కొన్ని పాటలు వింటుంటే మనల్ని మనమే మైమరిచిపోతాం.. తెలీకుండానే తల, చేతులు ఆడిస్తుంటాం.. లైన్ తెలిస్తే బాత్రూం సింగర్ కంటే మెరుగ్గా పాట కూడా పాడేస్తాం. ఇక ఈ ఏడాది ఎన్నో పాటలు ఓ ప్రవాహంలా వస్తే చాలా పాటలు ఒడ్డుకు నిలబడి విజయాన్ని అందుకున్నాయి. కొన్ని ప్రేమ గీతాలను ఆలపిస్తే, మరికొన్ని తీన్మార్ స్టెప్పులతో ఊరమాస్ అనిపించాయి. అలా 2019 మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. మరి ఈ ఏడాది టాప్ టెన్ తెలుగు పాటలు ఏంటో పాడేద్దాం...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తోన్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఇందులోని ప్రతీ పాట బ్లాక్‌బస్టర్ హిట్‌గా దూసుకుపోతూ రికార్డులు సృష్టిస్తోంది. సామజవరగమన.. నిను చూసి ఆగగలనా అనే పాట యూట్యూబ్‌లో ఆగకుండా దూసుకుపోతోంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు తమన్ సంగీతమందించగా సీతారామశాస్త్రి లిరిక్స్ అందించాడు.
బాహుబలి తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ భారీ బడ్జెట్‌తో ‘సాహో’ చేశాడు. ఇది ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో కొన్ని పాటలే జనాలకు క్లిక్ అయ్యాయి. కానీ ఒక పాటకు మాత్రం జనాలు విపరీతంగా ఆకర్షితులయ్యారు. అదే ‘ఆగదిక సయ్యా సైకో..’’ ఈ పాట క్యాచీగా ఉండటంతో పాటు మిక్స్‌డ్ భాషలు ఉపయోగించి అందరి నోట పాడించేలా చేశారు గేయ రచయిత శ్రీజో.
స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఇందులో ఓ సైరా అనే పాట ఆయన గొప్పతనాన్ని తెలుపుతూ సాగుతుంది. ఈ సినిమాలో ఇది ప్రధాన పాట కాగా ఇది జనంలో మార్మోగిపోయింది.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన మహర్షి సినిమా అంచనాలను దాటి వసూళ్లను సాధించింది. మహర్షి పేరుకు తగ్గట్టుగా పాట ‘ఇదే కదా ఇదే కదా..’ పాట ఉత్తేజాన్ని నింపింది. మహేశ్‌బాబు ‘నేనొక్కడినే, శ్రీమంతుడు, భరత్ అనే నేను’ సినిమాలకు దేవీశ్రీప్రసాద్ సూపర్ హిట్ సంగీతాన్ని అందించారు. ‘మహర్షి’తో మరో హిట్ అందించారు దేవీశ్రీప్రసాద్. ఇది నీ కథ అని చెప్తూ ఈ పాట అందరి మనసులకు చేరువైందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని ‘దిమాక్ ఖరాబ్’ పాట జనాలను ఇప్పటికీ వదలట్లేదు. మణిశర్మ సంగీతమందించిన ఈ పాటకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ పాటకు ఎనర్జిటిక్ హీరో రామ్ ఇరగదీసే స్టెప్పులు వేయగా హీరోయిన్ డ్యాన్యులతో ‘ఇస్మార్ట్ పాట’ అని ముద్ర వేసుకుంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను కీర్తన శర్మ, సాకేత్ ఆలపించారు.
‘ప్రియతమా.. ప్రియతమా..’ ఈ పదంలోనే ఏదో మత్తు ఉంది. ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటల లిస్టులో ఈ పాట కూడా చేరిపోయింది. చైతన్య ప్రసాద్ రచించిన ఈ పాటను చిన్మయి శ్రీపాద ఆలపించింది. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ‘మజిలీ’ సినిమాలోని ఈ పాటలో అక్కినేని నాగచైతన్య, సమంత వారి హావభావాలతో పాటను మరింత రక్తికట్టించారు.
చిత్రలహరి సినిమాలో ‘ప్రేమ వెన్నెల..’ పాట తెలియనవారు లేరంటే నమ్మండి. అందులోని ఈ పాటకు ఎంతో మంది ఫిదా అయిపోయారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా సుదర్శన్ అశోక్ రచించిన ఈ పాటకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. శ్రీమాన్ అద్భుతంగా పాడాడు.
నాచురల్ స్టార్ నాని ఈ ఏడాది రెండు సినిమాలతో పలకరించాడు. ఒకటి ‘జెర్సీ’ కాగా మరోటి ‘గ్యాంగ్ లీడర్’. రెండింటిలోనూ మంచి పాటలకు కొదువే లేదు. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ సినిమాలోని ‘హొయినా హొయినా’ పాట అందరినీ ఉర్రూతలూగించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతమందించగా, ఈ పాటను ఆలపించిన ఇన్నో జెంగా తన గాత్రంతో ఆకట్టుకున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ‘ఓ బావా.. మా అక్కను సక్కగ సూస్తావా..’ సాంగ్‌తో మరో హిట్ అందుకున్నాడు. కేకే రాసిన పాటను సత్య యామిని, మోహన భోగరాజు, హరి తేజ దానికి తగ్గట్టుగా ఆలపించారు. ప్రతిరోజు పండగే చిత్రంలోని ఈ పాట ఇప్పటికీ అందరి ఫోన్లలో మోగుతూనే ఉంది. బావను ఆట పట్టించడానికి మరదళ్లు ఈ పాటతో ఓ ఆట ఆడేసుకుంటున్నారనుకోండి.
క్రికెట్ చుట్టూ తిరిగే కథ ‘జెర్సీ’. ఇందులో ‘అదేంటో గానీ ఉన్నపాటుగా..’ పాట ఎంత హిట్టో మనందరికీ తెలిసిందే. దీనికి సంగీతాన్ని అందించిన అనిరుధ్ తనే స్వయంగా ఆలపించాడు. క్రిష్ణ కాంత్ మెలోడీకి తగ్గట్టుగా పాట రచించాడు. పెళ్లి తర్వాత ప్రేమ మరింత పెరుగుతుందని నిరూపిస్తుందీ పాట.
Comments
Please login to add a commentAdd a comment