సాక్షి, ముంబై: వర్షాలు ముఖం చాటేయడంతో రాష్ర్టంలోని కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. తత్ఫలితంగా నగరానికి ప్రతిరోజూ కూరగాయాల లోడుతో రావాల్సిన ట్రక్కులు, టెంపోల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో 20 శాతం మేర ధరలు పెరిగిపోయాయి. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)కి ప్రతి రోజూ పుణే, నాసిక్ జిల్లాల పరిసరాల నుంచి కూరగాయలు వస్తాయి. ఇవి ముంబై, ఠాణే, నవీముంబై ప్రాంతాలకు సరఫరా అవుతాయి.
వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా వర్షాల జాడ మాత్రం లేదు. దీంతో ఈ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేసిన విత్తనాలు భూమిలోనే ఎండిపోయాయి. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఉల్లిపాయలు గృహిణులకు కన్నీళ్లు రప్పిస్తున్నాయి. వారం క్రితమే కూరగాయల ధరలు పెరిగాయి. దీనికితోడు తాజాగా మరో 20 శాతం మేర పెరగడంతో సామాన్యుడి బడ్జెట్ పూర్తిగా తలకిందులైంది. మొన్నటివరకు ప్రతిరోజూ మార్కెట్‌కి 300-350 వరకు కూరగాయలు ట్రక్కులు రాగా , ప్రస్తుతం కేవలం 80-100 లోపే వస్తున్నాయి.
ఏపీఎంసీలో ఏదైనా కూరగాయ ధర కేజీకి ఐదు రూపాయలు పెరిగితే అవి కొనుగోలుదార్ల చెంతకు వచ్చేసరికి చిన్న వ్యాపారులు ఏకంగా మూడురెట్లు పెంచేస్తున్నారు. కొన్నిచోట్ల టమాటాలు మొన్నటి వరకు కేజీకి రూ.30 చొప్పున లభించాయి. సరుకు కొరత కారణంగా తాజాగా మరో ఐదు రూపాయల మేర వాటి ధర పెరిగింది. దీన్ని బట్టి కేజీకి రూ.35 చొప్పున విక్రయించాలి. అయితే చిన్న చిన్న వ్యాపారులు ఏకంగా రూ.50 విక్రయించి తమ జేబులను నింపుకుంటున్నారు. ఇవే టమాటాలు రెండు వారాలక్రితం టోకు మార్కెట్లో కేజీకి రూ.12 లభించాయి. వారం క్రితం రూ.22 చేరుకున్నాయి. తాజాగా టోకు మార్కెట్‌లో కిలో రూ.35 పలుకుతోంది. కూరగాయల ధరల పెరుగుదలతో పేదలే కాకుండా మధ్య తరగతి ప్రజలు కూడా సతమతమతున్నారు.
కొండెక్కిన ధరలు
Published Sun, Jul 6 2014 11:06 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM
Advertisement