6న కీలక నిర్ణయాలు
యథాతథ రేటు కొనసాగింపునకే సెంట్రల్ బ్యాంక్ మొగ్గు
ముంబై: గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశం కీలక నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ శుక్రవారం మీడియాకు వివరిస్తారు. భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన నేపథ్యంలో కీలక రుణ రేటు రెపో యథాతథంగానే కొనసాగే అవకాశం ఉందన్నది మెజారిటీ ఆర్థికవేత్తలు అంచనా.
ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా 4 శాతం వద్ద ఉండాలి. అంటే ఎగువదిశగా 6 శాతం పైకి పెరగకూడదు. అక్టోబర్‌లో నమోదయిన తీవ్ర ద్రవ్యోల్బణం గణాంకాల నేపథ్యంలో ఆర్‌బీఐ సమీప భవిష్యత్‌లో వడ్డీరేట్ల తగ్గుదలకు సంకేతాలు ఇవ్వకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం 6.5 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు) తగ్గే అవకాశాలు లేవని వారు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది సెపె్టంబర్ నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన కొనసాగింది. రిటైల్ ద్రవ్యోల్బణంలో కీలకమైన ఆహార ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఏకంగా 10.87 శాతంగా నమోదయ్యింది. ధరల స్థిరత్వమే ఎకానమీ స్థిరమైన వృద్ధికి పునాదిగా పనిచేస్తుందని గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేస్తున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కేంద్రం నిర్దేశిస్తున్న విధంగా 4 శాతానికి తగ్గించడమే సెంట్రల్ బ్యాంక్ లక్ష్యమని ఆయన ఉద్ఘాటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment