Wholesale price index
-
డిసెంబర్లో టోకు ద్రవ్యోల్బణం అప్
టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (WPI) డిసెంబర్లో 2.37 శాతానికి చేరింది. ఆహార ఉత్పత్తుల ధరలు నెమ్మదించినప్పటికీ ఆహారేతర ఉత్పత్తులు, ఇంధనం, విద్యుత్ మొదలైన వాటి రేట్ల పెరుగుదల ఇందుకు కారణం. 2024 నవంబర్‌లో డబ్ల్యూపీఐ 1.89 శాతంగా ఉండగా.. 2023 డిసెంబర్లో 0.86 శాతంగా నమోదైంది. డేటా ప్రకారం ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం(Food Inflation) నవంబర్‌లో 8.63 శాతంగా ఉండగా డిసెంబర్లో 8.47 శాతానికి దిగి వచ్చింది. క్రూడాయిల్, కమోడిటీల ధరలు పెరగడం, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి పరిణామాల వల్ల జనవరిలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 3 శాతానికి పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. గతేడాది జనవరిలో ఇది 0.3%. తాజా ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో పాలసీ రేట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ తీసుకోబోయే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.ఇదీ చదవండి: మార్చి తర్వాత వడ్డీరేటు తగ్గింపు!స్విగ్గీ స్పోర్ట్స్‌కి గ్రీన్ సిగ్నల్ఆహార, నిత్యావసరాల డెలివరీ సంస్థ స్విగ్గీకి చెందిన స్విగ్గీ స్పోర్ట్స్(Swiggy Sports) ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటుకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ అనుమతులు ఇచ్చింది. ఈ సంస్థ క్రీడలు, అమ్యూజ్మెంట్, రిక్రియేషన్ కార్యకలాపాలు సాగిస్తుందని స్విగ్గీ తెలిపింది. అలాగే, స్పోర్ట్స్ ఈవెంట్ల నిర్వహణ, కెరియర్ పరమైన సర్వీసులు అందించడం, ప్రసార హక్కులు కొనుగోలు చేయడం మొదలైనవి కూడా చేపడుతుందని పేర్కొంది. -
టోకు ధరలు మూడోనెలా మైనస్‌లోనే..
న్యూఢిల్లీ: ఆహార ఉత్పత్తులు, ఇంధనం, ప్రాథమిక లోహాల ధరలు తగ్గుదల ప్రభావం మొత్తంగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) క్షీణతకు దారితీస్తోంది. క్రూడ్ పెట్రోలియం, సహజ వాయువు, టెక్స్టైల్స్ ధరలు కూడా జూలై తగ్గుదలను నమోదుచేసుకున్నాయి. ఆయా అంశాల నేపథ్యంలో డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం జూన్‌లో అసలు పెరుగుదల లేకపోగా మైనస్ 4.12 శాతంగా నమోదయ్యింది. ఇలాంటి పరిస్థితిని ప్రతి ద్రవ్యోల్బణంగా వ్యవహరిస్తారు. గత ఏడాది జూన్ నెల్లో హై బేస్ ఎఫెక్ట్ (16.23 శాతం) కూడా తాజా ప్రతిద్రవ్యోల్బణం పరిస్థితికి ఒక కారణం. ఈ తరహా పరిస్థితి నెలకొనడం వరుసగా ఇది మూడవనెల కావడం గమనార్హం. ఇక ఇంతటి స్థాయిలో ప్రతిద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల కనిష్టం కావడం మరో విషయం. 2015 అక్టోబర్‌లో మైనస్ 4.76 ప్రతిద్రవ్యోల్బణం రికార్డయ్యింది. మేలో 4.3 శాతం ఉన్న వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 4.8 శాతానికి పెరిగిన నేపథ్యంలోనే టోకు ధరలు భారీగా తగ్గడం గమనార్హం. అయితే ఆర్థికవ్యవస్థకు కీలకమైన రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం) రేటు నిర్ణయానికి సెంట్రల్ బ్యాంక్ వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్నే ప్రామాణికంగా తీసుకునే సంగతి తెలిసిందే. -
ఐదు నెలల కనిష్టానికి టోకు ధరలు
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తరహాలోనే టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం స్పీడ్ కూడా దిగువముఖం పట్టింది. జూలైలో ఐదు నెలల కనిష్ట స్థాయిలో 13.93 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 జూలైతో పోల్చితే 2022 జూలైలో టోకు ధరల బాస్కెట్ ధర పెరుగుదల 13.93 శాతమన్నమాట. నెలవారీగా ఆహార, తయారీ ఉత్పత్తుల ధరల తగ్గుదల తాజా సానుకూల గణాంకానికి ప్రధాన కారణమని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. టోకు ధరల సూచీ తగ్గుదల ఇది వరుసగా రెండవనెల. మేలో సూచీ 15.88 శాతం రికార్డు గరిష్టానికి చేరింది. అయితే జూన్‌లో 15.18 శాతానికి తగ్గింది. తాజా సమీక్షా నెల్లో మరికొంత (13.93) దిగివచ్చింది. అయితే రెండంకెలపైనే డబ్ల్యూపీఐ స్పీడ్ కొనసాగడం వరుసగా 16వ నెల. రిటైల్ ద్రవ్యోల్బణం కూడా మేలో 7.04%కి చేరింది. అయితే జూన్‌లో 7.01%కి, జూలైలో 6.71 శాతానికి తగ్గింది. సరఫరాల పరంగా ప్రభుత్వం, ద్రవ్య పాలసీవైపు ఆర్బీఐ, పంట దిగుబడులు ద్రవ్యోల్బణం దిగిరావడానికి కారణమని భావిస్తున్నారు. ►ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం జూన్‌లో 14.39 శాతం ఉంటే, జూలైలో 10.77 శాతానికి తగ్గింది. ఇందులో కూరగాయల ధరల స్పీడ్ 18.25 శాతం. జూన్‌లో ఈ స్పీడ్ ఏకంగా 56.75 శాతంగా ఉంది. ►ఇంధన, విద్యుత్ బాస్కెట్ ద్రవ్యోల్బణం జూన్‌లో 40.38% ఉంటే, జూలైలో 43.75%కి పెరిగింది. ►సూచీలో మెజారిటీ వెయిటేజ్ ఉన్న తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 8.16 శాతానికి చేరింది. -
టోకు ధరలూ పెరిగాయ్!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 1.48 శాతం ఎగసింది. అంటే 2019 అక్టోబర్‌తో పోల్చితే 2020 అక్టోబర్‌లో టోకు వస్తువుల బాస్కెట్ ధర 1.48 శాతం పెరిగిందన్నమాట. ఎనిమిది నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. తయారీ ఉత్పత్తుల ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం. ఆర్థిక మందగమనం, వ్యవస్థలో డిమాండ్ లేకపోవడం, కరోనా ప్రతికూలతలు వంటి అంశాల నేపథ్యంలో టోకు ధరల సూచీ ‘జీరో’ లేదా ప్రతిద్రవ్యోల్బణం స్థాయిలో నమోదవుతోంది. సూచీలోని ఒక్క ఆహార ఉత్పత్తుల ధరలు మాత్రమే పెరుగుదలను సూచిస్తున్నాయి. అయితే వ్యవస్థలో కొంత డిమాండ్ నెలకొనడంతోపాటు, బేస్ ఎఫెక్ట్ (2019 అక్టోబర్‌లో ‘జీరో’ ద్రవ్యోల్బణం) కూడా తాజాగా సూచీ పెరుగుదలకు ఒక కారణమవుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆవిష్కరించిన తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► మొత్తం సూచీలో దాదాపు 12% వెయిటేజ్ ఉన్న ఆహార ఉత్పత్తుల ధరలు టోకును 6.37% పెరిగాయి. ఒక్క కూరగాయల ధరలు 25.23 శాతం పెరిగితే, ఆలూ ధరలు ఏకంగా 107.70% ఎగశాయి (2019 అక్టోబర్ ధరలతో పోల్చితే). ► సూచీలో 12% వెయిటేజ్ ఉన్న నాన్–ఫుడ్ ఆర్టికల్స్, మినరల్స్ ధరలు 2.85 శాతం, 9.11 శాతం చొప్పున ఎగశాయి. ► మొత్తం సూచీలో దాదాపు 62 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో ధరలు 2.12 శాతం ఎగశాయి. ► 14% వెయిటేజ్ ఉన్న ఫ్యూయల్ అండ్ పవర్ ఇండెక్స్‌లో అసలు పెరుగుదల లేకపోగా 10.95% క్షీణించాయి. ఆర్బీఐ రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చు... ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) తగ్గింపు ప్రక్రియకు ఇక తెరపడినట్లేనని నిపుణులు అంచనావేస్తున్నారు. వచ్చే నెల్లో జరగనున్న ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో యథాతథ రేటును కొనసాగించే వీలుందన్నది వారి విశ్లేషణ. టోకు ధరలే తీవ్రంగా ఉంటే, ఇక రిటైల్ ధరలు మరింత పెరుగుతాయని వారు విశ్లేషిస్తున్నారు. ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలని కేంద్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి నిర్దేశిస్తోంది. అయితే ఈ స్థాయికి మించి ఈ రేటు నమోదవుతోంది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో ఎనిమిది నెలల గరిష్టం 7.27 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ, రిటల్ ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్టు, అక్టోబర్ నెలల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగించింది. అయితే సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ అంచనావేస్తోంది. -
రేట్ల కోతకు ‘ధర’ల ఊతం!!
న్యూఢిల్లీ: ధరల భయాలు డిసెంబర్లో తక్కువగా ఉన్నాయని సోమవారం విడుదలైన అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. ఈ నెలలో టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం రెండూ తగ్గుముఖం పట్టాయని లెక్కలు వెల్లడించాయి. దీనితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.50) తగ్గింపునకు ఇది అవకాశమని పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. తద్వారా దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడాలని కోరుతున్నాయి. నవంబర్ పారిశ్రామిక ఉత్పత్తి ఏడు నెలల కనిష్ట స్థాయి అరశాతంగా నమోదయిన విషయాన్ని పారిశ్రామిక వర్గాలు ప్రస్తావిస్తూ, ఈ రంగానికి చేయూత నివ్వాల్సిన తక్షణ అవసరాన్ని ఉద్ఘాటిస్తున్నాయి. జనవరి–మార్చికి సంబంధించి డీఅండ్‌బీ వ్యాపార ఆశావహ పరిస్థితి కూడా ఇక్కడ గమనార్హం. కొత్త గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఫిబ్రవరి 7వ తేదీన ద్వైమాసిన ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విడుదలైన స్థూల ఆర్థిక గణాంకాలను చూస్తే... వరుసగా రెండవ నెల తగ్గిన టోకు ధరలు ► వరుసగా రెండు నెలల నుంచీ తగ్గిన టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు రేటు కోత అవకాశాలపై పారిశ్రామిక వర్గాల్లో ఆశావహ స్థితిని సృష్టిస్తున్నాయి. అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు 5.54 శాతం ఉంటే, నవంబర్‌లో 4.64 శాతంగా నమోదయ్యింది. ► మొత్తంగా...: 2018 డిసెంబర్లో (2017 ఇదే నెల ధరలతో పోల్చి) టోకు వస్తువుల బాస్కెట్ ధర కేవలం 3.80 శాతమే పెరిగింది. అంతక్రితం ఎనిమిది నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో టోకు ధరల నమోదు ఇదే తొలిసారి. ఇంధనం, కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు టోకున తగ్గడం దీనికి ప్రధాన కారణం. ► ప్రైమరీ ఆర్టికల్స్: సూచీలో ఆహార, ఆహారేతర ఉత్పత్తులకు సంబంధించిన ఈ విభాగంలో పెరుగుదల రేటు 2.28 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రేటు 3.86 శాతం. ఇక ఇందులో ఒక్క ఆహార విభాగాన్ని చూసుకుంటే పెరుగుదల అసలు లేకపోగా –0.07 శాతం తగ్గుదల నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ విభాగంలో ధరల పెరుగుదల రేటు 4.72 శాతం. కూరగాయల ధరలు వరుసగా ఆరు నెలల నుంచీ తగ్గుతూ వస్తున్నాయి. నవంబర్‌లో పెరుగుదల రేటు 26.98 శాతం ఉంటే, డిసెంబర్లో ఈ రేటు 17.55 శాతంగా ఉంది. టమోటా ధరలు నవంబర్‌లో పెరుగుదల రేటు 88 శాతంగా ఉంటే, డిసెంబర్లో 49 శాతానికి తగ్గాయి. ఇక పప్పు దినుసుల పెరుగుదల రేటు 2.1 శాతంగా ఉంది. గుడ్లు, మాంసం, చేపల ధరల పెరుగుదల రేటు 4.55 శాతం. ఉల్లిపాయల ధరలు మాత్రం 64 శాతం తగ్గాయి. అయితే నాన్ ఫుడ్ ఆర్టికల్స్ విషయంలో మాత్రం ద్రవ్యోల్బణం 4.45 శాతం పెరిగింది. 2017 డిసెంబర్లో ఇది క్షీణతలో –0.17శాతంగా నమోదయ్యింది. ► ఇంధనం, విద్యుత్: ఈ విభాగంలో రేటు 8.03 శాతం నుంచి 8.38 శాతానికి ఎగిసింది. 2018 నవంబర్‌లో ఈ రేటు ఏకంగా 16.28 శాతం ఉండటం గమనార్హం. ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60% వాటా ఉన్న తయారీ రంగంలో ధరల పెరుగుదల వార్షికంగా 2.79% నుంచి 3.59%కి పెరిగింది. అయితే నెలవారీగా చూస్తే, నవంబర్‌లో ఈ రేటు 4.21%. రిటైల్‌గా చూసినా తగ్గిన ధరల స్పీడ్.. ఇక వినియోగ ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు 2018 డిసెంబర్లో 2.19%. అంటే 2017 ఇదే నెలతో పోల్చితే రిటైల్‌గా ధరల బాస్కెట్ 2.19% పెరిగిందన్నమాట. గడచిన 18 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ధరలు పెరగడం ఇదే తొలిసారి. పండ్లు, కూరగాయలు, ఇంధనం ధరల స్పీడ్ తగ్గడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది. 2018 నవంబర్‌లో రిటైల్ ధరల స్పీడ్ 2.33 శాతం ఉండగా, డిసెంబర్లో 5.21 శాతంగా నమోదయ్యింది. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం– ఆహార ఉత్పత్తుల ధరలు పెరక్కపోగా –2.51 శాతం తగ్గాయి. ఇంధనం, లైట్ ద్రవ్యోల్బణం స్పీడ్ 7.39%(నవంబర్‌లో) నుంచి 4.54%కి (డిసెంబర్) తగ్గింది. -
టోకు ధరల ఊరట!
న్యూఢిల్లీ: రిటైల్ ధరల తరహాలోనే టోకు ధరలు కూడా ఆగస్టులో శాంతించాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో 4.53 శాతం పెరిగింది. అంటే ఈ బాస్కెట్ మొత్తం ధర 2017 ఆగస్టుతో పోల్చితే 2018 ఆగస్టులో కేవలం 4.53 శాతమే పెరిగిందన్నమాట. ఇంత తక్కువ స్థాయిలో టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం నమోదుకావడం నాలుగు నెలల్లో ఇదే తొలిసారి. మే నెల్లో 4.43 శాతం నమోదయిన టోకు ధరల సూచీ అటు తర్వాతి రెండు నెలల్లో వరుసగా 5.77 శాతం, 5.09 శాతంగా నమోదయ్యింది. కాగా గత ఏడాది ఇదే నెలలో టోకు ద్రవ్యోల్బణం 2018 ఆగస్టుకన్నా తక్కువగా 3.24 శాతంగా నమోదుకావడం గమనార్హం. మరోవైపు ఆగస్టులో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్టస్థాయిలో 3.69 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. ప్రధాన 3 విభాగాలనూ వేర్వేరుగా చూస్తే... ♦ ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం అసలు పెర క్కపోగా, 0.15 శాతం క్షీణించింది. 2017 ఆగస్టు లో ఈ విభాగంలో పెరుగుదల రేటు 2.97 శాతం. ♦ ఇక ఒక్క ఫుడ్ ఆర్టికల్స్‌ను చూస్తే, ద్రవ్యోల్బణం 5.82 శాతం నుంచి 4.04 శాతానికి తగ్గింది. జూలైలో కూరగాయల ధరలు 14.07 శాతం తగ్గితే, ఆగస్టులో 20.18 శాతం తగ్గాయి. బంగాళదుంప ధరలు 72 శాతం తగ్గాయి. ఉల్లి ధరలు 27 శాతం తగ్గితే, పండ్ల ధరలు 16 శాతం తగ్గాయి. పప్పుల ధరలు 16 శాతం తగ్గాయి. ♦ నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌లో మాత్రం 3.44% క్షీణత నుంచి 3.48 శాతం పెరుగుదలకు మారింది. ♦ ఫ్యూయెల్ అండ్ పవర్: ద్రవ్యోల్బణం 9.86 శాతం నుంచి 17.73 శాతానికి చేరింది. ♦ తయారీ: మొత్తం సూచీలో దాదాపు 65 శాతం ఉన్న ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 2.36 శాతం నుంచి 4.43 శాతానికి పెరిగింది. అయినా రేటు పెంపే..! ద్రవ్యోల్బణం తగ్గుదల, పారిశ్రామికోత్పత్తి మెరుగైన వృద్ధి ఉన్నప్పటికీ.. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) సమీప కాలంలో రేటు పెంచే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపు అవకాశాలు, క్రూడ్ ధరల తీవ్రత భయాలు, డాలర్ మారకంలో రూపాయి బలహీనత వంటి అంశాలను నిపుణులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. -
టోకు ధరలూ తగ్గాయి...
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2018 జూలైలో 5.09 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 జూలైతో పోల్చితే 2018 జూలైలో ఈ బాస్కెట్ మొత్తం ధర 5.09 శాతం పెరిగిందన్నమాట. ఫుడ్ ఆర్టికల్స్ ప్రత్యేకించి పండ్లు, కూరగాయల ధరలు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. 2017 జూలైలో టోకు ద్రవ్యోల్బణం 1.88 శాతం ఉంటే, 2018 జూన్‌లో 5.77 శాతంగా ఉంది. టోకున ఆహార ఉత్పత్తుల ధరలు... ♦ ప్రైమరీ ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో 2018 జూన్ నెలలో 1.8 శాతం ద్రవ్యోల్బణం ఉంటే, జూలై నెలలో అసలు ధర పెరక్కపోగా –2.16 శాతం తగ్గింది. ♦ ఫుడ్ ఆర్టికల్స్‌లో కూరగాయల ధరలు జూన్‌లో 8.12% పెరిగితే, జూలై నెలలో –14.07% తగ్గాయి. ♦ పండ్ల ధరలు జూన్‌లో 3.87 శాతం పెరిగితే, తరువాతి నెలలో 8.81 శాతం తగ్గాయి. ♦పప్పు దినుసుల కేటగిరీలో ధరలు –17.03 శాతం క్షీణించాయి. అంతక్రితం నెలలో ఈ క్షీణత –20.23 శాతంగా ఉంది. ♦ కూరగాయలు, పండ్లు, పప్పు దినుసుల ధరలు తగ్గడం వల్ల ప్రైమరీ ఫుడ్ ఆర్టికల్స్ విభాగం 3 నెలల తరువాత మళ్లీ ‘డిస్ఇన్ఫ్లెషన్’లోకి జారుకుంది. ♦ నాన్–ఫుడ్ ఆర్టికల్స్ విభాగానికి వస్తే, ద్రవ్యోల్బణం 3.81 శాతం నుంచి 3.96 శాతానికి పెరిగింది. ♦ ఇంధనం, తయారీ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు భారీగా 18.10 శాతంగా ఉంది. ♦ డబ్ల్యూపీఐ సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో ద్రవ్యోల్బణం రేటు 4.26 శాతం. రిటైల్ ధరలు తగ్గే చాన్స్: బ్యాంక్ ఆఫ్ అమెరికా కాగా వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 3.8గా నమోదయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ– బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్ మంగళవారం వెలువరించిన ఒక నివేదికలో అభిప్రాయపడింది. ద్రవ్యోల్బణం తన లక్ష్యానికి అనుగుణంగా ఉండటంతో (2 ప్లస్, 2 మైనస్‌కు లోబడి 4 శాతం వద్ద) అక్టోబర్ పాలసీ సందర్భంగా బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు రెపో (ప్రస్తుతం 6.5 శాతం)ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పెంచకపోవచ్చని కూడా అభిప్రాయపడింది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 4.17 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ఇది తొమ్మిది నెలల కనిష్ట స్థాయి. -
టోకు ధర తగ్గినా... పెట్రో భయాలు!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో ఊరట కలిగించింది. ధరల పెరుగుదల రేటు కేవలం 2.47 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 మార్చి ధరలతో పోల్చిచూస్తే, 2018 మార్చిలో టోకు బాస్కెట్ ధరల పెరుగుదల రేటు కేవలం 2.47 శాతంగా ఉందన్నమాట. ఈ రేటు 2018 ఫిబ్రవరిలో 2.48 శాతం.2017 మార్చిలో 5.11 శాతం. అటు తర్వాతి 12 నెలల్లో అంత స్థాయికి దిగువనే టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం గమనార్హం. అయితే ప్రస్తుతానికి ద్రవ్యోల్బణం తీరు ఊరటనిస్తున్నా, అంతర్జాతీయంగా చమురు ధరల తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రభావం దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలకు తదనంతరం నిత్యావసర ధరల పెరుగుదలకు దారితీయవచ్చన్నది పలువురి ఆందోళన. డాలర్ మారకంలో బలహీనపడుతున్న రూపాయి (దేశీయంగా ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్సే్ఛంజ్‌లో సోమవారం 6 నెలల గరిష్ట స్థాయిలో 65.49 వద్ద ముగింపు) ధరల పరుగుకు కారణం కావచ్చు. మార్చిలో టోకు సూచీలో మూడు ప్రధాన భాగాలను వార్షిక రీతిన పరిశీలించి చూస్తే.. ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 3.33 శాతం నుంచి 0.24 శాతానికి తగ్గింది. ఇందులో ఒక్క ఫుడ్ ఆర్టికల్స్ రేటు 3.15 శాతం నుంచి 0.24 శాతానికి చేరింది. నాన్–ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో రేటు అసలు పెరక్కపోగా –1.39 శాతంలోకి జారింది. ఇంధనం, విద్యుత్: ఈ రేటు ఏకంగా 22.35 శాతం నుంచి 4.70 శాతానికి జారింది. అయితే నెలవారీగా చూస్తే, మాత్రం ఫిబ్రవరి (3.81 శాతం) కన్నా ఈ విభాగంలో రేటు పెరగడం గమనార్హం. తయారీ: మొత్తం సూచీలో దాదాపు 58శాతం వాటా ఉన్న ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 2.33 శాతం నుంచి 0.03 శాతానికి తగ్గింది. నిత్యావసరాలు ఇలా: పప్పు ధాన్యాల ధరలు అసలు పెరక్కపోగా 20.58 శాతం తగ్గాయి. (2017 మార్చి ధరతో పోల్చి 2018 మార్చి ధర). కూరగాయలు (–2.70%), గోధుమలు (–1.19%) గుడ్లు, మాంసం, చేపలు (–0.82%) ధరలు తగ్గాయి. అయితే ఉల్లి, ఆలూ ధరలు 42.22%, 43.25% చొప్పున ఎగిశాయి. కాగా చక్కెర ధరలు 10.48% పెరిగాయి. ఆహార ధరల తగ్గుదల వల్ల మార్చి రిటైల్ ద్రవ్యోల్బణం 4.28 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. సగటు 3.9 శాతం ఉండొచ్చు... 2018–19లో టోకు ద్రవ్యోల్బణం సగటున 3.9 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. 2017–18లో ఇది 2.9 శాతం. పెట్రో ధరల పెరుగుదల అవకాశాలు ఆందోళన కలిగించే అంశం. జనవరికి సంబంధించి 2.84 శాతం ద్రవ్యోల్బణం అంచనాలను తాజాగా 3.02 శాతానికి పెంచడం ఇక్కడ గమనార్హం. - అదితి నయ్యర్, ఇక్రా ప్రిన్సిపల్ ఎకనమిస్ట్ -
ఆహార ధరలు క్రాష్: ద్రవ్యోల్బణం మరింత కిందకి
న్యూఢిల్లీ : టోకుధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) కూడా ఐదు నెలల కనిష్టానికి పడిపోయింది. ఆహార ధరలు భారీగా పడిపోవడంతో మే నెలలో ఈ ద్రవ్యోల్బణం 2.17 శాతంగా నమోదైంది. గత నెలలో ఈ ద్రవ్యోల్బణం 3.85 శాతంగా ఉంది. పప్పులు, తృణధాన్యాల ధరల్లో వృద్ధి కూడా చాలా తక్కువగా నమోదైందని నేడు ప్రభుత్వం విడుదల చేసిన డేటాలో వెల్లడైంది. వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) కూడా ఇటీవల రికార్డు కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. అది కూడా 2.18 శాతానికి పడిపోయింది. ఈ రెండు సూచీలు దిగిరావడంతో ఆర్బీఐ రేట్ల కోత అంచనాలు పెరుగుతున్నాయి. ఆగస్టులో కచ్చితంగా ఆర్బీఐ రేట్లలో కోత పెట్టవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటాలో ఆహార ధరల ముఖ్యంగా బంగాళదుంపలు, పప్పులు, ఉల్లిపాయల ధరలు వరుసగా మూడో నెలలో కూడా కిందకి పడిపోయినట్టు తెలిసింది. ఈ సూచీలో ఇవి ప్రైమరీ ఆర్టికల్స్ గా ఉంటాయి. మే నెలలో ఆహారోత్పత్తుల దరలు 2.27 శాతానికి పడిపోయాయి. కూరగాయలు ధరలు -18.51 శాతంగా నమోదయ్యాయి. బంగాళదుంపలు ధరలు కూడా 44.36 శాతం డీప్లేషన్ లో ఉన్నాయి. ఉల్లిపాయల రేట్లు 12.86 శాతం కిందకి పడిపోయినట్టు వెల్లడైంది. అయితే గతేడాది -14.78శాతంగా ఉన్న ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది 11.69 శాతం పైకి ఎగిసింది. కొత్త బేస్ ఇయర్ 2011-12 ఆధారితంగా ఈ ద్రవ్యోల్బణాన్ని గణించారు. -
టోకు ధరలకు ఆహారం, తయారీ సెగ
♦ జూన్‌లో ద్రవ్యోల్బణం 1.62 శాతం ♦ ఆహార ద్రవ్యోల్బణం 8.18 శాతం ♦ ఆగస్టు 9 ఆర్బీఐ రేటు కోత అంచనాలపై నీళ్లు న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా మూడవ నెలలోనూ ‘ప్లస్’లోనే కొనసాగింది. జూన్‌లో టోకు ధరల సూచీ 1.62%గా నమోదయ్యింది. టోకు సూచీలో ఆహార ధరల విభాగంలో భారీ పెరుగుదల, అలాగే సూచీలో దాదాపు 65 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగంలో ద్రవ్యోల్బణం కూడా ‘క్షీణతలోంచి’ బయటకు రావడం వంటి అంశాలు తాజా ఫలితానికి కారణం. టోకు ద్రవ్యోల్బణం సూచీ మార్చి వరకూ దాదాపు పదిహేడు నెలల పాటు అసలు పెరుగుదల లేకపోగా, క్షీణతలో కొనసాగిన విషయం తెలిసిందే. 2015 ఇదే నెలలో ఈ రేటు -2.13 శాతంగా ఉంది. ప్రధాన విభాగాలను వేర్వేరుగా చూస్తే... ⇒ ఫుడ్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ విభాగంలో రేటు 2015 జూన్‌లో -0.48 శాతం క్షీణతలో ఉంది. ఇది తాజాగా 5.5 శాతంగా నమోదయ్యింది. ఫుడ్ ఆర్టికల్స్‌లో రేటు ఏకంగా 3.12 శాతం నుంచి 8.18 శాతానికి పెరిగింది. కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు, ప్రొటీన్ ఆధారిత ఉత్పత్తుల ధరల భారీ పెరుగుదల దీనికి కారణం. కూరగాయల ధరలు వార్షికంగా (2015 ఇదే నెలలో పోల్చితే) 16.91 శాతం పెరిగాయి. పప్పుల ధరలు ఏకంగా 27శాతం పెరిగాయి. చక్కెర ధర 26 శాతం ఎగసింది. పండ్ల ధరలు 6 శాతం ఎగశాయి. ఆలూ ధరలు 64 శాతం పెరగడం గమనార్హం. అయితే ఉల్లి ధరలు మాత్రం 29 శాతం తక్కువగా ఉన్నాయి. ఇక నాన్-ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో రేటు 1.16 శాతం నుంచి 5.72 శాతానికి చేరింది. ⇒ తయారీ రంగాన్ని చూస్తే... -0.77% క్షీణత నుంచి ప్లస్+ 1.17%కి చేరింది. రేటు కోత లేనట్లేనా...! మంగళవారం విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం 22 నెలల గరిష్ట స్థాయి 5.77 శాతానికి పెరగడంతోపాటు, తాజాగా విడుదలైన కూడా ఆహార ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉండడంతో ఆగస్టు 9 నాటి ద్రవ్య పరపతి సమీక్ష సందర్భంగా ఆర్బీఐ పాలసీ వడ్డీరేటు(రెపో)ను తగ్గించే అవకాశం లేదని ఐడీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ ఇంద్రనీల్ పన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రేటు 6.5 శాతంగా ఉంది. -
రేటు కోతకు ‘ద్రవ్యోల్బణం’ మార్గం!
టోకు సూచీ వరుసగా 16వ నెలలోనూ క్షీణత ♦ ఫిబ్రవరిలో -0.91 శాతంగా నమోదు ♦ రిటైల్ ద్రవ్యోల్బణమూ దిగువ బాటలోనే ♦ జనవరిలో 5.69 శాతంగా ఉన్న సూచీ ఫిబ్రవరిలో 5.18 శాతానికి డౌన్ ♦ రేటుకోతకు ఇది తగిన సమయమని పారిశ్రామిక వర్గాల సూచన ♦ పారిశ్రామిక ఉత్పత్తి సైతం ‘మైనస్‌లో ఉన్న విషయం ప్రస్తావన న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు- రెపో (ప్రస్తుతం 6.75 శాతం) తగ్గింపునకు తగిన పరిస్థితులను తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు సృష్టిస్తున్నాయి. సోమవారం విడుదలైన గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం -0.91 శాతంగా నమోదయ్యింది. ద్రవ్యోల్బణంలో అసలు పెరుగుదల నమోదుకాకుండా మైనస్‌లోనే కొనసాగుతుండడం ఇది వరుసగా 16వ నెల. 2015 జనవరిలో ఈ రేటు -0.90 శాతం. 2016 ఫిబ్రవరిలో ఈ రేటు - 2.17 శాతం. ఇక వినియోగ ధరల సూచీ ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం 2016 ఫిబ్రవరిలో (2015 ఇదే నెలతో పోల్చిచూస్తే) 5.18 శాతంగా నమోదయ్యింది. ఈ ఏడాది జనవరిలో ఇది 5.69 శాతం. పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) మూడు నెలలుగా క్షీణబాటన కొనసాగుతుండడం, దీనికితోడు తాజాగా టోకు, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు సైతం సానుకూల రీతిన నమోదుకావడం వంటి అంశాలు ఆర్బీఐ రెపో రేటు కోతకు మార్గం సుగమం చేస్తున్నాయని నిపుణుల విశ్లేషణ. దీనితో ఆర్థిక విశ్లేషకులు, విధాన నిర్ణేతల దృష్టి ఏప్రిల్ 5న ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానం వైపునకు మళ్లింది. రేటు కోతకు ఇది తగిన సమయమని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్ 5 లేదా ఆ లోపే పావుశాతం రేటు కోత ఖాయమన్న అంచనాలూ వెలువడుతున్నాయి. టోకున ‘మూడు’ భాగాలనూ చూస్తే... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్-ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 1.58 శాతంగా నమోదయ్యింది. 2015 ఫిబ్రవరిలో ఈ రేటు 1.01 శాతం. ఒక్క ఫుడ్ ఆర్టికల్స్‌ను చూస్తే... వార్షికంగా ఈ రేటు 7.83 శాతం నుంచి 3.35 శాతానికి తగ్గింది. జనవరిలో ఈ రేటు 6.02 శాతం. అయితే నాన్ ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో ద్రవ్యోల్బణం క్షీణత నుంచి (-5.64 శాతం) నుంచి బయటపడి 5.88 శాతంగా నమోదయ్యింది. ఫ్యూయల్ అండ్ పవర్: క్షీణ రేటు -14.77 శాతం నుంచి - 6.40 శాతానికి చేరింది. తయారీ: మొత్తం సూచీలో దాదాపు 65 శాతం వరకూ వాటా ఉన్న ఈ విభాగంలో ద్రవ్యోల్బణంలో - 0.58 శాతం క్షీణత నమోదయ్యింది. 2015 ఫిబ్రవరిలో ఈ విభాగం ద్రవ్యోల్బణం 0.26 శాతం. పరిశ్రమల మాట ఇదీ... ఫిక్కీ: తదుపరి రేటు కోత అవసరం. అంతేకాదు ఇప్పటి వరకూ రేటు కోత ద్వారా అందిన ప్రయోజనాలను కంపెనీలు, వినియోగదారులకు బ్యాంకింగ్ బదలాయించాలి. పెట్టుబడులు, వినియోగం విభాగాలు ఇంకా బలహీనంగా ఉన్న విషయాన్ని విధాన నిర్ణేతలు గుర్తెరగాలి. అసోచామ్: స్థూల దేశీయోత్పత్తి పెరిగితేనే.. 2016-17లో ద్రవ్యలోటు 3.5 శాతం లక్ష్యసాధన సాధ్యమవుతుంది. రేటు కోత ద్వారానే చక్కటి వృద్ధి సాధ్యమవుతుంది. రిటైల్ ‘ఊరట’ జనవరిలో 5.69 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5.18 శాతానికి తగ్గింది. విభాగాల వారీగా చూస్తే... ♦ ఆహారం, పానీయాల ద్రవ్యోల్బణం 5.52 శాతంగా ఉంది. వేర్వేరుగా కొన్ని ముఖ్య ఆహార ఉత్పత్తులను చూస్తే... పప్పుదినుసుల ధరల పెరుగుదల 38 శాతంగా ఉంటే... కూరగాయల విషయంలో ద్రవ్యోల్బణం 0.7 శాతంగా నమోదయ్యింది. మాంసం చేపల ధరలు 7 శాతం పెరిగాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 10 శాతం ఎగశాయి. గుడ్ల ధరలు 6 శాతం పెరిగాయి. అయితే పండ్ల ధరలు మాత్రం 0.72 శాతం తగ్గాయి. ♦ పాన్, పొగాకు, ఇతర మత్తుప్రేరిత ఉత్పత్తుల సూచీ 8.39 శాతం ఎగసింది. ♦ దుస్తులు, పాదరక్షల ధరలు 5.52 శాతం ఎగశాయి ♦ హౌసింగ్ విషయంలో పెరుగుదల 5.33 శాతంగా ఉంది. ♦ ఇంధనం,లైట్ విషయంలో ద్రవ్యోల్బణం 4.59 శాతం పెరుగుదల నమోదయ్యింది. -
క్షీణతలోనే టోకు ధరలు
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో వరుసగా 15వ నెలలోనూ అసలు పెరగకపోగా.. క్షీణతలో (మైనస్) కొనసాగింది. - 0.9 శాతం క్షీణత నమోదయ్యింది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు తక్కువగా ఉండడం, ఈ ప్రభావం ప్రధానంగా కమోడిటీ ఆధారిత తయారీ ఉత్పత్తుల మీదా ఉండడం, దేశంలో మందగమన ధోరణి అన్నీ కలిసి టోకు ద్రవ్యోల్బణాన్ని 15 నెలలుగా క్షీణతలో ఉంచుతున్నాయి. అయితే సెప్టెంబర్ నుంచి క్రమంగా టోకు ద్రవ్యోల్బణం క్షీణ బాట నుంచి పెరుగుదల దారికి మళ్లుతున్న సంకేతాలు కనిపిస్తుండడం గమనార్హం. డిసెంబర్లో ఈ రేటు -0.73 శాతంగా నమోదయ్యింది. నవంబర్‌లో ఈ రేటు -2.04 శాతం. అక్టోబర్, సెప్టెంబర్లలో ఈ రేటు -4 శాతం వరకూ ఉంది. టోకు ద్రవ్యోల్బణంలోని ప్రధాన మూడు భాగాలనూ పరిశీలిస్తే... ఆహార, ఆహారేతర ఉత్పత్తులకు సంబంధించి ప్రైమరీ ఆర్టికల్స్ విభాగంలో 4.63 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఇందులో భాగమైన ఒక్క ఆహార విభాగాన్ని తీసుకుంటే టోకున ద్రవ్యోల్బణం 6.02 శాతంగా ఉంది. ఆహారేతర విభాగంలో ద్రవ్యోల్బణం 4.63 శాతంగా నమోదయ్యింది. -
టోకున ఆహార ధరలు భగ్గు..
♦ డిసెంబర్లో 8 శాతంపైకి.. ♦ మొత్తం టోకు సూచీ మాత్రం ♦ ‘క్షీణత’లోనే; మైనస్ 0.73 శాతం న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 14వ నెలలోనూ అసలు పెరక్కపోగా... క్షీణత (మైనస్)లో కొనసాగింది. డిసెంబర్లో -0.73 శాతంగా నమోదయ్యింది. అంటే 2014 డిసెంబర్‌తో పోల్చితే 2015 డిసెంబర్లో టోకు బాస్కెట్ రేటు మొత్తంగా అసలు పెరక్కపోగా... క్షీణించిందన్నమాట. నవంబర్‌లో ఈ రేటు -1.99 శాతం. అయితే మొత్తం టోకు ధరల సూచీలో ఒక భాగమైన ఆహార ధరల విభాగం మాత్రం సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న వైనాన్ని గణాంకాలు ప్రతిబింబించాయి. ఈ ధరల స్పీడ్ డిసెంబర్లో ఏకంగా 8.17 శాతంగా నమోదయ్యింది. గడచిన ఏడాది కాలంలో పెరుగుదల ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. ఆహార ఉత్పత్తుల ధరలు భారీగా పెరగడం దీనికి కారణం. ఆహార ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే... రానున్న కొద్ది నెలల్లో సూచీ మొత్తం క్షీణతలోంచి బయటకు వస్తుందని అంచనా. 2014 నవంబర్ నుంచి క్షీణతలో కొనసాగుతున్న టోకు ద్రవ్యోల్బణం... ఆహార ధరల తీవ్రత దృష్ట్యా గడచిన నాలుగు నెలల నుంచి కొంచెంకొంచెంగా పైకి వస్తోంది. ఆహార, ఆహారేతర ఉత్పత్తులతో కూడిన ఈ విభాగంలో రేటు 5.48% పెరిగింది. ఇందులో ఒక్క ఆహార ఉత్పత్తులను చూస్తే ఈ రేటు 8.17 శాతంగా ఉంది. నవంబర్‌లో ఈ రేటు 5.2%. పప్పు దినుసుల ధరలు వార్షికంగా చూస్తే... భారీగా 56% ఎగశాయి. ఉల్లి ధరలు 26% అధికంగా ఉన్నాయి. కూరగాయల ధరలు 21 శాతం ఎగశాయి. -
టోకు ధరలు తగ్గాయ్
* 2014 జనవరితో పోల్చితే * గడచిన నెలలో క్షీణత * మైనస్ 0.39 శాతంగా నమోదు న్యూఢిల్లీ: టోకు ధరలు జనవరిలో తగ్గాయి. 2014 జనవరితో పోల్చిచూస్తే, 2015లో అసలు పెరక్కపోగా 0.39 శాతం క్షీణించాయి. ఇది ఐదేళ్ల కనిష్ట స్థాయి. 3 నెలల్లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం క్షీణతలోకి జారడం ఇది రెండోసారి. నవంబర్‌లో తొలి అంచనాల ప్రకారం ద్రవ్యోల్బణం రేటు ‘జీరో’ అయినప్పటికీ, తాజాగా దీనిని -0.17 శాతంగా సవరించారు. తాజా సమీక్షా కాలంలో మూడు విభాగాల రేట్లూ తగ్గినా ఆహార ధరలు పెరిగాయి. నిత్యావసరాలు... ఇంకా భారమే! నిత్యావసర వస్తువుల టోకు బాస్కెట్ ధరల రేటు వార్షికంగా తగ్గినప్పటికీ (2014 జనవరిలో 8.85 శాతం స్పీడ్- 2015 ఇదే నెలలో 8 శాతం) ఇది ఇంకా సామాన్యుడికి ఇబ్బందికరమైన స్థాయిలో ఆరు నెలల గరిష్ట స్థాయిలో ఉంది. 2014 డిసెంబర్‌తో పోల్చినా... 2015 డిసెంబర్లో కూరగాయల ధరల పెరుగుదల (19.74 శాతం) రేటు అధికంగానే ఉన్నట్లు సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బియ్యం ధరలు సైతం 4 శాతం పెరిగాయి. - ఆహార, ఆహారేతర ఉత్పత్తులతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ సూచీ 6.80 శాతం నుంచి 3.27 శాతానికి తగ్గింది. - ఇంధనం, విద్యుత్ సూచీ స్పీడ్ 9.82 శాతం నుంచి 10.69 శాతం క్షీణతలోకి జారింది. - తయారీ రంగం స్పీడ్ 2.96 శాతం నుంచి 1.05 శాతానికి పడిపోయింది. -
కొత్త ఐపాడ్లు వస్తున్నాయ్...
న్యూఢిల్లీ: యాపిల్ కంపెనీ ఐపాడ్ ఎయిర్2, ఐపాడ్ మినీ 3 డివైస్‌లు ఈ నెల 29 నుంచి భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే వీటికి ముందస్తు బుకింగ్స్ ప్రారంభించామని, ఈ నెల 29 నుంచి యాపిల్ అధీకృత రిటైల్ స్టోర్స్‌లో వీటిని విక్రయిస్తామని యాపిల్ చానల్ భాగస్వామి కంపెనీ పేర్కొంది. వేలితో తాకటం ద్వారా ఈ డివైస్‌లను అన్‌లాక్ చేసే టచ్ ఐడీ ఫీచర్ వీటిలో ఉంది. ఈ రెండు డివైస్‌లు వైఫై, వైఫైతో పాటు సెల్యులర్ కనెక్టివిటీ.. ఈ 2 కేటగిరీల్లో లభిస్తాయి. ఈ డివైస్ల సెల్యులర్ మోడళ్లు - సీడీఎంఏ, 2జీ, 3జీ, 4జీ కనెక్టివిటీలను సపోర్ట్ చేస్తాయి. ఐపాడ్ ఎయిర్ 2 ఐపాడ్ మోడళ్లలో ఇదే అత్యంత పలుచని ఐపాడ్. మందం 6.1 మి.మీ. బరువు 437 గ్రాములు. ఒక్కో కేటగిరీలో 3 మోడళ్లు (వివిధ స్టోరేజ్ కెపాసిటీ)తో 6 మోడళ్లను అందిస్తోంది. వీటి ధరలు రూ.35,900 -59,900(వ్యాట్‌తో కలిపి) రేంజ్లో ఉన్నాయి. ఐపాడ్ మిని 3..: మూడు విభిన్నమైన స్టోరేజీ కెపాసిటిలతో మొత్తం ఆరు మోడళ్లు లభ్యమవుతాయి. వీటి ధరలు రూ.28,900 నుంచి రూ.52,900 రేంజ్లో ఉన్నాయి. ఐపాడ్ మిని 3లో 7.0 అంగుళాల స్క్రీన్, ఏ7 చిప్సెట్, 5 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 1.2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. -
టోకు ధరలు ఐదేళ్ల కనిష్ట స్థాయికి
న్యూఢిల్లీ: టోకు ధరలు 2014 అక్టోబర్‌లో ఐదేళ్ల కనిష్ట స్థాయిని నమోదుచేసుకున్నాయి. ఈ నెలలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు కేవలం 1.77 శాతంగా నమోదయ్యింది. అంటే 2013 అక్టోబర్‌తో పోల్చితే 2014 అక్టోబర్ నెలలో టోకు ధరలు కేవలం 1.77 శాతం మాత్రమే పెరిగాయన్నమాట. వార్షికంగా నిర్దిష్ట నెలను పరిగణనలోకి తీసుకుంటే... ఈ స్థాయిలో మాత్రమే టోకు ధరల పెరుగుదల రేటు నమోదుకావడం ఐదేళ్లలో ఇదే తొలిసారి. గత ఏడాది ఇదే నెలలో(అక్టోబర్) టోకు ధరల స్పీడ్ 7.24 శాతంగా ఉంది. 2014 సెప్టెంబర్‌లో రేటు 2.38 శాతం. ఇంత తక్కువ స్థాయిలో టోకు ధరల స్పీడ్ నమోదుకు ఒకపక్క ఇంధన ధరలు, మరోపక్క ఆహార ఉత్పత్తుల ధరల తగ్గుదల కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధిక బేస్ రేటు ప్రభావం కూడా ఉందని పేర్కొన్నాయి. ఈ సూచీ వరుసగా ఐదు నెలల నుంచీ తగ్గుతూ వస్తోంది. శుక్రవారం ఈ గణాంకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కార్పొరేట్ల ఆశలు... ధరలు ఈ స్థాయికి తగ్గడంతో ఇక వడ్డీరేట్ల కోత ద్వారా ఆర్బీఐ వృద్ధికి ఊతం ఇవ్వాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. డిసెంబర్ 2వ తేదీ న జరగనున్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షపై ఆయా వర్గాలు ఆశలు పెట్టుకుంటున్నాయి. అయితే, క్రూడ్ ధరకు సంబంధించి భవిష్యత్ అనిశ్చితి, ద్రవ్యోల్బణం తగ్గుదల అంతిమంగా వినియోగదారుకు అందుబాటులోకి తీసుకురావడం వంటి కారణాల ప్రాతిపదికన రానున్న రెండు పాలసీ సమీక్షా కాలాల్లో సైతం ఆర్బీఐ వడ్డీరేటు తగ్గించక పోవచ్చునని ఐసీఆర్ఏ సీనియర్ ఎకనమిస్ట్ ఆదితి నాయర్ విశ్లేషించారు. ఒక్క ఆహార ఉత్పత్తులను చూస్తే... ఆహార ఉత్పత్తుల ధరలు టోకున వార్షికంగా అక్టోబర్ నెలలో 2.7 శాతం మాత్రమే పెరిగాయి. సెప్టెంబర్‌తో పోల్చితే ఈ రేటు 0.82 శాతం (3.52 శాతం నుంచి ) తగ్గింది. వార్షికంగా చూస్తే (నిర్దిష్టంగా అక్టోబర్ నెలలో) ఉల్లిపాయలు (-59.77 శాతం), కూరగాయలు (-19.61 శాతం), ప్రొటీన్ ఆధారిత నాన్ వెజ్- గుడ్లు, మాంసం, చేపలు (-2.58 శాతం), గోధుమలు (-1.92 శాతం) ధరలు అసలు పెరక్కపోగా తగ్గాయి. ఇక పెరిగిన ఆహార ఉత్పత్తుల్లో బంగాళా దుంపలు (82.11 శాతం), పళ్లు (19.35 శాతం), పాలు (11.39 శాతం), బియ్యం (6.47 శాతం), పప్పు దినుసులు (4.02%), తృణధాన్యాలు (3.29%) ఉన్నాయి. మరింత తగ్గుతుంది: జైట్లీ అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గినందున, ధరల పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. అయితే క్రూడ్ ధరల భవిష్యత్ పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయంలో కొంత జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ అంశంపై అధిక ఆశావహంతో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. -
టోకు ధరల ఊరట...
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో ఊరట కలిగించింది. కేవలం 3.74 శాతంగా నమోదయ్యింది. అంటే 2013 ఆగస్టుతో పోల్చితే 2014 ఆగస్టులో టోకు ధరలు కేవలం 3.74 శాతం మాత్రమే పెరిగాయన్నమాట. ఇంత తక్కువ స్థాయిలో వార్షిక ద్రవ్యోల్బణం ఐదేళ్లలో ఇదే మొదటిసారి. (2009 అక్టోబర్‌లో ఈ సూచీ 1.8 శాతంగా నమోదయ్యింది) 2014 జూలై నెలలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 5.19 శాతం. 2013 ఆగస్టు నెలలో ఈ రేటు 6.99 శాతంగా ఉంది. ఆహార ధరలు తగ్గడమే కారణం! ఆగస్టు నెలలో ఉల్లి, కూరగాయలుసహా ఆహార ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గడమే మొత్తం ద్రవ్యోల్బణం దిగిరావడానికి కారణం. టోకు ధరల సూచీలోని మొత్తం మూడు విభాగాల్లో ఒక సబ్- కేటగిరీగా ఉన్న ఆహార ఉత్పత్తుల సూచీ అతి తక్కువగా నమోదయ్యింది. జూలైలో ఈ రేటు 8.43 శాతం ఉంటే, ఇది ఆగస్టులో భారీగా 3.28 శాతం పడిపోయి 5.15 శాతానికి చేరింది. వేర్వేరుగా చూస్తే కూరగాయలు (4.88 శాతం), ఉల్లిపాయలు(44.70 శాతం), ప్రొటీన్ ఆధారిత గుడ్లు, మాంసం, చేపల(5.87 శాతం) ధరలు గత యేడాది ఆగస్టులో పోల్చిచూస్తే 2014 ఆగస్టులో పెరగకపోగా తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అయితే భారీగా పెరిగిన ఆహార ఉత్పత్తుల్లో ఆలూ (61.61%), పండ్లు (20.31%), పాలు (12.18%) ఉన్నాయి. పప్పు దినుసులు (7.81%), బియ్యం (5.44%) ఉన్నాయి. కాగా తాజా గణాంకాల నేపథ్యంలో వడ్డీరేట్లు తగ్గించాలని పారిశ్రామిక ప్రతినిధులు కొందరు డిమాండ్ చేస్తున్నారు. 3 ప్రధాన విభాగాల తీరు... మూడు ప్రధాన విభాగాల్లో ఒకటైన ప్రైమరీ ఆర్టికల్స్ వార్షిక ద్రవ్యోల్బణం రేటు 3.89 శాతంగా ఉంది. ఇందులో ఒక సబ్-కేటగిరీగా ఉన్న నాన్ ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 4.19 శాతంగా ఉంది. మరో సబ్ కేటగిరీ పైన పేర్కొన్న ఆహార ఉత్పత్తులకు (ద్రవ్యోల్బణం 5.15%) సంబంధించింది. ఇంధన-విద్యుత్ కేటగిరీలో ద్రవ్యోల్బణం 4.54%. మెజారిటీ వాటా కలిగిన తయారీ ఉత్పత్తుల విభాగం వాటా 3.45 శాతం. -
5 నెలల కనిష్టానికి టోకు ధరలు
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం స్పీడ్ జూలైలో తగ్గింది. ఈ నెలలో ఈ రేటు 5.19 శాతంగా నమోదయ్యింది. జూన్‌లో ఈ రేటు 5.43 శాతం. అంటే టోకు ధరలు వార్షికంగా చూస్తే (2013 సంబంధిత నెలలతో పోల్చిచూస్తే ధరల పెరుగుదల తీరు) జూన్‌లో 5.43 శాతం ఉంటే, అది జూలైలో 5.19 శాతానికి తగ్గిందన్నమాట. టోకు ధరలకు సంబంధించిన మూడు ప్రధాన విభాగాల్లో ఒకటైన ఆహార ద్రవ్యోల్బణం రేటు మాత్రం పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఈ నిర్దిష్ట విభాగంలో ధరల స్పీడ్ జూన్‌లో 8.14 శాతం ఉంటే, జూలైలో ఇది 0.29 బేసిస్ పాయింట్లు ఎగసి (100 బేసిస్ పాయింట్లు 1 శాతానికి సమానం) 8.43 శాతంగా నమోదయ్యింది. మొత్తంగా చూస్తే జూన్ నెలతో పోల్చితే, జూలై నెలలో ఇంధనం-విద్యుత్ విభాగం ద్రవ్యోల్బణం తగ్గడం మొత్తం టోకు సూచీపై కొంత సానుకూల ప్రభావం చూపింది. నిత్యావసరాల ధరలు ఇలా... వార్షిక ప్రాతిపదికన కూరగాయల ధరలు జూలైలో స్వల్పంగా తగ్గినట్లు ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. అంటే 2013 జూలై నెలతో పోల్చితే 2014 జూలై నెలలో కూరగాయల ధరలు టోకుగా 1.27 శాతం తక్కువగానే ఉన్నాయి. ఉల్లిపాయల ధరలు సైతం 8.13 శాతం తగ్గాయి. తృణధాన్యాలు (4.46%), పప్పు దినుసులు (3.31%), బియ్యం (6.85%), పండ్లు (31.71%), గోధుమలు (1.02%), ఆలూ (46.41%), పాలు (10.46%), ప్రొటీన్ ఆధారిత గుడ్లు, మాంసం,చేపల (2.71) ధరలు పెరిగాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నిత్యావసర ధరల తీవ్రత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా సరఫరాల వైపు సమస్యల పరిష్కరించకపోతే, వినియోగదారునికి నిత్యావసర వస్తువు చేరే సరికి అది మరింత భారమవుతుందన్న ఆందోళన ఉంది. సరఫరాల సమస్య పరిష్కారమయితేనే ఆహార ద్రవ్యోల్బణం దిగివస్తుందని, ఇందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక రంగం కోరుతోంది. మూడు విభాగాల తీరిది... {పైమరీ ఆర్టికల్స్‌లో వార్షిక తీరున టోకు ద్రవ్యోల్బణం జూలైలో 6.78%గా ఉంది. (జూన్‌లో 5.43%) ఇందులో రెండు ప్రధాన కేటగిరీలైన ఫుడ్ ఆర్టికల్స్ 8.43%గా ఉంది. మరో కేటగిరీ నాన్- ఫుడ్ ఆర్టికల్స్ రేటు 3.32%గా ఉంది. ఇంధనం, విద్యుత్ రేటు 7.4%గా ఉంది (జూన్‌లో 9.04 శాతం) తయారీ విభాగం రేటు 3.67 శాతంగా నమోదయ్యింది. (జూన్‌లో 3.61 శాతం) -
రిలయన్స్ రికార్డు లాభం
క్యూ1లో రూ. 5,957 కోట్లు ఒక త్రైమాసికంలో బిలియన్ డాలర్లు ఆర్జించిన తొలి ప్రైవేట్ కంపెనీ అధిక రిఫైనింగ్ మార్జిన్లు, షేల్ గ్యాస్ వ్యాపారం ఊతం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ త్రైమాసికంలో రికార్డు స్థాయి నికర లాభాలు ఆర్జించాం. ప్రాంతీయంగా అంతటా రిఫైనింగ్ మార్జిన్లు అంతంత మాత్రమే ఉన్నప్పటికీ.. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి దీన్ని సాధించగలిగాం. పెట్రోకెమికల్స్ విభాగం పనితీరు వ్యాపార వైవిధ్యంలో రిలయన్స్‌కి ఉన్న బలాన్ని తెలియజేస్తుంది. మరెన్నో కొత్త ప్రాజెక్టులు చేపట్టబోతున్నాం. పోటీ సంస్థల కన్నా ముందుండేందుకు ఇవి తోడ్పడతాయి. ప్రస్తుతం ఉన్న మార్కెట్లతో పాటు కొత్త మార్కెట్లకూ రిటైల్ వ్యాపారాన్ని విస్తరించనున్నాం. - ముకేశ్ అంబానీ, సీఎండీ, ఆర్ఐఎల్ పెట్టుబడి ప్రణాళికలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 35,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు, ఇప్పటికే క్యూ1లో రూ. 8,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు రిలయన్స్ తెలిపింది. అలాగే, ఇంధన రిటైల్ వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో పునఃప్రారంభించేందుకు తగిన సమయం కోసం వేచిచూస్తున్నట్లు వివరించింది. తమ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కార్యకలాపాలను త్వరలో ప్రారంభించే దిశగా ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్లు, ఇప్పటికే పలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపింది. న్యూఢిల్లీ: కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రికార్డు లాభం ఆర్జించింది. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 13.7% వృద్ధితో రూ. 5,957 కోట్లు నమోదు చేసింది. తద్వారా ఒక త్రైమాసికంలో ఒక బిలియన్ డాలర్ల మేర ఆర్జించిన తొలి ప్రైవేట్ సంస్థగా నిల్చినట్లయిందని కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లాభం రూ. 5,237 కోట్లు. షేరువారీగా చూస్తే లాభం రూ. 17.8 నుంచి రూ. 20.3కి చేరినట్లవుతుందని కంపెనీ తెలిపింది. మరోవైపు టర్నోవరు 7.2% వృద్ధితో రూ. 1,07,905 కోట్లకు చేరింది. అధిక రిఫైనింగ్ మార్జిన్లు, పెట్రోకెమికల్ వ్యాపార ఆదాయం పెరగడం, అమెరికాలో షేల్ గ్యాస్ వ్యాపారం పుంజుకోవడం రికార్డు ఫలితాలకు తోడ్పడ్డాయని సంస్థ చైర్మన్ ముకేశ్ తెలిపారు. 8.4 డాలర్లుగా జీఆర్ఎం.. ముడిచమురును శుద్ధి చేసి ఇంధనంగా మార్చినందుకు గాను కంపెనీకి ప్రతి బ్యారెల్‌పై లభించే స్థూల రిఫైనింగ్ మార్జిను (జీఆర్ఎం) 8.4 డాలర్ల నుంచి 8.7 డాలర్లకు పెరిగింది. అయితే, జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే మాత్రం 9.3 డాలర్ల నుంచి తగ్గింది. మరోవైపు, రిఫైనరీ వ్యాపారం ఆదాయాలు 7.2%, పెట్రోకెమికల్ విభాగం ఆదాయాలు 9.3% మేర ఎగిశాయి. చమురు, గ్యాస్ ఉత్పత్తి విభాగం ఆదాయం అత్యధికంగా 27.3% మేర ఎగిసింది. అమెరికాలోని షేల్ గ్యాస్ వ్యాపారం పుంజుకోవడమే ఇందుకు కారణం. కాగా పెట్రోకెమికల్ వ్యాపారం నుంచి 25,398 కోట్లు. చమురు, గ్యాస్ వ్యాపార విభాగం ఆదాయాలు రూ. 3,178 కోట్లు వచ్చాయి. మరిన్ని విశేషాలు.. * 7.2 శాతం వృద్ధితో రూ. 98,081 కోట్లకు రిఫైనరీ వ్యాపార ఆదాయం. * జామ్‌నగర్ రిఫైనరీలో 16.7 మిలియన్ టన్నుల మేర చమురు ప్రాసెసింగ్ జరిగింది. * కేజీ-డీ6 క్షేత్రంలో 1 శాతం క్షీణించి 0.53 మిలియన్ బ్యారెళ్లకు తగ్గిన చమురు ఉత్పత్తి, 15 శాతం క్షీణించి 42 బిలియన్ ఘనపు అడుగులకు క్షీణించిన గ్యాస్ ఉత్పత్తి. * పన్నులకు ముందు రూ. 81 కోట్ల మేర లాభాలు నమోదు చేసిన రిటైల్ వ్యాపారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 148 నగరాల్లో 1,723 స్టోర్ల కార్యకలాపాలు. టర్నోవర్ 15శాతం వృద్ధితో రూ.3,999 కోట్లకు అప్. * కంపెనీ నగదు నిల్వలు రూ. 81,559 కోట్లు. * మార్చి 31 నాటితో పోలిస్తే రూ. 1,38,761 కోట్ల నుంచి జూన్ 30 నాటికి రూ. 1,35,769 కోట్లకు తగ్గిన రుణభారం. * దేశీయంగా చమురు, గ్యాస్ విభాగం నుంచి కంపెనీకి రూ. 1,557 కోట్లు మాత్రమే రాగా.. అమెరికా షేల్ గ్యాస్ ద్వారా అంతకన్నా ఎక్కువగా రూ. 1,617 కోట్లు వచ్చాయి. -
మొండిబకాయిల సమస్య నుంచి గట్టెక్కినట్టే..చందా కొచర్
ఐసీఐసీఐ సీఈఓ, ఎండీ చందా కొచర్ ముంబై: దేశీ బ్యాంకింగ్ పరిశ్రమ మొండి బకాయిల(ఎన్పీఏ) గడ్డు పరిస్థితుల నుంచి దాదాపు గట్టెక్కినట్లేనని ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందా కొచర్ అభిప్రాయపడ్డారు. ఇటీవలికాలంలో బ్యాం కుల ఎన్పీఏలు ఎగబాకడం తీవ్ర ఆందోళనకలిగిస్తున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో కూడా మొండిబకాయిలు, రుణాల పునర్వ్యవస్థీకరణలు కొంత పెరిగే అవకాశం ఉందని.. అయితే, క్రితం ఏడాది స్థాయిలో ఉండకపోవచ్చని కొచర్ పేర్కొన్నారు. కార్పొరేట్ రంగంలో ప్రాజెక్టులకు ఇక వేగంగా అనుమతులు లభిస్తాయని భావిస్తున్నామని.. నగదు ప్రవాహంలో ఏవైనా ఒత్తిడి ఉంటే తొలగించాల్సిన అవసరం ఉంద న్నారు. దేశీ బ్యాంకింగ్ వ్యవస్థకు తక్షణ సమస్య ఎన్పీఏల పెరుగుదలేనంటూ తాజాగా ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. కాగా, తమ బీమా యూనిట్లకు(ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్) సరైన విలువ లభిస్తుందన్న విశ్వాసంవస్తే స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసే అంశాన్ని పరిశీలిస్తామని కొచర్ పేర్కొన్నారు. తక్షణం తమ అనుబంద సంస్థల లిస్టింగ్ యోచనేదీ లేదని తేల్చిచెప్పారు. -
ఇన్ఫోసిస్ ఫలితాలు ఓకే..
బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాల బోణీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ తొలి త్రైమాసికం(2014-15, క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.2,886 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.2,374 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన లాభం 21.5 శాతం ఎగబాకింది. ఇక మొత్తం ఆదాయం కూడా రూ. 11,267 కోట్ల నుంచి రూ.12,770 కోట్లకు పెరిగింది. వార్షికంగా 13.3 శాతం వృద్ధి నమోదైంది. కంపెనీలో ఇటీవలే భారీగా యాజమాన్యపరమైన మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో కంపెనీ సీఈఓ, ఎండీ ఎస్డీ శిబులాల్ చిట్టచివరి ఆర్థిక ఫలితాల ప్రకటన ఇది. త్రైమాసికంగా తగ్గింది...: గతేడాది ఆఖరి క్వార్టర్(క్యూ4)తో పోలిస్తే ఈ ఏడాది క్యూ1లో(త్రైమాసిక ప్రాతిపదికన) ఇన్ఫీ లాభాలు 3.5 శాతం తగ్గాయి. క్యూ4లో రూ.2,992 కోట్ల లాభం నమోదైంది. కాగా, మొత్తం ఆదాయం కూడా 0.8 శాతం(క్యూ4లో రూ.12,875 కోట్లు) స్వల్పంగా తగ్గింది. అయితే, డాలరు రూపంలో ఏప్రిల్-జూన్ ఆదాయం 1.95 శాతం పెరిగి 2.133 బిలియన్ డాలర్లకు చేరింది. గెడైన్స్ యథాతథం...: ప్రస్తుత 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనా(గెడైన్స్)లను గతంలో ప్రకటించిన మాదిరిగానే యథాతథంగా కొనసాగించింది. క్యూ4 ఫలితాల సందర్భంగా డాలరు రూపంలో ఆదాయ గెడైన్స్‌ను 7-9 శాతంగా కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు ఇదే గెడైన్స్‌ను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఇక రూపాయి ప్రాతిపదికన గెడైన్స్ 5.6-7.6 శాతంగా ఉండొచ్చని వెల్లడించింది. డాలరుతో రూపాయి మారకం విలువ 60 చొప్పున ప్రాతిపదికగా తీసుకున్నట్లు ఇన్ఫీ తెలిపింది. విశ్లేషకుల అంచనాలకు పైనే... బ్రోకరేజి కంపెనీలకు చెందిన విశ్లేషకులు క్యూ1లో ఇన్ఫీ ఆదాయం సగటున రూ.12,814 కోట్లు, నికర లాభం రూ.2,667 కోట్లుగా అంచనావేశారు. ఈ అంచనాల కంటే మెరుగ్గానే ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... క్యూ1లో 5 మల్టీమిలియన్ డాలర్ కాంట్రాక్టులు ఇన్ఫోసిస్ దక్కించుకుంది. వీటి విలువ 70 కోట్ల డాలర్లు. ఇక ఈ కాలంలో మొత్తం 61 క్లయింట్లు కొత్తగా జతయ్యారు. ఇన్ఫీ నిర్వహణ మార్జిన్ క్రితం క్యూ1తో పోలిస్తే 23.5 శాతం నుంచి 25.1 శాతానికి మెరుగుపడింది. జూన్ చివరినాటికి కంపెనీ వద్దనున్న నగదు తత్సంబంధ నిల్వలు కాస్త తగ్గి రూ.29,748 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది మార్చిచివరికి ఈ మొత్తం రూ.30,251 కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్-జూన్ కాలంలో సబ్సిడరీలతో సహా కంపెనీలో కొత్తగా 11,506 మంది ఉద్యోగులు చేరారు. అయితే, కంపెనీని 10,627 మంది వీడటంతో నికరంగా 879 మందికి మాత్రమే జతైనట్లు లెక్క. దీంతో జూన్ చివరికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,61,284కు చేరింది. ఉద్యోగుల వలసల(అట్రిషన్) రేటు 19.5 శాతానికి ఎగబాకింది. క్రితం ఏడాది క్యూ1లో ఈ రేటు 16.9 శాతం కాగా, క్యూ4లో 18.7%. ఫలితాల నేపథ్యంలో శుక్రవారం కంపెనీ షేరు ధర బీఎస్ఈలో 1 శాతం లాభపడి రూ. 3,326 వద్ద స్థిరపడింది. మార్పులు... చేర్పులు.. కొత్త సీఈఓ, ఎండీగా విశాల్ సిక్కా నియామకానికి ఆమోదం కోసం ఈ నెల 30న అసాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కంపెనీ తెలిపింది. క్యూ1లోనే ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నారాయణ మూర్తి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఎస్. గోపాలకృష్ణన్‌లు పదవుల నుంచి వైదొలిగారు. అయితే, అక్టోబర్ 10 వరకూ వాళ్లు ఈ పదవుల్లో తాత్కాలికంగా కొనసాగనున్నారు. అక్టోబర్ 11 నుంచి గౌరవ చైర్మన్‌గా నారాయణ మూర్తి వ్యవహరిస్తారు. అదే రోజు నుంచి కేవీ కామత్ బోర్డు చైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తారు. కాగా, ఈ మార్పుల సందర్భంగానే ప్రెసిడెంట్, హోల్‌టైమ్ డెరైక్టర్ యూబీ ప్రవీణ్ రావు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ)గా పదోన్నతి పొందారు. మార్పును స్వాగతిస్తున్నా: శిబులాల్ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈఓ, ఎండీ ఎస్డీ శిబులాల్... తన ఆఖరి ఫలితాల ప్రకటనలో కొంత వేదాంత ధోరణితో మాట్లాడారు. శిబులాల్ స్థానంలో శాప్ మాజీ ఎగ్జిక్యూటివ్ విశాల్ సిక్కాకు వచ్చే నెల 1న బాధ్యతలను అప్పగించనున్న సంగతి తెలిసిందే. మూడు దశాబ్దాల క్రితం తనతోపాటు మొత్తం ఏడుగురు కలసి ఏర్పాటు చేసిన ఇన్ఫీ ఇప్పుడు 8 బిలియన్ డాలర్ల ఆదాయార్జనగల కంపెనీగా ఎదిగింది. కాగా, ఇప్పటిదాకా కంపెనీ సీఈఓలుగా ఏడుగురు సహవ్యవస్థాపకులే కొనసాగారు. తొలిసారి సిక్కా రూపంలో బయటివ్యక్తి పగ్గాలు చేపట్టనుండటం విశేషం. ‘అత్యంత పటిష్టమైన మూలాలతో ఉన్న కంపెనీని విడిచివెళ్తున్నా. బలమైన యంత్రాంగాన్ని ఉపయోగించుకుని సిక్కా కంపెనీని మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళ్తారన్న సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆయన టీమ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మార్పులనేవి జీవితంలో ఒక భాగమేనని నేను భావిస్తా. అయితే, నా ప్రయాణం చాలా గొప్పగానే సాగింది. గడచిన మూడేళ్లుగా మేం ఎదుర్కొంటున్న అనేక కఠిన పరిస్థితుల నుంచి ఇప్పుడు బయటికొస్తున్నాం. ఇంటాబయటా ముఖ్యంగా సిబ్బంది వలసల నుంచి క్లయింట్లను అట్టిపెట్టుకోవడం ఇలా పలు సవాళ్లను మేం దీటుగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఈ సవాళ్లన్నీ తొలగినట్టే. ఇన్ఫీని వీడుతున్నందుకు నేనేమీ చింతించడం లేదు. జరిగిపోయిన విషయాలపై అతిగా అలోచించే వ్యక్తిని కూడా కాదు. కంపెనీ మార్జిన్లు మెరుగుపడుతున్నాయి. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ మా నుంచి ఒక్క క్లయింట్ కూడా జారిపోలేదు. యూరప్‌లో కీలకమైన లోడ్స్టోన్ను కొనుగోలు చేయడం మేం తీసుకున్న వ్యూహాత్మకమైన నిర్ణయం. అంతేకాదు.. 2012-13తో పోలిస్తే గతేడాది మా ఆదాయం రెట్టింపుస్థాయిలో పెరగడం కూడా గమనించాల్సిన విషయం. మా కంపెనీలో అట్రిషన్ రేటు పెరగడం కొంత ఆందోళనకరమైన అంశమే. అయితే, ఐటీ పరిశ్రమలో నిపుణులైన సిబ్బందికి డిమాండ్ అధికంగాఉందన్న పరిస్థితిని ఇది తెలియజేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి మొత్తం 22,000 ఫ్రెషర్లకు కంపెనీ క్యాంపస్ ఆఫర్లు ఇచ్చింది. వ్యాపారపరిస్థితికి అనుగుణంగా వీళ్లను దశలవారీగా నియమించుకుంటాం’ అని శిబులాల్ ప్రస్తుత కంపెనీ పరిస్థితిని వివరించారు. -
కొండెక్కిన ధరలు
సాక్షి, ముంబై: వర్షాలు ముఖం చాటేయడంతో రాష్ర్టంలోని కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. తత్ఫలితంగా నగరానికి ప్రతిరోజూ కూరగాయాల లోడుతో రావాల్సిన ట్రక్కులు, టెంపోల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో 20 శాతం మేర ధరలు పెరిగిపోయాయి. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)కి ప్రతి రోజూ పుణే, నాసిక్ జిల్లాల పరిసరాల నుంచి కూరగాయలు వస్తాయి. ఇవి ముంబై, ఠాణే, నవీముంబై ప్రాంతాలకు సరఫరా అవుతాయి. వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా వర్షాల జాడ మాత్రం లేదు. దీంతో ఈ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేసిన విత్తనాలు భూమిలోనే ఎండిపోయాయి. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఉల్లిపాయలు గృహిణులకు కన్నీళ్లు రప్పిస్తున్నాయి. వారం క్రితమే కూరగాయల ధరలు పెరిగాయి. దీనికితోడు తాజాగా మరో 20 శాతం మేర పెరగడంతో సామాన్యుడి బడ్జెట్ పూర్తిగా తలకిందులైంది. మొన్నటివరకు ప్రతిరోజూ మార్కెట్‌కి 300-350 వరకు కూరగాయలు ట్రక్కులు రాగా , ప్రస్తుతం కేవలం 80-100 లోపే వస్తున్నాయి. ఏపీఎంసీలో ఏదైనా కూరగాయ ధర కేజీకి ఐదు రూపాయలు పెరిగితే అవి కొనుగోలుదార్ల చెంతకు వచ్చేసరికి చిన్న వ్యాపారులు ఏకంగా మూడురెట్లు పెంచేస్తున్నారు. కొన్నిచోట్ల టమాటాలు మొన్నటి వరకు కేజీకి రూ.30 చొప్పున లభించాయి. సరుకు కొరత కారణంగా తాజాగా మరో ఐదు రూపాయల మేర వాటి ధర పెరిగింది. దీన్ని బట్టి కేజీకి రూ.35 చొప్పున విక్రయించాలి. అయితే చిన్న చిన్న వ్యాపారులు ఏకంగా రూ.50 విక్రయించి తమ జేబులను నింపుకుంటున్నారు. ఇవే టమాటాలు రెండు వారాలక్రితం టోకు మార్కెట్లో కేజీకి రూ.12 లభించాయి. వారం క్రితం రూ.22 చేరుకున్నాయి. తాజాగా టోకు మార్కెట్లో కిలో రూ.35 పలుకుతోంది. కూరగాయల ధరల పెరుగుదలతో పేదలే కాకుండా మధ్య తరగతి ప్రజలు కూడా సతమతమతున్నారు. -
ఈ ఏడాది చివరికల్లా 8,650 పాయింట్లకు నిఫ్టీ!
ముంబై: ఈ ఏడాది చివరికల్లా ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ ‘నిఫ్టీ’ 8,650 పాయింట్లకు చేరే అవకాశమున్నదని ఆర్బీఎస్ ప్రైవేట్ వెల్త్ అంచనా వేసింది. ఇందుకు ప్రభుత్వ సంస్కరణలు, వర్థమాన మార్కెట్లలో ఇండియాకున్న సానుకూలతలు దోహదం చేస్తాయని పేర్కొంది. డిసెంబర్‌కల్లా నిఫ్టీ 7,700 పాయింట్లను తాకవచ్చునంటూ ఈ జనవరిలో ఆర్బీఎస్ అంచనా వేసిన విషయం విదితమే. అయితే ఇండియా మార్కెట్లు అత్యంత పటిష్టంగా ఉన్నాయని పేర్కొంటూ తాజాగా అంచనాలను దాదాపు 1,000 పాయింట్ల వరకూ పెంచడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ పుంజుకునే పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్లపట్ల బుల్లిష్‌గా ఉన్నట్లు తెలిపింది. దేశీ స్టాక్స్‌పట్ల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) చూపుతున్న ఆసక్తి కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 10న వెలువడనున్న బడ్జెట్ మార్కెట్లకు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది. వెరసి డిసెంబర్‌కల్లా నిఫ్టీ 8,650 పాయింట్లను తాకే చాన్స్ ఉన్నదని ఆర్బీఎస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ రాజేష్ చెరువు చెప్పారు. 2003నాటి పరిస్థితులు: ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని, ద్రవ్యలోటు, కరెంట్ ఖాతా లోటులకు చెక్ పడుతుందని రాజేష్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన మార్కెట్లతో పోలిస్తే దేశీ స్టాక్స్ చౌకగానే ట్రేడవుతున్నాయన్నారు. వెరసి 2003 నాటి దీర్ఘకాలిక బుల్‌ట్రెండ్ పరిస్థితులకు అవకాశముందని వ్యాఖ్యానించారు. మోడీ సర్కారు తీసకొస్తున్న సంస్కరణలు ఇతరత్రా అంశాలతో ఇండియా మార్కెట్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. -
రిటైల్ ధరలు తగ్గాయ్
న్యూఢిల్లీ: కూరగాయలు, తృణధాన్యాలు, డెయిరీ ఉత్పత్తుల ధరలు కాస్త దిగిరావడంతో రిటైల్ ద్రవ్యోల్బణం శాంతించింది. మే నెలలో 8.28 శాతంగా నమోదైంది. ఇది మూడు నెల ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. రిటైల్ ధరల ఆధారంగా లెక్కించే ఈ ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఏప్రిల్‌లో 8.59%గా ఉంది. కాగా, మే నెలలో రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గి 9.56%కి చేరింది. ఏప్రిల్‌లో 9.66 శాతంగా ఉంది. ఇక కూరగాయల ధరల పెరుగుదల రేటు ఏప్రిల్‌లో 17.5%కాగా, మే నెలలో 15.27%కి తగ్గింది. తృణధాన్యాల ధరల పెరుగుదల రేటు 9.67% నుంచి 8.81 శాతానికి దిగొచ్చింది. అదేవిధంగా పాలు, పాల ఉత్పత్తుల ధరల పెరుగుదల రేటు కూడా 11.42% నుంచి 11.28 శాతానికి చేరింది. త్వరలో కొత్త ద్రవ్యోల్బణ బాండ్లు... గతంలో ప్రవేశపెట్టిన ద్రవ్యోల్బణ సూచీ(ఇన్ఫ్లేషన్) ఆధారిత బాండ్లకు స్పందన అంతగారాకపోవడంతో త్వరలో వీటిని మరింత మెరుగుపరిచి జారీచేయనున్నట్లు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ హెచ్ఆర్ ఖాన్ చెప్పారు. నచికేత్ మోర్ కమిటీ సిఫార్సుల మేరకు భారత్‌లో తొలి పేమెంట్ బ్యాంక్ త్వరలో ఏర్పాటు కానుందని ఖాన్ చెప్పారు. డిపాజిట్, పేమెంట్ సేవలందించే ఈ బ్యాంక్‌లో రుణ సదుపాయం ఉండదన్నారు. -
వడ్డీ రేట్లలో మార్పులు చేయని RBI
-
కీలక పాలసీ వడ్డీరేట్లు యథాతథం..
ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లుచల్లారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మందగమనం కొనసాగుతున్నా.. ద్రవ్యోల్బణం కట్టడికే ప్రాధాన్యమిచ్చారు. కీలక పాలసీ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని మంగళవారం జరిగిన పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ నిర్ణయించింది. అయితే, చట్టబద్ద ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్)ను మాత్రం అర శాతం తగ్గించడంద్వారా వ్యవస్థలోకి ద్రవ్యసరఫరా పెంచే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా ద్రవ్యోల్బణం గనుక మరింత తగ్గుముఖం పడితే వడ్డీరేట్లను తప్పకుండా తగ్గిస్తామని చెప్పడం ఒక్కటే కాస్తలోకాస్త ఊరటనిచ్చే విషయం. అయితే, ఎస్ఎల్ఆర్ను తగ్గించినప్పటికీ... తాము ఇప్పట్లో వడ్డీరేట్లను తగ్గించే అవకాశం లేదని బ్యాంకర్లు తేల్చిచెప్పారు. ముంబై: మోడీ నేతృత్వంలోని కొత్త సర్కారు కొలువైన తర్వాత తొలిసారిగా చేపట్టిన ఆర్బీఐ పాలసీ సమీక్షలో దాదాపు అందరి అంచనాలకు అనుగుణంగానే నిర్ణయం వెలువడింది. కీలక పాలసీ రేట్లను మార్చకుండా వదిలేసినప్పటికీ.. ఎస్ఎల్ఆర్ను అర శాతం ఆర్బీఐ తగ్గించింది. దీంతో ప్రస్తుతం 23 శాతంగా ఉన్న ఎస్ఎల్ఆర్ 22.5 శాతానికి తగ్గింది. ఈ నెల 14 నుంచి ఈ తగ్గింపు నిర్ణయం అమలవుతుందని పేర్కొంది. తాజా చర్యలతో వ్యవస్థలోకి సుమారు రూ.40,000 కోట్లు విడుదలయ్యే అవకాశం ఉంది. దీనివల్ల బ్యాంకులకు రుణాలిచ్చేందుకు నిధుల లభ్యత పెరగనుంది. ఇదిలాఉండగా... రెపో రేటు 8 శాతం, రివర్స్ రెపో రేటు 7 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతం చొప్పున ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగనున్నాయి. బ్యాంక్ రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్ఎఫ్)లను కూడా ప్రస్తుత 9 శాతం వద్దే ఉంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వరుసగా రెండోసారీ నో చేంజ్... ఆర్బీఐ గవర్నర్‌గా గతేడాది సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టిన రాజన్.. ఆతర్వాత మూడుసార్లు పావు శాతం చొప్పున రెపో రేటును పెంచడం తెలిసిందే. అయితే, తాజాగా రేట్లను యథాతథంగా ఉంచడంద్వారా వరుసగా రెండోసారి పాలసీ రేట్లను పెంచడం లేదా తగ్గించకుండా వదిలేసినట్లయింది. ప్రధానంగా ద్రవ్యోల్బణం కట్టడికే తమ తొలిప్రాధాన్యమంటూ వస్తున్న రాజన్.. తాజాగా మోడీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూడా ఇదే పల్లవిని వినిపించారు. గతేడాది జీడీపీ వృద్ధి రేటు ఇంకా మందగమనంలోనే 4.7 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. కాగా, సరఫరాపరమైన అడ్డంకుల నేపథ్యంలో ఆర్బీఐ లక్ష్యానికి అనుగుణంగా ద్రవ్యోల్బణం దిగొచ్చే అవకాశాలు లేవని విశ్లేషకులు అంటున్నారు. దీనివల్ల డిసెంబర్‌లోపు మరో విడత పాలసీ రేట్ల పెంపు తప్పకపోవచ్చని బ్రోకరేజి దిగ్గజం క్రెడిట్ సూసే అభిప్రాయపడింది. పాలసీలో ఇతర ముఖ్యాంశాలు... ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు గతంలో అంచనావేసినట్లుగానే 5.5 శాతంగా ఉండొచ్చు. ఫారెక్స్ మార్కెట్లో సానుకూల పరిస్థితుల నేపథ్యంలో(డాలరుతో రూపాయి విలువ బలపడటం) వ్యక్తిగతంగా విదేశాల్లో పెట్టే వార్షిక పెట్టుబడుల పరిమితి పెంపు. ప్రస్తుత 75,000 డాలర్ల స్థాయి నుంచి 1.25 లక్షల డాలర్లకు పెంచుతూ నిర్ణయం. బంగ్లాదేశ్, పాకిస్థాన్ పౌరులు మినహా భారత, విదేశీ పౌరులు భారత్ నుంచి బయటికి వెళ్లినప్పుడు ఇకపై రూ.25,000 వరకూ భారతీయ కరెన్సీని పట్టుకెళ్లేందుకు అనుమతి. ప్రస్తుతం విదేశాలకు వెళ్లే భారతీయులు రూ.10,000 వరకూ మాత్రమే దేశీ కరెన్సీని తమతో తీసుకెళ్లేలా ఆర్బీఐ పరిమితి ఉంది. ఫారెక్స్ మార్కెట్లో దేశీయ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కరెన్సీ డెరివేటివ్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు కూడా లావాదేవీలు జరిపేం దుకు అనుమతి. ఈ విభాగంలో ట్రేడింగ్ పరిమాణం తగ్గడంతో దీన్ని బలోపేతం చేసేందుకు చర్యలు. ఎక్స్పోర్ట్ క్రెడిట్ రీఫైనాన్స్ సదుపాయం కింద నిధుల లభ్యత తగ్గింపు. ప్రస్తుతం ఎగుమతిదారులు తాము చెల్లించాల్సిన రుణ మొత్తంలో మరో 50 శాతం వరకూ రుణం తీసుకోవడానికి వీలుండగా.. దీన్ని ఇప్పుడు 32 శాతానికి తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను తగ్గించలేం తేల్చిచెప్పిన బ్యాంకర్లు ఆర్బీఐ ఎస్ఎల్ఆర్ను అర శాతం తగ్గించినప్పటికీ.. తాము మాత్రం వడ్డీరేట్ల తగ్గించే అస్కారం లేదని బ్యాంకర్లు స్పష్టం చేశారు. పాలసీ సమీక్ష తమ అంచనాలకు అనుగుణంగానే ఉందన్నారు. ఆర్బీఐ పాలసీపై ఎవరేమన్నారంటే... ఆర్బీఐ నిర్దేశించిన స్థాయికంటే ప్రస్తుతం బ్యాంకుల ఎస్ఎల్ఆర్ స్థాయి అధికంగానే ఉంది. దీన్ని తగ్గించడంవల్ల తక్షణం ఎలాంటి ప్రభావం ఉండదు. ద్రవ్యసరఫరా పెంపు సంకేతమిది. సమీప కాలంలో వడ్డీరేట్లు తగ్గే అవకాశాల్లేవు. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చైర్మన్ కొత్త ప్రభుత్వం రానున్న నెలల్లో వృద్ధి పెంపునకు, ద్రవ్యోల్బణం కట్టడి కోసం తీసుకోబోయే పాలసీ విధానపరమైన చర్యలను పరిశీలించి తదనుగుణంగా తగిన నిర్ణయం తీసుకోవడానికివీలుగానే ఆర్బీఐ పరపతి విధాన నిర్ణయం ఉంది. కేంద్రంలో కొలువుదీరిన మోడీ సర్కారు వృద్ధికి చేయూతనిస్తుందన్న అంచనాల నేపథ్యంలో వేచిచూసే ధోరణితో ఆర్బీఐ వ్యవహరించింది. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ ఎస్ఎల్ఆర్ తగ్గింపు వల్ల మాకు రూ.1,600 కోట్ల నిధుల లభ్యత పెరిగినప్పటికీ వడ్డీరేట్లలో మార్పులను మేం పరిశీలించే అవకాశం లేదు. - ఎం.నరేంద్ర, ఐఓబీ సీఎండీ ఎస్ఎల్ఆర్ కోతను స్వాగతించిన కార్పొరేట్లు పాలసీ వడ్డీరేట్లను తగ్గించనప్పటికీ.. ఎస్ఎల్ఆర్ను అర శాతం తగ్గించడంపట్ల పారిశ్రామిక వర్గాలు హర్హం వ్యక్తం చేశాయి. ఈ చర్యతో కార్పొరేట్ రంగానికి రుణాలు పెంచేందుకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయని చాంబర్లు పేర్కొన్నాయి. సరళ పాలసీని అనుసరించడం ద్వారా పెట్టుబడులను పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న చర్యలను ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్దార్థ్ బిర్లా ప్రశంసించారు. కాగా, ఎస్ఎల్ఆర్ తగ్గింపు వల్ల పారిశ్రామిక రంగానికి పెట్టుబడులకు రుణ లభ్యత పెరిగి, వృద్ధికి కూడా ఊతమిస్తుందని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. కాగా, అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ మాత్రం నిధుల లభ్యత పెరగడం కంటే వడ్డీరేట్ల తగ్గింపే ప్రస్తుతం పారిశ్రామిక రంగానికి అత్యవసరమని చెప్పారు. రియల్టర్ల అసంతృప్తి: పాలసీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపట్ల రియల్ ఎస్టేట్ రంగం అసంతృప్తి వ్యక్తం చేసింది. వృద్ధికి ఊతమిచ్చేవిధంగా మళ్లీ హౌసింగ్ డిమాండ్ పెంచాలంటే ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించాలని రియల్టీ డెవలపర్ల సంఘాల సమాఖ్య(క్రెడాయ్) డిమాండ్ చేసింది. ‘వ్యవస్థలోకి ద్రవ్యసరఫరా పెంచేలా ఎస్ఎల్ఆర్ను తగ్గించడాన్ని మేం స్వాగతిస్తున్నాం. అయితే, వడ్డీరేట్ల తగ్గింపు ద్వారా ఇళ్ల కొనుగోళ్లు పెంచే చర్యల కోసం రియల్టీ పరిశ్రమల వేచిచూస్తోంది’ అని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ సి.శేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీర్ఘకాలం పాటు వడ్డీరేట్లు తగ్గకుండా అక్కడే ఉంటే ఇళ్ల కొనుగోళ్లు జోరందుకోవడం కష్టమని క్రెడాయ్ చైర్మన్ లలిత్ జైన్ పేర్కొన్నారు. ఆర్బీఐ అస్త్రాలు... నగదు నిల్వల నిష్పతి(సీఆర్ఆర్): బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో కచ్చితంగా ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన మొత్తమే సీఆర్ఆర్. రెపో రేటు: బ్యాంకులు తన వద్దనుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీని రెపో రేటుగా పేర్కొంటారు. రివర్స్ రెపో: బ్యాంకులు తన వద్ద ఉంచే అదనపు నిధులపై రిజర్వ్ బ్యాంక్ చెల్లించే వడ్డీనే రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు. ఎస్ఎల్ఆర్: బ్యాంకులు తమ వద్దనున్న డిపాజిట్లలో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా ప్రభుత్వ సెక్యూరిటీ(బాండ్లు)ల్లో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. దీన్నే చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్)గా వ్యవహరిస్తారు. రుణ వృద్ధిని నియంత్రించేందుకు ఆర్బీఐ దీన్ని పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది. -
ఫోర్బ్స్ శక్తివంత మహిళల జాబితా..
న్యూయార్క్: ప్రపంచంలోని అత్యంత శక్తివంతులైన 100 మంది మహిళల జాబితాలో ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ చందా కొచర్లకు స్థానం లభించింది. జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానంలో ఉన్న ఈ జాబితాలో ఐదుగురు భారతీయ మహిళలకు చోటుదక్కింది. భట్టాచార్యకు 36వ ర్యాంకు, కొచర్‌కు 43వ ర్యాంకు లభించాయి. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్‌షా 92వ స్థానంలో నిలిచారు. పెప్సీకో చీఫ్ ఇంద్రా నూయి 13వ స్థానంలో, సిస్కో చీఫ్ టెక్నాలజీ, స్ట్రాటజీ ఆఫీసర్ పద్మశ్రీ వారియర్ 71వ స్థానంలో ఉన్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ జానెట్ ఎల్లెన్ (రెండో స్థానం), మానవతావాది మెలిండా గేట్స్ (3), హిల్లరీ క్లింటన్ (6), జనరల్ మోటార్స్ తొలి మహిళా సీఈఓ మేరీ బారా (7), అమెరికా తొలి మహిళ మిషెల్ ఒబామా, ఫేస్బుక్ సీఓఓ షెరిల్ శాండ్‌బెర్గ్(9) తొలి పది స్థానాలో ఉన్నారు. దాదాపు 38 వేల కోట్ల డాలర్ల ఆస్తులు కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సారథిగా భట్టాచార్య ఆసియా ఉపఖండంలోనే అత్యంత శక్తివంతమైన పదవిలో ఉన్నారని ఫోర్బ్స్ ప్రశంసించింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్, ట్రెజరీ, రిటైల్ ఆపరేషన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి వివిధ రంగాల్లో ఆమె విశేష సేవలందించారని తెలి పింది. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన 12,500 కోట్ల డాలర్ల ఆస్తులను చందా కొచర్ పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఇక్కట్లను ఎదుర్కొన్న ఐసీఐసీఐ బ్యాంకును ఆమె గాడిన పెట్టారని తెలిపింది. -
ఎక్కడి రేట్లు అక్కడేనా
బెంగళూరు: ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో కొనసాగుతూ ఆర్థిక కార్యకలాపాలు మందకొడిగా ఉన్న నేపథ్యంలో జూన్ 3న నిర్వహించనున్న ద్రవ్య విధాన సమీక్షలో కీలక రేట్లను రిజర్వు బ్యాంకు యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని రాయిటర్స్ పోల్‌లో ఆర్థిక నిపుణులు తెలిపారు. రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా రఘురామ్ రాజన్ గత సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ద్రవ్యోల్బణం కట్టడికి మూడు సార్లు వడ్డీ రేట్లను పెంచారు. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వర్షపాతం సగటు కంటే తక్కువగా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో 52 మంది ఆర్థికవేత్తలతో ఈ నెల 15-27 తేదీల మధ్య నిర్వహించిన పోలింగ్‌లో ముగ్గురు మాత్రమే పాలసీ రేట్లను మారుస్తారని అభిప్రాయపడ్డారు. వీరిలో ఒకరు 25 బేసిస్ పాయింట్లు పెంచుతారని చెప్పగా, మిగిలిన ఇద్దరూ రేటును తగ్గిస్తారని పేర్కొన్నారు. రెపో రేటును 8.00 శాతం వద్దే కనీసం జనవరి వరకు కొనసాగిస్తారని ఆర్థిక నిపుణుల అంచనా. ఆర్థిక వృద్ధికి చర్యలను పరిశీలించే ముందు ద్రవ్యోల్బణంపై ముమ్మర నిఘాను రిజర్వు బ్యాంకు కొనసాగిస్తుందని విశ్వసిస్తున్నట్లు వీనస్ క్యాపిటల్ మేనేజింగ్ డెరైక్టర్ కె.కె.మిట్టల్ చెప్పారు. తయారీ, గనుల రంగాలు నేటికీ బలహీనంగానే కొనసాగుతున్నందువల్ల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఓ మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నట్లు బార్ల్కేస్కు చెందిన ఆర్థిక నిపుణుడు రాహుజ్ బజోరియా తెలిపారు. నరేంద్ర మోడీ సారథ్యంలోని వాణిజ్య మిత్ర ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆర్థిక వ్యవస్థ జోరందుకుంటుందనీ, వచ్చే ఏడాదిన్నరలో వృద్ధి రేటు పుంజుకుంటుందనీ చెప్పారు. డిమాండ్ కొరవడడంతో గత నెలలో దేశీయ ఉత్పాదకరంగం ఏ మాత్రం పురోగతి సాధించలేదు. సేవల రంగం వరుసగా పదో నెలలో కూడా కుచించుకుపోయింది. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించింది. దీంతో షేర్లలోనూ, రూపాయి మారకం విలువలోనూ ర్యాలీ నెలకొంది. బడ్జెట్, అభివృద్ధి, కరెంటు అకౌంటు లోటు, ద్రవ్య నిర్వహణలు ప్రధాన సమస్యలనీ, దేశీయ వాణిజ్య, పారిశ్రామిక రంగాలు ఎదుర్కొంటున్న సమస్యల పరి ష్కారానికి మోడీ అధిక ప్రాధాన్యత ఇవ్వవచ్చనీ మిట్టల్ వ్యాఖ్యానించారు. కీలక వడ్డీరేట్లను మార్చకపోవచ్చు: డీబీఎస్ వచ్చేనెల మూడో తేదీన ఆర్బీఐ నిర్వహించనున్న ద్రవ్య విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశముందని డీబీఎస్ ఓ నివేదికలో తెలిపింది. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలుసుకుని ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తూ అభివృద్ధికి దోహదపడే చర్యలను రిజర్వు బ్యాంకు చేపడుతోందని వివరించిన విషయాన్ని నివేదికలో ప్రస్తావించారు. రెపో రేటులో ఎలాంటి మార్పు ఉండదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రభుత్వం, ఆర్బీఐ వచ్చే కొన్ని నెలల్లో సంఘటితంగా కృషిచేసే అవకాశముందని డీబీఎస్ తెలిపింది. 2013-14లో దేశ ఆర్థిక వృద్ధిరేటు మందగించి 4.9 శాతానికి చేరింది. -
తగ్గిన టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 5.2 శాతంగా నమోదయ్యింది. అంటే వార్షిక ప్రాతిపదికన 2013 ఏప్రిల్‌తో పోల్చితే ఈ రేటు 2014 ఏప్రిల్‌లో 5.2 శాతం పెరిగిందన్నమాట. 2014 మార్చిలో ఈ పరిమాణం 5.7 శాతం. నెలలో అరశాతం తగ్గింది. ఆహార ధరలు తగ్గడం మొత్తం టోకు ద్రవ్యోల్బణంపై సానుకూల ప్రభావం చూపింది. డబ్ల్యూపీఐలో ఒక భాగంగా ఉన్న ఆహార ధరల రేటు వార్షికంగా మార్చిలో 9.9% వద్ద ఉంటే, ఏప్రిల్‌లో ఇది 8.64%. పప్పు దినుసులు, ఉల్లిపాయల రేట్లు వార్షికంగా తగ్గాయి. ధరల తీరిది...: వార్షిక ప్రాతిపదికన 2013 ఏప్రిల్‌తో చూస్తే, 2014 ఏప్రిల్‌లో పప్పు దినుసులు (మైనస్ 0.77 శాతం) ఉల్లిపాయల (మైనస్ 9.76%) రేట్లు తగ్గాయి. మిగిలిన రేట్ల విషయానికివస్తే తృణధాన్యాల ధరలు 8.31 శాతం, బియ్యం ధరలు 12.76 శాతం, కూరగాయల ధరలు 1.34 శాతం, ఆలూ ధరలు భారీగా 31.56 శాతం, పండ్ల ధరలు 16.46 శాతం, పాల ధరలు 9.19 శాతం, గుడ్లు, మాంసం, చేపల ధరలు 9.97 శాతం పెరిగాయి. రేటు తగ్గింపుపై ఊహాగానాలు! కాగా టోకు ద్రవ్యోల్బణం తగ్గిన దృష్ట్యా ప్రత్యేకించి టోకున ఆహార పదార్థాల ధరల రేటు నెలవారీగా తగ్గినందున, రానున్న ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ పాలసీ రేటు రెపోను తగ్గించే అవకాశం ఉందని కొన్ని వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూన్ 3న ఆర్బీఐ పాలసీ సమీక్ష జరపనుంది. ధరలకు సంబంధించి తాజా ధోరణి ఇకముందూ కొనసాగే అవకాశం ఉందని ఫైనాన్స్ సెక్రటరీ అరవింద్ మయారామ్ అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్బణం 8.59%గా నమోదైంది. -
నేడు ఆర్బీఐ పరపతి సమీక్ష
ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మంగళవారం ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. రేట్లకు సంబంధించి గవర్నర్ రఘురామ్ రాజన్ యథాతథ పరిస్థితిని కొనసాగించవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రేట్ల విషయంలో సోమవారం తన తాజా అంచనాలను వెలువరిస్తూ, రెపో రేటు తగ్గింపునకు అవకాశం లేదని పేర్కొంది. యథాతథ పరిస్థితిని కొనసాగించవచ్చని సంస్థ అంచనా వేసింది. ప్రస్తుత రిటైల్ ద్రవ్యోల్బణం (ఫిబ్రవరిలో 8.1 శాతం) స్థాయి ఆమోదనీయంకాదని, ఇంకా తగ్గాలని ఆర్బీఐ భావించే అవకాశాలు ఉండడమే దీనికి కారణమని తన పరిశోధనా పత్రంలో పేర్కొంది. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- రెపో ప్రస్తుతం 8 శాతంగా ఉంది. రేట్లు పెంచితే వృద్ధికి విఘాతం రేట్లలో ఎటువంటి మార్పూ ఉండకపోవచ్చని డన్ అండ్ ఏఎంపీ బ్రాడ్షీట్ సీనియర్ ఎకనమిస్ట్ అరుణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం పెరగడానికే అవకాశాలు ఉండడం దీనికి కారణమని ఆయన అంచనావేశారు. అయితే రేటు పెంచితే మాత్రం అది ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రతికూలమవుతుందని స్పష్టం చేశారు. -
రాయ్ విడుదలకు సహారా సిబ్బంది చొరవ
న్యూఢిల్లీ: జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తమ గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ విడుదలకు సహారా గ్రూప్ సిబ్బంది వినూత్న ఆఫర్‌ను తెరముందుకు తెస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీని ప్రకారం సహారా ఉద్యోగులు, శ్రేయోభిలాషుల నుంచీ కనీసం లక్షకు తక్కువకాకుండా... రూ.2 లక్షలు, రూ. 3 లక్షలు, ఇలా వారివారి సామర్థ్యాన్ని బట్టి డబ్బును సమీకరిస్తారు. కనీసం రూ.5,000 కోట్లు సమీకరించాలన్నది ఈ ప్రతిపాదన లక్ష్యం. గ్రూప్‌లో ఎంటర్టైన్మెంట్ నుంచి రిటైల్ బిజినెస్ వరకూ దాదాపు 11 లక్షల మంది వేతన, ఫీల్డ్ కార్మికులు పనిచేస్తున్నట్లు సహారా చెబుతోంది. ఇలా డబ్బు చెల్లించిన వారికి ప్రతిగా సహార్యన్ ఇ-మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్‌లో షేర్లను కేటాయించడం జరుగుతుంది. ఒకపేజీ లెటర్‌పై గ్రూప్ ‘అనుబంధ’ సంస్థలు, సహార్యన్ సొసైటీ డెరైక్టర్లు ఈ మేరకు సంతకం చేస్తూ, సంబంధిత తోడ్పాటు ‘అభ్యర్థన’ చేసినట్లు సమాచారం. ఈ అంశంపై ఒక సీనియర్ సహారా అధికారిని వివరణ అడిగినప్పుడు ఆయన సమాధానం చెబుతూ, ‘సుబ్రతా రాయ్‌గానీ, లేదా యాజమాన్యం కానీ ఇందుకు సంబంధించి ఎటువంటి లేఖనూ జారీ చేయలేదు. ప్రస్తుత పరిస్థితికి ఆయా వ్యక్తుల నుంచి వచ్చిన భావోద్వేగ స్పందన మాత్రమే ఇది’ అని అన్నారు. సహారాశ్రీ(గ్రూప్‌లో రాయ్‌ని ఇలా పిలుస్తారు) సంస్థను ఒక పరివార్‌గా లేదా కుటుంబంగా నిర్మించారని, ఈ నేపథ్యంలో ఈ తరహా ప్రతిపాదన లేఖలు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వస్తున్నాయని ఆయన తెలిపారు. మార్కెట్ నిబంధనలకు వ్యతిరేకంగా 2 గ్రూప్ కంపెనీలు మదుపరుల నుంచి రూ.25 వేల కోట్లు సమీకరించాయన్నది ఈ వ్యవహారంలో ప్రధాన అంశం. ఈ డబ్బు పునఃచెల్లింపుల్లో విఫలమవుతున్నందుకుగాను సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఆదేశాల మేరకు రాయ్‌సహా రెండు కంపెనీల డెరైక్టర్లు ఇరువురు మార్చి 4 నుంచీ తీహార్ జైలులో ఉన్నారు. వీరి తాత్కాలిక బెయిల్‌కుగాను రూ.5 వేల కోట్లను కోర్టుకు డిపాజిట్ చేయాలని, మరో రూ. 5వేల కోట్లు సెబీ పేరుతో బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని ధర్మాసనం నిర్దేశించింది. ఇంత మొత్తం చెల్లించలేమని సహారా గురువారం ధర్మాసనానికి విన్నవించింది. ఇలాంటి రూలింగ్ తప్పని, రాయ్‌ని జైలులో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని గ్రూప్ దాఖలు చేసిన రిట్‌పై వాదనలు ఏప్రిల్ 3కు వాయిదా పడ్డాయి. -
ఇన్ఫోసిస్‌కు మరో ఉన్నతాధికారి గుడ్‌బై
బెంగళూరు: ఇన్ఫోసిస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు చంద్రశేఖర్ కాకాల్ తన పదవికి రాజీనామా సమర్పించారు. ఏప్రిల్ 18 నుంచి రాజీనామా అమల్లోకి రానుంది. ఇన్ఫోసిస్ సారథ్య బాధ్యతలను నారాయణమూర్తి తిరిగి చేపట్టిన నాటినుంచి వైదొలగిన ఉన్నతాధికారుల్లో కాకాల్ తొమ్మిదో వారు. కాకాల్ బుధవారం రాజీనామా సమర్పించగా, ఈ విషయాన్ని కంపెనీ గురువారం వెల్లడించింది. ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్లుగా బి.జి.శ్రీనివాస్, ప్రవీణ్ రావులకు పదోన్నతి ఇచ్చిన సందర్భంలో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికి కాకాల్ పోటీపడే అవకాశముందనే వాదనలు విన్పించాయి. 1999లో ఇన్ఫోసిస్‌లో చేరిన కాకాల్... అప్లికేషన్, టెస్టింగ్, ఇన్ఫ్రా డెవలప్మెంట్ సర్వీసెస్, కన్సల్టింగ్, మార్కెటింగ్ వంటి వివిధ విభాగాల్లో సేవలందించారు. కంపెనీ డెలివరీ కేపబిలిటీస్లో దాదాపు 95 శాతాన్ని ప్రవీణ్ రావుకు అప్పగించడంతో తనను చిన్నచూపు చూశారని కాకాల్ భావించి, రాజీనామా చేసి ఉండవచ్చని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఆయన సొంత కంపెనీ స్థాపించే ఆలోచనలో ఉన్నారనీ, అందుకోసమే ఫండ్ కంపెనీలతో చర్చిస్తున్నారనే వదంతులు రెండు మూడు వారాల క్రితం విన్పించాయి. -
పారిశ్రామిక ఉత్పత్తి.. స్వల్ప ఊరట
న్యూఢిల్లీ: కొంచెం ఊరటనిస్తూ... జనవరిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధిబాటలోకి ప్రవేశిం చింది. మూడు నెలలపాటు అసలు వృద్ధిలేకపోగా, క్షీణతలో ఉన్న ఈ సూచీ 2014 జనవరిలో స్వల్పంగా 0.1% వృద్ధిని (2013 జనవరితో పోల్చితే) నమోదుచేసుకుంది. విద్యుత్, మైనింగ్ రంగాలు ఈ సానుకూల ఫలితానికి కొంత కారణం. కాగా మొత్తం సూచీలో 75% వాటా ఉన్న తయారీ రంగం మాత్రం ఇంకా నీరసంగానే ఉంది. రంగాల వారీగా ... విద్యుత్ ఉత్పత్తి రంగం జనవరిలో 6.5% వృద్ధిని నమోదుచేసుకుంది. 2013 జనవరిలో ఈ రేటు 6.4%. మొత్తం ఐఐపీలో 14% వాటా కలిగిన మైనింగ్ రంగం జనవరిలో (-) 1.8% క్షీణబాట నుంచి 0.7% వృద్ధిలోకి మళ్లింది. తయారీ రంగం 2.7 శాతం వృద్ధి నుంచి 0.7 క్షీణతలోకి జారింది. వినియోగ వస్తువుల రంగం 2.5 శాతం వృద్ధి నుంచి 0.6 శాతం క్షీణతలోకి పడిపోయింది. క్యాపిటల్ గూడ్స్ రంగంలో క్షీణత మరింత పెరిగింది. ఇది -2.5 శాతం క్షీణత నుంచి - 4.2 క్షీణతలోకి జారింది. ఊహించిన విధంగానే... తాజా గణాంకాలపై ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ సీ రంగరాజన్ మాట్లాడుతూ, ఐఐపీ తాజా గణాంకాలు ఊహించిన విధంగానే ఉన్నాయన్నారు. ఫిబ్రవరి-మార్చి నెలల్లో తయారీ రంగం క్రియాశీలత మెరుగుపడాల్సి ఉందని పేర్కొన్నారు. -
ఫార్చూన్ ప్రశంసనీయ కంపెనీల్లో...టాటా స్టీల్, ఓఎన్జీసీ
న్యూయార్క్: ప్రపంచ అత్యంత ప్రశంసనీయ కంపెనీల జాబితాలో రెండు భారతీయ కంపెనీలు-టాటా స్టీల్, ఓఎన్‌జీసీలకు చోటు లభించింది. ఫార్చూన్ మ్యాగజైన్ 350 గ్లోబల్ కంపెనీలతో ఈ జాబితాను రూపొందించింది. వరుసగా ఏడో ఏడాది కూడా యాపిల్ కంపెనీయే ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా టాటా స్టీల్, ఓఎన్జీసీలు టాప్ 50లో చోటు సంపాదించలేకపోయాయి. అగ్రశ్రేణి మెటల్ కంపెనీల జాబితాలో నాలుగో స్థానంలో టాటా స్టీల్ నిలిచింది. గత ఏడాది జాబితాలో ఈ కంపెనీ ఆరో స్థానంలో నిలిచింది. గతేడాది మైనింగ్, ముడి చమురు ఉత్పత్తి కేటగిరిలో పదో స్థానంలో నిలిచిన ఓఎన్జీసీ ఈ ఏడాది ఏడో స్థానానికి ఎగబాకింది. అంతర్జాతీయ అగ్రశ్రేణి ప్రశంసనీయ కంపెనీల జాబితాలో రెండో స్థానంలో ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ డాట్‌కామ్ నిలిచింది. ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ 3వ స్థానం, వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్వే నాలుగో స్థానంలో ఉన్నాయి. ఇక ఆ తర్వాతి స్థానాల్లో కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్ (5వ స్థానం), కోకకోలా(6)లు ఉన్నాయి. ఈ జాబితాలో చోటు సాధించిన ఇతర కంపెనీలు, నైక్ (13వ స్థానం), ఐబీఎం(16), మైక్రోసాఫ్ట్(24), వాల్‌మార్ట్(28), జేపీ మోర్గాన్ చేజ్(30), గోల్డ్‌మాన్ శాచ్స్(34), ఫేస్బుక్(38), పెప్సికో(42వ స్థానం). -
ఫండ్స్ పథకాలపట్లా ఆసక్తి చూపాలి
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను వినియోగించుకోవడంలో విజయవంతమైన బీమా రంగ కంపెనీల బాటలో మ్యూచువల్ ఫండ్స్ కూడా ప్రయాణించాలని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సూచించింది. అయితే ఇందుకు ప్రధానంగా ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకులు సహకరించాలని పేర్కొంది. తద్వారా ఫండ్ పథకాల విక్రయంలో పీఎస్‌యూ బ్యాంకులు ప్రముఖ పాత్రను పోషించేందుకు వీలుచిక్కుతుందని అభిప్రాయపడింది. బీమా పథకాల పంపిణీలో బ్యాంకింగ్ నెట్వర్క్ విజయవంతమైన నేపథ్యంలో సెబీ సూచనలకు ప్రాధాన్యత ఏర్పడింది. సంప్రదాయ బ్యాంకింగ్ ప్రొడక్ట్లకుతోడు థర్డ్‌పార్టీ బీమా పథకాల విక్రయంలో బ్యాంకులు భారీ విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే మ్యూచువల్ ఫండ్స్ పథకాల విషయంలో ఇది ప్రతిబింబించడంలేదని సెబీ వ్యాఖ్యానించింది. బ్యాంకుల ద్వారా ఫండ్ పథకాల విక్రయం పుంజుకోవాలంటే పీఎస్‌యూ బ్యాంకులే చొరవ చూపాల్సి ఉంటుందని సూచించింది. భారీగా విస్తరించిన బ్రాంచీల ద్వారా బ్యాంకులు ఫండ్ పథకాల పంపిణీకి జోష్ తీసుకురాగలవని సెబీ ప్రతిపాదనలలో పేర్కొంది. ఈ ప్రతిపాదనలను సెబీ బోర్డు ఇటీవల ఆమోదించిన సంగతి తెలిసిందే. -
ఇటు ఆదా..అటు ఆదాయం
స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టనివారు మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవటం కొత్తేమీ కాదు. కాకపోతే ఆ ఫండ్స్‌లో కూడా పన్ను మినహాయింపులిచ్చేవి ఉన్నాయి.అంటే ఆ ఫండ్స్‌లో ఎంత పెట్టుబడి పెడితే అంత మొత్తాన్ని మనం ఆదాయపు పన్ను మినహాయంపు కోసం క్లెయిమ్ చేసుకోవచ్చన్న మాట. ఇప్పటిదాకా ఇలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే మొత్తానికి గరిష్టంగా రూ.లక్ష వరకు మాత్రమే మినహాయింపు వస్తోంది. దాన్ని రెట్టింపు చేయాలని, రూ.2 లక్షలకు పెంచాలని తాజాగా సెబీ సూచించింది. ఇలా చేస్తే రిటైల్ మదుపరుల స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెరుగుతాయని అభిప్రాయపడింది. ఈ సూచనలు అమల్లోకి వస్తే... చిన్న మదుపరులకు డబుల్ ట్యాక్స్ బొనాంజానే!!. ఈ నేపథ్యంలో అసలు ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి? వీటిల్లో ఉండే లాభనష్టాలేంటీ? ఇవన్నీ వివరించేదే ఈ కథనం... స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను ప్రయోజనాలు పొందాలనుకునే వారికోసమే పుట్టాయి ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీంలు (ఈఎల్ఎస్ఎస్). వీటినే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌గా కూడా పిలుస్తుంటారు. అటు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ దానిపై వచ్చే లాభాలతో పాటు, ఇటు పన్ను ప్రయోజనాలను పొందే అవకాశం ఉండటమే కాక... మిగిలిన పథకాలతో పోలిస్తే వీటి లాకిన్ పీరియడ్ అతి తక్కువ కావడం ప్రధాన ఆకర్షణ. పీపీఎఫ్, ఎన్ఎస్సీ, బీమా, పోస్టాఫీసు వంటి అనేక పథకాలు ఉన్నప్పటికీ వీటి కాలపరిమితి కనిష్టంగా 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు ఉంటోంది. అదే కొన్ని బీమా పథకాల్లో అయితే 30 నుంచి 40 ఏళ్ల వరకు ఆగాల్సి ఉంటుంది. కాని ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌లో లాకిన్ పీరియడ్ కేవలం మూడేళ్లు. ఇన్వెస్ట్ చేసిన మొదటి మూడేళ్లు క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్‌గా ఉండి, లాకిన్ పీరియడ్ అయిన తర్వాత ఓపెన్ ఎండెడ్ పథకాలుగా మారుతాయి. అంటే మూడేళ్ల తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు వైదొలగొచ్చు. లేదా మరింత లాభాలను ఆశిస్తే కొనసాగవచ్చు. రాబడిపై హామీ ఉండదు... ఇవి కూడా మ్యూచువల్ ఫండ్సే కావటంతో ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అందించే రాబడిపై ఎలాంటి హామీ ఉండదు. సేకరించిన మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే లాభనష్టాలను ఇన్వెస్టర్లకు అందిస్తాయి. కొన్ని సందర్భాల్లో అసలు కూడా నష్టపోవాల్సి ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులను అందించే సాధనాల్లో ఈక్విటీలే ముందుంటాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. గడిచిన మూడేళ్లలో పలు ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ 8 నుంచి 13 శాతం రాబడిని అందిస్తే, గత ఏడాది కాలంలో 10 నుంచి 18 శాతం వరకు లాభాలను అందించాయి. ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మూడు సంవత్సరాల వరకు వైదొలిగే అవకాశం లేకపోవడంతో ఫండ్ మేనేజర్లు దీర్ఘకాలంలో మంచి రాబడిని అందించడానికి వీలుండే షేర్లలో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు లభిస్తుంది. రెండిందాలా లాభం ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం గరిష్టంగా లక్ష రూపాయల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఉదాహరణకు గరిష్ట ట్యాక్స్ శ్లాబ్ (30%)లో ఉన్న వారు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నేరుగా రూ.30,000 పన్ను ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా ఇవి లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్స్ విభాగంలోకి వస్తాయి కాబట్టి అందించే లాభాలపై కూడా ఎటువంటి పన్ను భారం ఉండదు. అదే బ్యాంకు డిపాజిట్లు అయితే వడ్డీని ఆదాయంగా పరిగణించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు సెబీ నిబంధనలు అమల్లోకి వస్తే రెండు లక్షల మేరకు పన్ను ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు దాదాపు అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌ను అందిస్తున్నాయి. వీటిని నేరుగా ఆయా ఫండ్ హౌస్‌లు లేదా ఆన్లైన్ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. లేదా దగ్గర్లోని మ్యూచువల్ ఫండ్ ఏజెంట్‌ను సంప్రదించవచ్చు. వీటిల్లో ఒకేసారిగా లేదా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో ప్రతి నెలా కొంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇలా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ప్రతి నెలా ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని కొత్త పెట్టుబడి కింద భావించి అక్కడ నుంచి 3 సంవత్సరాలు వేచి చూడాలి. ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి పాన్ కార్డు తప్పనిసరి.- సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం పథకం పేరు 3 ఏళ్లలో వృద్ధి% యాక్సిస్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ 13 బీఎన్పీ ట్యాక్స్ అడ్వాంటేజ్ 10 హెచ్డీఎఫ్సీ ట్యాక్స్ అడ్వాంటేజ్ 8 ఎడల్విస్ ఈఎల్ఎస్ఎస్ 8 రెలిగేర్ ట్యాక్స్ ప్లాన్ 8 పథకం పేరు ఏడాదిలో వృద్ధి యాక్సిస్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ 18 ఎడల్విస్ ఈఎల్ఎస్ఎస్ 15 బీవోఐ ట్యాక్స్ అడ్వాంటేజ్ 12 ఐడీఎఫ్సీ ట్యాక్స్ అడ్వాంటేజ్ 10 సహారా ట్యాక్స్ గెయిన్ 10 -
టోకు ధరలూ దిగొచ్చాయ్!
న్యూఢిల్లీ: రిటైల్ ధరల తరహాలోనే జనవరిలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం స్పీడ్ కూడా తగ్గింది. ఈ రేటు ఎనిమిది నెలల కనిష్ట స్థాయిలో 5.05 శాతంగా నమోదయ్యింది. అంటే 2013 జనవరితో పోల్చితే 2014 జనవరిలో టోకు ధరలు పెరుగుదల రేటు 5.05 శాతం అన్నమాట. 2013 మేలో 4.58 శాతంగా ఉన్న టోకు ద్రవ్యోల్బణం తరువాత దాదాపు ఇదే స్థాయి దరిదాపులకు రావడం ఇదే తొలిసారి. రెండు నెలల నుంచీ క్రమంగా టోకు ధరల సూచీ తగ్గుతూ వస్తోంది. నవంబర్‌లో ఈ రేటు 7.52 శాతంకాగా, డిసెంబర్లో ఈ రేటు 6.16 శాతం. నిత్యావసర ఉత్పత్తుల ధరల వేగం తగ్గుతుండడం దీనికి కారణం. జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం రెండేళ్ల కనిష్ట స్థాయిలో 8.79 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. అయితే పారిశ్రామిక ఉత్పత్తిలో మాత్రం అసలు వృద్ధి లేకపోగా క్షీణత (నవంబర్‌లో -0.6 శాతం)లో ఉంది. ఏప్రిల్ 1వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. 3 ప్రధాన విభాగాలు ఇలా... ఆహార, ఆహారేతర ఉత్పత్తులతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్(వెయిటేజ్ 21%) విభాగం రేటు జనవరిలో 6.84%గా ఉంది.(డిసెంబర్లో 10.78%) ఇంధనం, విద్యుత్ విభాగం (15 శాతం వెయిటేజ్) ద్రవ్యోల్బణం రేటు 10.03 శాతం (డిసెంబర్లో 10.98 శాతం). మొత్తం సూచీలో దాదాపు 64 శాతం వెయిటేజ్ వాటా ఉన్న కోర్ గ్రూప్ (తయారీ రంగం) ద్రవ్యోల్బణం (డిసెంబర్లో 2.64 శాతం) విషయానికి వస్తే ఈ రేటు జనవరిలో డిసెంబర్లో రేటుకన్నా స్వల్పంగా పెరిగి 2.76 శాతంగా నమోదయ్యింది. ఆహార ఉత్పత్తుల బాస్కెట్... కాగా మొత్తం ఆహార ఉత్పత్తుల బాస్కెట్‌ను చూస్తే, జనవరిలో ఈ పెరుగుదల రేటు 8.8%గా ఉంది. డిసెంబర్లో ఈ రేటు 13.68%. కూరగాయల విషయంలో పెరుగుదల రేటు 16.6%గా ఉంది. డిసెంబర్లో ఈ రేటు 57.33%. ఉల్లిపాయల పెరుగుదల రేటు 39.56% నుంచి 6.59%కి తగ్గింది. ఆలూ పెరుగుదల రేటు భారీగా తగ్గి 21.73%గా (డిసెంబర్లో 54.65%) నమోదయ్యింది. పాలు, పాల ఉత్పత్తుల ధరల స్పీడ్ స్వల్పంగా పెరిగి 6.93% నుంచి 7.22%కి చేరాయి. పండ్లు, ప్రొటీన్ ఆధారిత గుడ్లు, చేపలు, మాంసం ధరలు మాత్రం 2013 జనవరితో పోల్చితే, 2014 జనవరిలో కొంచెం తగ్గాయి. రేట్ల కోతకు సమయం: పరిశ్రమలు ప్రస్తుత ద్రవ్యోల్బణం పరిస్థితి పాలసీ రేట్ల కోతకు సానుకూలంగా ఉందని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ పేర్కొన్నారు. వృద్ధి లక్ష్యంగా వడ్డీరేట్ల కోత అంశాన్ని ఆర్బీఐ సానుకూల దృష్టితో పరిశీలించాలని కోరారు. పారిశ్రామిక ఉత్పత్తి క్షీణదశలో ఉన్నందున దీని పునరుత్తేజానికి రెపో రేటు కోత తప్పదని పీహెచ్డీ చాంబర్ ప్రెసిడెంట్ శరద్ జైపూరియా అన్నారు. పెట్టుబడులు, డిమాండ్ మెరుగుపడ్డానికి... ఆర్థికాభివృద్ధికి ఊతం ఇవ్వడానికి రేట్ల కోత తప్పదని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. తయారీ, చిన్న పరిశ్రమల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఫిక్కీ అధ్యక్షుడు సిద్ధార్థ బిర్లా అన్నారు. -
ఇంకాస్త దిగొచ్చిన రిటైల్ ధరలు
న్యూఢిల్లీ: రిటైల్ ధరల వేగం వరుసగా రెండవ నెల జనవరిలో కూడా తగ్గింది. నవంబర్‌లో 11.16 శాతం ఉన్న రేటు- డిసెంబర్లో 9.87 శాతానికి పడగా, తాజాగా జనవరిలో మరింత కిందకు దిగి 8.79 శాతంగా నమోదయ్యింది. అంటే వార్షిక ప్రాతిపదికన ఆయా నెలల్లో ధరల పెరుగుదల రేటు కిందకు తగ్గుతూ వచ్చిందన్నమాట. జనవరి రేటు రెండేళ్ల కనిష్ట స్థాయి. మొత్తంగా చూస్తే- ఆహారం, ఆల్కాహాలేతర పానీయాల ధరలు 9.9 శాతం పెరిగాయి. ఇంధనం, లైట్ విభాగానికి సంబంధించి ద్రవ్యోల్బణం 6.54 శాతంగా నమోదయ్యింది. దుస్తులు, పాదరక్షలు, బెడ్డింగ్ కేటగిరీలో ఈ పెరుగుదల రేటు 9.18 శాతంగా ఉంది. నిత్యావసర వస్తువుల్లో చమురు, కొవ్వు పదార్థాలు (-0.35 శాతం), చక్కెర (-5.51 శాతం) మినహా దాదాపు అన్ని విభాగాల్లో రేట్లు పెరిగాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో... కాగా జనవరిలో పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 9.43 శాతంగా నమోదుకాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు 8.09 శాతంగా ఉంది. డిసెంబర్లో ఈ రేట్లు వరుసగా 10.49 శాతం, 9.11 శాతంగా ఉన్నాయి. ఇదిలావుండగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు రేపు (14వ తేదీ శుక్రవారం) విడుదలయ్యే అవకాశం ఉంది. -
ఐఓసీలో 10 శాతం వాటా ఓఎన్జీసీ, ఓఐఎల్ చేతికి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లో వాటాల విక్రయం లక్ష్యానికి గడువు దగ్గరపడుతుండటంతో కేంద్రం తన అస్త్రాలకు పదునుపెడుతోంది. ఈ ఏడాది(2013-14) డిజిన్వెస్ట్మెంట్లో తొలిసారిగా బ్లాక్ డీల్ రూపంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)లో వాటా విక్రయానికి ఓకే చెప్పింది. 10 శాతం వాటాను(24.27 కోట్ల షేర్లు) ఇతర పీఎస్‌యూ దిగ్గజాలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా(ఓఐఎల్)లకు విక్రయించే ప్రతిపాదనకు సాధికార మంత్రుల బృందం(ఈజీఓఎం) గురువారం ఆమోదముద్ర వేసింది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.4,800-5,000 కోట్లు రావచ్చని అంచనా. ఆర్థిక మంత్రి చిదంబరం నేతృత్వంలో జరిగిన ఈజీఓఎం భేటీలో ఈ మేరకు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ విలేకరులకు వెల్లడించారు. బ్లాక్ డీల్‌కు సంబంధించి విధివిధానాలను త్వరలోనే కొలిక్కి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. కాగా, ఓఎన్జీసీ, ఓఐఎల్ డెరైక్టర్ల బోర్డుల ఆమోదం అనంతరం వచ్చే వారంలో ఐఓసీ వాటా విక్రయ బ్లాక్ డీల్ ఉండొచ్చని చమురు శాఖ కార్యదర్శి వివేక్ రాయ్ పేర్కొన్నారు. గతేడాది జూన్ 30 నాటికి ఐఓసీలో కేంద్రానికి 78.92 శాతం వాటా ఉంది. వాస్తవానికి స్టాక్ మార్కెట్లో ఐఓసీ షేరు ధర ఉండాల్సినదానికంటే చాలా తక్కువ స్థాయిలో ఉందని.. అందువల్ల ఇప్పుడు వాటా విక్రయం వల్ల అటు కంపెనీకి, ఇటు ప్రభుత్వానికి నష్టమేనని పెట్రోలియం శాఖ విముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో వేలం(ఆఫర్ ఫర్ సేల్) రూపంలో 10% వాటా అమ్మకాన్ని వాయిదా వేశారు. అయితే, రూ.40 వేల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యానికి మరో రెండున్నర నెలలే గడువు మిగిలింది. ఇప్పటిదాకా ఏడు పీఎస్‌యూల్లో వాటా విక్రయం ద్వారా రూ. 3,000 కోట్లే లభించాయి. దీంతో చివరకు ఐఓసీలో బ్లాక్ డీల్‌కు ప్రభుత్వం మొగ్గుచూపినట్లు వివేక్ రాయ్ తెలిపారు. ఇప్పటికే తమకు ఐఓసీలో 8.77 శాతం వాటా ఉందని... ఇప్పుడు విక్రయించే 10% వాటాను ఓఐఎల్, తమ కంపెనీకి సమానంగా విభజించనున్నట్లు ఓఎన్జీసీ చైర్మన్ సుధీర్ వాసుదేవ చెప్పారు. గురువారం బీఎస్ఈలో ఐఓసీ షేరు ధర రూ.3.10(1.48%) లాభపడి రూ.212.05 వద్ద స్థిర పడింది. 52 వారాల గరిష్టస్థాయి రూ.375; కనిష్ట స్థాయి రూ. 186.20గా ఉంది. -
శాంతించిన టోకు ధరలు
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తరహాలోనే టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం కూడా డిసెంబర్ నెలలో తగ్గింది. 5 నెలల కనిష్ట స్థాయిలో 6.16 శాతంగా నమోదయ్యింది. అంటే 2012 డిసెంబర్‌తో పోల్చితే 2013 డిసెంబర్లో టోకు ధరల వేగం 6.16 శాతమన్నమాట. నవంబర్‌లో ఈ రేటు 14 నెలల గరిష్టం 7.52 శాతంగా ఉంది. రేట్ల కోతపై అంచనాలు! డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 9.87 శాతానికి (నవంబర్‌లో 11.16%)తగ్గడంతోపాటు, ఇప్పుడు టోకు ద్రవ్యోల్బణం కూడా కొంత తగ్గడంతో జనవరి 28న పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత నిర్ణయం తీసుకోవచ్చని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు. పారిశ్రామికోత్పత్తి క్షీణత(ఐఐపీ నవంబర్‌లో మైనస్ 2.1%), అదుపులోకి వచ్చిన కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) వంటి అంశాలు వడ్డీరేట్ల కోతకు వీలు కల్పిస్తుందనేది వారి వాదన. ప్రస్తుత పరిస్థితి పాలసీ రేట్ల కోతకు సానుకూలంగా ఉందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆర్బీఐ సానుకూల దృష్టితో పరిశీలించాలని కోరారు. అయితే ఒక్క ఆహార ఉత్పత్తుల ధరలను తీసుకుంటే ఇప్పటికీ వాటి ధరలు సామాన్యునికి అందుబాటులో లేవని, ఈ దృష్ట్యా రేట్ల కోత ఉండకపోవచ్చన్నది మరికొందరి నిపుణుల అంచనా. నిత్యావసరాల ధరల తీరు ఇలా... సూచీ మొత్తంలో 14.34 శాతం వాటా కలిగిన నిత్యావసర ఉత్పత్తుల టోకు ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదిక డిసెంబర్లో 13.68 శాతంగా నమోదయ్యింది. నవంబర్‌లో ఈ శాతం 19.93 శాతం. కూరగాయల ధరల పెరుగుదల రేటు 57.33 శాతం కాగా, నవంబర్‌లో ఈ రేటు 95.25 శాతంగా ఉంది. ఉల్లిపాయల ధరలు తగ్గడం మొత్తం కూరగాయల విభాగానికి కలసొచ్చిన అంశం. ఉల్లికి సంబంధించి ద్రవ్యోల్బణం 190.34 శాతం నుంచి 39.56 శాతానికి దిగివచ్చింది. అయితే ఆలూ ధర మాత్రం పెరిగింది. నవంబర్‌లో ఈ రేటు 26.71 శాతం కాగా, 54.65 శాతానికి ఎగసింది. పండ్ల ధరలు 9.07 శాతం పెరిగాయి. మొత్తం సూచీలో దాదాపు 64% వెయిటేజ్ వాటా ఉన్న కోర్ గ్రూప్ (తయారీ రంగం) ద్రవ్యోల్బణం డిసెంబర్లో 2.64% వద్ద స్థిరంగా(నవంబర్‌లో 2.64%) ఉంది.