
న్యూఢిల్లీ: ఉల్లి, బంగాళదుంప తదితర కూరగాయల ధరలు భారీగా పెరగడంతో డిసెంబర్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) ఎనిమిది నెలల గరిష్టానికి ఎగిసింది. 2.59 శాతంగా నమోదైంది. నవంబర్‌లో ఇది 0.58 శాతంగా ఉండగా, 2018 డిసెంబర్‌లో 3.46 శాతంగా నమోదైంది. 2019 ఏప్రిల్‌లో 3.24 శాతం తర్వాత మళ్లీ ఆ స్థాయి నమోదు కావడం డిసెంబర్‌లోనే కావడం గమనార్హం. డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం అయిదున్నరేళ్ల గరిష్టమైన 7.35 శాతంగా ఉన్న నేపథ్యంలో తాజాగా డబ్ల్యూపీఐ కూడా ఎగియడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆర్థిక సలహాదారు కార్యాలయం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం .. ఆహారపదార్థాల విభాగంలో కూరగాయల ధరలు అత్యధికంగా 69.69 శాతం ఎగిశాయి. ఉల్లి, బంగాళదుంప రేట్లే ఇందుకు కారణం. ఉల్లి రేటు 456 శాతం పెరగ్గా, బంగాళదుంప ధర 45 శాతం పెరిగింది. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని ఇటీవలి దాకా ఉల్లి రేటు చాలా ప్రాంతాల్లో రూ. 100 పైగా పలికిన సంగతి తెలిసిందే.
తాజాగా దిగుమతులతో పాటు కొత్త పంట కూడా చేతికి రావడంతో క్రమంగా ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆహార పదార్థాల ధరల పెరుగుదల నవంబర్‌లో 11 శాతంగా ఉండగా, డిసెంబర్‌లో 13.12 శాతంగా ఉంది. ఆహారేతర ఉత్పత్తుల ద్రవ్యోల్బణం నవంబర్‌లో నమోదైన 1.93 శాతంతో పోలిస్తే సుమారు నాలుగు రెట్లు పెరిగి 7.72 శాతంగా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment