
ఉల్లి ధరపై రాజ్యసభలో గందరగోళం
ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సమాజ్వాదీ పార్టీ సభ్యులు, ఉల్లిపాయల ధరల పెరుగుదలపై వామపక్ష సభ్యులు గట్టిగా నిలదీయడంతో రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సమాజ్వాదీ పార్టీ సభ్యులు, ఉల్లిపాయల ధరల పెరుగుదలపై వామపక్ష సభ్యులు గట్టిగా నిలదీయడంతో రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలోనే రెండుసార్లు వాయిదా పడింది. మాజీ సభ్యులు దిలీప్ సింగ్ జుదేవ్, ఎస్ ఎం లాల్ జాన్ బాషాల మృతి, ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదంలో నౌకా సిబ్బంది మృతి పట్ల చైర్మన్ హమీద్ అన్సారీ సంతాపం తెలిపిన తర్వాత బీజేపీ, సమాజ్వాదీ, వామపక్షాల సభ్యులు ఒక్కసారిగా లేచి నిలబడి నినాదాలు మొదలుపెట్టారు.
ఒకరి తర్వాత ఒకరిగా మాట్లాడాలని చైర్మన్ అన్సారీ సూచించి, బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడుకు ముందుగా మాట్లాడే అవకాశం ఇచ్చారు. బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించిన ఫైళ్లు కనపడకుండా పోవడం చాలా దారుణమని ఆయన తెలిపారు. ఆ విషయాన్ని శూన్యగంటలో ప్రస్తావించాలని అన్సారీ ఆయనకు తెలిపారు. ఇంతలో సమాజ్వాదీ సభ్యులు లేచి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజి కావాలని నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. అదే సమయంలో వామపక్షాల సభ్యులు లేచి, ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, వాటిని నేలమీదకు దించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగాలంటే సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని అన్సారీ విజ్ఞప్తి చేశారు. పోస్టర్లు చూపించొద్దని కోరినా, ఎవరూ వినిపించుకోలేదు. దీంతో అన్సారీ సభను పావుగంట పాటు వాయిదా వేశారు.
సభ తిరిగి సమావేశమైన తర్వాత, సమాజ్వాదీ సభ్యులు మళ్లీ లేచి తమ డిమాండును ప్రస్తావించారు. సభ్యులను శాంతపరిచేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్ శుక్లా ప్రయత్నించారు. వివిధ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై ప్రభుత్వం ఓ కమిటీని వేస్తుందని చెప్పినా.. వారు వినిపించుకోలేదు. దీంతో అన్సారీ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు.