు జరుగుతుంది. వచ్చే పాలసీలో రేటు తగ్గొచ్చు దేశంలో హౌసింగ్ డిమాండ్ పెంచడానికి వచ్చే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటు తగ్గింపు నిర్ణయం ఉంటుందని భావిస్తున్నాం. ప్రస్తుతానికి వడ్డీరేట్ల స్థిరత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. దీనివల్ల డిమాండ్ ప్రస్తుత పటిష్ట స్థాయిలోనే కొనసాగుతుందని పరిశ్రమ భావిస్తోంది. దేశ ఎకానమీ స్థిరంగా ఉండడం పరిశ్రమకు కలిసివచ్చే అంశం. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ ప్రెసిడెంట్ వృద్ధికి బూస్ట్ రేటు యథాతథ విధానాన్ని కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రగతిశీలమైంది. సుస్థిర ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. అంతర్జాతీయ, దేశీయ సవాళ్లు– ఆహార రంగానికి సంబంధించి ధరల సమస్యల వంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటూ... వినియోగదారు ప్రయోజనాలే లక్ష్యంగా జరిగిన నిర్ణయాలు హర్షణీయం. జాగరూకతతో కూడిన విధానమిది. – దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ -
ఫ్యూచర్ మనీ అదే.. ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
డిజిటల్ కరెన్సీ గురించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) క్రాస్-బోర్డర్ చెల్లింపులను ఖర్చుతో కూడుకున్నది కాకుండా మరింత సమర్థవంతం, వేగవంతం చేయగలదని ఆయన భావిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో భారత సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రసంగించారు. "CBDC గొప్ప ప్రయోజనం అంతర్జాతీయ చెల్లింపులు. దీని వల్ల అంతర్జాతీయ చెల్లింపులు మరింత సమర్థవంతంగా, వేగవంతంగా, చౌకగా మారతాయి. ఇతర దేశాలు ఈ డిజిటల్ కరెన్సీని స్వీకరించినప్పుడు అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థలు సమర్ధత, వేగం, ఖర్చు అంశాల్లో లాభపడతాయి. అంతిమంగా ఇది ఫ్యూచర్ మనీగా మారుతుందని నేను భావిస్తున్నాను" అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పైలట్ వెర్షన్ విజయవంతంపైనే దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ అమలు ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ‘దీన్ని మనం అధిగమించాల్సి ఉంటుంది. అయితే ఇంతలోపే దీన్ని సాధించాలన్న లక్ష్యం అంటూ ఏమీ లేదు. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అనవసరమైన తొందరపాటు లేదు. ఎందుకంటే అది కరెన్సీ అయిన తర్వాత, దాని భద్రత, సమగ్రత, సామర్థ్యాన్ని నిర్ధారించాలి’ అన్నారు. దేశంలో 2022లో నవంబర్-డిసెంబర్ టోకు, రిటైల్ కేటగిరీలలో డిజిటల్ కరెన్సీని పైలట్ ప్రాతిపదికన ఆర్బీఐ ప్రారంభించింది. ప్రస్తుతం రిటైల్ విభాగంలో 40 లక్షల మంది, వ్యాపారుల్లో 4 లక్షల మంది ఈ డిజిటల్ కరెన్సీ వినియోగిస్తున్నారు. -
ఆర్బీఐ గవర్నర్‌గా 'రఘురామ్ రాజన్' జీతం ఎంతంటే?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ 'రఘురామ్ రాజన్' ఇటీవల తాను గవర్నర్‌గా పనిచేస్తున్నప్పుడు ఎంత జీతం తీసుకునే వారనే విషయాలను అధికారికంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాజ్ షమానీ నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో RBI గవర్నర్ల జీతాలు ఎలా ఉండేవని ఆర్బీఐ మాజీ గవర్నర్ 'రఘురామ్ రాజన్' (Raghuram Rajan)ను అడిగిన ప్రశ్నకు, తాను గవర్నర్‌గా పనిచేసిన రోజుల్లో ఏడాదికి రూ. 4 లక్షలను జీతభత్యాలను పొందినట్లు వివరించారు. అయితే ప్రస్తుతం గవర్నర్ల జీతాలు ఎలా ఉంటాయనే విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా ఉన్నపుడు ధీరూభాయ్ అంబానీ నివాసానికి దగ్గరగా ఉన్న 'మలబార్ హిల్స్' అనే పెద్ద ఇంట్లో తనకు నివాసం కల్పించినట్లు వెల్లడించారు. అది కేంద్రం నాకు అందించిన అతిపెద్ద ప్రయోజనం అని చెప్పారు. 2013 నుంచి 2016 మధ్య RBI గవర్నర్‌గా పనిచేసిన రఘురామ్ రాజన్ క్యాబినెట్ సెక్రటరీతో సమానమైన జీతాన్ని పొందినట్లు వెల్లడిస్తూ.. గవర్నర్ పదవి నుంచి బయటకు వచ్చిన తరువాత పెన్షన్ వంటివి రాలేదని వెల్లడించారు. పెన్షన్ రాకపోవడానికి కారణం, తాను సివిల్ సర్వెంట్లు కావడం వల్ల, సివిల్ సర్వీస్ నుంచి అప్పటికే పెన్షన్ రావడం అని కూడా వివరించారు. ఇదీ చదవండి: నష్టాల్లో ఇన్ఫోసిస్.. ఆ ఒక్కటే కారణమా..! రఘురామ్ రాజన్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా పనిచేసి బయటకు వచ్చిన తరువాత షికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఫుల్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఈయన 'బ్రేకింగ్ ది మౌల్డ్: రీఇమేజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్' అనే పేరుతో ఓ బుక్ కూడా లాంచ్ చేశారు. -
RBI Monetary policy: అయిదోసారీ అక్కడే..!
ముంబై: ద్రవ్యోల్బణంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో అంతా ఊహించినట్లే రిజర్వ్ బ్యాంక్ వరుసగా అయిదోసారీ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా 6.5 శాతంగానే కొనసాగించాలని నిర్ణయించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశం హోదాను నిలబెట్టుకుంటూ భారత్ మరింత వృద్ధి నమోదు చేయగలదని అంచనా వేసింది. అటు ఆస్పత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ చెల్లింపుల పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. మరోవైపు, రికరింగ్ చెల్లింపుల ఈ–మ్యాండేట్ పరిమితిని రూ. 15 వేల నుంచి రూ. 1 లక్షకు పెంచాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6–8 మధ్య ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మళ్లీ సమావేశం అవుతుంది. ఆర్బీఐ నిర్ణయాలు అధిక వృద్ధి సాధనకు దోహదపడగలవని బ్యాంకర్లు, కార్పొరేట్లు వ్యాఖ్యానించగా .. రేటును తగ్గించి ఉంటే ప్రయోజనకరంగా ఉండేదని రియల్టీ రంగం అభిప్రాయపడింది. వచ్చే సమీక్షలోనైనా తగ్గించాలని కోరింది. వివరాల్లోకి వెడితే.. బుధవారం నుంచి మూడు రోజుల పాటు సాగిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షకు సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. ప్రామాణిక రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీ రేటు) యధాతథంగా 6.5%గా కొనసాగించాలని కమిటీలోని సభ్యులందరూ (ఆరుగురు) ఏకగ్రీవంగా తీర్మానించారు. ధరలను కట్టడి చేసే దిశగా 2022 మే నుంచి ఇప్పటివరకు ఆర్బీఐ రెపో రేటును 2.5% పెంచింది. యూపీఐ పరిమితులు పెంపు.. ► ఆస్పత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ ద్వారా జరిపే చెల్లింపుల పరిమితి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంపు. ► మళ్లీ మళ్లీ చేసే (రికరింగ్) చెల్లింపులకు సంబంధించి ఈ–మ్యాండేట్ పరిమితి రూ. 15 వేల నుంచి రూ. 1 లక్షకు పెంపు. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలు 6.5 శాతం నుంచి 7%కి పెంపు. జీడీపీ డిసెంబర్ త్రైమాసికంలో 6.5%గా, మార్చి క్వార్టర్లో 6 శాతంగా ఉంటుందని అంచనా. ► వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం క్యూ3లో 5.6%గా, క్యూ4లో 5.2%గా ఉండొచ్చని అంచనా. 2024–25 జూన్ క్వార్టర్లో ఇది 5.2 శాతంగా, సెపె్టంబర్ త్రైమాసికంలో 4 శాతంగా, డిసెంబర్ క్వార్టర్లో 4.7 శాతంగా ఉండవచ్చు. ► డేటా భద్రత, గోప్యతను మరింతగా పెంచే దిశగా ఆర్థిక రంగం కోసం ఆర్బీఐ క్లౌడ్ సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది. ► ఆర్థిక రంగ పరిణామాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు వీలు కలి్పంచేలా ‘‘ఫిన్‌టెక్ రిపాజిటరీ’’ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. 2024 ఏప్రిల్‌లో లేదా అంతకన్నా ముందే రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ దీన్ని అందుబాటులోకి తేనుంది. ఫిన్‌టెక్ సంస్థలు స్వచ్ఛందంగా సంబంధిత వివరాలను రిపాజిటరీకి సమర్పించవచ్చు. ► డిసెంబర్ 1 నాటికి విదేశీ మారక నిల్వలు 604 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ► ఇతర వర్దమాన దేశాలతో పోలిస్తే రూపాయి మారకంలో ఒడిదుడుకులు తక్కువగానే ఉన్నాయి. ద్రవ్యోల్బణంపై ఆహార ధరల ఎఫెక్ట్.. సెపె్టంబర్ క్వార్టర్ వృద్ధి గణాంకాలు పటిష్టంగా ఉండి, అందర్నీ ఆశ్చర్యపర్చాయి. ఆహార ధరల్లో నెలకొన్న అనిశ్చితి రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణ అంచనాలపై గణనీయంగా ప్రభావం చూపవచ్చు. వేగంగా మారిపోయే ఆహార ధరల సూచీలన్నీ కూడా కీలక కూరగాయల రేట్ల పెరుగుదలను సూచిస్తున్నాయి. ఫలితంగా సమీప భవిష్యత్తులో రిటైల్ ద్రవ్యోల్బణం పెరగొచ్చు. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ అంచనాల పెంపు సముచితమే.. ప్రథమార్ధంలో సాధించిన వృద్ధి, ఆ తర్వాత రెండు నెలల్లో (అక్టోబర్, నవంబర్) గణాంకాలన్నీ సానుకూల సంకేతాలనే ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధి అంచనాలను ఆర్బీఐ పెంచడం సముచితమే. – నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి రేటు తగ్గించాల్సింది.. వడ్డీరేట్లను య«థాతథంగా కొనసాగించడం మంచి నిర్ణయమే. అయితే, ప్రస్తుతం స్థూల–ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉన్నందున రేటును తగ్గించి ఉంటే రియల్టీ రంగం, ఎకానమీకి గణనీయంగా ప్రయోజనం కలిగేది. – »ొమన్ ఇరానీ, నేషనల్ ప్రెసిడెంట్, క్రెడాయ్ సానుకూల సంకేతాలు ద్రవ్యోల్బణం స్థిర స్థాయిలో ఉంటూ, ఎకానమీ అధిక వృద్ధి సాధించే దిశగా ముందుకెడుతుందని పాలసీ స్పష్టమైన, సానుకూల సంకేతాలిస్తోంది. వరుసగా మూడో ఏడాది 7 శాతం వృద్ధిని సాధించే అవకాశాలను సూచిస్తోంది. – దినేష్ ఖారా, చైర్మన్, ఎస్బీఐ -
RBI Monetary Policy: ధరల కట్టడే ధ్యేయం..
ముంబై: ధరల కట్టడికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) స్పష్టం చేసింది. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను యథాతథంగా 6.5 శాతంగా కొనసాగించాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ తరహా ‘యథాతథ రెపో రేటు కొనసాగింపు’ నిర్ణయం తీసుకోవడం వరుసగా ఇది నాల్గవసారి. రిటైల్ ద్రవ్యోల్బణం 4%గా కొనసాగించడమే ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించిన ఎంపీసీ, ఈ దిశలో వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) వెనక్కు తీసుకునే విధానాన్ని కొనసాగిస్తామని పేర్కొంది. ఇందులో భాగంగా బాండ్ విక్రయాల ను చేపడుతున్నట్లు తెలిపింది. ‘సరళతర ద్రవ్య విధానాన్ని వెనక్కుతీసుకునే’ ధోరణికే కట్టుబడి ఉన్నట్లు పాలసీ కమిటీ స్పష్టం చేసింది. మూడు రోజులపాటు జరిగిన కమిటీ సమావేశాల నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ మీడియాకు తెలిపారు. ‘ఆర్బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యం 4%. 2 నుంచి 6% కాదు’ అని ఉద్ఘాటించారు. ప్లస్ 2, మైనస్ 2తో 4% వద్ద ద్రవ్యోల్బణం ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. పాలసీ ముఖ్యాంశాలు... ► 2023–24లో జీడీపీ 6.5 శాతం. ► రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం. ► అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకుల బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్ కింద పసిడి రుణాల పరి మితి రూ. 2 లక్షల నుంచి రూ. 4లక్షలకు పెంపు. రూ. 2,000 నోట్లు ఇప్పటికీ మార్చుకోవచ్చు.. రూ.2,000 నోట్లను అక్టోబర్ 8 నుంచి కూడా మార్చుకునే అవకాశాలన్నీ ఆర్బీఐ కలి్పంచింది. గవర్నర్ ఈ విషయంపై మాట్లాడుతూ రూ. 3.43 లక్షల కోట్ల రూ. 2,000 డినామినేషన్ నోట్లు ఇప్పటి వరకూ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయ న్నారు. ఇంకా రూ.12,000 కోట్లకుపైగా విలువైన నోట్లు చెలామణీలో ఉన్నాయన్నారు. అక్టోబర్ 8 నుండి 19 ఆర్బీఐ కార్యాలయాల్లో వీటిని మార్చుకోవచ్చన్నారు. నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి మొదట సెపె్టంబర్ 30 వరకు గడువిచి్చన ఆర్బీఐ, ఈ తేదీని అక్టోబర్ 7 వరకూ పొడిగించింది. రాష్ట్ర రాజధానుల్లో ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నందున, ఎక్కడివారైనా, 2,000 నోట్లను మార్చు కోవడానికి పోస్టల్ శాఖ సేవలను పొందవచ్చని దాస్ సూచించారు. కఠిన ద్రవ్య విధానం కొనసాగింపు.. ఆర్బీఐ 2022 మే నుంచి 250 బేసిస్ పాయింట్లు రెపో రేటును పెంచింది. అయితే ఇటు డిపాజిట్ల విషయంలో అటు రుణాల విషయంలో బ్యాంకులు కస్టమర్లకు ఈ రేట్లను పూర్తిగా బదలాయించలేదు. ఈ పరిస్థితుల్లో ‘సరళతర ద్రవ్య విధానాన్ని వెనక్కుతీసుకునే’ ధోరణినే కొనసాగించాలని ఆర్బీఐ భావిస్తోంది. అంటే ఇప్పటి వరకూ తీసుకున్న నిర్ణయాలు వ్యవస్థలో ఇంకా ప్రతిఫలించాల్సి ఉంది. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతిలోనూ దేశ ఆర్థికాభివృద్ధి పటిష్టతే లక్ష్యంగా ఉంది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చీఫ్ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. సమీపకాలంలో ధరలు తగ్గవచ్చు. – సుభ్రకాంత్ పాండా, ఫిక్కీ ప్రెసిడెంట్ వృద్ధికి మద్దతునిస్తూ, ద్రవ్యోల్బణం కట్టడే ఆర్బీఐ ధ్యేయంగా కనబడుతోంది – ప్రసేన్‌జిత్ బసు, చీఫ్ ఎకనమిస్ట్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ -
ఎన్బీఎఫ్సీల్లో పరిపాలన మరింత బలపడాలి
ముంబై: పరిపాలనా ప్రమాణాలను బలోపేతం చేసుకోవాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), హౌసింగ్ ఫైనాన్సింగ్ కంపెనీలను (హెచ్ఎఫ్సీలు) ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కోరారు. ఎంపిక చేసిన పెద్ద ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీల ఎండీలు, సీఈవోలతో గవర్నర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వరంగంలోని ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీల చీఫ్‌లు కూడా ఇందులో పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న సంస్థలు ఈ రంగంలోని మొత్తం ఆస్తుల్లో సగం నిర్వహిస్తుండడం గమనార్హం. బ్యాంకింగ్ సేవలు చేరువ కాని లేదా అందుబాటులో లేని వర్గాలకు రుణాలను అందిస్తూ ఈ సంస్థలు పోషిస్తున్న కీలక పాత్రను ఆర్బీఐ గవర్నర్ గుర్తిస్తూ.. అనుకూల సమయాల్లో అలసత్వానికి చోటు ఇవ్వొద్దని అప్రమత్తం చేశారు. పరిపాలనా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ.. నిబంధనల అమలు, రిస్క్ నిర్వహణ, అంతర్గత ఆడిట్ల యంత్రాంగం విషయమై భరోసా అవసరమన్నారు. ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు తమ నిధుల కోసం ఎక్కువగా బ్యాంకులపై ఆధారపడకుండా, ప్రత్యామ్నాయ మార్గాలపైనా ఈ సమావేశంలో చర్చించారు. అలాగే అన్సెక్యూర్డ్ రిటైల్ రుణాల్లో ఉండే రిస్క్, ఐటీ వ్యవస్థలు, సైబర్ భద్రత మెరుగుపరుచుకోవడంపైనా దృష్టి సారించారు. ఎన్పీఏలకు మరిన్ని కేటాయింపులు చేయడం ద్వారా బ్యాలన్స్ షీట్ల బలోపేతం, ఒత్తిడిలోని రుణ ఆస్తులను పర్యవేక్షించడం, బలమైన లిక్విడిటీ, అస్సెట్ లయబిలిటీ మధ్య సమతుల్యం, రుణాలకు సంబంధించి పారదర్శకమైన రేట్లు, మెరుగైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగంపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలోఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎం రాజేశ్వర్ రావు, స్వామినాథన్, ఎన్‌హెచ్‌బీ ఎండీ ఎస్కే హోతా కూడా పాల్గొన్నారు. -
రేట్లు పెంచాల్సి ఉంటుంది.. ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
రానున్న నెలల్లో ఆర్బీఐ కీలక పాలసీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నరే స్వయంగా తెలిపారు. ఇప్పటికే పెరిగిపోయిన పలు ధరలపై ఆహార ధరల షాక్‌ల ప్రభావం రెండో రౌండ్లోనూ ఉంటే ఆర్బీఐ కీలక రేట్లను పెంచాల్సి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హింట్ ఇచ్చారు. ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ముఖ్యాంశాలపై ఆయన మాట్లాడుతూ.. "విస్తృత ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ద్రవ్యోల్బణం అంచనాలను పెంచే ప్రమాదాలపై ఆహార ధరల షాక్‌ల రెండో రౌండ్ ప్రభావాన్ని ముందస్తుగా తొలగించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆగస్టు 8 నుంచి 10 మధ్య జరిగిన ఎంపీసీ సమావేశంలో ఈ సంవత్సరం మూడవసారి కూడా రేట్లను యథాతథంగా ఉంచేందకు ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా ఓటు వేసింది" అన్నారు. అయితే పాలసీ రేటు యథాతథ కొనసాగింపుపై ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ.. కూరగాయల ధరల స్వల్పకాలిక స్వభావాన్ని బట్టి, ప్రధాన ద్రవ్యోల్బణంపై ధరల మొదటి రౌండ్ ప్రభావాన్ని బట్టి ద్రవ్య విధానం ఉంటుందన్నారు. ప్రపంచ ఆర్థిక వాతావరణం అనిశ్చితంగా కొనసాగుతోందని, ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణం లక్ష్యం కంటే ఎక్కువగానే ఉందని చెప్పారు. వీటన్నింటి మధ్య, భారతదేశం స్థిరంగా నిలుస్తూ ప్రపంచంలో కొత్త గ్రోత్ ఇంజిన్‌గా ఎదుగుతోందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ప్రస్తుత అధిక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని ఇతర కమిటీ సభ్యులు కూడా అంగీకరించారు. ఈ ఆహార ధరల పరిణామాల వల్ల గృహాల ద్రవ్యోల్బణ భావనలు ప్రభావితమైనట్లు తమ సర్వేలు సూచిస్తున్నాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్! ఇకపై మరింత.. -
రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ గవర్నర్ స్పష్టత
భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ. 2 వేల నోట్లు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మొట్టమొదటిగా స్పందించారు. రూ.2 వేల నోట్ల ఉపసంహరణను కరెన్సీ నిర్వహణలో భాగంగా తీసుకున్న కీలక చర్యగా అభివర్ణించారు. కేంద్ర బ్యాంకులకు సంబంధించిన ఓ అంతర్గత కార్యక్రమంలో పాల్గొన్న శక్తికాంతదాస్ మీడియాతో మాట్లాడారు. రూ.2 వేల నోట్ల ఉపసంహరణకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. నోట్ల ఉపసంహరణ అనేది ఆర్బీఐ సాధారణంగా చేపట్టే కరెన్సీ మేనేజ్మెంట్ చర్యల్లో భాగమేనని, క్లీన్ నోట్ పాలసీ అన్నది ఆర్బీఐ ఎప్పటినుంచే అమలుచేస్తోందని వివరించారు. వివిధ డినామినేషన్ నోట్లలో కొన్ని సిరీస్‌లను ఆర్బీఐ అప్పుడప్పుడూ ఉపసంహరిస్తుందని, కొత్త సిరీస్‌లను విడుదల చేస్తుందని చెప్పారు. అలాగే రూ.2 వేల నోట్లను కూడా ఉపసంహరించినట్లు తెలిపారు. అయితే అవి చెల్లుబాటు అవుతాయని వివరించారు. మరోవైపు రూ.2 నోటును ఎందుకు తీసుకొచ్చారో వెల్లడించారు. గతంలో రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసినప్పుడు ఏర్పడిన నగదు కొరతను నివారించడానికి రూ.2000 నోట్లను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరిందని వివరించారు. రూ.2 వేల నోట్ల జారీని చాలా రోజుల క్రితమే ఆపేసినట్లు స్పష్టం చేశారు. రూ.2 వేల నోట్ల మార్పిడి, డిపాజిట్ కోసం తగినంత సమయం ఇచ్చామని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని సూచించారు. సెప్టెంబర్ 30 వరకూ రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చన్నారు. కాగా డిపాజిట్ మొత్తం రూ.50 వేలకు మించితే పాన్ కార్డ్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. నగదు డిపాజిట్‌కు సంబంధించి ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉందని గుర్తు చేశారు. #WATCH | #Rs2000CurrencyNote | RBI Governor Shaktikanta Das says, "Let me clarify and re-emphasise that it is a part of the currency management operations of the Reserve Bank...For a long time, the Reserve Bank has been following a clean note policy. From time to time, RBI… pic.twitter.com/Rkae1jG0rU — ANI (@ANI) May 22, 2023 ఇదీ చదవండి: Rs 2,000 Notes: బంగారం కొంటాం.. రూ.2 వేల నోట్లు తీసుకుంటారా? జువెలరీ షాపులకు వెల్లువెత్తిన ఎంక్వైరీలు!