Onion prices
-
మహాయుతికి ఉల్లిమంట
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉల్లి ధరలు సామాన్యులకు కంటతడి పెట్టిస్తుంటే మరోపక్క ప్రస్తుత మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతిలో భాగమైన అధికార పార్టీ నేతలకు మంట పుట్టిస్తోంది. ఓ పక్క పెరుగుతున్న ధరలతో సామాన్యులు అధికార కూటమి ప్రభుత్వంపై నిప్పులు గక్కుతున్నారు. ఎగుమతులపై నిషేధంతో తమకు గిట్టుబాటు తగ్గిందని రైతులు సైతం గగ్గోలు పెడుతుండటం మహాయుతి కూటమికి సంకటంగా మారింది.దేశీయ అవసరాలకు అవసరమైన ఉల్లిలో 40 శాతం మహారాష్ట్ర నుంచే సరఫరా అవుతుండగా, ప్రస్తుత సీజన్లో భారీ వర్షాల కారణంగా ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో మహారాష్ట్రలోని నాసిక్, లాసల్గావ్ మార్కెట్లకు తరలివస్తున్న ఉల్లి సరకు పరిమాణం బాగా తగ్గిపోయింది. గత సంవత్సరం ఉల్లిసీజన్లో ప్రతి రోజూ దాదాపు 2,000 టన్నుల ఉల్లి మార్కెట్‌వ వచ్చింది. అది ప్రస్తుతం 300–400 టన్నుల మధ్య తచ్చాడుతోంది. దీనికి తోడు గత రబీలో సేకరించి పెట్టిన ఉల్లి నిల్వలు పూర్తిగా అడుగంటడం ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. దీంతో గత నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి ధర కిలో రూ.40–50 నుంచి రూ.90–100కి ఎగబాకింది. దీని ప్రభావం మహారాష్ట్ర ఎన్నికలపై నేరుగా పడుతుందని ముందే పసిగట్టిన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ధరల కట్టడికి రంగంలోకి దిగింది. ధర మరీ పెరిగిపోకుండా కట్టడిచేసేందుకు 4.7లక్షల టన్నుల బఫర్ నిల్వలోంచి 1.50లక్షల టన్నుల మేర విడుదలచేసింది. దీంతో నాసిక్ నుంచి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లోని విక్రయ కేంద్రాల్లోకి ఉల్లి సరఫరా సాధ్యమైంది. వీటిల్లో కిలో ఉల్లిని రూ.35కే విక్రయిస్తున్నారు. అయినాసరే ధరల పెరుగుదల ఆగడం లేదు. ‘గత రబీ సీజన్‌లోని పాత స్టాక్ దాదాపు అయిపోయింది. కొత్త స్టాక్ ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఈ సరఫరా–డిమాండ్ అసమతుల్యత ధర పెరుగుదలకు కారణం. దీన్ని చక్కదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని మహారాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ధరల ఉరవడిపై మహా వికాస్ అఘాడీ కూటమిలోని కాంగ్రెస్, శివసేన(యూబీటీ) పార్టీలు షిండే సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఎగుమతుల నిషేధంపై రైతుల్లో ఆగ్రహం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. గడిచిన లోక్‌సభ ఎన్నికల సమయంలో డిసెంబర్ 2023 వరకు ఉన్న ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రప్రభుత్వం 2024 మార్చినెల వరకు పొడిగించింది. దీనికి తోడు ఎగమతి సుంకాలను 25 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. ఎగుమతి ఆంక్షలు తమ జీవనోపాధిని దెబ్బతీశాయని మహారాష్ట్ర రైతుల ఆవేదనవ్యక్తంచేస్తున్నారు. ఉల్లి సాగు అధికంగాఉండే ధూలే, దిండోరి, అహ్మద్‌నగర్, పుణె, నాసిక్‌లలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే మహారాష్ట్ర నుంచి ఎగుమతులను నిషేధించిన కేంద్రం తమ పార్టీ ఏలుబడిలో ఉన్న గుజరాత్ నుంచి మాత్రం ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని నిర్ణయించడంతో మహారాష్ట్ర రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ కారణంగానే ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో 12 ఎంపీ స్థానాల్లో మహాయుతి కూటమి ఓటమిని చవిచూసిందని విశ్లేషణలు వెలువడ్డాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సైతం లోక్‌సభ ఎన్నికల్లో మహాయుతి పేలవ ప్రదర్శన వెనుక ఉల్లి రైతుల ఆగ్రహం ఉందని అంగీకరించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం మహారాష్ట్రలోని ఉల్లి రైతుల కంటే గుజరాత్‌లోని ఉల్లి రైతుల గురించే పట్టించుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఉల్లి మంట నుంచి బయట పడేందుకు పాలక కూటమి ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందన్న దానిపైనే ఎన్నికల్లో సామాన్యులు, రైతుల సానుకూల, ప్రతికూల ఓటింగ్ సరళి ఆధారపడిఉంటుందని తెలుస్తోంది. -
పండగ వేళ కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు
రామచంద్రాపురం(పటాన్చెరు): అన్ని వంటకాల్లో వాడే ఉల్లిగడ్డ ధరలు రోజురోజుకూ పెరగడంతో ఉల్లిగడ్డ ప్రియులు వాటిని కొనాలంటేనే ఉలిక్కిపడుతున్నారు. ఒక్కసారిగా ఉల్లిగడ్డ ధరలు పెరగడంతో ప్రజలు, వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం హోల్‌సెల్‌లో చిన్న ఉల్లిగడ్డ ధర కిలో రూ.50, పెద్ద ఉల్లిగడ్డ కిలో రూ.70 ఉండగా బయట మార్కెట్లో కిలో రూ.85 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. ధరలు పెరగడంతో చాలా మంది ఉల్లి జోలికి పోవడంలేదు.ప్రధానంగా హోటల్లు, ఫాస్ట్‌పుడ్ సెంటర్లలో ఆహారంతోపాటు ఉల్లిగడ్డలను ఇస్తుంటారు. ధరలు పెరగడంతో దాని స్థానంలో కీరాను అందిస్తున్నారు. ఎక్కువగా ఉల్లిగడ్డలు మహారాష్ట్రలోని సోలాపూర్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ నుంచి దిగుమతి అవుతున్నాయి. ధరలు పెరగడంతో కూరగాయల వ్యాపారస్తులు కొద్దిరోజులుగా ఉల్లిగడ్డలను అమ్మడంలేదు. దాని వల్ల తమకు నష్టమే తప్ప లాభం రావడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద వ్యాపారస్తులు ఉల్లిగడ్డలను బ్లాక్ మార్కెట్ చేయడం వల్లే ధరలు పెరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. మరి కొందరు ప్రభుత్వం ధరలను నియంత్రించిలేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. వేసవిలో ఉల్లి ధర కిలో రూ.15 నుంచి రూ.18 వరకు ఉండేది. దానికి కారణం అదే సమయంలో ఉల్లి పంట రావడం వల్ల ధరలు తక్కువగా ఉంటాయని కూరగాయల వ్యాపారస్తులు చెబుతున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి పూర్తిస్థాయిలో ఉల్లిగడ్డ ధరలను నియంత్రించలేకపోతే పేదవాడు ఉల్లిఘాట్కు దూరంకావాల్సివస్తుంది. -
కొండెక్కుతున్న ఉల్లి ధర..
-
ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ఉల్లి ధర కిలో రూ.60 నుంచి రూ.80 వరకు ఉంది. ధరల కట్టడి చర్యల్లో భాగంగా ఈనెల 8 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఎగుమతులపై నిషేధం విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశీయంగా ఉల్లి సరఫరాను మెరుగుపరిచేందుకు, ధరలను అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొంది. -
పెరుగుతున్న ఉల్లి ఘాటు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉల్లి ఘాటెక్కుతోంది. ఉత్తర భారతంలోని ఢిల్లీ సహా ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో నవరాత్రులు ముగిసిన అనంతరం నుంచి ధరలు పెరుగుతున్నాయి. పది రోజుల కిందటి వరకు ఢిల్లీలో కిలో ఉల్లి ధర రూ.30–40 వరకు ఉండగా ఇప్పుడు రూ.60–70కి చేరుకుంది. ఈ ధర నవంబర్ తొలివారం ముగిసేనాటికి ఏకంగా రూ.100 మార్కును చేరే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఉల్లి సరఫరాలో కీలకంగా ఉన్న మహారాష్ట్రలోని నాసిక్ మార్కెట్లకు సరఫరా తగ్గిందని, ఈ కారణంగా ధరలు పెరుగుతున్నాయని వారు వాదిస్తున్నారు. ధరల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్ నుంచి 1.70 లక్షల టన్నుల ఉల్లి నిల్వలను మార్కెట్లోకి విడుదల చేసింది. మరింత స్టాక్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. శనివారం ఢిల్లీలోని 400 సఫల్ రిటైల్ స్టోర్లలో కేజీ ఉల్లి రూ.67కు విక్రయించారు. బుధవారం ఇవే స్టోర్లలో రూ.54–56 పలికిన కిలో ఉల్లి ఇప్పుడు హఠాత్తుగా పైకి ఎగిసింది. నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్(ఎన్సీసీఎఫ్), జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య(నాఫెడ్) సొంత ఔట్లెట్లు, వాహనాల్లో మాత్రం సబ్సిడీ రేటుకే కేజీ ఉల్లిని రూ.25కే విక్రయిస్తుండం విశేషం. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం శనివారం దేశవ్యాప్తంగా కేజీ ఉల్లి సగటు ధర రూ.45 మాత్రమే. -
రూ. 25కు కిలో ఉల్లి
న్యూఢిల్లీ: నానాటికీ పెరుగుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసి వినియోగదారులకు ఊరట కలి్పంచేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. శుక్రవారం ఉల్లి ధరలు దేశవ్యాప్తంగా కిలో ఏకంగా 47 రూపాయలకు చేరాయి. దాంతో గోదాముల్లోని అదనపు నిల్వలను కిలో రూ.25కే విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ముఖ్యంగా ఉల్లి ధర ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అదనపు నిల్వలను 25 రూపాయల సబ్సిడీ ధరకే టోకు, రిటైల్ మార్కెట్లలోకి విడుదల చేస్తున్నట్టు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రోహిత్‌కుమార్ సింగ్ తెలిపారు. ఇలా ఆగస్టు నుంచి ఇప్పటిదాకా 22 రాష్ట్రాల్లో ఏకంగా 1.7 లక్షల టన్నుల ఉల్లిని విడుదల చేసినట్టు వివరించారు. ఎన్సీసీఎఫ్, నాఫెడ్ ఆధ్వర్యంలో దుకాణాలు, వాహనాల ద్వారా సబ్సిడీ ధరకు ఉల్లిని అందుబాటులో ఉంచుతున్నారు. -
అత్యధిక రేటుకి ఉల్లిని కొంటాం: కేంద్రం
న్యూఢిల్లీ: టమాటా బాటలో ఉల్లి ధరలు పయనిస్తున్నాయి. ఉల్లి ధరలు భారీగా పెరిగిపోతూ ఉండడంతో వాటిని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉల్లిపై 40% ఎగమతి సుంకాన్ని విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై రైతులు నిరసనలకు దిగుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లిపాయలని క్వింటాల్‌కి రూ.2,410 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ చెప్పారు. మరోవైపు ఉల్లిపాయలు దొరకకపోతే, ధరలు ఎక్కువుంటే ఒక రెండు నుంచి నాలుగు నెలలు తినకపోతే వచ్చే నష్టమేమీ లేదని మహారాష్ట్ర మంత్రి దాదా భూసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ ఎవరికైనా అంత ధర ఇచ్చి కొనే శక్తి లేకపోతే వారు రెండు నుంచి నాలుగు నెలలు మానేయచ్చు. దాని వల్ల ఏం నష్టం లేదు’ అని వ్యాఖ్యానించారు. రైతులు, వ్యాపారుల ధర్నాతో మహారాష్ట్రలోని నాసిక్‌లోని ఉల్లిమార్కెట్ బోసిపోయింది. -
మండుతున్న ఉల్లి ధరలు
-
కిలో ఉల్లి 220, కిలో చికెన్ 383, మరి బియ్యం?
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఒక వైపు రుణ సంక్షోభం, రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం, మరోవైపు తరిగి పోతున్న విదేశీ నిల్వలతో మరింత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. దీంతో నిత్యావసరాల ధరలు చుక్కల్నంటుతున్నాయి. గోధుమ పిండి కొరతతో పాటు, బియ్యం, పాలు చమురు ధరలు 40-50 శాతంపెరిగాయి. దీంతో అక్కడి ప్రజల బాధలు అన్నీ ఇన్నీ కావు. (తీవ్ర ఆర్థిక సంక్షోభం: ఆహారం కోసం జనం పాట్లు, వైరల్ వీడియోలు) గత ఏడాది 36 రూపాయలు ఉన్న కిలో ఉల్లి ధర 501 శాతం పెరిగి రూ. 220 గా ఉంది. చికెన్ కిలో రూ.210 నుంచి రూ.383కి, పప్పుధాన్యం దాదాపు రూ.151 నుంచి రూ.228కి ఎగబాకాయి. తాజా లెక్కల ప్రకారం ఒక కిలో బాస్మతి బియ్యం 46 శాతం పెరిగి రూ.146 పలుకుతోంది. పాల ధరలు 30 శాతం పెరిగి దాదాపు రూ. 150కి చేరుకున్నాయి. 2022 డిసెంబరులో పాక్ ద్రవ్యోల్బణం 24.5 శాతానికి చేరుకుంది. ఇది భారతదేశం కంటే దాదాపు నాలుగు రెట్లు. అలాగే విదేశీ నిల్వలు ఎనిమిదేళ్ల కనిష్టం 5.576 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇది కేవలం మూడు వారాల దిగుమతులకు సరిపోతుంది. ఫలితంగా చమురును దిగుమతి చేసు కోవడానికి తగినంత నిల్వలు లేనందున ఇంధనాన్ని ఆదా చేయడానికి మార్కెట్లు, హాళ్లను త్వరగా మూసివేయాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశించవలసి వచ్చింది. విదేశీ రుణాలను చెల్లించడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం 13 బిలియన్ డాలర్లు అవసరం. ప్రపంచ బ్యాంక్ వార్షిక రుణ నివేదిక ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరం నాటికి పాకిస్థాన్ 33 బిలియన్ డాలర్ల అప్పులు చెల్లించాలి.అయితే ప్రస్తుతం 20 బిలియన్ డాలర్లు ఖాతాలో ఉన్నాయని, 2023 జూన్ నాటికి దేశానికి ఇంకా 13 బిలియన్ డాలర్లు అవసరమని గత నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నర్ జమీల్ అహ్మద్ చెప్పారు. కాగా పాకిస్తాన్ పలు ప్రాంతాల్లో ప్రజలు గోధుమ పిండి కొరతను ఎదుర్కొంటున్నారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా సింధ్ ప్రావిన్స్‌ల వంటి అనేక ప్రాంతాల్లో తొక్కిసలాటలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. సింధ్‌లో, షహీద్ బెనజీరాబాద్‌లోని సక్రంద్ పట్టణంలోని ఒక పిండి మిల్లు వెలుపల జరిగిన తొక్కిసలాట, ఘర్షణలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. -
సబ్సిడీ ఉల్లి విక్రయాలు ప్రారంభం
సాక్షి, అమరావతి/సూర్యారావుపేట (విజయవాడ సెంట్రల్)/తాడేపల్లిగూడెం: రైతు బజార్లలో సబ్సిడీపై కిలో ఉల్లిపాయలను రూ.40కే విక్రయిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. జిల్లా కేంద్రాల్లోని రైతు బజార్లలో శనివారం నుంచి.. అన్ని రైతు బజార్లలో సోమవారం నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. విజయవాడ స్వరాజ్ మైదానం రైతు బజార్లో ఉల్లి విక్రయాలను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి 6 వేల క్వింటాళ్లను తెచ్చేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. గతంలోనూ రూ.60 కోట్ల భారం పడినా ప్రభుత్వమే సబ్సిడీపై ప్రజలకు అందించిందని గుర్తు చేశారు. దుకాణాల వద్ద ధరల బోర్డులు పెట్టాలని, అలా పెడుతున్నదీ లేనిదీ కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షించాలని కూడా సీఎం ఆదేశించారన్నారు. తాడేపల్లిగూడెం హోల్‌సేల్ మార్కెట్లో అధికారులు 140 టన్నులు కొనుగోలు చేశారు. కర్నూలు నుంచి వచ్చిన 2,881 బస్తాలనూ కొనుగోలు చేసి ప్రతి జిల్లాకు 10 టన్నుల చొప్పున తరలించారు. -
రేపటి నుంచి రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లోని రైతుబజార్లలో శుక్రవారం నుంచి సబ్సిడీ ధరపై ఉల్లిపాయలు విక్రయించనున్నారు. అధిక వర్షాలకు పంట దెబ్బతినడంతో ఉల్లి ధరలు మండిపోతున్నాయి. బుధవారం అనేక పట్టణాల్లోని రిటైల్ మార్కెట్లలో కిలో రూ.90 నుంచి రూ.100 వరకు అమ్మకాలు జరిగాయి. ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలుండటంతో రాష్ట్ర ప్రభుత్వం హోల్‌సేల్ మార్కెట్లో ఉల్లిపాయలు కొనుగోలు చేసి రైతుబజార్లలో సబ్సిడీ ధరకు విక్రయించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కర్నూలు, తాడేపల్లిగూడెం హోల్‌సేల్ మార్కెట్లలో ఉల్లిపాయలు కొనుగోలు చేయనుంది. ఆ మార్కెట్లలో ఎంతకు కొనుగోలు చేసినా రైతుబజార్లలో కిలో రూ.40కి అమ్మాలని నిర్ణయించింది. రెండోదశలో రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో ఉల్లిపాయలు అమ్మడానికి చర్యలు తీసుకుంటున్నామని మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్ ఎస్.ప్రద్యుమ్న చెప్పారు. -
త్వరలో రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లిపాయలు
సాక్షి, అమరావతి: రైతు బజార్లలో సబ్సిడీపై ఉల్లిపాయలు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఉల్లిపాయల ధర కిలో రూ.70 వరకు పలుకుతోంది. భారీ వర్షాలు, వరదల వల్ల ఈ ధర ఇంకా పెరిగే అవకాశాలుండటంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. గతేడాది లాగానే 40 వేల హెక్టార్లలో ఉల్లి పంటను రైతులు సాగు చేసినప్పటికీ, భారీ వర్షాల వల్ల దిగుబడి బాగా తగ్గిపోయింది. ఇదే పరిస్థితి మహారాష్ట్ర, కర్నాటకలోనూ ఉండటంతో ఉల్లి కొరత ఏర్పడింది. రాష్ట్రంలోని దిగుబడి సరిపోక.. వ్యాపారులు పలు రాష్ట్రాల నుంచి నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఉల్లి నిల్వలు లేకపోవడంతో రానున్న రోజుల్లో కిలో రూ.100 వరకు చేరుకునే అవకాశముందని మార్కెటింగ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం మార్కెట్లోని ధరలు, వస్తున్న ఉల్లి నిల్వలు తదితర అంశాలను వారు పరిశీలిస్తున్నారు. నాఫెడ్ నుంచి ఉల్లిని కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. గతేడాదిలాగే ఈ ఏడాది కూడా ధరల స్ధిరీకరణ నిధి నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తామని మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ ఎస్.ప్రద్యుమ్న తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌తో చర్చించిన తర్వాత విక్రయపు ధరపై నిర్ణయం తీసుకుంటామన్నారు. -
ఉల్లి ఘాటు!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా మళ్లీ ఉల్లి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. నెల రోజులుగా తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉల్లి సాగు గణనీయంగా చేస్తున్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో పంటలు దెబ్బతినడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. రాష్ట్రంలోనే నెల రోజుల కిందటితో పోలిస్తే ధర రెట్టింపయ్యింది. కిలో రూ.40 మేర పలుకుతోంది. పొరుగు నుంచి రావాల్సిన సరఫరా సగానికి తగ్గడమే ధరలు పెరగడానికి కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో విదేశాలకు ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఉల్లి ధరల నియంత్రణకు అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకునేందుకు కూడా కేంద్రం సిద్ధమవుతోంది. పంట నష్టంతో పెరిగిన ధరలు.. రాష్ట్రంలో ఉల్లి పంటల సాగు తక్కువే. ఆలంపూర్, గద్వాల, వనపర్తి, కొల్లాపూర్, నారాయణఖేడ్ ప్రాంతాల్లోనే సాగు ఎక్కువ. ఇవి రాష్ట్ర అవసరాలు తీర్చే అవకాశం లేకపోవడంతో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నుంచి దిగుమతి అయ్యే ఉల్లిపైనే ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటోంది. గత ఏడాది వర్షాలకు పంట దెబ్బతినడంతో దేశ వ్యాప్తంగా కిలో ఉల్లి ధర రూ.160కి చేరింది. తెలంగాణలో గరిష్టంగా రూ.170కి విక్రయాలు జరిగాయి. దీంతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించడం, యాసంగిలో ఉల్లి సాగు గణనీయంగా పెరగడంతో ధరల నియంత్రణ సాధ్యమైంది. దేశంలో లాక్డౌన్ విధించే నాటికి కిలో ఉల్లి ధర రూ.10–15కి మధ్యకి చేరింది. లాక్డౌన్ సమయంలోనూ కూరగాయల ధరలు పెరిగినా ఉల్లి ధర మాత్రం కిలో రూ.20 దాటలేదు. అయితే కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీల్లో.. ఆగస్టు నుంచి కురుస్తున్న వర్షాలతో పంటలు మళ్లీ దెబ్బతిన్నాయి. దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో నెల రోజుల కింద బహిరంగ మార్కెట్లో కిలో రూ.15–20 పలికిన ధర ప్రస్తుతం రూ.35–40కి చేరింది. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రాల నుంచి సరఫరా క్రమంగా తగ్గుతోంది. ఈ నెల 7న పొరుగు నుంచి 5,479 క్వింటాళ్ల గ్రేడ్–1 ఉల్లి్ల బోయిన్ పల్లి మార్కెట్‌కు రాగా, అది 12వ తేదీ నాటికి 3,424 క్వింటాళ్లు, 14న 2,835 క్వింటాళ్లు, 15న మంగళవారం 2,400 క్వింటాళ్లకు తగ్గింది. ఇక, రాష్ట్రీయంగా వచ్చే గ్రేడ్–2 ఉల్లి సైతం ఈ నెల 7న 8,719 క్వింటాళ్ల మేర రాగా, అది 12న 5,136, 14 నాటికి 4,252, 15న 1,600 క్వింటాళ్లకు పడిపోయింది. 15 రోజుల కిందట గ్రేడ్–1 ఉల్లి ధర హోల్‌సేల్‌లో క్వింటాల్‌కు రూ.1300–1500 ఉండగా, అది ఇప్పుడు రూ.30వేలకు చేరింది. మంగళవారం బోయిన్ పల్లిలో మహారాష్ట్ర నుంచి వచ్చిన మేలు రకం ఉల్లి ఏకంగా క్వింటాకు రూ.3,600 పలికింది. రాష్ట్రీయంగా వస్తున్న ఉల్లి సైతం ఈ నెల ఒకటిన హోల్‌సేల్‌లో క్వింటాకు రూ.700–800 ఉండగా, అది ఇప్పుడు రూ.2000కు చేరింది. ఈ ధరలకు అనుగుణంగా బహిరంగ మార్కెట్లో ధర కిలో రూ.20 నుంచి రూ.40కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రానికి సరఫరా తగ్గుతున్న క్రమంలో ధరల్లో పెరుగుదల ఉండవచ్చని మార్కెటింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎగుమతులపై నిషేధం.. రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం గత ఏడాది మాదిరి ధరలు పెరగకుండా నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టింది. విదేశాలకు ఉల్లి ఎగమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీఎఫ్టీ) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం నిర్ణయంతో బంగ్లాదేశ్, శ్రీలంకలకు ఉల్లి ఎగుమతులు తక్షణమే నిలిచిపోతున్నాయి. ఇక ధరల పెరుగుదలను బట్టి ఉల్లి నిల్వలపైనా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ధరలు భారీగా పెరిగితే వినియోగదారులకు ఉపశమనం కల్పించేందుకు 50 వేల టన్నుల బఫర్ స్టాక్‌ను కేంద్రం దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉంచే అవకాశాలను పరిశీలిస్తోందని ఆ వర్గాలు చెబుతున్నాయి. -
వెల్లువలా ఉల్లి! కిలో 10లోపే..
సాక్షి, సిటీబ్యూరో: ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభంతో ఉల్లి ధరలు పెరుగుతాయి. కానీ.. ఈ ఏడాది కొత్త ఉల్లి పంట మార్కెట్లకు రావడంతో హోల్‌సేల్ ధరలు భారీగా తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉల్లి ధరలు హోల్‌సేల్‌లో రూ.10 నుంచి రూ.15 దాటడంలేదని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి పెద్ద మొత్తంలో కొత్త ఉల్లి దిగుమతులు అవుతున్నాయి. గత ఏడాది ఇదే సీజన్లో కిలో ఉల్లి హోల్‌సేల్‌గా రూ.30 వరకు ఉండగా.. ఈ ఏడాది రూ.15లోపే పలుకుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. 60 లారీల ఉల్లి.. గత ఏడాది ఇదే సీజన్లో మలక్‌పేట్ మార్కెట్‌కు 34 లారీల ఉల్లి వచ్చింది. ఈసారి 60 లారీ ఉల్లి వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉల్లి ధరలు హోల్‌సేల్‌లో రూ.30 వరకు ఉండగా, ఈ ఏడాది పదిహేను రూపాయల లోపే ఉన్నాయని తెలిపారు. ఉల్లి ఎక్కువ మొత్తంలో దిగుమతులు జరగడంతో రిటేల్ మార్కెట్లో ధరలు రూ.15 నుంచి రూ.20 వరకు ఉన్నాయి. అదే గత ఏడాది రిటేల్ ఉల్లి ధరలు రూ.30 నుంచి రూ.40 వరకు ఉండేవి. పెరిగిన స్థానిక దిగుమతులు.. నగర ప్రజల ఉల్లి అవసరాలు దాదాపు 80 శాతం మహారాష్ట్ర నుంచి దిగుమతి అయ్యే ఉల్లితోనే తీరుతాయి. తాజాగా తెలంగాణలోని మహబూబ్‌నగర్, మెదక్‌తో పాటు ఇతర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ కర్నూలు, కర్ణాటక నుంచి ఉల్లి ఎక్కువగా దిగుమతి అవుతోంది. దీంతో ధరలు పెరగడంలేదు. మున్ముందు ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి దిగుమతులు భారీగా అవుతుండటం.. మార్కెట్లలో స్టోరేజీ సౌకర్యం లేకపోవడంతో హోల్‌సేల్ వ్యాపారులు ఎక్కువగా నిల్వ చేసుకుంటున్నారు. ఈ ఏడాది ధరలు సాధారణమే.. గత ఏడాదితో పోలీస్తే ఈసారి లోకల్ ఉల్లి మార్కెట్‌కు ఎక్కువగానే దిగుమతి అవుతోంది. గత ఏడాది మహారాష్ట్ర ఉల్లిపై ఆధారపడ్డాం. ఈ ఏడాది మెదక్, మహబూబ్‌నగర్‌తో పాటు కర్నూలు తదితర ప్రాంతాల నుంచి ఉల్లి ఎక్కువగా దిగుమతి అవుతోంది. పెద్ద ఉల్లిగడ్డ కిలో రూ.15 వరకు ధర పలుకుతోంది. చిన్నగడ్డకు రూ. 8 వరకు ఉంది. ఈ ఏడాది ఉల్లి ధరలు ఏమంత పెరగవు. కొత్త పంట రావడంతో ధరలు అదుపులోకి వచ్చాయి. గత ఏడాది కంటే ఈసారి దిగుమతులు రెట్టింపు అయ్యాయి. అదేవిధంగా లాక్‌డౌన్‌తో పాటు ఫంక్షన్స్, హోటల్స్ పూర్తి స్థాయిలో తెరుచుకొకపోవడంతో కూడా ఉల్లి వినియోగం అంతగా లేకుండాపోయింది. – దామోదర్, స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ,మలక్‌పేట్ మార్కెట్ -
ఉల్లి ధరల నియంత్రణలో ఏపీ కృషి భేష్
సాక్షి, అమరావతి: ఒక్కసారిగా పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించి సామాన్య ప్రజలకు అతి తక్కువ ధరకు అందజేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన కృషిని కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించింది. దేశవ్యాప్తంగా ఇటీవల ఉల్లి ధరలు రికార్డు స్థాయికి చేరగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు బజార్ల ద్వారా కిలో కేవలం రూ.25 చొప్పున అందించేలా చర్యలు చేపట్టడం తెలిసిందే. ఇప్పుడీ విషయాన్ని శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే–2019–20లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి భారీ ఎత్తున కొనుగోలు చేసి.. నష్టాలకు వెనుకాడకుండా వినియోగదారులకు సబ్సిడీ ధరకు విక్రయించడం ద్వారా ఉల్లి ధరలను అదుపు చేయడంలో తన వంతు కృషి చేసినట్లు ఆర్థిక సర్వే ప్రశంసలు కురిపించింది. హర్యానా, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలూ ఇదే రీతిలో తక్కువ ధరకే ఉల్లిని సరఫరా చేసినట్లు సర్వే వెల్లడించింది. అకాల వర్షాల వల్ల ఉల్లి పంట భారీగా దెబ్బతినడంతో ఖరీఫ్ దిగుబడి బాగా తగ్గిపోయిందని, దీంతో ఉల్లి ధరలు డిసెంబర్, 2019 నాటికి 455.8 శాతం పెరిగినట్టు పేర్కొంది. దేశంలో ఉల్లి సాగు అధికంగా జరిగే మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లలో పంట సాగు ఏడు శాతం మేరకు తగ్గిపోయినట్టు తెలిపింది. ఇదే సమయంలో సెప్టెంబర్–అక్టోబర్ మాసాల్లో వచ్చిన అకాల వర్షాల వల్ల ఉల్లి సాగైన మహారాష్ట్రలో 58 శాతం, కర్ణాటకలో 18 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో రెండు శాతం మేరకు పంట దెబ్బతిన్నట్టు పేర్కొంది. పెరిగిన ఉల్లి ధరలను తగ్గించడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుందని, ఎగుమతులపై ఆంక్షలు విధించడంతోపాటు 57,373 టన్నుల ముందస్తు నిల్వలను బయటకు తీసి విక్రయించినట్లు వివరించింది. వీటితోపాటు ఈజిప్ట్, టర్కీ వంటి దేశాల నుంచి ఎంఎంటీసీ ద్వారా దిగుమతి చేసుకొని నాఫెడ్ ద్వారా విక్రయించినట్లు తెలిపింది. ఇలా సరఫరా చేసిన ఉల్లిని కొనుగోలు చేసి వినియోగదారులకు విక్రయించడానికి ఆంధ్రప్రదేశ్ సత్వర చర్యలు చేపట్టినట్టు ఆర్థిక సర్వే పేర్కొంది. -
రూ. 22కే కిలో విదేశీ ఉల్లి
న్యూఢిల్లీ: విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిని కిలో రూ. 22 నుంచి రూ. 23కే రాష్ట్రాలకు విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి. ప్రస్తుతం ఇలా దిగుమతి చేసుకున్న ఉల్లిని కేంద్రం రూ. 58కి అమ్ముతోంది. అయితే తాజాగా ఉల్లి పంట చేతికి రావడం, రుచిలో దేశీ ఉల్లి బాగుండటంతో విదేశీ ఉల్లిని కొనుగోలు చేయడానికి రాష్ట్రాలు ముందుకు రాకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గత నవంబర్‌లో కేంద్రం విదేశాల నుంచి 14 వేల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసింది. అందులో నుంచి భారీస్థాయిలో ఉల్లి అమ్ముడుకుండా పోర్టుల వద్దే మిగిలిపోయింది. ఇలా మిగిలిప ఉల్లి కుళ్లిపోతుండటం, మార్కెట్లో దేశీ ఉల్లి అందుబాటులోకి రావడంతో కేంద్రం ఉల్లి ధరలు తగ్గించాలని నిర్ణయించింది. -
టోకు ద్రవ్యోల్బణానికి ఉల్లి సెగ
న్యూఢిల్లీ: ఉల్లి, బంగాళదుంప తదితర కూరగాయల ధరలు భారీగా పెరగడంతో డిసెంబర్లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) ఎనిమిది నెలల గరిష్టానికి ఎగిసింది. 2.59 శాతంగా నమోదైంది. నవంబర్‌లో ఇది 0.58 శాతంగా ఉండగా, 2018 డిసెంబర్లో 3.46 శాతంగా నమోదైంది. 2019 ఏప్రిల్‌లో 3.24 శాతం తర్వాత మళ్లీ ఆ స్థాయి నమోదు కావడం డిసెంబర్లోనే కావడం గమనార్హం. డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం అయిదున్నరేళ్ల గరిష్టమైన 7.35 శాతంగా ఉన్న నేపథ్యంలో తాజాగా డబ్ల్యూపీఐ కూడా ఎగియడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్థిక సలహాదారు కార్యాలయం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం .. ఆహారపదార్థాల విభాగంలో కూరగాయల ధరలు అత్యధికంగా 69.69 శాతం ఎగిశాయి. ఉల్లి, బంగాళదుంప రేట్లే ఇందుకు కారణం. ఉల్లి రేటు 456 శాతం పెరగ్గా, బంగాళదుంప ధర 45 శాతం పెరిగింది. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని ఇటీవలి దాకా ఉల్లి రేటు చాలా ప్రాంతాల్లో రూ. 100 పైగా పలికిన సంగతి తెలిసిందే. తాజాగా దిగుమతులతో పాటు కొత్త పంట కూడా చేతికి రావడంతో క్రమంగా ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆహార పదార్థాల ధరల పెరుగుదల నవంబర్‌లో 11 శాతంగా ఉండగా, డిసెంబర్లో 13.12 శాతంగా ఉంది. ఆహారేతర ఉత్పత్తుల ద్రవ్యోల్బణం నవంబర్‌లో నమోదైన 1.93 శాతంతో పోలిస్తే సుమారు నాలుగు రెట్లు పెరిగి 7.72 శాతంగా నమోదయ్యాయి. -
ఉల్లి బాంబ్ కల్లోలం
బంగారం, రియల్ ఎస్టేట్, షేర్‌మార్కెట్లను మరిపించేలా ఈ ఏడాది ఉల్లి ధర అమాంతం ఎగబాకింది. ఏడాది చివర ధరల లొల్లితో కిచెన్‌కు ఉల్లి దూరమైంది. ఒక దశలో కిలో ఉల్లి రూ. 200కు చేరి జనానికి కంటనీరు తెప్పించింది. ఉల్లి ఘాటు లేకుండానే వంటలు ముగించేస్తున్నామని గృహిణులు వాపోయారు. హోటళ్లు, రెస్టారెంట్లలోనూ ఉల్లి ఇచ్చేది లేదని తెగేసి చెబుతుంటే పురుష పుంగవులు ఆనియన్ లేకుండానే అయిందనిపించామని చెప్పుకొచ్చారు. హోటల్ మెనూలోంచి ఉల్లి దోశ మటుమాయమైంది. వంటకాల్లో ఉల్లి బదులు క్యాబేజీ వాడండంటూ మరికొందరు పాక నిపుణులు ఉచిత సలహాలూ పారేశారు. ఉల్లి వాడకం పూర్తిగా తగ్గించినా అమ్మకాలు పడిపోయినా ధర మాత్రం చుక్కలు చూస్తూనే ఉంది. వర్షాలు కురవడంలో జాప్యం, ఆ తర్వాత భారీ వర్షాలతో ఉల్లి దిగుబడులు గణనీయంగా తగ్గడంతో ఆనియన్ కాస్తా అందుబాటులో లేకుండా పోయింది. మార్కెట్లకు ఉల్లి సరఫరాలు తగ్గడంతో ధరలు అంతకంతకూ ఎగిశాయి. ఈ ఏడాది మార్చిలో కిలో ఉల్లి రూ. 40 కాగా ఇటీవల రూ 200కు చేరడంతో పదినెలల వ్యవధిలోనే దాదాపు ఐదు రెట్లు ఎగబాకింది. డబుల్ సెంచరీ.. గడిచిన ఏడాది మార్చి నుంచి ఘాటెక్కిన ఉల్లి డిసెంబర్ తొలి వారంలో ఏకంగా కిలోకు రూ.200 పలికింది. దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాలన్నింటా కిలో ఉల్లి రూ. 150కి చేరడంతో జనం తల్లడిల్లారు. ఆపై కిలోఉల్లి సెంచరీకి దిగివచ్చినా నేనింకా ఖరీదే అంటూ కళ్లనీళ్లు తెప్పిస్తునే ఉంది. ధరలు ఆకాశాన్ని అంటడంతో పలు చోట్ల ఉల్లిగడ్డల దోపిడీ ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. సినీ తారలు, సెలబ్రిటీలు సైతం ఉల్లి ధరలపై సెటైర్లు వేయడం, ఉల్లితో చేసిన ఆభరణాలను ప్రదర్శించడం పలువురి దృష్టిని ఆకర్షించింది. ఉల్లి సెగకు ప్రభుత్వాలు కుప్పకూలిన చరిత్ర కళ్లముందుంటడంతో కేంద్ర సర్కార్ తక్షణ చర్యలకు పూనుకుంది. ఎగుమతులపై నిషేధంతో పాటు ఉల్లి దిగుమతులపై దృష్టిసారించింది. దిగుమతులతో దిగివస్తోంది.. ఉల్లిలొల్లిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించడంతో పాటు టర్కీ, ఆప్ఘనిస్తాన్‌ల నుంచి ఉల్లి దిగుమతులకు ఆర్డరిచ్చింది. టర్కీ నుంచి 11 వేల మెట్రిక్ టన్నుల ఉల్లి దేశ రాజధాని ఢిల్లీకి రానుంది.ఆయా దేశాల నుంచి ఉల్లి దిగుమతులు మార్కెట్లకు చేరుకుంటుండటంతో ధరలు కొద్దిగా దిగివస్తున్నాయి. ఉల్లి కొరతను ఎదుర్కోవడానికి టర్కీ నుంచి మరో 12,500 టన్నులు దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఉల్లి లొల్లి కాస్త కుదుటపడుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఉల్లి ఘాటుతో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఏపీ ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిని రూ. 25కే అందుబాటులో ఉంచడంతో ప్రజలు ఊరట పొందారు. ఇక తాజా పంట కూడా త్వరలో మార్కెట్‌కు రానుండటంతో కొత్త ఏడాది ఆరంభంలోనే ఉల్లి ధరలు సాధారణ స్ధాయికి చేరతాయని అంచనా వేస్తున్నారు. -
చర్చలో ప్రధానాంశం ఉల్లిపాయే!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ నెల మొదటి వారంలో మూడు (3–5 తేదీల మధ్య) రోజులు నిర్వహించిన ద్రవ్య, పరపతి సమీక్షా సమావేశ మినిట్స్ వివరాలు గురువారం వెల్లడయ్యాయి. భారీగా పెరిగిన ఉల్లి ధరలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు మినిట్స్ వెల్లడించాయి. సెప్టెంబర్ నుంచీ ఉల్లి ధరలు తీవ్రంగా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో కేజీ ధర రూ.125 నుంచి రూ.150 వరకూ పలుకుతోంది. 2018 నవంబర్ ధరలతో పోల్చిచూస్తే, 2019 నవంబర్‌లో ఉల్లిపాయల ధర కేజీకి 175 శాతం పెరిగిందని స్వయంగా టోకు ధరల గణాంకాలు తెలిపాయి. టోకు ధర పెరుగుదల తీవ్రతే ఇంత ఉంటే, ఇక రిటైల్‌లో ఈ నిత్యావసర వస్తువు ధర పరిస్థితి ఊహించుకోవచ్చు. ఫిబ్రవరి నుంచీ వరుసగా ఐదు ద్వైమాసిక సమీక్షా సమావేశాల సందర్భంగా ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో రేటును 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. ఆర్థిక వృద్ధే లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయాలకు ధరలు కట్టడిలో ఉండడం ఊతం ఇచ్చింది. అయితే ఈ నెల మొదట్లో జరిగిన ద్వైమాసిక సమీక్షా సమావేశంలో మాత్రం రెపో రేటును యథాతథంగా ఉంచాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ధరల తీవ్రతే దీనికి ప్రధాన కారణం. ‘‘సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిత్యావసరాల ధరల భారీగా పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాల వల్ల ఖరీఫ్ పంట దెబ్బతినడం దీనికి కారణం’’ అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ పరపతి విధాన సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు. గవర్నర్ నేతృత్వంలోని ద్రవ్య విధాన పరపతి సమీక్షా కమిటీలోని ఆరుగురు సభ్యులూ రెపో రేటు యథాతథ పరిస్థితికి ఓటు చేసిన సంగతి తెలిసిందే. -
172% పెరిగిన ఉల్లిపాయల ధర
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్ గణాంకాలు వ్యవస్థలో మందగమన స్థితికి అద్దం పట్టాయి. ధరల స్పీడ్ కేవలం 0.58 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 నవంబర్‌లో టోకు ధరల బాస్కెట్‌తో పోల్చిచూస్తే, 2019 నవంబర్‌లో అదే బాస్కెట్ ధర కేవలం 0.58 శాతమే పెరిగిందన్నమాట. అయితే సామాన్యునికి సంబంధించి నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. ఉల్లిపాయ ధరలు వార్షికంగా చూస్తే, ఏకంగా 172 శాతం పెరిగాయి. ఈ ధరలూ పెరగకపోతే, టోకు ద్రవ్యోల్బణం క్షీణతలోకి జారిపోయేదని అంచనా. 2019 అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం 0.16 శాతం అయితే 2018 నవంబర్‌లో ఈ రేటు 4.47 శాతం. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో ధరల పెరుగుదల అసలు నమోదుకాలేదు. 2018 నవంబర్‌తో పోల్చితే 2019 నవంబర్‌లో ఈ బాస్కెట్ ధర –0.84 శాతం క్షీణించింది. 2018 నవంబర్‌లో ఈ రేటు 4.21 శాతం. ఇంధనం, విద్యుత్: సూచీలో దాదాపు 22 శాతం వెయిటేజ్ ఉన్న ఈ విభాగంలో కూడా ద్రవ్యోల్బణం –7.32 శాతం క్షీణించింది. గత ఏడాది నవంబర్‌లో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 15.54 శాతం. ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం భారీగా 7.68 శాతం పెరిగింది. 2018 నవంబర్‌లో ఈ రేటు 0.59 శాతం మాత్రమే. ఇక ఇందులోనూ నాన్–ఫుడ్ ఆర్టికల్స్ విభాగాన్ని చూసుకుంటే ద్రవ్యోల్బణం 6.40 శాతం నుంచి 1.93 శాతానికి తగ్గింది. సామాన్యుడిపై భారం... ఫుడ్ ఆర్టికల్స్ చూస్తే... 2018 నవంబర్‌లో అసలు ఈ విభాగంలో పెరుగుదల నమోదుకాకపోగా, –3.24 శాతం క్షీణతలో ఉంది. అయితే తాజా సమీక్షా నెల నవంబర్‌లో ఈ బాస్కెట్ ధర ఏకంగా 11.08 శాతం ఎగసింది. గడచిన 71 నెలల్లో ఈ స్థాయిలో ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడం ఇదే తొలిసారి. అక్టోబర్‌లో ఈ రేటు 9.80 శాతంగా ఉంది. ఉల్లిపాయల ధరలు 172 శాతం పెరిగితే, కూరగాయల విషయంలో ఈ ధర స్పీడ్ 45.32 శాతంగా ఉంది. పప్పు దినుసుల ధరలు టోకున 16.59 శాతం ఎగశాయి. -
ఇవి చాలా ఖరీదైన దండలు సుమా..!
వారణాసి : ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకాయి. ఉల్లి కోస్తేనే కాదు కొనాలంటే కూడా కన్నీళ్లు వస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలు ప్రజలను హడలెత్తిస్తుంటే.. సోషల్ మీడియాలో మాత్రం ఉల్లి నవ్వులు పూయిస్తుంది. నెటిజన్లు తమ క్రియేటివిటీ అంతా ఉల్లిపై చూపిస్తున్నారు. కామెడీ పండించే ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తూ ‘ఉల్లి’ జోకులు వేస్తున్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ పెళ్లి జంట ఏకంగా ఉల్లి, వెల్లుల్లి దండలనే మార్చుకొని అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు పెళ్లికి వచ్చిన అతిథులు కూడా వారికి ఉల్లిపాయల్ని గిఫ్టులుగా ఇచ్చారు. ఈ పెళ్లికి హాజరైన సమాజ్ వాదీ పార్టీ నేత కమల్ పటేల్ మాట్లాడుతూ..ఉల్లిధరలు దేశంలో ఎలా ఉన్నాయో జనాలకు సింబాలిక్‌గా తెలియజేసేందుకే వారు అలా ఉల్లిదండలను ధరించారని అందరూ అంటున్నారు. గత కొంతకాలం నుంచి ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. కిలో ఉల్లి రూ.120కి పైగా పలుతోందన్నారు. దీంతో ప్రజలు ఉల్లిపాయల్ని బంగారం కంటే ఎక్కువగా భావిస్తున్నారని అన్నారు. ఈ పెళ్లిలో వధూవరులు ఉల్లిపాయలు, వెల్లుల్లి దండలను మార్చుకుని వాటి రేట్లు ఎలా ఉన్నాయో ప్రదర్శించారని అన్నారు. మరో ఎస్పీ నేత సత్య ప్రకాష్ మాట్లాడుతూ..ఉల్లి రేట్లు అధికంగా ఉన్నందుకు వధూవరులిద్దరు ఈ రకంగా తమ నిరసనను తెలిపారని అన్నారు. ఉల్లికి వ్యతిరేకంగా ఇటువంటి కార్యక్రమాలను తమ పార్టీ నిరసనలు చేపడుతోందని తెలిపారు. కాగా, ఉల్లి ధరలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఇలాంటి వింత ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తమిళనాడుకు చెందిన ఓ నవ జంటకు పెళ్లి గిఫ్ట్‌గా రెండున్నర కిలోల ఉల్లిపాయలను అందించారు స్నేహితులు. కొన్ని కంపెనీలు తమ బిజినెస్‌ను పెంచుకునేందుకు కూడా ఉల్లిని వాడుకుంటున్నారు. తమిళనాడుకు చెందిన ఓ మొబైల్ కంపెనీ.. తమ కస్టమర్లకు కేజీ ఉల్లిని బహుమతిగా అందించాయి. కొన్ని చోట్ల కిలో చికెన్ కొంటే అరకిలో ఉల్లి ఫ్రీ అంటూ ఆఫర్లు ఇస్తున్నారు. -
ఉల్లి ధర ఇక్కడే తక్కువ : మంత్రి మోపిదేవి
సాక్షి, అమరావతి : మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలోనే ఉల్లి ధరలు తక్కువగా ఉన్నాయని మంత్రి మోపిదేవి వెంకటరమణారావు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ సమస్య నెలకొన్న తరుణంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించిందని వెల్లడించారు. ఉల్లి, ఇతర నిత్యావసర సరుకుల ధరలపై గురువారం శాసనమండలిలో స్వల్పకాలిక చర్చపై మంత్రి మోపిదేవి సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉల్లి కొరత, పెరిగిన ధరల కారణంగా వినియోగదారులపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి మంత్రి సభకు వివరించారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉల్లి సమస్య ఉన్నట్టు విపక్ష టీడీపీ విమర్శలకు దిగటాన్ని తప్పుబట్టారు. 2,100 టన్నులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం... ఉల్లి సాగు తగ్గడం, అధిక వర్షాల కారణంగా దిగుబడులు పడిపోవడంతో సెప్టెంబరు నుంచే దేశమంతా ధరలు పెరిగాయని మంత్రి మోపిదేవి పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లిని ప్రభుత్వం రూ.120 చొప్పున కొనుగోలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రజలపై భారం పడకుండా రూ.25కే అందజేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని వివరించారు. ఇప్పటివరకు 35 రోజుల పాటు 42,096 క్వింటాళ్ల ఉల్లిని మార్కెటింగ్ శాఖ రూ.25 చొప్పున పంపిణీ చేసినట్లు చెప్పారు. ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్రం రెండు లక్షల క్వింటాళ్లను ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకుంటోందని, ఈనెల 14 లేదా 15వ తేదీల్లో మన దేశానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. తద్వారా కొంత మేర ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. బయట నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లి కోసం మన రాష్ట్రమే అత్యధికంగా 2,100 మెట్రిక్ టన్నులు కావాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్‌యార్డులలో శుక్రవారం నుంచి రూ.25కే ఉల్లి విక్రయాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కాగా ఉల్లిపై స్వల్పకాలిక చర్చకు మంత్రి మోపిదేవి జవాబిస్తుండగానే టీడీపీ ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా సభ నుంచి నిష్క్రమించారు. -
ఉల్లి ధర: కేసీఆర్ సమీక్ష చేయాలి
సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో ఉల్లి ధరలు కొండెక్కడంతో.. ధరల నియంత్రణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమీక్ష చేసి, వెంటనే చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నార్సీ బిల్లును కేంద్రం అత్యవసరంగా ఆమోదించింది కానీ, నిత్యావసరాల ధరలను మాత్రం ఎందుకు నియంత్రించలేకపోతోందని విమర్శించారు. ఉల్లి ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేలేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతోనే ధరలు మరింతగా పెరుగుతున్నాయని, ధరలను నియంత్రించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఉల్లి బ్లాక్ మార్కెట్ తరలకుండా చేయడంతోపాటు ధరల స్థిరీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక లంబాడీలకు, ఆదివాసీలకు మధ్య నడుస్తున్న గొడవను బీజేపీ, టీఆర్ఎస్లు ప్రోత్సహిస్తున్నాయని మల్లు రవి ఆరోపించారు. -
ఏపీలో మాత్రమే కేజీ రూ. 25
సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే కేజీ ఉల్లి రూ.25 చొప్పున రైతు బజార్లలో ప్రజలకు అమ్ముతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో ఉల్లి ధరల అంశంపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు పోడియం చుట్టుముట్టి నానా యాగీ చేస్తున్న సందర్భంలో సీఎం స్పందించి మాట్లాడారు. ఇప్పటి వరకు 36,536 క్వింటాళ్ల ఉల్లిపాయలు కొనుగోలు చేసి ప్రతి రైతు బజారులోనూ కేజీ రూ.25 చొప్పున అమ్ముతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఉల్లిపాయలు దొరకనందున, ఎక్కడ దొరికినా కొనుగోలు చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. షోలాపూర్, ఆల్వార్ లాంటి చోట్ల నుంచి కూడా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఇదే చంద్రబాబు హయాంలో ఉల్లి పంట రైతులకు గిట్టుబాటు కాక, పొలాల్లోనే వదిలేసిన పరిస్థితులు చూశామని గుర్తు చేశారు. ‘ఇవాళ రైతులకూ మంచిరేటు లభిస్తోంది. మరోవైపు వినియోగదారులకు నష్టం రాకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుని తక్కువ ధరకు అమ్ముతున్నాం’ అని వివరించారు. హెరిటేజ్‌లో కిలో రూ.200 చంద్రబాబు హెరిటేజ్ షాపుల్లో కేజీ ఉల్లి రూ.200 చొప్పున అమ్ముతున్నారని సీఎం జగన్ విమర్శించారు. వీళ్లేమో (టీడీపీ) ఇక్కడకు వచ్చి.. పేపర్లు (ప్లకార్డు) పట్టుకుని దిగజారిపోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వీళ్లు చేసే పనులకు న్యాయం, ధర్మం అనేవి ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఉల్లి ధరలపై చర్చకు తాము సిద్ధమని, అదే విధంగా మహిళల భద్రత మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ‘దేశంలో సంచలనాత్మక పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహిళల భద్రత కోసం కొత్త చట్టాలు తీసుకొచ్చి ప్రజలకు విశ్వాసం, నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. ఉన్న చట్టాలు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయనే అంశంపై కూడా చర్చ జరగాలి. మహిళలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు.. వాళ్లకు భద్రత ఎలా పెంచాలన్న అంశంపైనా చర్చ జరగాలి’ అని సీఎం అన్నారు. -
‘హెరిటేజ్‌లో ధరలన్నీ అధికమే’
సాక్షి, అమరావతి: దేశమంతా ఉల్లి అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నా.. మన రాష్ట్రంలో కేజీకి రూ. 25లకే అందిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. ఆయన సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ప్రజలకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. ప్రభుత్వం రూ.150 నుంచి రూ. 200 వరకు ఉల్లిపాయలను కొనుగోలు చేసి ప్రజలకు కేవలం రూ. 25లకు అందిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కార్యాలయం నుంచి ప్రతిరోజు మార్కెటింగ్ శాఖ, ఎస్టేట్ అధికారులతో సమీక్షలు చేస్తున్నారని తెలిపారు. అధిక వర్షాభావం వలన ఉల్లిపాయల ఇబ్బందులు వచ్చాయని ధర్మశ్రీ వ్యాఖ్యానించారు. ఉల్లిని కావాలని స్టాక్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని ఆయన గుర్తుచేశారు. హెరిటేజ్‌లో ఉల్లిపాయల ధర రూ.200 ఉందని.. ప్రజలపై ప్రేమ ఉంటే హెరిటేజ్‌లో తక్కువ ధరకు ఉల్లిపాయలు ఎందుకు విక్రయించట్లేదని ప్రశ్నించారు. హెరిటేజ్‌లో నిత్యావసర వస్తువులు అన్నీ అధిక ధరలే.. మందు రేట్లు పెరిగితే మాత్రం చంద్రబాబు, లోకేష్‌కి భాదేస్తోందని ఎమ్మెల్యే ధర్మశ్రీ మండిపడ్డారు. అదే విధంగా హెరిటేజ్‌లో ఉల్లి అమ్మకాల ధరలకు సంబంధించిన ప్లకార్డులను కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మీడియాకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. హోదా కన్నా ప్యాకేజీనే ముద్దు అన్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాలుక ఎటుపడితే అటు మళ్లిస్తారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసుతో భయపడి పారిపోయింది చంద్రబాబు కాదా అని విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం తీరు చట్టవిరుద్ధంగా ఉందని ఎమ్మెల్యే మేరుగు నాగార్జున మండిపడ్డారు. -
హెరిటేజ్ షాపులో కిలో ఉల్లి రూ. 200: సీఎం జగన్
సాక్షి, అమరావతి: దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే కిలో ఉల్లిని రూ. 25కు అమ్ముతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉల్లి అందుబాటులో లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తూ ప్రజలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉల్లి ధరల అంశంపై సీఎం జగన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ... ఇప్పటిదాకా 36,500 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసి.. రైతు బజార్లలో కేజీ కేవలం రూ.25లకు అమ్ముతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉల్లిపాయలు దొరకడంలేదని షోలాపూర్, ఆల్వార్ లాంటి చోట్ల నుంచి ప్రభుత్వం ఉల్లి కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇంత తక్కువ ధరకు ఉల్లి అందుబాటులో ఉందని వెల్లడించారు. అదే చంద్రబాబు హయాంలో మాత్రం ఉల్లి పంట రైతులకు గిట్టుబాటు ధర లభించక.. పొలాల్లోనే వదిలేసిన పరిస్థితుల చూశామని సీఎం జగన్ గుర్తు చేశారు. ప్రస్తుతం తమ హయాంలో రైతులకు మంచిరేటు లభించడంతో పాటుగా.. వినియోగదారులకు కూడా నష్టం రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హెరిటేజ్‌లో కిలో ఉల్లి రూ.200 చంద్రబాబు హెరిటేజ్ షాపులో కేజీ ఉల్లి రూ.200లకు అమ్ముతున్నారని సీఎం జగన్ విమర్శించారు. వీళ్లేమో(టీడీపీ) ఇక్కడకు వచ్చి... పేపర్లు పట్టుకుని దిగజారిపోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వీళ్లు చేసే పనులకు న్యాయం, ధర్మం అనేవి ఉన్నాయా అని ప్రశ్నించారు. ఉల్లి ధరలపై చర్చకు తాము సిద్ధమని.. అదే విధంగా మహిళల భద్రత మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ అన్నారు. ‘దేశంలో సంచలనాత్మకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహిళల భద్రతకై కొత్త చట్టాలు తీసుకు వచ్చి ప్రజలకు విశ్వాసం, నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. ఉన్న చట్టాలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో అనే అంశంపై కూడా చర్చ జరగాలి. మహిళల భద్రత కోసం కొత్త చట్టం కూడా తీసుకు రాబోతున్నాం. దాని మీద అసెంబ్లీలో చర్చ జరగాలి’ అని పేర్కొన్నారు. -
ఉల్లి రిటైలర్ల మాయాజాలం
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా హోల్‌సేల్ మార్కెట్లో ఉల్లి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే ఈ మేరకు రిటైల్ మార్కెట్లో పలువురు వ్యాపారుల మాయాజాలం వల్ల ధర తగ్గడం లేదు. సామాన్యులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కొద్ది రోజులుగా మార్కెటింగ్, సివిల్ సప్లయిస్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగాలు ఉల్లి ధరలను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాయి. మరో వైపు మార్కెటింగ్ శాఖ మార్కెట్ ధరకు ఉల్లిని కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా కిలో రూ.25 చొప్పున విక్రయిస్తోంది. ఇప్పటి వరకు రూ.25 కోట్లు ఖర్చు చేసి 35 వేల క్వింటాళ్ల ఉల్లిని విక్రయించింది. ధరల స్ధిరీకరణ నిధి నుంచి రూ.16.50 కోట్లను సబ్సిడీ కింద భరించింది. మాయాజాలం ఇలా.. రాష్ట్రంలోని కర్నూలు, తాడేపల్లిగూడెం మార్కెట్లలో గడువులు, మీడియాలు, గోల్టా, గోల్టీ, పేళ్లు, రెమ్మలు అనే రకాల ఉల్లిపాయలు వస్తున్నాయి. ఇందులో గడువులు, మీడియాలు కొన్ని సందర్భాల్లో కిలో రూ.110 వరకు ధర పలికాయి. మిగిలిన రకాలు కిలో రూ.40 నుంచి రూ.60 ధర పలుకుతున్నాయి. వీటి సగటు ధర (40+60+110=210/3) రూ.70గా నిర్ణయిస్తారు. ఈ రకాలన్నింటినీ రిటైలర్లు హోల్‌సేల్ వ్యాపారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వీటిలో తక్కువ రేటు కలిగిన ఉల్లిని ఎక్కువగా కలిపి ఏ గ్రేడ్ రేటుకు అమ్ముతున్నారు. వీటి సగటు ధర కిలో రూ.70 ఉంటే రిటైలర్లు రూ.100 నుంచి రూ.110కి అమ్ముతూ లాభాలు పొందుతున్నారు. రిటైలర్ల క్రయ విక్రయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. కాగా, ప్రస్తుతం మంచి నాణ్యత కలిగిన ఉల్లికి కిలోకు రూ.80 నుంచి రూ.100 వరకు ధర వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతులు వస్తుండటంతో క్రమంగా ధరలు తగ్గుతున్నాయని మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శారదారాణి తెలిపారు. ప్రజలకు భారం కాకూడదని.. ప్రజలకు భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కిలో ఉల్లిపై రూ.80 నుంచి రూ.100 సబ్సిడీ భారాన్ని భరిస్తోంది. ఇలా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారాన్ని మోయడం లేదు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం షోలాపూర్, అల్వార్, కర్నూలు, తాడేపల్లిగూడెం నుంచి ఉల్లిని కొనుగోలు చేసి సబ్సిడీపై ప్రజలకు అందిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి రూ.150 నుంచి రూ.200 వరకూ పలుకుతోంది. పొరుగునున్న తెలంగాణలో కూడా రైతు బజార్లలోనే కిలో రూ.45కు అమ్ముతున్నారు. మహారాష్ట్రలో కిలో రూ.160, చెన్నైలో రూ.120, ఒడిశాలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. మనరాష్ట్ర ప్రభుత్వం మాత్రం వివిధ మార్కెట్లలో కిలో రూ.120 చొప్పున కొనుగోలు చేసి.. కేవలం రూ.25కే రైతు బజార్ల ద్వారా విక్రయిస్తోంది.. – మోపిదేవి వెంకట రమణారావు, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి -
ఉల్లి ధర తగ్గుతోంది
కర్నూలు (అగ్రికల్చర్)/ఒంగోలు సబర్బన్: ఉల్లి ధరల జోరు క్రమంగా తగ్గుతోంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాల్‌కు ఉల్లి గరిష్ట ధర శనివారం రూ.9,300 ఉండగా.. ఆదివారం రూ.9,150కి తగ్గింది. రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాలకు ఉల్లి ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించటం, ఇతర చర్యల కారణంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కర్నూలు మార్కెట్లో రోజుకు 100 నుంచి 150 టన్నుల వరకు ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేసి రాయలసీమతోపాటు ప్రకాశం జిల్లాకు సరఫరా చేస్తోంది. తాడేపల్లిగూడెం మార్కెట్ నుంచి ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలకు సరఫరా చేస్తోంది. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో కొనుగోలు చేసిన ఉల్లిని మిగిలిన జిల్లాలకు సరఫరా చేస్తోంది. రైతు బజార్లకు పోటెత్తుతున్న ప్రజలు ఉల్లిపాయల కోసం ప్రజలు ఆశ్రయిస్తుండటంతో రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లు కిటకిటలాడుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.160కి చేరింది. రైతు బజార్ల ద్వారా రూ.25కే విక్రయిస్తుండటంతో వాటిని తీసుకునేందుకు జనం పోటెత్తుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఒంగోలులోని రైతు బజార్ల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనుగోలుదారులు బారులు తీరారు. -
‘ఉల్లి ధర ఎంతైనా రూ 25కే’
సాక్షి, అమరావతి : దేశవ్యాప్తంగా ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలతో ప్రజలు ఇబ్బందులు పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని ఏపీ మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ప్రజలకు కిలో ఉల్లిని రూ. 25 కే సబ్సిడీపై అందిస్తోందని చెప్పారు. ప్రజలకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కిలో ఉల్లికి రూ. 90 నుంచి 100 వరకూ సబ్సిడీ భారాన్ని భరిస్తోందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉల్లి ధర బహిరంగ మార్కెట్ లో కిలో రూ. 150 నుంచి రూ. 200 పలుకుతోందని, పొరుగు రాష్ట్రం తెలంగాణలో రైతు బజార్లలోనే అక్కడి ప్రభుత్వం ఉల్లి కిలో రూ. 45కు అమ్ముతోందని చెప్పారు. మిగతా రాష్ట్రాల్లో బహిరంగ మార్కెట్లలో అయితే రూ. 150 నుంచి 200 వరకూ అమ్ముతున్నారని, మన రాష్ట్రంలో మాత్రం రూ. 25కే సబ్సిడీపై ప్రజలకు ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో ఉల్లిపాయలను ప్రజలకు అందుబాటులో ఉంచామని..వ్యవసాయశాఖ, పౌరసరఫరాలశాఖ , మార్కెటింగ్‌శాఖ , రైతుబజార్ల ఎస్టేట్ అధికారులతో నిత్యం ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తోందని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం షోలాపూర్, అల్వార్, కర్నూలుతో పాటు గత రెండు మూడురోజులుగా తాడేపల్లి గూడెం నుంచి కూడా ఉల్లిని కొనుగోలు చేసి.. సబ్సిడీపై ప్రజలకు అందిస్తోందని చెప్పారు. ఇప్పటివరకు ఉల్లిని ప్రజలకు అందుబాటు ధరకు కిలో రూ. 25కే ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ. 25 కోట్లు ఖర్చు చేసి దాదాపు 35 వేల క్వింటాళ్ళను కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేసిందని తెలిపారు. ఎన్నికల వాగ్దానం మేరకు.. ధరల స్ధిరీకరణ నిధి నుంచి సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తోందని అన్నారు. ఎవరైనా అక్రమంగా ఉల్లిపాయలు నిల్వ చేస్తే వారిపై మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి మోపిదేవి స్పష్టం చేశారు. -
గృహిణులకు షాక్ : డబుల్ సెంచరీ దాటేసింది
సాక్షి, న్యూఢిల్లీ : ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతుండగా ఆదివారం కొన్ని ప్రాంతాల్లో కిలో ఉల్లి రూ 200 దాటడం సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. మధురై, బెంగళూర్ వంటి నగరాల్లో ఉల్లిపాయలు కిలో రూ 200పైగా పలకడంతో వినియోగదారుల జేబులు గుల్లవుతున్నాయి. మరోవైపు పలు నగరాలు, పట్టణాల్లో ఉల్లి ధర రూ 150కి ఎగబాకడంతో వంటింట్లో ఉల్లి ఘాటు మాయమైంది. ఉల్లిని అధికంగా పండించే మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో పంట దెబ్బతినడం, ఖరీఫ్‌లో పంట దిగుబడి తగ్గడం వంటి కారణాలతో ఉల్లి రిటైల్ ధరలు గత కొద్దివారాలుగా భగ్గుమంటున్నాయి. నిన్నమొన్నటి వరకూ బెంగళూర్‌లో సగటున కిలో రూ 140 పలికిన ఉల్లి మార్కెట్లో సరఫరాలు పడిపోవడంతో అమాంతం రూ 200కి ఎగబాకింది. కోయంబత్తూర్‌లోని ఉల్లి ధర రూ 200కు చేరడంతో ఉల్లి ధర వింటేనే సగటు వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఉల్లి ధర క్వింటాల్‌కు రూ 6000 నుంచి రూ 14,000కు చేరడంతో రిటైల్ ధరలు కిలోకు రూ 200కు ఎగబాకాయని కర్ణాటక వ్యవసాయ మార్కెటింగ్ అధికారి సిద్ధగంగయ్య తెలిపారు. ఏపీలో ఊరట ఉల్లి ధరలు మార్కెట్లో కన్నీళ్లు తెప్పిస్తుంటే వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉల్లి ధర భారాలు మహిళలపై పడకుండా రైతు బజార్లలో కిలో ఉల్లిని రూ 25కే అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు రూ 150 పలుకుతుంటే రైతుబజార్లలో కేవలం రూ 25కే అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం పట్ల మహిళలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
ఉల్లి తినడం మానేయండి..
సాక్షి,న్యూఢిల్లీ : ఉల్లి ధరలు విపరీతంగా పెరగడంతో వీటిని తినడం మానివేయాలని ఎస్పీ నేత ఆజం ఖాన్ సూచించారు. ఉల్లిపాయలను తినడం మానేయాలి వీటిని తప్పనిసరిగా తినాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. జైన్ సోదరులు ఉల్లి తినరని ప్రజలంతా ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం అన్నింటినీ మానేస్తే అంతా ఆదా అవుతుందని చెప్పుకొచ్చారు. ఉల్లి తింటే దుర్వాసన వస్తుందని ఆజం ఖాన్ అన్నారు. ప్రజలకు తినేందుకు బ్రెడ్ లేకుంటే వారిని కేక్ తినేలా చేయండని గతంలో ఒక రాణి అన్నారని గుర్తుచేశారు. ఉల్లిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఉల్లి తినడం మానివేయాలని దేశ ప్రజలకు ఇచ్చిన సంకేతమని అన్నారు. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కిలో రూ 100 దాటడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. -
భారం ఎంతైనా కిలో ఉల్లి రూ.25కే
సాక్షి, అమరావతి/కర్నూలు (అగ్రికల్చర్): దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలకు రెక్కలు రావడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా సబ్సిడీ ధరలకే రైతు బజార్ల ద్వారా ఉల్లిపాయలు విక్రయిస్తోంది. ఈ విషయంలో వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖలు, రైతుబజార్ల ఎస్టేట్ అధికారులతో సీఎం కార్యాలయం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. వారం రోజులుగా రాష్ట్రంలో ఉల్లిధరలు కిలో రూ.80 నుండి రూ.100 వరకూ పెరగడంతో ఈ అధిక ధరలను అదుపుచేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయల ధరలు తగ్గేంత వరకూ రైతు బజార్లలో అమ్మకాలు చేపట్టాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తోంది. ధరలను పెంచేందుకు అక్రమంగా ఎవరైనా ఉల్లిపాయలు నిల్వ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎంతైనా సామాన్యులకు రైతు బజార్లలో రూ.25 కే కిలో చొప్పున అమ్మాలని సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లిపాయలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అక్రమంగా ఉల్లిపాయల నిల్వ చేస్తే వారిపై మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు రోజుకు 500 నుంచి 1,200 క్వింటాళ్ల ఉల్లిపాయలు సేకరించి మార్కెటింగ్ శాఖ ద్వారా రైతు బజార్లకు తరలిస్తున్నారు. ప్రతీ కిలో మీద రూ. 50కి పైగా ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చి రైతు బజార్లకు సరఫరా చేస్తోంది. రాష్ట్రానికి షోలాపూర్ ఉల్లిపాయలు కర్నూలు మార్కెట్లో ఉల్లి నిల్వలు తగ్గిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి దిగుమతి చేసుకునేందుకు చర్యలు తీసుకుంది. షోలాపూర్ మార్కెట్‌కు ఉల్లి నిల్వలు అధికంగా వస్తున్నాయనే సమాచారం తెలుసుకున్న మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న అక్కడికి తమ సిబ్బందిని పంపించారు. బుధవారం నుంచి అక్కడ ఉల్లిని కొనుగోలు చేసి రోడ్డు మార్గంలో రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఉల్లి ధరల హోరు కొనసాగుతోంది. మంగళవారం క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.10,220 పలికింది. -
ఉల్లి నిల్వ పరిమితి కుదింపు
న్యూఢిల్లీ: ఉల్లి ధరలు పైపైకి ఎగబాకుతున్న నేపథ్యంలో కేంద్రం మరిన్ని చర్యలు ప్రకటించింది. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల వద్ద ఉల్లి నిల్వల పరిమితిని 25 టన్నులు, 5 టన్నులకు కుదించింది. ఉల్లి సరఫరాను పెంచినప్పటికీ ధరలు గత కొద్ది వారాలుగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభకు వినియోగదారుల వ్యవహారాల శాఖ దన్వే రావ్ చెప్పారు. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు ఉల్లి నిల్వల వివరాలను రోజువారీగా సమర్పించాలని ఆదేశించామని తెలిపారు. దేశంలోని నగరాల్లో ఉల్లి గడ్డల ధర కిలో రూ.75 నుంచి రూ.100 వరకు ఉంది. సరాసరి ధర కిలో రూ.75 కాగా అత్యధికంగా పోర్ట్బ్లెయిర్లో రూ.140 వరకు పలుకుతోందని కేంద్రం తెలిపింది. -
ఉల్లి రైతుల్లో ‘ధర’హాసం
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి రైతుల పంట పండుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉల్లి ధరలు పెరుగుతుండటంతో రైతుల ఆనందానికి అవధులు లేవు. గతంలో క్వింటాల్ ఉల్లికి అత్యధికంగా లభించిన ధర రూ.5,400 మాత్రమే. ప్రస్తుతం రూ.10,180 ధర పలకడం విశేషం. ఉల్లి పంటకు కర్నూలు జిల్లా పెట్టింది పేరు. తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి పేరు చెబితే కర్నూలు జిల్లా గుర్తొస్తుంది. దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత ఏర్పడటంతో ఈ జిల్లాపై జాతీయ స్థాయి వ్యాపారుల దృష్టి పడింది. జిల్లాలో పండిన ఉల్లి ఎప్పటికప్పుడు అమ్ముడైపోతుండటంతో ధరలు ఎగిసి పడుతున్నాయి. రెండు, మూడేళ్లుగా ధరలు పడిపోవడంతో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ధరలు పెరగడంతో వారి ఆనందం అంతా ఇంతా కాదు. ఆదివారం కర్నూలు మార్కెట్లో క్వింటాల్‌కు అత్యధిక ధర రూ.7,570 పలికింది. సోమవారం రూ.10,180కి ఎగబాకింది. రాష్ట్రంలో పండుతున్న ఉల్లిలో 95 శాతం కర్నూలు జిల్లాలోనే పండిస్తున్నారు. జిల్లాలో 2018–19లో 34,158 హెక్టార్లలో ఉల్లి సాగు చేయగా.. 7,85,634 టన్నుల దిగుబడి వచ్చింది. 2019–20లో 32 వేల హెక్టార్లలో పంట సాగు కాగా.. 7,04,000 టన్నులు ఉత్పత్తి అయ్యింది. గత ఏడాదితో పోలిస్తే సుమారు 2 వేల ఎకరాల్లో సాగు తగ్గగా.. ఉత్పత్తి 81,634 టన్నులు తగ్గింది. సబ్సిడీతో ఊరట ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు షాక్ కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీపై కిలో ఉల్లి రూ.25కే పంపిణీ చేస్తుండటం ఊరటనిస్తోంది. వినియోగదారుల కోసం ప్రభుత్వం కూడా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో రోజుకు 100 నుంచి 120 టన్నుల వరకు ఉల్లి కొనుగోలు చేస్తోంది. కిలో ఉల్లిపై ప్రభుత్వం రూ.50కి పైగా సబ్సిడీ రూపంలో భరిస్తోంది. -
ఉల్లి లొల్లి : కేంద్రం కీలక చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ : చుక్కలు తాకుతున్న ధరలతో కంటనీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేశంలో ఉల్లి సరఫరాలను పెంచేందుకు టర్కీ నుంచి 11,000 టన్నుల ఉల్లి దిగుమతులకు ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ ఆర్డర్ ఇచ్చింది. ఈ సంస్థ ఇప్పటికే ఈజిప్ట్ నుంచి 6090 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుంటుండగా తాజా ఆర్డర్‌తో పరిస్థితి మెరుగవుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఉల్లి ధరలను సమీక్షించేందుకు హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఆర్థిక మంత్రి, వినియోగదారుల వ్యవహరాల మంత్రి, వ్యవసాయ, రవాణా శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో రూ 75 నుంచి రూ 120 వరకూ ఉల్లి ధరలు పలకడంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లి దిగుమతులకు ప్రాధాన్యత ఇస్తోంది. ఉల్లి ఎగమతులపై నిషేధం విధించిన కేంద్ర కేబినెట్ 1.2 లక్షల టన్నుల ఉల్లి దిగుమతులకు ఆమోదం తెలిపింది. ఇక దిగుమతి చేసుకున్న ఉల్లిని ఆయా రాష్ట్రాలకు కిలో రూ 50 నుంచి 60లకు అందచేస్తారు. -
ఉల్లి మరో 3 వారాలు కొరతే!
సాక్షి, హైదరాబాద్: ఉల్లి కొరత మరో 3 వారాల వరకు ఉంటుందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వర్గాలు అంటున్నాయి. ఈజిప్ట్ నుంచి కేంద్ర ప్రభుత్వం 6,090 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుంటోంది. అందులో 500 టన్నులు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. ఈ మేరకు వారం రోజుల్లో రాష్ట్రానికి ఉల్లి వచ్చే అవకాశముందని అధికారులు అంటున్నారు. కాగా, రాష్ట్రంలో ఉల్లి ధరలను నియంత్రించేందుకు మార్కెటింగ్ శాఖ చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్, మెహిదీపట్నం రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.40కే విక్రయించేలా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఆధార్ కార్డు చూపించిన వారికి రోజూ సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు విక్రయించనున్నారు. కొరతను వ్యాపారులు అవకాశంగా తీసుకొని ఇష్టారాజ్యంగా ధరలు పెంచకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.ప్రస్తుతం తెలంగాణలో ఉల్లిపాయ ఫస్ట్ క్వాలిటీ ధర క్వింటాలుకు రూ.4 వేల నుంచి రూ.8 వేలకు పెరిగింది. కర్ణాటక, కర్నూలు నుంచి వచ్చే రెండో క్వాలిటీ ధర రూ.3,700 నుంచి రూ.6,000కు గరిష్టంగా పెరిగింది. కాగా,ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల ఉల్లి విత్తనాలు వేయడంలో మూడు, నాలుగు వారాలు ఆలస్యమైంది. దీంతో ఖరీఫ్ ఉల్లిపాయ సాగు విస్తీర్ణం తగ్గింది. మన రాష్ట్రంలో ఖరీఫ్‌లో 10 వేల ఎకరాల్లోపే ఉల్లి సాగవుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి రాష్ట్రానికి ఉల్లి దిగుమతి అవుతోంది. ఆయా రాష్ట్రాల్లోనూ ఆలస్యపు రుతుపవనాల వల్ల విస్తీర్ణం తగ్గింది. కోత సీజన్లో అకాల వర్షాలు ఉల్లి పంటను దెబ్బతీశాయి. సెప్టెంబర్–అక్టోబర్ కాలంలో కురిసిన వర్షాల వల్ల ఉల్లి రవాణాపైనా ప్రభావం పడింది. దీంతో ఉల్లి కొరత ఏర్పడింది. -
ఉల్లి.. వంటింట్లో లొల్లి
ఉదయం పూట దోశలు వేసిన రోజు సుబ్బారావుకు ఉల్లిపాయ ముక్కలు తప్పనిసరి. మధ్యాహ్నం భోజనంలో భాగంగా పెరుగన్నంలో రోజూ పచ్చి ఉల్లిపాయ తినడం అలవాటు. ఇతని భార్య ఉల్లిపాయను ముక్కలుగా కోసి ప్లేట్లో పెట్టేది. వారం రోజులుగా ఇలా ఇవ్వడం మానేసింది. ‘ఉల్లిపాయ ఎందుకు ఇవ్వడం లేదు?’ అని సుబ్బారావు ప్రశ్నించాడు. ‘ఎందుకో ఏమిటో మీకు తెలియదా? ఏమీ తెలియనట్లు అడుగుతున్నావు.. ధర మండిపోతోంది.. ధర తగ్గేవరకు అంతే.. పోపులో, కొంచెం కూరల్లో మాత్రమే వేస్తాను..’ అని తేల్చి చెప్పింది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎడతెరిపిలేని వర్షాలు, వరదల ప్రభావం, పంట దిగుబడి గణనీయంగా తగ్గడం.. వెరసి ఉల్లిధరలు గణనీయంగా పెరిగాయి. రిటైల్ మార్కెట్లో కిలో రూ.60–70 వరకు ఉండటంతో వినియోగ దారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి తక్కువ ధరకే ఉల్లిని అందించే ఏర్పాట్లు చేయడం వల్ల కాస్త వెసులుబాటు లభించినా, రాష్ట్రంలో ఉల్లి ధరల ఘాటు మాత్రం తగ్గలేదు. రాష్ట్రంలో 95 శాతం ఉల్లి పంట ఒక్క కర్నూలు జిల్లాలోనే సాగవుతోంది. తక్కిన 5 శాతం మాత్రమే ఇతర జిల్లాల్లో పండుతోంది. కర్నూలు జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి ఏటా 87,500 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఎకరాకు సగటున 60 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ లెక్కన ఏటా 5.25 లక్షల టన్నుల ఉల్లి కర్నూలు జిల్లా నుంచి ఉత్పత్తి అవుతోంది. అయితే ఈ ఏడాది జూలై నుంచి అక్టోబర్ వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం వల్ల దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు 40–45 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. పండిన గడ్డల్లోనూ ఎక్కువ శాతం కుళ్లిపోయాయి. ఇతర రాష్ట్రాల్లోనూ తగ్గిన దిగుబడులు మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉల్లి ఎక్కువగా సాగవుతోంది. ఉత్తరభారత దేశంలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గింది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో 48 వేల హెక్టార్లలో పంట సాగు చేస్తారు. ఈ ఒక్క జిల్లాలోనే 6.5 –7 లక్షల టన్నుల ఉల్లి పండుతుంది. ఈ ఏడాది వరదల ప్రభావంతో పంట బాగా దెబ్బతింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. దేశ వ్యాప్తంగా వరదల దెబ్బకు ఒక్కసారిగా పంట దిగుబడి తగ్గడం, ఎగుమతులు కొనసాగడంతో కొరత ఏర్పడి ధరలు అమాంతం పెరిగాయి. ఏపీపై మహారాష్ట్ర ప్రభావం మహారాష్ట్ర మార్కెట్ ఆధారంగా ఏపీలో ఉల్లి ధరలు నిర్ణయిస్తారు. అక్కడ ధరలు పెరిగితే ఇక్కడా పెరుగుతాయి. ఇక్కడి, అక్కడి వ్యాపారుల మధ్య సంబంధాలు బాగా ఉండటంతో మార్కెట్ ధరలు కూడా దాదాపు ఒకేలా ఉంటాయి. ఈ ఏడాది జూన్‌లో క్వింటా ధర కనిష్టంగా రూ.310 ఉంటే.. గరిష్టంగా రూ.1,520 వరకూ ఉండింది. సెప్టెంబర్ నుంచి ధరలు పెరిగాయి. సెప్టెంబర్‌లో గరిష్టంగా రూ.4,500, అక్టోబర్‌లో రూ.4070కు చేరింది. ఈ నెలలో 11వ తేదీన ఏకంగా రూ.5 వేలకు చేరింది. శనివారం (16వ తేదీ) కూడా క్వింటా రూ.4,650 వరకూ విక్రయించారు. దీంతో రిటైల్ మార్కెట్లో మొదటి రకం ఉల్లి కిలో రూ.60–70 చొప్పున విక్రయిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఉత్పత్తయ్యే పంటలో 20 శాతం మాత్రమే కర్నూలు మార్కెట్ యార్డులో అమ్మకాలు సాగుతాయి. మిగతా పంటను పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, హైదరాబాద్, చెన్నైతో పాటు ఇతర రాష్ట్రాల వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. దాదాపు 50 శాతం ఇక్కడి పంటను తాడేపల్లిగూడెం వ్యాపారులే కొనుగోలు చేసి.. ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తుండడం గమనార్హం. వినియోగదారులకు తక్కువ ధరకే.. ఉల్లిరేట్లు పెరగడంతో వినియోగదారులు ఇబ్బంది పడకుండా కిలో రూ.25కే విక్రయించేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ ఫెడరేషన్) ద్వారా నాసిక్ నుంచి 350 టన్నుల ఉల్లిని ప్రభుత్వం కొనుగోలు చేసి.. రాష్ట్రంలోని మార్కెట్ యార్డులు, రైతు బజార్లలో కిలో రూ.25కే విక్రయిస్తోంది. మరో 300 టన్నుల కొనుగోలుకు కూడా ప్రతిపాదనలు పంపింది. మరోవైపు గోదాముల్లో అక్రమంగా నిల్వ చేసిన ఉల్లిపై విజిలెన్స్ దాడులు చేయించి, మార్కెట్లోకి తెస్తోంది. దీనికితోడు ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఈజిప్టు, నెదర్లాండ్స్ నుంచి లక్ష టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం చేసుకుంది. కాగా, నేటి (ఆదివారం) నుంచి రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలోనూ కిలో రూ.25 చొప్పున ఉల్లిపాయలు అందుబాటులో ఉంటాయని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. రైతులు ఆనందంగా ఉండారు.. ఎకరాలో పంట సాగు సేసినా. 120 ప్యాకెట్లయినాయి (60 క్వింటాళ్లు). పోయినేడు 200 పాకెట్లయిండే. వర్షాలకు ఈ ఏడు పంట పాడయిపోయినాది. అయితే రేటు బాగుంది. పోయిన్సారి కింటా 300 రూపాయలకు అమ్మినా. ఇప్పుడు 3,600 రూపాయలకు అమ్మినా. పంట తగ్గినా రేటు బాగుండాది. శానా సంతోషంగా ఉండాది. ఉల్లిగడ్డలు వేసిన రైతులంతా ఆనందంగా ఉండారు. – గిడ్డయ్య, బండపల్లి, దేవనకొండ మండలం, కర్నూలు జిల్లా ప్రజలపై భారం పడకుండా చర్యలు 2014 తర్వాత ఈ ఏడాది ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రభుత్వం నన్ను నాసిక్ పంపించింది. ఆరు రోజులు అక్కడ ఉండి 350 టన్నుల ఉల్లి కొనుగోలు చేశాం. ప్రభుత్వం ఎక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రజలకు రూ.25కే విక్రయించి ఉపశమనం కల్పిస్తోంది. నెలాఖరుకు కర్నూలు జిల్లాతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలోనూ ఉల్లి దిగుబడులు పెరగనున్నాయి. ఎగుమతులు తగ్గడం, దిగుమతి చేసుకోవడం, దేశీయంగా ఉత్పత్తులు పెరగనుండటంతో ఉల్లి ధరలు దిగొచ్చే అవకాశం ఉంది. – సత్యనారాయణ చౌదరి, ఏడీ, మార్కెటింగ్ శాఖ 6 నెలలుగా కర్నూలు మార్కెట్లో ఉల్లి ధరలు -
ఉల్లి లొల్లి తగ్గింది!
ఉల్లిపాయల ధరలు క్రమేపీ దిగి వస్తున్నాయి. మహారాష్ట్రలో వరదలు రావడం, అయ్యప్ప మరోవైపు దసరా, దీపావళి పండుగలు... ఇవన్నీ ఉల్లి పాయలకు డిమాండు పెంచేవే! ఈ డిమాండును సొమ్ము చేసుకోవడానికి కొంతమంది వ్యాపారులు సృష్టించిన కృత్రిమ కొరతను రాష్ట్ర ప్రభుత్వం ఛేదించింది. విజిలెన్స్, మార్కెటింగ్ శాఖల అధికారులు సంయుక్తంగా చేపట్టిన చర్యలు ఫలించాయి. విశాఖ నగరంలోని 13 రైతు బజార్లలో వినియోగదారులకు కావాల్సినన్ని ఉల్లిపాయలు రూ.25కే లభ్యమవుతున్నాయి. ఇలా తక్కువ ధరకే ఉల్లి అందించేందుకు మార్కెట్ జోక్య పథకం కింద కేంద్ర మార్కెట్ ఫండ్ (సీఎంఎఫ్) నుంచి మరో రూ.3 కోట్లను ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. ఈ చర్యలతో వినియోగదారులకు ఊరట లభిస్తోంది. సాక్షి–విశాఖపట్నం : దసరా పండుగకు కొద్ది రోజుల ముందు మహారాష్ట్రలో వరదల కారణంగా రాష్ట్రానికి ఉల్లి సరఫరా తగ్గిపోయింది. ఇదే అదనుగా బ్లాక్ మార్కెట్ వ్యాపారులు ఉల్లిపాయలు అక్రమంగా నిల్వ చేయడంతో ధరలు భారీగా పెరిగాయి. కిలో రూ.50 నుంచి రూ.60 వరకూ చేరడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అక్రమంగా నిల్వ చేసిన వ్యాపారులపై విశాఖ నగరంలో విజిలెన్స్, మార్కెటింగ్ శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అక్రమ నిల్వలు సీజ్ చేశారు. దీంతో బ్లాక్ చేసిన సరుకు మార్కెట్‌కు వచ్చింది. మరోవైపు బయట ప్రాంతాల్లో ఉల్లి కొనుగోలు చేసి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. మహారాష్ట్రలోని నాసిక్‌తో పాటు కర్నూలు మార్కెట్ యార్డు నుంచి ఉల్లిపాయలను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు కొనుగోలు చేశారు. ఇలా ఇప్పటివరకూ నగరానికి తీసుకొచ్చిన 111.229 మెట్రిక్ టన్నుల (1,11,229 కిలోలు) ఉల్లిపాయలు 13 రైతుబజార్లలో విక్రయించారు. దిగుమతిపైనే ఆధారం జిల్లాలో ఉల్లి సాగు ఏటా తగ్గుతూ వస్తోంది. సాధారణంగా ఖరీఫ్‌లో 53 హెక్టార్లలో సాగు చేస్తే దాదాపు 1,577 మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వస్తుంది అంచనా. కానీ 2017 సంవత్సరంలో 52 హెక్టార్లు, 2018 సంవత్సరంలో 38 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. ఈ ఖరీఫ్‌లో కేవలం 24 హెక్టార్లలో మాత్రమే ఉల్లి వేశారు. అయితే జిల్లాలో ఉత్పత్తి అయ్యే ఉల్లి మైదాన, నగరవాసుల అవసరాలను అత్యవసర సమయంలోనైనా తీర్చేందుకు సరిపోవాలి. కానీ అన్నిరోజులూ దాదాపు మహారాష్ట్ర, కర్నూలు మార్కెట్ల నుంచి దిగుమతిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. అందుకే మహారాష్ట్రలో వరదలు వస్తే ఇక్కడ ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రూ.25 వద్ద ధర నిలకడ... విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీ, సీతమ్మధార, కంచరపాలెం, గోపాలపట్నం, నరసింహనగర్, పెదవాల్తేరు, పెందుర్తి, మర్రిపాలెం, మధురవాడ, గాజువాక, స్టీల్‌ప్లాంట్, ములగాడ, పెదగంట్యాడ రైతు బజార్లలో కిలో రూ.25 చొప్పున ఉల్లిపాయలు విక్రయిస్తున్నారు. ఇప్పటివరకూ 1,11,229 కిలోలు రాయితీ ధరపై వినియోగదారులకు అందించేలా మార్కెటింగ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. రైతుబజార్లలో ఉల్లిపాయలు విక్రయించే డ్వాక్రా సభ్యుల దుకాణాలకు 1,587 బస్తాలు (74,365 కిలోలు), దివ్యాంగుల దుకాణాలకు 783 బస్తాలు (36,864 కిలోలు) అందజేశారు. ఇలా ఉల్లి విక్రయాల ద్వారా డ్వాక్రా సభ్యులకు రూ.1,11,548లు, దివ్యాంగులకు రూ.55,296లు కమిషన్ లభించింది. ఉల్లి ధరలు పూర్తిగా దిగొచ్చేవరకూ కిలో రూ.25 చొప్పున విక్రయించేందుకు వీలుగా ప్రభుత్వం మరోసారి నిధులు విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్ర అవసరాలకు అవసరమైన ఉల్లిపాయలను మార్కెట్ జోక్య పథకం కింద కొనుగోలు చేసేందుకు కేంద్ర మార్కెట్ ఫండ్ (సీఎంఎఫ్) నుంచి రూ.3 కోట్లు విడుదలయ్యాయి. ప్రభుత్వ చర్యలతో ఇక ఉల్లి కోసం వినియోగదారులకు బెంగ అక్కర్లేదని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కె.శ్రీనివాసరావు తెలిపారు. ఉల్లి ధరలు దిగొచ్చేవరకూ రైతుబజార్లలో రాయితీపై విక్రయాలు కొనసాగిస్తామని చెప్పారు. -
ఢిల్లీలో కిలో ఉల్లి రూ.23
న్యూఢిల్లీ: ఉల్లి ధర భారీగా పెరిగిన నేపథ్యంలో ఢిల్లీ వాసులకు ప్రభుత్వం ఊరటనిచ్చే ప్రకటన చేసింది. మార్కెట్ రేటుతో పోలిస్తే సగానికే ఉల్లిని అందించే ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28 నుంచి కిలో ఉల్లిపాయలను రూ.23.90కే విక్రయించనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. రాష్ట్రంలోని 400 రేషన్ షాపులతోపాటు 70 మొబైల్ వ్యాన్ల ద్వారా ఉల్లిని ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు. దీనికోసం రానున్న 5 రోజుల్లో కేంద్రం నుంచి సుమారు లక్ష కిలోల ఉల్లిపాయలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే కొన్ని పరిమితులతో మాత్రమే వీటిని కొనుగోలు చేయగలరు. ఒక వ్యక్తికి ఒకసారి కేవలం 5 కిలోల ఉల్లిపాయలను మాత్రమే విక్రయించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.80 దాకా పలుకుతోంది. -
‘ఉల్లి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు’
సాక్షి, అమరావతి: ఉల్లి ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆయన సోమవారం ఉల్లి ధరలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు రోజుల్లో మహారాష్ట్ర నుంచి ఉల్లిని తెప్పించి రైతు బజార్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండేటట్లు చూడాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలు కారణంగా ఉల్లి పంటలు దెబ్బతినడం వల్లే ధరలు పెరిగాయని తెలిపారు. కొందరు వ్యాపారులు ఉల్లికి కృత్రిమ కొరత సృష్టించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి మోపిదేవి హెచ్చరించారు. ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి.. మహారాష్ట్ర, కర్ణాటక, కర్నూలులో వరదల నేపథ్యంలో ఉల్లి దిగుబడి తగ్గిపోయింది. నెల రోజుల కిందట రైతు బజార్లో రూ.20 పలికిన ఉల్లిపాయల ధర ప్రస్తుతం 38కి చేరుకుంది. బహిరంగ విపణిలో రూ.55 నుంచి రూ.60 పలుకుతోంది. దక్షిణాది రాష్ట్ర్రాల్లో గతంలో పోలిస్తే ప్రస్తుతం ఉత్పత్తి తగ్గింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు మందగించింది. ఉల్లి ధరల పెరుగుదల నియంత్రించడానికి ప్రభుత్వం దృష్టిసారించింది. -
ఉల్లి.. లొల్లి...!
ఉల్లి చేసిన మేలు తల్లి చేయదనేది నానుడు. ఉల్లి గొప్పతనాన్ని కవులు ఎంతగానో పొగడారు. దీనివెనుక ఉల్లి ఆవశ్యకత అంత. ఉల్లి లేనిది వంటకాలు రుచి తగలడం కష్టమే. దాదాపు అన్ని రకాల కూరలు, ఇతర వంటల్లో ఉల్లి వినియోగించాల్సిందే. కాబట్టే ఉల్లికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే పంట సరిపడినంత ఉన్నంత కాలం ఇబ్బంది ఉండదు. సరుకు దొరకడంతో పాటు ధరలు స్వల్పంగా మాత్రమే పెరుగుదల, తగ్గుదల ఉంటాయి. అయితే సరుకు కొరత ఏమాత్రం తక్కువగా ఉన్న ధరలు అమాంతంగా పెరిగిపోవడం ఖాయం. ప్రస్తుతం అదే జరిగింది. విజయనగరం గంటస్తంభం: ఏటా ఏదో ఒక సమయంలో ఉల్లి ధరలు లొల్లి సృష్టించడం ఆనవాయితీగా మారిపోయింది. ఈ ఏడాది ప్రస్తుత మార్కెట్లో ఉల్లి ధరలు మళ్లీ అమాంతం పెరిగి కొనుగోలుదారులను కంటనీరు పెట్టిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలో సగానికి పైగా ధర పెరిగింది. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు కృత్రిమ డిమాండ్ సృష్టించి మరింత ధర పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా ఉల్లి ధరలు దసరా, అమ్మవారి పండగ నాటికి ఎంతకు చేరుతాయోనని కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. పెరిగిన ఉల్లి ధర.. ఉల్లి ధర నెల రోజుల్లో వంతుకు వంతు పెరిగింది. సెప్టెంబరు ఒకటో తేదీ నాటికి తెలుపు(పెద్ద) ఉల్లి బహిరంగ మార్కెట్లో కేజీ రూ.20 ఉండగా ప్రస్తుతం రూ.40కు పెరిగింది. కనీసం నాలుగైదు రూపాయిలు తేడా ఉండే రైతు బజారులో కూడా బుధవారం రూ.35 ఉంది. ఇక జిల్లాలో అంతగా వినియోగించని కర్నూలు ఉల్లి ధర కూడా ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కేజీ రూ.35 ఉంటే రైతుబజారులో రూ.32 ఉంది. దీని ధర కూడా 20రోజుల్లో వంతుకు వంతు పెరగడం విశేషం. సరుకు కొరత కారణం.. ఉల్లి ధరలు భారీగా పెరగడానికి సరుకు కొరత కారణం. జిల్లాకు మహారాష్ట్ర నుంచి సరుకు వస్తుంది. కర్నూలు నుంచి కొంత సరుకు వస్తుంది. అక్కడ ప్రస్తుతం సరుకు తక్కువగా ఉంది. వర్షాలు పడుతుండడంతో పంట తీసే పరిస్థితి లేక కొరత ఏర్పడింది. ఫలితంగా ఇక్కడ వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. మళ్లీ అక్కడ సరుకు ఎక్కువగా దొరికే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు పెరుగుతాయని ప్రచారం.. ఇదిలా ఉండగా వ్యాపారులు ధరలు మరింత పెరుగుతాయని ప్రచారం చేస్తున్నారు. సాధారణంగా ఉల్లి ధర కాస్తా పెరిగినపుడు వ్యాపారులు మరింత డిమాండ్ సృష్టించడం జిల్లాలో పరిపాటి. సరుకు రావడం లేదని, తక్కువ సరుకు ఉందని చెప్పి రోజురోజుకు ధర పెంచుతూ వెళ్తారు. వాస్తవానికి ఉల్లి కుళ్లిపోయే సరుకు కావున కొనుగోలు ఆపేస్తే ధర తగ్గుతుంది. కానీ రోజువారీ అవసరాలకు ఉల్లి తప్పనిసరి కావడంతో జనాలు కొనుగోలు చేయకతప్పని పరిస్థితి. దీంతో చిల్లర వర్తకులు వద్ద హోల్‌సేల్ వ్యాపారులు ధరలు పెంచి అమ్ముతుంటారు. ఈ భారం చివరికి వినియోగదారులపైనే పడుతుంది. ప్రస్తుతం ఉన్న సరుకు కొరత, డిమాండ్‌ను అడ్డం పెట్టుకునే ధరలు పెరుగుతాయని ముందే ప్రచారం చేస్తున్నారు. దీంతో వినియోగదారులు మానసికంగా సిద్ధమై పెంచినా కొంటారని వ్యాపారులు ఆలోచన. ఇదిలా ఉండగా ధరలు పెరుగుతాయని వ్యాపారులు చెప్పడంతో వినియోగదారులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఉన్న ధరతో సర్దుకుంటున్నామని, మరింత పెరిగితే ఇబ్బందేనని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కృత్రిమ డిమాండ్ రాకుండా అధికారులు దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉంది. సరుకు లేకే... ఉల్లి ధర రోజుకు రూపాయి, రెండు పెరుగుతోంది. మహరాష్ట్రలో జనవరి, ఫిబ్రవరిలో పండే సరుకు చివరి దశకు చేరడంతో దొరకడం లేదు. ఈ సీజన్లో కర్నూలు నుంచి ఉల్లి వస్తుంది. కానీ వర్షాలు వల్ల రాకపోవడంతో కొరత ఉంది. దీంతో ధర పెరుగుతుంది. – ఎస్.వి.వి.లక్ష్మీనారాయణ, వ్యాపారి దృష్టి పెడతాం... ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. సరుకు తక్కువగా రావడం వల్ల అక్కడే పెరగడం వల్ల ఇక్కడ మార్కెట్లో పెరగక తప్పదు. ఇప్పటివరకు కృత్రిమ కొరత, డిమాండ్ వ్యాపారులు సృష్టిస్తున్నట్లు సమాచారం లేదు. కానీ మున్ముందు ధర పెరిగే అవకాశం ఉన్నందున సరుకు లభ్యతపై దృష్టి పెడతాం. – శ్యామ్‌కుమార్, ఏడీ మార్కెట్ శాఖ -
నెల రోజులు ఉల్లి తిప్పలు తప్పవు
చాదర్‌ఘాట్: ఉల్లి ఘాటు నెల రోజులపాటు భరించవలసిందేనని, అయితే ధరలు అదుపులో ఉన్నాయని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ అనంతయ్య తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యాపారులపై నిఘా ఏర్పాటు చేశామని, కర్నాటక, మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి తక్కువ రావటం వల్ల ఉల్లి ధర క్వింటాకు రూ.3,300 ఉందని వివరించారు. కొత్తపంట సెప్టెంబర్ నెల చివరికి వస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో ఉల్లి దిగుమతి మొదలైతే మరల తిరిగి రూ.8, 10, 12 లకు కేజీ ఉల్లి విక్రయాలు ఇప్పుడు రోజుకు 15 వేల బస్తాలు మాత్రమే దిగుమతి అవుతుందని తెలిపారు. హోల్‌సేల్‌గా 10 కేజీలకు రూ.280 ఉండగా, రిటైల్‌గా కేజీ రూ.35 చొప్పున అమ్మకాలు జరుగుతున్నట్లు వివరించారు. ఉల్లి ధరలు విపరీతంగా పెరిగితే రైతు బజార్ లో ప్రభుత్వ అనుమతి తో ఉల్లి కౌంటర్లు ఏర్పాటు చేసి ధరలు అదుపులోకి తెస్తామన్నారు. -
ఉల్లి ‘ఘాటు’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉల్లి ఘాటు క్రమంగా పెరుగుతోంది. పొరుగు రాష్ట్రాల్లో ఇటీవలి వర్షాలు, వరదల కారణంగా దిగుబడి తగ్గడంతో ధర కొండెక్కుతోంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే కిలో ఉల్లి ధర రూ. 10 నుంచి రూ. 15 మేర పెరిగింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ. 42 నుంచి రూ. 45 పలుకుతుండగా ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రధానంగా ఉల్లి సాగు గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, కొంతమేర కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో సాగవుతుంది. రాష్ట్రంలో సాధారణ ఉల్లి సాగు విస్తీర్ణం 13,247 హెక్టార్లు కాగా ఈ ఏడాది ఆలస్యంగా కురిసిన వర్షాలు, భూగర్భ జలాల్లో భారీ తగ్గుదల కారణంగా 5,465 హెక్లార్లలోనే సాగైంది. దీంతో రాష్ట్రం నుంచి వస్తున్న ఉల్లితో పూర్తిస్థాయిలో అవసరాలు తీరే అవకాశం లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. సాధారణంగా రాష్ట్ర మార్కెట్లకు మహారాష్ట్రలోని షోలాపూర్, ఔరంగాబాద్, నాసిక్, కర్ణాటకలోని శివమొగ్గ, రాయచూర్ ప్రాంతాలు, మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి దిగుమతులు ఉంటాయి. అలాగే ఏపీలోని కర్నూలు నుంచి కూడా ఉల్లి సరఫరా అవుతుంది. అయితే ఈ ఏడాది మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన కుండపోత వర్షాలతో ఉల్లి సాగుకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో అక్కడ దిగుబడులు పూర్తిగా తగ్గాయి. మార్కెట్లోకి వస్తున్న కొద్దిపాటి ఉల్లి ఆయా రాష్ట్రాల అవసరాలకే సరిపోతుండగా మిగతా వాటి కోసం దక్షిణాది రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఫలితంగా డిమాండ్ పెరగడంతో ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. 2, 3 రోజుల కిందటి వరకు హైదరాబాద్ మార్కెట్లకు క్వింటాల్‌కు రూ. 2 వేల మేర పలికిన ధర మంగళవా రం రూ. 3 వేలకు పెరిగింది. గతేడాదితో పోలిస్తే మార్కెట్లకు 4–5 వేల క్వింటాళ్ల మేర సరఫరా తగ్గిపోయింది. దీంతో హోల్‌సేల్ ధరే కిలో రూ. 33కి చేరింది. మరోవైపు కర్నూలు జిల్లాలో సైతం మార్కెట్లోకి ఉల్లి అంతగా రావడం లేదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉల్లి సాగు అనుకున్నంత జరగకపోవడంతో తెలంగాణకు అవసరమైన సరఫరా లేక ధర పెరుగుతోంది. హైదరాబాద్ బహిరంగ మార్కెట్లో పది రోజుల కింద కిలో ఉల్లి రూ. 30 మేర ఉండగా ప్రస్తుతం రూ. 42 నుంచి రూ .45కి చేరింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెటింగ్ వర్గాలు అంటున్నాయి. 50 వేల టన్నులు నిల్వ ఉంచిన కేంద్రం ఇటీవలి వరదల కారణంగా ఉల్లి ధరలు పెరగుతాయన్న సంకేతాల నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే 50 వేల టన్నుల ఉల్లిని నాఫెడ్ ద్వారా సేకరించి నిల్వ చేసింది. వచ్చే నెలలో ఉల్లి ధరలు మరింత పెరిగిన పక్షంలో నిల్వచేసిన ఉల్లిని మార్కెట్లోకి అందుబాటు లోకి తెచ్చి ధరను నియంత్రిస్తామని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారులశాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లి వ్యాపారులు నిల్వలు పెంచకుండా చూడటం, వారిపై నియంత్రణ చర్యలు చేపడితేనే ఉల్లి ధరలకు కళ్లెంపడే అవకాశం ఉంది. లేదంటే మున్ముం దు వంటింట్లో ఉల్లి ఘాటు తప్పేలా లేదు. -
ఉల్లి..ఫుల్లు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రతిఏటా చలికాలంలో ఉల్లిగడ్డ ధరలు పెరుగుతాయి. కానీ ఈ ఏడాది కొత్త ఉల్లిపంట మార్కెట్లకు పోటెత్తడంతో హోల్‌సేల్ ధరలు భారీగా తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉల్లి ధరలు హోల్‌సేల్‌లో రూ.10 దాటడం లేదని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో ఉల్లి దిగుమతి అవుతోంది. దీంతో ఇక్కడ డిమాండ్‌కు మించి సరుకు చేరింది. ఈ నేపథ్యంలోనే ధరలు భారీగా పడిపోయాయి. గత ఏడాది ఈ సీజన్లో ఉల్లి హోల్‌సేల్ ధరలు కిలో రూ.30 వరకు ఉండగా, ఈ ఏడాది రూ.10 లోపే ఉన్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. గత ఏడాది రిటైల్ మార్కెట్లోకిలో ఉల్లి ధర రూ.40 నుంచి రూ.50 వరకు ఉండగా, ఈ ఏడాది రూ.10 నుంచి 15 రూపాయల లోపే ఉన్నాయి. గత ఏడాది ఇదే సీజన్లో మలక్‌పేట్ మార్కెట్‌కు రోజుకు 34 లారీల ఉల్లి రాగా, ఈ ఏడాది 120 లారీల ఉల్లి వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో ఉల్లి పంట ఎక్కువ పండించడంతో అక్కడ ధరలు పడిపోయాయి. దీంతో నగరానికి దిగుమతులు పెరిగాయి. స్థానిక దిగుమతులూ ఎక్కువే... నగర ప్రజల ఉల్లి అవసరాలు దాదాపు 80 శాతం మహారాష్ట్ర నుంచి దిగుమతి అయ్యే ఉల్లితోనే పూర్తి అవుతాయి. తాజాగా తెలంగాణలోని మహబూబ్‌నగర్, మెదక్‌తో పాటు ఇతర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ కర్నూలు, కర్ణాటక నుంచి ఉల్లి ఎక్కువగా దిగుమతి అవుతోంది. దీంతో ధరలు పెరగడంలేదు. మున్ముందు ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి ఎక్కువగా మార్కెట్‌కు దిగుమతి అయితే దాన్ని నిలువ చేసుకోవడానికి స్టోరేజీ సౌకర్యం లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. -
ఉల్లి పతనంతో రైతుకు కన్నీళ్లు
గత మూడేళ్లుగా తాము పండిస్తున్న పంటలకు ధరలు పడిపోవడంతో ఆగ్రహావేశాలకు గురైన రైతులు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, టమేటోలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బఠానీ వంటి కూరగాయలును వీధుల్లో పారేయడం నిత్యం వార్తలకు ఎక్కుతూనే ఉంది. కానీ అమెరికాలో అధిక ఉత్పత్తితో వ్యవసాయ ధరలు పతనమైనప్పడు అమెరికా వ్యవసాయ విభాగం రైతులనుంచి నేరుగా ఉత్పత్తులను కొంటూ సమస్యను పరిష్కరిస్తున్న పద్ధతిని భారత్‌లో ఎందుకు అమలు చేయరు? వినియోగదారుకు మాత్రమే ప్రాధాన్యమిచ్చే వ్యవస్థ నుంచి రైతుకు ప్రాధాన్యమిచ్చే తరహా వ్యవస్థకు భారత్ చోటు కల్పించాలి. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మద్‌నగర్‌లో ఉన్న సంగమ్నెర్కి చెందిన యువరైతు శ్రేయస్ అభాలే. ఇతడి వయస్సు 21 సంవత్సరాలు. 53.14 క్వింటాళ్ల ఉల్లిపాయలు అమ్మిన తర్వాత తాను సంపాదించిన మొత్తం కేవలం రూ. 6 (ఆరు రూపాయలు) మాత్రమే అని తెలుసుకుని ఒక్కసారిగా నివ్వెరపోయాడు. తీవ్రమైన నిరాశా నిస్పృహలతో అతడు తను సంపాదించిన ఆ ఆరు రూపాయలను చెక్కురూపంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవీందర్ ఫడణవీస్‌కు పంపాడు. కొద్ది రోజుల తర్వాత మహారాష్ట్రలోని యోలా తాలూకాలో ఉన్న అండర్సుల్ ప్రాంతానికి చెందిన చంద్రకాంత్ బైకన్ దేశ్‌ముఖ్ అనే మరొక రైతు తాను పండించిన ఉల్లి పంటకు కిలోకి 51 పైసలు మాత్రమే ధర పలకడంతో హతాశుడయ్యాడు. దారుణంగా పడిపోయిన ఉల్లిపాయల ధరకు నిరసనగా అతడు 216 రూపాయలను మహారాష్ట్ర ముఖ్యమంత్రికి మనీఆర్డర్ రూపంలో పంపాడు. మండీ చార్జీలు, రవాణా ఖర్చులు మినహాయిస్తే ఈ సీజన్లో తాను పండించిన ఉల్లిపాయలకు వచ్చిన రాబడి అంతే మరి. ఎంవో వద్దట.. ఆన్లైన్లో పంపాలట..! మహారాష్ట్రలోని నాసిక్ రైతు సంజయ్ సాఠేను వీరిద్దరూ ఆదర్శంగా తీసుకున్నట్లుంది. సాఠే కూడా ప్రధాని విపత్తు సహాయ నిధికి రూ. 1,066ల మనీఆర్డర్‌ను పంపి వార్తలకెక్కాడు. 750 కిలోల ఉల్లిపంటను అమ్మగా, ఖర్చులన్నీ మినహాయించుకున్న తర్వాత సాఠేకి దక్కిన రాబడి ఇదే. ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు ఆ మనీఆర్డర్‌ను స్వీకరించకుండా, మళ్లీ తనకే వెనక్కు పంపడంతోపాటు ఆ సొమ్మును ఆన్లైన్లో పంపమని ఉచిత సలహా ఇవ్వడం చూసి సాఠే విస్తుపోయాడు. ఉల్లి ధర దారుణంగా పడిపోవడంతో, పంటపొలాల్లో నిజంగా రక్తస్నానం చోటు చేసుకుంది. దేశంలోనే ఉల్లిపాయలకు అతిపెద్ద వ్యాపార కేంద్రమైన లసల్గావ్ మండీలో ఉల్లి ధర క్వింటాలు (వంద కేజీలు)కు రూ. 100 నుంచి రూ. 300 వరకు పడిపోయింది. సగటున ఉల్లిరైతులు ఉల్లిసాగుకు అయిన ఖర్చుల్లో 15 శాతానికి మించి రాబడి పొందలేకపోయారు. ఈ ఉత్పాతం కలిగించిన ప్రకంపనలను తట్టుకోలేక నాసిక్ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు. మధ్యప్రదేశ్‌లోని నీముచ్ మండీలో, ఉల్లి ధరలు కిలో 50 పైసలకు పడిపోయాయి. ఇలాంటి అనేక ఘటనల్లో, విసిగిపోయిన రైతులు తమ పంటను వీధుల్లో పారవేశారు. కొంతమంది రైతులు ఉల్లి పంటను రహదారుల పైన కుమ్మరించి ఆ దారెంట వెళుతున్న జనాలకు ఉచితంగా పంచిపెట్టారు. చివరకు వెల్లుల్లి పంటకు కూడా ఇదే గతి పట్టింది. గత సంవత్సరం రాజస్థాన్‌లోని హడోటి (కోటా, బుండి, బరన్, ఝళవర్ అనే నాలుగు జిల్లాలు) రీజియన్‌లోని రైతులు ధర బాగా పలుకుతోందని వెల్లుల్లి పంట సాగుకు మళ్లారు. ఈ సంవత్సరం మార్చి నెలలో పంట చేతికొచ్చింది. కానీ మార్కెట్లో ధర కిలోకు 1 రూపాయి మేరకు పడిపోయింది. మండీకి రవాణా చేయడం కూడా సాధ్యం కాని దుస్థితి ఏర్పడింది. వెల్లుల్లిధరలు అనూహ్యంగా పడిపోవడంతో ఈ ప్రాంతంలో అయిదుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలొచ్చాయి. ఉల్లి, వెల్లుల్లి సాగుదారుల దుస్థితి అసాధారణమైన విషయం కాదు. కొన్ని నెలల క్రితం నాసిక్ మార్కెట్లో టొమేటో టోకు ధరలు 65 శాతం పతనమైనప్పుడు చాలామంది రైతులు తాము పండించిన టొమేటో పంటను రోడ్లమీదే కుప్పపోశారు. ఇలా ధరలు కుప్పకూలే ధోరణి మన దేశానికి కొత్తేమీ కాదు. గత మూడేళ్లుగా తాము పండిస్తున్న పంటలకు ధరలు పడిపోవడంతో ఆగ్రహావేశాలకు గురైన రైతులు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, టొమేటోలు, క్యాబేజీ, కాలిఫ్లవర్, బఠానీ వంటి కూరగాయలను వీధుల్లో పారేయడం నిత్యం వార్తలకు ఎక్కుతూనే ఉంది. నిజానికి గతంలో ఒక రైతు తాను పండించిన దానిమ్మకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రోడ్డుమీద కూర్చుని దానిమ్మ పళ్లను ఒకదాని తర్వాత ఒకటిగా పగులగొడుతూ తన నిస్పృహను వ్యక్తపరుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పంట చేతికి వచ్చాక మార్కెట్లో ధరలు కుప్పగూలిపోవడం అనేది వేలాది వ్యవసాయదారుల జీవితాలను ఎలా దెబ్బ తీస్తోందో తెలుసుకోవడానికి ఇలాంటి ఉదాహరణలు నిత్యం సమాజం అనుభవంలోకి వస్తూనే ఉన్నాయి. కనీస మద్దతు ధరను వెక్కిరిస్తున్న వ్యవసాయ ధరల పతనం నవంబర్ నెలలోనే కనీస మద్దతు ధరకంటే కనిష్ట స్థాయికి బహిరంగ మార్కెట్లో ధరలు పతనమైపోయినప్పుడు మన దేశ రైతులు ఇంతకు మించి ఏం చేయగలరని ఆశించాలి? రైతులు పండించే పంటల ధరలు మొత్తంగా 15 నుంచి 25 శాతం వరకు పడిపోవడం ప్రస్తుతం సాధారణ కృత్యమైపోయింది. చివరకు వరిధాన్యం విషయంలో కూడా కనీస మద్దతు ధర కింద అదనపు వరి ధాన్యాన్ని సేకరించడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్న దశలోనూ వరి ధర 20 శాతం మేరకు పడిపోయింది. ప్రతి సంవత్సరం 23 వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తున్న నేపథ్యంలో వీటిలో 21 పంటల ఉత్పత్తి అనూహ్య స్థాయిలో మిగులు రూపంలో పోగుపడటం ఫలితంగానే ధరలు కుప్పకూలుతున్నాయని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. ఒక సంవత్సరం ఏదైనా పంటకు అధిక ధర లభించడం, వాతావరణం అనుకూలించడం పట్ల ఆకర్షితులైన రైతులు ఆ మరుసటి సీజ నులో రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తికి తీవ్రంగా శ్రమిస్తుంటారు. కానీ వారి ఆ ఉత్సాహం, చొరవ తాత్కాలికం మాత్రమే. ఎందుకంటే గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కుప్పకూలి పోతూ రైతులను సంక్షోభంలో ముంచెత్తుతున్నాయి. మన ఎగుమతులకు సుస్థిర మార్కెట్‌ను కల్పించడంలో వైఫల్యానికి కారణంగా దేశీయ ఎగుమతి, దిగుమతి పాలసీని తప్పుపట్టడం సహజమే. అదే సమయంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ప్రవేశపెడతామని ప్రభుత్వం చేస్తున్న వాగ్దానం రైతులను నష్టాల బారినుంచి గట్టెక్కించడంలో విఫలమయింది. వాస్తవానికి ఆపరేషన్ ఫ్లడ్ విధానాలకు అనుగుణంగా ఆపరేషన్ గ్రీన్‌ని ప్రారంభించినప్పుడు టొమేటో, ఉల్లి, బంగాళాదుంప అనే మూడు కీలక పంటల విషయంలో మార్కెట్ జోక్యానికి వీలుకల్పించాలని నిర్ణయించారు. ధరలు పెరిగే అవకాశముందనేది వార్తల రూపంలో ఉన్నప్పుడే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. కానీ పాలు వంటి అతిత్వరగా పాడైపోయే ఉత్పత్తి కోసం సమర్థవంతంగా సహకార వ్యవస్థను దేశంలో ఏర్పర్చుకోగలిగినప్పుడు, ఇదే వ్యూహాన్ని ఇతర కీలక వ్యవసాయోత్పత్తుల విషయంలో ఎందుకు అమలు చేయలేరన్నది ప్రశ్న. అమెరికాలో, ధరల పతనం నుంచి రైతులను కాపాడటంలో ప్రైవేట్ మార్కెట్లు విఫలమైనప్పుడు అమెరికా వ్యవసాయ విభాగం (యుఎస్డిఎ) రైతుల వద్ద ఉన్న మిగులుపంటకు ధర కల్పించే విషయమై పదే పదే చర్యలు తీసుకుంటుంది. 2016లో మార్కెట్‌ధరలు పతనమైనప్పుడు అమెరికా రైతులనుంచి 20 మిలియన్ డాలర్ల విలువైన కోటి పది లక్షల టన్నుల చీజ్‌ని (జున్నుగడ్డలాంటిది) యుఎస్డిఎ సేకరించింది. ఆ సందర్భంగా అమెరికా వ్యవసాయ కార్యదర్శి టామ్ విల్శాక్ మాట్లాడుతూ ‘‘వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు అనేది సమగ్రమైన భద్రతా నెట్‌వర్క్‌లో భాగమని, 30 ఏళ్ల కాలంలో కనివీనీ ఎరుగని రీతిలో ఉత్పత్తయిన చీజ్ మిగులును తగ్గించడానికి, సమాజంలో అత్యవసరమైన వారికి ఈ అత్యధిక ప్రొటీన్ విలువలున్న ఆహారాన్ని అందించడానికి ఈ నెట్వర్క్ తోడ్పడుతుంద’’ని చెప్పారు. రైతు కేంద్రక భద్రతా వ్యవస్థ అవశ్యం అంతకుముందు కూడా, యుఎస్డిఎ కోటి పౌండ్ల స్టాబెర్రీలను కొనుగోలు చేసి వాటిని పాఠశాలలకు, సమాజంలో అవసరమైన వారికి పంపిణీ చేసింది. అధిక మిగులుతో సతమతమవుతున్న టొమేటో రైతులనుంచి 2011లో తాజా టొమేటాలను 6 మిలియన్ డాలర్ల విలువైన టొమేటాలను కొనుగోలు చేసింది. ఇదేవిధంగా భారత ఆహార, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ అదనంగా ఉత్పత్తయిన టొమేటో, ఉల్లి, బంగాళాదుంపలను ఎందుకు కొనలేదు అని నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. అలాగే త్వరగా పాడైపోయే అదనపు ఆహార పదార్థాలను ఆహార భద్రత వలయంలో లేని వారికి మనం ఎందుకు పంపిణీ చేయలేకపోతున్నట్లు? ఈ దేశంలో ప్రతి రాత్రీ 2 కోట్లమంది ప్రజలు పస్తులతో నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే అదనపు టొమేటాలను వీధుల్లో పారవేస్తుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అలాగని, అమెరికా ప్రతి సందర్భంలోనూ ఈ వ్యవసాయ ధరల పతనాన్ని పరిష్కరిస్తూ వచ్చిందని చెప్పలేం. 2002లోనే అమెరికా ప్రైజ్–లాస్ కవరేజ్ సిస్టమ్ పేరిట రైతులకు మద్దతు ప్రకటించేందుకు యుఎస్ ఫార్మ్ బిల్ తోడ్పడింది. 2014లో కూడా వేరుశనగ ఉత్పత్తిదారులు ధరల పతనం సంక్షోభంలో కూరుకుపోతున్నప్పుడు ఈవిధమైన ఇన్కమ్ సపోర్టు వ్యవస్థ సంబంధిత రైతులను ఎంతగానో ఆదుకుంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం పెరిగిపోయినప్పుడు వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకునే భారతీయ మార్కెట్ ఇంటర్వెన్షన్ సిస్టమ్‌లా కాకుండా, అమెరికాలో రైతులకు భద్రతా నెట్ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేస్తుండటం గమనార్హం. దేవిందర్‌శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
కాసింత ఘాటు!
సాక్షి, సిటీబ్యూరో: ఉల్లి ధరలు చాలావరకు తగ్గాయని నగరవాసులు ఆనందపడుతున్న తరుణంలో ఇటీవల అవి స్వల్పంగా పెరిగిన పరిస్థితి నెలకొంది. గతవారం దసరా పండగ, సెలవుల దృష్ట్యా మహారాష్ట్ర నుంచి నగరానికి నిత్యం రావాల్సిన ఉల్లి దిగుమతులు తగ్గడంతో ధరలు స్వల్ప ంగా పెరిగాయి. మహారాష్ట్ర నుంచి మార్కెట్‌కు ఉల్లి సరఫరా తగ్గడంతో గోదాముల్లో నిల్వ ఉన్న సరుకును హోల్‌సేల్ వ్యాపారులు కాస్త ధరలు పెంచి విక్రయించారు. గతవారం ఉల్లి కిలో రూ.12 నుంచి రూ. 18 వరకు ఉండగా.. ప్రస్తు తం రూ.15 నుంచి రూ. 23 వరకు పలుకుతోంది. నగరంలోని బోయిన్పల్లి, గుడిమల్కాపూర్, మలక్‌పేట్ మార్కెట్లకు కర్నూలు, కర్ణాటకతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి లోకల్ ఉల్లి దిగుమతులు పెరిగాయి. దీంతో ధరలు నియంత్రణలోకి వచ్చే అవకాశముంది. ఒకవేళ గత వారం మాదిరిగా మార్కెట్లకు ఉల్లి దిగుమతి తగ్గితే ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉండేదని, ప్రస్తుతం డిమాండ్‌కు సరిపడా ఉల్లి దిగుమతి అవుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దిగుమతులు తగ్గడం వల్లే.. సాధారణంగా నగర ఉల్లి అవసరాలకు దాదాపు 60 శాతం మహారాష్ట్ర నుంచే దిగుమతి అవుతాయి. పుణె, నాసిక్‌తో పాటు షోలాపూర్ తదితర జిల్లాల నుంచి నగర మార్కెట్‌కు రోజు దాదాపు 60 లారీల ఉల్లి దిగుమతి అవుతోంది. మిగతా 40 శాతం కర్ణాటక, కర్నూలుతో తెలంగాణ జిల్లాల నుంచి వస్తుంది. మహారాష్ట్ర రోజు దిగుమతి అయ్యే ఉల్లి అక్కడ సకాలంలో వర్షాలు కురవకపోవడం, రైతులు ఎక్కువశాతం ఏడాది ఉల్లి సాగు వేయకపోవడంతో ముంబైకి ఉల్లిని ఎగుమతి చేయడంతో నగరానికి దిగుమతులు తగ్గాయి. ఒక్క మలక్‌పేట్ ఉల్లి మార్కెట్‌కు రోజూ దాదాపు 20 వేల క్వింటాళ్ల దిగుమతి అవుతుంది. గతవారం కేవలం 5 వేల నుంచి 8 వేల క్వింటాళ్ల ఉల్లి దిగుమతులు జరిగాయి. దీంతో ధరలు హోల్‌సేల్ మార్కెట్లో కిలో ఉల్లి రూ. 8 నుంచి రూ.10 ఉండగా.. గురువారం కిలో రూ.15 నుంచి రూ. 20కి పెరిగాయి. ధరలు విపరీతంగా పెరుగుతాయని.. గతవారం ఉల్లి దిగుమతులు తగ్గడంతో కొంతమంది హోల్‌సేల్ వ్యాపారులు, రిటైల్ వ్యాపారులు ఉల్లి కృత్రిమ కొరత సృష్టించడానికి ప్రయత్నించారు. కానీ మార్కెట్ అధికారులు మహారాష్ట్ర నుంచి దిగుమతులు తగ్గాయని గ్రహించి కర్ణాటక, కర్నూలు నుంచి ఉల్లి దిగుమతులు చేయాలని వ్యాపారులను సూచనలు జారీ చేశారు. దీంతో మంగళవారం నుంచి మలక్‌పేట్ మార్కెట్‌కు వంద లారీల ఉల్లి దిగుమతి అయ్యింది. గతేడాది కంటే ఈ ఏడాది ఉల్లి ఎక్కువగా దిగుమతి అవుతుంది. ఇక గురువారం అయితే రికార్డు స్థాయిలో 138 లారీల ఉల్లి దిగుమతులు జరిగాయి. నవంబర్ వరకూ నిలకడగానే.. ఉల్లి దిగుమతులు అనుకున్న స్థాయిలో జరగకపోవడంతో ధరలు పెరుగుతాయని మార్కెట్లో వదంతులు వినిపిస్తున్నాయి. ఉల్లి ధరలు అమాంతంగా పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్న విషయం అవాస్తవం. గతవారం ఉల్లి దిగుమతులు తగ్గడంతో ధరలు కిలోకు రూ.3 నుంచి రూ. 5 పెరిగాయి. నవంబర్ చివరి వరకు ఉల్లి ధరలు నిలకడగానే ఉంటాయి. – అనంతయ్య , స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ మలక్‌పేట్ మార్కెట్ -
ఉల్లి.. తల్లడిల్లి!
సాక్షి, వికారాబాద్, పరిగి : ఉల్లి ధరలు రోజురోజుకు పతనమయ్యాయి. క్వింటాలు ఉల్లి ధర రూ. 600 నుంచి 800 లకు పడిపోయింది. 60 కిలోల ఉల్లి బ్యాగు రూ. 350 నుంచి 400 చొప్పున అమ్ముడవుతోంది. మూడు నెలల క్రితం వరకు కిలో రూ. 40 నుంచి రూ. 50 ధర పలికిన ఉల్లి ఇప్పుడు మరింత పడిపోయింది. నాడు వినియోగదారునికి కన్నీళ్లు పెట్టించిన ఉల్లి.. నేడు రైతును పెట్టిస్తోంది. పంట వేసే సమయంలో ధరలు ఆకాశాన్నంటడం.. పంట దిగుబడి వచ్చే సమయంలో పాతాళానికి పడిపోవడంతో రైతన్న దిక్కుతోచనిస్థితికి గురవుతున్నారు. ధరల స్థిరీకరణ లేకపోవటమే ఇందుకు కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు అటు రైతును ఇటు వినియోగదారులను నిండా ముంచుతుండగా దళారులకు మత్రం లక్షలు ఆర్జించి పెడుతోంది. దిగుబడి బాగానే ఉన్నా.. ఈసారి ఉల్లి రైతుకు మంచి దిగుబడులే వచ్చాయి. అయినప్పటికీ పంట చేతికి వచ్చే సమయానికి ధరలు పూర్తిగా పడిపోవటంతో పెట్టుబడులు కూడా రావటంలేదంటూ రైతులు లబోదిబో మంటున్నారు. మూడు నెలల క్రితం వరకు ఆకాశంలో ఉన్న ఉల్లి ధరలు ఇప్పుడు పూర్తిగా పడిపోయాయి. పట్టించుకోని సర్కారు.. ధరలు పెరిగిన ప్రతిసారి సర్కారు కంటితుడుపు చర్యలకే పరిమితమవుతూ వస్తుందే తప్ప శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడంలేదు. ధరలు పెరిగి పోయి వినియోగదారుడు అల్లాడుతున్నారని సాగు విస్తీర్ణం పెంచేందుకు రాయితీపై విత్తనాలివ్వటం వరకే సర్కారు పరిమిత మయ్యింది. ఆ తరువాత పంట చేతికి వచ్చే సమయానికి రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమవుతోంది. ప్రస్తుతం రైతులు పంట పొలాల్లోంచి తీయక ముందే ఉల్లి ధరలు క్వింటాలుకు రూ. 700 పలుకుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం రైతును ఆదుకునేందుకు కంటితుడుపు చర్యలు తీసుకోవటం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ధరల స్థిరీకరణ ఏదీ? రైతులు పండించే పంట ఏదైనా.. అటు రైతులు ఇటు వినియోగదారుడు నష్టాల పాలు కాక తప్పటంలేదు. కందులు, వేరుశనగ, పత్తి, మొక్క జొన్నలు ఇలా పంట ఏదైనా విత్తనాలు వేసే సమయంలో ధరలు ఆకాశంలో.. రెండు మూడు నెలల్లో పంట చేతికొచ్చే నాటికి ధరలు పాతాళానికి చేరుకోవటం సర్వసాధారణమై పోయింది. ఆరుగాలం పండించిన రైతులు.. కిలో కొనుగోలు చేసి తినే వినియోగదారులు ఇద్దరూ నష్టాలపాలు కాక తప్పటంలేదు. ఇదే సమయంలో కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్న దళారులు మాత్రం అమాంతం ధరలు పెంచేసి లక్షలు ఆర్జిస్తున్నారు. ఇలా ప్రతి సీజ¯న్‌లోనూ పరిస్థితి పునరావృతం కావటానికి కారణం కేవలం ధరల స్థిరీకరణ లేకపోవటమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పెరిగిన సాగు విస్తీర్ణం ఉల్లి సాగు విస్తీర్ణం గననీయంగా పెరిగింది. జిల్లాలో సాధారణ సాగు వీస్తీర్ణం 3000 ఎకరాలు కాగా ఈ సారి 4,500 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. పరిగి నియోజకవర్గంలో సాధారణ సాగు 200 ఎకరాలు కాగా ఈ సంవత్సరం 300 ఎకరాల్లో ఉల్లి సాగయ్యింది. దిగుబడి ఎకరానికి 100 క్వింటాళ్ల వరకు వచ్చేది కాగా ఈ సారి 130 నుంచి 150 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అయితే హైబ్రీడ్ రకాల ఉల్లి సాగు చేయటంవల్ల దిగుబడి పెరిగి నట్లు ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
దిగొచ్చిన ఉల్లి!
సాక్షి, సిటీబ్యూరో: కొన్ని నెలలుగా వినియోగదారులను కన్నీళ్లు పెట్టించిన ఉల్లి ధరలు బుధవారం భారీగా తగ్గుముఖం పట్టాయి. హోల్‌సేల్‌గా కిలో రూ.3, రిటైల్‌గా రూ.7 పలికాయి. ఈ ఏడాది ఇదే కనిష్ట ధర అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఉల్లి పంట నగరంలోని మలక్‌పేట్ మార్కెట్‌కు భారీగా దిగుమతి కావడంతో తక్కువ ధర పలికింది. దిగుమతుల పెరుగుదలే కారణం.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మలక్‌పేట్ మార్కెట్‌కు నిత్యం దాదాపు వెయ్యి టన్నుల ఉల్లి దిగుమతి అవుతోంది. ప్రస్తుతం మలక్‌పేట్ హోల్‌సేల్ మార్కెట్‌కు తెలుగు రాష్ట్రాల్లోని మెదక్, తాండూరు, మహబూబ్‌నగర్, కర్నూలు, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలనుంచి ఉల్లి దిగుమతులు పెరిగాయి. దీంతో హోల్‌సేల్‌గా కిలో ఉల్లి రూ.3కు చేరింది. వారం పది రోజుల క్రితం హోల్‌సేల్ మార్కెట్లో క్వింటా లు ఉల్లి రూ.800–1000 వరకు ఉండేది. దీం తో రిటైల్ మార్కెట్లో కిలో రూ.15– 20 పలి కింది. ప్రస్తుతం కొత్త పంట వస్తుండడంతో ధరలు భారీగా తగ్గాయి. ఫస్టు క్వాలిటీ ఉల్లి కిలోకు రూ.7 ఉండగా, మధ్య రకం క్వాలిటీ రూ.5గా ఉంది. దీంతో రిటైల్ మార్కెట్లో ఒకే సారి సాధారణ ఉల్లి ధరలు పడిపోయాయి. భారీగా కొత్త ఉల్లి.. తాండూరు, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డితో పాటు కర్ణా టక, మహారాష్ట్ర ల నుంచి ఎక్కువ మొత్తంలో కొత్త ఉల్లి దిగుమతి అవుతోంది. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. ఏజెంట్లు అక్రమాలకు పాల్పడితే రైతులు ఫిర్యాదు చేయాలి. అతిత్వరలో ట్రోల్ ఫ్రీ నంబర్ ప్రారంభిస్తున్నాం. – జె.అనంతయ్య, సెలక్షన్ గ్రేడ్–1కార్యదర్శి, హైదరాబాద్ మార్కెట్ సొసైటీ -
మధ్య 'ధర' గతి
సాక్షి, అమరావతి: కూరగాయల ధరాఘాతానికి పేదలు, మధ్యతరగతి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. చుక్కల్లోంచి దిగిరాని ధరలను చూసి కలవరపడుతున్నారు. మొన్నటి వరకూ అయిదారు రూపాయలున్న కొత్తి మీర కట్ట నేడు రూ.40కి ఎగసింది. రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, నగరాల్లో కిలో క్యారెట్ రూ.60, టమాట రూ. 50, చిక్కుడు రూ.75, బీన్స్ రూ.80 పలుకుతున్నాయి. కిలో రూ.40 – 45 పెట్టినా నాణ్యమైన ఉల్లిపాయలు దొరకడం లేదు. కూరగాయల ధరలు వింటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయని అల్పాదాయ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. నెల కిందట కిలో రూ.10 ఉన్న ఉల్లి నేడు రూ.40 – 45 పలుకుతోంది. బెండ రూ.15 – 20 నుంచి రూ.40కి ఎగబాకింది. కిలో రూ. 15 – 20 ఉన్న టమాటా ధర నేడు ఏకంగా రూ.50కి చేరింది. ప్రాంతాన్ని, కాయల నాణ్యతను బట్టి ధరల్లో కొంత వ్యత్యాసం ఉంది. మొన్నటి వరకూ రూ.5కు ఇచ్చిన తోటకూర కట్ట ఇప్పుడు రూ.10 నుంచి 15కు పెరిగింది. వర్షాకాలంలో ధరలు తగ్గాలి కానీ.. సాధారణంగా వర్షాకాలంలో కూరగాయలు, ఆకుకూరల ధరలు చౌకగా ఉంటాయి. ప్రస్తుతం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇరవై రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్, కర్నూలు తదితర జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగైన టమాటా తోటల్లోని కాయలు ఎడతెరపిలేని వర్షాలకు రాలిపోయాయి.. కుళ్లిపోయాయి. మిరప, బెండ, వంగ తదితర తోటలు కూడా వర్షాలకు దెబ్బతిన్నాయి. క్యారెట్, బీన్స్ కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వస్తున్నాయి. అక్కడ కూడా వర్షాల కారణంగా తోటలు పాడై దిగుబడి పడిపోయింది. కార్తీక మాసం రాకతో చాలామంది అయ్యప్ప, శివమాలలు ధరించారు. వీరంతా శాఖాహారమే తీసుకుంటున్నారు. దీంతో కూరగాయలు, ఆకు కూరలకు గిరాకీ మరింత పెరిగింది. ఉల్లి ధర.. రెండు రెట్లు పెరుగుదల మన రాష్ట్రానికి మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి అవుతోంది. రాష్ట్రంలోని కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లో కూడా ఉల్లి ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతుంది. సెప్టెంబర్‌తో ముగిసిన ఖరీఫ్ సీజన్లో మొదట వర్షాభావం వల్ల తక్కువ విస్తీర్ణంలోనే ఉల్లి సాగైంది. ఈ కొద్దిపాటి పంట కోత దశకు వచ్చిన సమయంలో గత 20 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాడైంది. ఉల్లి గడ్డలు పొలాల్లోనే కుళ్లిపోయాయి. మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి. దీంతో 20 రోజుల కిందట ఉన్న ధరలతో పోల్చితే ఉల్లి ధర రెండు రెట్లు పెరిగింది. డిమాండ్, సప్లయిల మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడటంవల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కూరగాయల ధరలు ఇంకా పెరుగుతాయంటున్నారు. డిమాండ్‌ను, కొరతను సాకుగాచూపి వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచారనే విమర్శలూ ఉన్నాయి. పట్టించుకోని సర్కార్ సాధారణంగా కూరగాయలు వంటి నిత్యావసరాల ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి రాయితీ ధరలకు కూరగాయలను అందించే ఏర్పాట్లు చేయాలి. ఇందుకోసం ధరల స్థిరీకరణ నిధిని వినియోగించాలి. రైతుల నుంచి మార్కెట్ రేటుకు ప్రభుత్వం కూరగాయలు కొనుగోలు చేసి సబ్సిడీ ధరలతో వినియోగదారులకు అందించే ఏర్పాట్లు చేయాలి అయితే ప్రస్తుతం కూరగాయల ధరలు మండుతున్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై పేద మధ్యతరగతి వర్గాలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నాయి. కిలో దొండకాయలు 40 రూపాయలు.. వీటి రేటు ఎక్కువగా ఉంది కదాని వంకాయలు కొందామనుకుంటే దొండకాయని మించిపోయి రూ.60 పలుకుతోంది. ఆకు కూరల ధరలూ అందేలా లేవు. ఉల్లి ధరైతే ఉరుకులు పరుగులు పెడుతోంది. చుక్కలనంటి దిగిరానంటోంది.. నెల కిందట కిలో పట్టుమని పది రూపాయలు కూడా లేని ఉల్లి.. నేడు 40 రూపాయలకు చేరింది. ఇక టమాటాదీ అదే బాట.. -
ఐటీ దాడులు : దిగొచ్చిన ఉల్లి ధరలు
సాక్షి, నాసిక్: ఉల్లి ధరలు భారీగా కిందకి దిగొచ్చాయి. లాసల్గావ్ వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ) వద్దనున్న దేశంలోని అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్లో ఉల్లి ధరలు సుమారు 35 శాతం వరకు తగ్గాయి. ఈ మేర ధరలు తగ్గడానికి ప్రధాన కారణం నాసిక్‌లో ఉల్లి ట్రేడర్లకు సంబంధించిన ఏడుగురిపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు నిర్వర్తించడమే. ఏడుగురు అగ్ర ఉల్లి ట్రేడర్లకు సంబంధించి లాసల్గావ్, నాసిక్ జిల్లాల సమీప ప్రాంతాల్లో 25 ప్రదేశాల్లో ఐటీ దాడులు నిర్వర్తించింది. నాసిక్ యూనిట్ డిపార్ట్మెంట్కు చెందిన 120 మంది అధికారులు ఈ సెర్చ్, సర్వే ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు ఓ సీనియర్ ఐటీ అధికారి చెప్పారు. లాసల్గావ్ ఉల్లి ట్రేడర్ల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని తాము సేకరించినట్టు చెప్పారు. భవిష్యత్తులో ధరలను పెంచడానికి ఉత్పత్తిని మార్కెట్లకు రానియకుండా ఆపుతున్నారు. వాటిని అక్రమంగా నిల్వ ఉంచుతున్నట్టు తెలిపారు. ధరలు పడిపోయినప్పటి నుంచి వ్యవసాయదారుల నుంచి ఉల్లిని ట్రేడర్లు కొని, తర్వాత వాటిని ఎక్కువ ధరలకు మార్కెట్లో అమ్ముతున్నట్టు అధికారి పేర్కొన్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్ మరో రెండు, మూడు రోజులు కొనసాగే అవకాశాలున్నాయని కూడా అధికారులు చెప్పారు. -
ఉల్లిపాయలు... కిలో రూ. 1
ఉల్లిపాయలు ఎక్కువగా పండే మహారాష్ట్రలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. లాసల్గావ్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో క్వింటాల్ ఉల్లిపాయలను కనిష్ఠంగా రూ. 100 నుంచి గరిష్ఠంగా రూ. 425 చొప్పున తీసుకుంటున్నారు. అంటే కిలో రూ. 1 నుంచి రూ. 4.25 మాత్రమే అన్నమాట. గడిచిన నాలుగేళ్లలో కూడా బాగా డిమాండ్ ఉన్నప్పుడు గరిష్ఠంగా క్వింటాల్‌కు రూ. 716 మాత్రమే ధర వచ్చింది. ఉల్లిపాయల దిగుబడి చాలా ఎక్కువగా ఉండటం, డిమాండు మాత్రం అంతగా లేకపోవడంతో రేట్లు పడిపోయాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఆగస్టు 16న క్వింటాల్‌కు రూ. 150 మాత్రమే పలికింది. రైతులు భారీ మొత్తంలో ఉల్లిపాయలు తీసుకొస్తున్నా, డిమాండు మాత్రం అంత లేదని.. దానికితోడు సరుకు కూడా పాడవుతోందని మార్కెట్ కమిటీ చైర్మన్ జయదత్త హోల్కర్ తెలిపారు. మంచి ఉల్లిపాయలకైతే క్వింటాలు రూ. 450 వరకు ధర వస్తోందని, ఓ మాదిరి వాటికి వంద రూపాయల కంటే రావట్లేదని అన్నారు. చాలావరకు సరుకు మధ్యప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ట్రాల నుంచి వస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో కోసిన ఉల్లిపాయలను ఇప్పుడు మార్కెట్‌కు తెస్తున్నారని, ఇవి నాలుగైదు నెలల క్రితం నాటివి కావడంతో నాణ్యత తగ్గిపోతోందని నాఫెడ్ డైరెక్టర్ నానాసాహెబ్ పాటిల్ చెప్పారు. -
ఉచితంగా ఉల్లిపాయలు..
భోపాల్: నిన్న మొన్నటివరకూ కన్నీళ్లు తెప్పించిన ఉల్లిపాయలను...ఇప్పుడు ఎలా వదిలించుకోవాలా అని మధ్యప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ఉల్లిగడ్డలను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది మేలో ఉల్లి ధరలు గణనీయంగా పడిపోయాయి. దీంతో రైతులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం వారివద్ద నుంచి కేజీ ఆరు రూపాయలకు 10.4 లక్షల క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసింది. అయితే కొనుగోలు చేసిన ఉల్లిని నిల్వ చేసేందుకు రాష్ట్రంలో సరైన గిడ్డండి సదుపాయం లేకపోవడం ఇప్పుడు సర్కార్‌కు తలనొప్పి వ్యవహారంగా మారింది. నిల్వ సదుపాయం లేకపోవడంతో వర్షాకాలంలో అవి కుళ్లిపోవడం మొదలెట్టాయి. దీంతో కొనుగోలు చేసిన ఉల్లిని వదిలించుకోవడానికి ప్రభుత్వం తక్కువ ధరకు రేషన్ దుకాణాల ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఉచితంగా కూడా ఇచ్చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే రవాణా ఖర్చుల నిమత్తం కేజీ ఉల్లిపాయలకు కేవలం ఒక్క రూపాయిని వసూలు చేయనుంది. సో మీకు ఉల్లిపాయలు కేజీ రూపాయికి కానీ, లేదా ఫ్రీగా కావాలనుకుంటే మధ్యప్రదేశ్ వెళ్లి తెచ్చుకోవచ్చు. మరోవైపు మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆ రాష్ట్రంలో కూడా ఉల్లి ధరలు దారుణంగా పడిపోయాయి. కేజీ ఉల్లిపాయలు అయిదు పైసలు పలుకుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
క్షీణతలోనే... టోకు ద్రవ్యోల్బణం
అక్టోబర్‌లో మైనస్ 3.81 శాతం * 12 నెలల నుంచీ ఇదే ధోరణి * అంతర్జాతీయ కమోడిటీ ధరల తగ్గుదల ఎఫెక్ట్ * నిత్యావసరాల్లో... పప్పులు, ఉల్లి ధరలు భారం న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 12వ నెలలోనూ అసలు పెరక్కపోగా... మైనస్‌లోనే కొనసాగింది. అక్టోబర్‌లో -3.81%గా నమోదయ్యింది. సెప్టెంబర్‌లో ఈ రేటు -4.54%. 2014 ఇదే నెలలో ఈ రేటు 1.66%గా ఉంది. దేశంలో టోకు ధరల సూచీ అసలు పెరక్కపోడానికి కారణాల్లో అంతర్జాతీయ కమోడిటీ ధరలు కనిష్ట స్థాయిల్లో ఉండడం ఒకటి. అయితే టోకున చూస్తే... నిత్యావసరాల్లో పప్పులు, ఉల్లి ధరలు తీవ్రంగా ఉన్నాయి. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... మూడు ప్రధాన విభాగాల వార్షిక రీతిన వివరాలు... మూడు విభాగాలూ మైనస్‌లోనే... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్-ఫుడ్, మినరల్స్ విభాగాలతో కూడిన ఈ కేటగిరీలో ద్రవ్యోల్బణం -0.36% క్షీణతలో ఉంది. అయితే ప్రధానంగా ఫుడ్ ఆర్టికల్స్‌ను ఇందులో చూస్తే పెరుగుదల రేటు 2.44%. ఫ్యూయల్ అండ్ పవర్: ద్రవ్యోల్బణం క్షీణతలో -16.32%గా ఉంది. తయారీ: సూచీలో దాదాపు 65 శాతం వాటా ఉన్న ఈ రంగంలో కూడా ద్రవ్యోల్బణం -1.67 శాతంగా ఉంది. ఆహార ఉత్పత్తులు...: ఫుడ్ కేటగిరీలో టోకు ద్రవ్యోల్బణం మొత్తంగా 2.44% పెరిగితే... ప్రధానంగా పప్పులు, ఉల్లి ధరలు సామాన్యునికి చుక్కలు చూపిస్తున్నాయి. పప్పు దినుసుల ధరలు వార్షికంగా 52.98% పెరిగాయి. ఉల్లి ధరలు 85.66% అధికంగా ఉన్నాయి. కూరగాయల ధరలు 2.56% పెరిగాయి. ఈ నెలలో ధరలు పెరిగిన ఆహార ఉత్పత్తుల్లో పాలు (1.75%), గోధుమలు (4.68%) ఉన్నాయి. ధరలు తగ్గిన ఉత్పత్తుల్లో ఆలుగడ్డ (-59%) ఉంది. పాలసీ సమీక్షపై దృష్టి... డిసెంబర్ 1న ఆర్బీఐ పాలసీ సమీక్షను నిర్వహించనుంది. ఈ సందర్భంగా నిర్ణయానికి అక్టోబర్ టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. అక్టోబర్‌లో వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా ఈ రేటు నాలుగు నెలలుగా పెరుగుతూ వస్తోంది. పప్పులు, ఇతర ఆహార ఉత్పత్తుల రిటైల్ ధరల పెరుగుదలే దీనికి కారణం. -
దసరా సంభారం
సాక్షి, బెంగళూరు: సామాన్యుడికి ధరల శరాలు గుచ్చుకుంటున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న పప్పుల ధరలు పండగ సంబరాలను కాస్తా దూరం చేస్తున్నాయి. కందిపప్పు ధర డబుల్ సెంచరీకి చేరుకోవడంతో ఇక సామాన్యుడికి పండుగ సంతోషం దక్కే అవకాశం లేదని నగర వాసులు ఉసూరుమంటున్నారు. నిన్న మొన్నటి దాకా మధ్యతరగతి జీవికి ఉల్లిపాయ చుక్కలు చూపిస్తే ఇప్పుడు ఆ స్థానంలో పప్పు దినుసులు చేరిపోయాయి. కేజీ చికెన్ ధర కంటే కేజీ కందిపప్పు ధరే ఎక్కువైపోయింది. దీంతో ఇప్పుడు సామాన్యుడికి చేరువగా ఉన్న పప్పు కాస్తా ధనవంతుల ‘మెను’లో చేరిపోయింది. ఈ ధరల శరాలు నేరుగా సామాన్యుడి జేబును తాకుతుండడంతో మధ్యతరగతి జీవి జేబుకు చిల్లులు పడుతున్నాయి. డబుల్ సెంచరీకి చేరిన కందిపప్పు..... ప్రస్తుతం రాష్ట్ర మార్కెట్లో కేజీ కందిపప్పు ధర రూ.200గా పలుకుతోంది. అంతేకాదు కందిపప్పుతో పాటు ఉద్దిపప్పు, శనగపప్పు, వేరుశనగ గింజలు ఇలా పప్పుధాన్యాలన్నీ కందిపప్పు రేటుతో పోటీపడుతూ పెరిగిపోతున్నాయి. నెల రోజుల క్రితం రూ.100గా ఉన్న కేజీ కందిపప్పు ధర అమాంతం రూ.200కు చేరిపోవడంతో బడ్జెట్‌ను సరిచూసుకోవాల్సిన పరిస్థితుల్లో సామాన్యుడు పడిపోయాడు. ఇక పప్పుధాన్యాల ధరలు ఈ విధంగా పెరిగిపోవడానికి వర్షాభావ పరిస్థితుల కారణంగా పప్పుధాన్యాల దిగుబడి తగ్గిపోవడం ప్రధాన కారణం కాగా, ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని వ్యాపారులు మరింతగా మార్కెట్లో కొరతను ృసష్టిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఇక పప్పుధాన్యాల రేటు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో దసరా పండుగ సంతోషం సామాన్యుడిలో కనిపించడం లేదు. దసరా పండుగ సందర్భంలో దుర్గామాతకు ఏ నైవేద్యం వండాలన్నా మండుతున్న పప్పుధాన్యాల ధరల వైపు దీనంగా చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతం సగటు మధ్యతరగతి జీవికి ఏర్పడుతోంది. హోటళ్లలోనూ పెరిగిన రేట్లు.... ఇక కందిపప్పు, ఉద్దిపప్పు ధరలు ఆకాశాన్నంటే దిశగా పరుగెడుతున్న నేపథ్యంలో నగరంలోని హోటళ్లలో సైతం అల్పాహార పదార్థాల ధరలు పెరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే నగరంలోని హోటళ్ల యజమానుల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇడ్లీ, వడ, దోసె ఇలా అన్ని అల్పాహారాల ధరలను రూ.5చొప్పున పెంచాలని హోటళ్ల యజమానుల సంఘం తీర్మానించినట్లు తెలుస్తోంది. ఈ ధరలు మరికొద్ది రోజుల్లోనే అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. -
అనూహ్యంగా పడిపోయిన ఉల్లి ధరలు
-
దిగిరాని ఉల్లి ధరలు
క్వింటాలుకు గరిష్టంగా రూ. 4,300 కనిష్టంగా రూ. 3 వేలు దేవరకద్ర : ఉల్లి ధరలు దిగి రావడం లేదు. ఒక వారం కొంత వరకు ధరలు దిగినా, మరో వారం మరింత పెరుగుతున్నాయి. దేవరకద్ర మార్కెట్లో ప్రతి బుధవారం జరిగే ఉల్లిపాయల బహిరంగ వేలం జోరందుకుంది. ధరలు బాగా పెరగడంతో రైతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ధరలు పెరగడంతో పండించిన ఉల్లిని వెంటనే మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. బుధవారం జరిగిన వేలంలో గతవారం కన్నా మరింత అధికంగా ధర పలికింది. వరుసగా ఐదు వారాల నుంచి ఉల్లి ధరలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. వందలాది బస్తాల ఉల్లిని రైతులు మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. జిల్లాలోని గద్వాల, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు ఉల్లిపాయల వేలంలో పాల్గొన్నారు. వ్యాపారులు, కొనుగోలుదారులు, రైతులతో మార్కెట్ అంతా సందడిగా మారింది. గత వారం కన్నా రూ. 300 అధికం దేవరకద్ర మార్కెట్లో ఉల్లి వేలం జోరుగా సాగింది. గత వారం వచ్చిన ధర కన్నా రూ. 3 వందలు అధిక ధర పలికింది. గత వారం క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 4 వేలు ధర ఉంది. ఈ వారం రూ. 4300 ల వరకు ధరలు వచ్చాయి. కనిష్టంగా రూ. 3 వేల వరకు వేలంలో ధరలు పలికాయి. ఇక చిన్నపేడుగా ఉన్న ఉల్లికి ఈ వారం ఏకంగా రూ. 2 వేల వరకు ధరలు పలికాయి. ఉల్లి ధరలు బాగా పెరగడంతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు ఆనందంలో మునిగి పోయారు. -
ఉల్లి.. కమీషన్ల లొల్లి
కర్నూలు(అగ్రికల్చర్) : ఉల్లి రైతులను కమీషన్ ఏజెంట్లు దోపిడీ చేస్తున్నారు. కర్నూలు మార్కెట్ యార్డులో ఈ తంతు యథేచ్ఛగా సాగుతోంది. ప్రస్తుతం మార్కెట్‌కు ఉల్లి భారీగా వస్తోంది. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు 2 శాతం కమీషన్ ఉండగా ఉల్లికి మాత్రం 4 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారు. అయితే కమీషన్ ఏజెంట్లు రైతులకు ఇచ్చే బిల్లులో మాత్రం 2శాతం తీసుకుంటున్నట్లుగా నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం ఉల్లి ధరలు పెరిగి పోయాయి. క్వింటాల్ ధర రూ 4000 పైగా ఉంది. అంటే ఒక క్వింటాల్ పైనే కమీషన్ రూపంలో రూ. 40 వసూలు చేస్తున్నారు. ఉల్లిని వేలంపాట ద్వారా కొనుగోలు చేస్తారు. ఏ ధరకు పోయినా రైతుకు డబ్బు చెల్లించేటపుడు క్వింటాళుపై రూ. 20 ప్రకారం కోత విధించి చెల్లిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. ఇలా చేస్తునే యథావిధిగా కూలీల చేత చెడిన వాటిని వ్యర్థాలను ఏరీ వేయిస్తున్నారు. క్వింటాలుకు 2 నుంచి 3 కిలోలు ఏరీ వేయిస్తుడటంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ఈ విషయం మార్కెట్ కమిటీ అధికారలకు తెలిసినా పట్టించుకోరు. ఎందకంటే సీజన్ మామూలు కింద ఏటా రూ 5లక్షల నుంచి 6 లక్షలు ముట్ట చెబుతుండటమే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్లో ఉల్లిని విక్రయించిన రైతులు శ్యాంపల్ కింద ప్యాకెట్ ఉల్లి సమర్పించుకోవాల్సింది. కాటాదారులు, ఉల్లిని క్లీన్ చేసిన మహిళా కూలీలు 10 కిలోలకు పైగా రైతును అడగకుండానే తీసుకుంటున్నారు. వేలంపాట నిర్వహించే సెక్యూరిటీ సిబ్బందికి మరో 10 కిలోలు సమర్పించుకుంటున్నారు. కాటాదారులు, ఇతర హమాలీలకు నిబంధనల ప్రకారం కూలి చెల్లిస్తునే అదనంగా ఇచ్చుకుంటున్నామని రైతులు వాపోతున్నారు. కర్నూలు మార్కెట్లో అడుగడుగునా దగా చేస్తుడటంతో రైతులు తాడేపల్లిగూడేనాకి వెలుతున్నట్లు సమాచారం. ఇప్పటికైన మార్కెట్ కమిటీ అధికారులు చర్యలు తీసుకొని ఉల్లి దోపడీని అరికట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. -
ఉల్లి వ్యాపారి లొల్లి
♦ మార్కెట్లో ధరల మోత.. ♦ రైతుకు వాత సిండికేట్‌గా ఏర్పడిన వ్యాపారులు ఉల్లి పంట పండిందని ఆనందంతో ఉన్న రైతుల ఆశలను వ్యాపారులు మొగ్గలోనే తుంచివేస్తున్నారు. కిలో రూ.20 చొప్పున కొంటూ గోదాముల్లో దాచుకుంటున్నారు. బయట మార్కెట్లో మాత్రం ఉల్లి తల్లి బంగారమైంది. కిలో రూ.60-70 పెట్టి కొనలేక సామాన్యుల వంటింట్లో ఉల్లి కరువైంది. నాలుగు గడ్డలను కోసి కూరల్లో వేయడానికి మహిళల చేతులాడటం లేదు. పెండ్లిమర్రి : ఆరుగాలం కష్టపడి శ్రమించిన రైతులకు కష్టాలు, నష్టాలు త ప్పడం లేదు. దళారులు సిండికేట్‌గా ఏర్పడి ఉల్లి రైతు కంట నీరు తెప్పిస్తున్నారు. కష్టపడి ఉల్లి పంట సాగు చేసిన రైతులకు కష్టం తప్ప ఫలితం రావడం లేదు. మార్కెట్లో ఉల్లిపాయల ధర ఆకాశాన్నంటుతుండగా, వ్యాపారులు మాత్రం రైతుల వద్ద నుంచి క్వింటాలు రూ. రెండు వేలు చొప్పున కొనుగోలు చేస్తున్నారు. పెండ్లిమర్రి, వేముల, సికె దిన్నె, మైదుకూరు, వేంపల్లె, ఖాజీపేట, ముద్దనూరు తదిత ర మండ లాల్లో 2500 హెక్టార్లలో ఉల్లి పంటను సాగు చేశారు. దిగుబడి కూడా బాగానే వచ్చింది. అయితే రాష్ట్రానికి కావాల్సినంత సరఫరా కాకపోవడం, మార్కెట్ మాయాజాలం వల్ల ప్రస్తుతం ఉల్లి కిలో రూ.40 నుంచి రూ.70 దాకా విక్రయిస్తున్నారు. ఇదే అవకాశంగా భావించిన కొందరు వ్యాపారులు ఎక్కడికక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి గోదాముల్లో దాచి పెడుతున్నారు. ఉల్లి వ్యాపారులందరూ సిండికేట్‌గా ఏర్పడి.. రాజమండ్రి, తాడేపల్లె గూడెంలో మార్కెట్ ధరలు తగ్గాయని కిలో రూ.20-25 అయితే కొనుగోలు చేస్తాం, లేదంటే లేదని ఒకే మాటపై ఉన్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తే తమకు గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు. దళారులు సిండికేటయ్యారు ఎకరం పొలం కౌలుకు తీసుకుని ఉల్లిపంట సాగు చేశాను. పంట బాగా పండింది. ధరలు బాగా ఉండడంతో మంచి లాభాలు వస్తాయనే ఆశతో ఉన్నాం. ప్రస్తుతం దళారులు కుమ్మక్కై కిలో రూ.20 చొప్పున అడుగుతున్నారు. మార్కెట్లో మాత్రం కిలో రూ. 50-60 అమ్ముతున్నారు. దళారుల మూలంగా నష్టపోతున్నాం. - లింగాల గోపాల్, రైతు, రామచంద్రాపురం, పెండ్లిమర్రి మండలం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి నాలుగు ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశాను. రెండు ఎకరాల్లో వచ్చిన గడ్డలను కిలో రూ.32 చొప్పున అమ్మాను. ప్రస్తుతం దళారులు, వ్యాపారులు సిండికేటై రూ.20-25 రేటు పెడుతున్నారు. ఇది చాలా అన్యాయం. ఇలాగైతే మాకు లాభాలు రావు. ప్రభుత్వం రైతుల వద్దకు వచ్చి కొనుగోలు చేయాలి. - సికె బసిరెడ్డి, రైతు, బాలయ్యగారిపల్లె, పెండ్లిమర్రి మండలం -
సబ్సిడీ ఉల్లి కోసం జనాలు బారులు
♦ క్యూలైన్లో గంటల కొద్దీ నిరీక్షణ ♦ నాలుగు కిలోలు పంపిణీ చేయాలని డిమాండ్ మేడ్చల్ : ప్రభుత్వం సబ్సిడీతో సరఫరా చేస్తున్న ఉల్లి కోసం మేడ్చల్ రైతుబజార్లో ప్రజలు బారులు తీరుతున్నారు. ఉల్లి ధరలు ఆకాశానంటుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీ కేంద్రాలను ఏర్పాటు చేసి కిలో రూ.20 చొప్పున పంపిణీ చే స్తున్న విషయం తెలిసింది. అందులో భాగంగా మేడ్చల్ రైతుబజార్లో ఆగస్టు 5న ఉల్లి సబ్సిడీ కేంద్రాన్ని ప్రారంభించింది. నిత్యం ఈ కేంద్రంలో 2 వేల కిలోల ఉల్లిని సబ్సిడీపై విక్రరుుస్తుండగా, ఇప్పటి వరకు దాదాపు 350 క్వింటాళ్ల ఉల్లిని విక్రయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రతీ కుటుంబానికి 15 రోజులకు ఒక సారి రెండు కిలోల చొప్పున ఉల్లిని అందిస్తున్నట్లు వారు వివరించారు. ఉల్లి ధరలు వూర్కెట్లో అదుపులోకి వచ్చేంత వరకు విక్రరుుస్తావుని రైతుబజార్ సూపర్వైజర్ రమేష్‌కువూర్ తెలిపారు. నాణ్యత లేని ఉల్లిగడ్డను తిరిగి పంపుతున్నావున్నారు. నాలుగు కిలోలు సరఫరా చేయాలి ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న రెండు కిలో ఉల్లి గడ్డలు వారానికి సరిపోవడం లేదు. ప్రభుత్వం అవసరాలను గుర్తించి నాలుగు కిలోలను సరఫరా చేయాలి. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి. - ఎస్ సోనీ, మేడ్చల్ కుళ్లిన ఉల్లిగడ్డలు వస్తున్నారుు సబ్సిడీపై సరఫరా చేస్తున్న ఉల్లిగడ్డల్లో కుళ్లినవి సరఫరా చేస్తున్నారు. ఎందు కు ఇలా సరఫరా చేస్తున్నారంటే.. నిర్వాహకుల నుంచి సమాధానం రావడం లేదు. మంచి గడ్డలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలి. - యుసూఫ్ ఉన్నీసా వసతులు కల్పించాలి సబ్సిడీతో ఇస్తున్న ఉల్లి పంపిణీ కేంద్రం వద్ద కనీస వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. గంటల తరబడి క్యూలో నిల బడాల్సి రావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కనీసం తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. - సత్తెవ్ము కుళిన్ల ఉల్లిని తీసేస్తున్నాం దిగువుతి చేసుకున్న ఉల్లిగడ్డను నేరుగా విక్రరుుంచకుండా వాటిలో వూర్కెట్లోని స్టాల్స్‌లో ఆరబోసి ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేసి కుళ్లిన ఉల్లిని ఏరివేసి విక్రరుుస్తున్నాం. నాణ్యత లేని సరుకును తిరిగి వెనక్కి పంపిస్తున్నాం. - రమేష్‌కువూర్,రైతుబజార్ సూపర్వైజర్ -
ఉల్లి ధరలు తగ్గించాలని రాస్తారోకో
అమలాపురం (తూర్పుగోదావరి జిల్లా) : చుక్కలనంటుతున్న ఉల్లి ధరలు వెంటనే తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ రాస్తారోకోకు దిగింది. ఈ మేరకు గురువారం తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి విశ్వరూప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మేరకు పెరిగిన ఉల్లి ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
'అందుకే ఉల్లిని సాయం చేయలేకపోతున్నాం'
మహబూబ్ నగర్ : తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉల్లిపాయ అవసరాలపై తమకు ఎటువంటి విజ్ఞప్తి రాకపోవడంతో ఆ ప్రాంతానికి ఎలాంటి సహాయం చేయలేకపోతున్నామంటూ కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి మోహన్‌బాయ్ కుందూరియా వ్యాఖ్యానించారు. ఉల్లి అవసరాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు సార్లు లేఖ రాసిన ఎటువంటి స్పందన లేదని కుందూరియా వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఉల్లి అవసరాలను గుర్తించి, ఇప్పటికే టెండర్లు నిర్వహించామని ఆయన తెలిపారు. -
పేట్రేగిన ఉల్లి
♦ ఢిల్లీ ధరలతో వ్యాపారుల పోటీ ♦ రిటైల్ మార్కెట్లో కిలో రూ.70-80 ♦ సబ్సిడీ ఉల్లికి జనం బారులు సాక్షి, సిటీబ్యూరో : ఉల్లి ధర జనాలను హడలెత్తిస్తోంది. ఢిల్లీలో ఉల్లి ధర కిలో రూ.100కు చేరువవుతోందన్న వార్త నగరంలోని రిటైల్ వ్యాపారుల్లో అత్యాశను రేపింది. దీంతో ఒక్కరోజు వ్యవధిలోనే కిలోపైఅదనంగా రూ.10-15 పెంచేశారు. మలక్‌పేటలోని హోల్‌సేల్ మార్కెట్లో గ్రేడ్ -1 ఉల్లి కేజీ ధర రూ.67 పలకడంతో వెంటనే రిటైల్ వ్యాపారులు పెంచేశారు. నిన్న మొన్నటి వరకు కేజీ రూ.65కు లభించిన మహారాష్ట్ర ఉల్లి ఇప్పుడు రూ.80కి, కర్నూలు ఉల్లి కిలో రూ.50 నుంచి రూ.60కి ఎగబాకాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి నగరానికి ఉల్లి దిగుమతి తగ్గిపోవడంతో పాటు కర్నూలునుంచి కూడా సరఫరా నిలిచిపోయింది. మహారాష్ట్రలో స్థానికంగానే ఉల్లికి మంచి ధర పలుకుతుండటంతో రైతులు ఇక్కడికి పంపేందుకు ఆసక్తి చూపడం లేదు. నగరంలోని మహబూబ్ మాన్షన్ హోల్‌సేల్ మార్కెట్‌కు నిత్యం 16-18వేల క్వింటాళ్ల ఉల్లి దిగుమతయ్యేది. మంగళవారం 14వేల క్వింటాలు మాత్రమే వచ్చింది. ఇదే అదనుగా భావించి వ్యాపారులు ధర లు పెంచేశారు. నిన్నటి వరకు కేజీ రూ.50 ఉన్న గ్రేడ్-2 నీరుల్లి (కర్నూలు) ధర ఒక్కరోజులోనే రూ.60కి చేరింది. తోపుడు బండ్ల వారైతే... థర్డ్ గ్రేడ్ ఉల్లిని గ్రేడింగ్ చేసి కాస్త పెద్దవి కేజీ రూ.70, చిన్నవి రూ. 60 వంతున విక్రయిస్తున్నారు. టీవీలు, పత్రికల్లోని కథనాలను చూసి నగరానికి ఉల్లి సరఫరా ఆగిపోయిందని... ధరలు ఢిల్లీ తరహాలోనే ఉంటాయని కొందరు వ్యాపారులు ప్రచారం చేస్తున్నారు. కిక్కిరిసిన రైతుబజార్లు సబ్సిడీ ఉల్లి కోసం జనం పోటెత్తుతుండటంతో నగరంలోని రైతుబజార్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రతి సోమవారం సబ్సిడీ ఉల్లి కౌంటర్లను మూసేస్తుంటారు. ఇది తెలియని కొందరు సోమవారం ఉల్లి కోసం వచ్చి సరుకు అయిపోయిందని ప్రచారం మొదలెట్టారళు. దీన్ని నమ్మిన గృహిణులు మంగళవారం ఉదయాన్నే కౌంటర్ల వద్ద క్యూలు కట్టారు. స్కూల్‌కు వెళ్లాల్సిన పిల్లలను కూడా క్యూలైన్లో నిలబెట్టి ఉల్లి కొనుగోలు చేశారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు నిరంతరాయంగా విక్రయాలు సాగించినా రద్దీని నియంత్రించలేక పోతున్నామని రైతుబజార్ సిబ్బంది వాపోతున్నారు. కావాల్సినంత సరుకు ఉందనీ పదే... పదే మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నా... ఎవరూ పట్టించుకోవట్లేదని, పోలీసుల సహకారంలో విక్రయిస్తున్నామని చెబుతున్నారు. కృత్రిమ కొరత కొందరు ఉల్లి వ్యాపారులు ప్రస్తుత పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు వినికిడి. కర్నూలు ఉల్లి వారం రోజులకు మించి నిల్వ ఉండ దు. మహారాష్ట్ర ఉల్లి నెల రోజుల వరకు బాగుంటుంది. కొందరు వ్యాపారులు నాణ్యమైన మహారాష్ట్ర ఉల్లిని అక్రమంగా నిల్వ చేసి ధరలు పెంచేశారని తెలుస్తోంది. వర్షాలు, ఇతర కారణాలతో ఒక్కరోజు దిగుమతులు ఆగిపోతే... ఆ కొరతను బూచిగా చూపి ధరలు పెంచుతుండటం నగరంలో పరిపాటి. ఈ తరుణంలో మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగి అక్రమ నిల్వలపై దాడులు నిర్వహించడంతో పాటు, ఉల్లి ధరలకు కళ్లెం వేయకపోతే పరిస్థితి మరింత భారమయ్యే అవకాశం ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే సెప్టెంబర్ నాటికి నగరంలో ఉల్లి కేజీ రూ.100కు చేరినా ఆశ్చర్య పడాల్సిందేమీ లేదని మార్కెటింగ్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
స్వల్పంగా తగ్గిన ఉల్లి ధర
* హోల్‌సేల్ మార్కెట్లో ధరలు తగ్గుముఖం * రూ.7.25 కోట్లతో సబ్సిడీ ఉల్లి సేకరణ సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ ఎగబాకి చుక్కలను తాకిన ఉల్లి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో ప్రధాన మార్కెట్ అయిన హైదరాబాద్‌లోని మలక్‌పేటలో శనివారం కిలో గరిష్టంగా రూ. 67 పలికిన ఉల్లి ధర మంగళవారం రూ. 60కి తగ్గింది. కర్నూలు, కర్ణాటక ఉల్లి రకాలు రెండు రోజుల వ్యవధిలోనే కిలోకు రూ. 10 చొప్పున తగ్గినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలోనే అతి పెద్ద ఉల్లి మార్కెట్ లాసల్గావ్ (మహారాష్ట్ర) నుంచి రాష్ట్రానికి ఉల్లి దిగుమతులు భారీగా తగ్గిపోయాయి. ఉత్తర భారతదేశంలో ఉల్లికి డిమాండ్ పెరగడంతో మహారాష్ట్ర రైతులు, వ్యాపారులు అటువైపు దృష్టి సారించారు. గతంలో రోజుకు మహారాష్ట్ర నుంచి 5వేలకు పైగా ఉల్లి బస్తాలు రాగా, ప్రస్తుతం రెండు వేల బస్తాలకు మించి రావడం లేదు. ఇదే సమయంలో కర్ణాటక, కర్నూలు నుంచి ఉల్లి నిల్వలు పెద్దమొత్తంలో రాష్ట్రానికి వస్తున్నాయి. అయితే హోల్‌సేల్ మార్కెట్లో ధరలు కిలోకు రూ. 10 మేర తగ్గడంతో రైతులు అమ్మకాలపై వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నా రు. మార్కెట్‌కు సరుకు చేరుకున్నా లావాదేవీలు ఆశించిన స్థాయిలో లేవని అధికారులు చెబుతున్నారు. అయితే విదేశాలకు ఉల్లి ఎగుమతి ధరలు భారీ గా పెంచడం, విదేశాల నుంచి 10 వేల టన్నుల ఉల్లి దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించడం, నల్లబజారుకు తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం, సబ్సిడీ ధరలపై విక్రయాలు వంటి కారణాలతో ఉల్లి హోల్‌సేల్ మార్కెట్లలో పరిస్థితి కొంత మెరుగైందని అధికారులు పేర్కొంటున్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటే.. ధరలు అదుపులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 88 సబ్సిడీ విక్రయ కేంద్రాలకు సరఫరా చేసేందుకు రూ. 7.25 కోట్లతో 1737.29 టన్నుల ఉల్లిని సేకరించింది. విక్రయాల ద్వారా తిరిగి రూ. 3.47 కోట్లు వచ్చినట్లు మార్కెటింగ్ విభాగం అధికారులు వెల్లడించారు. -
స్మగ్లింగ్ జరగొచ్చు.. సరిహద్దుల్లో జాగ్రత్త
భద్రతాదళాలకు బంగ్లా ఆదేశం ఢాకా: ఉల్లి ధరలు భారత్‌లో ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉల్లి స్మగ్లింగ్ జరగొచ్చని, సరిహద్దుల్లో జాగరూకతతో ఉండాలని బోర్డర్ గార్డు (బంగ్లా సరిహద్దు భద్రతాదళం)ను హెచ్చరించింది. భారత్‌లో భారీ ధరలను సొమ్ము చేసుకొనేందుకు వ్యాపారులు దొడ్డిదారుల్లో ఉల్లిని ఆ దేశానికి స్మగ్లింగ్ చేసే అవకాశముందని బంగ్లాదేశ్ అనుమానిస్తోంది. అందుకే సరిహద్దుల్లో కదలికలపై నిఘా వేసి ఉంచాలని సూచించింది. స్వయంగా వాణిజ్య శాఖ కార్యదర్శి హిదయతుల్లా అల్ మమూన్ రంగంలోకి దిగి ఉల్లి హోల్‌సేల్ వ్యాపారులతో సమావేశమయ్యారు. సరఫరాలో తేడా వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. బంగ్లాదేశ్‌లో ఉల్లి వార్షిక డిమాండ్ 22 లక్షల టన్నులు కాగా... ఈ ఏడాది 19.3 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. పాత నిల్వలను కూడా కలుపుకొంటే దేశీయ అవసరాలకు సరిపడా సరుకు ఉంది. అయితే భారత్‌లో ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో... ఉల్లి పొరుగుదేశానికి తరలితే బంగ్లా దేశీయులు ఇబ్బందిపడాల్సి వస్తుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. -
ఉల్లి @ 80
రైతు బజార్లలో విక్రయాలు బంద్ దిగిరాని ఉల్లి ధరలు మూడు రోజుల్లో రూ. 30 పెరుగుదల విజయవాడ : విజయవాడలో ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రైవేటు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ఉల్లి ధరలను రోజురోజుకు పెంచేస్తున్నారు. సోమవారం నగరంలో ప్రైవేటు మార్కెట్లలో ఉల్లిపాయలు కేజీ రూ. 80 ధర పలికింది. వ్యాపారులు మూడు రోజులుగా రోజుకు రూ. 10 చొప్పున సోమవారం నాటికి రూ.30 పెంచేశారు. మూడు రోజుల నుంచి నగరంలో రైతుబజార్లలో ఉల్లి విక్రయాలు బంద్ అయ్యాయి. జిల్లాలోని 17 రైతు బజార్లలో సోమవారం ఉల్లిపాయల విక్రయాలు జరుగలేదు. కర్నూల్ నుంచి ఉత్పత్తి తగ్గిపోవటంతో మార్కెటింగ్ అధికారులు రైతు బజార్లకు మూడు రోజుల నుంచి ఉల్లి సరఫరా చేయలేకపోతున్నారు. దాంతో ప్రైవేటు మార్కెట్లో వ్యాపారులు కేజీ రూ.50 నుంచి రూ. 80కి పెంచేశారు. ఉల్లిపాయలు దొరక్క ప్రజలు షాపులు, మార్కెట్లకు పరుగులు తీశారు. రెండు రకాల గ్రేడులు వ్యాపారులు ఉల్లిపాయలను రెండు రకాలుగా గ్రేడ్ చేసి అధిక రేటు వసూలు చేస్తున్నారు. ఎందుకూ పనికిరాని నాసిరకం ఉల్లిని కేజీ రూ. 50కి విక్రయిస్తున్నారు. మంచి రకం ఉల్లి కేజీ రూ. 80 వసూలు చేస్తున్నారు. రైతు బజార్లలో కేజీ రూ. 20కి సరఫరా చేసిన ఉల్లిని బయటి మార్కెట్లో రూ. 50కి విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో ఉల్లిధరలు మరింతగా పెరగవచ్చని వ్యాపారులు చెపుతున్నారు. వచ్చే నెలాఖరు వరకు ఉల్లిపాయల కొరత ఇలానే ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. వచ్చే నెలాఖరునాటికి సోలాపూర్‌లో ఉల్లి పంట వస్తుందని, అప్పటికి గాని ఉల్లిపాయల ఉత్పత్తులు పెరిగి ధర తగ్గే అవకాశం ఉంటుందని చెపుతున్నారు. రైతు బజార్ల చుట్టూ తిరుగుతున్న ప్రజలు బయటి మార్కెట్లో ఉల్లి కొనుగోలు చేయలేక సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు రైతు బజార్ల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ అధికారులు, సిబ్బంది రేపు రండి మాపు రండని ప్రజలకు చెప్పి పంపుతున్నారు. కొందరు ప్రజలు రైతు బజార్లలోకి ఎప్పడు వస్తుందో తెలుసుకుని ఉరుకులు, పరుగులతో క్యూలెన్లలో ఉల్లి కోసం కాపు కాస్తున్నారు. -
కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి
-
నెట్లో నవ్వుల ఉల్లి..
నిజజీవితంలో కన్నీళ్లు తెప్పిస్తున్నా.. నెట్లో మాత్రం ఉల్లి నవ్వులు పూయిస్తోంది. ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న కొద్దీ సోషల్ మీడియాలో కార్టూన్లు, జోకులు పేలుతున్నాయి. ఫేస్బుక్, వాట్సాప్, ట్వీటర్ ఎందులో అయినా ఇప్పుడు ఉల్లి హాట్ టాపిక్‌గా మారింది. డైమండ్ రింగులకు బదులుగా ‘ఉల్లి’ పొదిగిన ఆభరణాలను చూసి జనం తెగ నవ్వుకుంటున్నారు. ఫొటోషాప్ ఎఫెక్ట్: చూడు తమ్ముడూ.. ఇయ్యల రేపట్ల చేతిలో ఉల్లిగడ్డ ఉన్నోడే శ్రీమంతుడు. (హీరో మహేష్‌బాబు శ్రీమంతుడు పోస్టర్‌కు ఎఫెక్ట్) ఉల్లిగడ్డలు కొనేందుకు భార్యాభర్తలు కూరగాయల దుకాణానికి వెళ్లారు. భార్యాభర్తలు: రెండు కిలోల ఉల్లిగడ్డలు ఇవ్వండి.. షాప్ ఓనర్: పాన్ నంబర్ ప్లీజ్..! వ్యంగ్యాస్త్రం: ఓ ఇంట్లో దోపిడీకి వచ్చిన దొంగ భార్యాభర్తలిద్దరినీ తాడుతో బంధించాడు. ఎన్ని డబ్బులైనా ఇస్తాం.. మమ్మల్ని వదిలేయమని భార్యాభర్తలు వేడుకుంటున్నారు. ‘పైసలు ఎవ్వడికి కావాలి.. కుక్కను కొడితే రాల్తాయ్.. ఓన్లీ ఉల్లిగడ్డలు..’ అని దొంగ కామెంట్. ఓ ఫొటో: ఒక ఉల్లిగడ్డ తాడుకు వేలాడుతోంది. దాన్ని కన్నార్పకుండా చూసుకుంటూ.. ఆనందంగా లొట్టలేసుకుంటూ ‘అహా నా పెళ్లంట’ సినిమాలో కోట శ్రీనివాసరావును తలపించేలా అన్నం పళ్లెం పట్టుకున్నాడో సగటు జీవి. ఓ వీడియో: అందమైన భార్య. సూటుబూటు ధరించిన భర్త. ఎంతో ప్రేమతో కానుకగా ఓ గిఫ్ట్ ప్యాక్ తెచ్చి భార్యకు అందించాడు. గోల్డ్ షాప్ నుంచి తెచ్చినట్లుగా ఉన్న ఆ ప్యాక్‌లో ఏముందో అని చకచకా ప్యాక్ విప్పింది భార్య. అందులో ‘ఉల్లి పొదిగిన ఉంగరం’ ఉంది. అంతే ఆనందంతో ఆ భార్య తన భర్తను హత్తుకుంది. -
దిగిరావే ఉల్లి
తాడేపల్లిగూడెం : నెల రోజులుగా ఆకాశ యానం చేస్తున్న ఉల్లి ధరలు దిగిరాకపోగా.. మరింత ప్రియం అవుతున్నాయి. పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఎగబాకుతున్నాయి. శనివారం తాడేపల్లిగూడెం గుత్త మార్కెట్లో కనీవినీ ఎరుగని రీతిలో కర్నూలు రకం ఉల్లి క్వింటాల్ రూ.6 వేలకు చేరింది. మహారాష్ట్ర ఉల్లి క్వింటాల్ రూ.6,500కు పెరిగింది. నాసిరకం ఉల్లి సైతం క్వింటాల్ రూ.5వేలు పలికింది. ఈ ప్రభావంతో రిటైల్ మార్కెట్లో కర్నూలు ఉల్లి కిలో రూ.65, మహారాష్ట్ర రకం రూ.70 అమ్ముతున్నారు. ప్రతి శనివారం కర్నూలు నుంచి తాడేపల్లిగూడెం మార్కెట్‌కు 150 నుంచి 250 లారీల ఉల్లి వస్తుంది. ఈ శనివారం కేవలం 50 లారీల సరుకు మాత్రమే వచ్చింది. ఉల్లి ధరలు సంక్రాంతి వరకు తగ్గే సూచనలు కనిపించడం లేదని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కర్నూలులో దిగుబడులు తగ్గటమే దీనికి కారణమని చెబుతున్నాయి. ఎకరానికి 10 టన్నుల ఉల్లిపాయల దిగుబడి రావాల్సి ఉండగా, కేవలం నాలుగు టన్నులు మాత్రమే రావడంతో ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి. మహారాష్ట్రలో ఉల్లి పంటపై వానల ప్రభావం పడటంతో అక్కడా దిగుబడులు పడిపోయాయి. దీనికి తోడు వర్షానికి చేతికొచ్చిన పంట కుళ్ళిపోవడంతో మహారాష్ట్ర మండీలలో సైతం గుత్తగా క్వింటాల్ రూ.6 వేలకు కొనే పరిస్థితి వచ్చింది. -
ఘాటెక్కిన ఉల్లిపాయలు!
-
ఉల్లీ.. చిక్కవే తల్లీ
- సబ్సిడీ పథకం ప్రారంభం - కేజీ రూ.20కి విక్రయం - రైతుబజార్లకు పోటెత్తిన జనం సాక్షి, సిటీబ్యూరో: ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నగరంలోని అన్ని రైతుబజార్లలో బుధవారం సబ్సిడీ ఉల్లి కౌంటర్లను అధికారికంగా ప్రారంభించింది. రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు సబ్సిడీ ఉల్లి కౌంటర్లను ప్రారంభించారు. కేజీ రూ.20 వంతున... ఒక్కో వినియోగదారుడికి రెండేసి కిలోల చొప్పున ఉల్లిని అందిస్తున్నారు. గ్రేటర్‌లోని 9 రైతుబజార్లతో పాటు వివిధ ప్రాంతాల్లోని 34 ఔట్లెట్స్, మేడ్చెల్, మేడిపల్లి రైతుబజార్లలో బుధవారం నుంచి సబ్సిడీ ఉల్లి పథకం ప్రారంభమైంది. తొలిరోజు ఈ కేంద్రాలకు మొత్తం 29 టన్నుల (290 క్వింటాళ్లు) ఉల్లిని మార్కెటింగ్ శాఖ అధికారులు సరఫరా చేశారు. సరూర్‌నగర్‌లో మంత్రి హరీష్‌రావు, కూకట్‌పల్లిలో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎర్రగడ్డలో మంత్రి తలసాని శ్రీనివాస్, మెహిదీపట్నంలో మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఫలక్‌నుమాలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, అల్వాల్‌లో మంత్రి పద్మారావు, వనస్థలిపురంలో ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, రామకృష్ణాపురంలో ఎమ్మెల్యే శ్రీనివాస్, మీర్‌పేటలో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మేడిపల్లి, మేడ్చెల్ రైతుబజార్లలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సబ్సిడీ ఉల్లి కౌంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉల్లి ధరలు కిందికుదిగివచ్చే వరకు ఈ సబ్సిడీ కౌంటర్లను కొనసాగిస్తామని ప్రకటించారు. ఎక్కడా కూడా కొరత రాకుండా మార్కెటింగ్ శాఖ అధికారులు పక్కాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోటెత్తిన జనం బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ఉల్లి ధర కిలో రూ.40-45 పలుకుతోంది. దీంతో సబ్సిడీ ఉల్లికి విపరీతమైన గిరాకీ ఎదురైంది. రైతుబ జార్లలో సబ్సిడీ ధరపై ఉల్లిని విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం ముందుగానే ప్రకటించడంతో గ్రేటర్‌లోని అన్ని రైతుబ జార్లకు జనం పోటెత్తారు. ఉదయం 8గంటలకే కౌంటర్ల వద్ద బారులు తీరారు. మెహిదీపట్నం, ఎర్రగడ్డ, కూకట్పల్లి, సరూర్‌నగర్ , ఫలక్‌నుమా, వనస్థలిపురం, అల్వాల్ రైతుబజార్లలో వినియోగదారుల రద్దీ అధికం కావడంతో ఉదయం 9 నుంచి రాత్రి 7గంటల వరకు నిరాటంకంగా విక్రయాలు కొనసాగించారు. ఒక్కో రైతుబ జార్‌కు 4-7 టన్నుల చొప్పున ఉల్లిని అధికారులు అందించారు. అయితే... సాయంత్రం 4 గంటలకే కొన్ని రైతుబజార్లలో సరుకు ఖాళీ అయిపోయింది. దీంతో రంగంలోకి దిగిన మార్కెంటింగ్ శాఖ డిప్యూటీ డెరైక్టర్లు వై.ఎస్.పద్మహర్ష, ఎల్లయ్యలు ఒక్కో టన్ను చొప్పున అదనంగా సరఫరా చేశారు. విక్రయాల్లో అవకతవకలకు తావులేకుండా రైతుబ జార్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రైతుబజార్లు అందుబాటులో లేని ప్రాంతాలకు సైతం సబ్సిడీ ఉల్లిని సరఫరా చేసేందుకు వివిధ ప్రాంతాల్లో 34 ఔట్లెట్స్ ఏర్పాటు చేశారు. కొరత రానివ్వం: జి.లక్ష్మీబాయ్, మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు సబ్సిడీ ఉల్లికి కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని మిగ తా జిల్లాలకు కూడా తగినంత సరుకును సేకరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్మాల్ ఫార్మర్స్ అగ్రీ బిజినెస్ కన్సార్టియా నుంచి పెద్దమొత్తంలో ఉల్లి దిగుమతి చేసుకొంటున్నాం. ధరలు ఎంత పెరిగినా కేజీ రూ.20కే అందిస్తాం. నాసిక్ నుంచి గురువారం మరో 3వేల క్వింటాళ్ల సరుకు తెప్పిస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి, ఎనతల ప్రాంతంలోని రైతుల నుంచి, మలక్‌పేట హోల్‌సేల్ మార్కెట్ నుంచి ఉల్లిని సేకరిస్తున్నాం. సబ్సిడీ ఉల్లి పక్కదారి పట్టకుండా నిఘా బృందాలను ఏర్పాటు చేశాం. ఏదైనా గుర్తింపు కార్డును చూపిన వినియోగదారులకే ప్రస్తుతం అందిస్తున్నాం. నగరం నలుమూలకు సరఫరా చేసి ఉల్లికి కొరత లేకుండా చూస్తాం. -
ఉల్లిపాయల కోసం క్యూ..
-
ఉల్లి వెక్కిరిస్తోంది
♦ మార్కెట్లో తగ్గిపోతున్న నిల్వలు ♦ అకాల వర్షాలతో తగ్గిన దిగుబడి సాక్షి, ముంబై : నగరంలో ఉల్లి ధరలు కంటతడి పెట్టిస్తున్నాయి. మార్కెట్లో ఉల్లి నిల్వలు తగ్గిపోవడంతో ధరలు మండిపోతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులు వీయడంతో ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో పంట దిగుబడి తగ్గింది. ఫలితంగా జూన్‌లో అదుపులో ఉన్న ధరలు జూలైలో పెరగడం ప్రారంభమైంది. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)కి ముంబై ప్రజలకు కోసం ప్రతి రోజు 125 ట్రక్కుల ఉల్లి వస్తుండగా ప్రస్తుతం వంద వరకు మాత్రమే వస్తున్నాయి. దీంతో నగరంలో ఉల్లి కొరత ఏర్పడింది. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ. 35-37 పలుకుతన్న ఉల్లి కొనుగోలుదారుల చెంతుకు వచ్చేసరికి రూ. 50 అవుతోంది. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే ధర రూ. 90-100కి పెరగడం ఖాయమని వ్యాపారులు చెబుతున్నా రు. మరోవైపు దా దర్, వాషి ఏపీఎంసీ మార్కెట్లలో వ్యాపారులు నాసిరకం ఉల్లిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో నాసిక్ జిల్లాలోని నిఫాడ్, లాసల్గావ్ ప్రాంతాల్లో ఉల్లి ఎక్కువగా పండుతుంది. ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు కూడా రైళ్లలో ఎగుమతి అవుతుంది. అయితే ప్రస్తుతం రైతుల వద్ద నిల్వలు అయిపోవడం, అకాల వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గడం వల్ల ఉల్లికోసం ఇతర రాష్ట్రాలపై ఆదారపడాల్సిన పరిస్థితి వచ్చింది. -
తెలంగాణకు కర్నూలు ఉల్లి
కర్నూలు: రోజురోజుకు పెరిగిపోతున్న ఉల్లి ధరలు మధ్య తరగతి ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నేపథ్యంలో కర్నూలు ఉల్లిని సబ్సిడీపై పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేసింది. సోమవారం నుంచి కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలంగాణ మార్కెటింగ్ శాఖ అధికారులు వేలంపాట ద్వారా ఉల్లి కొనుగోలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు కర్నూలు జిల్లా మార్కెటింగ్ అధికారులతో ఆదివారం చర్చించారు. అక్కడ కొన్న ఉల్లిని రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా కర్నూలు మార్కెట్లో ఉల్లిని కొనుగోలు చేసి కిలో రూ. 20 ప్రకారం 13 జిల్లాలకు సరఫరా చేస్తోంది. -
ఉల్లికి ప్రోత్సాహమేదీ!
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో ఉల్లికి ప్రోత్సాహం కరువయింది. ఏటా విస్తీర్ణం తగ్గుతోంది. ఉల్లి ధరలు పెరుగుతున్నా ఉద్యానశాఖ అధికారులకు నిర్లక్ష్యం వహించడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉల్లి సాగుతోపాటు దిగుమతులూ తగ్గిపోవడంతో ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కిలో రూ.25 ఉన్న ఉల్లి ధర అమాంతంగా రూ.40 పెరిగింది. నాణ్యత చూపిస్తూ కొన్ని చోట్ల రూ.45 అమ్ముతున్నారు. దీనికి కారణం గత ఐదేళ్ళుగా పంట సాగు ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఉద్యానశాఖ అధికారుల గణాంకాల ప్రకారం 2012లో 900 హెక్టార్లలో సాగవగా 2013లో 655 హెక్టార్లకు పడిపోయింది. 2014-15కు వచ్చే సరికి 500హెక్టార్లకు కుచించుకుపోయింది. రైతులతో మాట్లాడి ప్రోత్సాహకాలు ఇవ్వడంలో ఆ శాఖ అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉద్యాన పంటల అభివృద్ధి కోసం రైతులకు విత్తనాలపై 50 శాతం రాయితీపై ఇవ్వటానికి 2013-14లో రూ.39 లక్షలు కేటాయించారు. అప్పట్లో వీటిని ఆ శాఖ పరిధిలో ఉన్న మిర్చి పంటకు మినహా ఏ పంటకైనా ఇవ్వవచ్చునని ప్రభుత్వ సడలింపు ఇచ్చింది. అలాంటి వీలున్న ఉల్లికోసం ఇప్పటి వరకూ కేటాయించింది నామమాత్రమేనని చెప్పవచ్చు. ఏళ్ళతరబడి ఈ పంటసాగులో తగినంత ప్రోత్సాహం లేకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని పలువురు భావిస్తున్నారు. -
రూ.20కే కిలో ఉల్లి
- రైతుబజార్లలో రాయితీపై విక్రయం - 5 నుంచి అధికారికంగా ప్రారంభం సాక్షి, సిటీబ్యూరో : ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు ఎట్టకేలకు మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగింది. నగరంలోని అన్ని రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కేజీ రూ.20ల ప్రకారం రాయితీ ధరపై ఉల్లిని అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 5 నుంచి కూకట్పల్లి, ఎర్రగడ్డ, మెహిదీపట్నం, సరూర్‌నగర్, వనస్థలిపురం, ఫలక్‌నుమా, మీర్పేట్, రామకృష్ణాపురం, అల్వాల్, మేడిపల్లి రైతుబజార్లతో పాటు వివిధ ప్రాంతాల్లోని 36 ఔట్లెట్స్ ద్వారా సబ్సిడీ ఉల్లిని అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఉల్లి, టమోటా ధరలకు కళ్లెం వేస్తే మిగతా కూరగాయల ధరలు పెరగకుండా నియంత్రించవచ్చేనే ఉద్దేశంతో గత జూన్ 24న అన్ని రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి హోల్‌సేల్ ధరకే (నో లాస్... నో ప్రాఫిట్ ప్రాతిపదికన) విక్రయాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాటిని తప్పించి అదే కౌంటర్లలో సబ్సిడీ ఉల్లి విక్రయాలు ప్రారంభించేందుకు రైతుబ జార్ సిబ్బంది సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఉల్లి కేజీ రూ.40-45లు పలుకుతోంది. వినియోగదారుల రద్దీ అధికంగా ఉండే ఎర్రగడ్డ, కూకట్పల్లి, మెహిదీపట్నం, సరూర్‌నగర్ రైతుబజార్లకు రోజుకు 2 నుంచి 3 టన్నులు, అలాగే చిన్న రైతుబజార్లకు 1-2 టన్నుల ఉల్లి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఉదయం 9గం.ల నుంచి రాత్రి 7గంటల వరకు సబ్సిడీ ఉల్లి కౌంటర్లు తె రచి ఉంచి, ఒక్కో వినియోగదారుడికి 2 కేజీల చొప్పున విక్రయించాలని ప్లాన్ చేశారు. కర్నూలు, మహారాష్ట్ర, కర్ణాటకలకు ప్రత్యేక అధికారుల బృందాలను పంపి పెద్దమొత్తంలో ఉల్లిని సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కొరత రానివ్వం : ఉల్లి ధర లు అదుపులోకి వచ్చే వరకు రైతుబజార్లలో సబ్సిడీ ధరలపై ఉల్లిని అందుబాటులో ఉంచుతామని మార్కెటింగ్ శాఖ అడిషనల్ డెరైక్టర్ లక్ష్మీబాయి తెలిపారు. రైతుబజార్లు లేని ప్రాంతాలకు మొబైల్ వ్యాన్లు, మన కూరగాయల వాహనాల ద్వారా సబ్సిడీ ఉల్లి సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. హోల్‌సేల్ ట్రేడర్స్‌తో సమావేశం నిర్వహించి పెద్దమొత్తంలో సరుకు సేకరించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కొరత రాకుండా చూస్తే ధరలు వాటంతటవే దిగివస్తాయని, వ్యాపారులు కూడా ధరలు పెంచేందుకు సాహసించరని తెలిపారు. -
ధరల స్థిరీకరణనిధి విడుదల చేయండి
సాక్షి, హైదరాబాద్: ఉల్లి ధరలను నియంత్రించేందుకు ధరల స్థిరీకరణ నిధి నుంచి నిధులు విడుదల చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. శుక్రవారం శాసనసభ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉల్లిని అందరికీ అందుబాటులోకి తెచ్చేలా చేపడుతున్న చర్యలను వివరించారు. ఉల్లి సేకరణకు కేంద్రం నుంచి సకాలంలో నిధులు విడుదల కాని పక్షంలో రాష్ట్ర ఖజానా నుంచి రూ.100 కోట్ల మేర వినియోగించే యోచనలో ఉన్నామన్నారు. రూ.20కే కిలో ఉల్లిని అందుబాటులోకి తెస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 80 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో 40 విక్రయ కేంద్రాలు ఏర్పా టు కాగా, రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో మరో 40 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రాజధాని హైదరాబాద్‌లో రైతు బజార్లతో పాటు ‘మన కూరగాయల’ అవుట్లెట్ల ద్వారా ఉల్లి విక్రయాలు ప్రారంభించామన్నారు. మిగతా తొమ్మిది జిల్లాల్లో ఈ నెల ఐదో తేదీ నుంచి ప్రభు త్వ అవుట్లెట్లు ప్రారంభమయ్యేలా సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఉల్లి సేకరణ, విక్రయాలపై సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాలశాఖ అధికారులతో వీడియోకాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. కుటుంబానికి రెండు కిలోలు మహారాష్ట్రలోని నాసిక్‌తోపాటు కర్నూలు, హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్ల నుంచి ఉల్లి కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు హరీశ్ ప్రకటిం చారు. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.40 నుంచి రూ.50 వరకు ఉందన్నారు. ప్రభుత్వ ఔట్లెట్ల ద్వారా రోజూ 100 టన్నుల ఉల్లి అందుబాటులోకి తెస్తామన్నారు. కుటుంబానికి గరిష్టంగా రెండు కిలోల వంతున సరఫరా చేస్తామని చెప్పారు. వాట్సప్ ద్వారా ఉల్లి ధరలపై ఎప్పటికప్పుడు మార్కెటింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. -
ఘాటెక్కిన ఉల్లి
కిలో రూ. 30- 40 మధ్యన అమ్మకాలు సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఉల్లిగడ్డల ధరలు కొండెక్కాయి. దేశ రాజధానిలో ఉల్లి కిలో 35 నుంచి 40 రూపాయల మధ్య పలుకుతోంది. హైదరాబాద్‌లో ఆయా ప్రాంతాలను బట్టి రూ. 30 నుంచి 40 మధ్య విక్రయిస్తున్నారు. సాధారణంగానే జూలై నెలలో ఉల్లి ధర పెరుగుతుంది. ఎందుకంటే వర్షాల కారణంగా సరఫరా తగ్గుతుంది. అలాగే నాణ్యత దెబ్బతింటుంది. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా పేరొందిన మహారాష్ట్రలోని లాసల్గావ్ హోల్‌సేల్ మార్కెట్లో ఉల్లి ధర నెలరోజుల్లోనే ఏకంగా కిలోకు 15 రూపాయలు పెరిగింది. గత రెండు దశాబ్దాల్లోనే జూలై మాసంలో ఇది అత్యధిక ధర అని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం లాసల్గావ్లో కేజీ 25 రూపాయల పైచిలుకు పలుకుతోంది. హైదరాబాద్‌లో గురువారం హోల్‌సేల్ మార్కెట్లోనే కిలో రూ. 31కి చేరింది. మహారాష్ట్ర, కర్నూల్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి నగరానికి ఉల్లిగడ్డ సరఫరా చేస్తున్నారు. గత రబీసీజన్‌లో (మార్చిలో) అకాలవర్షాల వల్ల ఉల్లి దిగుబడి తగ్గిపోయింది. దానికి తోడు గోదాముల్లో నిల్వచేసిన ఉల్లి కూడా బాగా పాడైపోయింది. దాంతో సరఫరా తగినంత లేక ధర పెరిగిపోతోంది. ఎగుమతుల కారణంగా దేశీయ మార్కెట్లో ఉల్లికి కొరత ఏర్పడకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం టన్ను ఉల్లికి కనీస ఎగుమతి ధరను 27,625 రూపాయలకు పెంచింది. దిగుమతుల ద్వారా ధరలను అదుపు చేయడానికి కేంద్రం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ మధ్యలో కొత్త పంట చేతికి వచ్చేదాకా ఇదే పరిస్థితి ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
ఉల్లి కొందామన్నా కన్నీళ్లే!
సాక్షి, హైదరాబాద్: కరువొస్తే ఢిల్లీ పీఠాన్నీ వణికించగల ఉల్లిగడ్డ రోజురోజుకూ ఘాటెక్కుతోంది.. కోస్తేనే కాదు కొందామన్నా కన్నీళ్లు పెట్టించడానికి సిద్ధమవుతోంది.. రాష్ట్రంలో కొరత నెలకొనడంతో కొద్దిరోజు లుగా ఉల్లి ధరలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ సాగు విస్తీర్ణం తగ్గిపోవడం, పొరుగు రాష్ట్రాల నుంచి అవసరమైన స్థాయిలో రాకపోతుండడమే దీనికి కారణమవుతోంది. రాష్ట్రానికి రోజుకు సరాసరి 40 వేల క్వింటాళ్ల ఉల్లిగడ్డ అవసరం. కానీ కొద్దిరోజు లుగా రోజూ కేవలం 25 వేల క్వింటాళ్లకు మించి సరఫరా కావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్ నగరానికే రోజుకు 10 వేల క్వింటాళ్ల ఉల్లి అవసరం కాగా ప్రస్తుతం 6 వేల క్వింటాళ్లు మాత్రమే సరఫరా అవుతోందని అంటున్నారు. గతేడాది హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్‌కు రోజూ తొమ్మిది వేల క్వింటాళ్ల ఉల్లి సరఫరా కాగా తాజాగా శుక్రవారం కేవలం ఆరు వేల క్వింటాళ్లు మాత్రమే సరఫరా కావడం పరిస్థితేమిటో స్పష్టం చేస్తోంది. గతేడాది ఇదే నెలలో రాష్ట్రంలో కిలో ఉల్లిగడ్డ ధర రూ. 9వరకు ఉండగా... ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ. 21కు చేరింది. మరికొద్ది రోజుల్లోనే ఉల్లిగడ్డ ధర కిలో రూ. 25 నుంచి రూ. 35 వరకు పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర దెబ్బ.. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల హెక్టార్లలో ఉల్లిసాగు జరుగుతుండగా... ఒక్క మహారాష్ట్రలోనే మూడు లక్షల హెక్టార్లలో సాగవుతుంది. ఇక్కడి నేలలు ఉల్లిసాగుకు అనువైనవి కాదు. దీంతో 90 శాతం మహారాష్ట్ర నుంచే దిగుమతి అవుతోంది. మహారాష్ట్రలో ఉల్లి విత్తనం కొరత, దుర్భిక్ష పరిస్థితుల కారణంగా ఈసారి సాగు బాగా తగ్గిపోయి, ఉల్లిగడ్డ ఉత్పత్తి పడిపోయింది. పట్టించుకుంటేనే.. ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులు అంటున్నారు. లేకుంటే కొరతను అడ్డుకోవడం, ధరలను నియంత్రించడం చాలా కష్టమని వారు పేర్కొంటున్నారు. కొరత, ధరల పెరుగుదల నేపథ్యంలో... ఇప్పటికే కొందరు వ్యాపారులు ఉల్లిని నల్లబజారుకు తరలించినట్లు తెలి సింది. ఇక ఉల్లిగడ్డను తక్కువ ధరకే అందించేందుకు రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉల్లి కొరతపై మార్కెటింగ్ అధికారి లక్ష్మీబాయిని ‘సాక్షి’ స్పందన కోరగా శుక్రవారం ఉల్లి కొరతపైనా, ధరలపైనా చర్చించినట్లు చెప్పారు. -
ఘాటెక్కిన ఉల్లి
* కిలో రూ.15 నుంచి రూ.25కు పెరుగుదల * పెద్దగా మార్పుల్లేని కూరగాయల ధరలు తాడేపల్లిగూడెం : ఉల్లి ధర మళ్లీ ఘాటెక్కింది. గత వారంతో పోలిస్తే కిలో రిటైల్‌గా రూ.8 నుంచి రూ.10 వరకు పెరిగింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తాడేపల్లిగూడెం హోల్‌సేల్ మార్కెట్లో ఆదివారం మహారాష్ట్ర ఉల్లి క్వింటాల్ రూ. 2,400 పలికింది. నాణ్యత తక్కువగా ఉన్న ఉల్లి అయితే రూ. 1,800 వరకు పలికింది. రిటైల్‌గా నాణ్యతను బట్టి కిలో రూ.20 నుంచి రూ.25 వరకు విక్రయించారు. గత వారం నాణ్యత కలిగిన ఉల్లి క్వింటాల్ రూ.2,000 పలకగా నాణ్యత తక్కువగా ఉన్నవి రూ.1,400 చేసి విక్రయించారు. ఆదివారం కేవలం 15 లారీల సరుకు మాత్రమే గూడెం హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చింది. ఉల్లి ధర ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. పెరిగిన బీరకాయల ధర మార్కెట్లో బీర కాయలు ధర ఒక్కసారిగా పెరిగింది. గూడెం హోల్‌సేల్ మార్కెట్లో పది కిలోల ధర రూ.250 పలికింది. గత వారం రూ.110 కావడం గమనార్హం. వంకాయలు తక్కువ ధరకే లభ్యమయ్యాయి. తెల్ల వంకాయలు పది కిలోలు రూ.100 పలకగా రిటైల్ మార్కెట్లో కిలో రూ.15 నుంచి రూ.20 వరకు విక్రయించారు. నల్ల వంకాయలు పది కిలోలు రూ.60 పలికాయి. బెండ, దొండకాయల ధరలు స్వల్పంగా పెరిగాయి. బెండ కాయలు పది కిలోలు రూ.220 పలకగా దొండకాయలు రూ.150 చేసి విక్రయించారు. చిక్కుళ్లు పది కిలోలు రూ.200 లకు విక్రయించగా, పొట్టి చిక్కుళ్లు పది కిలోలు రూ. 400 చేసి విక్రయించారు. క్యారెట్ పది కిలోలు రూ.180, బీట్ రూట్ రూ.250, క్యాప్సికం, బీన్ రూ.450 పలికాయి. క్యాబేజీ పది కిలోలు రూ.80 నుంచి రూ.100 వరకు పలికాయి. దోసకాయలు కూడా ఇదే ధర పలికాయి. కంద పది కిలోలు రూ.130 వద్ద స్థిరంగా ఉండగా, పెండ్లం రూ.250 చేసి విక్రయించారు. టమోటాలు చిత్తూరు రకం 25 కిలోల ట్రే రూ.250కి చేసి అమ్మగా నాటు రకం రూ.80 పలికాయి. బంగాళా దుంపలు పది కిలోలు రూ.110 చేసి అమ్మకాలు సాగించారు. -
మళ్లీ ఘాటెక్కిన ఉల్లి
తాడేపల్లిగూడెం : ఉల్లి ధర మళ్లీ పెరిగింది. గత వారం కాస్త తగ్గినట్టు కనిపించినా ఆదివారం అనూహ్యంగా మార్కెట్లో వాటి ధర మళ్లీ యథాస్థితికి చేరింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇబ్బడిముబ్బడిగా కొత్త ఉల్లిపాయలు ముంచెత్తగా గత వారం ధర దిగివచ్చింది. రెండు వారాల క్రితం రూ.1,700 ఉండగా, గత వారం ధర రూ.1,100కి తగ్గింది. ఇటీవల ఇంతగా ధర పతనం కావడం ఇదే ప్రథమం. మహారాష్ట్ర నుంచి పాత ఉల్లిపాయల రాక ఆగిపోవడం, మరో పక్క కర్నూలు ఉల్లిపాయలు మాత్రమే మార్కెట్ అవసరాలను తీర్చడం, అస్సోం, బంగ్లాదేశ్ , సిలిగుడి ప్రాంతాల నుంచి ఎగుమతిదారులు మార్కెట్‌కు రావడం తదితర కారణాల వల్ల రెండు వారాల క్రితం ధర పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తారు. ఈ పరిస్థితి వారం తరువాత రివర్స్ అయ్యింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇండోర్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కొత్త సరుకు మార్కెట్‌కు రావడంతో ధర పతనమైంది. అయితే తాజాగా ఆదివారం కర్నూలు నుంచి ఇక్కడి గుత్త మార్కెట్‌కు కేవలం 40 లారీల సరుకులు మాత్రమే వచ్చాయి. దీంతో క్వింటాలు ధర రూ.1,600కు ఎగబాకింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, రాజస్థాన్‌లోని అల్వార్, మహారాష్ట్రలోని సోలాపూర్, అహ్మద్ నగర్, నాసిక్ వంటి ప్రాంతాలలో బుధ, గురువారాలలో భారీగా వర్షాలు కురవడంతో మార్కెట్లకు సరుకు ఎగుమతి నిలిచిపోయింది. దీంతో ఉన్న సరుకులకు డిమాండ్ పెరిగింది. మరో పది రోజుల వరకు ఉల్లి ధర లు ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దిగివచ్చిన కూరగాయలు కార్తీక మాసంలో ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు కాస్త దిగివచ్చాయి. గురువారం నుంచి మార్కెట్‌కు సరుకు రాక పెరగడంతో ధరలు పతనమై ఆది వారం నాటికి మరింత తగ్గాయి. గడచిన మూడు నెలల కాలంగా ఎన్నడూ లేని విధంగా ఎగబాకిన వంకాయల ధర ఆదివారం వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. గుత్త మార్కెట్లో గతవారం పది కిలోలు రూ.450 పలుకగా, ఈ వారం సగానికి తగ్గాయి. నలుపు రకం వంకాయలు పది కిలోలు రూ.100కు విక్రయించారు. కాగా బీన్స్ పదికిలోలు రూ.60 నుంచి రూ.40, క్యారట్ రూ.350 నుంచి రూ.300 , దొండ రూ.250 నుంచి 120, బీరకాయలు రూ.150కి, దోసకాయలు రూ.100కు తగ్గాయి. చిక్కుళ్ల ధర గత వారం రూ.600 పలకగా, ప్రస్తుతం రూ.230కు పడిపోయింది. అలాగే బెండకాయలు రూ.250 నుంచి రూ.100కి, ఆకాకర రూ.400 నుంచి రూ.350, కాకరకాయలు రూ.200 నుంచి రూ.100కు తగ్గాయి. బీట్రూట్ పది కిలోల ధర రూ.200, కంద రూ.120 వద్ద స్థిరంగా ఉంది. టమాటా ధర స్వల్పంగా పెరిగింది.