వృద్ధి సంకేతాలు బాగున్నాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక వ్యవస్థ వృద్ధి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, కానీ దీన్ని స్థిరంగా ఎలా కొనసాగించాలన్నదే అత్యంత కీలకమైన అంశమని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ద్రవ్యలోటు అదుపులోకి రావడం, పారిశ్రామికోత్పత్తిలో వృద్ధి కనిపించడం, ఆయిల్, బంగారం కాకుండా ఇతర ఎగుమతుల్లో వృద్ధి, ద్రవ్యోల్బణం దిగిరావడం వంటి అంశాలన్నీ వృద్ధిపై నమ్మకాన్ని కలిగిస్తున్నాయన్నారు. ఈ ఏడాది 5.5 శాతం వృద్ధిని, వచ్చే ఏడాది 6 శాతం ఆ తర్వాత ఏడు శాతం వృద్ధిని సాధించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
గురువారం హైదరాబాద్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) విద్యార్థులతో జరిగిన చర్చాగోష్టి కార్యక్రమంలో రాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా గవర్నర్ మాట్లాడుతూ ఈ వృద్ధిరేటు మరింత పైకి పెరగాలంటే ప్రభుత్వ సంస్కరణల తోడ్పాటు అవసరమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ఆర్థిక వృద్ధిపై భారీ అంచనాలను పెట్టుకున్నారని, దీన్ని అందుకోవాలంటే కీలక సంస్కరణలు తప్పవన్నారు. వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం అంటే.. రుణ లభ్యత, నిబంధనలు, స్కిల్డ్ లేబర్‌ను అందుబాటులోకి తీసుకొస్తే రెండంకెల వృద్ధిరేటును అందుకోగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ కలిసి పనిచేయాల్సి ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త మానిటరీ పాలసీని విధానాలను రూపొందిస్తున్నామన్నారు.
స్టార్ట్‌అప్స్, చిన్న కంపెనీలను ప్రోత్సహించేందుకు ఆర్‌బీఐ ఏమైనా ప్రత్యేక ప్యాకేజీలను ఇచ్చే ఆలోచనలో ఉందన్న మరో విద్యార్ధి ప్రశ్నకు సమాధానమిస్తూ... ఒక కంపెనీ ఎదగడానికి అందుకు కావల్సిన వాతావరణం ఏర్పాటు చేయాలే కాని సబ్సీడీలు మార్గం కాకూడదన్నారు. అందరికీ సబ్సిడీలు ఇస్తే దాన్ని భరించే వారు ఎవరని, అందుకే సబ్సీడీలకు ఆర్‌బీఐ వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. ఒక ఆర్థిక సంస్థ సరిగి పనిచేయకపోతే దీని ప్రభావం బాగా పనిచేసే సంస్థపై పడుతోందని, ఇటువంటి పనిచేయని సంస్థలను మూసివేయడం కోసం ఫైనాన్షియల్ రిజల్యూషన్ అథార్టీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్‌ఫ్రా కంపెనీల్లో పెరిగిపోతున్న ఎన్‌పీఏలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెపుతూ ఎన్‌పీఏ నిబంధనలు మార్చితే బ్యాలెన్స్ షీట్లు మెరుగు అవుతాయే కానీ, సమస్యకు పూర్తి పరిష్కారం రాదన్నారు. ఇన్‌ఫ్రా ఎన్‌పఏలను కొనుగోలు చేయడానికి త్వరలోనే కొత్త అసెట్ రీకనస్ట్రక్షన్ కంపెనీలకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన ఆర్‌బీఐ బోర్డు
దేశ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితిపై హైదరాబాద్‌లో సమావేశమైన ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు సమీక్షించింది. ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దేశ ఆర్థిక పరిస్థితి, దేశీయ, అంతర్జాతీయ సవాళ్లు, పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్స్ వంటి విషయాలపై సమీక్ష జరిపినట్లు ఆర్‌బీఐ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సుమారు ఏడేళ్ల తర్వాత హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు సమీక్షా సమావేశంలో ఆర్‌బీఐ డెరైక్టర్లు అనిల్ కకోద్కర్, కిరణ్ కార్నిక్, నచికేత్ మోర్, వై.హెచ్.మలేగామ్, జీ.ఎం.రావు, ఇందిరా రాజారామన్, దమోదర్ ఆచార్యాలతో పాటు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు హరున్ ఖాన్, ఆర్.గాంధీ, ఎస్.ఎస్.ముంద్రా పాల్గొన్నారు.