టోకున ఆహార ధరలు భగ్గు..
♦ డిసెంబర్‌లో 8 శాతంపైకి..
♦ మొత్తం టోకు సూచీ మాత్రం
♦ ‘క్షీణత’లోనే; మైనస్ 0.73 శాతం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 14వ నెలలోనూ అసలు పెరక్కపోగా... క్షీణత (మైనస్)లో కొనసాగింది. డిసెంబర్‌లో -0.73 శాతంగా నమోదయ్యింది. అంటే 2014 డిసెంబర్‌తో పోల్చితే 2015 డిసెంబర్‌లో టోకు బాస్కెట్ రేటు మొత్తంగా అసలు పెరక్కపోగా... క్షీణించిందన్నమాట.
నవంబర్‌లో ఈ రేటు -1.99 శాతం. అయితే మొత్తం టోకు ధరల సూచీలో ఒక భాగమైన ఆహార ధరల విభాగం మాత్రం సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న వైనాన్ని గణాంకాలు ప్రతిబింబించాయి. ఈ ధరల స్పీడ్ డిసెంబర్‌లో ఏకంగా 8.17 శాతంగా నమోదయ్యింది. గడచిన ఏడాది కాలంలో పెరుగుదల ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి.
ఆహార ఉత్పత్తుల ధరలు భారీగా పెరగడం దీనికి కారణం. ఆహార ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే... రానున్న కొద్ది నెలల్లో సూచీ మొత్తం క్షీణతలోంచి బయటకు వస్తుందని అంచనా. 2014 నవంబర్ నుంచి క్షీణతలో కొనసాగుతున్న టోకు ద్రవ్యోల్బణం... ఆహార ధరల తీవ్రత దృష్ట్యా గడచిన నాలుగు నెలల నుంచి కొంచెంకొంచెంగా పైకి వస్తోంది.
ఆహార, ఆహారేతర ఉత్పత్తులతో కూడిన ఈ విభాగంలో రేటు 5.48% పెరిగింది. ఇందులో ఒక్క ఆహార ఉత్పత్తులను చూస్తే ఈ రేటు 8.17 శాతంగా ఉంది. నవంబర్‌లో ఈ రేటు 5.2%. పప్పు దినుసుల ధరలు వార్షికంగా చూస్తే... భారీగా 56% ఎగశాయి. ఉల్లి ధరలు 26% అధికంగా ఉన్నాయి. కూరగాయల ధరలు 21 శాతం ఎగశాయి.