ఉల్లి బాంబ్‌‌ కల్లోలం | Onion Price Trends During This Year | Sakshi
Sakshi News home page

ఏడాది చివరిలో ఉల్లి బాంబ్‌‌..

Published Wed, Dec 25 2019 1:56 PM | Last Updated on Thu, Dec 26 2019 7:41 PM

Onion Price Trends During This Year - Sakshi

బంగారం, రియల్‌ ఎస్టేట్‌, షేర్‌మార్కెట్లను మరిపించేలా ఈ ఏడాది ఉల్లి ధర అమాంతం ఎగబాకింది. ఏడాది చివర ధరల లొల్లితో కిచెన్‌కు ఉల్లి దూరమైంది. ఒక దశలో కిలో ఉల్లి రూ. 200కు చేరి జనానికి కంటనీరు తెప్పించింది. ఉల్లి ఘాటు లేకుండానే వంటలు ముగించేస్తున్నామని గృహిణులు వాపోయారు. హోటళ్లు‌, రెస్టారెంట్లలోనూ ఉల్లి ఇచ్చేది లేదని తెగేసి చెబుతుంటే పురుష పుంగవులు ఆనియన్‌ లేకుండానే అయిందనిపించామని చెప్పుకొచ్చారు. హోటల్‌ మెనూలోంచి ఉల్లి దోశ మటుమాయమైంది. వంటకాల్లో ఉల్లి బదులు క్యాబేజీ వాడండంటూ మరికొందరు పాక నిపుణులు ఉచిత సలహాలూ పారేశారు. ఉల్లి వాడకం పూర్తిగా తగ్గించినా అమ్మకాలు పడిపోయినా ధర మాత్రం చుక్కలు చూస్తూనే ఉంది. వర్షాలు కురవడంలో జాప్యం, ఆ తర్వాత భారీ వర్షాలతో ఉల్లి దిగుబడులు గణనీయంగా తగ్గడంతో  ఆనియన్‌ కాస్తా అందుబాటులో లేకుండా పోయింది. మార్కెట్లకు ఉల్లి సరఫరాలు తగ్గడంతో ధరలు అంతకంతకూ ఎగిశాయి. ఈ ఏడాది మార్చిలో కిలో ఉల్లి రూ. 40 కాగా ఇటీవల రూ 200కు చేరడంతో పదినెలల వ్యవధిలోనే దాదాపు ఐదు రెట్లు ఎగబాకింది.


డబుల్‌ సెంచరీ..
గడిచిన ఏడాది మార్చి నుంచి ఘాటెక్కిన ఉల్లి డిసెంబర్‌ తొలి వారంలో ఏకంగా కిలోకు రూ.200 పలికింది. దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాలన్నింటా కిలో ఉల్లి రూ. 150కి చేరడంతో జనం తల్లడిల్లారు. ఆపై కిలో​ఉల్లి సెంచరీకి దిగివచ్చినా నేనింకా ఖరీదే అంటూ కళ్లనీళ్లు తెప్పిస్తునే ఉంది. ధరలు ఆకాశాన్ని అంటడంతో పలు చోట్ల ఉల్లిగడ్డల దోపిడీ ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. సినీ తారలు, సెలబ్రిటీలు సైతం ఉల్లి ధరలపై సెటైర్లు వేయడం, ఉల్లితో చేసిన ఆభరణాలను ప్రదర్శించడం ​పలువురి దృష్టిని ఆకర్షించింది. ఉల్లి సెగకు ప్రభుత్వాలు కుప్పకూలిన చరిత్ర కళ్లముందుంటడంతో కేంద్ర సర్కార్‌ తక్షణ చర్యలకు పూనుకుంది. ఎగుమతులపై నిషేధంతో పాటు ఉల్లి దిగుమతులపై దృష్టిసారించింది.

దిగుమతులతో దిగివస్తోంది..
 ఉల్లిలొల్లిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించడంతో పాటు టర్కీ, ఆప్ఘనిస్తాన్‌ల నుంచి ఉల్లి దిగుమతులకు ఆర్డరిచ్చింది. టర్కీ నుంచి 11 వేల మెట్రిక్ టన్నుల ఉల్లి దేశ రాజధాని ఢిల్లీకి రానుంది.ఆయా దేశాల నుంచి ఉల్లి దిగుమతులు మార్కెట్లకు చేరుకుంటుండటంతో ధరలు కొద్దిగా దిగివస్తున్నాయి. ఉల్లి కొరతను ఎదుర్కోవడానికి టర్కీ నుంచి మరో 12,500 టన్నులు దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఉల్లి లొల్లి కాస్త కుదుటపడుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఉల్లి ఘాటుతో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఏపీ ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిని రూ. 25కే అందుబాటులో ఉంచడంతో ప్రజలు ఊరట పొందారు. ఇక తాజా పంట కూడా త్వరలో మార్కెట్‌కు రానుండటంతో కొత్త ఏడాది ఆరంభంలోనే ఉల్లి ధరలు సాధారణ స్ధాయికి చేరతాయని అంచనా వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement