నేడు ఆర్‌బీఐ పరపతి సమీక్ష
ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మంగళవారం ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. రేట్లకు సంబంధించి గవర్నర్ రఘురామ్ రాజన్ యథాతథ పరిస్థితిని కొనసాగించవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రేట్ల విషయంలో సోమవారం తన తాజా అంచనాలను వెలువరిస్తూ, రెపో రేటు తగ్గింపునకు అవకాశం లేదని పేర్కొంది. యథాతథ పరిస్థితిని కొనసాగించవచ్చని సంస్థ అంచనా వేసింది.
ప్రస్తుత రిటైల్ ద్రవ్యోల్బణం (ఫిబ్రవరిలో 8.1 శాతం) స్థాయి ఆమోదనీయంకాదని, ఇంకా తగ్గాలని ఆర్‌బీఐ భావించే అవకాశాలు ఉండడమే దీనికి కారణమని తన పరిశోధనా పత్రంలో పేర్కొంది. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- రెపో ప్రస్తుతం 8 శాతంగా ఉంది.
రేట్లు పెంచితే వృద్ధికి విఘాతం
రేట్లలో ఎటువంటి మార్పూ ఉండకపోవచ్చని డన్ అండ్ ఏఎంపీ బ్రాడ్‌షీట్ సీనియర్ ఎకనమిస్ట్ అరుణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం పెరగడానికే అవకాశాలు ఉండడం దీనికి కారణమని ఆయన అంచనావేశారు. అయితే రేటు పెంచితే మాత్రం అది ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రతికూలమవుతుందని స్పష్టం చేశారు.