
టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో కాస్తంత ఎగసి 2.38 శాతానికి చేరింది. జనవరి నెలకు ఇది 2.31 శాతంగా ఉంది. ఆహార వస్తువుల ధరలు, తయారీ, వెజిటబుల్ ఆయిల్, పానీయాల ధరలు పెరగడం ద్రవ్యోల్బణం పెరిగేలా చేసింది. దీంతో మూడు నెలల వరుస క్షీణతకు బ్రేక్ పడింది. ఆహారోత్పత్తుల ధరల ద్రవ్యోల్బణం 11.06 శాతానికి పెరిగింది.
వెజిటబుల్ ఆయిల్ ద్రవ్యోల్బణం 33.59 శాతానికి చేరింది. ఇక పానీయాలకు సంబంధించి 1.66 శాతానికి ఎగిసింది. తయారీ ఉత్పత్తుల టోకు ధరల సూచీ ఫిబ్రవరిలో 0.42 శాతం మేర పెరిగింది. కూరగాయల ధరల (బంగాళాదుంప సహా) ద్రవ్యోల్బణం జనవరిలో ఉన్న 74.28 శాతం నుంచి ఫిబ్రవరిలో 27.54 శాతానికి తగ్గింది. పాల ధరలకు సంబంధించి 5.40 శాతం నుంచి 1.58 శాతానికి దిగొచ్చింది. పండ్లకు సంబంధించి 20 శాతం, ఉల్లిపాయలకు సంబంధించి ద్రవ్యోల్బణం 48.05 శాతం చొప్పున ఇప్పటికీ గరిష్ట స్థాయిల వద్దే కొనసాగుతోంది.
ఇదీ చదవండి: మ్యూచువల్ ఫండ్స్‌లో అమ్మకాల సెగ
ఇంధనం, విద్యుత్ విభాగంలో ప్రతి ద్రవ్యోల్బణం (మైనస్ 0.71 శాతం) నమోదైంది. జనవరిలోనూ మైనస్ 2.78 శాతంగా ఉండడం గమనార్హం. రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో ఏడు నెలల కనిష్ట స్థాయి అయిన 3.61 శాతానికి తగ్గిపోవడం తెలిసిందే. పంటల దిగుబడి మెరుగ్గా ఉండడానికి తోడు, అధిక బేస్‌తో సమీప కాలంలో టోకు ద్రవ్యోల్బణం మరింత దిగొస్తుందన్న అభిప్రాయాన్ని ఇక్రా సీనియర్ ఆర్థికవేత్త రాహుల్ అగర్వాల్ వ్యక్తం చేశారు. 2025–26లో టోకు ద్రవ్యోల్బణం 2.5–3 శాతం మధ్య ఉండొచ్చన్నది ఇక్రా అంచనాగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment