Raghuram Rajan Warning: ఆర్థిక వృద్ధికి సంబంధించి "హైప్"ను నమ్మి భారత్ పెద్ద తప్పు చేస్తోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. దేశం దాని సామర్థ్యాన్ని చేరుకోవడానికి గణనీయమైన నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన అతిపెద్ద సవాలు శ్రామిక శక్తి, నైపుణ్యాలను మెరుగుపరచడం అని రఘురామ్ రాజన్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఈ సవాలును పరిష్కరించకుంటే యువత ప్రయోజనాలను కాపాడటంలో కష్టాలు పడాల్సి వస్తుందన్నారు. దేశంలోని 140 కోట్ల జనాభాలో సగానికి పైగా 30 ఏళ్లలోపు యువతే ఉన్నారన్నారాయన.
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాన్ని ఈ ఆర్బీఐ మాజీ గవర్నర్ కొట్టిపారేశారు. డ్రాప్-అవుట్ శాతం అధికంగా ఉండి పిల్లలలో చాలా మందికి హైస్కూల్ విద్య లేకపోతే ఆ ఆశయం గురించి మాట్లాడటమే వ్యర్థం అన్నారు. భారతదేశంలో అక్షరాస్యత రేట్లు వియత్నాం వంటి ఇతర ఆసియా దేశాల కంటే తక్కువగా ఉన్నాయన్నారు.
స్థిరమైన ప్రాతిపదికన 8% వృద్ధిని సాధించడానికే దేశం మరింత ఎక్కువ పని చేయాల్సి ఉందన్నారు. దేశంలో ఉన్నత విద్య కోసం కంటే చిప్‌ల తయారీకి రాయితీలపై ఎక్కువ ఖర్చు చేసేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను రఘురామ్ రాజన్ తప్పుపట్టారు. భారతదేశంలో కార్యకలాపాలను స్థాపించడానికి సెమీ-కండక్టర్ కంపెనీలకు రాయితీల కింద సుమారు రూ. 76 వేల కోట్లు కేటాయించగా ఉన్నత విద్య కోసం రూ. 47 వేల కోట్లనే కేటాయించడాన్ని ఎత్తి చూపారు.
Comments
Please login to add a commentAdd a comment