రూపాయిని ‘తక్కువ’ చేసేది లేదు
ఆర్‌బీఐ గవర్నర్ రాజన్
తిరువనంతపురం: వృద్ధి సాధన దిశగా చైనా, జపాన్ తదితర దేశాల బాటలో రూపాయి మారకం విలువను తక్కువ స్థాయిలో ఉంచే యోచనేది కేంద్రానికి గానీ తమకు గానీ లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. ఇలాంటి ధోరణులు భవిష్యత్‌లో అనేక సమస్యలకు దారి తీస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. లఘు, చిన్న, మధ్యతరహా సంస్థల 4వ సదస్సును ప్రారంభించిన సందర్భంగా రాజన్ ఈ విషయాలు చెప్పారు. కరెన్సీ మారకం విలువను ఉండాల్సిన దానికన్నా తక్కువ స్థాయికి (అండర్‌వేల్యుయేషన్) పరిమితం చేయడం వల్లే చైనా, జపాన్, కొరియా వంటి దేశాలు అధిక వృద్ధి సాధించగలిగాయని, భారత్ కూడా అదే బాటలో వెళ్లాలని పలువురు భావిస్తున్నారని పేర్కొన్నారు.
అయితే, దీర్ఘకాలంలో దీనివల్ల తలెత్తే సమస్యలు ఆయా దేశాల్లో ప్రస్తుతం కనిపిస్తున్నాయన్నారు. సుదీర్ఘకాలం కరెన్సీ విలువ తక్కువ స్థాయిలోనే ఉంచడం సాధ్యం కాదని, అలాగే వృద్ధి సాధనకు అనుసరించతగిన వ్యూహమూ కాదని రాజన్ చెప్పారు. కాబట్టి మారకం విలువను పెంచి, తగ్గించి మాయ చేసే కన్నా.. ఎక్కువ హెచ్చుతగ్గులకు లోను కాకుండా సముచిత స్థాయిలో స్థిరంగా ఉండేలా చూడాలన్నదే ఆర్‌బీఐ ఉద్దేశమని పేర్కొన్నారు.
ఎన్‌పీఏలను మరీ కఠిన ం చేస్తే ...
మొండిబకాయిల (ఎన్‌పీఏ) నిర్వచనాలను, నిబంధనలను మరీ కఠినతరం చేస్తే ఖాతాల వాస్తవ పరిస్థితులు ఇన్వెస్టర్లకు తెలియకుండా పోయే ప్రమాదముందని, అందుకే దీనిపై ఆర్‌బీఐ సుముఖంగా లేదని రాజన్ చెప్పారు. ఎన్‌పీఏ నిబంధనలను స్థిరంగా ఉంచడమే ప్రయోజనకరమని, తరచూ మొండి బకాయిల నిర్వచనాలు మార్చేస్తుంటే ప్రధాన లక్ష్యం నీరుగారిపోతుందన్నారు. వ్యాపారవేత్తల నిధుల సమీకరణకు తోడ్పడేలా విశిష్ట గుర్తింపు కార్డు లాంటిది ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనితో చిన్న సంస్థలకు రుణ సమీకరణ సమస్యలు తగ్గే అవకాశాలు ఉన్నాయని రాజన్ చెప్పారు.
భారత ఎకానమీ అభివృద్ధికి.. ఉపాధి కల్పనకు చిన్న సంస్థలు కీలకమని, వాటికి సమాన అవకాశాలు లభించేలా చూడాల్సిన అవసరం ఉందని రాజన్ పేర్కొన్నారు. కేవలం స్టార్టప్స్‌కే కాకుండా చిన్న సంస్థల ఎదుగుదలకు అనువైన పరిస్థితులు కల్పించాలని ఆయన చెప్పారు.