'మై నేమ్ ఈజ్ రాజన్.. రఘురాం రాజన్'
ఆర్బీఐ గవర్నర్‌గా అతి తక్కువకాలంలో తనదైన ముద్రవేసిన రఘురాం రాజన్ ఆదివారం ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన వారసుడిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పగ్గాలను ఉర్జిత్ పటేల్ చేపట్టారు. రాజన్ నిక్కచితనం గల ఆర్థికవేత్త. ముక్కుసూటిగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం ఆయన నైజం. చాలా అంశాల్లో ఆయన వ్యాఖ్యలు మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. గతంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్ ఆర్థికవేత్తగా పనిచేసిన రాజన్ మళ్లీ తన పాతవృత్తి ఉపాధ్యాయ రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు.
రాజన్ పలుసందర్భాల్లో చేసిన వ్యాఖ్యలివి. ఆయన మంచి బ్యాంకర్ కాదు.. హాస్య చతురత కలిగిన వక్త అని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తాయి.
- ఇప్పటికీ మనం సంతృప్తికరమైన స్థానాన్ని సాధించాల్సిన అవసరముంది. 'గుడ్డివాళ్ల దేశంలో ఒంటికన్నువాడే రాజు' అనే సామెత ఉంది. మనం అదే దారిలో సాగుతున్నాం.
- నేను వినాశకారినో, విషాద వ్యక్తినో కాదు
- వ్యవస్థతో మంచి సంబంధాలు కలిగిన సంపన్న అక్రమార్కులను ఎవరూ పట్టించుకోవడం లేదు. మనం నిరంతర వృద్ధి సాధించాలంటే అలాంటి వారికి రక్షణ కల్పించే సంస్కృతికి ఫుల్‌స్టాప్ పెట్టాలి.
- నన్ను మీరెలా పిలుస్తారో నాకు తెలియదు. శాంట్ క్లాజ్ అని పిలుస్తారో, లేక డేగ అని అంటారో కానీ, నా పేరు రఘురాం రాజన్. నేనేం చేయాలనుకుంటానో అదే చేస్తాను.
- జేమ్స్ బాండ్ ఇమేజ్ కావాలని నేను కోరుకోవడం లేదు. కానీ, ముందుకునడింపించే బ్యాంకర్‌గా ఉండాలనుకుంటున్నా.
- బ్యాంకర్ దయ వల్ల కాదు.. డబ్బును సృష్టించాలన్న అతని ఆలోచన వల్లే మనకు ప్రతిరోజు ఉదయం ఆహారం దొరుకుతోంది.
- మనం డేగలం కాదు. పావురాళ్లమూ కాదు. మనం నిజానికి గబ్బిలాలం.
- అంచనాలు చాలా ఉన్నాయి. కానీ నేనేమీ సూపర్‌మ్యాన్ ని కాదు. భారత్‌లో ఇలాంటి కోలాహలం ఎప్పుడూ ఉండనే ఉంటుంది.