న్యూఢిల్లీ: రిటైల్ ధరల తరహాలోనే జనవరిలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం స్పీడ్ కూడా తగ్గింది. ఈ రేటు ఎనిమిది నెలల కనిష్ట స్థాయిలో 5.05 శాతంగా నమోదయ్యింది. అంటే 2013 జనవరితో పోల్చితే 2014 జనవరిలో టోకు ధరలు పెరుగుదల రేటు 5.05 శాతం అన్నమాట. 2013 మేలో 4.58 శాతంగా ఉన్న టోకు ద్రవ్యోల్బణం తరువాత దాదాపు ఇదే స్థాయి దరిదాపులకు రావడం ఇదే తొలిసారి.
రెండు నెలల నుంచీ క్రమంగా టోకు ధరల సూచీ తగ్గుతూ వస్తోంది. నవంబర్‌లో ఈ రేటు 7.52 శాతంకాగా, డిసెంబర్‌లో ఈ రేటు 6.16 శాతం. నిత్యావసర ఉత్పత్తుల ధరల వేగం తగ్గుతుండడం దీనికి కారణం. జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం రెండేళ్ల కనిష్ట స్థాయిలో 8.79 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. అయితే పారిశ్రామిక ఉత్పత్తిలో మాత్రం అసలు వృద్ధి లేకపోగా క్షీణత (నవంబర్‌లో -0.6 శాతం)లో ఉంది. ఏప్రిల్ 1వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది.
3 ప్రధాన విభాగాలు ఇలా...
ఆహార, ఆహారేతర ఉత్పత్తులతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్(వెయిటేజ్ 21%) విభాగం రేటు జనవరిలో 6.84%గా ఉంది.(డిసెంబర్‌లో 10.78%)
ఇంధనం, విద్యుత్ విభాగం (15 శాతం వెయిటేజ్) ద్రవ్యోల్బణం రేటు 10.03 శాతం (డిసెంబర్‌లో 10.98 శాతం).
మొత్తం సూచీలో దాదాపు 64 శాతం వెయిటేజ్ వాటా ఉన్న కోర్ గ్రూప్ (తయారీ రంగం) ద్రవ్యోల్బణం (డిసెంబర్‌లో 2.64 శాతం) విషయానికి వస్తే ఈ రేటు జనవరిలో డిసెంబర్‌లో రేటుకన్నా స్వల్పంగా పెరిగి 2.76 శాతంగా నమోదయ్యింది.
ఆహార ఉత్పత్తుల బాస్కెట్...
కాగా మొత్తం ఆహార ఉత్పత్తుల బాస్కెట్‌ను చూస్తే, జనవరిలో ఈ పెరుగుదల రేటు 8.8%గా ఉంది. డిసెంబర్‌లో ఈ రేటు 13.68%. కూరగాయల విషయంలో పెరుగుదల రేటు 16.6%గా ఉంది. డిసెంబర్‌లో ఈ రేటు 57.33%. ఉల్లిపాయల పెరుగుదల రేటు 39.56% నుంచి 6.59%కి తగ్గింది. ఆలూ పెరుగుదల రేటు భారీగా తగ్గి 21.73%గా (డిసెంబర్‌లో 54.65%) నమోదయ్యింది. పాలు, పాల ఉత్పత్తుల ధరల స్పీడ్ స్వల్పంగా పెరిగి 6.93% నుంచి 7.22%కి చేరాయి. పండ్లు, ప్రొటీన్ ఆధారిత గుడ్లు, చేపలు, మాంసం ధరలు మాత్రం 2013 జనవరితో పోల్చితే, 2014 జనవరిలో కొంచెం తగ్గాయి.
రేట్ల కోతకు సమయం: పరిశ్రమలు
ప్రస్తుత ద్రవ్యోల్బణం పరిస్థితి పాలసీ రేట్ల కోతకు సానుకూలంగా ఉందని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ పేర్కొన్నారు. వృద్ధి లక్ష్యంగా వడ్డీరేట్ల కోత అంశాన్ని ఆర్‌బీఐ సానుకూల దృష్టితో పరిశీలించాలని కోరారు. పారిశ్రామిక ఉత్పత్తి క్షీణదశలో ఉన్నందున దీని పునరుత్తేజానికి రెపో రేటు కోత తప్పదని పీహెచ్‌డీ చాంబర్ ప్రెసిడెంట్ శరద్ జైపూరియా అన్నారు. పెట్టుబడులు, డిమాండ్ మెరుగుపడ్డానికి... ఆర్థికాభివృద్ధికి ఊతం ఇవ్వడానికి రేట్ల కోత తప్పదని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. తయారీ, చిన్న పరిశ్రమల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఫిక్కీ అధ్యక్షుడు సిద్ధార్థ బిర్లా అన్నారు.
టోకు ధరలూ దిగొచ్చాయ్!
Published Sat, Feb 15 2014 1:09 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM
Advertisement
Advertisement