ఈ ఏడాది టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగించింది. ప్రధానంగా టెస్టుల్లో సత్తాను చాటుతూ దూసుకుపోయింది. ఐసీసీ టెస్టు చాంపియన్‌లో భాగంగా ఈ ఏడాది(2019) పలు సిరీస్‌లను ఆడిన టీమిండియా ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోలేదు. అసలు ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి చవిచూడలేదు. టెస్టు చాంపియన్ కోసం ద్వైపాక్షిక సిరీస్‌లు ఖరారైన తర్వాత ఈ ఏడాది జూలై-ఆగస్టు నెలల్లో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. అక్కడ కరీబియన్లను క్లీన్‌స్వీప్ చేసింది. తొలుతు రెండు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్..ఆపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. అదే ఊపును రెండు టెస్టుల సిరీస్‌లో కూడా కొనసాగించింది.
ఫలితంగా ఆ రెండు టెస్టుల్లో విజయం సాధించి 120 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఇది భారత్‌కు తొలి అడుగు. అటు తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో సఫారీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వని టీమిండియా..హ్యాట్రిక్ విజయాలతో దుమ్ములేపింది. తొలి టెస్టును 203 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. రెండో టెస్టులో ఇన్నింగ్స్ 137 పరుగులతో విజయం సాధించగా, మూడో టెస్టును ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇది మూడు టెస్టుల సిరీస్ కాబట్టి మ్యాచ్‌కు 40 పాయింట్లు చొప్పున భారత్ మరో 120 పాయింట్లను సాధించింది. అటు తర్వాత నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో భాగంగా మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-1 గెలవగా, రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ రెండు టెస్టులను కూడా భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది.
ఇండోర్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో గెలవగా, కోల్‌కతాలో జరిగిన డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్టులో ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది రెండు టెస్టులో సిరీస్ కాబట్టి మ్యాచ్‌కు 60 పాయింట్ల చొప్పున 120 పాయింట్లను దక్కించుకుంది. దాంతో ఓవరాల్‌గా 360 పాయింట్లతో టీమిండియా టాప్‌లో కొనసాగుతోంది. టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా.. టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలోనూ ప్రథమ స్థానంలో ఉండటం మన పటిష్టమైన బలగానికి అద్దం పడుతోంది. ఐసీసీ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత స్థానంలో ఆసీస్ ఉంది. ఆస్ట్రేలియా ప్రస్తుతం 216 పాయింట్లతో ఉంది. ఇప్పటివరకూ ఆసీస్ 8 మ్యాచ్‌లు ఆడి ఐదు గెలుపొందగా, రెండింట ఓటమి పాలైంది. ఒకటి డ్రాగా ముగిసింది.ఆసీస్ తర్వాత స్థానంలో శ్రీలంక 80 పాయింట్లతో ఉంది. 60 పాయింట్లతో కివీస్ నాల్గో స్థానంలోనూ, 56 పాయింట్లతో ఇంగ్లండ్ ఐదో స్థానంలో ఉన్నాయి.
టెస్టు చరిత్రలో తొలిసారి..
వరుసగా నాలుగు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాల్ని సాధించడం ద్వారా టీమిండియా నయా రికార్డును నెలకొల్పింది. టెస్టు చరిత్రలో వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌లో సాధించడం ఇదే తొలిసారి. దక్షిణాఫ్రికా చివరి రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాలు సాధించగా, బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టులను కూడా ఇన్నింగ్స్ తేడాతోనే భారత్ గెలుచుకుంది. ఫలితంగా వరుసగా నాలుగు మ్యాచ్‌లను ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన తొలి జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది. అదే సమయంలో ఆ ఘనత సాధించిన కెప్టెన్‌గా కూడా విరాట్ కోహ్లి రికార్డు నమోదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment