Rewind 2019
-
ఆహా! పదేళ్లలో ఎంత మార్పు!
2019 నుంచి 2020లోకి అడుగు పెట్టామంటే ఓ కొత్త సంవత్సరంలోకి ప్రవేశించడమే కాదు. కొత్త దశాబ్దంలోకి కూడా ప్రవేశించడం. 2010 సంవత్సరం నాటికి మొదటి దశాబ్దకాలాన్ని పూర్తి చేసుకున్న సోషల్ మీడియా 2020 నాటికి రెండో దశాబ్దంలోకి వినూత్న రీతిలో అడుగు పెట్టింది. 2010లో తాము ఎలా ఉన్నారో, ఇప్పుడు ఈ దశాబ్దంలో ఎలా ఉన్నరో తెలియజేసే ఫొటోలను యూజర్లు పోస్ట్ చేస్తూ వాటికి సముచిత కామెంట్లను కూడా జోడిస్తున్నారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ‘హౌహార్డ్డిడ్ఏజ్హిట్యూ, గ్లోఅప్, టెన్ఇయర్ఛాలెంజ్’ హాష్ ట్యాగ్‌లతో తమ అప్పటి, ఇప్పటి ఫొటోలను సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు పోస్ట్ చేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది ఆరోగ్యం, శరీర సౌష్టవం వల్ల అవగాహన పెంచుకోవడం ద్వారా అప్పటికంటే ఇప్పుడు బలంగా, అందంగా తయారుకాగా, కొంత మంది వయస్సురీత్యా సంక్రమించే వద్ధాప్య లక్షణాలతో కళ తప్పారు. సినీతారలు, కళాకారులు, మోడల్స్‌తోపాటు మోడ్రన్ దంపతులు కూడా తమ అప్పటి, ఇప్పటి ఫోటోలను షేర్ చేశారు. వారిలో విక్టోరియా బెకమ్ నుంచి లిజ్హర్లీ, చెరిల్ వరకు సెలబ్రిటీలు ఉన్నారు. -
పాటల మ్యాజిక్: వింటూ మైమరిచిపోదాం..
కొన్ని పాటలు వింటుంటే మనల్ని మనమే మైమరిచిపోతాం.. తెలీకుండానే తల, చేతులు ఆడిస్తుంటాం.. లైన్ తెలిస్తే బాత్రూం సింగర్ కంటే మెరుగ్గా పాట కూడా పాడేస్తాం. ఇక ఈ ఏడాది ఎన్నో పాటలు ఓ ప్రవాహంలా వస్తే చాలా పాటలు ఒడ్డుకు నిలబడి విజయాన్ని అందుకున్నాయి. కొన్ని ప్రేమ గీతాలను ఆలపిస్తే, మరికొన్ని తీన్మార్ స్టెప్పులతో ఊరమాస్ అనిపించాయి. అలా 2019 మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. మరి ఈ ఏడాది టాప్ టెన్ తెలుగు పాటలు ఏంటో పాడేద్దాం... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తోన్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఇందులోని ప్రతీ పాట బ్లాక్‌బస్టర్ హిట్‌గా దూసుకుపోతూ రికార్డులు సృష్టిస్తోంది. సామజవరగమన.. నిను చూసి ఆగగలనా అనే పాట యూట్యూబ్‌లో ఆగకుండా దూసుకుపోతోంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు తమన్ సంగీతమందించగా సీతారామశాస్త్రి లిరిక్స్ అందించాడు. బాహుబలి తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ భారీ బడ్జెట్‌తో ‘సాహో’ చేశాడు. ఇది ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో కొన్ని పాటలే జనాలకు క్లిక్ అయ్యాయి. కానీ ఒక పాటకు మాత్రం జనాలు విపరీతంగా ఆకర్షితులయ్యారు. అదే ‘ఆగదిక సయ్యా సైకో..’’ ఈ పాట క్యాచీగా ఉండటంతో పాటు మిక్స్డ్ భాషలు ఉపయోగించి అందరి నోట పాడించేలా చేశారు గేయ రచయిత శ్రీజో. స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఇందులో ఓ సైరా అనే పాట ఆయన గొప్పతనాన్ని తెలుపుతూ సాగుతుంది. ఈ సినిమాలో ఇది ప్రధాన పాట కాగా ఇది జనంలో మార్మోగిపోయింది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన మహర్షి సినిమా అంచనాలను దాటి వసూళ్లను సాధించింది. మహర్షి పేరుకు తగ్గట్టుగా పాట ‘ఇదే కదా ఇదే కదా..’ పాట ఉత్తేజాన్ని నింపింది. మహేశ్‌బాబు ‘నేనొక్కడినే, శ్రీమంతుడు, భరత్ అనే నేను’ సినిమాలకు దేవీశ్రీప్రసాద్ సూపర్ హిట్ సంగీతాన్ని అందించారు. ‘మహర్షి’తో మరో హిట్ అందించారు దేవీశ్రీప్రసాద్. ఇది నీ కథ అని చెప్తూ ఈ పాట అందరి మనసులకు చేరువైందనడంలో ఎలాంటి సందేహం లేదు. మాస్ ఎంటర్టైనర్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని ‘దిమాక్ ఖరాబ్’ పాట జనాలను ఇప్పటికీ వదలట్లేదు. మణిశర్మ సంగీతమందించిన ఈ పాటకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ పాటకు ఎనర్జిటిక్ హీరో రామ్ ఇరగదీసే స్టెప్పులు వేయగా హీరోయిన్ డ్యాన్యులతో ‘ఇస్మార్ట్ పాట’ అని ముద్ర వేసుకుంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను కీర్తన శర్మ, సాకేత్ ఆలపించారు. ‘ప్రియతమా.. ప్రియతమా..’ ఈ పదంలోనే ఏదో మత్తు ఉంది. ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటల లిస్టులో ఈ పాట కూడా చేరిపోయింది. చైతన్య ప్రసాద్ రచించిన ఈ పాటను చిన్మయి శ్రీపాద ఆలపించింది. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ‘మజిలీ’ సినిమాలోని ఈ పాటలో అక్కినేని నాగచైతన్య, సమంత వారి హావభావాలతో పాటను మరింత రక్తికట్టించారు. చిత్రలహరి సినిమాలో ‘ప్రేమ వెన్నెల..’ పాట తెలియనవారు లేరంటే నమ్మండి. అందులోని ఈ పాటకు ఎంతో మంది ఫిదా అయిపోయారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా సుదర్శన్ అశోక్ రచించిన ఈ పాటకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. శ్రీమాన్ అద్భుతంగా పాడాడు. నాచురల్ స్టార్ నాని ఈ ఏడాది రెండు సినిమాలతో పలకరించాడు. ఒకటి ‘జెర్సీ’ కాగా మరోటి ‘గ్యాంగ్ లీడర్’. రెండింటిలోనూ మంచి పాటలకు కొదువే లేదు. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ సినిమాలోని ‘హొయినా హొయినా’ పాట అందరినీ ఉర్రూతలూగించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతమందించగా, ఈ పాటను ఆలపించిన ఇన్నో జెంగా తన గాత్రంతో ఆకట్టుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ‘ఓ బావా.. మా అక్కను సక్కగ సూస్తావా..’ సాంగ్‌తో మరో హిట్ అందుకున్నాడు. కేకే రాసిన పాటను సత్య యామిని, మోహన భోగరాజు, హరి తేజ దానికి తగ్గట్టుగా ఆలపించారు. ప్రతిరోజు పండగే చిత్రంలోని ఈ పాట ఇప్పటికీ అందరి ఫోన్లలో మోగుతూనే ఉంది. బావను ఆట పట్టించడానికి మరదళ్లు ఈ పాటతో ఓ ఆట ఆడేసుకుంటున్నారనుకోండి. క్రికెట్ చుట్టూ తిరిగే కథ ‘జెర్సీ’. ఇందులో ‘అదేంటో గానీ ఉన్నపాటుగా..’ పాట ఎంత హిట్టో మనందరికీ తెలిసిందే. దీనికి సంగీతాన్ని అందించిన అనిరుధ్ తనే స్వయంగా ఆలపించాడు. క్రిష్ణ కాంత్ మెలోడీకి తగ్గట్టుగా పాట రచించాడు. పెళ్లి తర్వాత ప్రేమ మరింత పెరుగుతుందని నిరూపిస్తుందీ పాట. -
2019: బుక్‌మై షోలో రికార్డు సృష్టించిన సినిమాలు
భారతీయ చిత్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోంది. బయోపిక్ ట్రెండ్లను దాటి ఇప్పుడు మరో ముందడుగు వేసింది. దేశంలో చోటు చేసుకుంటున్న ప్రధాన సంఘటనలను కూడా తెరకెక్కించవచ్చని ఉరి: ద సర్జికల్ స్ట్రైక్, మిషన్ మంగళ్ నిరూపించాయి. కొత్తదనాన్ని కోరుకుంటున్న జనం చిన్న సినిమాలను ఆదరిస్తున్నారని ప్రాంతీయ సినిమాలను చూస్తే అర్థమవుతుంది. సినిమా విజయం సాధించింది అని చెప్పడానికి కావాల్సిన కొలమానాలు మారిపోయాయి. కేవలం కలెక్షన్లు వచ్చిన సినిమాలే కాకుండా ప్రేక్షకులు అక్కున చేర్చుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ పరీక్షలో పాస్ అయినట్టు లెక్క. ఇది కొత్తసంవత్సరంలోనూ కొనసాగనుంది. ఇక ఈ ఏడాది భారత చిత్రపరిశ్రమలో సాహసాలు చేసిన సినిమాలు కొన్ని అంచనాలకు మించి సక్సెస్ అవుతే మరికొన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాయి. సినిమా బాగుందంటే చాలు.. ప్రాంతీయ, జాతీయ బేధాలను లెక్క చేయకుండా ఆ సినిమాలను నెత్తిన పెట్టుకుని ఆదరించడమే భారతీయ చిత్ర పరిశ్రమ లక్షణం. ఈ క్రమంలో 2019కు గానూ జాతీయ అంతర్జాతీయ సినిమాలు ఏవి టాప్‌లో నిలిచాయో రౌండేద్దాం.. బుక్‌మైషోలో రికార్డు ఒకప్పటిలా సినిమా చూడాలంటే పొద్దునే లేచి బారెడంత క్యూలో నిలబడాల్సిన పని లేదు. సినిమా విడుదల కాక ముందే ఫోన్లో ఉన్న యాప్‌తో టికెట్ కొనేసి రెడీగా ఉండచ్చు. ఇలాంటి యాప్‌లు ఈ మధ్య కాలంలో కుప్పలు తెప్పలుగా వచ్చాయి. అయితే సినిమా టికెట్లతో పాటు, పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమాలకు సైతం టికెట్లు బుక్ చేసుకునే ‘బుక్ మై షో’ ఓ ముఖ్య విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం ఈ ఏడాది బుక్‌మైషోలో అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమాగా ‘అవెంజర్స్: ది ఎండ్‌గేమ్’ అనే హాలీవుడ్ మూవీ రికార్డు సృష్టించింది. 5.7 మిలియన్ల టికెట్ల అమ్మకాలతో భారతీయ చిత్రం ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ రెండో స్థానంలో చోటు దక్కించుకుంది. విమ టాప్ టెన్ ఇండియన్ సినిమాలు ► అవెంజర్స్: ఎండ్‌గేమ్ ► ఉరి: ద సర్జికల్ స్టైక్ ► కబీర్ సింగ్ ► సాహో ► వార్ ► ద లయన్ కింగ్ ► మిషన్ మంగళ్ ► సింబా ► గల్లీబాయ్ ► చిచోరే భారత్‌లో హవా కనబర్చిన అంతర్జాతీయ సినిమాలు జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్డమ్ వండర్ వెధరింగ్ విత్ యు పాడింగ్టన్ 2 బ్లూ ప్లానెట్ 2 హస్ట్లర్స్ విలేజ్ రాక్‌స్టార్స్ మైల్ 22 హరే కృష్ణ ఎ ప్రైవేట్ వార్ టాప్ 5 తెలుగు సినిమాలు ⇔ సైరా సరసింహ రెడ్డి ⇔ సాహో ⇔ మహర్షి ⇔ ఎఫ్2 ⇔ మజిలీ టాప్ 5 బెంగాలీ సినిమాలు ♦ దుర్గేష్గోరర్ గుప్తోధోన్ ♦ గుమ్నామీ ♦ కొంఠో ♦ మిటిన్ మషి ♦ గోట్రో టాప్ 5 తమిళ సినిమాలు ⇒ బిగిల్ ⇒ పేట ⇒ విశ్వాసం ⇒ నెర్కొండ పార్వై ⇒ ఖైదీ టాప్ 5 మరాఠీ సినిమాలు • ముంబై పుణె ముంబై 3 • ఠాక్రే • హిర్కానీ • ఆనంది గోపాల్ • భాయ్- వ్యక్తి కి వల్లి -
వెంటాడిన ‘అనారోగ్యం’!
సాక్షి, సిటీబ్యూరో: వైద్య ఆరోగ్యశాఖను ఈ ఏడాది తీవ్రమైన అనారోగ్యం వెంటాడింది. డెంగీ, స్వైన్‌ఫ్లూ జ్వరాలతో అనేక మంది మృత్యువాతపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడం, బస్తీల్లో వరదలు పోటెత్తాయి. డెంగీ దోమలు వృద్ధి చెందాయి. ఫలితంగా ఈ ఏడాది ఇప్పటి వరకు అధికారికంగా 4500పైగా డెంగీ జ్వరాలు నమోదు కాగా, వీరిలో 22 మంది వరకు మృత్యువాతపడ్డారు. అనధికారికంగా మృతుల సంఖ్య వందకు పైగా ఉన్నట్లు అంచనా. జ్వరాలపై హైకోర్టు సీరియస్ డెంగీ జ్వరాలపై చివరకు హైకోర్టు సైతం ప్రభుత్వంపై సీరియస్ కావడంతో అప్రమత్త మైన ప్రభుత్వం ఆగమేఘాల మీద నష్టనివారణ చర్యలు చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్ సహా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ వైద్యుల సెలవులు రద్దు చేసి, ఆదివారం ఓపీ సర్వీసులు అందజేసింది. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, బస్తీ దవాఖానాల్లో ఈవినింగ్ ఓపీలను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో కాలంతో సంబంధం లేకుండా గత పదేళ్ల నుంచి స్వైన్‌ఫ్లూ వీరవిహారం చేస్తూనే ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 250పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో 25 మంది మృత్యువాతపడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. నిలోఫర్‌లో క్లినికల్ ట్రయల్స్ దుమారం నిలోఫర్ కొంత మంది వైద్యులు చిన్నారుల తల్లిదండ్రులకు తెలియకుండా శిశువులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇద్దరు వైద్యుల మధ్య నెలకొన్న వివాదం చివరకు తార స్థాయికి చేరుకుంది. ఇరువురు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది. చివరికి వైద్య ఆరోగ్య శాఖను ఓ కుదుపు కుదిపేసింది. అదృష్టవశాత్తు ఈ ట్రయల్స్‌లో ఎవరికీ ఏమీ కాకకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆస్పత్రిలో నవజాత శిశువుల మరణాల సంఖ్య రెట్టింపైంది. వ్యాక్సినేషన్లో నిర్లక్ష్యం..శిశువు మృతి జాతీయ వ్యాధినిరోధక టీకాల కార్యక్రమంలో నాంపల్లి ఏరియా ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ శిశువు ప్రాణాలను మింగేసింది. మరో 32 మంది పిల్లల అస్వస్థతకు కారణమైంది. వ్యాక్సినేషన్ తర్వాత పారాసిటమాల్ టాబ్లెట్‌కు బదులు...సర్జరీ తర్వాత నొప్పి నివారణ కోసం వాడే ట్రెమడాల్ 300 ఎంజీ టాబ్లెట్ ఇవ్వడంతో కిషన్‌బాగ్‌కు చెందిన మూడున్నర నెలల లోపు శిశువు మృతి చెందగా, మరో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడం వివాదాస్పదమైంది. ఏరియా ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల శిశువు ప్రాణాలు కోల్పొవడం అప్పట్లో ఈ అంశంపె పెద్ద దుమారమే రేగింది. చివరకు ప్రభుత్వం స్పందించి ఏరియా ఆస్పత్రి ఇన్చార్జి డాక్టర్, ఫార్మసీ ఉద్యోగి, స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేసింది. షైన్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఎల్బీ నగర్షైన్ ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఐసీయూలో అర్దరాత్రి మంటలు చెలరేగాయి. ఈఘటనలో ఓ శిశువు మృత్యువాత పడగా, మరో నలుగురు శిశువులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో ఉలిక్కి పడిన ప్రభుత్వం..ఆస్పత్రి వైద్యులు సహా విధి నిర్వహణలో ఉన్న స్టాఫ్ నర్సులపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేయించింది. బోధనాసుపత్రుల్లోనూ వసతులు మృగ్యం.. ⇔ ఉస్మానియా ఆస్పత్రి పాతభవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రత్యామ్నాయంగా అదే ప్రాంగణంలో మరో రెండు బహుల అంతస్థుల భవనాలు నిర్మించనున్నట్లు ఐదేళ్ల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ ఏడాది కూడా ప్రతిపాదన దశలోనే ఉంది. ప్రస్తుతం పునాదిరాయికి నోచుకోలేదు. ఆస్పత్రి చరిత్రలో వైద్యులు వంద రోజుల పాటు ఆందోళనలు చేసినా..అనేక విజ్ఞప్తులు చేసినా ఆలకించిన నాధుడే లేరు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రోగులకు ఇబ్బందులు తప్పలేదు. ⇔ గాంధీ జనరల్ ఆస్పత్రిలో రూ.30 కోట్లలో 8 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు నిర్మించనున్నట్లు ప్రకటించినా..ఇప్పటి వరకు ఒక్క థియేటర్ కూడా ప్రారంభం కాలేదు. సంతాన సాఫల్య కేంద్రం సహా అత్యవసర విభాగం ఆధునీకికరణ వంటి పనులు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ⇔ ఈఎన్టీ ఆస్పత్రిలో రోగులకు కష్టాలు తప్పలేదు. రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు, ఆపరేషన్ థియేటర్లు లేకపోవడంతో చికిత్సల కోసం మూడు నుంచి నాలుగు నెలలు ఎదురు చూడాల్సి వస్తుంది. -
చీకట్లను చీల్చుకొని..
సాక్షి, అనంతపురం: జిల్లా వాసుల జీవితాల్లో 2019 గమ్మత్తైన ప్రయాణాన్ని సాగించింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. సంక్షేమ వెలుగులు ప్రసరించడంతో జిల్లాలో చీకట్లు వైదొలుగుతూ వచ్చాయి. పాలనలో సంస్కరణలు అన్ని వర్గాలకు కొత్త జీవితాన్ని అందించాయి. జనవరి మొదలు.. డిసెంబర్ వరకూ సాగిన ఈ ప్రయాణంలో ఎన్నో అనుభూతులను 2019 మిగిల్చింది. ఉత్సాహవంతులైన యువ అధికారుల నియామకం.. వారి ఆలోచనల్లో కొత్తదనం ఫలితంగా జిల్లాలో పెనుమార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. కాస్త చేదు మిగిల్చినా.. మొత్తానికి జిల్లాలో గత పాలకులు మిగిల్చిన చీకట్లను పారదోలడంలో 2019 సాగించిన విజయప్రస్థానంపై మంత్ టు మంత్ రిపోర్ట్ మీ కోసం. జనవరి: 10వతేదీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఇచ్చాపురంలో దిగ్విజయంగా పూర్తి అయిన సందర్భంగా జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఫిబ్రవరి: 18వ తేదీ: ఏలూరు సభలో బీసీ డిక్లరేషన్‌పై అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టతనివ్వడంతో జిల్లా వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. మార్చి: ►10వ తేదీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యుల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ను కలెక్టర్ విడుదల చేశారు. అదే రోజు నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. ►18వ తేదీ: రాయదుర్గంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ►25వ తేదీ: తాడిపత్రిలో ఎన్నికల ప్రచార బహిరంగ సభ వేదికపై నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. ► 30వ తేదీ: సోమందేపల్లి, మడకశిర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న వైఎస్ జగన్. ►31న: కళ్యాణదుర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌గాంధీ. ఏప్రిల్: ►4వ తేదీ: హిందూపురం, కళ్యాణదుర్గంలో వైఎస్జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ►11వ తేదీ: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగింది. 14 నియోజవకర్గాల పరిధిలో చిన్నపాటి సంఘటలనలు మినహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. మే: ►14వ తేదీ: పది పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 95.55 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 7వ స్థానంలో అనంత జిల్లా నిలిచింది. 2,971 మంది విద్యార్థులు 10/10 గ్రేడ్‌పాయింట్లు సాధించారు. ►23వ తేదీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని సృష్టించింది. 12 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. జూన్: ► 7వ తేదీ: జిల్లా కలెక్టర్‌గా సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ► 9వ తేదీ: జిల్లా ఎస్పీగా సత్యయేసుబాబు బాధ్యతలు స్వీకరించారు. జూలై: ►9వ తేదీ: జిల్లాలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ►19వ తేదీ: సర్వజనాస్పత్రి అభివృద్ధికి రూ.250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో అదనపు భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. ఆగస్టు: ► 8వ తేదీ: కియా పరిశ్రమలో తొలి కారు ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, శంకరనారాయణ, పీఐఐసీసీ చైర్పర్సన్ ఆర్.కె.రోజా పాల్గొన్నారు. ►19వ తేదీ: ఎమ్మెల్సీగా విశ్రాంత ఐజీ మహమ్మద్ ఇక్బాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శాసనమండలి చాంబర్లో రిగర్నింగ్ అధికారి బాలకృష్ణమాచార్యలు ప్రకటించారు. సెప్టెంబర్: ►26వ తేదీ: డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ జిల్లాకు విచ్చేశారు. భూ యజమానుల హక్కులను కాపాడేందుకు రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇళ్ల పట్టాల మంజూరుకు భూసేకరణ, భూ రికార్డుల స్వచ్ఛీకరణ తీరును మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, శంకరనారాయణ, విప్ కాపు రామచంద్రారెడ్డితో కలిసి అధికారులతో ఆయన సమీక్షించారు. అక్టోబర్: ►1వ తేదీ: జిల్లాలో గ్రామ సచివాలయాల వ్యవస్థను మంత్రి శంకరనారాయణ లాంఛనంగా ప్రారంభించారు. నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ►10వ తేదీ: వైఎస్సార్ కంటి వెలుగు రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనంతలో ప్రారంభించారు. ►22వ తేదీ: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యుడిగా రాష్ట్ర విద్యాసంస్కరణల కమిటీ సభ్యుడు ఆలూరి సాంబశివారెడ్డి నియమితులయ్యారు. నవంబర్: ►8వ తేదీ: అగ్రిగోల్డ్ బాధితులకు రూ.20.64 కోట్ల మెగా చెక్కును ప్రజాప్రతినిధులు అందజేశారు. ►17వ తేదీ: కనకదాస జయంతిని అధికారికంగా జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ►22వ తేదీ: పుట్టపర్తిలో సత్యసాయి 94వ జయంత్యుత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 38వ స్నాతకోత్సవం జరిగింది. కార్యక్రమానికి డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సతీష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిసెంబర్: ► 2వ తేదీ: జిల్లాకు 100వ కలెక్టర్‌గా గంధం చంద్రుడు బాధ్యతలు స్వీకరించారు. ► 5వ తేదీ: కియా గ్రాండ్ సెర్మనీలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానికులకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, కియా మోటార్స్‌లో పూర్తిస్థాయి ఉత్పత్తి మొదలైతే మరిన్ని ఉద్యోగాలు జిల్లా వాసులకు దక్కుతాయని ఆయన అన్నారు. ► 6వ తేదీ: 36 సంవత్సరాలుగా తమకు సేవలందిస్తూ వచ్చిన దంపెట్ల నారాయణ యాదవ్ మృతి చెందడంతో ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఢిల్లీ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని సతీసమేతంగా ముదిగుబ్బ మండలం దిగువపల్లికి వచ్చారు. ► 9వ తేదీ: ఎస్కేయూ వీసీ ఫ్రొఫెసర్ జయరాజ్ హఠాన్మరణం. ► 11వ తేదీ: డీసీసీబీ చైర్మన్‌గా బీసీ సామాజిక వర్గానికి చెందిన పామిడి నివాసి మానుకింద వీరాంజినేయులు బాధ్యతల స్వీకరణ. ► 18వ తేదీ: మూడు రోజుల పాటు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ► 21వ తేదీ: వైఎస్సార్ నేతన్న నేస్తంను ధర్మవరం నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. జిల్లాలో 27,481 మంది నేతన్నలకు లబ్ది చేకూరింది. -
ఈ ఏడాది చోటుచేసుకున్న కీలకాంశాలు
దేశ విదేశాల్లో కొంగొత్త ఆవిష్కరణలు... కార్పొరేట్ దిగ్గజాల అస్తమయం... దివాలా కోరల్లో చిక్కుకున్న కంపెనీలు... కొత్త బాధ్యతలతో తళుకులు... ఇలా ఆద్యంతం వ్యాపార రంగంలో ఊపిరిసలపని పరిణామాలతో పయనం సాగించిన 2019 మరికొద్ది గంటల్లో మనకు గుడ్‌బై చెప్పేస్తోంది. ఎన్నో మలుపులు.. మరెన్నో ఊహించని సంఘటనలను తన మదిలో నింపుకున్న సంవత్సరం ఇది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చోటుచేసుకున్న కీలకాంశాలను ఒక్కసారి అవలోకనం చేసుకునే ‘బిజినెస్ రివైండ్’ సాక్షి పాఠకులకు ప్రత్యేకం... జనవరి... ► బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయ, దేనా బ్యాంక్‌ల విలీనానికి కేంద్రం ఓకే. దీనితో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత దేశంలోనే మూడవ అతిపెద్ద బ్యాంకుగా బీఓబీ అవతరించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండవ అతిపెద్ద బ్యాంకుగా నిలిచింది. ► బంధన్ బ్యాంక్ చేతికి గృహ్ ఫైనాన్స్. ► వీడియోకాన్ క్విడ్‌ప్రోకో వ్యవహారంలో చందా కొచర్‌పై సీబీఐ కేసు. ఫిబ్రవరి ► ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం బాగోలేకపోవడం తో, తాత్కాలిక బాధ్యతల్లో మధ్యంతర వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన పీయూష్ గోయెల్. ఆదాయాలపై రూ. 5 లక్షల వరకూ పన్ను రిబేట్ కీలక నిర్ణయం. మార్చి ► ఎరిక్సన్కు ఇవ్వాల్సిన రూ.458.77 కోట్ల బకాయిలు చెల్లించకపోతే... జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఆర్‌కామ్ చైర్మన్ అనిల్ అంబానీకి ఫిబ్రవరి 20న సుప్రీంకోర్టు హెచ్చరిక. నెల గడువు. ఆదుకున్న అన్నయ్య ముకేశ్. గడువుకు ఒకరోజు ముందు మార్చి 18న మొత్తం డబ్బు చెల్లించిన ఆర్ఐఎల్. ఏప్రిల్ ► ఇండియా బుల్స్ చేతికి లక్ష్మీ విలాస్ బ్యాంక్. షేర్ బదలాయింపు ద్వారా ఆర్థిక లావాదేవీ. ► దాదాపు రూ.8,000 కోట్ల రుణ భారంతో జెట్ ఎయిర్వేస్ క్రాష్ ల్యాండింగ్. మే ► జాగరణ్ ప్రకాశన్ చేతికి అనిల్ అంబానీ రేడియో బిగ్ఎఫ్ఎం. డీల్ విలువ రూ.1,050 కోట్లు. అడాగ్ కంపెనీల రుణ భారం తగ్గించుకునే ప్రయత్నం. జూన్ ► మూడేళ్ల పదవీకాలంలో ఆరు నెలల ముందుగానే వ్యక్తిగత అంశాలను కారణంగా చూపుతూ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ డాక్టర్ విరాల్ ఆచార్య రాజీనామా. వ్యక్తిగత కారణాలే కారణంగా చూపుతూ ఆర్బీఐ గవర్నర్‌గా రాజీనామా చేసిన ఉర్జిత్ పటేల్ తర్వాత, ఆర్బీఐ ఉన్నత పదవికి రాజీనామా చేసిన వ్యక్తిగా విరాల్ ఆచార్య. జూలై ► 2019–2020 ఆర్థిక సంవత్సరానికి రూ.27,86,349 కోట్ల పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ► బ్యాంకుల జాతీయీకరణకు 50 సంవత్సరాలు పూర్తి ఆగస్టు ► హైదరాబాద్‌లో అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ ప్రారంభం ► ప్రభుత్వ బ్యాంకుల మెగా విలీనానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం. మొత్తం 10 బ్యాంకులు 4 బ్యాంకులుగా కుదింపు. సెప్టెంబర్ ► దేశ వ్యాప్తంగా 1600 నగరాల్లో జియో హైస్పీడ్– ఫైబర్ నెట్ సేవలు ప్రారంభం. ► కార్పొరేట్ ట్యాక్స్ రేటును కంపెనీలకు 30 శాతం నుంచి 22 శాతానికి, కొన్ని కొత్త తయారీ సంస్థలకు 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన. ► బ్రిటిష్ పర్యాటక సంస్థ.. 178 ఏళ్ల చరిత్ర ఉన్న థామస్ కుక్ దివాలా. అక్టోబర్ ► బ్యాంకింగ్ రుణ రేట్లు అన్నీ రెపో రేటుకు, ఇతర ఎక్న్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లకు అనుసంధానం. ఆర్బీఐ రేట్ల కోత ప్రయోజనాన్ని బ్యాంకులు తక్షణం కస్టమర్‌కు బదలాయించేలా చూడటమే దీని లక్ష్యం. నవంబర్ ► తీవ్రమైన రుణ సంక్షోభంలో చిక్కుకున్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్(డీహెచ్ఎఫ్ఎల్)పై ఆర్బీఐ కొరడా. కంపెనీ డైరెక్టర్ల బోర్డు రద్దు. దివాలా చర్యలు షురూ. డిసెంబర్ ► ఇన్సాల్వెన్సీ, దివాలా కోడ్ ప్రక్రియతో రూ.42,000 కోట్లకు ఎస్సార్ స్టీల్ కొనుగోలు ద్వారా దేశంలోకి ప్రవేశించిన ప్రపంచ స్టీల్ దిగ్గజం– ఆర్సిలార్మిట్టల్. కొత్త బాధ్యతలు ఆర్థికమంత్రిగా నియమితులైన నిర్మలా సీతారామన్. గతంలో ఇందిరాగాంధీ తాత్కాలికంగా ఆర్థికశాఖను నిర్వహించినా, పూర్తి స్థాయి ఆర్థికమంత్రిగా నియమితులైన తొలి భారత మహిళగా సీతారామన్‌కు గుర్తింపు. బలమైన కంపెనీగా ఐటీసీని మలచిన శిల్పి, పద్మ భూషన్ అవార్డు గ్రహీత యోగేష్ చందన్ దేవేశ్వర్ (72) కన్నుమూత. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) సంస్థ చీఫ్ ఎకనమిస్ట్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా గీతా గోపీనాథ్. విప్రో చైర్మన్ ప్రేమ్‌జీ పదవీ విరమణ. కుమారుడు రిషద్‌కు బాధ్యతలు. దిగ్గజాల అస్తమయం... బిర్లా మూల పురుషుడు బీకే బిర్లా (98) మరణం. మాజీ ఆర్థిక మంత్రి, దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన బీజేపీ నేత అరుణ్ జైట్లీ అనారోగ్యంతో అస్తమయం. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయి... ఆత్మహత్య చేసుకున్న కాఫీ డే అధినేత సిద్ధార్థ. రెండు రోజుల అదృశ్యం తర్వాత కర్ణాటకలోని నేత్రావతి నది ఒడ్డున మృతదేహం గుర్తింపు. ఐటీ అధికారులు, పీఈ ఇన్వెస్టర్లు వేధించారంటూ వెలువడిన ఆయన లేఖ సంచలనం. ఆటో ‘మొబైల్’... దక్షిణకొరియా కార్ల దిగ్గజం కియా ‘మేడిన్ ఆంధ్రా’ సెల్టోస్ విడుదల. అనంతపురం ప్లాంట్‌లో తొలి కారు ఆవిష్కరణ. దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ .. కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ హారియర్ వాహనాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూసిన అత్యాధునిక ఐఫోన్లు 11, 11 ప్రోలను ఆవిష్కరించిన యాపిల్. ధరల స్పీడ్ ధరలూ సామాన్యునిపై భారాన్ని మోపుతున్నాయి. మొత్తంగా గణాంకాలు దేశంలో మందగమన పరిస్థితులను ప్రతిబింబిస్తుండగా, నిత్యావసరాల ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం ఉండాలన్నది ఆర్బీఐకి కేంద్రం నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్ 2’ లేదా ‘మైనస్ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే అక్టోబర్ (4.62 శాతం), నవంబర్ (5.54 శాతం) ద్రవ్యోల్బణం అదుపుతప్పింది. ఇక నవంబర్ టోకు ద్రవ్యోల్బణం వ్యవస్థలో మందగమన స్థితికి (0.58 శాతం) అద్దం పట్టింది. చిక్కుల్లో కార్వీ క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందన్న ఆరోపణలతో స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీ తీవ్ర సంక్షోభంలోకి జారింది. దాదాపు రూ. 2,300 కోట్ల విలువ చేసే క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి రూ. 600 కోట్ల దాకా రుణాలు తీసుకుందని, క్లయింట్ల నిధులను సొంత అవసరాలకు వాడుకుందని కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) ఆరోపణలు ఎదుర్కొంటోంది. దీంతో కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా, పాత క్లయింట్ల పవర్ ఆఫ్ అటార్నీలను (పీవోఏ) ఉపయోగించుకోకుండా కార్వీపై నవంబర్ 22న సెబీ నిషేధం విధించింది. ఎక్సే్ఛంజీల నిబంధనలను ఉల్లంఘించినందుకు అన్ని విభాగాల్లో ట్రేడింగ్ లైసెన్సును సస్పెండ్ చేస్తున్నట్లు ఎక్సే్ఛంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రకటించాయి. ‘మిస్త్రీ’కి ఊరట... 2016 అక్టోబర్ 24న టాటా సన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో మిస్త్రీకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు చట్టవిరుద్ధమని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) స్పష్టం చేసింది. మళ్లీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టవచ్చని, అలాగే, టాటా కంపెనీల్లో డైరెక్టరుగా కూడా ఉండవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో మిస్త్రీ స్థానంలో చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధం అవుతుందని కూడా జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ్ సారథ్యంలోని ద్విసభ్య బెంచ్ తుది ఉత్తర్వులిచ్చింది. ఈ ఆదేశాలు నాలుగు వారాల్లో అమల్లోకి వస్తాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు బిలియనీర్లు ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో రూ.3,80,700 కోట్లతో రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీ భారత్‌లో అపర కుబేరుడుగా నిలిస్తే, ఇదే జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు బిలియనీర్లకూ స్థానం దక్కింది. అరబిందో ఫార్మా చైర్మన్ పీవీ రాంప్రసాద్ రెడ్డికి(రూ.14,800 కోట్లు) 51వ స్థానం లభించగా, ఎంఈఐఎల్ చైర్మన్, ఎండీలు పి. పిచ్చిరెడ్డి (రూ.13,400), పీవీ కృష్ణారెడ్డి (రూ12,900 కోట్లు)లు 57, 63 స్థానాల్లో నిలిచారు. ఇక దివీస్ ల్యాబ్స్– దివి సత్చంద్ర కిరణ్ (రూ.10,200 కోట్లు) , నీలిమ మోటపర్తి (రూ.9,800 కోట్లు) 83, 89 స్థానాల్లో ఉన్నారు. మరో విశేషం ఏమిటంటే... ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ ఇండియా మేగజైన్.. ‘కలెక్టర్స్ ఎడిషన్ 2019’లో ఎంఈఐఎల్ చైర్మన్ పీపీ రెడ్డికి విశిష్ట గౌరవం లభించింది. పీపీ రెడ్డితో సంస్థ ఎండీ పీవీ కృష్ణా రెడ్డి కలిసి ఉన్న ఫొటోతో ‘మేఘా బిల్డర్’ పేరుతో ప్రచురించిన ఈ వ్యాసంలో సంస్థ పురోగతిని వివరించింది. పరిశ్రమలు నిరాశ... పారిశ్రామిక ఉత్పత్తి వరుసగా మూడవనెల– అక్టోబర్‌లోనూ వృద్ధిలేకపోగా ‘క్షీణత’లో నిలిచింది. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌తో ప్రారంభం నుంచీ అక్టోబర్ వరకూ ఏడు నెలల కాలాన్ని చూస్తే, వృద్ధి రేటు 5.7 శాతం నుంచి (2018 ఇదే కాలంలో) 0.5 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది జూలై తర్వాత ఈ రంగంలో అసలు వృద్ధిలేదు. ఇన్ఫీకి విజిల్‌బ్లోయర్స్ షాక్ భారీ ఆదాయాలు చూపించడం కోసం ఇన్ఫీ సీఈవో సలిల్ పరీఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ ’అనైతిక’ విధానాలకు పాల్పడుతున్నారంటూ పేరు వెల్లడించని కొందరు ఉద్యోగుల(విజిల్‌బ్లోయర్స్) ఫిర్యాదులతో ఇన్ఫోసిస్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. -
పసందైన విందు
ఈ గడిచిన ఏడాదిలో క్రికెట్లో ఎన్నో జ్ఞాపకాలున్నాయి. చెలరేగిన ఆటగాళ్లు, పట్టాలెక్కిన పరుగు వీరులున్నారు. చెడుగుడు ఆడిన బౌలర్లున్నారు. చెరిగిన రికార్డులు కూడా ఉన్నాయి. ఎన్ని చెప్పుకున్నా...ఇందులో కొన్నయితే పదిలమైన ముద్ర వేసుకున్నాయి. వాటిని గుర్తుచేసుకుంటే మాత్రం... ప్రత్యేకించి క్రికెట్ ప్రియులకు కళ్లు మూసినా కనువిందే చేస్తాయి. మొత్తానికి 2019 సంవత్సరం క్రికెట్ ప్రేమికులకు పసందైన విందును అందించి వీడ్కోలు పలుకుతోంది. సాక్షి క్రీడావిభాగం: పుట్టింటికి వెళ్లిన ప్రపంచకప్... భారత్‌లో పింక్‌బాల్ టెస్టు... ఓపెనింగ్‌లో రో‘హిట్స్’... బౌలింగ్‌లో దీపక్ చాహర్ చెడుగుడు... టి20 మెరుపులు చూసినోళ్లకు చూసినంత వేడుక చేసింది... క్రికెట్లో ఈ ఏడాది ఇవన్నీ అద్భుతాలేం కావు! కానీ... కొన్ని కోట్ల కళ్లను కట్టిపడేశాయి. తప్పతాగి జీరోగా మారిన వ్యక్తిని ఒక్క మ్యాచ్‌తో హీరోగా మార్చేశాయి. క్రికెట్ లోకానికి పసందైన విందును అందించాయి. ఇంగ్లండ్‌దే వన్డే ప్రపంచం క్రికెట్ ఇంగ్లండ్‌లో పుట్టింది. కానీ పురుషుల జట్టు ఎప్పుడూ వన్డే ప్రపంచకప్‌ను మాత్రం ముద్దాడలేదు. ఆ లోటు తీరింది 2019లో అయితే తీర్చింది మాత్రం ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్! పురిటిగడ్డపై కొత్త చాంపియన్ కోసం జరిగిన పోరు ముందు ‘టై’ అయింది. తర్వాత ‘సూపర్ ఓవర్’ టై దాకా రసవత్తరం చేసింది. తద్వారా కనీవినీ ఎరుగని ఫైనల్‌గా నిలిచింది. ఇప్పటి వరకు ఏ ప్రపంచకప్ తుదిపోరు కూడా ఇలా ఇన్ని ‘టై’ మలుపులు తిరగలేదు. పరుగుల తేడాతోనూ, లేదంటే వికెట్ల తేడాతోనూ గెలిచిన విజేతలే ఉన్నాయి. కానీ మొట్టమొదటి సారిగా ఇటు వికెట్, అటు పరుగులు పైచేయి సాధించలేక... చివరకు ‘బౌండరీ కౌంట్’తో ఇంగ్లండ్ విజేత అయ్యింది. ఇవన్నీ ఈ ఒక్క మ్యాచ్‌లోనే జరిగాయి. ఇక్కడ స్టోక్స్ (84) చేసిన పోరాటం అంతాఇంతా కాదు. అంతక్రితం తప్పతాగి రోడ్డుమీద తగువులాడి ‘జీరో’ అయిన స్టోక్స్ ఈ వీరోచిత పోరాటంతో ‘హీరో’ అయ్యాడు. అనంతరం ఈ బౌండరీల లెక్క పెద్ద చర్చకే దారి తీసింది. అలనాటి స్టార్లు మొదలు దిగ్గజాల వరకు అంతా ‘లెక్క’పై శ్రుతి కలిపారు. ఇది కొన్ని రోజులు, నెలల దాకా సాగడంతో చివరకు ఐసీసీ నిబంధనలు మార్చాల్సి వచ్చింది. మెగా ఈవెంట్ టైటిల్ పోరులో సూపర్ ఓవర్ కూడా ‘టై’ అయితే బౌండరీలను లెక్కపెట్టకుండా... పరుగులు పైచేయి సాధించేదాకా ‘సూపర్’ ఓవర్‌ను కొనసాగించాలని ఐసీసీ నిర్ణయించింది. పొట్టి క్రికెట్లో 4 రికార్డులకు ‘చెక్’ ఐసీసీ పుణ్యమాని చెక్ రిపబ్లిక్ కూడా అంతర్జాతీయ రికార్డు పుటలకెక్కింది. క్రికెట్‌కు విశ్వవ్యాప్త ఆదరణ తెచ్చేందుకని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పొట్టి ఫార్మాట్లో అసోసియేట్, అఫిలియేట్ దేశాల మధ్య జరిగే పోటీలకూ అంతర్జాతీయ హోదా ఇచ్చింది. దీంతో ఈ ఏడాది ఆగస్టు 30న చెక్ రిపబ్లిక్, టర్కీ జట్ల మధ్య జరిగిన ఒక్క టి20ల్లోనే నాలుగు రికార్డులు చెదిరిపోయాయి. 278/4 స్కోరు చేసిన చెక్ 257 పరుగుల తేడాతో టర్కీని కంగుతినిపించింది. టర్కీ 21 పరుగులకే ఆలౌట్ కావడంతో అత్యల్ప స్కోరుకే ఆలౌట్ (నెదర్లాండ్స్ 39 ఆలౌట్), అత్యధిక పరుగుల తేడా (కెన్యాపై శ్రీలంక 172), అత్యధిక జట్టు స్కోరు... 35 బంతుల్లోనే చెక్ ఆటగాడు సుదేశ్ విక్రమశేఖర ‘శత’క్కొట్టడంతో (రోహిత్ శర్మ, మిల్లర్) ఫాస్టెస్ట్ సెంచరీల రికార్డు కనుమరుగయ్యాయి. టెస్టు ‘క్లాసిక్స్’... సంప్రదాయ ఆటలో ఈ ఏడాది రెండు సార్లు ‘ఆఖరి వికెట్’ హంగామా చేయడం విశేషం. ఏ పదో... పాతిక... కాదు ఏకంగా 70 పరుగుల పైచిలుకు భాగస్వామ్యంతో ఆయా జట్లను గెలిపించింది. ఫిబ్రవరిలో డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 304 లక్ష్యంతో దిగిన శ్రీలంక 226/9 స్కోరుతో ఓడేందుకు సిద్ధమైంది. కానీ ఓడలేదు. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన విశ్వ ఫెర్నాండో (6 నాటౌట్)తో కలిసి కుశాల్ పెరీరా (153 నాటౌట్) అజేయమైన విజయ పోరాటం చేశాడు. ఆగస్టులో జరిగిన యాషెస్ సిరీస్‌లోనూ ఆసీస్‌పై ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ స్టోక్స్ (135 నాటౌట్) కూడా ఆఖరి వరుస బ్యాట్స్‌మన్ జాక్ లీచ్ (1 నాటౌట్)తో కలిసి అదే పోరాటం చేశాడు. చాహర్ చెడుగుడు... బంగ్లాదేశ్‌తో భారత్‌లో జరిగిన టి20 ద్వైపాక్షిక సిరీస్‌లో దీపక్ చాహర్ చెడుగుడు ఆడేశాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో చెరొటి నెగ్గడంతో ఆఖరి పోరు నిర్ణాయకమైంది. అంతకుముందెపుడు బంగ్లాతో పొట్టి సిరీస్ కోల్పోని రికార్డు భారత్‌ది. దీంతో కీలకమైన మ్యాచ్‌లో భారత్ 174/5 స్కోరు చేస్తే... లక్ష్యఛేదనలో బంగ్లా ఓ దశలో 110/2 స్కోరుతో పటిష్టంగా కనపడింది. కానీ చాహర్ 3.2–0–7–6 బౌలింగ్ రికార్డుతో బంగ్లా చెల్లాచెదురైంది. ఇందులో అతని ‘హ్యాట్రిక్’ కూడా ఉండటం విశేషం. దీంతో బంగ్లా 144 పరుగులకే ఆలౌటైంది. సిరీస్, సిరీస్ ఓడిపోని రికార్డు భారత్ ఖాతాలో పదిలంగా ఉండిపోయింది. ‘పేస్’ ఇయర్... ఈ సంవత్సరం ‘పేస్’ పదునెక్కింది. వన్డేల్లో వివిధ జట్లకు చెందిన 29 మంది బౌలర్లు 20కి పైగా వికెట్లు తీశారు. అయితే ఇందులో ఐదుగురే స్పిన్నర్లున్నారు. అంటే సింహాభాగం (75 శాతం) ఫాస్ట్ బౌలర్లే. ఓవరాల్‌గా టాప్–5 బౌలర్లలో నంబర్‌వన్ బౌలర్ షమీ. అతను ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో 42 వికెట్లు తీశాడు. 38 వికెట్లతో బౌల్ట్ (కివీస్) రెండో స్థానంలో ఉండగా... తదుపరి స్థానాలు కూడా పేసర్లవే. ఫెర్గూసన్ (కివీస్), ముస్తఫిజుర్ (బంగ్లాదేశ్), భువనేశ్వర్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ భరతం పట్టారు. ఆసీస్ బౌలర్ స్టార్క్ కూడా విశేషంగా ఆకట్టుకున్నాడు. ప్రత్యేకించి వన్డే ప్రపంచకప్‌లో అతను 10 మ్యాచ్‌ల్లోనే 27 వికెట్లు తీశాడు. పదేళ్ల తర్వాత... సాధారణంగా క్రికెట్లో గాయపడిన ఆటగాళ్లు పునరాగమనం చేస్తారు. పాకిస్తాన్లో మాత్రం మరుగునపడిన టెస్టు క్రికెట్ పదేళ్ల తర్వాత లేచి వచ్చింది. శ్రీలంక టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లడంతో పాక్‌లో మళ్లీ అంతర్జాతీయ టెస్టు క్రికెట్ మొదలైంది. 2009లో లంకపైనే ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆగిపోయిన ఆటకు దశాబ్దం తర్వాత లంకనే ఊపిరి పోసింది. టెస్టుల్లో లబ్‌షేన్ తన బ్యాటింగ్ ప్రదర్శనతో ‘టాప్’ లేపాడు. 11 మ్యాచ్‌లే ఆడిన ఈ ఆసీస్ బ్యాట్స్‌మన్ 17 ఇన్నింగ్స్‌ల్లో 1,104 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు వరుస టెస్టుల్లో చేశాడు. మరో 7 అర్ధ సెంచరీలు కూడా బాదాడు. టెస్టుల్లో ఈ ఏడాది వెయ్యి పరుగులు దాటిన ఏకైక బ్యాట్స్‌మన్ లబ్‌షేన్ కావడం విశేషం. స్టీవ్ స్మిత్ (8 మ్యాచ్‌ల్లో 965 పరుగులు) రెండో స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో ఆసీస్ పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఈ ఏడాది ‘టాపర్’గా నిలిచాడు. అతను 12 టెస్టులు ఆడి 59 వికెట్లు తీశాడు. నాథన్ లయన్ (ఆస్ట్రేలియా– 45 వికెట్లు), స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్–43 వికెట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచారు. వన్డేల్లో ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ జోరుపెంచాడు. 28 మ్యాచ్‌లాడిన ఈ ఓపెనర్ 27 ఇన్నింగ్స్‌ల్లో 1490 పరుగులు చేశాడు. 7 శతకాలు, అరడజను అర్ధ శతకాలున్నాయి. ఏడు శతకాల్లో ఐదు సెంచరీలను ఒక్క ప్రపంచకప్‌లోనే చేయడం విశేషం. బెంగళూరులో జరిగిన టి20లో మ్యాక్స్‌వెల్ భారత శిబిరాన్ని వెలవెలబోయేలా చేశాడు. తొలుత కోహ్లి, ధోనిల స్ట్రోక్స్‌తో భారత్ 190/4 స్కోరు చేసింది. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని మ్యాక్స్‌వెల్ (55 బంతుల్లో 113 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆసీస్ 194/3 స్కోరు చేసి సులువుగా ఛేదించింది. భారత్‌లో ఎట్టకేలకు డేనైట్ టెస్టు జరిగింది. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు చేపట్టిన రోజుల వ్యవధిలోనే కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో ఫ్లడ్‌లైట్ల టెస్టు జరిగింది. వీడ్కోలు వీరులు... ఈ ఏడాది పలువురు స్టార్ క్రికెటర్లు ఆటకు గుడ్‌బై చెప్పారు. దక్షిణాఫ్రికా నుంచి హషీమ్ ఆమ్లా, ఇమ్రాన్ తాహిర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోగా... డేల్ స్టెయిన్ టెస్టు ఫార్మాట్‌కు ‘టాటా’ చెప్పాడు. భారత స్టార్ యువరాజ్ సింగ్ జూన్ నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. -
అటువైపు అడుగులు పడనీ...
కాలమొక అవధులు లేని నిరంతర ప్రవాహం. గ్రహగతులు, రుతువులను బట్టి మనిషి గీసుకున్న విభజన రేఖలే దిన, వార, మాస, సంవత్సర కాలఖండికలు. కాలం ఒక మాయాజాలం, కొత్త గాయాలు చేసే అస్త్రమే కాదు, పాత గాయాలు మాన్పే ఔషధమనీ ప్రతీతి! ఏడాది ముగించుకొని కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ! దేశ పరిస్థితి ఎలా ఉంది? ఏయే దారుల వెంట ఈ ఏడాది కాలంలో అడుగులు ఎలా పడ్డాయి? సాధించిన ప్రగతి ఎంత, ఎదురైన వైఫల్యాలెన్ని... సమీక్షిం చుకునే సముచిత సందర్భమిది. జరిగిన మంచికైనా, చెడుకైనా సంకేతాలు విస్పష్టంగానే ఉన్నాయి. ఎవరు, ఏది దాచాలని చూసినా, అన్నీ కళ్లెదుట కనిపిస్తూనే ఉన్నాయి. ప్రతి మార్పూ సగటు మనిషి జీవితాన్ని స్పృశిస్తూనే ఉంది. సంధి కాలంలో నిలబడి.. గతాన్ని తడిమిన అనుభవ పాఠాలతో జాగ్రత్తపడితే భవిష్యత్తులోకి భరోసాతో అడుగేయవచ్చు! ఏయే పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుకోవాలో ప్రణాళికా రచనకిది శుభతరుణం. దేశం నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మందగమనంపై ఎన్ని సంకేతాలు, హెచ్చరికలు వచ్చినా జాగ్రత్తపడకపోవడమూ దీనికొక కారణం కావచ్చు. మెరుగుపడని ఆర్థిక స్థితి వల్లే సమాధానం దొరకని సమస్యలా నిరుద్యోగం ప్రబలుతోంది. రైతు చేయూతకు ఎన్ని చర్యలు చేపట్టినా వ్యవసాయం కునారిల్లుతోంది. పర్యావరణ సమస్య జఠిలమౌతోంది. మానవా భివృద్ధి సూచీలో అడుగునే ఉన్నాం. మరో వంక దేశంలో జాతీయతా భావం బలపడుతోందని, అంతర్జాతీయ సంబంధాలు మెరుగవుతున్నాయని, ప్రపంచ యవనికపై భారత్ ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతోందనే జనాభిప్రాయం విస్తృతంగా ప్రచారంలో ఉంది. అవినీతి నియంత్రణతో పాటు పాలనా సంస్కరణల్లో కొంత ముందడుగు పడింది. ఇరుగుపొరుగుతో ఇబ్బందులున్నప్పటికీ అంత ర్జాతీయ దౌత్య సంబంధాలు మెరుగుపడ్డాయి. తీవ్రవాదంపై పోరుకు అంతర్జాతీయ సమాజాన్ని తనకు అనుకూలంగా భారత్ మలచగలిగింది. ఆర్థిక పరిస్థితి అడుగంటుతున్నా... స్టాక్ మార్కెట్ ఎగిసిపడుతోంది. వీటన్నిటిపైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ నేతృ త్వపు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) ప్రభుత్వ విధానాల ప్రభావం ఉంది. మారు తున్న భాజపా రాజకీయ నిమ్నోన్నతులకు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ స్థితిగతులూ కొంత కార ణమే! ఈ ముఖ్య పార్టీల రాజకీయ సమీకరణాలు, ఉత్తానపతనాలెలా ఉన్నా, నూట పాతిక కోట్ల భారతీయులు ఆశావహంగా ఎదురుచూసే కొత్త సంవత్సరంలో... చెడు తగ్గి, మంచి పెరిగే ఓ బలమైన ముందడుగు పడాలన్నది అందరి అభిలాష. రాజకీయ సుస్థిరత ఆర్థికాంశంతో ముడివడి ఉందనే వాస్తవాన్ని పాలకపక్షాలు అంత తెలిగ్గా అంగీకరించవు. అసలు దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందన్నా, అతినమ్మకపు కాళ్లకింద ఇసుకను ‘మందగమనం’ క్రమంగా కరిగిస్తోందన్నా అవి ఒప్పుకోవు. ప్రస్తుతం బీజేపీ రాజకీయ పరిస్థితి దేశ ఆర్థిక స్థితిని బట్టి మారుతోందనే విషయం ఆ పార్టీకి తప్ప అందరికీ కనిపిస్తోంది. పదేళ్ల ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) పాలన తర్వాత 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. ఆ ఐదేళ్ల పాలనలో బీజేపీ, కూటమి రాజకీయ సూచీ ఊర్ద్వముఖంగా సాగినట్టు అప్పట్లో జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్ని పరిశీలిస్తే స్పష్టమౌతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి స్వాతంత్రదినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ... ‘కులపరమైన సున్నితాంశాలకు, మతపరమైన భావోద్వేగాలకు పదేళ్ల మారిటోరియం విధిస్తున్న’ట్టు ప్రధాని నరేంద్ర మోది బహిరంగ ప్రకటన చేశారు. అది ప్రజలూ నమ్మారు. జనం కష్టాల కడగండ్లు చూసిన పెద్ద నోట్ల రద్దు, సెగ తగిలిన జీఎస్టీ వంటి నిర్ణయాల తర్వాత కూడా పలు రాష్ట్రాల్లో లభించిన సానుకూల ఫలితాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. అవి కల్పించిన విశ్వాసం, పలు ఎత్తుగడలు, వ్యూహాలతో 2019 ఎన్నికల్లో పోరిన బీజేపీ అనూహ్య ఫలితాల్ని సాధించింది. కిందటి ఎన్నికల కన్నా లోకసభ స్థానాల సంఖ్య తగ్గుతుందేమో అని సందేహించిన చోట, సంఖ్య పెరిగింది. సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపోయే నిబ్బరమైన మెజారిటీ బీజేపీకి లభించింది. దాంతో, తమ ఆర్థిక పంథాయే కరెక్టని, తమ రాజకీయ విధానాలకే జనం మద్దతుందని బీజేపీ బలంగా భావించింది. కిందటి అయిదేళ్లలో అణచిపెట్టుకున్న సొంత ఎజెండాను వేగంగా తెరపైకి తెచ్చింది. జాతీయత పేరుతో అధిక సంఖ్యాక వాదం, వివాదాస్పద రామమందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్–అధికరణం 370 రద్దు, జాతీయ పౌర నమోదు పట్టి, పౌర సత్వ సవరణ చట్టం.... ఇలా తనదైన ఎజెండాను అమలుపరుస్తోంది. సహజంగానే వ్యతిరేకత పెరు గుతోంది. అదే సమయంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే చర్యలు పెద్దగా తీసుకోలేదు. తీసుకున్న ఒకటీ, అర చర్యలు సానుకూల ఫలితాలివ్వలేదు. భారత్ ఆర్థిక వృద్ధి రేటు అంచనాల్ని అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు తరచూ తగ్గిస్తున్నాయి. వాస్తవ గణాంకాలూ ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. మూడో త్రైమాసికం ఆర్థిక వృద్దిరేటు 4.5 వద్ద తచ్చాడుతుండగా, నాలుగో త్రైమాసికంలో అది 4 శాతానికి పడిపోయే సంకేతాలే కనిపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగం గొప్పగా మెరుగుపడే సూచనలు లేవని ఆర్థిక నిపుణులంటున్నారు. దీని ప్రభావం సగటు జీవి ప్రత్యక్ష మను గడతో పాటు రాజకీయ సుస్థిరతపైనా పడుతోంది. బీజేపీ క్రమంగా తన రాజకీయ పట్టు కోల్పో తోంది. హర్యానా, మహారాష్ట్ర, జార్ఘండ్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. రాజకీయ వ్యూహ–ప్రతివ్యూహాలిచ్చే విజయాలన్నీ తాత్కాలికం. ప్రజాస్వామ్యంలో ప్రజా భిప్రాయమే ప్రామాణికం. జనం మనోగతం తెలిసి వ్యవహరించడమే పాలకులకు శిరోధార్యం! లక్ష్యం దిశలో ఎటు సాగుతున్నామో స్పష్టత ఉండాలంటే.. ఎక్కడ బయలుదేరామో అవగాహన ఉండాలంటారు. ఏడాది గమనంపై ఆత్మశోధన చేసుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తే కొత్త సంవత్సరం ప్రగతి దిశలో సరికొత్త దారులు పరుస్తుంది. జన జీవితం వెలుగులీనేలా మంచి కాలం వెల్లివిరుస్తుంది. -
2019లో భారీ వసూళ్లు రాబట్టిన సినిమాలివే..
సినిమా పండగను బాక్సాఫీస్ డిసైడ్ చేస్తుంది. ఎంత కలెక్షన్ వస్తే అంత పండగ. ప్రతి సినిమా నచ్చాలని రిలీజయ్యి హిట్ కొట్టాలని ఇండస్ట్రీ కోరుకుంటుంది. కానీ ప్రేక్షకులు తమకు కనెక్ట్ అయిన వాటికే జైకొట్టి కాని వాటికి నై కొడతారు. ఈ సంవత్సరం వారికి నచ్చిన సినిమాలను నెత్తిన పెట్టుకున్నారు. నచ్చనివాటిని చూసి పెదవి విరిచారు. మరింత కష్టపడి ఇంకా బాగా తీస్తే ప్రతి శుక్రవారం పండగ చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇది 2019 రిపోర్ట్. 2019కి అన్ని సంవత్సరాల్లాగే తన వంతు మంచి, తన వంతు చెడు ఉన్నాయి. అది కొందరిని సంతోషపెట్టింది. కొందరిని మరింత బాగా పని చేయమని హెచ్చరించింది. శ్రద్ధ పెట్టి తీస్తే కొత్త సబ్జెక్ట్‌లు కూడా ఆడతాయని, చిన్న సినిమాలు కూడా గెలుస్తాయని తేల్చి చెప్పింది. ఈ ఏడాది స్ట్రయిట్ సినిమాలు సుమారు 190కి పైనే రిలీజ్ అయితే దాదాపు 20 చిత్రాలు మాత్రమే సక్సెస్‌ని టేస్ట్ చేశాయి. ఇది తక్కువ శాతమే. మరిన్ని సినిమాలు ఆడాల్సింది. హిట్ రేట్ ఎక్కువ ఉంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. చిత్రం : మహర్షి నటీనటులు : మహేశ్‌బాబు, పూజా హెగ్డే, ‘అల్లరి’ నరేశ్, ప్రకాశ్‌రాజ్ తదితరులు నిర్మాతలు : అశ్వనీ దత్, ‘దిల్’ రాజు, పీవీపీ దర్శకుడు : వంశీ పైడిపల్లి విడుదల తేది : మే 9 కథ : డబ్బు సాధించడమే నిజమైన సక్సెస్ అనుకునే మనస్తత్వం ఉన్నవాడు రిషి. దానికోసం పరిగెడుతూ ఉంటాడు. ఈ ప్రయాణంలో తనకు దగ్గరైన ఇద్దరు వ్యక్తులకు దూరం అవుతాడు. ఫైనాన్షియల్ సక్సెస్ ముఖ్యమా? ఎమోషనల్ సక్సెస్ గొప్పా? అనే సందిగ్ధంలో రిషి ఎటు వైపు నడిచాడు? ఇంతకీ జీవితంలో నిజమైన సక్సెస్ ఏంటో తెలుసుకున్నాడా? అనేది కథ. బడ్జెట్: 130 కోట్లు ; వసూళ్లు: 145 కోట్లు ‘మహర్షి’లో మహేశ్‌బాబు చిత్రం : ఎఫ్ 2 నటీనటులు : వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ డైరెక్టర్ : అనిల్ రావిపూడి నిర్మాత : ‘దిల్’ రాజు విడుదల తేది : జనవరి 12 కథ : భార్య పెట్టే బాధలను భరించలేక వెంకటేశ్, పెళ్లయితే జీవితం ఇలా ఉంటుందేమోనని భయంతో వరుణ్ తేజ్, ఆల్రెడీ పెళ్లయిన రాజేంద్రప్రసాద్ బ్యాంకాక్ పారిపోతారు. ఆ తర్వాత తమ భార్యలకు వేరే వాళ్లతో పెళ్లి సెట్ అవుతుందని తెలుసుకొని పెళ్లి చెడగొట్టే ప్రయత్నాలు చేస్తారు తోడుఅల్లుళ్లు వెంకీ, వరుణ్. ఈ ప్రయత్నాల్లో ఫ్రస్ట్రేట్ అవుతూ ఫన్ ఎలా క్రియేట్ చేశారన్నది కథ. బడ్జెట్: 40 కోట్లు ; వసూళ్లు: 94 కోట్లు ‘ఎఫ్2’లో వెంకటేశ్, వరుణ్ తేజ్ చిత్రం : యాత్ర నటీనటులు : మమ్ముట్టి, జగపతిబాబు, సుహాసిని డైరెక్టర్ : మహీ వి రాఘవ్ నిర్మాత : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి విడుదల తేదీ : ఫిబ్రవరి 8 కథ : మాజీ ముఖ్యమంత్రి, దివంగత జన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ ప్రస్థానంలో పాదయాత్ర ప్రముఖమైనది. ఈ యాత్ర చేపట్టడానికి కారణాలు, ఇందులో భాగంగా ఆయన కలుసుకున్న మనుషులు, తెలుసుకున్న విషయాలు ఏంటి? తద్వారా చేపట్టిన ప«థకాలేంటి అనేది కథాంశం. బడ్జెట్: 18 కోట్లు ; వసూళ్లు : 22 కోట్లు ‘యాత్ర’లో మమ్ముట్టి చిత్రం : ఇస్మార్ట్ శంకర్ నటీనటులు : రామ్, నభా నటేశ్, నిధీ అగర్వాల్ నిర్మాత : పూరి జగన్నాథ్, చార్మి దర్శకుడు : పూరి జగన్నాథ్ విడుదల తేదీ : జూలై 18 కథ : శంకర్ హైదరాబాద్‌లో చిన్న రౌడీ. ఓ సెటిల్మెంట్లో భాగంగా ఓ ఎం.ఎల్.ఏని చంపేస్తాడు. ఆ కేస్‌ని ఇన్వేస్టిగేట్ చేస్తూ ఓ పోలీసాఫీసర్ చనిపోతాడు. అతని మెదడులోని సమాచారాన్ని శంకర్ మెదడులోకి చిప్ ద్వారా పొందుపరుస్తారు. శంకర్ పోలీసులకు సహాయం చేస్తాడా? లేదా అనేది కథ. బడ్జెట్: 27 కోట్లు ; వసూళ్లు: 78 కోట్లు ‘ఇస్మార్ట్ శంకర్’లో రామ్ చిత్రం : జెర్సీ నటీనటులు : నాని, శ్రద్ధాశ్రీనాథ్ దర్శకుడు : గౌతమ్ తిన్ననూరి నిర్మాతలు : సూర్యదేవర నాగవంశీ విడుదల తేది : ఏప్రిల్ 19 కథ : 25 ఏళ్ల వయసులో అనుకోకుండా క్రికెట్‌కు దూరం కావాలనుకుంటాడు అర్జున్. కానీ 36 ఏళ్ల వయసులో మళ్లీ ఇండియన్ టీమ్‌కు ఆడాలని నిశ్చయించుకుంటాడు. మళ్లీ క్రికెట్ ఆడాలని ఎందుకు అనుకున్నాడు? అనుకున్నది సాధించాడా లేదా? అనేది కథాంశం. బడ్జెట్: 25 కోట్లు ; వసూళ్లు: 36 కోట్లు ‘జెర్సీ’లో నాని చిత్రం : ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నటీనటులు : నవీన్ పొలిశెట్టి, శృతీ శర్మ, సుహాస్ నిర్మాత : రాహుల్ యాదవ్ నక్కా దర్శకుడు : స్వరూప్ ఆర్ఎస్ జె విడుదల తేది : జూలై 21 కథ : డిటెక్టివ్ సినిమాల్లో ట్విస్ట్ రివీల్ అవ్వకముందే పసిగడితే చాలు కేసులు స్వాల్ చేయొచ్చు అనుకునే అమాయకపు జీనియస్ ఆత్రేయ. గుళ్లో హుండీలో డబ్బులు పోవడం, కుక్క పిల్లలు తప్పిపోవడం వంటి చిన్న చిన్న కేసులు డీల్ చేస్తుంటాడు. ఆ సమయంలోనే ఓ అనాథ శవాలతో క్రైమ్‌ను నడిపించే ఓ పెద్ద మాఫియా కేసుని టేకప్ చేస్తాడు ఆత్రేయ. ఆ మిస్టరీని ఎలా చేధించాడు? అనేది చిత్రకథ. బడ్జెట్: 4 కోట్లు వసూళ్లు: 20 కోట్లు ‘ఏజెంట్ సాయిశ్రీనివాస...’లో నవీన్ చిత్రం : మజిలీ నటీనటులు : నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్ దర్శకుడు : శివ నిర్వాణ నిర్మాతలు : సాహు గారపాటి, హరిష్ పెద్ది విడుదల తేది : ఏప్రిల్ 5 కథ : క్రికెటర్ అవ్వాలనుకుంటాడు వైజాగ్ కుర్రాడు పూర్ణ (నాగచైతన్య). అది పూర్ణ తండ్రికి ఇష్టం ఉండదు. క్రికెట్‌పై ఫోకస్ పెడుతున్న సమయంలో అతని జీవితంలోకి అన్షూ (దివ్యాంశ) ప్రవేశిస్తుంది. కానీ శ్రావణి (సమంత)ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పూర్ణ ఎందుకు క్రికెటర్ కాలేకపోయాడు. అసలు అన్షు–పూర్ణ ఎలా విడిపోయారు? పూర్ణ లైఫ్‌లోకి శ్రావణి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు ఏంటి? అనేది కథ. బడ్జెట్: 30 కోట్లు ; వసూళ్లు: 47 కోట్లు ‘మజిలీ’లో నాగచైతన్య చిత్రం: డియర్ కామ్రేడ్ నటీనటులు : విజయ్ దేవరకొండ, ర ష్మికా మందన్నా నిర్మాత : మైత్రీ మూవీ మేకర్స్ దర్శకుడు : భరత్ కమ్మ విడుదల తేదీ : జూలై 26 కథ : లిల్లీ (రష్మిక) పెద్ద క్రికెటర్ కావాలనుకుంటుంది. తన అక్క పెళ్లికోసం కాకినాడ వెళ్లినప్పుడు బాబీతో (విజయ్) ప్రేమలో పడుతుంది. అనివార్య కారణాలతో తనకి ఇష్టమైన క్రికెట్‌ను వదిలేయాల్సి వస్తుంది. దానికి కారణమేంటి? లిల్లీ తన లక్ష్యాన్ని చేరుకునేలా బాబీ ఎలా సహాయం చేశాడు అన్నదే కథ. బడ్జెట్: 30 కోట్లు వసూళ్లు: 45 కోట్లు ‘డియర్ కామ్రేడ్’లో రష్మిక, విజయ్ చిత్రం: గద్దలకొండ గణేశ్ నటీనటులు : వరుణ్ తేజ్, పూజా హెగ్డే, అథర్వ మురళి నిర్మాత : 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ దర్శకుడు : హరీశ్ శంకర్ విడుదల తేది : సెప్టెంబర్ 20 కథ : అథర్వ దర్శకుడు కావాలనుకుంటాడు. దానికోసం ఓ నిజమైన విలన్ మీద సినిమా తీయాలనుకుంటాడు. అలా గద్దల కొండ గణేశ్ (వరుణ్ తేజ్)æ ఊరికి ప్రయాణం అవుతాడు. మరి తను అనుకున్నది సాధించాడా లేదా అనేది కథాంశం. బడ్జెట్ : 35 కోట్లు ; వసూళ్లు : 45 కోట్లు ‘గద్దలకొండ గణేష్’లో పూజ, వరుణ్ చిత్రం : రాక్షసుడు నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ నిర్మాత : కోనేరు సత్యనారాయణ దర్శకుడు : రమేష్ వర్మ విడుదల తేది : ఆగస్ట్ 2 కథ : నగరంలో వరుసగా ఆడపిల్లలు కిరాతకంగా హత్యకు గురవుతుంటారు. దీని వెనక ఓ సైకో కిల్లర్ ఉంటాడు. ఆ సైకో కిల్లర్ ఎందుకిలా చేస్తున్నాడు? ఈ హత్యలు చేయడానికి గల కారణాలేంటి? పోలీస్ ఆఫీసర్ అరుణ్ (బెల్లంకొండ సాయిశ్రీనివాస్) అతన్ని ఎలా పట్టుకున్నాడన్నదే చిత్రకథ. తమిళ చిత్రం ‘రాక్షసన్’కి ఇది తెలుగు రీమేక్. బడ్జెట్: 28 కోట్లు ; వసూళ్లు: 35 కోట్లు ‘రాక్షసుడు’లో సాయిశ్రీనివాస్.... చిత్రం: ఎవరు నటీనటులు : అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర నిర్మాత : పీవీపీ దర్శకుడు : వెంకట్ రామ్‌జీ విడుదల తేది : ఆగస్ట్ 15 కథ : అత్యాచారానికి గురయ్యానని చెప్పుకుంటుంది రెజీనా. తనని తాను కాపాడుకునే ప్రయత్నంలో తన మీద దాడి చేసిన పోలీస్ ఆఫీసర్‌ను కాల్చి చంపానని చెబుతుంది. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఓ లంచగొండి పోలీస్ ఆఫీసర్ సహాయం తీసుకుంటుంది. అసలు నిజంగానే రెజీనా అత్యాచారానికి గురైందా? ఒకవేళ జరగకపోతే ఎందుకలా చెప్పింది? ఆమె టార్గెట్ ‘ఎవరు’ అనేది చిత్రకథ. బడ్జెట్: 8 కోట్లు వసూళ్లు: 15.5 కోట్లు ‘ఎవరు’లో రెజీనా, అడివి శేష్ చిత్రం : 118 నటీనటులు : కల్యాణ్‌రామ్, నివేదా థామస్, షాలినీ పాండే డైరెక్టర్ : కేవీ గుహన్ ; నిర్మాత : మహేష్ కోనేరు ; విడుదల : మార్చి 1 కథ : ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు గౌతమ్ (కల్యాణ్ రామ్) వర్క్ విషయమై ఓ రిసార్ట్‌లోని 118 అనే రూమ్‌లో ఉండాల్సి వస్తుంది. సరిగ్గా 1 గంట 18 నిమిషాలకు ఎవరో ఓ అమ్మాయిని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కలగంటాడు. మరో సందర్భంలోనూ అదే కల. ఆ గదికి, అతని కలకు ఉన్న లింక్ ఏంటి? గౌతమ్‌కి వచ్చిన కల నిజంగా జరిగిందా? ఈ ప్రాసెస్‌లో గౌతమ్‌కి ఎదురైన సంఘటనలు ఏంటి? అన్నదే కథ. బడ్జెట్ : 12 కోట్లు ; వసూళ్లు: 17 కోట్లు చిత్రం: ఓ బేబీ నటీనటులు : సమంత, లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్, నిర్మాత : సునీతా తాటి , వివేక్ కూచిభొట్ల దర్శకుడు : నందినీ రెడ్డి విడుదల తేది : జూలై 5 కథ : 70 ఏళ్లు పైబడిన లక్ష్మికి తన జీవితాన్ని 20 ఏళ్ల వయసున్న అమ్మాయిలా జీవించే అవకాశం వస్తే ఏం చేసింది? ఎలా అల్లరి చేసింది? తన కుటుంబంతో ఏర్పడ్డ మనస్పర్థలు ఎలా తొలగించింది? అనే కథాంశంతో ‘ఓ బేబీ’ తెరకెక్కింది. కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’కి ఇది తెలుగు రీమేక్. బడ్జెట్: 16 కోట్లు ; వసూళ్లు: 40 కోట్లు ‘ఓ బేబీ’లో సమంత చిత్రం: గ్యాంగ్‌లీడర్ నటీనటులు : నాని, లక్ష్మీ, కార్తికేయ, ప్రియాంక మోహనన్ నిర్మాత : మైత్రీ మూవీ మేకర్స్ దర్శకుడు : విక్రమ్ కె కుమార్ విడుదల తేది : సెప్టెంబర్ 13 కథ : ఇంగ్లీష్ సినిమాల్లో కథల్ని కాపీ కొట్టి ప్రతీకార నవలలు రాస్తుంటాడు పార్థసారధి. తమకు జరిగిన అన్యాయం ఎదుర్కోవడానికి ఓ రివెంజ్ ప్లాన్ కావాలంటూ ఐదురుగురు మహిళలు అతని దగ్గరకు వస్తారు. వాళ్ల ప్రతీకారం ప్లాన్‌ను పార్థసారథి ఎలా రాశాడన్నది కథ. బడ్జెట్: 40 కోట్లు ; వసూళ్లు: 45 కోట్లు ‘గ్యాంగ్‌లీడర్’లో నాని, ప్రియాంక చిత్రం : లక్ష్మీస్ ఎన్టీఆర్ నటీనటులు : విజయ్‌కుమార్, యజ్ఞాశెట్టి, శ్రీతేజ్ దర్శకులు : రామ్‌గోపాల్ వర్మ, అగస్త్య మంజు నిర్మాతలు : రాకేష్ రెడ్డి, దీప్తి విడుదల తేది : మార్చి 29 కథ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీఆర్ జీవితంలో రాజకీయ వెన్నుపోటు పర్వంగా ప్రజలు చెప్పుకునే సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చినప్పటి నుంచి ఆయన జీవితం ఎలా సాగిందనే అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బడ్జెట్: రెండున్నర కోట్లు ; వసూళ్లు: 7 కోట్లు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో విజయ్‌కుమార్ చిత్రం : చిత్రలహరి నటీనటులు : సాయిధరమ్ తేజ్, నివేదా పేతురాజ్, కల్యాణీ ప్రియదర్శన్ దర్శకుడు : కిశోర్ తిరుమల నిర్మాతలు : నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ విడుదల తేది : ఏప్రిల్ 12 కథ: లైఫ్‌లోని ప్రతీ స్టేజ్‌లో విజయ్ కృష్ణను (సాయి తేజ్) ఫెయిల్యూరే పలకరిస్తుంది. అందరూ అతన్ని ఫెయిల్యూర్ అంటున్నప్పటికీ అతని తండ్రి మాత్రం విజయ్ను ప్రోత్సహిస్తుంటాడు. ఈ క్రమంలో అతను డెవలప్ చేస్తున్న యాప్ ప్రజెంటేషన్, తన లవ్ లైఫ్ రెండూ అనుకున్నట్టు జరగవు. ఆ టైమ్‌లో విజయ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? అతనికి సాయంగా నిలబడింది ఎవరు? విజయ్ ఎలా గెలిచాడు అన్నదే కథ. బడ్జెట్: 16 కోట్లు ; వసూళ్లు : 25 కోట్లు ‘చిత్రలహరి...’లో సాయితేజ్, కల్యాణి చిత్రం : మత్తు వదలరా నటీనటులు : శ్రీ సింహా, సత్య డైరెక్టర్ : రితేష్ రానా నిర్మాతలు : చెర్రీ (చిరంజీవి), హేమలత) కథ : చాలీ చాలని జీతంతో కష్టపడే డెలివరీ బాయ్ హీరో శ్రీసింహా. తన మిత్రుడు ఇచ్చిన ఐడియా మేరకు ఓ పని చేస్తాడు. ఆ ఐడియా అతన్ని ఎలాంటి ఇబ్బందుల్లో పడేసింది? అందులోనుంచి ఎలా బయటకు వస్తాడు? అనేది కథ. బడ్జెట్: 2 కోట్లు ; వసూళ్లు: (మంచి టాక్‌తో ఇంకా థియేటర్స్‌లో ప్రదర్శితం అవుతోంది ) ‘మత్తు వదలరా..’లో శ్రీసింహా... చిత్రం : అర్జున్ సురవరం నటీనటులు : నిఖిల్, లావణ్యా త్రిపాఠి నిర్మాత : రాజ్‌కుమార్ ఆకెళ్ల, ఠాగూర్ మధు దర్శకుడు : టి. సంతోష్ విడుదల తేది : నవంబర్ 29 కథ : అర్జున్ ఓ టీవీ ఛానెల్ రిపోర్టర్. అనుకోకుండా నకిలీ సర్టిఫికెట్ల స్కామ్‌లో ఇరుక్కుంటాడు. ఈ స్కామ్ వెనక ఉన్నది ఎవరు? ఇందులో నుంచి తను ఎలా తప్పించుకున్నాడన్నది కథాంశం. బడ్జెట్ : 10 కోట్లు ; వసూళ్లు : 20 కోట్లు ‘అర్జున్ సురవరం’లో నిఖిల్ చిత్రం : ప్రతిరోజూ పండగే నటీనటులు : సాయి తేజ్, సత్యరాజ్, రాశీ ఖన్నా, రావు రమేశ్ నిర్మాత : బన్నీ వాస్ దర్శకుడు : మారుతి విడుదల తేది: డిసెంబర్ 20 కథ: పుట్టినరోజు, పెళ్లిలానే చావు కూడా మన జీవితంలో ఓ విశేషమే. దాన్ని కూడా ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ఇది. బడ్జెట్: 25 కోట్లు ; వసూళ్లు : 40 కోట్లు (ఇంకా థియేటర్స్‌లో ప్రదర్శిస్తున్నారు) ‘ప్రతిరోజూ పండగే’లో సత్యరాజ్, సాయితేజ్ చిత్రం : వెంకీ మామ నటీనటులు : వెంకటేశ్, నాగచైతన్య డైరెక్టర్ : కేయస్ రవీంద్ర (బాబి) నిర్మాతలు : సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ విడుదల తేది : డిసెంబర్ 13 కథ : వెంకటేశ్, నాగచైతన్య మామాఅల్లుళ్లు. అల్లుడి కోసం అసలు పెళ్లే వద్దు అనుకున్న మామ, మామను విడిచి ఉండటం ఇష్టం లేక వచ్చిన మంచి ఉద్యోగాన్ని కూడా వదులుకున్న అల్లుడు... మరి ఇలాంటి మామాఅల్లుళ్లు మూడేళ్లు కలుసుకోకుండా ఉండాల్సి వస్తుంది. దానికి కారణం ఏంటి? మామాఅల్లుళ్లు మళ్లీ ఎలా కలుసుకున్నారు అనేది కథ. బడ్జెట్: 45 కోట్లు ; వసూళ్లు: 60 కోట్లు (ఇంకా థియేటర్స్‌లో రన్ అవుతోంది) ‘వెంకీమామ’లో నాగచైతన్య, వెంకటేశ్ చిత్రం : మల్లేశం నటీనటులు : ప్రియదర్శి, అనన్య, ఝాన్సీ దర్శక–నిర్మాత: రాజ్ ఆర్ విడుదల తేది : జూలై 21 కథ : పద్మశ్రీ అవార్డుగ్రహీత చింతకింది మల్లేశం బయోపిక్ ఇది. ఆసు పోయడం కోసం అమ్మ పడుతున్న అవస్థను చూడలేక ఆసు యంత్రం తయారు చేయాలనుకుంటాడు మల్లేశం. 6వ తరగతి కూడా పాస్ కాని మల్లేశం ఆసు యంత్రం ఎలా కనుక్కొన్నాడు? ఈ మెషీన్ తయారీలో తనకు ఎదురైన అడ్డంకులేంటి? అన్నది కథాంశం. బడ్జెట్ : రెండున్నర కోట్లు ; వసూళ్లు: 5 కోట్లు ‘మల్లేశం’లో ప్రియదర్శి చిత్రం : బ్రోచేవారెవరురా నటీనటులు : శ్రీవిష్ణు, నివేదా థామస్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నిర్మాత : మన్యం విజయ్ కుమార్ దర్శకుడు : వివేక్ ఆత్రేయ విడుదల తేది : జూలై 21 కథ : దర్శకుడు అవ్వాలని కలలు కంటుంటాడు సత్యదేవ్. ఓ టాప్ హీరోయిన్‌కి కథ చెప్పే అవకాశం వస్తుంది. ఇంటర్ ఐదేళ్లుగా పాస్ అయ్యే ప్రయత్నం చేస్తుంటారు శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. వీళ్ల గ్యాంగ్‌లో ప్రిన్సిపల్ కూతురు నివేదా థామస్ కూడా తోడవుతుంది. సరదాగా సాగిపోతున్న సమయంలో నివేదా కిడ్నాప్ అవుతుంది. సత్యదేవ్, నివేదా పేతురాజ్ వెళ్తున్న కార్కి యాక్సిడెంట్ అవుతుంది. సత్యదేవ్ సినిమా మొదలెట్టాడా? నివేదా థామస్ కిడ్నాపర్స్ నుంచి ఎలా బయటపడింది? అన్నది కథాంశం . బడ్జెట్: 7 కోట్లు ; వసూళ్లు: 20 కోట్లు ‘బ్రోచేవారెవరురా..’లో శ్రీవిష్ణు.. డబ్బింగ్ సినిమాలు ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు ప్రభావం చూపించలేదనే చెప్పాలి. దాదాపు 70 డబ్బింగ్ సినిమాలు విడుదలైతే కార్తీ ‘ఖైదీ’ స్థాయిలో వేరే ఏ అనువాద చిత్రం వసూళ్లు రాబట్టలేదు. రజనీకాంత్ ‘పేటా’ తమిళంలో మంచి సక్సెస్ అయినా తెలుగులో అనుకున్నంతగా ఆడలేదు. రాఘవ లారెన్స్ ‘కాంచన 3’ మంచి వసూళ్లను రాబట్టింది. సూర్య ‘ఎన్జీకే’ పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. కార్తీ ‘దొంగ’ ఫర్వాలేదనిపించుకుంది. ఎన్నో అంచనాలతో విడుదలైన మలయాళ చిత్రం ‘లవర్స్ డే’ ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. సల్మాన్ ఖాన్ ‘దబంగ్ 3’ దబంగ్ సిరీస్‌లోనే వీక్ అనిపించుకుంది. ‘ఖైదీ’లో కార్తీ 2019లో భారీ అంచనాల నడుమ విడుదలై, ఆ అంచనాలను అందుకోలేకపోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. రామ్‌చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ ‘వినయ విధేయ రామ’ పెద్ద నిరాశనే మిగిల్చింది. ఎన్టీఆర్ బయోపిక్‌గా తెరకెక్కిన ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’, ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ తన కలెక్షన్ల ప్రేమలో విఫలమయ్యాడు. నాగార్జున ‘మన్మథుడు 2’ మిశ్రమ స్పందనకు గురైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ ‘సాహో’ మేకింగ్‌లో మార్కులు పొందినా కలెక్షన్లను ఊహించిన స్థాయిలో రాబట్టలేకపోయింది. ‘సైరా: నరసింహా రెడ్డి’ భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. దేశభక్తి కథాంశం, చిరంజీవి కష్టపడి పని చేయడం సినిమా మీద అంచనాలను పెంచాయి. ఆ అంచనాలను అందుకోవడంలో అది అంతిమంగా వెనకబడింది. కాంట్రవర్శియల్ చిత్రంగా విడుదలైన ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ రిలీజ్‌కు ముందు ఉన్న ఆసక్తిని రిలీజ్ తర్వాత థియేటర్ల దాకా తీసుకురాలేకపోయింది.. బాలకృష్ణ ‘రూలర్’ అంతకుముందు సేమ్ కాంబినేషన్ (బాలకృష్ణ–కె.ఎస్. రవికుమార్)లో వచ్చిన ‘జై సింహా’ను మరపించలేకపోయింది. ∙‘సైరా’లో చిరంజీవి ‘వినయ విధేయ...’లో రామ్‌చరణ్ ‘సాహో’లో ప్రభాస్ ‘యన్.టి.ఆర్’ బయోపిక్‌లో బాలకృష్ణ గమనిక : సినిమా బడ్జెట్, వసూళ్లకు చెందిన లెక్కలన్నీ సుమారుగా చెప్పినవే. అన్ని హక్కులు, థియేట్రికల్ రన్‌ను పరిగణించి వసూళ్లు ప్రచురించాం. -
అదిరిపోయే ఆఫర్లు.. ఇంకెందుకు ఆలస్యం
కొత్త సంవత్సరం ఎన్నో ఆశలను, ఆశయాలను తీసుకువస్తుంది. ప్రతి ఏడాది మనకు అనేక జ్ఞాపకాలను, అనుభూతులను అందిస్తుంది. వీటికితోడు కొన్ని చేదు అనుభవాలను సైతం ఇస్తుంది. గడిచిన ప్రతి క్షణం రేపటికి ఒక జ్ఞాపకమే. మంచి చెడుల సమ్మేళనమే జీవితం. అలాంటి జీవితంలో మరో నూతన అధ్యాయాన్ని స్వాగతిస్తూ.. న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెబుతాం.. న్యూ ఇయర్ ఇంకో నెల రోజులు ఉంది అనగానే వేడుకలు, సంబరాల గురించి మదిలో ఆలోచనలు మెదులుతాయి. గత ఏడాది కంటే భిన్నంగా ఈసారి డిసెంబర్ 31 వేడుకల నిర్వహణకు హైదరాబాదీయులు తహతహలాడుతున్నారు. మొదట్లో ఈ కల్చర్‌కు ఇంత క్రేజు లేకున్నా రానూ రానూ పరాయి వేడుకపై మోజు బంగారం ధరలా పెరుగుతూనే ఉంది. ఇక ఈ నూతన సంవత్సర సంబరాలలో ప్రజలను ఆకర్షించే వాటిలో ఆఫర్లు ప్రధానమైనవి. కేకుల నుంచి ఫేస్ క్రీమ్ వరకు అన్ని ఆఫర్లే (క్లాతింగ్, ఫుట్‌వేర్, జ్యూవెల్లరీ, ఫుడ్, కాస్మోటిక్స్).. వీటిలో మరీ ముఖ్యమైనది ఫుడ్. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు. ఫుడ్‌ను ఇష్టపడని వారంటూ ఉండరు. అసలే హైదరాబాదీలు భోజన ప్రియులు. ఇక ఆఫర్లు కనిపిస్తే ఊరుకుంటారా... లేదండోయ్ ఆవురావురంటూ లాంగిచేయడమే. చాలా సందర్బాల్లో ఫుడ్ ఫెస్టివల్స్‌ను సైతం నిర్వహిస్తుండటం తెలిసిందే. మరీ ఫుడ్‌కు ఉన్న డిమాండేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.. ఆఫర్లే ఆఫర్లు... నగరంలో ఇంచుమించుగా 12వేల వరకు చిన్న, పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా. మరో 10వేల దాకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మెస్‌లు హోటల్ ఉన్నాయి. హోటళ్లు, రిసార్ట్లు ప్రజలను ఆకర్షించేందుకు వినూత్నడిస్కౌంట్లు, స్పెషల్ ఆఫర్లతో తలుపులు తెరుస్తున్నాయి. నోరూరించే ఆహారాన్ని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. రెస్టార్లెంటు, హోటళ్లు, దాబాలు, చిన్న చిన్న హోటళ్లు సైతం తమదైన రీతిలో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఒకటి కొంటే మరొకటి ఉచితమని,, ఒక్కొదానిపై 30, 40, 50 శాతం వరకు డిస్కౌంట్‌ను ప్రకటిస్తున్నాయి. కొన్ని రెస్టారెంట్లయితే బఫేపై వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఇస్తున్నాయి. కొన్నిచోట్ల అన్లిమిటెడ్ ఫుడ్, బేవరేజ్‌ను ఆఫర్ చేస్తున్నారు. పేరుగాంచిన హోటళ్లు పాశ్చాత్య వంటకాలు, కాక్టైల్స్, మాక్‌టైల్స్‌ను రుచి చూపించనున్నాయి. నాన్ వెజ్ ఆఫర్లు.. ఆదివారం వచ్చిందంటే ముక్క లేనిది ముద్ద దిగదు. అలాంటిది వేడుకల్లో నాన్ వెజ్ లేకుంటే.. నో నో తప్పకుండా ఉండాల్సిందే అంటున్నారు హైదరాబాదీలు. మరీ నాన్ వెజ్ లవర్స్ వారి కోసం ప్రముఖ రెస్టారెంట్లు ఇస్తున్న ఆఫర్లు ఏంటో తెలుసుకుందాం. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు... ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్బంలో బిర్యాని లాంగించేస్తూ ఉంటారు. వీటిలో చికెన్, మటన్, మష్రూమ్,ఫిష్ బిర్యానీలు ప్రత్యేకం. ఈ సారి ఈ బిర్యానిపైలపై ఆఫర్లు ఆశించిన స్థాయిలో లేనట్లు కన్పిస్తోంది. సాధారణ రోజుల్లో బిర్యాని ధర రెస్టారెంట్లను బట్టి 150 నుంచి 300 వరకు ఉండగా... న్యూ ఇయర్ సందర్భంగా ఈ ధరను 100 నుంచి 250 లోపు తగ్గించారు. అదేవిధంగా కొన్ని రకాల ఐటమ్‌లపై 10 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. ఇక స్టాటర్లు, సూప్‌లు ధరలు అదేవిధంగా కొనసాగుతున్నాయి. ఆన్లైన్ ఫుడ్ సర్వీసింగ్.... ఆన్లైన్ ఫుడ్ సర్వీస్‌లు వచ్చాక నగరంలో తిండికి కొదవే లేకుండా పోయింది. యాంత్రిక టెక్నాలజీ వచ్చాక బిజీ సిటీ లైఫ్‌లో అటు ఉద్యోగం ఇటు జీవితాన్నిసమన్వయం చేయలేక నానా తాంటాలు పడుతున్న కుటుంబాలు ఎన్నో. అలాంటి వారికి ఆన్లైన్ ఫుడ్ డెలీవరీ యాప్‌లు ఎంతగానో దోహదపడుతున్నాయి. కేవలం తినాలనుకున్న సమయానికి అరగంట ముందు కావాల్సిన ఫుడ్‌ను ఆర్డర్ చేసుకుంటే సరి. దీనికి కావాల్సింది. కేవలం సంబంధిత యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడమే. హోటల్ కు వెళ్లి తినేవారు తగ్గడంతో ఆన్లైన్ ఫుడ్ సర్వీస్‌లను డిమాండ్ పెరిగింది. ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించడంతో ఫుడ్డీస్ రెస్టారెంట్లకు క్యూ కడుతున్నారు. వెజ్, నాన్‌వెజ్, ఫాస్ట్‌ఫుడ్ ఐటమ్ ఏదైనా సరే మనీ ఉంటే చాలు. మీ దరికి విచ్చేస్తుంది. అంతేగాక 10 శాతం నుంచి 50 శాతం వరకు డిస్కౌంటు లభిస్తుంది. పైగా డెలివరీ కూడా ఫ్రీ... అర్థరాత్రి అపరాత్రి అన్న తేడా కూడా లేదు. ఎప్పుడంటే అప్పుడు.. ఎక్కడంటే అక్కడ మీరు కోరుకున్న ఆహారం.. మీ చెంతకు చేరుతుంది. దీంతో ఫుడ్ ఆర్డరింగ్ అనేది చాలామంది జీవితాలలో ఓ ఫ్యాషన్‌లో మారిపోయింది. ఫేమస్ ఫుడ్ యాప్‌లు ఆన్లైన్ ఫుడ్ యాప్‌లో స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్, ఫుడ్ పాండా వంటివే అధికం. సిటీలో నిత్యం అమ్ముడయ్యే ఫుడ్‌లో 60శాతం మేర ఆన్ లైన్ డెలివరీలే ఉంటాయి. ఒక్క స్విగ్గీ ఫుడ్ డెలివరీ సంస్థనే నగరంలో రోజూ 80వేల ఆర్డర్ల వరకు యాప్ ద్వారా విక్రయిస్తోంది. ఇలా మిగతా ఫుడ్ డెలివరీ సంస్థలు అన్ని కలిసి దాదాపు ప్రతి నెల 10లక్షలకు పైనే ఆర్డర్లను చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే తమ వద్దకు ఫుడ్ వస్తుండటంతో ఈ యాప్‌లకు క్రేజ్ పెరిగిపోయింది. దీంతో ప్రత్యేక ప్యాకేజీల రూపంలో తమ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. భోజన ప్రియులను కట్టిపడేస్తున్నాయి. ఇంకేముంది ఆర్డర్ చేసిన అరగంటలో నోరూరించే వంటకాలు మన ముంగిట ప్రత్యక్షమవుతున్నాయి. ప్రమోషన్ ఆఫర్లు, డిస్కౌంట్ల వర్షాలు.. కొద్ది తేడాతో దాదాపు అన్ని సంస్థలు ఒకే విధమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా బిర్యానీలు, పిజ్జాలు, మిల్క షేక్‌లు,ఫ్యామిలీ ప్యాక్ వంటివి అధికంగా ఉన్నాయి. ఈ న్యూ ఈయర్‌కు మరీ ఏ సంస్థ ఏ ఆర్డర్‌ను అందిస్తోందో ఓ లుక్కేద్ధాం... జొమాటో...న్యూ యూజర్లకు 40 శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. అంతేగాక ప్రోమో కోడ్లు అందిస్తుంది. అలాగే పేటీఎం యూపీఐ ద్వారా రూ. 350 మించి కొనుగోలు చేస్తే 30 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇందుకు ZOMATO300 కోడ్‌ను ఆప్లై చేయాలది. అదే విధంగా స్నాక్స్‌పై 50 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. టాప్ రెస్టారెంట్లలో రూ. 99 కంటే కొనుగోలు చేస్తే 50 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇందుకు ZOMATO కోడ్‌ను అప్లై చేయాలి. కోటక్ మహీంద్ర కార్డు ద్వారా రూ. 250 కంటే ఎక్కు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్‌ను అధికంగా రూ75 వరకు అందిస్తోంది. ప్రత్యేక పార్టీ ఆఫర్ పేరుతో రూ .500 విలువైన ఆహార ఆర్డర్లలో రూ .1000 వరకు ఆదా ఇస్తుంది. ఇది కేవలం ఎంచుకున్న రెస్టారెంట్లలో మాత్రమే. స్విగ్గీ.. కొత్త యూజర్లకు 33 శాతం డిస్కౌంట్‌ను ఇస్తుంది. దీంతోపాటు ఫ్రీ డెలివరీ లభిస్తుంది. ఫుడ్ డెలివరీ యాప్స్ అన్నీ కొత్త యూజర్లను ఆకట్టుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తాయి. ఆఫర్లు కూడా వారికే ఎక్కువ ఉంటాయి. సంబంధిత రెస్టారెంట్ల ద్వారా WELCOME50... ద్వారా 50 శాతం డిస్కౌంట్‌ను ఇస్తుంది. 150LPAYNEW ద్వారా 150 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. రెండు మీడియం పిజ్జాలను ఒక పిజ్జా ధరకే పిజ్జా హట్ ద్వారా ఇస్తోంది. ఉబర్ ఈట్స్.. ఉబర్ రైడ్లతోపాటు ఉబర్ ఈట్స్ ఆహార డెలివరీ యాప్ ప్రముఖంగా నిలుస్తోంది అన్ని రకాల పదార్థాలపై 30 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. సెలక్టెడ్ రెస్టారెంట్ల నుంచి 50 శాతం బిర్యానిపై డిస్కౌంట్‌ను అందిస్తోంది. సంబంధిత రెస్టారెంట్లపై30,40, 50 శాతం వరకు కూడా తగ్గింపును అందిస్తోంది. వీటికి ఎలాంటి ప్రోమో కోడ్ అవసరం లేదు. నేచురల్ ఐస్ క్రీం నుంచి కప్ ఐస్ క్రీమ్నుఒకటి కొంటే ఒకటి ఉచితంగా అందిస్తోంది. మిల్క్ షేక్‌లను కేవలం 99 రూపాయలకే అందిస్తోంది. HYDFEAST50, HYDFEAST30, HYDFEAST20 ద్వారా 50,30, 20 శాతం డస్కౌంట్ను ఇస్తుంది బేకరీల్లో బారులు.. న్యూయర్ దగ్గర పడుతుండటంతో బేకరీలలో కేకుల తయారీలు జోరందుకున్నాయి. కేకుల్లో వెజ్, నాన్ వెజ్, పేస్ట్రీస్ వంటివి.. విభిన్న రకాల ఆకృతిలో అందుబాటులో ఉన్నాయి.. ఒక్కో బేకరీలలో దాదాపు 500 నుంచి 1000 కేకుల వరకు తయారీ చేస్తున్నారు. నూతన సంవత్సర సందర్భంగా కేక్‌లు కొనుగోలు చేసేందుకు బేకరీ నిర్వాహకులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారు. బేకరీలలో అయితే. కేజీ కేకు 400 రూపాయలు, అర కేజీ కేకు 200 రూపాయలకే అందిస్తున్నాయి. అంతేగాక వీటికి 500 ఎంఎల్ కూల్‌డ్రింక్, మిక్చర్ వంటివి ఉచితంగా అందజేస్తున్నాయి. వీటితోపాటు పిజ్జా, బర్గర్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బేకరీలు ఆఫర్లను జోరుగా అందిస్తున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే న్యూ ఇయర్ ఆఫర్లను ఆరగించండి.. - గుండా భావన (వెబ్ డెస్క్ ప్రత్యేకం) -
ఓడి.. గెలిచిన నేతలు
కాల గమనంలో మరో మైలు రాయి దాటిపోయే సమయమాసన్నమైంది. ఎన్నో తీపి గుర్తులు, విజయాలు, అంతకు మించిన విషాదాలు,వైఫల్యాలను తనలో నింపుకొనికాలగర్భంలో కలిసేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. మరికొన్ని గంటల్లో కొత్త ఏడాదిలోకి అడుగిడుతున్నతరుణంలో మహానగర యవనికపై 2019 సంవత్సర ‘పొలిటికల్’ప్లాష్‌బ్యాక్.. సాక్షి,సిటీబ్యూరో: ఈ ఏడాది(2019) జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహానగర ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. నగరంలోని నాలుగు లోక్‌సభ స్థానాలను నాలుగు పార్టీల అభ్యర్థులకు కట్టబెట్టారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన జి.కిషన్‌రెడ్డి(అంబర్‌పేట), ఎ.రేవంత్‌రెడ్డి(కొడంగల్)కు 2019 లోక్‌సభ ఎన్నికలు రాజకీయ పునర్జన్మనిచ్చాయి. సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా కిషన్‌రెడ్డి, మల్కాజిగిరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి ఊహించని విజయాలు అందుకున్నారు. కిషన్‌రెడ్డి ఏకంగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడితే, రేవంత్ సైతం కాంగ్రెస్‌లో కీలక స్థాయికి వెళ్లారు. వీరితోపాటు హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో అసదుద్దీన్ ఓవైసీ మరోసారి ఢిల్లీ సభకు వెళ్లగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పుడే క్రియాశీల రాజకీయ ఆరంగేట్రం చేసిన గడ్డం రంజిత్‌రెడ్డి చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి విజేతగా నిలిచారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు షాక్ 2018లో శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు ఆనందం ఆర్నెల్లకే ఆవిరైంది. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు కిరణ్ పోటీకి దిగగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి విజేతగా 14,836 ఓట్ల మెజారిటీ రావటం తలసానిని ఇబ్బంది పెట్టింది. అదేవిధంగా మేడ్చల్‌లో 2018 శాసనసభ ఎన్నికల్లో ఏకంగా 88 వేల ఓట్ల మెజారిటీ సాధించి మంత్రిగా పదవి దక్కించుకున్న మల్లారెడ్డి.. లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి టీఆర్ఎస్ అభ్యర్థికి కేవలం 8,087 ఓట్ల మెజారిటీనే తీసుకు రాగలిగారు.ఇక ఎల్బీనగర్లో సీన్ రివర్స్ అయింది. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన సుధీర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరిన తర్వాత కూడా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 27,404 ఓట్ల భారీ మెజారిటీ వచ్చింది. ఉప్పల్, మల్కాజిగిరి. సికింద్రాబాద్, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట నియోకజవర్గాల్లోనూ టీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థులు వెనకబడి పోయారు. కొందరిలో నిరాశ.. కాంగ్రెస్‌లో విజయం సాధించి టీఆర్ఎస్లో చేరిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి రాష్ట్ర క్యాబినెట్లో చేరగా, కూకట్‌పల్లికి చెందిన నాయకుడు నవీన్‌రావుకు ఎమ్మెల్సీగావచ్చిన చాన్స్ వారి అనుయాయుల్లో కొత్త శ్వాసను నింపింది. మంత్రి పదవులు ఆశించిన నాయిని నర్సింహారెడ్డి(ఎమ్మెల్సీ), మైనంపల్లి హన్మంతరావు(మల్కాజిగిరి) నిరాశే ఎదురవగా.. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలకు అప్పట్లో అగ్రనేతలిచ్చిన అభయం ఈ ఏడాది కాలంలో కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. ముఖ్యంగా ఉప్పల్ నుంచి బండారి లక్ష్మారెడ్డి, ఖైరతాబాద్ నుంచి విజయారెడ్డి, శేరిలింగంపల్లి నుంచి బండి రమేష్, రామ్మోహన్‌గౌడ్(ఎల్బీనగర్) తదితరులకు నిరాశ తప్పలేదు. -
ఓ బాట‘సారీ’
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రతి ఏడాదీ రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో పాదచారులది రెండో స్థానం. గడిచిన నాలుగేళ్ళ గణాంకాలు పరిశీలిస్తే ఏటా వందకు పైగా పెడస్ట్రియన్స్ రోడ్డుకు బలవుతున్నారు. నగర పరిధిలో జరిగిన మొత్తం ప్రమాదాల్లో మృతులుగా మారిన పాదచారులు 38 శాతానికి పైగా ఉన్నారు. ఈ పరిస్థితి తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రాథమిక అంశాలైన ఫుట్‌పాత్‌లు మాయం కావడం, అవసరమైన అన్ని ప్రాంతాల్లోనూ పెలికాన్ సిగ్నల్స్‌తో పాటు జీబ్రా క్రాసింగ్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేకపోవడం. ఈ సమస్యలు తీర్చడానికి జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేయడంతో వచ్చే ఏడాది పరిస్థితులు మారవచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది. అయితే నగర ట్రాఫిక్ పోలీసుల కృషి ఫలితంగా ఏటా ప్రమాదాలు, మృతులతో పాటు యాక్సిడెంట్స్‌లో అశువులుబాస్తున్న పాదచారుల సంఖ్యా తగ్గుతూ వస్తోంది. కానీ కనిష్టంగా 100 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరంగా మారుతోంది. రెండో స్థానంలో పాదచారులు... నగర ట్రాఫిక్ పోలీసులు ఏటా ప్రమాదాలపై విశ్లేషణ నిర్వహిస్తారు. ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాలు, బాధితులుగా/మృతులుగా మారుతున్న వారు ఎవరెవరు అనేది గణాంకాల ప్రకారం జాబితాలు రూపొందిస్తుంటారు. 2016–2019 (డిసెంబర్ 16) మధ్య హైదరాబాద్ పోలీసులు రూపొందించిన రికార్డుల ప్రకారం ప్రతి ఏడాది సిటీలో చోటు చేసుకుంటున్న ప్రమాదాలు రెండు వేలకు పైనే ఉంటున్నాయి. వీటిలో వందల మంది మృత్యువాతపడుతున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల్లో బాధితులుగా మారుతున్న వారిలో ద్విచక్ర వాహనచోదకులు తొలిస్థానంలో ఉండగా... రెండో స్థానం పాదచారులదే. ఇప్పుడే కాదు... గత కొన్నేళ్లుగా నమోదైన గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాద బాధితుల్లో పాదచారులే ఎక్కువగా ఉన్నారు. సిటీలో నాలుగేళ్ళల్లో మొత్తం 9435 ప్రమాదాలు చోటు చేసుకోగా... 1232 మంది మరణించారు. వీటిలో మృత్యువాతపడిన పాదచారుల సంఖ్య 519గా ఉంది. మొత్తమ్మీద రోడ్డు ప్రమాద బాధితుల్లో 36.6 శాతం, మృతుల్లో 42.12 శాతం పాదచారులే ఉన్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది గణాంకాలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 261 మంది చనిపోగా... వీరిలో పాదచారులు 101 మంది (38.69 శాతం) ఉన్నారు. ఎఫ్‌ఓబీలు, భూగర్భ మార్గాలు కనుమరుగు... నగరంలోని రద్దీ ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు ఎక్కువగా ఉన్న చోట్ల గతంలో భూగర్భ క్రాసింగ్ మార్గాలు (సబ్–వే) నిర్మించారు. ఆపై దిల్‌సుక్‌నగర్, సికింద్రాబాద్, బేగంపేట, మెహదీపట్నం సహా అనేక ప్రాంతాల్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులోకి తీసుకువచ్చారు. సరైన నిర్వహణ, భద్రతా ప్రమాణాలు లేకపోవడంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, కోఠిల్లో ఏర్పాటు చేసిన భూగర్భ క్రాసింగ్ మార్గాలు ఆదరణకు నోచుకోలేదు. దీంతో ఒకటి పూర్తిగా కనుమరుగు కాగా... మరోటి స్వరూపం మార్చుకుని పాదచారులకు పనికిరాకుండా పోయింది. ఇక ఫుట్ఓవర్ బ్రిడ్జిలు కట్టిన జీహెచ్ఎంసీ అధికారులు వాటికి ఎలివేటర్ వంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో నగరవాసులకు ఉపయోగపడలేదు. ఇవి పూర్తిగా ఓ స్వరూపాన్ని సంతరించుకోకముందే ‘మెట్రో’ గండం ముంచుకువచ్చింది. మెట్రోరైల్ నిర్మాణాల కోసం సిటీలోని ఫుట్ఓవర్ బ్రిడ్జ్‌ల్ని తొలగించారు. ఈ ఏడాది పరిస్థితులు మారేనా? పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్న నగర ట్రాఫిక్ పోలీసులు పలు ప్రతిపాదనలు రూపొందించి జీహెచ్ఎంసీకి పంపారు. వీటికి అనుగుణంగా ఇప్పటికే అనేక చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు (ఎఫ్ఓబీ) రూపుదిద్దుకుంటున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేయించిన జీహెచ్ఎంసీ సకల సౌకర్యాలతో నిర్మిస్తోంది. మరోపక్క జంక్షన్లు కాని, ఎఫ్‌ఓబీలు లేని చోట్ల పాదచారులు రోడ్డు దాటడానికి అనువుగా మూడు కమిషనరేట్లలో కలిపి 106 పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమై ప్రభుత్వానికి చేరాయి. ఇవి కూడా మంజూరై అందుబాటులోకి వస్తే వచ్చే ఏడాది పాదచారుల ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు చెప్తున్నారు. అయితే పాదచారులు సైతం ఈ మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరుతున్నారు. -
ఎన్నికలు.. ఆందోళనలు
2019 రాజకీయంగా, సామాజికంగా జరిగిన మార్పులు మామూలువి కావు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరున్న భారతదేశంలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల క్రతువు ముగిసింది. 543 లోక్‌సభ స్థానాలతో పాటు కొన్ని అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగ్గా భారతీయ జనతా పార్టీ 303 లోక్‌సభ స్థానాలతో కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఒక రాజకీయ పార్టీ సొంతంగా పూర్తిస్థాయి మెజారిటీ సాధించడం 30 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి కూడా. ఆర్థికంగా వెనుకబడ్డ వారికి రిజర్వేషన్లు.. విద్యా, ఉపాధి రంగాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాజ్యాంగాన్ని 124వ సారి మార్చారు కూడా. ఏడాదికి రూ.8 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉండి... ప్రభుత్వమిచ్చే ఇతర రిజర్వేషన్లు (ఎక్స్ సర్వీస్ మెన్, వికలాంగులు తదితరాలు) ఉపయోగించుకోని అగ్రవర్ణాల వారికి ఈడబ్ల్యూఎస్ కోటా వర్తిస్తుంది. ఏడాది మొదట్లో, లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం ఎన్డీయేపై కొన్ని విమర్శలు వచ్చేందుకూ కారణమైంది. పౌరసత్వ చట్ట సవరణ.... దేశాద్యంతం ఆందోళనలకు, హింసాత్మక ఘటనలకు తావిచ్చిన చట్ట సవరణ ఇది. 1955 నాటి చట్టం ప్రకారం భారతీయ పౌరులయ్యేందుకు ఉన్న ఐదు అవకాశాల్లో కొన్ని సవరణలు చేయడం మొత్తం వివాదానికి కారణమైంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన హిందు, సిక్కు, పార్శీ, క్రైస్తవ, జైన, బౌద్ధ మతాల వారు ఆయా దేశాల్లో మతపరమైన హింస ఎదుర్కొంటే వారికి భారతీయ పౌరసత్వం కల్పించేందుకు ఈ సవరణ వెసులుబాటు కల్పించింది. ఈ జాబితాలో ముస్లింల ప్రస్తావన లేకపోవడం, ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి వచ్చే ముస్లిమేతరుల పరిస్థితీ అగమ్యగోచరంగా మారడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి. ఈ ఆందోళనపూరిత వాతావరణం కొనసాగుతుండగానే కేంద్రం జాతీయ జనాభా పట్టిక తయారీకి ఏర్పాట్లు చేయడంతో పరిస్థితి ఇంకా సద్దుమణగలేదు. కాంగ్రెస్‌లో నేతల కరవు సార్వత్రిక ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. గాంధీ కుటుంబానికి చెందని వారినెవరినైనా పార్టీ అధ్యక్షుడిగా నియమించుకోవాలని రాహుల్ స్వయంగా విజ్ఞప్తి చేసినప్పటికీ కొన్ని నెలల పాటు అధ్యక్ష ఎన్నికపై తర్జనభర్జనలు కొనసాగాయి. చివరకు సోనియాగాంధీ మరోసారి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రాంతానికి ఇన్చార్జ్గా ప్రియాంక గాంధీ నియమితులవడం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగానూ ఆమెకు పదవి దక్కడం ఆ పార్టీలో జరిగిన ముఖ్యపరిణామాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కశ్మీర్, లద్దాఖ్... జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతోపాటు జమ్మూ కశ్మీర్ నుంచి లద్దాఖ్‌ను వేరు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం ఈ ఏడాది జరిగిన అత్యంత కీలకమైన రాజకీయ ఘట్టాల్లో ఒకటి. దశాబ్దాలుగా దేశంలో ఒకరకమైన అసంతృప్తికి కారణమైన ఆర్టికల్ 370ని ఈ ఏడాది ఆగస్టు 5న రద్దు చేశారు. ఆ తరువాత అక్కడ పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడం, 145 రోజుల వరకూ ఇంటర్నెట్పై నిషేధం విధించటం వంటి అంశాలు ప్రపంచదేశాలు దృష్టి పెట్టేలా చేశాయి. పుల్వామా దాడులు... పాకిస్తాన్ ప్రేరిపిత ఉగ్రవాద చర్యలకు తాజా తార్కాణంగా చెప్పుకునే పుల్వామా దాడులు ఈ ఏడాది దాయాది దేశాలు మరోసారి కత్తులు నూరేందుకు కారణమయ్యాయి. ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్లో ఓ మిలటరీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేయగా అందులో సుమారు 40 మంది భారతీయ సైనికులు మరణించారు. ఈ ఘటనకు ప్రతీకారంగా అదే నెల 26న భారత సైన్యం పాకిస్తాన్ లోపలికి చొరబడి బాలాకోట్ వద్ద ఉగ్రవాద స్థావరాలపై బాంబులు వేసింది. ఈ క్రమంలో భారతీయ యుద్ధ విమాన పైలెట్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ చేతికి చిక్కాడు. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ కొన్ని రోజుల వ్యవధిలోనే అభినందన్‌ను సగౌరవంగా భారత్‌కు అప్పగించింది. -
రివైండ్ 2019: గ్లోబల్ వార్నింగ్స్
అంతర్జాతీయంగా 2019 ఎన్నెన్నో ప్రభావవంతమైన ఘటనలకు వేదికయింది. ఆ వివరాలు చూస్తే... అమెరికా – ఉత్తర కొరియా అణు సంక్షోభం ఉత్తర కొరియాను అణ్వస్త్ర రహిత దేశంగా మార్చాలని అగ్రరాజ్యం భావి స్తూ ఉంటే, దేశ అధ్యక్షుడు కిమ్ మరి న్ని అణు పరీక్షలు నిర్వహిస్తూ ఉద్రిక్త తల్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియాలో జూన్ 30న అడుగు పెట్టడం ఈ ఏడాది అతి పెద్ద విశేషం గా చెప్పుకోవాలి. ఉత్తర కొరియాకు వెళ్లిన తొలి అమెరికా అధ్యక్షుడిగానూ ఆయన రికార్డు సృష్టించారు. ఉత్తర కొరియాలో జరిగిన సమావేశంలో ఇరు దేశాధినేతలు అణు చర్చలు జర పాలని నిర్ణయించారు. కానీ అక్టోబర్ 1 వరకు అది సాధ్యం కాలేదు. అయితే ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ఉల్లం ఘించి మరీ ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. దీంతో ఇరు దేశాల ప్రతినిధులు అక్టోబర్ 5న సంప్రదింపులు జరిపారు. అవి కూడా ముందుకు వెళ్లలేదు. అంతర్జాతీయంగా ఈ ఏడాది ఎన్నెన్నో ప్రభావవంతమైన ఘటనలకు వేదికయింది. ఆ వివరాలు చూస్తే... ట్రంప్ అభిశంసనకు ఓకే! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనని ఎదుర్కొ న్నారు. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి పోటీదారు అయిన జో బైడెన్‌పై ఉన్న అవినీతి ఆరోపణలకు తగు ఆధారాలు సంపాదించి, విచారణ జరపాలని... తనకు రాజకీయంగా సహకరించాలని ఉక్రెయిన్‌పై ట్రంప్ ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలున్నాయి. ట్రంప్ తన అధికారాన్ని దుర్విని యోగం చేస్తున్నారని, కాంగ్రెస్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొంటూ ప్రతినిధుల సభలో విచారణ సాగింది. ప్రతినిధుల సభ అభిశంసనకి అనుకూలంగా ఓటు కూడా వేసింది. ఈ అభిశంసన తీర్మానం కొత్త ఏడాది జనవరిలో సెనేట్‌లో చర్చకు రానుంది. హాంగ్‌కాంగ్ భగ్గు హాంగ్‌కాంగ్‌లో భగ్గుమన్న నిరసనలు ఈ ఏడాది ప్రపంచ దేశాల్లో మరెన్నో పోరాటాలకి స్ఫూర్తిగా నిలిచాయి. చైనా చేసిన నేరస్తుల అప్పగింత బిల్లుపై హాంగ్‌కాంగ్‌లో అగ్గి రాజుకుంది. ఈ బిల్లు నిందితుల్ని చైనాలో విచారించడానికి వీలు కల్పిస్తుంది. చైనా ప్రభుత్వ విధానాలపై కొన్నేళ్లుగా పేరుకుపోయిన అసంతృప్తి అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. హాంగ్‌కాంగ్ ప్రత్యేక ప్రతిపత్తిని నిర్వీర్యం చేసేలా చైనా ప్రభుత్వం వ్యవహరిస్తోందని నిరసిస్తూ రోడ్డెక్కారు. ప్రభుత్వం కూడా పోలీసు బలగాలతో నిరసనలు అణచివేయాలని అనుకుంది కానీ అంతకంతకూ అవి తీవ్రమయ్యాయి. బ్రెగ్జిట్ గెలుపు.. బోరిస్ జాన్సన్ 2019 చివరలో బ్రిటన్ ఒక స్పష్టమైన వైఖరిని కనబరిచింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియను (బ్రెగ్జిట్) 2020 మార్చి 29 నాటికి పూర్తి చేయాలని డెడ్‌లైన్ కూడా విధించుకుంది. దీనికి తగ్గట్టుగా దేశంలో రాజకీయంగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బ్రిటన్ ప్రధానిగా మూడు సార్లు బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో విఫలమైన థెరెస్సా మే... తన పదవికి రాజీనామా చేయగా అప్పటికే కన్జర్వేటివ్ పార్టీలోని బోరిస్ జాన్సన్ ఈయూతో ఏ ఒప్పందం లేకుండా బ్రిటన్ నుంచి వైదొలుగుతామని చెప్పారు. దీంతో పార్టీ ఆయన్ను ప్రధానిని చేసింది. అయితే సభలో బ్రెగ్జిట్‌ను వ్యతిరేకించే సంప్రదాయవాదులు కూడా ఉండడంతో జాన్సన్ సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. అఖండ మెజార్టీతో నెగ్గారు. జనవరి 31లోగా బ్రెగ్జిట్‌కు అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందిస్తానని జాన్సన్ వెల్లడించారు. అమెజాన్ చిచ్చు పుడమికి ఊపిరితిత్తులుగా పేరొందిన బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో ఏర్పడిన కార్చిచ్చు ప్రపంచవ్యాప్తంగా గుబులు పుట్టించింది. ఇక్కడ కార్చిచ్చులు సర్వ సాధారణమైనా 2019లో 80 వేల చోట్ల చెలరేగిన కార్చిచ్చులు రికార్డు సృష్టించాయి. -
మంటలు రేపిన మాటలు..
రాజకీయాలంటేనే ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం... నోటికి ఏదొస్తే అది మాట్లాడటంగా మారిపోయింది. 2019 సంవత్సరం ఎన్నికల ఏడాది కూడా కావడంతో ఎందరో నేతలు నోరు జారారు. దిగజారుడుకు హద్దుల్లేవని నిరూపించారు. అలాంటి మాటలు కొన్ని చూస్తే... మేకిన్ ఇండియా కాదు రేపిన్ ఇండియా – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముస్లింలీగ్ గ్రీన్ వైరస్ – యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం గాడ్సే దేశభక్తుడు – ప్రజ్ఞాఠాకూర్, బీజేపీ ఎంపీ జయప్రద లోదుస్తులు ఖాకీ – ఆజంఖాన్, ఎస్పీ నాయకుడు తీరైన తీర్పులు దశాబ్దాలే కాదు... కొన్ని శతాబ్దాల సందిగ్ధానికి కూడా సర్వోన్నత న్యాయస్థానం తెరదించిన సంవత్సరమిది. శ్రీరాముడి జన్మభూమిగా భావించే అయో«ధ్య అంశం మొదలుకొని... రాజకీయ యవనికను కుదిపేసిన రాఫెల్ డీల్ వరకు ఎన్నెన్నో కీలకమైన తీర్పులు వెలువడ్డాయి. వీటిలో మత ప్రాధాన్యమైనవే కాదు!!. మహిళల హక్కులకు సంబంధించినవి... ఆఖరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువచ్చే తీర్పులూ ఉన్నాయి. ఆ మేటి తీర్పులు సంక్షిప్తంగా... జన్మభూమి... రాముడిదే! దేశ చరిత్రలోనే సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అయోధ్యలోని రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్‌గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం నవంబర్ 9న తుది తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిలో హిందువులు రామ మందిరాన్ని నిర్మించుకోవడానికి అనుమతిం చింది. ముస్లింలకు మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని వేరొకచోట కేటాయించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్‌ని ఏర్పాటు చేయాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. శబరిమలకు మహిళలు... కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లను ఏడుగురు సభ్యుల విస్త్రుత ధర్మాసనానికి బదిలీచేస్తూ 3:2 మెజారిటీతో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే వయసు రీత్యా కొన్ని వర్గాలకు చెందిన మహిళల ప్రవేశంపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేస్తూ 2018 సెప్టెంబర్ 28న ఇచ్చిన తీర్పుపై మాత్రం కోర్టు ఎలాంటి స్టే విధించలేదు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం నవంబర్ 14న ఈ తీర్పుని వెలువరించింది. న్యాయమా! నువ్వు ‘ఉన్నావ్’... ఢిల్లీలో నిర్భయ ఘటన అనంతరం ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మైనర్ బాలికపై ఘోర అత్యాచారం జరగటంతో దేశం నిర్ఘాంతపోయింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి అధికార బీజేపీ ఎమ్మెల్యే కావటంతో కేసు ఎన్నెన్నో మలుపులు తిరిగింది. పార్టీ అతన్ని బహిష్కరించింది. అయితేనేం!! నేరాన్ని కప్పిపుచ్చే యత్నాలు ఆగలేదు. బాధిత మహిళను కిడ్నాప్ చేయటం... ఆమె తండ్రి లాకప్ హత్య... బాధితురాలు సహా బంధువులను యాక్సిడెంట్ రూపంలో చంపే ప్రయత్నాలు... ఇలా ఎన్నో ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజకీయ నాయకుడు నిందితుడైతే కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్ని మలుపులూ తిరిగింది. దీంతో ఈ కేసుపై యావద్దేశం ఒక్కటయింది. చివరికి సర్వోన్నత న్యాయ స్థానం జోక్యం చేసుకుంది. 45 రోజుల్లో విచారణ పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఫలితం... బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఢిల్లీ తీస్ హజారీ కోర్టు తీర్పునిచ్చింది. డిసెంబర్ 19న సెంగార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రాఫెల్... విచారణకు నో! రాఫెల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయటానికి ఆ కంపెనీతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిన గత తీర్పులను పునఃపరిశీలించాలన్న డిమాండ్‌ని కోర్టు తోసిపుచ్చింది. న్యాయవాది ప్రశాంత్ భూషణ్, కేంద్ర మంత్రులు యశ్వంత్ సింగ్, అరుణ్ శౌరి దాఖలు చేసిన పిటిషన్లపై మే 10న కోర్టు విచారణ ముగించి తన ఉత్తర్వులను రిజర్వులో ఉంచింది. నవంబరు 14న తీర్పు వెలువరించింది. -
సినిమా సూపర్ హిట్ కలెక్షన్లు ఫట్
జనం పెట్టే ఖర్చులు తగ్గాయంటే... ఓలా, ఉబెర్ బుకింగులు పెరిగాయంటారు ఆర్థిక మంత్రి!!. మరి అదే నిజమైతే కార్ల విక్రయాలు కూడా పెరగాలి కదా? అనేది సామాన్యుడి సందేహం. వీటి మధ్య సంబంధం ఉందనుకుంటే ఉంది!. లేదనుకుంటే లేదు!!. 2019లో మన ఆర్థిక వ్యవస్థ తీరు చూసినా ఇలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఎకానమీ మందగమనంతో నత్తనడకన నడుస్తోంది. విక్రయాలు తగ్గిపోయాయని ఆటోమొబైల్, వినియోగ వస్తువుల కంపెనీలు మొత్తుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్లు మాత్రం రోజుకో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అటు సంస్కరణల ఊతంతో సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకుల్లో భారత్ భారీగా ఎగబాకినా.. ఇటు పారిశ్రామిక దిగ్గజాలు మాత్రం వ్యాపార వర్గాల నోరు నొక్కేస్తోందంటూ ప్రభుత్వంపై బాహాటంగానే విరుచుకుపడుతున్నారు. మందగమనం సమస్యకు చికిత్స చేసేందుకు ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించినా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో 2019 సింహావలోకనంతో పాటు కొత్త సంవత్సరంపై నెలకొన్న అంచనాల సమాహారమిది... స్టాక్ మార్కెట్లు.. ‘రికార్డ్’ల పరుగు ఎకానమీ పరిస్థితి ఎలా ఉన్నా.. స్టాక్ మార్కెట్లు మాత్రం రయ్‌మని ఎగిశాయి. నిఫ్టీ సుమారు 13 శాతం, సెన్సెక్స్ దాదాపు 15 శాతం పెరిగాయి. 2017 తర్వాత దేశీ సూచీలకు 2019 బాగా కలిసొచ్చింది. ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.10.2 లక్షల కోట్లు ఎగిసింది. ఈ ఏడాది జనవరి 1న 36,162 పాయింట్లుగా ఉన్న సెన్సెక్స్ 5,000 పాయింట్లు పైగా పెరిగి తాజాగా 41,000 పైకి చేరింది. ఎకానమీతో సంబంధం లేనట్లుగా స్టాక్ మార్కెట్లు అలా పెరుగుతూ పోవడంపై ఆర్థికవేత్తలు కూడా అయోమయంలో పడ్డారు. స్టాక్ మార్కెట్ల ర్యాలీ కొన్ని షేర్లకే పరిమితం కావడం గమనార్హం. 2018 జనవరిలోని ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలతో పోలిస్తే మిడ్ క్యాప్ సూచీ 19 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 33 శాతం పడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన తొలి దేశీ కంపెనీగా రికార్డు సృష్టించింది. కార్పొరేట్ ట్యాక్స్ రేటును తగ్గించడం, ఆఖరు దశలో నిల్చిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఊతమిచ్చేందుకు రూ. 25,000 కోట్ల నిధి ఏర్పాటు చేయడం, విదేశీ ఇన్వెస్టర్లపై పన్ను ప్రతిపాదనలను ఉపసంహరించడం వంటి అంశాలు మార్కెట్ల పరుగుకు దోహదపడ్డాయి. 2019లో రూ.లక్ష కోట్లకు పైగా విదేశీ నిధులు వచ్చాయి. ఇది క్రితం ఏడాదితో పోలిస్తే 7.5 శాతం అధికం. వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందని స్టాక్ ఇన్వెస్టర్లతో పాటు వ్యూహాత్మక ఇన్వెస్టర్లు కూడా బుల్లిష్‌గా ఉన్నారనడానికి ఇది నిదర్శనంగా పరిశీలకులు భావిస్తున్నారు. టెల్కోలకు షాక్ ట్రీట్మెంట్.. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కింపు విషయంలో కేంద్రం ఫార్ములానే సమర్ధి స్తూ సుప్రీం కోర్టు ఆదేశాలివ్వడంతో పాత ప్రైవేట్ టెల్కోల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈ దెబ్బతో టెల్కోలు ఏకంగా రూ. 1.47 లక్షల కోట్లు కేంద్రానికి చెల్లించాల్సి వస్తోంది. వీటికి కేటాయింపులు జరపడంతో వొడాఫోన్ ఐడియా సంస్థ దేశ కార్పొరేట్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో రూ. 50,921 కోట్ల పైచిలుకు నష్టాలను సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రకటించింది. ఎయిర్టెల్ కూడా రూ. 23,045 కోట్ల నష్టాలు నమోదు చేసింది. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే కంపెనీని మూసేయక తప్పదని వొడాఫోన్ ఐడియా ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తానికి రంగంలోకి దిగిన కేంద్రం.. టెల్కోలకు ఊరటనిచ్చేలా స్పెక్ట్రం బాకీల చెల్లింపుపై రెండేళ్ల మారటోరియం ప్రకటించింది. ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జీల వివాదం కూడా తెరపైకి వచ్చింది. ఈ చార్జీలను కొనసాగించాలంటూ పాత టెల్కోలు, ఎత్తివేయాలని కొత్త టెలికం సంస్థ జియో వాదించాయి. చివరికి 2021 దాకా దీని గడువును ట్రాయ్ పొడిగించింది. ఈలోగా టెల్కోలన్నీ కలిసికట్టుగా చార్జీలను పెంచేశాయి. రేటు పెరిగినా డేటా వినియోగానికి డిమాండ్ తగ్గదని, ఆదాయాలు గణనీయంగా మెరుగుపడతాయని కంపెనీలు ఆశిస్తున్నాయి. కనీస చార్జీల ప్రతిపాదనను ట్రాయ్ పరిశీలిస్తోంది. అటు ప్రభుత్వ రంగ టెల్కోలకు కాస్త ఊరట లభించింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. రూ.69,000 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది. ఇరు సంస్థల్లో 92,000 మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ఎంచుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్ కొనసాగిన జోష్.. 2019లో మ్యూచువల్ ఫండ్స్ అసెట్స్ భారీగా పెరిగాయి. 2019 నవంబర్ నాటికే ఏయూఎం 18 శాతం (సుమారు రూ. 4.2 లక్షల కోట్లు) ఎగిసి రూ.27 లక్షల కోట్లకు చేరింది. ఇన్వెస్టర్ల ధీమాను పెంచేందుకు సెబీ తీసుకుంటున్న చర్యలు, డెట్ స్కీముల్లోకి భారీగా పెట్టుబడుల రాకతో.. కొత్త ఏడాది కూడా ఇదే ధోరణి కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. 2020లో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ 17–18 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చని, ఎకానమీ పుంజుకుంటే ఈక్విటీ ఫండ్స్‌లోకి కూడా భారీగా పెట్టుబడులు రావొచ్చని ఫండ్ సంస్థల సమాఖ్య యాంఫీ అంచనా వేస్తోంది. బీమా రంగం... ధీమాగా వృద్ధి బీమా పరిశ్రమ వృద్ధి స్థిరంగా కొనసాగింది. నవంబర్ దాకా చూస్తే కొత్త ప్రీమియం వసూళ్లు వార్షికంగా సుమారు 37 శాతం వృద్ధితో రూ. 1.7 లక్షల కోట్లుగా నమోదైనట్లు కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. రాబోయే రోజుల్లో పరిశ్రమ 15% వృద్ధి రేటు సాధించవచ్చని అంచనా వేసింది. కుటుంబాలు చేసే పొదుపు మొత్తాలు.. బంగారం వంటి వాటి వైపు కాకుండా ఇతరత్రా ఆర్థిక అసెట్స్‌వైపు మళ్లుతుండటం, ప్రభుత్వ విధానాలు, బీమా విస్తృతికి సంస్థల ప్రయత్నాలు ఇందుకు దోహదపడగలవని పరిశ్రమవర్గాలు పేర్కొ న్నాయి. ఎకానమీ అస్తవ్యస్తం.. అంతర్గత, అంతర్జాతీయ సవాళ్లతో ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థకు కష్టంగానే గడిచింది. వినియోగం, ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతులు.. అన్నీ మందగించాయి. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అగ్రగామి దేశం హోదాను భారత్ కోల్పోయింది. సెప్టెంబర్ క్వార్టర్లో జీడీపీ వృద్ధి.. ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి పడిపోయింది. 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం దిశగా దూసుకెళ్లాల్సిన ఎకానమీ... మందగమనం దెబ్బతో కుంటినడకలు నడుస్తోంది. ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు దేశ వృద్ధి రేటు అంచనాలకు భారీగా కోతలు పెట్టాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం పలు సంస్కరణలు ప్రవేశపెడుతోంది. కార్పొరేట్ ట్యాక్స్ రేటును పాతిక శాతానికి తగ్గించడం, ఆర్థిక రంగ పునర్వ్యవస్థీకరణ, వడ్డీ రేట్ల కోత వంటివి వీటిలో కీలకం. కార్పొరేట్ ట్యాక్స్ కోత వల్ల సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీలు కాస్త మెరుగైన ఫలితాలు ప్రకటించగలిగాయి. సులభతరంగా వ్యాపారాలు నిర్వహించడానికి అనువైన దేశాల జాబితాలో భారత్ 77వ స్థానం నుంచి 63వ స్థానానికి వచ్చింది. మరోవైపు, ఆర్బీఐ కీలక పాలసీ రేట్లను తగ్గించినా.. ఆ ప్రయోజనాలను ఖాతాదారులకు బ్యాంకులు పూర్తిగా బదలాయించకపోతుండటంతో దేశీయంగా వినియోగానికి ఊతం లభించడం లేదు. దీంతో వచ్చే సంవత్సరం కూడా పరిస్థితి పెద్దగా మెరుగుపడేలా కనిపించడం లేదనేది పరిశీలకుల మాట. అయితే, ఇన్ఫ్రాపై వచ్చే అయిదేళ్లలో రూ.100 లక్షల కోట్లు వెచ్చించాలన్న ప్రభుత్వ ప్రణాళికతో ఎకానమీకి కొంత ఊతం లభించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. రియల్టీ అంతంతమాత్రం... రియల్టీ రంగంపైనా ఆర్థిక మందగమన ప్రభావం గణనీయంగా పడింది. టాప్ 7 నగరాల్లో రిటైల్ లీజింగ్ కార్యకలాపాలు క్రితం ఏడాదితో పోలిస్తే 35 శాతం తగ్గాయి. 2018లో 5.5 మిలియన్ చ.అ. లీజింగ్ నమోదు కాగా 2019లో ఇది 3.6 మి.చ.అ.లకు పరిమితమైందని రియల్టీ సేవల సంస్థ అనరాక్ నివేదికలో వెల్లడైంది. ఆటోమొబైల్, జ్యుయలరీ, ఎలక్ట్రానిక్స్, హైపర్మార్కెట్లు మొదలైన విభాగాల్లో లీజింగ్ తగ్గగా.. ఫుడ్ అండ్ బెవరేజెస్, సినిమా, సౌందర్య సంరక్షణ సేవల విభాగాల్లో పెరిగింది. అయితే, వచ్చే ఏడాది రిటైల్ లీజింగ్ మళ్లీ పుంజుకోవచ్చని అంచనాలున్నాయి. పసిడి.. జిగేల్ జిగేల్ పసిడి మెరుపులు ఈ ఏడాది మరింత కాంతివంతమయ్యాయి. అంతర్జాతీయంగా ఔన్సు (31.1 గ్రాములు) బంగారం ధర 1,400 డాలర్ల శ్రేణిని ఛేదించింది. 2013 తర్వాత మళ్లీ తొలిసారి ఈ ఏడాది ఆగస్టులో 1,500 డాలర్ల మార్కును అధిగమించింది. దేశీయంగా రేటు ఏకంగా 25 శాతం పెరిగింది. సంవత్సరం తొలినాళ్లలో రూ.31,500 స్థాయిలో ఉన్న పది గ్రాముల బంగారం ధర దాదాపు రూ.8,000 పెరిగి ఒక దశలో రూ. 40,000 స్థాయిని కూడా తాకింది. సాధారణంగా.. అనిశ్చితి, ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారాన్ని పరిగణిస్తారు. ఈ కారణాలే ఈ ఏడాది పసిడి పరుగుకు దోహదపడ్డాయి. అంతర్జాతీయంగా భౌగోళిక.. రాజకీయ... వాణిజ్య అనిశ్చితి, అమెరికా – చైనా మధ్య సుదీర్ఘంగా కొనసాగిన టారిఫ్‌ల యుద్ధం వంటివన్నీ ఇన్వెస్టర్లను పసిడివైపు మొగ్గేలా చేశాయి. ప్రపంచ ఎకానమీపై కమ్ముకున్న నీలినీడలతో.. షేర్ల వంటి రిస్కీ సాధనాల కన్నా బంగారం, ఇతరత్రా సురక్షిత సాధనాలే ఆకర్షణీయంగా ఉంటాయని 2019 రెండో త్రైమాసిక నివేదికలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. సాధారణ ఇన్వెస్టర్ల తరహాలోనే సెంట్రల్ బ్యాంకులు కూడా పసిడిని భారీగా కొని నిల్వలు పెంచుకుంటున్నాయి. వచ్చే ఏడాది కూడా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి, కనిష్ట స్థాయిల్లో వడ్డీ రేట్లు, డాలరు బలహీనపడే అవకాశాల నేపథ్యంలో బంగారం పరుగు కొనసాగుతుందని భావిస్తున్నారు. కీలకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికలతో మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో 2020లో ఔన్సు బంగారం ధర 1,620 డాలర్ల స్థాయిని తాకవచ్చని అంచనాలున్నాయి. అయితే, ఇప్పటికే పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరిపేసిన స్పెక్యులేటివ్ ఇన్వెస్టర్లు.. 2020లో అమ్మకాలకు దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫలితంగా పసిడి రేటు తగ్గే చాన్సు కూడా ఉందనేది నిపుణుల అంచనా. ఆటోమొబైల్ రివర్స్ గేర్‌లోనే... డిమాండ్ లేక అమ్మకాలు తగ్గడం మొదలుకుని ప్లాంట్ల మూసివేతలు, ఉద్యోగాల కోతలు, వందల మంది డీలర్ల దివాలా.. కొత్త కాలుష్య ప్రమాణాలు, ఎలక్ట్రిక్ వాహనాల విధానాలు.. ఇలా వివిధ కారణాలు ఆటోమొబైల్ పరిశ్రమను తెరిపిన పడనివ్వకుండా చేశాయి. ఎకానమీలో మందగమనం, ధరల పెంపుతో ప్యాసింజర్ వాహన విక్రయాలు క్షీణించగా, అధిక నిల్వలు పేరుకుపోయి.. ఫైనాన్స్ అవకాశాలు తగ్గిపోయి వాణిజ్య వాహన అమ్మకాలు పడిపోయాయి. ఉద్యోగ కల్పన, డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటంతో ద్విచక్ర వాహన విక్రయాలు భారీగా తగ్గాయి. అయితే, వాహనాల కొనుగోళ్లకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తుండటం, రుణ లభ్యతను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటూ ఉండటం తదితర చర్యలు రాబోయే రోజుల్లో ప్యాసింజర్ వాహనాలకు సానుకూలంగా ఉండగలవన్న అంచనాలు నెలకొన్నాయి. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో సెంటిమెంటు మెరుగుపడుతుండటం .. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ల అమ్మకాలకూ సానుకూలంగా ఉండవచ్చని అంచనా. డీల్ స్ట్రీట్ .. కార్పొరేట్లు డీలా కార్పొరేట్లు రుణ సంక్షోభాల్లో కూరుకుపోవడంతో 2019లో విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్ఏ) డీల్స్ ఒక మోస్తరు స్థాయికే పరిమితమయ్యాయి. లిక్విడిటీ కొరత, విదేశీ ఇన్వెస్టర్లు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడం, అంతర్జాతీయంగా అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం వంటి అంశాలతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అవలంబించారు. న్యాయసేవల సంస్థ బేకర్ మెకెంజీ నివేదిక ప్రకారం 2019లో మొత్తం మీద సుమారు రూ. 52.1 బిలియన్ డాలర్ల విలువ చేసే డీల్స్ జరిగాయి. 2019లో సగటు ఎంఅండ్ఏ డీల్ పరిమాణం 81 మిలియన్ డాలర్లుగా నమోదైంది. గడిచిన మూడేళ్లతో పోలిస్తే ఇదే అత్యల్పం. తయారీ, ఇంధనం, స్టార్టప్, ఫార్మా, బ్యాంకింగ్, ఐటీ, ఇన్ఫ్రా, రిటైల్, ఈ–కామర్స్ రంగాల్లో గణనీయంగా ఒప్పందాలు కుదిరాయి. వ్యాపారాలకు అనువైన సంస్కరణలు, అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు తిరిగొస్తుండటం వంటి అంశాల ఊతంతో 2020, 2021 సంవత్సరాల్లో డీల్స్ పరిస్థితి మళ్లీ పుంజుకోగలదని బేకర్ మెకెంజీ ఒక నివేదికలో తెలిపింది. బ్యాంకింగ్... ఫైనాన్స్ సవాళ్లమయం ఐఎల్అండ్ ఎఫ్ఎస్ దివాలా ప్రభావాలతో 2019 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం కష్టాలు కొనసాగాయి. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్, అల్టికో క్యాపిటల్ వంటి సంస్థలు దివాలా తీశాయి. ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభంతో రుణ లభ్యత కొరవడి ఆటోమొబైల్ వంటి ఇతర రంగాలపైనా ప్రభావం పడింది. మొండిబాకీలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం 10 బ్యాంకులను నాలుగు కింద విలీనం చేసింది. యూనియన్ బ్యాంకులో విలీనంతో తెలుగువారి ఆంధ్రా బ్యాంకు కనుమరుగు కానుంది. నెఫ్ట్ సేవలు ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులోకి వచ్చాయి. ఎట్టకేలకు దివాలా కోడ్ ప్రయోజనాలు కనిపించడం ప్రారంభమైంది. ఎస్సార్ స్టీల్ వంటి కేసులు పరిష్కారం కావడంతో బ్యాంకులకు వేల కోట్ల మేర మొండిబాకీల రికవరీ సాధ్యపడింది. అయితే, ఇంకా చాలా కేసుల పరిష్కారానికి సుదీర్ఘ సమయం పట్టేస్తుండటం ఆందోళనకర విషయం. మొండిబాకీల (ఎన్పీఏ) భారం ఈసారి కాస్త తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ ఆఖరు నాటికి స్థూల ఎన్పీఏలు రూ. 8.94 లక్షల కోట్లకు తగ్గాయి. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో స్థూల మొండిబాకీలు రూ. 10.18 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇక, సుదీర్ఘ వివాదానికి ఫుల్స్టాప్ పెడుతూ బిమల్ జలాన్ సిఫార్సుల మేరకు రిజర్వ్ బ్యాంక్ .. 2018–19 కేంద్రానికి గాను తన వద్ద ఉన్న మిగులు నిధుల్లో రూ. 1.76 లక్షల కోట్లు కేంద్రానికి బదలాయించేందుకు అంగీకరించింది. మందగమనంతో కొట్టుమిట్టాడుతున్న ఎకానమీకి ఊతమిచ్చేలా కీలక వడ్డీ రేట్లను 135 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు .. దశాబ్ద కనిష్ట స్థాయి 5.15 శాతానికి దిగివచ్చింది. అయితే, ద్రవ్యోల్బణం ఎగియడంతో డిసెంబర్లో రేట్ల కోతకు కాస్త విరామమిచ్చింది. -
టాలీవుడ్ @ 2020
గడిచిన పదేళ్ల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ.. ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. మరెన్నో శిఖరాలను అందుకుంది. గొప్ప గొప్ప విజయాలను సాధించింది. తన మార్కెట్ వ్యాల్యూనూ అనూహ్యంగా పెంచుకుంది. ఇవాళ జాతీయంగా, అంతర్జాతీయంగా తెలుగు సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేశవ్యాప్తంగానే కాదు.. ఓవర్సీస్లోనూ భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇందుకు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి. తెలుగు సినిమాను అంతర్జాతీయంగా నిలబెట్టడంలో, టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయంగా విస్తరింపజేయడంలోనూ బాహుబలి సినిమాలది ప్రత్యేకమైన స్థానం. కానీ అంతకుముందు నుంచి టాలీవుడ్ సినిమాలు వడివడిగా ఎదుగుతూ ఎంతో పేరుప్రఖ్యాతలు పొందాయి. ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ దిశదిశలా వ్యాపించింది. ఇప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగానే క్రేజ్ నెలకొంది. అంతర్జాతీయంగానూ గుర్తింపు లభిస్తోంది. ఈ నేపథ్యంలో విస్తరించిన మార్కెట్‌ను అందిపుచ్చుకోవడం.. పెరిగిపోయిన అంచనాలకు దీటుగా సత్తా ఉన్న సినిమాలు నిర్మించడం తెలుగు చిత్రసీమకు కత్తిమీద సాములాంటిదే. పెరిగిన బడ్జెట్.. అంచనాలు! బాహుబలి ఇచ్చిన జోష్‌తో భారీ సినిమాలు తెరకెక్కించేందుకు ఇప్పుడు దర్శకనిర్మాతలు ముందుకొస్తున్నారు. ఒకప్పుడు 30, 40కోట్ల బడ్జెట్‌తో సినిమాలను తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు వెనుకాముందు అయ్యేవారు. సినిమా హిట్టయినా అంత బడ్జెట్ తిరిగొస్తుందా? అన్న సందేహాలు వెంటాడేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతిష్టాత్మక సినిమాల కోసం, క్రేజీ కాంబినేషన్ల కోసం వందల కోట్లు పెట్టేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు సాహసిస్తున్నారు. ఈ కోవలో వచ్చిన సినిమాలే సాహో, సైరా, మహర్షి, వినయవిధేయ రామ. ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలు. ఇందులో సాహో, సైరాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు 200 కోట్లకుపైగా బడ్జెట్‌తో భారీ అంచనాలతో, కళ్లుచెదిరే విజువల్స్, స్టంట్లతో ఈ సినిమాలు తెరకెక్కాయి. ఈ సినిమాలకు టాలీవుడ్లోనే కాదు దేశవ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. అయితే, భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఏమాత్రం కథ, కథనాలు ఏమాత్రం ప్రేక్షకుడి అంచనాలకు మించి లేకపోతే.. కథ మొదటికి వచ్చే ప్రమాదం ఉందని ఈ ఏడాది వచ్చిన సినిమాలు నిరూపించాయి. బాహుబలి తర్వాత భారీ అంచనాలతో, దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సాహో’. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విడుదలైనప్పటికీ.. అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలమైంది. దర్శకుడు సినిమాలోని స్టంట్ల మీద పెట్టిన ఫోకస్లో కొంతమేరకైనా కథ, స్క్రీన్‌ప్లే మీద పెట్టి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదేమోనని వినిపించింది. మొత్తానికి హిందీలో తప్ప మిగతా అన్ని భాషల్లో సాహో సినిమా భారీ పరాభవాన్నే ముటగట్టుకుంది. హిందీలో వందకోట్లకుపైగా వసూళ్లు రావడం, ప్రభాస్ స్టార్డమ్ కలిసిరావడంతో ఈ సినిమా నిర్మాతలకు కొంత ఊరటనిచ్చే విషయం. ఇక, చారిత్రక నేపథ్యంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సైరానరసింహారెడ్డి సినిమా కూడా అంచనాలకు దూరంగానే ఉండిపోయింది.రేనాటి సూరీడు, స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాంచరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులో హిట్టైనప్పటికీ.. అంచనాలను అందుకోలేకపోయింది. ఇతర భాషల్లో ఓ మోస్తరు వసూళ్లే రాబట్టింది. మహేశ్‌బాబు 25వ సినిమా మహర్షి కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే, ఈ సినిమా హిట్ అయినప్పటికీ.. ప్రిన్స్ మహేశ్ స్టామినాకు తగ్గట్టు వసూళ్లు రాబట్టంలో సక్సెస్ కాలేదు. ఇక, రాంచరణ్ హీరోగా తెరకెక్కిన వినయవిధేయ రామ సినిమా గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. రంగస్థలం లాంటి పర్ఫార్మెన్స్ ఒరియంటెడ్ పాత్ర చేసిన చరణ్.. ఆ వెంటనే రోటిన్ ఫార్ములా సినిమాలో నటించడం.. ఫైట్లు, రక్తపాతంతో దర్శకుడు బోయపాటి శ్రీను ప్రేక్షకులను బెంబెలెత్తించడంతో ఈ సినిమా బోల్తా కొట్టింది. మారిన బాక్సాఫీస్ సరళి! తెలుగు చిత్రపరిశ్రమ మార్కెట్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశీయంగానూ పొరుగు రాష్ట్రాల్లోనూ మంచి మార్కెట్ ఏర్పడింది. అంతేకాదు ఓవర్సీస్లోనూ గణనీయంగా వసూళ్లు రాబట్టే సత్తా ఉన్నట్టు తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో సినిమా జయాపజయాల ప్రమాణాలూ మారిపోయాయి. ఒకప్పడు 50 రోజులు ఆడితే బొమ్మ హిట్టు అనేవారు. వందరోజులు ఆడితే సూపర్‌హిట్టు.. 175, 200 రోజులు ఆడితే బ్లాక్‌బస్టర్ హిట్టు, ఆల్‌టైమ్ హిట్టు అని కొనియాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. డిజిటల్ స్ట్రీమింగ్ అందుబాటులోకి రావడంతో 40రోజుల్లోనే కొత్త సినిమా ప్రేక్షకుల చెంతకు చెరిపోతోంది. టీవీల్లోనూ, ఇంకా వీలైతే యూట్యూబ్‌లోనూ వీలైనంత త్వరగా కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల నడుమ ఎన్ని థియేటర్లలో విడుదలైంది.. ఏ స్థాయిలో ప్రారంభ వసూళ్లు సాధించింది.. ఎన్ని వారాలపాటు నిలకడగా వసూళ్లు రాబట్టగలిగిందనేని సినిమా విజయానికి ఇప్పుడు ప్రమాణంగా మారింది. ప్రారంభ వసూళ్ల ఆధారంగా సినిమా జయాపజయాలు బేరిజు వేసే పరిస్థితి వచ్చింది. మొదటి మూడు రోజులు బంపర్ వసూళ్లు సాధిస్తే బొమ్మ హిట్టు, సూపర్‌హిట్టు ఖాతాలోకి వెళ్లిపోతోంది. మొదటి రెండు వారాల వసూళ్లు సినిమా విజయానికి ప్రాణపదంగా మారిపోయాయి. థియేటర్లలో లాంగ్రన్ అనేది చాలావరకు కనుమరుగవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బాహుబలి, రంగస్థలం లాంటి బలమైన కథాచిత్రాలే చాలాకాలంపాటు ప్రేక్షకులను థియేటర్లకు లాక్కొచ్చాయి. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ఎంత మంచి టాక్ వచ్చిన సినిమా అయినా, స్టార్ హీరో మూవీ అయినా మూడు, నాలుగు వారాలకు మించి థియేటర్లలో నిలబడని పరిస్థితి. మారిన పరిస్థితులకు అనుగుణంగా టాలీవుడ్ కూడా తన పద్ధతలను మార్చుకుంది. ప్రారంభ వసూళ్లపైనే ఇప్పుడు దర్శక నిర్మాతలు, సినీ తారలు ఫోకస్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున విడుదల చేసి మొదటి ఒకటిరెండు వారాల్లోనే దండిగా వసూళ్లు రాబడట్టంపై దృష్టి పెట్టారు. ఆన్లైన్లో వరుసగా ఫస్ట్‌లుక్, టీజర్లు, పాటలు, ట్రైలర్లు విడుదల చేస్తూ.. ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచుతూనే.. క్షేత్రస్థాయి పర్యటనలతో సినిమా విడుదలకు ముందే ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లి.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు కొత్త కొత్త వ్యూహాలు పన్నుతున్నారు. ఈ పరిణామాలు కొంతమేరకు సక్సెస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా సినిమాలోబలమైన కథకథనాలు, భావోద్వేగాలు, వినోదం ఉంటే.. ఆటోమేటిక్‌గా ప్రేక్షకులు థియేటర్ వైపు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కథకథనాలు బాగుండి.. స్టార్ బలం లేకపోయినా, అంతగా ప్రచారం లేకపోయినా హిట్టు కొట్టవచ్చునని ఈ ఏడాది వచ్చిన బ్రోచేవారెవురా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఎవరు, మల్లేశం వంటి సినిమాలు నిరూపించాయి. మొత్తానికి కళ్లుచెరిరే స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్ మాత్రమే సినిమాను ప్రేక్షకులకు చేరువచేయలేదని, ప్రేక్షకుడిని రంజింపజేసే కథ, స్క్రీన్‌ప్లే, బలమైన భావోద్వేగాలు ఉంటే తప్ప బొమ్మ హిట్టు కావడం అంత ఈజీ కాదని 2019 బాక్సాఫీస్ హిస్టరీ చాటుతోంది. మూస సినిమాలకు కాలం చెల్లిపోయిందని, రొటీన్ ఫార్మూలాలతో తెరకెక్కించే మసాలా సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ దొరకడం కష్టమేనని తాజా పరిణామాలు చెప్పకనే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే, పెరిగిన మార్కెట్ అంచనాలకు దీటుగా.. మారిన ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని.. ఫ్రెష్ కంటెంట్‌నూ, క్రియేటివ్ కథలను అన్వేషించి తెరకెక్కించాల్సిన అవసరముందని టాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కమర్షియల్ సినిమా పేరిట ఇన్నాళ్లు అవలంబించిన రోటిన్, మూస ఫార్ములా చిత్రాలను పక్కనబెట్టి.. ఒరిజినాలిటీ ఉన్న కథలను, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో వినూత్నంగా తెరకెక్కిస్తే ప్రేక్షకుల హృదయాలు గెలుచుకోవడం ఈజీ అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సంక్రాంతికి రాబోతున్న టాలీవుడ్ పందెకోళ్లు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురం సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. సరికొత్త కథాకథనాలతో కొత్త సంవత్సరంలో రాబోయే సినిమాలు ప్రేక్షకులను ఆదరిస్తాయని, నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తాయని ఆశిద్దాం. - శ్రీకాంత్ కాంటేకర్ -
దివికేగిన సినీ దిగ్గజాలు
-
మాంద్యం మింగేసింది
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక మాంద్యం నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత.. ఇంటర్ ఫలితాల్లో లోపాలపై తీవ్ర వివాదం... న్యాయ చిక్కులతో బెడిసికొట్టిన కొత్త సచివాలయం, శాసనసభ భవన సముదాయాల నిర్మాణం, ఆర్టీసీ కార్మికుల సుదీర్ఘ సమ్మె... దిశ హత్యాచారం, నలుగురు నిందితుల ఎన్కౌంటర్.. వెరసి ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం కొన్ని ఒడిదుడుకులకు, సంచలనాలకు వేదికైంది. అదే సమయంలో ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభం కావడం ప్రభుత్వ అతిపెద్ద విజయంగా, తీపిగుర్తుగా మిగిలింది. 2019 సంవత్సరం మరో మూడు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్రంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలు, రాష్ట్రానికి ఎదురైన క్లిష్ట పరిస్థితులపై కథనం. ఆర్థిక మాంద్యం దెబ్బ ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పడింది. ఫిబ్రవరిలో రూ. 1,82,087 కోట్ల భారీ అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఆర్థిక మాంద్యం దెబ్బకు పూర్తిస్థాయి బడ్జెట్‌ను సెప్టెంబర్‌లో రూ. 1,46,492.30 కోట్లకు తగ్గించుకుంది. అయినా ఇప్పటికే అమల్లో ఉన్న రైతుబంధు వంటి ప్రతిష్టాత్మక పథకాలకు తీవ్ర నిధుల కొరత ఏర్పడింది. పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్ల బిల్లులు పేరుకుపోయాయి. గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన కొత్త హామీల అమలు కూడా ఆర్థిక మాంద్యం వల్ల ప్రశ్నార్థకమైంది. రైతులకు రూ. లక్షలోపు రుణ మాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు పీఆర్సీ, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు వంటి హామీల అమలు కోసం రాష్ట్ర ప్రజలు ఏడాదంతా నిరీక్షించాల్సి వచ్చింది. రైతుబంధు ఆర్థిక సాయం, ఆసరా పెన్షన్ల పెంపు హామీలను అమల్లోకి తెచ్చినా సకాలంలో పంపిణీ చేయలేకపోయింది. గత ఖరీఫ్‌లో 45 లక్షల మంది రైతులకు రైతుబంధు కింద రూ. 5,460 కోట్లు చెల్లించగా 8 లక్షల మందికి రూ. 1,500 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఇక రబీకి సంబంధించి చెల్లింపులు ఇంకా ప్రారంభం కాలేదు. నిధుల కొరత వల్ల కొత్తగా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సవరించిన అంచనాల్లో రూ. 10 వేల కోట్లను భూముల అమ్మకం ద్వారా సమీకరించుకోవాలని నిర్ణయించినా కోకాపేట భూముల అమ్మకంపై హైకోర్టు స్టే విధించడంతో అది నెరవేరట్లేదు. ఇంటర్ ఫలితాల్లో ‘ఫెయిల్’ ఇంటర్మీడియెట్ ఫలితాల ప్రకటనలో దొర్లిన తప్పులు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. రిజల్ట్స్ ప్రాసెసింగ్ కాంట్రాక్టు దక్కించుకున్న గ్లోబరీనా సంస్థ చేసిన తప్పిదాల కారణంగా పాసైన విద్యార్థులు సైతం ఫెయిలైనట్లు ఫలితాలొచ్చాయి. దీంతో తీవ్ర మానసిక వేదనకు 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపింది. ఈ విషయంలో ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదనే విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితాలపై విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు ఆందోళనలు నిర్వహించడం, ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల సంఘం, సుప్రీంకోర్టు స్పందించడం ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేసింది. ‘కాళేశ్వరం’ జాతికి అంకితం.. రాష్ట్రంలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ జూన్ 21న ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి ఆయకట్టుకు నీరు అందించేలా యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. 52 రోజుల పాటు.. అక్టోబర్ 5 నుంచి 52 రోజులపాటు సాగిన ఆర్టీసీ సమ్మె యావత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. సమ్మె విరమణకు కార్మిక సంఘాల జేఏసీ, డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభు త్వం నిరాకరించడంతో 50 వేల మంది కార్మికులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఐదుగురు కార్మికుల బలవన్మరణాలతో కలిసి మొత్తం 38 మంది కార్మికులు సమ్మె కాలంలో మరణించారు. చివరకు కార్మిక జేఏసీ సమ్మె విరమించడం, కార్మికులను ప్రభుత్వం బేషరతుగా విధుల్లో చేర్చుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. సమ్మె విరమించిన కార్మికులపై సీఎం కేసీఆర్ హామీల వర్షం కురిపించడం ఊరట కలిగించింది. ఆర్టీసీ పరిరక్షణ కోసం కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున చార్జీల పెంపును ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. సచివాలయం లేని రాష్ట్రం కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయాల నిర్మాణం కోసం ప్రభుత్వం చారిత్రక ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చేసి అక్కడే రూ. 400 కోట్లతో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలనితీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చి రూ. 100 కోట్లతో కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని తీసుకున్న నిర్ణయంపై స్టే విధించింది. ప్రభుత్వం హుటాహుటిన సచివాలయ భవనాలను ఖాళీ చేయించడంతో పాలనపరంగా కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. సచివాలయ శాఖల్లో కొన్నింటిని సమీపంలోని బీఆర్కేఆర్ భవన్‌కు తరలించగా మిగిలిన శాఖలను వేర్వేరు చోట్లలో ఉన్న ప్రభుత్వ భవనాలకు చేర్చారు. చెట్టుకొకరు పుట్టకొకరు అన్న చందంగా సచివాలయ శాఖల పరిస్థితి తయారైంది. -
ఆడ బిడ్డల ఆర్తనాదాలు
సాక్షి, హైదరాబాద్: నేరం..ఈ ఏడాది రాష్ట్రంపై పడగ విప్పింది. ప్రశాంత జీవనాన్ని తన ఉనికితో ఉలికిపాటుకి గురిచేస్తూ మానవత్వాన్ని మృగ్యం చేసింది. మానవ సంబంధాల విలువల్ని తుంచు తూ వికృత చేష్టలతో మనిషంటే ఓ భరోసా అన్న నమ్మకాన్ని సడలించింది. అవినీతి కేసులు, వివాహేతర సంబంధాలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు, ఎన్కౌంటర్లు, హత్యలతో అన్ని రకాల నేరాలకూ రాష్ట్రం ఆలవాలమైంది. రాజధానిలో చోటుచేసుకు న్న కొన్ని నేరాలు దేశం దృష్టిని ఆకర్షించాయి. వరుసగా వెలుగుచూసిన అత్యాచారాలు, హత్యలతో ఒక దశలో మహిళలు, చిన్నారుల రక్షణ సందేహం లో పడింది. ముఖ్యంగా ‘దిశ’కేసులో నిందితులు ఆమెను చంపిన తీరు..దేశవ్యాప్త ఉద్యమానికి దారి తీసింది. అదేరోజు వరంగల్‌లో మానస, అదేవారంలో ఆసిఫాబాద్‌లో ‘సమత’ అత్యాచారం అ నంతరం దారుణహత్యలకు గురయ్యారు. జూన్‌లో వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై లైంగికదాడి హత్య తో ప్రజలు కోపంతో రగిలిపోయారు. మరోవైపు యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హా జీపూర్లో శ్రీనివాసరెడ్డి.. ముగ్గురు మైనర్లపై అ త్యాచారం జరిపి, తన వ్యవసాయబావిలో పూడ్చి న ఘటన కలకలం రేపింది. ఈ ఏడాది జరిగిన నేరాలన్నింటినీ సింహావలోకనం చేసుకుంటే... ► కోస్టల్‌బ్యాంక్ డైరెక్టర్, ఎన్ఆర్ఐ, ప్రముఖ వ్యాపార వేత్త చిగురుపాటి జయరాం (55) జనవరి 31న హత్యకు గురయ్యారు. తెలంగాణలో హత్యచేసి మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్‌లో వదిలివేశారు. తెలంగాణకు కేసు బదిలీఅయ్యాక ప్ర ధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి, అతని అ నుచరులను అరెస్టు చేశారు. సహకరిం చిన ఇద్దరు పోలీసులపై వేటుపడింది. ► డేటా చౌర్యం కేసులో మాదాపూర్‌లోని ఐటీ గ్రీడ్ కార్యాలయాన్ని మార్చి 8న పోలీస్ లు సీజ్ చేశారు. ఈ కేసు తెలంగా ణ, ఏపీలో సంచలనం సృష్టిం చింది. రెండు తెలుగు రా ష్ట్రాల రాజకీయ పార్టీల తో ముడిపడి ఉన్న కేసు దర్యాప్తునకు ప్రభుత్వం ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ ఏర్పాటు చే సింది. దర్యాప్తు కొనసాగుతోంది. ► యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో సైకో శ్రీనివాస్ రెడ్డి ముగ్గు రు బాలికలను అపహరించి అత్యాచారం చేసి న విషయం ఏప్రిల్ 26న వెలుగుచూసింది. ఊరికి రవాణా సదుపాయం లేకపోవడంతో లిఫ్ట్ ఇస్తానని చెప్పి, బాలికలను తన వ్యవసా య బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేసి అక్కడే మృతదేహాల్ని పాతిపెట్టాడు. ► టీవీ9 యాజమాన్య బదిలీ విషయంలో పలు అడ్డంకులు సృష్టించిన కేసులో ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాశ్‌పై మే 9న పోలీసులు కేసు లు నమోదు చేశారు. టీవీ9 చానల్‌ను ఏబీసీఎల్ నుంచి అలందా మీడియాకు బదిలీ కా కుండా నటుడు శివాజీతో ప లు నకిలీ పత్రాలు సృష్టించారని రవిప్రకాశ్, శివాజీలపై కేసు నమోదైంది. ఈ కేసులో నిం దితులిద్దరూ పోలీసులకు చిక్కకుండా పరారవడం, అపుడప్పుడూ వీడియోలు విడుదల చేయడం సంచలనం రేపింది. ► హన్మకొండ కుమార్‌పల్లిలో తల్లిపక్కనే నిద్రపోతున్న 9 నెలల పసిపాపను ప్రవీణ్ అనే యువకుడు జూన్ 30న ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి, చంపేశాడు. పోలీసులు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు లో 48 రోజుల్లో నిందితుడి నేరం నిరూపిం చారు. అతనికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆపై దాన్ని హైకోర్టు జీవితఖైదుగా మార్చింది. ► కుమరంభీం జిల్లా సార్సాల అటవీ అధికారిణి అనితపై కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీటీ సీ సభ్యుడు కోనేరు కృష్ణారావు తన అనుచరులతో జూన్ 30న దాడి చేశారు. ► పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో టీఆర్ ఎస్ ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టు లు జూలై9న అపహరించి కాల్చిచంపారు. కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బెస్తకొత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ► జూలై 10న ఏసీబీ దాడుల్లో కేశంపేట తహసీల్దార్ వి.లావణ్య వద్ద ఏకంగా రూ.93 లక్షల నగదు 40 తులాల బంగారం లభించింది. ► ఎంసెట్ పేపర్ లీకేజీలో సీఐడీ పోలీసులు జూలై 16న చార్జిషీటు దాఖలు చేశారు. ► భద్రాద్రి జిల్లా గుండాలలో జూలై 31న ఎన్కౌంటర్లో న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి లింగన్న మరణించాడు. ► ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య,కుటుంబ సమస్యల కారణంగా కోడెల హైదరాబాద్‌లోని సొంతింట్లో ఆగస్టు 16వ తేదీన ఉరేసుకుని మరణించారు. ► ఈఎస్ఐలోని ఐఎంఎస్ కుంభకోణంలో 700 కోట్ల మేరకు అవతవకలు ఆరోపణల నేపథ్యంలో ఆగస్టు 29న మాజీ డైరెక్టర్ దేవికారా ణి, మాజీ జేడీ పద్మలను ఏసీబీ అరెస్టు చేసిం ది. ఇప్పటిదాకా 21 మంది అరెస్టయ్యారు. ► హయత్‌నగర్‌లో..ప్రియుడు శశికుమార్ బ్లాక్‌మెయిలింగ్‌కు తలొగ్గిన కీర్తి అనే యువతి అక్టోబరు 28న తల్లి రజితను చంపి, శవాన్ని మాయం చేసిన ఘటన వెలుగుచూసింది. ► అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని భూవివాదంలో కూర సురేశ్ నవంబరు 4న పెట్రోల్ పోసి నిప్పంటించాడు. విజయారెడ్డి అక్కడికక్కడే మరణించగా, నిందితుడు సురేశ్, డ్రైవర్ గురునాథం, అ టెండర్ చంద్రయ్య తరువాత మరణించారు. ► కాచిగూడలో హంద్రీనీవా– ఎంఎంటీఎస్ రైళ్లు కాచిగూడలో నవంబరు 11న ఎదురెదురుగా ఢీకొన్నాయి. 8 మంది గాయపడ్డారు. లోకోపైలెట్ చంద్రశేఖర్ చికిత్స పొందుతూ మరణించాడు. ► ఆసిఫాబాద్ జిల్లాలో సమతపై ముగ్గురు టేకు చెక్కల స్మగ్లర్లు నవం బరు 24న లైంగికదాడి చేసి, కత్తితో గొంతుకోసి చంపారు. దీనిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ► రాష్ట్రంలో ఒకేరోజు వెటర్నరీ వైద్యురాలు దిశ, వరంగల్‌లో డిగ్రీ విద్యార్థిని మానసలు నవం బరు 27 అపహరణకు గురై అత్యాచారం అనంతరం హత్యకు గురయ్యారు. ► దిశ కేసులో నిందితులు నలుగురు ఎన్కౌంటర్లో మరణించారు. డిసెంబరు 6న చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో నిందితు లు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీ న్, చింతకుంట చెన్నకేశవులు పోలీసులపై దాడి చేసి, తుపాకులు లాక్కున్నారు. పోలీ సుల ఎదురుకాల్పుల్లో నలుగురు హతమయ్యారు. దీనిపై సిట్ విచారణ నడుస్తోంది. -
గులాబీనామ సంవత్సరం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో వరుసగా ఆరో ఏడాది కూడా టీఆర్ఎస్ హవా కొనసాగింది. రాజకీయంగా ఆ పార్టీకి 2019 అన్ని రకాలుగా కలిసొచ్చింది. ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ను కుదేలు చేయడంతోపాటు స్థానిక సంస్థలను క్లీన్‌స్వీప్ చేసుకోవడం ద్వారా అధికార టీఆర్ఎస్ ఈ ఏడాది పూర్తిస్థాయి రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఓ ఎమ్మెల్సీ సీటు, మూడు లోక్‌సభ స్థానాల్లో విజయం మినహా రాజకీయంగా ఈ ఏడాది అన్నీ ఒడిదుడుకులే ఎదురయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రం నుంచి నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకోవడం, ఎంపీగా గెలిచిన కిషన్‌రెడ్డి ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు చేపట్టడం ఆ పార్టీలో కాస్త జోష్ నింపాయి. అధికార టీఆర్ఎస్కు మిత్రపక్షంగా ఉంటున్న ఎంఐఎంకు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కగా తెలంగాణ జన సమితి, లెఫ్ట్ పార్టీలు ఈ ఏడాది ఉనికి చాటుకునేందుకు తంటాలు పడ్డాయి. 32 జిల్లా పరిషత్‌లు గులాబీ ఖాతాలోకి... ఈ ఏడాది జనవరిలో మూడు విడతల్లో 12,732 గ్రామ పంచాయతీలు, 1.13 లక్షల వార్డులకు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ పదవులను అధికార టీఆర్ఎస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ‘కారు’ జోరు తగ్గింది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకుగాను తొమ్మిది చోట్లే టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. పార్టీ కీలక ఎంపీలైన కవిత, బోయినపల్లి వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, నగేశ్ ఓటమి పాలయ్యారు. మార్చిలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతోపాటు వరంగల్–నల్లగొండ–ఖమ్మం, కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ టీచర్ల నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ మద్దతుదారులు ఓటమిపాలయ్యారు. శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), తేరా చిన్నపరెడ్డి (నల్లగొండ) విజయం సాధించారు. ఎమ్మెల్యే కోటాలో నవీన్‌రావు శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 32 జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. 5,659 ఎంపీటీసీ స్థానాలకుగాను 3556, 534 జెడ్పీటీసీ స్థానాలకుగాను 445 చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. రెండో పర్యాయం సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ 2019లో రెండు విడతల్లో కేబినెట్‌ను విస్తరించారు. ఫిబ్రవరిలో జరిగిన తొలి విడత విస్తరణలో ఈటెల రాజేందర్, జి.జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు చోటు దక్కింది. సెప్టెంబర్‌లో జరిగిన రెండో విడత మంత్రివర్గ విస్తరణలో హరీశ్‌రావు, కేటీఆర్, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లకు అవకాశం లభించింది. అక్టోబర్ 21న జరిగిన హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలవడం ద్వారా తొలిసారిగా ఈ నియోజకవర్గం టీఆర్ఎస్ ఖాతాలో చేరింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన 13 మంది అధికారికంగా టీఆర్ఎస్లో చేరగా సీఎల్పీని విలీనం చేసుకోవడం ద్వారా కాంగ్రెస్‌ను టీఆర్ఎస్ కోలుకోలేని దెబ్బతీసింది. కుదేలవుతూ... కోలుకుంటూ కాంగ్రెస్ పయనం అధికార టీఆర్ఎస్ రాజకీయ వ్యూహాలకు కుదేలవుతూనే ఈ ఏడాది కాంగ్రెస్ పయనాన్ని కొనసాగించింది. పార్టీ నుంచి గెలిచిన 13 మంది ఎమ్మెల్యేలను చేజార్చుకొని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోవడం ఈ ఏడాది కాంగ్రెస్‌కు ఘోర పరాజయంగా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 3 ఎంపీ సీట్లతోనే సరిపెట్టుకున్న కాంగ్రెస్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 30 శాతం స్థానాల్లో గెలిచినా ఒక్క జడ్పీ పీఠాన్ని కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. ఈ ఏడాది ఆసాంతంలో కాంగ్రెస్‌కు లభించిన పెద్ద ఊరట అంటే ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి గెలుపే. గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఆయన గెలవడమే కాంగ్రెస్‌లో కొంత ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు పార్టీ కురువృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ ఈ ఏడాది మరణించడం పార్టీకి తీరని లోటుగా మారింది. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే వ్యాఖ్యలు చేసినా ఆ తర్వాత సర్దుకొని పార్టీతో కలసి పనిచేస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాటాల విషయానికి వస్తే ఎప్పటిలాగే కాంగ్రెస్ తాబేలు యాత్ర చేసింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో ఎంపీ రేవంత్‌రెడ్డి కొంత హడావుడి చేసినా ఆర్టీసీ సమ్మె, దిశ హత్య లాంటి కీలకాంశాల్లో తగిన రీతిలో స్పందించలేదనే భావన వ్యక్తమైంది. ప్రభుత్వ ఆసుపత్రులు, కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన, అక్కడక్కడా యాత్రలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నేతల్లో ఇంకా సమన్వయ లేమి కనిపిస్తోంది. హుజూర్నగర్ ఉప ఎన్నికలో ఓటమితో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ను మారుస్తారనే ప్రచారం జరిగినా 2019లో అది జరగలేదు. ఈ ఏడాది చివర్లో ఎన్నార్సీ అంశంతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్‌కు 2020లో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారనున్నాయి. పోరాటాలు చేస్తున్నారు కానీ...! గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది తాము ప్రజల్లోకి వెళ్లామని బీజేపీ అంచనా వేసుకుంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం కమలదళంలో కొత్త ఉత్సాహం నింపింది. ఇదే జోష్‌తో రాష్ట్రంలో 11 లక్షలుగా ఉన్న పార్టీ సభ్యత్వాన్ని 30 లక్షలకు పెంచుకుంది. అయితే స్థానిక నేతల మధ్య సమన్వయం, వ్యూహాల అమలులో కొంత వెనుకబడింది. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిరం లాంటి అంశాలు తమకు మేలు చేశాయన్న అంచనాలో ఆ పార్టీ నేతలు ఉన్నా ప్రజల్లోకి వెళ్లడంలో ఈ ఏడాది స్ఫూర్తిదాయక పోరాటం చేసినట్టు కనిపించలేదు. పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఈ ఏడాదిలోనే హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులవగా మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన విద్యాసాగర్‌రావు మళ్లీ పార్టీ కార్యక్రమాల్లోకి వచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఆ తరువాత ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షా సహా 80 మందికిపైగా పార్టీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించడం, టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్ చేరడం, టీ టీడీపీ నేతలు గరికపాటి రామ్మోహన్రావు, పెద్దిరెడ్డి, సురేశ్‌రెడ్డి, వీరేందర్‌గౌడ్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వంటి నేతలను చేర్చుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో కొంత పట్టు సాధించగలిగింది. అయితే ‘స్థానిక’ ఎన్నికల్లో కనీస స్థాయిలోనూ గెలవలేకపోవడంతో రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అంటున్న కమలనాథులకు కొత్త ఏడాది పద్మవ్యూహం లాగానే కనిపిస్తోంది. విస్తరణ బాటలో ఎంఐఎం... ఎంఐఎంకు ఈ ఏడాది అనుకోని అవకాశం లభించింది. టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనం కావడంతో అసెంబ్లీలో ఏడుగురు సభ్యుల బలంతో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ఈ హోదాతోనే ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మరోవైపు ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల గెలవడం ద్వారా ఎంఐఎం ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీని విస్తరించుకుంది. తెలంగాణ జన సమితి, లెఫ్ట్ పార్టీలు తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే ఈ ఏడాది పరిమితమయ్యాయి. ప్రజాసమస్యలపై తమదైన స్థాయిలో ఉద్యమాలు చేస్తూ పార్టీ కార్యకలాపాలను కొనసాగించాయి. అయితే ఈ ఏడాది టీటీడీపీ దాదాపు కనుమరుగు కావడం గమనార్హం. -
నేరం.. నిజం!
కుటుంబ కలహాలు, చిన్న చిన్న కారణాలతో హత్యలు...పరిచయస్తులే కీచకులుగా మారి అత్యాచారాలు...సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరాలు...2019లో సిటీనేర చరిత్రను పోలీసులు విడుదల చేయగా..అవాక్కయ్యే నిజాలు వెల్లడయ్యాయి. సిటీలో మొత్తం 76 హత్యలు జరిగాయి. వీటలో కుటుంబ కలహాలతో 19..చిన్న చిన్న కారణాలతో 15 చోటుచేసుకున్నాయి. అత్యాచారాల విషయానికొస్తే మొత్తం 150 కేసులు నమోదవగా...పరిచయస్తులు చేసినవే ఎక్కువగా ఉన్నాయి. పొరుగువారు చేసినవి 33 అత్యాచారాలుండగా...బంధువులు చేసినవి 18 ఉన్నాయి. ప్రేమ,పెళ్లి పేరుతో మోసం చేసిన కేసులు 89 ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే సైబర్క్రైమ్విపరీతంగా పెరిగింది. ఓటీపీ మోసాలు, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్‌తో జనం కోట్లాదిరూపాయలు నష్టపోయారు. గత ఏడాది మొత్తమ్మీద వీటి సంఖ్య 450 లోపేఉండగా..ఈ ఏడాది శుక్రవారం నాటికే 1358 నమోదయ్యాయి. ఏడాదిపూర్తయ్యే నాటికి ఇది 1500కు చేరుతుందని అధికారుల అంచనా.సైబర్‌క్రైమ్స్‌లో మొత్తం నిందితులు ఇతర రాష్ట్రాలు,దేశాలకు చెందిన వారే ఉన్నారు. సాక్షి, సిటీబ్యూరో: ప్రతి నేరానికి ఓ మూలం ఉన్నట్లే.. కారణం కూడా ఉంటుంది. అదే ఆ నేరం వెనుక ఉన్న నిజం అవుతుంది. 2019కు సంబంధించిన పోలీసులు గురువారం విడుదల చేసిన నేర గణాంకాలను పరిశీలిస్తే.. నమోదైన కేసులు, వాటి వెనుక ఉన్న వాస్తవాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. కేవలం మూడు రకాలైన నేరాలను విశ్లేషిస్తేనే అందులో అనేక ఆసక్తికరమైన కోణాలు వెలుగులోకి వచ్చాయి. పరిచయస్తులే ‘పాపాత్ములు’.. మహిళలపై జరుగుతున్న నేరాల్లో అత్యాచారం తీవ్రమైనదిగా పోలీసులు పరిగణిస్తారు. నగరంలో ఈ ఏడాది నమోదైన అత్యాచారం కేసుల్లో పరిచయస్తులే నిందితులుగా ఉన్న ఉదంతాలే అత్యధికంగా ఉన్నాయి. మొత్తం రేప్ కేసుల్లో 59.33 శాతం పెళ్ళి, ప్రేమ పేరుతో సన్నిహితంగా మెలిగి మోసం చేసినవే ఉన్నాయి. డిసెంబర్ 15 వరకు 150 కేసులు నమోదు కాగా... వీటిలో 38 శాతం పరిచయస్తుల వల్ల జరిగినవే. మొత్తమ్మీద 59.33 శాతం కేసులు ప్రేమ, పెళ్ళి వ్యవహారాలకు సంబంధించినవిగా రికార్డు అయ్యాయి. వీటిలోనూ అత్యధికులు పరిచయస్తులే ఉంటారు. 18 కేసుల్లో బంధువులు, 33 కేసుల్లో పక్కింటి వాళ్ళో, అదే ప్రాంతానికి చెందిన వారో నిందితులుగా ఉన్నారు. అపరిచితులు చేసిన ఉదంతాలకు కేసులు నాలుగు ఉన్నాయి. ‘మామూలుగానే’ మర్డర్స్... నిత్యం నమోదవుతున్న నేరాల్లో ప్రధానంగా రెండు రకాలైనవి ఉంటాయి. బాడీలీ అఫెన్స్‌గా పిలిచే హత్యలు, హత్యాయత్నాలు, దాడులు వంటివి మొదటిదైతే... ప్రాపర్టీ అఫెన్సుల కేటగిరీలోకి వచ్చే చోరీ, దోపిడీ తదితరాలు రెండోవి. బాడీలీ అఫెన్సులకు... అందునా హత్య కేసులను పోలీసులు చాలా ప్రాధాన్యం ఇస్తారు. వీటి దర్యాప్తు కోసం అవసరమైతే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతారు. సాధారణంగా ఓ వ్యక్తి/వ్యక్తులు మరొకరిని చంపడానికి బలమైన కారణాలు, ఆర్థిక లావాదేవీలే ఉంటాయని భావిస్తాం. సిటీలో నమోదైన 76 హత్య కేసుల్లో అత్యధికంగా 19 కేసులు కేవలం కుటుంబ కలహాల వల్లే జరిగాయి. 15 కేసులతో చిరు వివాదాలు ఆ తర్వాత స్థానంలో నిలిచాయి. మిగిలినవి ఇతర కారణాల వల్ల జరిగాయి. సిటీలో ఎక్కడా కమ్యూనల్, ఫ్యాక్షన్ , ఎలక్షన్, టెర్రరిజం, మావోయిజం సంబంధిత హత్యలు నమోదు కాలేదు. సైబర్ క్రైమ్‌లో ‘బయటివారి హవా’... సిటీలో ఈ ఏడాది సైబర్ నేరాల నమోదు గణనీయంగా పెరిగింది. గత ఏడాది మొత్తమ్మీద వీటి సంఖ్య 450 లోపే ఉండగా..శుక్రవారం నాటికే 1358 నమోదయ్యాయి. ఏడాది పూర్తయ్యే నాటికి ఇది 1500కు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో 70 శాతం పైగా ‘బయటివారి’ కారణంగా జరిగినవే. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో నిత్యం నమోదవుతున్న కేసుల్లో రెండు కేటగిరీలకు చెందినవి ఎక్కువగా ఉంటున్నాయి. జమ్‌తార కేంద్రంగా జరిగే ఓటీపీ ఫ్రాడ్స్‌తో పాటు భరత్పూర్ నుంచి చోటు చేసుకునే ఓఎల్ఎక్స్ మోసాలు. ఈ రెండు ప్రాంతాలు ఉత్తరాదిలోనే ఉన్నాయి. మొదటి దాంట్లో బ్యాంకు అధికారుల మాదిరిగా ఫోన్లు చేసే నేరగాళ్లు ఓటీపీలు తెలుసుకుని అందినకాడికి స్వాహా చేస్తున్నారు. రెండో తరహా నేరాల్లో ఓఎల్ఎక్స్ కేంద్రంగా నకిలీ యాడ్స్ పెడుతున్న నేరగాళ్లు అడ్వాన్స్‌ల పేరుతో కొల్లగొడుతున్నారు. ఈ రెండు తరహాలకు చెందిన కేసులే 600 వరకు రిజిస్టర్ అయ్యాయి. ఉద్యోగాలు, ఇన్సూరెన్స్ పాలసీలపై బోనస్‌లు, వివాహాల పేరుతో జరిగే ఫ్రాడ్స్ మరో 400 వరకు నమోదయ్యాయి. వీటిలోనూ ఉత్తరాదికి చెందిన వాళ్ళే నిందితులుగా ఉంటున్నారు. 23 రాష్ట్రాలకు ప్రత్యేక టీమ్స్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఇప్పటి వరకు 1358 కేసులు నమోదు కాగా.. 207 కేసులు కొలిక్కి వచ్చాయి. ప్రత్యేక బృందాలు దేశంలోని 23 రాష్ట్రాలకు వెళ్లి 341 మందిని అరెస్టు చేసి తీసుకువచ్చాయి. – అవినాష్ మహంతి,సంయుక్త కమిషనర్ -
కారు..ఠారు!
సాక్షి, సిటీబ్యూరో: మద్యం మత్తులో మితిమీరిన వేగంతో కారు నడుపుకుంటూ వచ్చిన సందీప్‌రెడ్డి మియాపూర్‌లోని కళ్యాణ్ గార్డెన్ సమీపంలో ప్యాసింజర్ల కోసం వేచి చూస్తున్న ఆటోడ్రైవర్‌ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఆటోడ్రైవర్ కృష్ణ అక్కడిక్కడే మృతి చెందాడు. ♦ అదుపు చేయలేని వేగంతో కారులో దూసుకువచ్చిన అబ్దుల్ వాహెబ్ బంజారాహిల్స్ పరిధిలో రోడ్డు పక్కన ఆగిఉన్న క్యాబ్‌ను వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఫలితంగా క్యాబ్‌లో నిద్రిస్తున్న డ్రైవర్ వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు. ♦ ‘దిశ’ కేసులో నాలుగో నిందితుడు చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య బైక్‌పై వెళ్తుండగా జెక్లెర్ గ్రామ సమీపంలో ఇన్నోవా కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని పోలీసులు చికిత్స నిమిత్తం నగరంలోని ఆస్పత్రికి తరలించారు. ♦ గురువారం చోటు చేసుకున్న కారు ప్రమాదాలకు మచ్చుతునకలివీ. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఈ వాహనాలు ఠారెత్తించేస్తున్నాయి. ఇలా వరుస ఘటనలు చోటు చేసుకోవడం వెనుక అనేక కారణాలు ఉంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఏటా నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో తేలికపాటి వాహనాలుగా పిలిచే కార్ల వాటా పది శాతానికి పైగా ఉంటోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో 33.9 శాతం కార్లు తదితర తేలికపాటి వాహనాల కారణంగా జరిగినవేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మద్యం నుంచి.. నిర్లక్ష్యం వరకు... ఈ తరహా వాహనాలకు సంబంధించిన ప్రమాదాల్లో అత్యంత సంచలనాత్మక ఘటనలూ ఉన్నాయి. బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని పంజగుట్ట శ్మశానవాటిక వద్ద జరిగిన చిన్నారి రమ్య ఉదంతం, నారాయణగూడ ఫ్లైఓవర్ పై పట్టపగలు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న వైనం ఇందుకు నిదర్శనాలు. ఇలాంటి ప్రమాదాలు జరగడానికి అనేక కారణాలు ఉంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో పాటు నిర్లక్ష్యంగా వాహనం నడపడం కూడా ఓ కారణంగా మారుతోందని అధికారులు పేర్కొన్నారు. వీటికితోడు నగర రహదారుల్లోని ఇంజినీరింగ్ లోపాలు, డ్రైవర్ల నిద్రమత్తు సైతం ప్రమాద హేతువులుగా మారుతున్నాయి. సిటీలో వంపులు లేకుండా ఉన్న రహదారుల్ని వేళ్లపై లెక్కపెట్టొచ్చు. అందులోనూ అనేక బాటిల్‌నెక్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. డ్రైవింగ్ అంటే ‘ఆ మూడే’ అని... ఇటీవల కాలంలో నగరంలో కార్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రజల జీవన ప్రమాణాలతో పాటు సెకండ్ హ్యాండ్ మార్కెట్ పెరగడం, ఫైనాన్సింగ్ విధానాలు తదితర కారణాల నేపథ్యంలో కార్లు ఖరీదు చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. వీరంతా ప్రాథమికంగా డ్రైవింగ్ స్కూళ్లలోనో, పరిచయస్తుల వద్దో డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. ఆ సమయంలో వీరి దృష్టి ప్రధానంగా స్టీరింగ్, క్లచ్, బ్రేక్‌ల పైనే ఉంటోంది. ఈ మూడింటినీ నిర్వహించగలిగితే ఎక్కడైనా వాహనం నడపవచ్చనని భావిస్తుంటారు. అయితే హఠాత్పరిణామాలు, మార్జిన్స్, ఓవర్ టేకింగ్ తదితర సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీరికి పూర్తి స్థాయిలో అవగాహన ఉండటం లేదు. దీంతో ‘ఆ మూడు’ నేర్చుకుని రోడ్ల పైకి వస్తున్న వాహనచోదకులు అనేక సందర్భాల్లో ప్రమాదాలకు లోనుకావడంతో పాటు కారకులుగానూ మారుతున్నారు. లైసెన్స్ జారీ విధానాల్లోనూ లోపాలెన్నో... దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ డ్రైవింగ్ లైసెన్సుల జారీ వ్యవహారం లోపభూయిష్టంగా ఉంది. ఎల్ఎల్ఆర్ జారీ చేసేందుకు ముందు నిర్వహించే కంప్యూటర్ పరీక్ష తూతూ మంత్రంగా సాగుతోంది. దీని తర్వాత ట్రాక్ టెస్ట్ నిర్వహిస్తారు. అయితే ఇప్పటికీ ఏ కేంద్రంలోనూ పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాక్ టెస్ట్ చేసే సామర్థ్యం లేదు. మాన్యువల్‌గా కేవలం కొన్ని అంశాలను మాత్రమే తనిఖీ చేస్తున్నారు. దీంతో డ్రైవింగ్‌పై పూర్తి పట్టులేని వారికీ లైసెన్సులు ఇచ్చేస్తున్నారు. వీరిలో కొందరు క్యాబ్ డ్రైవర్లు కూడా ఉంటున్నారు. ఇలాంటి డ్రైవర్ల కారణంగా తరచు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్ని పూర్తిగా మార్చి, లోపాలను సరి చేయడంతో పాటు నిబంధనలను కఠినతరం చేస్తేనే ప్రమాదాలను నిరోధించే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది గణాంకాలిలా మొత్తం ప్రమాదాలు: 2377 కార్ల కారణంగా: 806 (33.9 శాతం) మొత్తం క్షతగాత్రులు: 2526 కారు ప్రమాదాల్లో: 935 (37.01 శాతం) మొత్తం మృతులు: 261 కారు ప్రమాదాల్లో: 49 (18.77 శాతం) -
గ్రేట్ ఇండియన్ క్రికెట్ సిరీస్
భారత క్రికెట్‌కు 2019 ‘గుడ్’గా సాగి ‘బైబై’ చెప్పింది. ఆటలో మేటి జట్టుగా టీమిండియా దూసుకెళ్లగా... వ్యక్తిగతంగానూ క్రికెటర్లు ఎన్నో మైలురాళ్లను అందుకున్నారు. కొన్ని సిరీస్‌లలో అయితే ఒకరిని మించి ఒకరు దంచేశారు. గాయాల మరకలు, కీలక ఆటగాళ్ల లోటు ఏ సిరీస్‌లోనూ కనబడలేదంటే అతిశయోక్తి కాదు. బ్యాటింగ్ ఇండియాలో బౌలింగ్ గ్రేట్ అయ్యింది ఈ ఏడాదే. కోహ్లి ‘టన్’లకొద్దీ పరుగులు, రోహిత్ ప్రపంచకప్ శతకాలు, కొన్ని మచ్చుతునకలైతే... టెస్టుల్లో మయాంక్, వన్డేల్లో రాహుల్ రెగ్యులర్ ఓపెనర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఎదిగారు. 2019లో కోహ్లి సేన జోరు టెస్టుల్లో అయితే భారత్‌కు ఓటమన్నదే లేదు. రెగ్యులర్ ఓపెనర్ ధావన్ లేని భారత్‌కు మయాంక్ అగర్వాల్ రూపంలో మరో నిలకడైన బ్యాట్స్‌మన్ జతయ్యాడు. పరిమిత ఓవర్ల క్రికెటర్ రోహిత్‌కు ఐదురోజుల ఆట కలిసొచ్చింది కూడా ఈ ఏడాదే. ఆ్రస్టేలియా పర్యటనలోని ఆఖరి టెస్టును డ్రా చేసుకున్న భారత్... ఆ తర్వాత ఆడితే గెలుపు తప్ప మరో ఫలితం ఎరుగదు. విండీస్ దీవుల్లో ఆడిన రెండు టెస్టుల్ని భారీతేడాతో గెలిచింది. అక్టోబర్‌లో ఇక్కడికొచ్చిన దక్షిణాఫ్రికాను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. సఫారీ జట్టుపై రెండు టెస్టులైతే ఇన్నింగ్స్‌తేడాతో గెలుపొందడం విశేషం. ఓపెనర్లుగా మయాంక్, రోహిత్ సెంచరీలు, డబుల్ సెంచరీలతో మెరిశారు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ (2–0)లో భారత్‌కు రెండో ఇన్నింగ్స్ ఆడే అవకాశమే రాలేదు. రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ దెబ్బకు బంగ్లా కునారిల్లింది. వరల్డ్ చాంపియన్íÙప్లో భాగంగా ఆడిన మూడు సిరీస్‌లూ గెలిచి అందుబాటులో ఉన్న 360 పాయింట్లను తమ ఖాతాలో వేసుకుంది. ఇంటా గెలిచి... రచ్చా గెలిచి... ఏడాది ప్రత్యేకించి వన్డేల్లో టీమిండియా గర్జించింది. ఎక్కడికెళ్లినా ఎదురేలేని జట్టుగా తిరిగొచి్చంది. ఇంటా బయటా కలిపి ఐదు ద్వైపాక్షిక సిరీస్‌లాడిన భారత్ నాలుగింటిని వశం చేసుకుంది. ప్రపంచకప్‌లో 10 మ్యాచ్‌ల్లో ఒకటి రద్దయితే ఏడు గెలిచింది. ఓవరాల్‌గా ఏ జట్టుకూ సాధ్యం కానీ 70 శాతం విజయాలు నమోదు చేసింది. మొదట ఆ్రస్టేలియా గడ్డపై కంగారూ పెట్టించి మరీ వన్డే క్రికెట్లో భారత్ విజయ శాసనానికి శ్రీకారం చుట్టింది. అక్కడ మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకొని కొత్త ఏడాదికి గెలుపు రుచిని చూపించింది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ధోని ఆట అదరహో! తొలుత ఓడిన మ్యాచ్ సహా... వరుస వన్డేల్లో మిస్టర్‌కూల్ (51, 55 నాటౌట్, 87 నాటౌట్) అర్ధసెంచరీలతో అదరగొట్టాడు. ఆ వెంటే న్యూజిలాండ్‌కెళ్లి చితగ్గొట్టింది. ఐదు వన్డేల్లో ఒకే ఒక్క మ్యాన్ మినహా ప్రతి పోరులో పరాక్రమం చూపింది. 4–1తో కివీరెక్కలు విరిచింది. ఈ సిరీస్‌లో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు చూపించిన తెగువ క్రికెట్ విశ్లేషకుల్ని ఆకర్షించింది. ముఖ్యంగా ఆఖరి వన్డేలో రోహిత్, ధావన్, ధోనిలాంటి హేమాహేమీలు సైతం విలవిలలాడిన చోట మన రాయుడు (113 బంతుల్లో 90; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగాడు. 18 పరుగులకే 4 వికెట్లను కోల్పోయిన భారత్‌కు పెద్దదిక్కయ్యాడు. మొత్తానికి విజయగర్వంతో ఉన్న కోహ్లి సేనకు సొంతగడ్డపై ఆసీస్ చేతిలో అనూహ్య పరాజయం ఎదురైంది. ఈ యేడు భారత్ కోల్పోయిన సిరీస్ (2–3తో) ఇదొక్కటే! అనంతరం వరల్డ్‌కప్ ముగిశాక కరీబియన్ దీవులకెళ్లి మళ్లీ జయకేతనం ఎగరేసింది. అక్కడ 3వన్డేల సిరీస్‌లో తొలి వన్డే రద్దవగా తర్వాత రెండు వన్డేల్ని సునాయాసంగా గెలుచుకుంది. మళ్లీ ఇటీవల ఇక్కడికొచ్చాక కూడా వెస్టిండీస్‌ను విడిచిపెట్టలేదు. భారీస్కోర్లు చేసిమరీ 2–1తో నెగ్గింది. అయితే విండీస్ ఓడినా ఆకట్టుకుంది. ఈ క్యాలెండర్‌ను కోహ్లి రోహిత్‌లు అసాధారణ ఫామ్‌తో ముగించారు. రోహిత్ 28 మ్యాచ్‌ల్లో 57.30 సగటుతో 1490 పరుగులు చేశాడు. 7 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు బాదాడు. 26 వన్డేలాడిన కెపె్టన్ 59.86 సగటుతో 1377 పరుగులు చేశాడు. 5 సెంచరీలు, 7 ఫిఫ్టీలు కొట్టాడు. మెరుపుల్లో వెనుకబడింది పొట్టి ఫార్మాట్లో మాత్రం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. న్యూజిలాండ్ పర్యటనలో ఆతిథ్య జట్టు చేతిలో 2–1తో ఓడిన టీమిండియా... స్వదేశంలో ఆసీస్ చేతిలో 2–0తో కంగుతింది. గట్టి జట్లపై మన మెరుపులు మెరవలేదు. అయితే విండీస్ పర్యటనలో భాగంగా అమెరికాలో జరిగిన మ్యాచ్‌ల్లో మాత్రం కోహ్లి సేన చెలరేగింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. సొంతగడ్డపై సఫారీతో జరిగిన మూడు మ్యాచ్‌ల పొట్టి ఆటను 1–1తో సమం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ రద్దయింది. తర్వాత బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లతో సిరీస్‌లను 2–1తో గెలిచినప్పటికీ ఒక్కో మ్యాచ్‌లో ఎదురుదెబ్బలు తిన్నది. సెమీస్‌లో చెదిరిన ‘ప్రపంచ’కల కోహ్లిసేన ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగింది. విదేశీ దిగ్గజాలు, వ్యాఖ్యాతలు సైతం కప్ భారత్‌దే అని జోస్యం చెప్పారు. అయితే భారత్ కూడా ఫేవరెట్ హోదాకు సెమీస్ దాకా న్యాయం చేసింది. 9 లీగ్ మ్యాచ్‌లకు గాను ఒక్క ఆతిథ్య జట్టు చేతిలోనే ఓడింది. ఒక వన్డే రద్దయింది. ఆసీస్, దక్షిణాఫ్రికాలాంటి మేటి జట్లను అవలీలగా మట్టికరిపించి... లీగ్ టాపర్‌గా నాకౌట్ బరిలో దిగిన టీమిండియాకు ఊహించని విధంగా న్యూజిలాండ్ చేతిలో చుక్కెదురైంది. ఈ టోరీ్నలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఐదు శతకాలతో రికార్డులకెక్కాడు. -
కొత్త శిఖరాలకు...
ఒకప్పుడు ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనడమే ఘనతగా భావించే భారత క్రీడాకారులు ఇప్పుడు ఏకంగా పతకాలు కొల్లగొడుతున్నారు. క్రీడల్లో అగ్రరాజ్యాల ఆటగాళ్లకు దీటుగా తమ ప్రదర్శన ఇస్తున్నారు. ఆశల పల్లకీని మోస్తూ అసలు సమరంలోనూ ఔరా అనిపిస్తున్నారు. విశ్వ వేదికపై భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది భారత క్రీడారంగం కొత్త శిఖరాలకు చేరింది. బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజం పీవీ సింధు విశ్వవిజేతగా అవతరించి గతంలో ఏ భారత షట్లర్కూ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుంది. బాక్సింగ్‌లో అమిత్ పంఘాల్, మనీశ్ కౌశిక్ రజత, కాంస్య పతకాలు గెలిచి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఒకేసారి భారత్‌కు రెండు పతకాలు అందించారు. షట్లర్లు, బాక్సర్లకు తోడుగా షూటర్లు, రెజ్లర్లు, ఆర్చర్లు కూడా అత్యున్నత వేదికపై అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఈ సంవత్సరం అదరగొట్టిన భారత క్రీడాకారులు వచ్చే ఏడాది విశ్వ క్రీడా సంరంభం టోక్యో లింపిక్స్లోనూ తమ అది్వతీయ విజయ విన్యాసాలను పునరావృతం చేయాలని ఆకాంక్షిద్దాం... ఆశీర్వదిద్దాం..! సాక్షి క్రీడావిభాగం విజయాల బాటలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ... తమకంటే మెరుగైన ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ... ఈ ఏడాది భారత క్రీడాకారుల ప్రస్థానం సాగింది. ఈ క్రమంలో మనోళ్లు కొత్త రికార్డులు సృష్టించారు. భవిష్యత్‌పై కొత్త ఆశలు రేకెత్తించారు. మెరుపుల్లేని టెన్నిస్ రాకెట్... ఈ సంవత్సరం భారత టెన్నిస్‌కు గొప్ప ఫలితాలేవీ రాలేదు. పురుషుల సింగిల్స్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించినా... ఒక్క దాంట్లోనూ తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. యూఎస్ ఓపెన్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌తో భారత యువతార సుమీత్ నాగల్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్ ఆడాడు. ఫెడరర్‌పై తొలి సెట్ గెలిచిన సుమీత్ ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు కోల్పోయి ఓడిపోయాడు. డబుల్స్‌లో దివిజ్ శరణ్ రెండు ఏటీపీ టోర్నీ టైటిల్స్ (పుణే ఓపెన్, సెయిట్ పీటర్స్బర్గ్ ఓపెన్) సాధించగా... రోహన్ బోపన్న (పుణే ఓపెన్) ఒక టైటిల్ గెలిచాడు. భారత దిగ్గజం, 46 ఏళ్ల లియాండర్ పేస్ 19 ఏళ్ల తర్వాత ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్–100 నుంచి బయటకు వచ్చాడు. తటస్థ వేదిక కజకిస్తాన్‌లో పాకిస్తాన్‌తో జరిగిన డేవిస్ కప్ ఆసియా ఓసియానియా మ్యాచ్‌లో భారత్ 4–0తో గెలిచి వచ్చే ఏడాది వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత సాధించింది. ‘పట్టు’ పెరిగింది... ఈ ఏడాది రెజ్లింగ్‌లో భారత్‌కు మంచి ఫలితాలు లభించాయి. కజకిస్తాన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు ఏకంగా ఐదు పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో బజరంగ్ పూనియా (65 కేజీలు), రవి దహియా (57 కేజీలు), రాహుల్ అవారే (61 కేజీలు) కాంస్యాలు గెలుపొందగా... దీపక్ పూనియా (86 కేజీలు) రజతం సాధించాడు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో వినేశ్ ఫొగాట్ (53 కేజీలు) కాంస్య పతకం దక్కించుకుంది. ప్రపంచ జూనియర్ చాంపియన్íÙప్లో దీపక్ పూనియా (86 కేజీలు) స్వర్ణం నెగ్గి 18 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్‌లోని ఓ విభాగంలో భారత్‌కు పసిడి పతకం అందించిన రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. ఈ సంవత్సరం ఉత్తమ ప్రపంచ జూనియర్ రెజ్లర్‌గా కూడా దీపక్ పూనియా ఎంపిక కావడం విశేషం. సస్పెన్షన్ ఉన్నా... భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) అంతర్గత రాజకీయాల కారణంగా ప్రపంచ ఆర్చరీ సంఘం భారత్‌పై సస్పెన్షన్ విధించింది. దాంతో భారత ఆర్చర్లు భారత పతాకం కింద కాకుండా ప్రపంచ ఆర్చరీ సంఘం పతాకంపై పోటీ పడాల్సి వచి్చంది. జూన్‌లో నెదర్లాండ్స్‌లో జరిగిన ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రాయ్ బృందం రికర్వ్ టీమ్ విభాగంలో రజతం నెగ్గడంతోపాటు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇదే ఈవెంట్ కాంపౌండ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించింది. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా చాంపియన్íÙప్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ జంట కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణం సొంతం చేసుకుంది. ఇదే ఈవెంట్లో దీపిక కుమారి మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను సంపాదించింది. జగజ్జేత... గత పదేళ్లుగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో తమదైన ముద్ర వేస్తున్న భారత షట్లర్లు ఈసారి అద్భుతమే చేశారు. పూసర్ల వెంకట (పీవీ) సింధు రూపంలో భారత బ్యాడ్మింటన్‌కు తొలిసారి ప్రపంచ చాంపియన్ లభించింది. ఆగస్టులో స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధు మహిళల సింగిల్స్ విభాగంలో విశ్వవిజేతగా నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ఇక పురుషుల సింగిల్స్‌లో మరో తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ప్రకాశ్ పదుకొనే (1983లో) తర్వాత ప్రపంచ చాంపియన్íÙప్ పురుషుల సింగిల్స్‌లో కాంస్యం గెలిచిన భారత క్రీడాకారుడిగా సాయిప్రణీత్ ఘనత వహించాడు. వీరిద్దరి ప్రతిభ కారణంగా 42 ఏళ్ల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు తొలిసారి మహిళల, పురుషుల సింగిల్స్ విభాగాల్లో పతకాలు లభించాయి. ప్రపంచ చాంపియన్íÙప్లో ప్రదర్శనను మినహాయిస్తే వరల్డ్ టూర్ సూపర్ టోర్నమెంట్లలో ఈసారి భారత అగ్రశ్రేణి క్రీడాకారులెవరూ ఆకట్టుకోలేకపోయారు. పురుషుల డబుల్స్ విభాగంలో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట థాయ్‌లాండ్ ఓపెన్‌లో టైటిల్ సాధించి మేటి జోడీకి ఉండాల్సిన లక్షణాలు తమలో ఉన్నాయని చాటిచెప్పింది. సీజన్ చివర్లో యువతార లక్ష్య సేన్ ఐదు సింగిల్స్ టైటిల్స్ సాధించి ఊరటనిచ్చాడు. ఏడాది ఆరంభంలో జరిగిన ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో బెంగళూరు రాప్టర్స్ జట్టు టైటిల్ దక్కించుకుంది. ఫైనల్లో బెంగళూరు 4–3తో ముంబై రాకెట్స్‌పై గెలిచింది. మరింత ‘ఎత్తు’కు... భారత చెస్‌కు ఈ ఏడాది కలిసొచ్చింది. ఈ సంవత్సరం ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా పొందారు. ఈ జాబితాలో విశాఖ్ (తమిళనాడు), గుకేశ్ (తమిళనాడు), ఇనియన్ (తమిళనాడు), స్వయమ్స్ మిశ్రా (ఒడిశా), గిరిశ్ కౌశిక్ (కర్ణాటక), ప్రీతూ గుప్తా (ఢిల్లీ) ఉన్నారు. 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయస్సులో డి.గుకేశ్ గ్రాండ్‌మాస్టర్ హోదా పొంది భారత్ తరఫున ఈ ఘనత సాధించిన పిన్న వయసు్కడిగా... ప్రపంచంలో రెండో పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. 2002లో సెర్గీ కర్యాకిన్ (రష్యా) 12 ఏళ్ల 10 నెలల వయస్సులో జీఎం హోదా సాధించాడు. ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి టూర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి రష్యా గ్రాండ్‌ప్రిలో టైటిల్ సాధించి... మొనాకో గ్రాండ్‌ప్రిలో రన్నరప్‌గా నిలిచింది. ‘పంచ్’ అదిరింది... బాక్సింగ్‌లోనూ ఈ సంవత్సరం భారత క్రీడాకారులు అదరగొట్టారు. రష్యాలో జరిగిన పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్íÙప్లో అమిత్ పంఘాల్ (52 కేజీలు) రజతం సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బాక్సర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. మనీశ్ కౌశిక్ (63 కేజీలు) కాంస్యం గెలవడంతో ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్‌కు తొలిసారి ఒకేసారి రెండు పతకాలు లభించాయి. సీనియర్ మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగు పతకాలు దక్కాయి. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు)తోపాటు జమునా బోరో (54 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు) కాంస్యాలు సాధించగా... మంజు రాణి (48 కేజీలు) రజత పతకం గెల్చుకుంది. సూపర్ ‘గురి’... షూటింగ్లో మనోళ్లు గురి చూసి పతకాల పంట పండించారు. ఫిబ్రవరిలో న్యూఢిల్లీ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అపూర్వీ చండేలా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో... సౌరభ్ చౌధరీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ప్రపంచ రికార్డులు సృష్టించి పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో సౌరభ్–మను భాకర్ జోడీ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఏప్రిల్‌లో చైనాలో జరిగిన రెండో ప్రపంచకప్ టోర్నీలోనూ భారత షూటర్లు మెరిశారు. మూడు స్వర్ణాలు, ఒక రజతం సాధించి ‘టాప్’ ర్యాంక్‌ను సంపాదించారు. ఆసియా చాంపియన్íÙప్లోనూ భారత షూటర్లు అదుర్స్ అనిపించారు. ఓవరాల్‌గా ఈసారి భారత్ నుంచి అత్యధికంగా 15 మంది షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. చలాకీ... హాకీ సొంతగడ్డపై జరిగిన టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో తమ ప్రత్యర్థులను ఓడించిన భారత పురుషుల, మహిళల జట్లు ఒలింపిక్ బెర్త్‌లను సంపాదించాయి. క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో రష్యాపై భారత పురుషుల జట్టు... అమెరికాపై భారత మహిళల జట్టు గెలుపొందాయి. అంతకుముందు సీజన్ ఆరంభంలో భారత పురుషుల జట్టు అజ్లాన్ షా హాకీ టోరీ్నలో రన్నరప్‌గా నిలిచింది. అదే మందగమనం... ‘ఆసియా’ స్థాయి మినహాయిస్తే అంతర్జాతీయంగా భారత అథ్లెట్స్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు తెచ్చే సత్తా ఉన్న అథ్లెట్స్‌గా నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో), హిమ దాస్ (మహిళల 400 మీటర్లు)లపై భారీ ఆశలు పెట్టుకున్నా వారిద్దరూ గాయాల బారిన పడ్డారు. సెపె్టంబర్లో దోహాలో జరిగిన ప్రపంచ చాంపియన్íÙప్‌కు దూరమయ్యారు. ఇటలీలో జూలైలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో ద్యుతీ చంద్ మహిళల 100 మీటర్ల విభాగంలో స్వర్ణం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. అయితే ప్రపంచ చాంపియన్íÙప్లో ద్యుతీ చంద్ విఫలమైంది. ఆమె హీట్స్ దాటి ముందుకెళ్లలేకపోయింది. ఇప్పటివరకు టోక్యో ఒలింపిక్స్ అర్హత సమయాన్ని (11.15 సెకన్లు) ఆమె అందుకోలేకపోయింది. దీటుగా... టీటీ... టేబుల్ టెన్నిస్‌లో భారత స్టార్ సత్యన్ జ్ఞానశేఖరన్ అద్భుత పురోగతి సాధించాడు. ఈ ఏడాది అతను ప్రపంచ టాప్–20 ర్యాంకింగ్స్‌లోని పలువురు ఆటగాళ్లను ఓడించాడు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ 24వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్ తరఫున పురుషుల సింగిల్స్ ఆటగాడు ఐటీటీఎఫ్ టాప్–25 ర్యాంకింగ్స్‌లో రావడం ఇదే ప్రథమం. సత్యన్, శరత్ కమల్, హర్మీత్ దేశాయ్‌లతో కూడిన భారత జట్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా ఎనిమిదో ర్యాంక్‌కు చేరుకుంది.