న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్‌బీఐ గవర్నర్ ఆశావహ వ్యాఖ్యలతో శుక్రవారం కూడా స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 327 పాయింట్లు పెరిగి 40,509 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 80 ర్యాలీ చేసి 11,914 వద్ద ముగిసింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ... కరోనా ప్రభావంతో సెప్టెంబర్ క్వార్టర్‌లో మైనస్‌ల్లో నమోదైన జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ4 నుంచీ రికవరీ బాట పట్టే అవకాశం ఉందన్నారు. వ్యవస్థలో ప్రతికూల పరిస్థితు లు నెలకొన్న తరుణంలో అకామిడేటివ్ విధానాన్ని కొనసాగిస్తామన్నారు. దీంతో ఫైనాన్స్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అలాగే కీలక వడ్డీరేట్లపై యథాతథ పాలసీకే కట్టుబడి ఉంటామన్నారు.
బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంచే చర్యలు చేపడతామన్నారు. ఫలితంగా బ్యాంకింగ్ రంగ షేర్లు ర్యాలీ చేశాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగి బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లతో పాటు గత సెషన్లో సూచీలను నడిపించిన ఐటీ షేర్ల హవా నేడు కూడా కొనసాగింది. ఫలితంగా సూచీలు ఏడో రోజూ లాభాలను మూటగట్టుకున్నాయి. ఈ 7 రోజుల్లో సెనెక్స్ 2,537 పాయింట్లను, నిఫ్టీ 692 పాయింట్లను ఆర్జించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,067 – 40,585 రేంజ్‌లో కదలాడగా, నిఫ్టీ 11,805 – 11,939 మధ్య ఊగిసలాడింది. అయితే ఫార్మా, రియల్టీ, ఎఫ్‌ఎంజీసీ, ఆటో, రియల్టీ రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
దన్నుగా అంతర్జాతీయ సంకేతాలు
ఆర్‌బీఐ గవర్నర్ వ్యాఖ్యలకు తోడు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు కూడా మన మార్కెట్‌కు దన్నుగా నిలిచాయి. అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కన్నా తక్కువగా నమోదుకావడంతో ఉద్దీపన ఆశలు మరింత పెరిగాయి. ఫలితంగా నేడు ఆసియాలో మార్కెట్లు రెండున్నర ఏళ్ల గరిష్టాన్ని తాకాయి. వారం రోజుల సెలవు తర్వాత ప్రారంభమైన చైనా మార్కెట్ లాభాలతో దూసుకెళ్లింది. యూరప్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం కావడంతో పాటు అమెరికా ఫ్యూచర్లు పాజిటివ్‌గా ట్రేడ్ అవడం మన మార్కెట్‌కు కలిసొచ్చాయి.
కొత్త జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద
స్టాక్ మార్కెట్ వరుస ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపదగా కొత్త జీవితకాల గరిష్టానికి చేరుకుంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన అన్ని కంపెనీల మొత్తం క్యాపిటలైజేషన్ శుక్రవారం రూ.160.68 లక్షల కోట్లకు చేరుకుంది.
ఆర్థిక వ్యవస్థకు అండగా అవసరమైతే మరిన్ని విధాన చర్యలకు సిద్ధమని ఆర్‌బీఐ గవర్నర్ ప్రకటన మార్కెట్ సెంటిమెంట్ బలపరిచింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వాలన్న ఆర్‌బీఐ నిర్ణయం సాహసోపేతం. వడ్డీరేట్ల యథాతథ కొనసాగింపు, అకామిడేటివ్ విధానాలు బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్ల ర్యాలీకి మద్దతునిచ్చాయి’’
– దీపక్ జెసానీ, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ హెడ్
Comments
Please login to add a commentAdd a comment