Year 2019 Roundup
-
ఆహా! పదేళ్లలో ఎంత మార్పు!
2019 నుంచి 2020లోకి అడుగు పెట్టామంటే ఓ కొత్త సంవత్సరంలోకి ప్రవేశించడమే కాదు. కొత్త దశాబ్దంలోకి కూడా ప్రవేశించడం. 2010 సంవత్సరం నాటికి మొదటి దశాబ్దకాలాన్ని పూర్తి చేసుకున్న సోషల్ మీడియా 2020 నాటికి రెండో దశాబ్దంలోకి వినూత్న రీతిలో అడుగు పెట్టింది. 2010లో తాము ఎలా ఉన్నారో, ఇప్పుడు ఈ దశాబ్దంలో ఎలా ఉన్నరో తెలియజేసే ఫొటోలను యూజర్లు పోస్ట్ చేస్తూ వాటికి సముచిత కామెంట్లను కూడా జోడిస్తున్నారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ‘హౌహార్డ్డిడ్ఏజ్హిట్యూ, గ్లోఅప్, టెన్ఇయర్ఛాలెంజ్’ హాష్ ట్యాగ్‌లతో తమ అప్పటి, ఇప్పటి ఫొటోలను సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు పోస్ట్ చేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది ఆరోగ్యం, శరీర సౌష్టవం వల్ల అవగాహన పెంచుకోవడం ద్వారా అప్పటికంటే ఇప్పుడు బలంగా, అందంగా తయారుకాగా, కొంత మంది వయస్సురీత్యా సంక్రమించే వద్ధాప్య లక్షణాలతో కళ తప్పారు. సినీతారలు, కళాకారులు, మోడల్స్‌తోపాటు మోడ్రన్ దంపతులు కూడా తమ అప్పటి, ఇప్పటి ఫోటోలను షేర్ చేశారు. వారిలో విక్టోరియా బెకమ్ నుంచి లిజ్హర్లీ, చెరిల్ వరకు సెలబ్రిటీలు ఉన్నారు. -
పాటల మ్యాజిక్: వింటూ మైమరిచిపోదాం..
కొన్ని పాటలు వింటుంటే మనల్ని మనమే మైమరిచిపోతాం.. తెలీకుండానే తల, చేతులు ఆడిస్తుంటాం.. లైన్ తెలిస్తే బాత్రూం సింగర్ కంటే మెరుగ్గా పాట కూడా పాడేస్తాం. ఇక ఈ ఏడాది ఎన్నో పాటలు ఓ ప్రవాహంలా వస్తే చాలా పాటలు ఒడ్డుకు నిలబడి విజయాన్ని అందుకున్నాయి. కొన్ని ప్రేమ గీతాలను ఆలపిస్తే, మరికొన్ని తీన్మార్ స్టెప్పులతో ఊరమాస్ అనిపించాయి. అలా 2019 మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. మరి ఈ ఏడాది టాప్ టెన్ తెలుగు పాటలు ఏంటో పాడేద్దాం... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తోన్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఇందులోని ప్రతీ పాట బ్లాక్‌బస్టర్ హిట్‌గా దూసుకుపోతూ రికార్డులు సృష్టిస్తోంది. సామజవరగమన.. నిను చూసి ఆగగలనా అనే పాట యూట్యూబ్‌లో ఆగకుండా దూసుకుపోతోంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు తమన్ సంగీతమందించగా సీతారామశాస్త్రి లిరిక్స్ అందించాడు. బాహుబలి తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ భారీ బడ్జెట్‌తో ‘సాహో’ చేశాడు. ఇది ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో కొన్ని పాటలే జనాలకు క్లిక్ అయ్యాయి. కానీ ఒక పాటకు మాత్రం జనాలు విపరీతంగా ఆకర్షితులయ్యారు. అదే ‘ఆగదిక సయ్యా సైకో..’’ ఈ పాట క్యాచీగా ఉండటంతో పాటు మిక్స్డ్ భాషలు ఉపయోగించి అందరి నోట పాడించేలా చేశారు గేయ రచయిత శ్రీజో. స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఇందులో ఓ సైరా అనే పాట ఆయన గొప్పతనాన్ని తెలుపుతూ సాగుతుంది. ఈ సినిమాలో ఇది ప్రధాన పాట కాగా ఇది జనంలో మార్మోగిపోయింది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన మహర్షి సినిమా అంచనాలను దాటి వసూళ్లను సాధించింది. మహర్షి పేరుకు తగ్గట్టుగా పాట ‘ఇదే కదా ఇదే కదా..’ పాట ఉత్తేజాన్ని నింపింది. మహేశ్‌బాబు ‘నేనొక్కడినే, శ్రీమంతుడు, భరత్ అనే నేను’ సినిమాలకు దేవీశ్రీప్రసాద్ సూపర్ హిట్ సంగీతాన్ని అందించారు. ‘మహర్షి’తో మరో హిట్ అందించారు దేవీశ్రీప్రసాద్. ఇది నీ కథ అని చెప్తూ ఈ పాట అందరి మనసులకు చేరువైందనడంలో ఎలాంటి సందేహం లేదు. మాస్ ఎంటర్టైనర్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని ‘దిమాక్ ఖరాబ్’ పాట జనాలను ఇప్పటికీ వదలట్లేదు. మణిశర్మ సంగీతమందించిన ఈ పాటకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ పాటకు ఎనర్జిటిక్ హీరో రామ్ ఇరగదీసే స్టెప్పులు వేయగా హీరోయిన్ డ్యాన్యులతో ‘ఇస్మార్ట్ పాట’ అని ముద్ర వేసుకుంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను కీర్తన శర్మ, సాకేత్ ఆలపించారు. ‘ప్రియతమా.. ప్రియతమా..’ ఈ పదంలోనే ఏదో మత్తు ఉంది. ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటల లిస్టులో ఈ పాట కూడా చేరిపోయింది. చైతన్య ప్రసాద్ రచించిన ఈ పాటను చిన్మయి శ్రీపాద ఆలపించింది. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ‘మజిలీ’ సినిమాలోని ఈ పాటలో అక్కినేని నాగచైతన్య, సమంత వారి హావభావాలతో పాటను మరింత రక్తికట్టించారు. చిత్రలహరి సినిమాలో ‘ప్రేమ వెన్నెల..’ పాట తెలియనవారు లేరంటే నమ్మండి. అందులోని ఈ పాటకు ఎంతో మంది ఫిదా అయిపోయారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా సుదర్శన్ అశోక్ రచించిన ఈ పాటకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. శ్రీమాన్ అద్భుతంగా పాడాడు. నాచురల్ స్టార్ నాని ఈ ఏడాది రెండు సినిమాలతో పలకరించాడు. ఒకటి ‘జెర్సీ’ కాగా మరోటి ‘గ్యాంగ్ లీడర్’. రెండింటిలోనూ మంచి పాటలకు కొదువే లేదు. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ సినిమాలోని ‘హొయినా హొయినా’ పాట అందరినీ ఉర్రూతలూగించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతమందించగా, ఈ పాటను ఆలపించిన ఇన్నో జెంగా తన గాత్రంతో ఆకట్టుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ‘ఓ బావా.. మా అక్కను సక్కగ సూస్తావా..’ సాంగ్‌తో మరో హిట్ అందుకున్నాడు. కేకే రాసిన పాటను సత్య యామిని, మోహన భోగరాజు, హరి తేజ దానికి తగ్గట్టుగా ఆలపించారు. ప్రతిరోజు పండగే చిత్రంలోని ఈ పాట ఇప్పటికీ అందరి ఫోన్లలో మోగుతూనే ఉంది. బావను ఆట పట్టించడానికి మరదళ్లు ఈ పాటతో ఓ ఆట ఆడేసుకుంటున్నారనుకోండి. క్రికెట్ చుట్టూ తిరిగే కథ ‘జెర్సీ’. ఇందులో ‘అదేంటో గానీ ఉన్నపాటుగా..’ పాట ఎంత హిట్టో మనందరికీ తెలిసిందే. దీనికి సంగీతాన్ని అందించిన అనిరుధ్ తనే స్వయంగా ఆలపించాడు. క్రిష్ణ కాంత్ మెలోడీకి తగ్గట్టుగా పాట రచించాడు. పెళ్లి తర్వాత ప్రేమ మరింత పెరుగుతుందని నిరూపిస్తుందీ పాట. -
2019: బుక్‌మై షోలో రికార్డు సృష్టించిన సినిమాలు
భారతీయ చిత్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోంది. బయోపిక్ ట్రెండ్లను దాటి ఇప్పుడు మరో ముందడుగు వేసింది. దేశంలో చోటు చేసుకుంటున్న ప్రధాన సంఘటనలను కూడా తెరకెక్కించవచ్చని ఉరి: ద సర్జికల్ స్ట్రైక్, మిషన్ మంగళ్ నిరూపించాయి. కొత్తదనాన్ని కోరుకుంటున్న జనం చిన్న సినిమాలను ఆదరిస్తున్నారని ప్రాంతీయ సినిమాలను చూస్తే అర్థమవుతుంది. సినిమా విజయం సాధించింది అని చెప్పడానికి కావాల్సిన కొలమానాలు మారిపోయాయి. కేవలం కలెక్షన్లు వచ్చిన సినిమాలే కాకుండా ప్రేక్షకులు అక్కున చేర్చుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ పరీక్షలో పాస్ అయినట్టు లెక్క. ఇది కొత్తసంవత్సరంలోనూ కొనసాగనుంది. ఇక ఈ ఏడాది భారత చిత్రపరిశ్రమలో సాహసాలు చేసిన సినిమాలు కొన్ని అంచనాలకు మించి సక్సెస్ అవుతే మరికొన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాయి. సినిమా బాగుందంటే చాలు.. ప్రాంతీయ, జాతీయ బేధాలను లెక్క చేయకుండా ఆ సినిమాలను నెత్తిన పెట్టుకుని ఆదరించడమే భారతీయ చిత్ర పరిశ్రమ లక్షణం. ఈ క్రమంలో 2019కు గానూ జాతీయ అంతర్జాతీయ సినిమాలు ఏవి టాప్‌లో నిలిచాయో రౌండేద్దాం.. బుక్‌మైషోలో రికార్డు ఒకప్పటిలా సినిమా చూడాలంటే పొద్దునే లేచి బారెడంత క్యూలో నిలబడాల్సిన పని లేదు. సినిమా విడుదల కాక ముందే ఫోన్లో ఉన్న యాప్‌తో టికెట్ కొనేసి రెడీగా ఉండచ్చు. ఇలాంటి యాప్‌లు ఈ మధ్య కాలంలో కుప్పలు తెప్పలుగా వచ్చాయి. అయితే సినిమా టికెట్లతో పాటు, పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమాలకు సైతం టికెట్లు బుక్ చేసుకునే ‘బుక్ మై షో’ ఓ ముఖ్య విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం ఈ ఏడాది బుక్‌మైషోలో అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమాగా ‘అవెంజర్స్: ది ఎండ్‌గేమ్’ అనే హాలీవుడ్ మూవీ రికార్డు సృష్టించింది. 5.7 మిలియన్ల టికెట్ల అమ్మకాలతో భారతీయ చిత్రం ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ రెండో స్థానంలో చోటు దక్కించుకుంది. విమ టాప్ టెన్ ఇండియన్ సినిమాలు ► అవెంజర్స్: ఎండ్‌గేమ్ ► ఉరి: ద సర్జికల్ స్టైక్ ► కబీర్ సింగ్ ► సాహో ► వార్ ► ద లయన్ కింగ్ ► మిషన్ మంగళ్ ► సింబా ► గల్లీబాయ్ ► చిచోరే భారత్‌లో హవా కనబర్చిన అంతర్జాతీయ సినిమాలు జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్డమ్ వండర్ వెధరింగ్ విత్ యు పాడింగ్టన్ 2 బ్లూ ప్లానెట్ 2 హస్ట్లర్స్ విలేజ్ రాక్‌స్టార్స్ మైల్ 22 హరే కృష్ణ ఎ ప్రైవేట్ వార్ టాప్ 5 తెలుగు సినిమాలు ⇔ సైరా సరసింహ రెడ్డి ⇔ సాహో ⇔ మహర్షి ⇔ ఎఫ్2 ⇔ మజిలీ టాప్ 5 బెంగాలీ సినిమాలు ♦ దుర్గేష్గోరర్ గుప్తోధోన్ ♦ గుమ్నామీ ♦ కొంఠో ♦ మిటిన్ మషి ♦ గోట్రో టాప్ 5 తమిళ సినిమాలు ⇒ బిగిల్ ⇒ పేట ⇒ విశ్వాసం ⇒ నెర్కొండ పార్వై ⇒ ఖైదీ టాప్ 5 మరాఠీ సినిమాలు • ముంబై పుణె ముంబై 3 • ఠాక్రే • హిర్కానీ • ఆనంది గోపాల్ • భాయ్- వ్యక్తి కి వల్లి -
కొత్త సంవత్సరంలో చేయాల్సిన పనులెన్నో..
సాక్షి, సిటీబ్యూరో: దాదాపు కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రజల సదుపాయం కోసం రహదారులు, జంక్షన్లు, పార్కుల ఆధునీకరణలతోపాటు వివిధ కార్యక్రమాలకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ఇప్పటికే చేపట్టిన పనుల్ని పూర్తిచేయడంతో పాటు కొత్త సంవత్సరం(2020)లో కొన్ని కొత్త కార్యక్రమాలకు సన్నద్ధమవుతోంది. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం దిశగా ఆయా కార్యక్రమాల అమలుకు జీహెచ్ఎంసీ అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. అందుకనుగుణంగా పాదచారుల ఇబ్బందులు తొలగించేందుకు రూ.232 కోట్ల వ్యయంతో 52 ఎఫ్‌ఓబీలు, పలు స్కైవేల నిర్మాణ పనుల్ని త్వరలో ప్రారంభించనున్నారు. వీటితోపాటు 55 సమాంతర స్ట్రిప్రోడ్లు, 800 కి.మీ.ల మేర ఫుట్‌పాత్‌ల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. నగరంలోని 66 పార్కుల్లో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. కొత్త సంవత్సరంలో 135 కి.మీ.ల మేర వివిధ జంక్షన్లలో స్కైవేలు, 166 కి.మీ. పొడవున 11 మేజర్ కారిడార్స్, 348 కి.మీ. మేర 68 మేజర్ రోడ్స్‌తో పాటు 1400 కి.మీ.ల ఇతర రహదారులు, 54 చోట్ల గ్రేడ్ సెపరేటర్ల పనులు చేపట్టనున్నారు. ఈ సంవత్సరం రూ.24.74 కోట్లతో ఎల్బీనగర్ ఫ్లై ఓవర్, రూ.97.94 కోట్లతో కూకట్పల్లి రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద ఫ్లై ఓవర్, రూ. 69.47 కోట్లతో బయోడైవర్సిటీ పార్కువద్ద ఫ్లై ఓవర్లు జీహెచ్ఎంసీ చేపట్టిన పనుల్లో మైలురాళ్లుగా నిలిచాయని జీహెచ్ఎంసీ పేర్కొంది. ఆయా జంక్షన్లలో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు 155 జంక్షన్లలో ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. సంక్షేమం దిశగా.. మహిళలకు రుణాలు .. జీహెచ్ఎంసీ పరిధిలోని 6,949 సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులకు ఈ సంవత్సరం రూ.287 కోట్ల బ్యాంకు రుణాలిప్పించడం ద్వారా ఆయా మహిళల కుటుంబాలు ఆయా వృత్తివ్యాపారాల ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడింది. గ్రేటర్ పరిధిలోని 1466 మురికివాడల్లో మొత్తం 51,051 సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులున్నాయి. ఈ సంవత్సరం కొత్తగా 1942 గ్రూపులేర్పడ్డాయి. జీహెచ్ఎంసీ యూసీడీ విభాగం ఆధ్వర్యంలో ఇన్ని కుటుంబాలకు ఆర్థిక సహకారం అందడంతో కొత్త సంవత్సరంలో ఈ కార్యక్రమాల్ని మరింత విస్తృతం చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. చిరువ్యాపారాలు చేసుకుంటున్న 24,909 మందిని గుర్తించి వారిలో 24,811 మందికి గుర్తింపుకార్డులందజేశారు. చిరు వ్యాపారాలు చేసుకునే మిగతా వారందరినీ గుర్తించి, గుర్తింపుకార్డులివ్వడంతోపాటు వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే వెండింగ్జోన్లలోనే వ్యాపారాలు చేసుకునేలా చేయాలనేది కొత్త సంవత్సర లక్ష్యంగా ఉంది. గ్రేటర్లో ఇప్పటికే ఉన్న దాదాపు 700 మీసేవా కేంద్రాలతోపాటు వచ్చే సంవత్సరంలో జీహెచ్ఎంసీలోని పౌరసేవాకేంద్రాల్లో కూడా మీసేవా కేంద్రాల సబ్‌సెంటర్లు ఏర్పాటుచేసి వాటిద్వారానే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే చర్యలకు శ్రీకారం చుట్టారు. పూర్తయిన 35 మోడల్మార్కెట్లలోని దుకాణాలను లబ్ధిదారులకు కేటాయించేపనిని పూర్తిచేసి కొత్తసంవత్సరం వాటిని వినియోగంలోకి తేనున్నారు. మొత్తం 15 ప్రాంతాల్లో ఫంక్షన్‌హాళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి మూడేళ్లు దాటగా, ఇప్పటి వరకు 9 పూర్తిచేశారు. మిగతావి కొత్త సంవత్సరంలో పూర్తిచేసే లక్ష్యంతో ఉన్నారు. ఆస్తులన్నీ జియోట్యాగింగ్.. కాగితరహిత పాలన, ఈ–ఆఫీస్ నిర్వహణలో భాగంగా 6,29,000 పాత ఫైళ్లలోని 4కోట్ల 22లక్షల పేజీలను డిజిటలైజ్ చేసినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. ఆస్తిపన్ను విధింపులో అవకతవకల నివారణకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) సహకారంతో, ‘ట్రాక్’ సాంకేతిక భాగస్వామ్యంతో ఇటీవల ప్రారంభించిన జీఐఎస్ సర్వే ద్వారా 21వేల ఆస్తుల జియోట్యాగింగ్‌తో పాటు ఆస్తిపన్ను జాబితాలో లేని 545 ఆస్తులను గుర్తించారు. కొత్త సంవత్సరంలో మిగతా ఆస్తులన్నింటికీ జియోట్యాగింగ్ చేయనున్నారు. పబ్లిక్‌పార్కులు, ప్రభుత్వ ఖాలీస్థలాల్లో 1500 పబ్లిక్ టాయ్‌లెట్స్ యూనిట్స్ నిర్మించనున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. చెత్త నుంచి విద్యుత్.. దేశంలోనే పెద్దదైన జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు క్యాపింగ్ పనులతోపాటు చెత్తనుంచి విద్యుత్ఉత్పత్తికి 19.8మెగావాట్ల సామర్ధ్యం కలిగిన విద్యుత్‌ప్లాంట్ నిర్మాణం కూడా పూర్తి కావడంతో విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి యూనిట్ రేట్ ఖరారు కాగానే వాణిజ్యపరంగా విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. నగరానికి నాలుగువైపులా డెబ్రిస్ రీసైక్లింగ్ప్లాంట్ల ఏర్పాటు జరగనుండగా, ఇప్పటికే పనులు పూర్తయిన జీడిమెట్ల ప్లాంట్ త్వరలో వినియోగంలోకి రానుంది. దీంతోపాటు చెంగిచెర్లలోని రెండరింగ్ప్లాంట్ కూడా వినియోగంలోకి రానుంది. ఇంకా.. ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుతో 2017 జూలై నుండి ఇప్పటి వరకు 258.38 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా కావడంతో రూ. 182.67 కోట్ల కరెంట్ బిల్లు తగ్గింది. విద్యుత్ ఖర్చును మరింత తగ్గించేందుకు జీహెచ్ఎంసీకి చెందిన 34 కార్యాలయాల భవనాలపై 941 కిలో వాట్ల సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేశారు. వీటికైన వ్యయం రూ. 3.49 కోట్లు. u విపత్తు సమయాల్లో నగర ప్రజలు, ఆస్తులను కాపాడేందుకు మూడు షిప్టుల్లో పనిచేస్తున్న డీఆర్ఎఫ్ బృందాలతో నగర ప్రజలకు అండగా ఉన్న ఈవీడీఎం విభాగం కొత్త సంవత్సరంలో మరిన్ని హంగులతో సేవలను విస్తృతం చేయనుంది. 2019లో ఫుట్‌పాత్‌లపై వెలసిన 15వేల ఆక్రమణల తొలగించడంతో పాటు ని»బంధనలను ఉల్లంఘించి వాల్‌పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేసిన వారిపై, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసిన వారిపై మొత్తం 3.48 లక్షల అతిక్రమణలకు జరిమానాలు విధించారు. పది లక్షల ప్లాస్టిక్ కవర్లు సీజ్ చేశారు. u దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ఎంటమాలజీ విభాగం ద్వారా 642 బృందాలతో యాంటీ లార్వా ఆపరేషన్లు..150 పోర్టబుల్, 13 వాహనాలకు అమర్చిన ఫాగింగ్ మిషన్ల ద్వారా ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. 15 చెరువుల్లో గుర్రపుడెక్క తొలగింపుతోపాటు దోమల నివారణకు ఆయిల్‌బాల్స్ వదిలారు. మూసీతోపాటు కొన్ని చెరువుల్లో ప్రయోగాత్మకంగా డ్రోన్ల ద్వారా దోమల నివారణ మందు స్ప్రే చేశారు. వీటికి కొనసాగింపుగా కొత్త సంవత్సరం మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నారు. -
వెంటాడిన ‘అనారోగ్యం’!
సాక్షి, సిటీబ్యూరో: వైద్య ఆరోగ్యశాఖను ఈ ఏడాది తీవ్రమైన అనారోగ్యం వెంటాడింది. డెంగీ, స్వైన్‌ఫ్లూ జ్వరాలతో అనేక మంది మృత్యువాతపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడం, బస్తీల్లో వరదలు పోటెత్తాయి. డెంగీ దోమలు వృద్ధి చెందాయి. ఫలితంగా ఈ ఏడాది ఇప్పటి వరకు అధికారికంగా 4500పైగా డెంగీ జ్వరాలు నమోదు కాగా, వీరిలో 22 మంది వరకు మృత్యువాతపడ్డారు. అనధికారికంగా మృతుల సంఖ్య వందకు పైగా ఉన్నట్లు అంచనా. జ్వరాలపై హైకోర్టు సీరియస్ డెంగీ జ్వరాలపై చివరకు హైకోర్టు సైతం ప్రభుత్వంపై సీరియస్ కావడంతో అప్రమత్త మైన ప్రభుత్వం ఆగమేఘాల మీద నష్టనివారణ చర్యలు చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్ సహా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ వైద్యుల సెలవులు రద్దు చేసి, ఆదివారం ఓపీ సర్వీసులు అందజేసింది. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, బస్తీ దవాఖానాల్లో ఈవినింగ్ ఓపీలను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో కాలంతో సంబంధం లేకుండా గత పదేళ్ల నుంచి స్వైన్‌ఫ్లూ వీరవిహారం చేస్తూనే ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 250పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో 25 మంది మృత్యువాతపడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. నిలోఫర్‌లో క్లినికల్ ట్రయల్స్ దుమారం నిలోఫర్ కొంత మంది వైద్యులు చిన్నారుల తల్లిదండ్రులకు తెలియకుండా శిశువులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇద్దరు వైద్యుల మధ్య నెలకొన్న వివాదం చివరకు తార స్థాయికి చేరుకుంది. ఇరువురు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది. చివరికి వైద్య ఆరోగ్య శాఖను ఓ కుదుపు కుదిపేసింది. అదృష్టవశాత్తు ఈ ట్రయల్స్‌లో ఎవరికీ ఏమీ కాకకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆస్పత్రిలో నవజాత శిశువుల మరణాల సంఖ్య రెట్టింపైంది. వ్యాక్సినేషన్లో నిర్లక్ష్యం..శిశువు మృతి జాతీయ వ్యాధినిరోధక టీకాల కార్యక్రమంలో నాంపల్లి ఏరియా ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ శిశువు ప్రాణాలను మింగేసింది. మరో 32 మంది పిల్లల అస్వస్థతకు కారణమైంది. వ్యాక్సినేషన్ తర్వాత పారాసిటమాల్ టాబ్లెట్‌కు బదులు...సర్జరీ తర్వాత నొప్పి నివారణ కోసం వాడే ట్రెమడాల్ 300 ఎంజీ టాబ్లెట్ ఇవ్వడంతో కిషన్‌బాగ్‌కు చెందిన మూడున్నర నెలల లోపు శిశువు మృతి చెందగా, మరో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడం వివాదాస్పదమైంది. ఏరియా ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల శిశువు ప్రాణాలు కోల్పొవడం అప్పట్లో ఈ అంశంపె పెద్ద దుమారమే రేగింది. చివరకు ప్రభుత్వం స్పందించి ఏరియా ఆస్పత్రి ఇన్చార్జి డాక్టర్, ఫార్మసీ ఉద్యోగి, స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేసింది. షైన్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఎల్బీ నగర్షైన్ ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఐసీయూలో అర్దరాత్రి మంటలు చెలరేగాయి. ఈఘటనలో ఓ శిశువు మృత్యువాత పడగా, మరో నలుగురు శిశువులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో ఉలిక్కి పడిన ప్రభుత్వం..ఆస్పత్రి వైద్యులు సహా విధి నిర్వహణలో ఉన్న స్టాఫ్ నర్సులపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేయించింది. బోధనాసుపత్రుల్లోనూ వసతులు మృగ్యం.. ⇔ ఉస్మానియా ఆస్పత్రి పాతభవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రత్యామ్నాయంగా అదే ప్రాంగణంలో మరో రెండు బహుల అంతస్థుల భవనాలు నిర్మించనున్నట్లు ఐదేళ్ల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ ఏడాది కూడా ప్రతిపాదన దశలోనే ఉంది. ప్రస్తుతం పునాదిరాయికి నోచుకోలేదు. ఆస్పత్రి చరిత్రలో వైద్యులు వంద రోజుల పాటు ఆందోళనలు చేసినా..అనేక విజ్ఞప్తులు చేసినా ఆలకించిన నాధుడే లేరు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రోగులకు ఇబ్బందులు తప్పలేదు. ⇔ గాంధీ జనరల్ ఆస్పత్రిలో రూ.30 కోట్లలో 8 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు నిర్మించనున్నట్లు ప్రకటించినా..ఇప్పటి వరకు ఒక్క థియేటర్ కూడా ప్రారంభం కాలేదు. సంతాన సాఫల్య కేంద్రం సహా అత్యవసర విభాగం ఆధునీకికరణ వంటి పనులు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ⇔ ఈఎన్టీ ఆస్పత్రిలో రోగులకు కష్టాలు తప్పలేదు. రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు, ఆపరేషన్ థియేటర్లు లేకపోవడంతో చికిత్సల కోసం మూడు నుంచి నాలుగు నెలలు ఎదురు చూడాల్సి వస్తుంది. -
చీకట్లను చీల్చుకొని..
సాక్షి, అనంతపురం: జిల్లా వాసుల జీవితాల్లో 2019 గమ్మత్తైన ప్రయాణాన్ని సాగించింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. సంక్షేమ వెలుగులు ప్రసరించడంతో జిల్లాలో చీకట్లు వైదొలుగుతూ వచ్చాయి. పాలనలో సంస్కరణలు అన్ని వర్గాలకు కొత్త జీవితాన్ని అందించాయి. జనవరి మొదలు.. డిసెంబర్ వరకూ సాగిన ఈ ప్రయాణంలో ఎన్నో అనుభూతులను 2019 మిగిల్చింది. ఉత్సాహవంతులైన యువ అధికారుల నియామకం.. వారి ఆలోచనల్లో కొత్తదనం ఫలితంగా జిల్లాలో పెనుమార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. కాస్త చేదు మిగిల్చినా.. మొత్తానికి జిల్లాలో గత పాలకులు మిగిల్చిన చీకట్లను పారదోలడంలో 2019 సాగించిన విజయప్రస్థానంపై మంత్ టు మంత్ రిపోర్ట్ మీ కోసం. జనవరి: 10వతేదీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఇచ్చాపురంలో దిగ్విజయంగా పూర్తి అయిన సందర్భంగా జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఫిబ్రవరి: 18వ తేదీ: ఏలూరు సభలో బీసీ డిక్లరేషన్‌పై అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టతనివ్వడంతో జిల్లా వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. మార్చి: ►10వ తేదీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యుల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ను కలెక్టర్ విడుదల చేశారు. అదే రోజు నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. ►18వ తేదీ: రాయదుర్గంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. ►25వ తేదీ: తాడిపత్రిలో ఎన్నికల ప్రచార బహిరంగ సభ వేదికపై నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. ► 30వ తేదీ: సోమందేపల్లి, మడకశిర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న వైఎస్ జగన్. ►31న: కళ్యాణదుర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌గాంధీ. ఏప్రిల్: ►4వ తేదీ: హిందూపురం, కళ్యాణదుర్గంలో వైఎస్జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ►11వ తేదీ: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగింది. 14 నియోజవకర్గాల పరిధిలో చిన్నపాటి సంఘటలనలు మినహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. మే: ►14వ తేదీ: పది పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 95.55 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 7వ స్థానంలో అనంత జిల్లా నిలిచింది. 2,971 మంది విద్యార్థులు 10/10 గ్రేడ్‌పాయింట్లు సాధించారు. ►23వ తేదీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని సృష్టించింది. 12 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. జూన్: ► 7వ తేదీ: జిల్లా కలెక్టర్‌గా సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ► 9వ తేదీ: జిల్లా ఎస్పీగా సత్యయేసుబాబు బాధ్యతలు స్వీకరించారు. జూలై: ►9వ తేదీ: జిల్లాలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ►19వ తేదీ: సర్వజనాస్పత్రి అభివృద్ధికి రూ.250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో అదనపు భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. ఆగస్టు: ► 8వ తేదీ: కియా పరిశ్రమలో తొలి కారు ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, శంకరనారాయణ, పీఐఐసీసీ చైర్పర్సన్ ఆర్.కె.రోజా పాల్గొన్నారు. ►19వ తేదీ: ఎమ్మెల్సీగా విశ్రాంత ఐజీ మహమ్మద్ ఇక్బాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శాసనమండలి చాంబర్లో రిగర్నింగ్ అధికారి బాలకృష్ణమాచార్యలు ప్రకటించారు. సెప్టెంబర్: ►26వ తేదీ: డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ జిల్లాకు విచ్చేశారు. భూ యజమానుల హక్కులను కాపాడేందుకు రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇళ్ల పట్టాల మంజూరుకు భూసేకరణ, భూ రికార్డుల స్వచ్ఛీకరణ తీరును మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, శంకరనారాయణ, విప్ కాపు రామచంద్రారెడ్డితో కలిసి అధికారులతో ఆయన సమీక్షించారు. అక్టోబర్: ►1వ తేదీ: జిల్లాలో గ్రామ సచివాలయాల వ్యవస్థను మంత్రి శంకరనారాయణ లాంఛనంగా ప్రారంభించారు. నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ►10వ తేదీ: వైఎస్సార్ కంటి వెలుగు రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనంతలో ప్రారంభించారు. ►22వ తేదీ: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యుడిగా రాష్ట్ర విద్యాసంస్కరణల కమిటీ సభ్యుడు ఆలూరి సాంబశివారెడ్డి నియమితులయ్యారు. నవంబర్: ►8వ తేదీ: అగ్రిగోల్డ్ బాధితులకు రూ.20.64 కోట్ల మెగా చెక్కును ప్రజాప్రతినిధులు అందజేశారు. ►17వ తేదీ: కనకదాస జయంతిని అధికారికంగా జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ►22వ తేదీ: పుట్టపర్తిలో సత్యసాయి 94వ జయంత్యుత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 38వ స్నాతకోత్సవం జరిగింది. కార్యక్రమానికి డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సతీష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిసెంబర్: ► 2వ తేదీ: జిల్లాకు 100వ కలెక్టర్‌గా గంధం చంద్రుడు బాధ్యతలు స్వీకరించారు. ► 5వ తేదీ: కియా గ్రాండ్ సెర్మనీలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానికులకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, కియా మోటార్స్‌లో పూర్తిస్థాయి ఉత్పత్తి మొదలైతే మరిన్ని ఉద్యోగాలు జిల్లా వాసులకు దక్కుతాయని ఆయన అన్నారు. ► 6వ తేదీ: 36 సంవత్సరాలుగా తమకు సేవలందిస్తూ వచ్చిన దంపెట్ల నారాయణ యాదవ్ మృతి చెందడంతో ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఢిల్లీ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని సతీసమేతంగా ముదిగుబ్బ మండలం దిగువపల్లికి వచ్చారు. ► 9వ తేదీ: ఎస్కేయూ వీసీ ఫ్రొఫెసర్ జయరాజ్ హఠాన్మరణం. ► 11వ తేదీ: డీసీసీబీ చైర్మన్‌గా బీసీ సామాజిక వర్గానికి చెందిన పామిడి నివాసి మానుకింద వీరాంజినేయులు బాధ్యతల స్వీకరణ. ► 18వ తేదీ: మూడు రోజుల పాటు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ► 21వ తేదీ: వైఎస్సార్ నేతన్న నేస్తంను ధర్మవరం నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. జిల్లాలో 27,481 మంది నేతన్నలకు లబ్ది చేకూరింది. -
ఈ ఏడాది చోటుచేసుకున్న కీలకాంశాలు
దేశ విదేశాల్లో కొంగొత్త ఆవిష్కరణలు... కార్పొరేట్ దిగ్గజాల అస్తమయం... దివాలా కోరల్లో చిక్కుకున్న కంపెనీలు... కొత్త బాధ్యతలతో తళుకులు... ఇలా ఆద్యంతం వ్యాపార రంగంలో ఊపిరిసలపని పరిణామాలతో పయనం సాగించిన 2019 మరికొద్ది గంటల్లో మనకు గుడ్‌బై చెప్పేస్తోంది. ఎన్నో మలుపులు.. మరెన్నో ఊహించని సంఘటనలను తన మదిలో నింపుకున్న సంవత్సరం ఇది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చోటుచేసుకున్న కీలకాంశాలను ఒక్కసారి అవలోకనం చేసుకునే ‘బిజినెస్ రివైండ్’ సాక్షి పాఠకులకు ప్రత్యేకం... జనవరి... ► బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయ, దేనా బ్యాంక్‌ల విలీనానికి కేంద్రం ఓకే. దీనితో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత దేశంలోనే మూడవ అతిపెద్ద బ్యాంకుగా బీఓబీ అవతరించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండవ అతిపెద్ద బ్యాంకుగా నిలిచింది. ► బంధన్ బ్యాంక్ చేతికి గృహ్ ఫైనాన్స్. ► వీడియోకాన్ క్విడ్‌ప్రోకో వ్యవహారంలో చందా కొచర్‌పై సీబీఐ కేసు. ఫిబ్రవరి ► ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం బాగోలేకపోవడం తో, తాత్కాలిక బాధ్యతల్లో మధ్యంతర వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన పీయూష్ గోయెల్. ఆదాయాలపై రూ. 5 లక్షల వరకూ పన్ను రిబేట్ కీలక నిర్ణయం. మార్చి ► ఎరిక్సన్కు ఇవ్వాల్సిన రూ.458.77 కోట్ల బకాయిలు చెల్లించకపోతే... జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఆర్‌కామ్ చైర్మన్ అనిల్ అంబానీకి ఫిబ్రవరి 20న సుప్రీంకోర్టు హెచ్చరిక. నెల గడువు. ఆదుకున్న అన్నయ్య ముకేశ్. గడువుకు ఒకరోజు ముందు మార్చి 18న మొత్తం డబ్బు చెల్లించిన ఆర్ఐఎల్. ఏప్రిల్ ► ఇండియా బుల్స్ చేతికి లక్ష్మీ విలాస్ బ్యాంక్. షేర్ బదలాయింపు ద్వారా ఆర్థిక లావాదేవీ. ► దాదాపు రూ.8,000 కోట్ల రుణ భారంతో జెట్ ఎయిర్వేస్ క్రాష్ ల్యాండింగ్. మే ► జాగరణ్ ప్రకాశన్ చేతికి అనిల్ అంబానీ రేడియో బిగ్ఎఫ్ఎం. డీల్ విలువ రూ.1,050 కోట్లు. అడాగ్ కంపెనీల రుణ భారం తగ్గించుకునే ప్రయత్నం. జూన్ ► మూడేళ్ల పదవీకాలంలో ఆరు నెలల ముందుగానే వ్యక్తిగత అంశాలను కారణంగా చూపుతూ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ డాక్టర్ విరాల్ ఆచార్య రాజీనామా. వ్యక్తిగత కారణాలే కారణంగా చూపుతూ ఆర్బీఐ గవర్నర్‌గా రాజీనామా చేసిన ఉర్జిత్ పటేల్ తర్వాత, ఆర్బీఐ ఉన్నత పదవికి రాజీనామా చేసిన వ్యక్తిగా విరాల్ ఆచార్య. జూలై ► 2019–2020 ఆర్థిక సంవత్సరానికి రూ.27,86,349 కోట్ల పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ► బ్యాంకుల జాతీయీకరణకు 50 సంవత్సరాలు పూర్తి ఆగస్టు ► హైదరాబాద్‌లో అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ ప్రారంభం ► ప్రభుత్వ బ్యాంకుల మెగా విలీనానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం. మొత్తం 10 బ్యాంకులు 4 బ్యాంకులుగా కుదింపు. సెప్టెంబర్ ► దేశ వ్యాప్తంగా 1600 నగరాల్లో జియో హైస్పీడ్– ఫైబర్ నెట్ సేవలు ప్రారంభం. ► కార్పొరేట్ ట్యాక్స్ రేటును కంపెనీలకు 30 శాతం నుంచి 22 శాతానికి, కొన్ని కొత్త తయారీ సంస్థలకు 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన. ► బ్రిటిష్ పర్యాటక సంస్థ.. 178 ఏళ్ల చరిత్ర ఉన్న థామస్ కుక్ దివాలా. అక్టోబర్ ► బ్యాంకింగ్ రుణ రేట్లు అన్నీ రెపో రేటుకు, ఇతర ఎక్న్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లకు అనుసంధానం. ఆర్బీఐ రేట్ల కోత ప్రయోజనాన్ని బ్యాంకులు తక్షణం కస్టమర్‌కు బదలాయించేలా చూడటమే దీని లక్ష్యం. నవంబర్ ► తీవ్రమైన రుణ సంక్షోభంలో చిక్కుకున్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్(డీహెచ్ఎఫ్ఎల్)పై ఆర్బీఐ కొరడా. కంపెనీ డైరెక్టర్ల బోర్డు రద్దు. దివాలా చర్యలు షురూ. డిసెంబర్ ► ఇన్సాల్వెన్సీ, దివాలా కోడ్ ప్రక్రియతో రూ.42,000 కోట్లకు ఎస్సార్ స్టీల్ కొనుగోలు ద్వారా దేశంలోకి ప్రవేశించిన ప్రపంచ స్టీల్ దిగ్గజం– ఆర్సిలార్మిట్టల్. కొత్త బాధ్యతలు ఆర్థికమంత్రిగా నియమితులైన నిర్మలా సీతారామన్. గతంలో ఇందిరాగాంధీ తాత్కాలికంగా ఆర్థికశాఖను నిర్వహించినా, పూర్తి స్థాయి ఆర్థికమంత్రిగా నియమితులైన తొలి భారత మహిళగా సీతారామన్‌కు గుర్తింపు. బలమైన కంపెనీగా ఐటీసీని మలచిన శిల్పి, పద్మ భూషన్ అవార్డు గ్రహీత యోగేష్ చందన్ దేవేశ్వర్ (72) కన్నుమూత. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) సంస్థ చీఫ్ ఎకనమిస్ట్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా గీతా గోపీనాథ్. విప్రో చైర్మన్ ప్రేమ్‌జీ పదవీ విరమణ. కుమారుడు రిషద్‌కు బాధ్యతలు. దిగ్గజాల అస్తమయం... బిర్లా మూల పురుషుడు బీకే బిర్లా (98) మరణం. మాజీ ఆర్థిక మంత్రి, దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన బీజేపీ నేత అరుణ్ జైట్లీ అనారోగ్యంతో అస్తమయం. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయి... ఆత్మహత్య చేసుకున్న కాఫీ డే అధినేత సిద్ధార్థ. రెండు రోజుల అదృశ్యం తర్వాత కర్ణాటకలోని నేత్రావతి నది ఒడ్డున మృతదేహం గుర్తింపు. ఐటీ అధికారులు, పీఈ ఇన్వెస్టర్లు వేధించారంటూ వెలువడిన ఆయన లేఖ సంచలనం. ఆటో ‘మొబైల్’... దక్షిణకొరియా కార్ల దిగ్గజం కియా ‘మేడిన్ ఆంధ్రా’ సెల్టోస్ విడుదల. అనంతపురం ప్లాంట్‌లో తొలి కారు ఆవిష్కరణ. దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ .. కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ హారియర్ వాహనాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూసిన అత్యాధునిక ఐఫోన్లు 11, 11 ప్రోలను ఆవిష్కరించిన యాపిల్. ధరల స్పీడ్ ధరలూ సామాన్యునిపై భారాన్ని మోపుతున్నాయి. మొత్తంగా గణాంకాలు దేశంలో మందగమన పరిస్థితులను ప్రతిబింబిస్తుండగా, నిత్యావసరాల ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం ఉండాలన్నది ఆర్బీఐకి కేంద్రం నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్ 2’ లేదా ‘మైనస్ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే అక్టోబర్ (4.62 శాతం), నవంబర్ (5.54 శాతం) ద్రవ్యోల్బణం అదుపుతప్పింది. ఇక నవంబర్ టోకు ద్రవ్యోల్బణం వ్యవస్థలో మందగమన స్థితికి (0.58 శాతం) అద్దం పట్టింది. చిక్కుల్లో కార్వీ క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందన్న ఆరోపణలతో స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీ తీవ్ర సంక్షోభంలోకి జారింది. దాదాపు రూ. 2,300 కోట్ల విలువ చేసే క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి రూ. 600 కోట్ల దాకా రుణాలు తీసుకుందని, క్లయింట్ల నిధులను సొంత అవసరాలకు వాడుకుందని కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) ఆరోపణలు ఎదుర్కొంటోంది. దీంతో కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా, పాత క్లయింట్ల పవర్ ఆఫ్ అటార్నీలను (పీవోఏ) ఉపయోగించుకోకుండా కార్వీపై నవంబర్ 22న సెబీ నిషేధం విధించింది. ఎక్సే్ఛంజీల నిబంధనలను ఉల్లంఘించినందుకు అన్ని విభాగాల్లో ట్రేడింగ్ లైసెన్సును సస్పెండ్ చేస్తున్నట్లు ఎక్సే్ఛంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రకటించాయి. ‘మిస్త్రీ’కి ఊరట... 2016 అక్టోబర్ 24న టాటా సన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో మిస్త్రీకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు చట్టవిరుద్ధమని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) స్పష్టం చేసింది. మళ్లీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టవచ్చని, అలాగే, టాటా కంపెనీల్లో డైరెక్టరుగా కూడా ఉండవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో మిస్త్రీ స్థానంలో చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధం అవుతుందని కూడా జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ్ సారథ్యంలోని ద్విసభ్య బెంచ్ తుది ఉత్తర్వులిచ్చింది. ఈ ఆదేశాలు నాలుగు వారాల్లో అమల్లోకి వస్తాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు బిలియనీర్లు ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో రూ.3,80,700 కోట్లతో రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీ భారత్‌లో అపర కుబేరుడుగా నిలిస్తే, ఇదే జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు బిలియనీర్లకూ స్థానం దక్కింది. అరబిందో ఫార్మా చైర్మన్ పీవీ రాంప్రసాద్ రెడ్డికి(రూ.14,800 కోట్లు) 51వ స్థానం లభించగా, ఎంఈఐఎల్ చైర్మన్, ఎండీలు పి. పిచ్చిరెడ్డి (రూ.13,400), పీవీ కృష్ణారెడ్డి (రూ12,900 కోట్లు)లు 57, 63 స్థానాల్లో నిలిచారు. ఇక దివీస్ ల్యాబ్స్– దివి సత్చంద్ర కిరణ్ (రూ.10,200 కోట్లు) , నీలిమ మోటపర్తి (రూ.9,800 కోట్లు) 83, 89 స్థానాల్లో ఉన్నారు. మరో విశేషం ఏమిటంటే... ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ ఇండియా మేగజైన్.. ‘కలెక్టర్స్ ఎడిషన్ 2019’లో ఎంఈఐఎల్ చైర్మన్ పీపీ రెడ్డికి విశిష్ట గౌరవం లభించింది. పీపీ రెడ్డితో సంస్థ ఎండీ పీవీ కృష్ణా రెడ్డి కలిసి ఉన్న ఫొటోతో ‘మేఘా బిల్డర్’ పేరుతో ప్రచురించిన ఈ వ్యాసంలో సంస్థ పురోగతిని వివరించింది. పరిశ్రమలు నిరాశ... పారిశ్రామిక ఉత్పత్తి వరుసగా మూడవనెల– అక్టోబర్‌లోనూ వృద్ధిలేకపోగా ‘క్షీణత’లో నిలిచింది. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌తో ప్రారంభం నుంచీ అక్టోబర్ వరకూ ఏడు నెలల కాలాన్ని చూస్తే, వృద్ధి రేటు 5.7 శాతం నుంచి (2018 ఇదే కాలంలో) 0.5 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది జూలై తర్వాత ఈ రంగంలో అసలు వృద్ధిలేదు. ఇన్ఫీకి విజిల్‌బ్లోయర్స్ షాక్ భారీ ఆదాయాలు చూపించడం కోసం ఇన్ఫీ సీఈవో సలిల్ పరీఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ ’అనైతిక’ విధానాలకు పాల్పడుతున్నారంటూ పేరు వెల్లడించని కొందరు ఉద్యోగుల(విజిల్‌బ్లోయర్స్) ఫిర్యాదులతో ఇన్ఫోసిస్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. -
పసందైన విందు
ఈ గడిచిన ఏడాదిలో క్రికెట్లో ఎన్నో జ్ఞాపకాలున్నాయి. చెలరేగిన ఆటగాళ్లు, పట్టాలెక్కిన పరుగు వీరులున్నారు. చెడుగుడు ఆడిన బౌలర్లున్నారు. చెరిగిన రికార్డులు కూడా ఉన్నాయి. ఎన్ని చెప్పుకున్నా...ఇందులో కొన్నయితే పదిలమైన ముద్ర వేసుకున్నాయి. వాటిని గుర్తుచేసుకుంటే మాత్రం... ప్రత్యేకించి క్రికెట్ ప్రియులకు కళ్లు మూసినా కనువిందే చేస్తాయి. మొత్తానికి 2019 సంవత్సరం క్రికెట్ ప్రేమికులకు పసందైన విందును అందించి వీడ్కోలు పలుకుతోంది. సాక్షి క్రీడావిభాగం: పుట్టింటికి వెళ్లిన ప్రపంచకప్... భారత్‌లో పింక్‌బాల్ టెస్టు... ఓపెనింగ్‌లో రో‘హిట్స్’... బౌలింగ్‌లో దీపక్ చాహర్ చెడుగుడు... టి20 మెరుపులు చూసినోళ్లకు చూసినంత వేడుక చేసింది... క్రికెట్లో ఈ ఏడాది ఇవన్నీ అద్భుతాలేం కావు! కానీ... కొన్ని కోట్ల కళ్లను కట్టిపడేశాయి. తప్పతాగి జీరోగా మారిన వ్యక్తిని ఒక్క మ్యాచ్‌తో హీరోగా మార్చేశాయి. క్రికెట్ లోకానికి పసందైన విందును అందించాయి. ఇంగ్లండ్‌దే వన్డే ప్రపంచం క్రికెట్ ఇంగ్లండ్‌లో పుట్టింది. కానీ పురుషుల జట్టు ఎప్పుడూ వన్డే ప్రపంచకప్‌ను మాత్రం ముద్దాడలేదు. ఆ లోటు తీరింది 2019లో అయితే తీర్చింది మాత్రం ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్! పురిటిగడ్డపై కొత్త చాంపియన్ కోసం జరిగిన పోరు ముందు ‘టై’ అయింది. తర్వాత ‘సూపర్ ఓవర్’ టై దాకా రసవత్తరం చేసింది. తద్వారా కనీవినీ ఎరుగని ఫైనల్‌గా నిలిచింది. ఇప్పటి వరకు ఏ ప్రపంచకప్ తుదిపోరు కూడా ఇలా ఇన్ని ‘టై’ మలుపులు తిరగలేదు. పరుగుల తేడాతోనూ, లేదంటే వికెట్ల తేడాతోనూ గెలిచిన విజేతలే ఉన్నాయి. కానీ మొట్టమొదటి సారిగా ఇటు వికెట్, అటు పరుగులు పైచేయి సాధించలేక... చివరకు ‘బౌండరీ కౌంట్’తో ఇంగ్లండ్ విజేత అయ్యింది. ఇవన్నీ ఈ ఒక్క మ్యాచ్‌లోనే జరిగాయి. ఇక్కడ స్టోక్స్ (84) చేసిన పోరాటం అంతాఇంతా కాదు. అంతక్రితం తప్పతాగి రోడ్డుమీద తగువులాడి ‘జీరో’ అయిన స్టోక్స్ ఈ వీరోచిత పోరాటంతో ‘హీరో’ అయ్యాడు. అనంతరం ఈ బౌండరీల లెక్క పెద్ద చర్చకే దారి తీసింది. అలనాటి స్టార్లు మొదలు దిగ్గజాల వరకు అంతా ‘లెక్క’పై శ్రుతి కలిపారు. ఇది కొన్ని రోజులు, నెలల దాకా సాగడంతో చివరకు ఐసీసీ నిబంధనలు మార్చాల్సి వచ్చింది. మెగా ఈవెంట్ టైటిల్ పోరులో సూపర్ ఓవర్ కూడా ‘టై’ అయితే బౌండరీలను లెక్కపెట్టకుండా... పరుగులు పైచేయి సాధించేదాకా ‘సూపర్’ ఓవర్‌ను కొనసాగించాలని ఐసీసీ నిర్ణయించింది. పొట్టి క్రికెట్లో 4 రికార్డులకు ‘చెక్’ ఐసీసీ పుణ్యమాని చెక్ రిపబ్లిక్ కూడా అంతర్జాతీయ రికార్డు పుటలకెక్కింది. క్రికెట్‌కు విశ్వవ్యాప్త ఆదరణ తెచ్చేందుకని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పొట్టి ఫార్మాట్లో అసోసియేట్, అఫిలియేట్ దేశాల మధ్య జరిగే పోటీలకూ అంతర్జాతీయ హోదా ఇచ్చింది. దీంతో ఈ ఏడాది ఆగస్టు 30న చెక్ రిపబ్లిక్, టర్కీ జట్ల మధ్య జరిగిన ఒక్క టి20ల్లోనే నాలుగు రికార్డులు చెదిరిపోయాయి. 278/4 స్కోరు చేసిన చెక్ 257 పరుగుల తేడాతో టర్కీని కంగుతినిపించింది. టర్కీ 21 పరుగులకే ఆలౌట్ కావడంతో అత్యల్ప స్కోరుకే ఆలౌట్ (నెదర్లాండ్స్ 39 ఆలౌట్), అత్యధిక పరుగుల తేడా (కెన్యాపై శ్రీలంక 172), అత్యధిక జట్టు స్కోరు... 35 బంతుల్లోనే చెక్ ఆటగాడు సుదేశ్ విక్రమశేఖర ‘శత’క్కొట్టడంతో (రోహిత్ శర్మ, మిల్లర్) ఫాస్టెస్ట్ సెంచరీల రికార్డు కనుమరుగయ్యాయి. టెస్టు ‘క్లాసిక్స్’... సంప్రదాయ ఆటలో ఈ ఏడాది రెండు సార్లు ‘ఆఖరి వికెట్’ హంగామా చేయడం విశేషం. ఏ పదో... పాతిక... కాదు ఏకంగా 70 పరుగుల పైచిలుకు భాగస్వామ్యంతో ఆయా జట్లను గెలిపించింది. ఫిబ్రవరిలో డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 304 లక్ష్యంతో దిగిన శ్రీలంక 226/9 స్కోరుతో ఓడేందుకు సిద్ధమైంది. కానీ ఓడలేదు. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన విశ్వ ఫెర్నాండో (6 నాటౌట్)తో కలిసి కుశాల్ పెరీరా (153 నాటౌట్) అజేయమైన విజయ పోరాటం చేశాడు. ఆగస్టులో జరిగిన యాషెస్ సిరీస్‌లోనూ ఆసీస్‌పై ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ స్టోక్స్ (135 నాటౌట్) కూడా ఆఖరి వరుస బ్యాట్స్‌మన్ జాక్ లీచ్ (1 నాటౌట్)తో కలిసి అదే పోరాటం చేశాడు. చాహర్ చెడుగుడు... బంగ్లాదేశ్‌తో భారత్‌లో జరిగిన టి20 ద్వైపాక్షిక సిరీస్‌లో దీపక్ చాహర్ చెడుగుడు ఆడేశాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో చెరొటి నెగ్గడంతో ఆఖరి పోరు నిర్ణాయకమైంది. అంతకుముందెపుడు బంగ్లాతో పొట్టి సిరీస్ కోల్పోని రికార్డు భారత్‌ది. దీంతో కీలకమైన మ్యాచ్‌లో భారత్ 174/5 స్కోరు చేస్తే... లక్ష్యఛేదనలో బంగ్లా ఓ దశలో 110/2 స్కోరుతో పటిష్టంగా కనపడింది. కానీ చాహర్ 3.2–0–7–6 బౌలింగ్ రికార్డుతో బంగ్లా చెల్లాచెదురైంది. ఇందులో అతని ‘హ్యాట్రిక్’ కూడా ఉండటం విశేషం. దీంతో బంగ్లా 144 పరుగులకే ఆలౌటైంది. సిరీస్, సిరీస్ ఓడిపోని రికార్డు భారత్ ఖాతాలో పదిలంగా ఉండిపోయింది. ‘పేస్’ ఇయర్... ఈ సంవత్సరం ‘పేస్’ పదునెక్కింది. వన్డేల్లో వివిధ జట్లకు చెందిన 29 మంది బౌలర్లు 20కి పైగా వికెట్లు తీశారు. అయితే ఇందులో ఐదుగురే స్పిన్నర్లున్నారు. అంటే సింహాభాగం (75 శాతం) ఫాస్ట్ బౌలర్లే. ఓవరాల్‌గా టాప్–5 బౌలర్లలో నంబర్‌వన్ బౌలర్ షమీ. అతను ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో 42 వికెట్లు తీశాడు. 38 వికెట్లతో బౌల్ట్ (కివీస్) రెండో స్థానంలో ఉండగా... తదుపరి స్థానాలు కూడా పేసర్లవే. ఫెర్గూసన్ (కివీస్), ముస్తఫిజుర్ (బంగ్లాదేశ్), భువనేశ్వర్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ భరతం పట్టారు. ఆసీస్ బౌలర్ స్టార్క్ కూడా విశేషంగా ఆకట్టుకున్నాడు. ప్రత్యేకించి వన్డే ప్రపంచకప్‌లో అతను 10 మ్యాచ్‌ల్లోనే 27 వికెట్లు తీశాడు. పదేళ్ల తర్వాత... సాధారణంగా క్రికెట్లో గాయపడిన ఆటగాళ్లు పునరాగమనం చేస్తారు. పాకిస్తాన్లో మాత్రం మరుగునపడిన టెస్టు క్రికెట్ పదేళ్ల తర్వాత లేచి వచ్చింది. శ్రీలంక టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లడంతో పాక్‌లో మళ్లీ అంతర్జాతీయ టెస్టు క్రికెట్ మొదలైంది. 2009లో లంకపైనే ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆగిపోయిన ఆటకు దశాబ్దం తర్వాత లంకనే ఊపిరి పోసింది. టెస్టుల్లో లబ్‌షేన్ తన బ్యాటింగ్ ప్రదర్శనతో ‘టాప్’ లేపాడు. 11 మ్యాచ్‌లే ఆడిన ఈ ఆసీస్ బ్యాట్స్‌మన్ 17 ఇన్నింగ్స్‌ల్లో 1,104 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు వరుస టెస్టుల్లో చేశాడు. మరో 7 అర్ధ సెంచరీలు కూడా బాదాడు. టెస్టుల్లో ఈ ఏడాది వెయ్యి పరుగులు దాటిన ఏకైక బ్యాట్స్‌మన్ లబ్‌షేన్ కావడం విశేషం. స్టీవ్ స్మిత్ (8 మ్యాచ్‌ల్లో 965 పరుగులు) రెండో స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో ఆసీస్ పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఈ ఏడాది ‘టాపర్’గా నిలిచాడు. అతను 12 టెస్టులు ఆడి 59 వికెట్లు తీశాడు. నాథన్ లయన్ (ఆస్ట్రేలియా– 45 వికెట్లు), స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్–43 వికెట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచారు. వన్డేల్లో ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ జోరుపెంచాడు. 28 మ్యాచ్‌లాడిన ఈ ఓపెనర్ 27 ఇన్నింగ్స్‌ల్లో 1490 పరుగులు చేశాడు. 7 శతకాలు, అరడజను అర్ధ శతకాలున్నాయి. ఏడు శతకాల్లో ఐదు సెంచరీలను ఒక్క ప్రపంచకప్‌లోనే చేయడం విశేషం. బెంగళూరులో జరిగిన టి20లో మ్యాక్స్‌వెల్ భారత శిబిరాన్ని వెలవెలబోయేలా చేశాడు. తొలుత కోహ్లి, ధోనిల స్ట్రోక్స్‌తో భారత్ 190/4 స్కోరు చేసింది. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని మ్యాక్స్‌వెల్ (55 బంతుల్లో 113 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆసీస్ 194/3 స్కోరు చేసి సులువుగా ఛేదించింది. భారత్‌లో ఎట్టకేలకు డేనైట్ టెస్టు జరిగింది. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు చేపట్టిన రోజుల వ్యవధిలోనే కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో ఫ్లడ్‌లైట్ల టెస్టు జరిగింది. వీడ్కోలు వీరులు... ఈ ఏడాది పలువురు స్టార్ క్రికెటర్లు ఆటకు గుడ్‌బై చెప్పారు. దక్షిణాఫ్రికా నుంచి హషీమ్ ఆమ్లా, ఇమ్రాన్ తాహిర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోగా... డేల్ స్టెయిన్ టెస్టు ఫార్మాట్‌కు ‘టాటా’ చెప్పాడు. భారత స్టార్ యువరాజ్ సింగ్ జూన్ నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. -
అటువైపు అడుగులు పడనీ...
కాలమొక అవధులు లేని నిరంతర ప్రవాహం. గ్రహగతులు, రుతువులను బట్టి మనిషి గీసుకున్న విభజన రేఖలే దిన, వార, మాస, సంవత్సర కాలఖండికలు. కాలం ఒక మాయాజాలం, కొత్త గాయాలు చేసే అస్త్రమే కాదు, పాత గాయాలు మాన్పే ఔషధమనీ ప్రతీతి! ఏడాది ముగించుకొని కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ! దేశ పరిస్థితి ఎలా ఉంది? ఏయే దారుల వెంట ఈ ఏడాది కాలంలో అడుగులు ఎలా పడ్డాయి? సాధించిన ప్రగతి ఎంత, ఎదురైన వైఫల్యాలెన్ని... సమీక్షిం చుకునే సముచిత సందర్భమిది. జరిగిన మంచికైనా, చెడుకైనా సంకేతాలు విస్పష్టంగానే ఉన్నాయి. ఎవరు, ఏది దాచాలని చూసినా, అన్నీ కళ్లెదుట కనిపిస్తూనే ఉన్నాయి. ప్రతి మార్పూ సగటు మనిషి జీవితాన్ని స్పృశిస్తూనే ఉంది. సంధి కాలంలో నిలబడి.. గతాన్ని తడిమిన అనుభవ పాఠాలతో జాగ్రత్తపడితే భవిష్యత్తులోకి భరోసాతో అడుగేయవచ్చు! ఏయే పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుకోవాలో ప్రణాళికా రచనకిది శుభతరుణం. దేశం నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మందగమనంపై ఎన్ని సంకేతాలు, హెచ్చరికలు వచ్చినా జాగ్రత్తపడకపోవడమూ దీనికొక కారణం కావచ్చు. మెరుగుపడని ఆర్థిక స్థితి వల్లే సమాధానం దొరకని సమస్యలా నిరుద్యోగం ప్రబలుతోంది. రైతు చేయూతకు ఎన్ని చర్యలు చేపట్టినా వ్యవసాయం కునారిల్లుతోంది. పర్యావరణ సమస్య జఠిలమౌతోంది. మానవా భివృద్ధి సూచీలో అడుగునే ఉన్నాం. మరో వంక దేశంలో జాతీయతా భావం బలపడుతోందని, అంతర్జాతీయ సంబంధాలు మెరుగవుతున్నాయని, ప్రపంచ యవనికపై భారత్ ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతోందనే జనాభిప్రాయం విస్తృతంగా ప్రచారంలో ఉంది. అవినీతి నియంత్రణతో పాటు పాలనా సంస్కరణల్లో కొంత ముందడుగు పడింది. ఇరుగుపొరుగుతో ఇబ్బందులున్నప్పటికీ అంత ర్జాతీయ దౌత్య సంబంధాలు మెరుగుపడ్డాయి. తీవ్రవాదంపై పోరుకు అంతర్జాతీయ సమాజాన్ని తనకు అనుకూలంగా భారత్ మలచగలిగింది. ఆర్థిక పరిస్థితి అడుగంటుతున్నా... స్టాక్ మార్కెట్ ఎగిసిపడుతోంది. వీటన్నిటిపైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ నేతృ త్వపు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) ప్రభుత్వ విధానాల ప్రభావం ఉంది. మారు తున్న భాజపా రాజకీయ నిమ్నోన్నతులకు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ స్థితిగతులూ కొంత కార ణమే! ఈ ముఖ్య పార్టీల రాజకీయ సమీకరణాలు, ఉత్తానపతనాలెలా ఉన్నా, నూట పాతిక కోట్ల భారతీయులు ఆశావహంగా ఎదురుచూసే కొత్త సంవత్సరంలో... చెడు తగ్గి, మంచి పెరిగే ఓ బలమైన ముందడుగు పడాలన్నది అందరి అభిలాష. రాజకీయ సుస్థిరత ఆర్థికాంశంతో ముడివడి ఉందనే వాస్తవాన్ని పాలకపక్షాలు అంత తెలిగ్గా అంగీకరించవు. అసలు దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందన్నా, అతినమ్మకపు కాళ్లకింద ఇసుకను ‘మందగమనం’ క్రమంగా కరిగిస్తోందన్నా అవి ఒప్పుకోవు. ప్రస్తుతం బీజేపీ రాజకీయ పరిస్థితి దేశ ఆర్థిక స్థితిని బట్టి మారుతోందనే విషయం ఆ పార్టీకి తప్ప అందరికీ కనిపిస్తోంది. పదేళ్ల ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) పాలన తర్వాత 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. ఆ ఐదేళ్ల పాలనలో బీజేపీ, కూటమి రాజకీయ సూచీ ఊర్ద్వముఖంగా సాగినట్టు అప్పట్లో జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్ని పరిశీలిస్తే స్పష్టమౌతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి స్వాతంత్రదినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ... ‘కులపరమైన సున్నితాంశాలకు, మతపరమైన భావోద్వేగాలకు పదేళ్ల మారిటోరియం విధిస్తున్న’ట్టు ప్రధాని నరేంద్ర మోది బహిరంగ ప్రకటన చేశారు. అది ప్రజలూ నమ్మారు. జనం కష్టాల కడగండ్లు చూసిన పెద్ద నోట్ల రద్దు, సెగ తగిలిన జీఎస్టీ వంటి నిర్ణయాల తర్వాత కూడా పలు రాష్ట్రాల్లో లభించిన సానుకూల ఫలితాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. అవి కల్పించిన విశ్వాసం, పలు ఎత్తుగడలు, వ్యూహాలతో 2019 ఎన్నికల్లో పోరిన బీజేపీ అనూహ్య ఫలితాల్ని సాధించింది. కిందటి ఎన్నికల కన్నా లోకసభ స్థానాల సంఖ్య తగ్గుతుందేమో అని సందేహించిన చోట, సంఖ్య పెరిగింది. సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపోయే నిబ్బరమైన మెజారిటీ బీజేపీకి లభించింది. దాంతో, తమ ఆర్థిక పంథాయే కరెక్టని, తమ రాజకీయ విధానాలకే జనం మద్దతుందని బీజేపీ బలంగా భావించింది. కిందటి అయిదేళ్లలో అణచిపెట్టుకున్న సొంత ఎజెండాను వేగంగా తెరపైకి తెచ్చింది. జాతీయత పేరుతో అధిక సంఖ్యాక వాదం, వివాదాస్పద రామమందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్–అధికరణం 370 రద్దు, జాతీయ పౌర నమోదు పట్టి, పౌర సత్వ సవరణ చట్టం.... ఇలా తనదైన ఎజెండాను అమలుపరుస్తోంది. సహజంగానే వ్యతిరేకత పెరు గుతోంది. అదే సమయంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే చర్యలు పెద్దగా తీసుకోలేదు. తీసుకున్న ఒకటీ, అర చర్యలు సానుకూల ఫలితాలివ్వలేదు. భారత్ ఆర్థిక వృద్ధి రేటు అంచనాల్ని అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు తరచూ తగ్గిస్తున్నాయి. వాస్తవ గణాంకాలూ ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. మూడో త్రైమాసికం ఆర్థిక వృద్దిరేటు 4.5 వద్ద తచ్చాడుతుండగా, నాలుగో త్రైమాసికంలో అది 4 శాతానికి పడిపోయే సంకేతాలే కనిపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగం గొప్పగా మెరుగుపడే సూచనలు లేవని ఆర్థిక నిపుణులంటున్నారు. దీని ప్రభావం సగటు జీవి ప్రత్యక్ష మను గడతో పాటు రాజకీయ సుస్థిరతపైనా పడుతోంది. బీజేపీ క్రమంగా తన రాజకీయ పట్టు కోల్పో తోంది. హర్యానా, మహారాష్ట్ర, జార్ఘండ్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. రాజకీయ వ్యూహ–ప్రతివ్యూహాలిచ్చే విజయాలన్నీ తాత్కాలికం. ప్రజాస్వామ్యంలో ప్రజా భిప్రాయమే ప్రామాణికం. జనం మనోగతం తెలిసి వ్యవహరించడమే పాలకులకు శిరోధార్యం! లక్ష్యం దిశలో ఎటు సాగుతున్నామో స్పష్టత ఉండాలంటే.. ఎక్కడ బయలుదేరామో అవగాహన ఉండాలంటారు. ఏడాది గమనంపై ఆత్మశోధన చేసుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తే కొత్త సంవత్సరం ప్రగతి దిశలో సరికొత్త దారులు పరుస్తుంది. జన జీవితం వెలుగులీనేలా మంచి కాలం వెల్లివిరుస్తుంది. -
2019లో భారీ వసూళ్లు రాబట్టిన సినిమాలివే..
సినిమా పండగను బాక్సాఫీస్ డిసైడ్ చేస్తుంది. ఎంత కలెక్షన్ వస్తే అంత పండగ. ప్రతి సినిమా నచ్చాలని రిలీజయ్యి హిట్ కొట్టాలని ఇండస్ట్రీ కోరుకుంటుంది. కానీ ప్రేక్షకులు తమకు కనెక్ట్ అయిన వాటికే జైకొట్టి కాని వాటికి నై కొడతారు. ఈ సంవత్సరం వారికి నచ్చిన సినిమాలను నెత్తిన పెట్టుకున్నారు. నచ్చనివాటిని చూసి పెదవి విరిచారు. మరింత కష్టపడి ఇంకా బాగా తీస్తే ప్రతి శుక్రవారం పండగ చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇది 2019 రిపోర్ట్. 2019కి అన్ని సంవత్సరాల్లాగే తన వంతు మంచి, తన వంతు చెడు ఉన్నాయి. అది కొందరిని సంతోషపెట్టింది. కొందరిని మరింత బాగా పని చేయమని హెచ్చరించింది. శ్రద్ధ పెట్టి తీస్తే కొత్త సబ్జెక్ట్‌లు కూడా ఆడతాయని, చిన్న సినిమాలు కూడా గెలుస్తాయని తేల్చి చెప్పింది. ఈ ఏడాది స్ట్రయిట్ సినిమాలు సుమారు 190కి పైనే రిలీజ్ అయితే దాదాపు 20 చిత్రాలు మాత్రమే సక్సెస్‌ని టేస్ట్ చేశాయి. ఇది తక్కువ శాతమే. మరిన్ని సినిమాలు ఆడాల్సింది. హిట్ రేట్ ఎక్కువ ఉంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. చిత్రం : మహర్షి నటీనటులు : మహేశ్‌బాబు, పూజా హెగ్డే, ‘అల్లరి’ నరేశ్, ప్రకాశ్‌రాజ్ తదితరులు నిర్మాతలు : అశ్వనీ దత్, ‘దిల్’ రాజు, పీవీపీ దర్శకుడు : వంశీ పైడిపల్లి విడుదల తేది : మే 9 కథ : డబ్బు సాధించడమే నిజమైన సక్సెస్ అనుకునే మనస్తత్వం ఉన్నవాడు రిషి. దానికోసం పరిగెడుతూ ఉంటాడు. ఈ ప్రయాణంలో తనకు దగ్గరైన ఇద్దరు వ్యక్తులకు దూరం అవుతాడు. ఫైనాన్షియల్ సక్సెస్ ముఖ్యమా? ఎమోషనల్ సక్సెస్ గొప్పా? అనే సందిగ్ధంలో రిషి ఎటు వైపు నడిచాడు? ఇంతకీ జీవితంలో నిజమైన సక్సెస్ ఏంటో తెలుసుకున్నాడా? అనేది కథ. బడ్జెట్: 130 కోట్లు ; వసూళ్లు: 145 కోట్లు ‘మహర్షి’లో మహేశ్‌బాబు చిత్రం : ఎఫ్ 2 నటీనటులు : వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ డైరెక్టర్ : అనిల్ రావిపూడి నిర్మాత : ‘దిల్’ రాజు విడుదల తేది : జనవరి 12 కథ : భార్య పెట్టే బాధలను భరించలేక వెంకటేశ్, పెళ్లయితే జీవితం ఇలా ఉంటుందేమోనని భయంతో వరుణ్ తేజ్, ఆల్రెడీ పెళ్లయిన రాజేంద్రప్రసాద్ బ్యాంకాక్ పారిపోతారు. ఆ తర్వాత తమ భార్యలకు వేరే వాళ్లతో పెళ్లి సెట్ అవుతుందని తెలుసుకొని పెళ్లి చెడగొట్టే ప్రయత్నాలు చేస్తారు తోడుఅల్లుళ్లు వెంకీ, వరుణ్. ఈ ప్రయత్నాల్లో ఫ్రస్ట్రేట్ అవుతూ ఫన్ ఎలా క్రియేట్ చేశారన్నది కథ. బడ్జెట్: 40 కోట్లు ; వసూళ్లు: 94 కోట్లు ‘ఎఫ్2’లో వెంకటేశ్, వరుణ్ తేజ్ చిత్రం : యాత్ర నటీనటులు : మమ్ముట్టి, జగపతిబాబు, సుహాసిని డైరెక్టర్ : మహీ వి రాఘవ్ నిర్మాత : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి విడుదల తేదీ : ఫిబ్రవరి 8 కథ : మాజీ ముఖ్యమంత్రి, దివంగత జన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ ప్రస్థానంలో పాదయాత్ర ప్రముఖమైనది. ఈ యాత్ర చేపట్టడానికి కారణాలు, ఇందులో భాగంగా ఆయన కలుసుకున్న మనుషులు, తెలుసుకున్న విషయాలు ఏంటి? తద్వారా చేపట్టిన ప«థకాలేంటి అనేది కథాంశం. బడ్జెట్: 18 కోట్లు ; వసూళ్లు : 22 కోట్లు ‘యాత్ర’లో మమ్ముట్టి చిత్రం : ఇస్మార్ట్ శంకర్ నటీనటులు : రామ్, నభా నటేశ్, నిధీ అగర్వాల్ నిర్మాత : పూరి జగన్నాథ్, చార్మి దర్శకుడు : పూరి జగన్నాథ్ విడుదల తేదీ : జూలై 18 కథ : శంకర్ హైదరాబాద్‌లో చిన్న రౌడీ. ఓ సెటిల్మెంట్లో భాగంగా ఓ ఎం.ఎల్.ఏని చంపేస్తాడు. ఆ కేస్‌ని ఇన్వేస్టిగేట్ చేస్తూ ఓ పోలీసాఫీసర్ చనిపోతాడు. అతని మెదడులోని సమాచారాన్ని శంకర్ మెదడులోకి చిప్ ద్వారా పొందుపరుస్తారు. శంకర్ పోలీసులకు సహాయం చేస్తాడా? లేదా అనేది కథ. బడ్జెట్: 27 కోట్లు ; వసూళ్లు: 78 కోట్లు ‘ఇస్మార్ట్ శంకర్’లో రామ్ చిత్రం : జెర్సీ నటీనటులు : నాని, శ్రద్ధాశ్రీనాథ్ దర్శకుడు : గౌతమ్ తిన్ననూరి నిర్మాతలు : సూర్యదేవర నాగవంశీ విడుదల తేది : ఏప్రిల్ 19 కథ : 25 ఏళ్ల వయసులో అనుకోకుండా క్రికెట్‌కు దూరం కావాలనుకుంటాడు అర్జున్. కానీ 36 ఏళ్ల వయసులో మళ్లీ ఇండియన్ టీమ్‌కు ఆడాలని నిశ్చయించుకుంటాడు. మళ్లీ క్రికెట్ ఆడాలని ఎందుకు అనుకున్నాడు? అనుకున్నది సాధించాడా లేదా? అనేది కథాంశం. బడ్జెట్: 25 కోట్లు ; వసూళ్లు: 36 కోట్లు ‘జెర్సీ’లో నాని చిత్రం : ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నటీనటులు : నవీన్ పొలిశెట్టి, శృతీ శర్మ, సుహాస్ నిర్మాత : రాహుల్ యాదవ్ నక్కా దర్శకుడు : స్వరూప్ ఆర్ఎస్ జె విడుదల తేది : జూలై 21 కథ : డిటెక్టివ్ సినిమాల్లో ట్విస్ట్ రివీల్ అవ్వకముందే పసిగడితే చాలు కేసులు స్వాల్ చేయొచ్చు అనుకునే అమాయకపు జీనియస్ ఆత్రేయ. గుళ్లో హుండీలో డబ్బులు పోవడం, కుక్క పిల్లలు తప్పిపోవడం వంటి చిన్న చిన్న కేసులు డీల్ చేస్తుంటాడు. ఆ సమయంలోనే ఓ అనాథ శవాలతో క్రైమ్‌ను నడిపించే ఓ పెద్ద మాఫియా కేసుని టేకప్ చేస్తాడు ఆత్రేయ. ఆ మిస్టరీని ఎలా చేధించాడు? అనేది చిత్రకథ. బడ్జెట్: 4 కోట్లు వసూళ్లు: 20 కోట్లు ‘ఏజెంట్ సాయిశ్రీనివాస...’లో నవీన్ చిత్రం : మజిలీ నటీనటులు : నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్ దర్శకుడు : శివ నిర్వాణ నిర్మాతలు : సాహు గారపాటి, హరిష్ పెద్ది విడుదల తేది : ఏప్రిల్ 5 కథ : క్రికెటర్ అవ్వాలనుకుంటాడు వైజాగ్ కుర్రాడు పూర్ణ (నాగచైతన్య). అది పూర్ణ తండ్రికి ఇష్టం ఉండదు. క్రికెట్‌పై ఫోకస్ పెడుతున్న సమయంలో అతని జీవితంలోకి అన్షూ (దివ్యాంశ) ప్రవేశిస్తుంది. కానీ శ్రావణి (సమంత)ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పూర్ణ ఎందుకు క్రికెటర్ కాలేకపోయాడు. అసలు అన్షు–పూర్ణ ఎలా విడిపోయారు? పూర్ణ లైఫ్‌లోకి శ్రావణి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు ఏంటి? అనేది కథ. బడ్జెట్: 30 కోట్లు ; వసూళ్లు: 47 కోట్లు ‘మజిలీ’లో నాగచైతన్య చిత్రం: డియర్ కామ్రేడ్ నటీనటులు : విజయ్ దేవరకొండ, ర ష్మికా మందన్నా నిర్మాత : మైత్రీ మూవీ మేకర్స్ దర్శకుడు : భరత్ కమ్మ విడుదల తేదీ : జూలై 26 కథ : లిల్లీ (రష్మిక) పెద్ద క్రికెటర్ కావాలనుకుంటుంది. తన అక్క పెళ్లికోసం కాకినాడ వెళ్లినప్పుడు బాబీతో (విజయ్) ప్రేమలో పడుతుంది. అనివార్య కారణాలతో తనకి ఇష్టమైన క్రికెట్‌ను వదిలేయాల్సి వస్తుంది. దానికి కారణమేంటి? లిల్లీ తన లక్ష్యాన్ని చేరుకునేలా బాబీ ఎలా సహాయం చేశాడు అన్నదే కథ. బడ్జెట్: 30 కోట్లు వసూళ్లు: 45 కోట్లు ‘డియర్ కామ్రేడ్’లో రష్మిక, విజయ్ చిత్రం: గద్దలకొండ గణేశ్ నటీనటులు : వరుణ్ తేజ్, పూజా హెగ్డే, అథర్వ మురళి నిర్మాత : 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ దర్శకుడు : హరీశ్ శంకర్ విడుదల తేది : సెప్టెంబర్ 20 కథ : అథర్వ దర్శకుడు కావాలనుకుంటాడు. దానికోసం ఓ నిజమైన విలన్ మీద సినిమా తీయాలనుకుంటాడు. అలా గద్దల కొండ గణేశ్ (వరుణ్ తేజ్)æ ఊరికి ప్రయాణం అవుతాడు. మరి తను అనుకున్నది సాధించాడా లేదా అనేది కథాంశం. బడ్జెట్ : 35 కోట్లు ; వసూళ్లు : 45 కోట్లు ‘గద్దలకొండ గణేష్’లో పూజ, వరుణ్ చిత్రం : రాక్షసుడు నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ నిర్మాత : కోనేరు సత్యనారాయణ దర్శకుడు : రమేష్ వర్మ విడుదల తేది : ఆగస్ట్ 2 కథ : నగరంలో వరుసగా ఆడపిల్లలు కిరాతకంగా హత్యకు గురవుతుంటారు. దీని వెనక ఓ సైకో కిల్లర్ ఉంటాడు. ఆ సైకో కిల్లర్ ఎందుకిలా చేస్తున్నాడు? ఈ హత్యలు చేయడానికి గల కారణాలేంటి? పోలీస్ ఆఫీసర్ అరుణ్ (బెల్లంకొండ సాయిశ్రీనివాస్) అతన్ని ఎలా పట్టుకున్నాడన్నదే చిత్రకథ. తమిళ చిత్రం ‘రాక్షసన్’కి ఇది తెలుగు రీమేక్. బడ్జెట్: 28 కోట్లు ; వసూళ్లు: 35 కోట్లు ‘రాక్షసుడు’లో సాయిశ్రీనివాస్.... చిత్రం: ఎవరు నటీనటులు : అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర నిర్మాత : పీవీపీ దర్శకుడు : వెంకట్ రామ్‌జీ విడుదల తేది : ఆగస్ట్ 15 కథ : అత్యాచారానికి గురయ్యానని చెప్పుకుంటుంది రెజీనా. తనని తాను కాపాడుకునే ప్రయత్నంలో తన మీద దాడి చేసిన పోలీస్ ఆఫీసర్‌ను కాల్చి చంపానని చెబుతుంది. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఓ లంచగొండి పోలీస్ ఆఫీసర్ సహాయం తీసుకుంటుంది. అసలు నిజంగానే రెజీనా అత్యాచారానికి గురైందా? ఒకవేళ జరగకపోతే ఎందుకలా చెప్పింది? ఆమె టార్గెట్ ‘ఎవరు’ అనేది చిత్రకథ. బడ్జెట్: 8 కోట్లు వసూళ్లు: 15.5 కోట్లు ‘ఎవరు’లో రెజీనా, అడివి శేష్ చిత్రం : 118 నటీనటులు : కల్యాణ్‌రామ్, నివేదా థామస్, షాలినీ పాండే డైరెక్టర్ : కేవీ గుహన్ ; నిర్మాత : మహేష్ కోనేరు ; విడుదల : మార్చి 1 కథ : ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు గౌతమ్ (కల్యాణ్ రామ్) వర్క్ విషయమై ఓ రిసార్ట్‌లోని 118 అనే రూమ్‌లో ఉండాల్సి వస్తుంది. సరిగ్గా 1 గంట 18 నిమిషాలకు ఎవరో ఓ అమ్మాయిని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కలగంటాడు. మరో సందర్భంలోనూ అదే కల. ఆ గదికి, అతని కలకు ఉన్న లింక్ ఏంటి? గౌతమ్‌కి వచ్చిన కల నిజంగా జరిగిందా? ఈ ప్రాసెస్‌లో గౌతమ్‌కి ఎదురైన సంఘటనలు ఏంటి? అన్నదే కథ. బడ్జెట్ : 12 కోట్లు ; వసూళ్లు: 17 కోట్లు చిత్రం: ఓ బేబీ నటీనటులు : సమంత, లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్, నిర్మాత : సునీతా తాటి , వివేక్ కూచిభొట్ల దర్శకుడు : నందినీ రెడ్డి విడుదల తేది : జూలై 5 కథ : 70 ఏళ్లు పైబడిన లక్ష్మికి తన జీవితాన్ని 20 ఏళ్ల వయసున్న అమ్మాయిలా జీవించే అవకాశం వస్తే ఏం చేసింది? ఎలా అల్లరి చేసింది? తన కుటుంబంతో ఏర్పడ్డ మనస్పర్థలు ఎలా తొలగించింది? అనే కథాంశంతో ‘ఓ బేబీ’ తెరకెక్కింది. కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’కి ఇది తెలుగు రీమేక్. బడ్జెట్: 16 కోట్లు ; వసూళ్లు: 40 కోట్లు ‘ఓ బేబీ’లో సమంత చిత్రం: గ్యాంగ్‌లీడర్ నటీనటులు : నాని, లక్ష్మీ, కార్తికేయ, ప్రియాంక మోహనన్ నిర్మాత : మైత్రీ మూవీ మేకర్స్ దర్శకుడు : విక్రమ్ కె కుమార్ విడుదల తేది : సెప్టెంబర్ 13 కథ : ఇంగ్లీష్ సినిమాల్లో కథల్ని కాపీ కొట్టి ప్రతీకార నవలలు రాస్తుంటాడు పార్థసారధి. తమకు జరిగిన అన్యాయం ఎదుర్కోవడానికి ఓ రివెంజ్ ప్లాన్ కావాలంటూ ఐదురుగురు మహిళలు అతని దగ్గరకు వస్తారు. వాళ్ల ప్రతీకారం ప్లాన్‌ను పార్థసారథి ఎలా రాశాడన్నది కథ. బడ్జెట్: 40 కోట్లు ; వసూళ్లు: 45 కోట్లు ‘గ్యాంగ్‌లీడర్’లో నాని, ప్రియాంక చిత్రం : లక్ష్మీస్ ఎన్టీఆర్ నటీనటులు : విజయ్‌కుమార్, యజ్ఞాశెట్టి, శ్రీతేజ్ దర్శకులు : రామ్‌గోపాల్ వర్మ, అగస్త్య మంజు నిర్మాతలు : రాకేష్ రెడ్డి, దీప్తి విడుదల తేది : మార్చి 29 కథ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీఆర్ జీవితంలో రాజకీయ వెన్నుపోటు పర్వంగా ప్రజలు చెప్పుకునే సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చినప్పటి నుంచి ఆయన జీవితం ఎలా సాగిందనే అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బడ్జెట్: రెండున్నర కోట్లు ; వసూళ్లు: 7 కోట్లు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో విజయ్‌కుమార్ చిత్రం : చిత్రలహరి నటీనటులు : సాయిధరమ్ తేజ్, నివేదా పేతురాజ్, కల్యాణీ ప్రియదర్శన్ దర్శకుడు : కిశోర్ తిరుమల నిర్మాతలు : నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ విడుదల తేది : ఏప్రిల్ 12 కథ: లైఫ్‌లోని ప్రతీ స్టేజ్‌లో విజయ్ కృష్ణను (సాయి తేజ్) ఫెయిల్యూరే పలకరిస్తుంది. అందరూ అతన్ని ఫెయిల్యూర్ అంటున్నప్పటికీ అతని తండ్రి మాత్రం విజయ్ను ప్రోత్సహిస్తుంటాడు. ఈ క్రమంలో అతను డెవలప్ చేస్తున్న యాప్ ప్రజెంటేషన్, తన లవ్ లైఫ్ రెండూ అనుకున్నట్టు జరగవు. ఆ టైమ్‌లో విజయ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? అతనికి సాయంగా నిలబడింది ఎవరు? విజయ్ ఎలా గెలిచాడు అన్నదే కథ. బడ్జెట్: 16 కోట్లు ; వసూళ్లు : 25 కోట్లు ‘చిత్రలహరి...’లో సాయితేజ్, కల్యాణి చిత్రం : మత్తు వదలరా నటీనటులు : శ్రీ సింహా, సత్య డైరెక్టర్ : రితేష్ రానా నిర్మాతలు : చెర్రీ (చిరంజీవి), హేమలత) కథ : చాలీ చాలని జీతంతో కష్టపడే డెలివరీ బాయ్ హీరో శ్రీసింహా. తన మిత్రుడు ఇచ్చిన ఐడియా మేరకు ఓ పని చేస్తాడు. ఆ ఐడియా అతన్ని ఎలాంటి ఇబ్బందుల్లో పడేసింది? అందులోనుంచి ఎలా బయటకు వస్తాడు? అనేది కథ. బడ్జెట్: 2 కోట్లు ; వసూళ్లు: (మంచి టాక్‌తో ఇంకా థియేటర్స్‌లో ప్రదర్శితం అవుతోంది ) ‘మత్తు వదలరా..’లో శ్రీసింహా... చిత్రం : అర్జున్ సురవరం నటీనటులు : నిఖిల్, లావణ్యా త్రిపాఠి నిర్మాత : రాజ్‌కుమార్ ఆకెళ్ల, ఠాగూర్ మధు దర్శకుడు : టి. సంతోష్ విడుదల తేది : నవంబర్ 29 కథ : అర్జున్ ఓ టీవీ ఛానెల్ రిపోర్టర్. అనుకోకుండా నకిలీ సర్టిఫికెట్ల స్కామ్‌లో ఇరుక్కుంటాడు. ఈ స్కామ్ వెనక ఉన్నది ఎవరు? ఇందులో నుంచి తను ఎలా తప్పించుకున్నాడన్నది కథాంశం. బడ్జెట్ : 10 కోట్లు ; వసూళ్లు : 20 కోట్లు ‘అర్జున్ సురవరం’లో నిఖిల్ చిత్రం : ప్రతిరోజూ పండగే నటీనటులు : సాయి తేజ్, సత్యరాజ్, రాశీ ఖన్నా, రావు రమేశ్ నిర్మాత : బన్నీ వాస్ దర్శకుడు : మారుతి విడుదల తేది: డిసెంబర్ 20 కథ: పుట్టినరోజు, పెళ్లిలానే చావు కూడా మన జీవితంలో ఓ విశేషమే. దాన్ని కూడా ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ఇది. బడ్జెట్: 25 కోట్లు ; వసూళ్లు : 40 కోట్లు (ఇంకా థియేటర్స్‌లో ప్రదర్శిస్తున్నారు) ‘ప్రతిరోజూ పండగే’లో సత్యరాజ్, సాయితేజ్ చిత్రం : వెంకీ మామ నటీనటులు : వెంకటేశ్, నాగచైతన్య డైరెక్టర్ : కేయస్ రవీంద్ర (బాబి) నిర్మాతలు : సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ విడుదల తేది : డిసెంబర్ 13 కథ : వెంకటేశ్, నాగచైతన్య మామాఅల్లుళ్లు. అల్లుడి కోసం అసలు పెళ్లే వద్దు అనుకున్న మామ, మామను విడిచి ఉండటం ఇష్టం లేక వచ్చిన మంచి ఉద్యోగాన్ని కూడా వదులుకున్న అల్లుడు... మరి ఇలాంటి మామాఅల్లుళ్లు మూడేళ్లు కలుసుకోకుండా ఉండాల్సి వస్తుంది. దానికి కారణం ఏంటి? మామాఅల్లుళ్లు మళ్లీ ఎలా కలుసుకున్నారు అనేది కథ. బడ్జెట్: 45 కోట్లు ; వసూళ్లు: 60 కోట్లు (ఇంకా థియేటర్స్‌లో రన్ అవుతోంది) ‘వెంకీమామ’లో నాగచైతన్య, వెంకటేశ్ చిత్రం : మల్లేశం నటీనటులు : ప్రియదర్శి, అనన్య, ఝాన్సీ దర్శక–నిర్మాత: రాజ్ ఆర్ విడుదల తేది : జూలై 21 కథ : పద్మశ్రీ అవార్డుగ్రహీత చింతకింది మల్లేశం బయోపిక్ ఇది. ఆసు పోయడం కోసం అమ్మ పడుతున్న అవస్థను చూడలేక ఆసు యంత్రం తయారు చేయాలనుకుంటాడు మల్లేశం. 6వ తరగతి కూడా పాస్ కాని మల్లేశం ఆసు యంత్రం ఎలా కనుక్కొన్నాడు? ఈ మెషీన్ తయారీలో తనకు ఎదురైన అడ్డంకులేంటి? అన్నది కథాంశం. బడ్జెట్ : రెండున్నర కోట్లు ; వసూళ్లు: 5 కోట్లు ‘మల్లేశం’లో ప్రియదర్శి చిత్రం : బ్రోచేవారెవరురా నటీనటులు : శ్రీవిష్ణు, నివేదా థామస్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నిర్మాత : మన్యం విజయ్ కుమార్ దర్శకుడు : వివేక్ ఆత్రేయ విడుదల తేది : జూలై 21 కథ : దర్శకుడు అవ్వాలని కలలు కంటుంటాడు సత్యదేవ్. ఓ టాప్ హీరోయిన్‌కి కథ చెప్పే అవకాశం వస్తుంది. ఇంటర్ ఐదేళ్లుగా పాస్ అయ్యే ప్రయత్నం చేస్తుంటారు శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. వీళ్ల గ్యాంగ్‌లో ప్రిన్సిపల్ కూతురు నివేదా థామస్ కూడా తోడవుతుంది. సరదాగా సాగిపోతున్న సమయంలో నివేదా కిడ్నాప్ అవుతుంది. సత్యదేవ్, నివేదా పేతురాజ్ వెళ్తున్న కార్కి యాక్సిడెంట్ అవుతుంది. సత్యదేవ్ సినిమా మొదలెట్టాడా? నివేదా థామస్ కిడ్నాపర్స్ నుంచి ఎలా బయటపడింది? అన్నది కథాంశం . బడ్జెట్: 7 కోట్లు ; వసూళ్లు: 20 కోట్లు ‘బ్రోచేవారెవరురా..’లో శ్రీవిష్ణు.. డబ్బింగ్ సినిమాలు ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు ప్రభావం చూపించలేదనే చెప్పాలి. దాదాపు 70 డబ్బింగ్ సినిమాలు విడుదలైతే కార్తీ ‘ఖైదీ’ స్థాయిలో వేరే ఏ అనువాద చిత్రం వసూళ్లు రాబట్టలేదు. రజనీకాంత్ ‘పేటా’ తమిళంలో మంచి సక్సెస్ అయినా తెలుగులో అనుకున్నంతగా ఆడలేదు. రాఘవ లారెన్స్ ‘కాంచన 3’ మంచి వసూళ్లను రాబట్టింది. సూర్య ‘ఎన్జీకే’ పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. కార్తీ ‘దొంగ’ ఫర్వాలేదనిపించుకుంది. ఎన్నో అంచనాలతో విడుదలైన మలయాళ చిత్రం ‘లవర్స్ డే’ ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. సల్మాన్ ఖాన్ ‘దబంగ్ 3’ దబంగ్ సిరీస్‌లోనే వీక్ అనిపించుకుంది. ‘ఖైదీ’లో కార్తీ 2019లో భారీ అంచనాల నడుమ విడుదలై, ఆ అంచనాలను అందుకోలేకపోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. రామ్‌చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ ‘వినయ విధేయ రామ’ పెద్ద నిరాశనే మిగిల్చింది. ఎన్టీఆర్ బయోపిక్‌గా తెరకెక్కిన ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’, ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ తన కలెక్షన్ల ప్రేమలో విఫలమయ్యాడు. నాగార్జున ‘మన్మథుడు 2’ మిశ్రమ స్పందనకు గురైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ ‘సాహో’ మేకింగ్‌లో మార్కులు పొందినా కలెక్షన్లను ఊహించిన స్థాయిలో రాబట్టలేకపోయింది. ‘సైరా: నరసింహా రెడ్డి’ భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. దేశభక్తి కథాంశం, చిరంజీవి కష్టపడి పని చేయడం సినిమా మీద అంచనాలను పెంచాయి. ఆ అంచనాలను అందుకోవడంలో అది అంతిమంగా వెనకబడింది. కాంట్రవర్శియల్ చిత్రంగా విడుదలైన ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ రిలీజ్‌కు ముందు ఉన్న ఆసక్తిని రిలీజ్ తర్వాత థియేటర్ల దాకా తీసుకురాలేకపోయింది.. బాలకృష్ణ ‘రూలర్’ అంతకుముందు సేమ్ కాంబినేషన్ (బాలకృష్ణ–కె.ఎస్. రవికుమార్)లో వచ్చిన ‘జై సింహా’ను మరపించలేకపోయింది. ∙‘సైరా’లో చిరంజీవి ‘వినయ విధేయ...’లో రామ్‌చరణ్ ‘సాహో’లో ప్రభాస్ ‘యన్.టి.ఆర్’ బయోపిక్‌లో బాలకృష్ణ గమనిక : సినిమా బడ్జెట్, వసూళ్లకు చెందిన లెక్కలన్నీ సుమారుగా చెప్పినవే. అన్ని హక్కులు, థియేట్రికల్ రన్‌ను పరిగణించి వసూళ్లు ప్రచురించాం. -
2019లో నింగికేగిన ప్రముఖులు...
జీవితమే పోరాటంగా అహర్నిశలు శ్రమించిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు 2019లో నింగి కేగిశారు. సాహిత్య, సామాజిక సేవా రంగాలకు చెందిన పలువురి ప్రముఖుల మరణాలు అభిమానులను కలచివేశాయి. సాహిత్య రంగంలో సాహితీ సవ్యసాచిగా పేరుగాంచిన ద్వా.నా. శాస్త్రి, తెలుగులో అరుదైన కథలు రాసిన సాహిత్యవేత్తగా గుర్తింపు పొందిన అబ్బూరి ఛాయాదేవి ఈ ఏడాది కనుమరుగయ్యారు. సామాజిక సేవా రంగంలో అభ్యుదయవాది, స్త్రీ విద్య, మహిళా సాధికారతకు విశేష కృషి చేసిన డాక్టర్ వి.కోటేశ్వరమ్మ ఈ ఏడాది తుదిశ్వాస విడిచారు. కుష్ఠు వ్యాధి బాధితుల కోసం జీవితాంతం కృషి చేసిన దామోదర్ గణేష్ కన్నుమూశారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ లోకాన్ని విడిచిపెట్టడం విషాదాన్ని నింపింది. ►సాహిత్య రంగం.. ద్వానా శాస్త్రి సాహితీ సవ్యసాచిగా పేరుగాంచిన ద్వా.నా. శాస్త్రి.. విభిన్న పత్రికల్లో వేలాది పుస్తక సమీక్షలు చేసిన ఏకైక వ్యక్తి. వందేళ్లనాటి ఛాయా చిత్రాలు, అరుదైన పుస్తకాలు, అలనాటి విశేష కవితలు, వెలుగులోకి తెచ్చారు. అంతేకాకుండా సాహిత్యంలో పలు ప్రయోగాలు చేసి అంతర్జాతీయ రికార్డులు సొంతం చేసుకున్నారు. ఏకధాటిగా 12 గంటల పాటు తెలుగు భాషా సాహిత్యాలపై ప్రసంగించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.కాగా ద్వా.నా.శాస్త్రి అని పిలవబడే ద్వాదశి నాగేశ్వర శాస్త్రి కృష్ణాజిల్లా లింగాలలో 1948 జూన్ 15వ తేదీన జన్మించారు. శ్వాసకోశ వ్యాధితో ఫిబ్రవరి 25న ఆయన కన్నుమూశారు. అబ్బూరి ఛాయాదేవి తెలుగులో అరుదైన కథలు రాసిన సాహిత్యవేత్తగా గుర్తింపు పొందిన ఛాయాదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో 1933 అక్టోబర్ 13వ తేదీన జన్మించారు. ప్రముఖ రచయిత, విమర్శకుడు, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు అబ్బూరి వరదరాజేశ్వరరావు సతీమణి ఛాయాదేవి. 1960 దశకంలో ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైబ్రేరియన్‌గా ఆమె పనిచేశారు. స్త్రీల జీవితాల్లోని దృక్కోణాలను కథల్లో ఛాయాదేవి ఆవిష్కరించారు. బోన్సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. బోన్సాయ్ బ్రతుకు కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో పెట్టింది. ఆమె రాసిన 'తన మార్గం' కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 2003లో వాసిరెడ్డి రంగనాయకమ్మ ప్రతిభా పురస్కారం, 1996లో తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు అందుకున్నారు. జూన్ 28న ఆమె తుది శ్వాస విడిచారు. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ అభ్యుదయ కవి, సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంత శర్మ జూలై 26న కన్నుమూశారు. 1944 మే 29న జన్మించిన ఇంద్రగంటికి.. తండ్రి హనుమత్ శాస్త్రి సుప్రసిద్ధ కవి కావడంతో సహజంగానే సాహిత్యం ఒంటబట్టింది. విద్యార్థి దశనుంచే ఆయన రచనావ్యాసాంగాన్ని చేపట్టారు. చిన్నవయసులోనే అభ్యుదయ కవిగా ప్రసిద్ధులయ్యారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి వారపత్రికలో సబ్ఎడిటర్గా పనిచేశారు. 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సహాయ సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించారు. రేడియోలో నాటికలు, డాక్యుమెంటరీలు, సంగీత రూపకాలకు ప్రాణం పోశారు. ఆ తర్వాత ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికకు సంపాదకులుగా కూడా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ పనిచేశారు. ఇంటిపేరు ఇంద్రగంటి పేరుతో తన ఆత్మకథను వెలువరించారు. గత యాభై సంవత్సరాల్లో తానెరిగిన సాహిత్య జీవితాన్ని, అలాగే తన కుటుంబ విశేషాలను, రచయితగా తన అనుభవాలను కలగలిపి ఈ ఆత్మ కథ రాసి 2018 జనవరిలో విడుదల చేశారు. రామతీర్థ వక్తగా, అనువాదకుడిగా, కవిగా, వ్యాసకర్తగా, విమర్శకుడిగా గుర్తింపు పొందిన రామతీర్థ మే 30న కన్నుమూశారు. అసలు పేరు యాబలూరు సుందర రాంబాబు. 1960లో నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలో జన్మించారు. తండ్రి రైల్వే ఉద్యోగి కావడం వల్ల నెల్లూరు, ఒడిశాలలో విద్యాభ్యాసం సాగింది. బి.ఎ. తర్వాత 1981లో పారదీప్ పోర్టులో కార్మికుల రక్షణ విభాగంలో ఉద్యోగంలో చేరారు. 1985లో బదిలీపై విశాఖపట్నం వచ్చి అక్కడే స్థిరపడ్డారు. ఐదేళ్ళ క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పూర్తి కాలం సాహితీసేవలో నిమగ్నమయ్యారు. మహాస్వప్న.. దిగంబర కవిత్వోద్యమానికి శంఖారావం పూరించిన మహాస్వప్న.. జూన్ 24న కన్నుమూశారు. మహాస్వప్న అసలు పేరు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. కమ్మిశెట్టి వెంకయ్య నారాయణమ్మల ఏకైక కుమారుడు. ఆయనకు ఒక చెల్లెలు ఉంది. వృతిరీత్యా వ్యవసాయదారుడు. ఆజన్మ బ్రహ్మచారిగానే జీవితాంతం గడిపారు. ఇంటర్మీడియెట్ వరకు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మహాస్వప్న చదువుకున్నారు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌కు వెళ్లడంతో, ఆయన జీవితం మలుపు తీసుకొంది. అక్కడ వివేకవర్థని కళాశాలలో బీఏలో చేరారు. ఈ క్రమంలో అభ్యుదయ, ప్రగతిశీల సాహిత్యంతో పరిచయం పెంచుకొన్నారు. 1958లో ప్రముఖ సంపాదకుడు నార్ల చిరంజీవి సహకారంతో పద్దెనిమిదేళ్ల వయసులోనే ‘చందమామ’ పేరుతో బాలకవితా సంపుటి వెలువరించారు. 1964లో అగ్నిశిఖలు - మంచు జడులు, స్వర్ణధూళి, కవితా సంపుటిలను ప్రచురించారు. వాసా ప్రభావతి ప్రముఖ రచయిత్రి, సాహితీవేత్త డాక్టర్ వాసా ప్రభావతి అనారోగ్యంతో డిసెంబర్ 18న కన్నుమూశారు. ఆమె వాసా ప్రభావతి పలు నవలలు రాశారు. ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యురాలిగా కూడా పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు కాశీచేనుల సూర్యనారాయణ లక్ష్మీదేవమ్మ దంపతులకు 1940లో ఆమె జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధురాలు దువ్వూరి సుబ్బమ్మపై ‘దేశ బాంధవి’ అనే పుస్తకాన్ని ప్రభావతి రాశారు. వెండి వెలుగులు, హృదయ నేత్రం, పలు పద్య కావ్యాలు, 50కి పైగా లలిత గీతాలు, నవలలు, 20 వరకు నాటకాలు రాశారు. కులశేఖర్‌రావు ప్రముఖ సాహితీవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య మడుపు ఎం.కులశేఖర్‌రావు మే నెల లో కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో జన్మించిన కులశేఖర్‌రావు తెలంగాణలో తొలితరం సాహితీవేత్త. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ, ఎంఏ తెలుగు చదివారు. ఆంధ్ర వచన వాజ్ఞ్మయ వికాసంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. ఉస్మానియా వర్సిటీ తెలుగు శాఖలో మూడున్నర దశాబ్దాలపాటు లెక్చరర్‌గా, రీడర్‌గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా, శాఖ అధిపతిగా సేవలందించారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో పలు రచనలు, పద్య రచనలు సైతం అందించారు. తెలుగు సాహిత్య చరిత్రను ఆంగ్లంలో రాశారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి సాహిత్య బహుముఖి వ్యక్తిత్వంపై ఆంగ్లంలో ఒక గ్రంధాన్ని రచించారు. ►సామాజిక సేవా రంగం.. వి.కోటేశ్వరమ్మ విజయవాడ మాంటిస్సోరి విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు, అభ్యుదయవాది, స్త్రీ విద్య, మహిళా సాధికారతకు విశేష కృషి చేసిన డాక్టర్ వి.కోటేశ్వరమ్మ జూన్ 30న కన్నుమూశారు. విజయవాడ సమీపంలోని గోశాలలో కోనేరు వెంకయ్య, మీనాక్షి దంపతులకు 1925, మార్చి 5న కోటేశ్వరమ్మ జన్మించారు. తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ చేసి నెల్లూరు, విజయవాడల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. మహిళలు చదువుకుంటేనే పురుషులతో సమానంగా రాణిస్తారన్న నమ్మకంతో 1955లో చిల్డ్రన్స్ మాంటిస్సోరి స్కూల్‌ను స్థాపించారు. ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను ఒప్పించి మరీ బాలికలను పాఠశాలలో చేర్పించేవారు. పది మందితో ప్రారంభమైన ఆ పాఠశాల క్రమంగా ప్రాథమికోన్నత, ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలలుగా ఎదిగింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎడ్యుకేషన్, బయోటెక్నాలజీ, ఫిజియోథెరపీ వంటి కోర్సులూ ప్రారంభమయ్యాయి. ఆమె విద్యా సంస్థల్లో చదివిన లక్షలాది మంది మహిళలు దేశ, విదేశాల్లో ఉన్నత స్థితిలో ఉన్నారు. తన సేవలకు గుర్తింపుగా కోటేశ్వరమ్మ పలు అవార్డులు పొందారు. 1971లో బెస్ట్ టీచర్‌గా జాతీయ స్థాయి అవార్డు, 2017లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. మహిళా విద్యా సంస్థలను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు 2015లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్‌లో స్థానం పొందారు. రిటైర్డ్ ఐఏఎస్ పీఎస్ కృష్ణన్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని కృషి చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్ నవంబర్ 9న కన్ను మూశారు. కేరళకు చెందిన 1956 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి కృష్ణన్.. కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం విశేష కృషి చేసిన అఖిల భారత సర్వీసు అధికారిగా అందరి మన్ననలు పొందారు. మండల్ కమిషన్ సిఫార్సుల్లో ఆయన ముఖ్యభూమిక పోషించారు. వైఎస్సార్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ముస్లిం రిజర్వేషన్ల రూపకల్పనలో కృష్ణన్‌ది ప్రముఖపాత్ర. కేంద్ర సంక్షేమ శాఖ కార్యదర్శిగా, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, బీసీ కమిషన్ సభ్య కార్యదర్శిగా, ప్లానింగ్ కమిషన్‌లోని వివిధ విభాగాల్లో చైర్మన్, సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్సీ, ఎస్టీ చట్టం-1989, సవరణ చట్టం-2015, సవరణ చట్టం-2018 డ్రాఫ్ట్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. కేంద్ర ప్రభుత్వ గౌరవ సలహాదారుడిగా పనిచేశారు. భాగవతుల వెంకట పరమేశ్వరరావు గాంధేయవాది,శాస్త్రవేత డాక్టర్ భాగవతుల వెంకట పరమేశ్వరరావు జూన్ 9న విశాఖపట్నంలో కన్నుమూశారు. ఆయన స్వగ్రామం విశాఖ జిల్లా దిమిలి. 1976 నవంబర్‌లో యలమంచిలి సమీప గ్రామం హరిపురంలో బీసీటీ అనే పేరుతో స్వచ్ఛంద సేవా సంస్థను భాగవతుల ఏర్పాటు చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయంపై గ్రామాల్లో ప్రచారం చేసి వినూత్న మార్పునకు కృషి చేశారు. గ్రామ స్వరాజ్యం స్థాపన ధ్యేయంగా స్వగ్రామం దిమిలిలో హైస్కూల్ ఏర్పాటు చేసి అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య,వైద్యం అందించడానికి చేసిన కృషికి పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఆయనను సత్కరించాయి. దామోదర్ గణేష్.. కుష్ఠు వ్యాధి బాధితుల కోసం జీవితాంతం కృషి చేసిన దామోదర్ గణేష్ బాపట్ ఆగష్టు 17న కన్నుమూశారు. తన 87ఏళ్ల జీవితకాలంలో 47ఏళ్ల పాటు కుష్ఠువ్యాధి బాధితులకు సేవలు అందించారు. 1972 నుంచి కుష్ఠువ్యాధిగ్రస్తుల సేవలో ఉన్నారు. కాట్రేనగర్ చంపాలో సొంత ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన ఆయన.. సామాజికంగానూ, ఆర్థికంగానూ వారి జీవితాల్లో మార్పుకు కృషి చేశారు. ఆయన సేవలకుగానూ 2018లో భారతప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. -
అదిరిపోయే ఆఫర్లు.. ఇంకెందుకు ఆలస్యం
కొత్త సంవత్సరం ఎన్నో ఆశలను, ఆశయాలను తీసుకువస్తుంది. ప్రతి ఏడాది మనకు అనేక జ్ఞాపకాలను, అనుభూతులను అందిస్తుంది. వీటికితోడు కొన్ని చేదు అనుభవాలను సైతం ఇస్తుంది. గడిచిన ప్రతి క్షణం రేపటికి ఒక జ్ఞాపకమే. మంచి చెడుల సమ్మేళనమే జీవితం. అలాంటి జీవితంలో మరో నూతన అధ్యాయాన్ని స్వాగతిస్తూ.. న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెబుతాం.. న్యూ ఇయర్ ఇంకో నెల రోజులు ఉంది అనగానే వేడుకలు, సంబరాల గురించి మదిలో ఆలోచనలు మెదులుతాయి. గత ఏడాది కంటే భిన్నంగా ఈసారి డిసెంబర్ 31 వేడుకల నిర్వహణకు హైదరాబాదీయులు తహతహలాడుతున్నారు. మొదట్లో ఈ కల్చర్‌కు ఇంత క్రేజు లేకున్నా రానూ రానూ పరాయి వేడుకపై మోజు బంగారం ధరలా పెరుగుతూనే ఉంది. ఇక ఈ నూతన సంవత్సర సంబరాలలో ప్రజలను ఆకర్షించే వాటిలో ఆఫర్లు ప్రధానమైనవి. కేకుల నుంచి ఫేస్ క్రీమ్ వరకు అన్ని ఆఫర్లే (క్లాతింగ్, ఫుట్‌వేర్, జ్యూవెల్లరీ, ఫుడ్, కాస్మోటిక్స్).. వీటిలో మరీ ముఖ్యమైనది ఫుడ్. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు. ఫుడ్‌ను ఇష్టపడని వారంటూ ఉండరు. అసలే హైదరాబాదీలు భోజన ప్రియులు. ఇక ఆఫర్లు కనిపిస్తే ఊరుకుంటారా... లేదండోయ్ ఆవురావురంటూ లాంగిచేయడమే. చాలా సందర్బాల్లో ఫుడ్ ఫెస్టివల్స్‌ను సైతం నిర్వహిస్తుండటం తెలిసిందే. మరీ ఫుడ్‌కు ఉన్న డిమాండేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.. ఆఫర్లే ఆఫర్లు... నగరంలో ఇంచుమించుగా 12వేల వరకు చిన్న, పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా. మరో 10వేల దాకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మెస్‌లు హోటల్ ఉన్నాయి. హోటళ్లు, రిసార్ట్లు ప్రజలను ఆకర్షించేందుకు వినూత్నడిస్కౌంట్లు, స్పెషల్ ఆఫర్లతో తలుపులు తెరుస్తున్నాయి. నోరూరించే ఆహారాన్ని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. రెస్టార్లెంటు, హోటళ్లు, దాబాలు, చిన్న చిన్న హోటళ్లు సైతం తమదైన రీతిలో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఒకటి కొంటే మరొకటి ఉచితమని,, ఒక్కొదానిపై 30, 40, 50 శాతం వరకు డిస్కౌంట్‌ను ప్రకటిస్తున్నాయి. కొన్ని రెస్టారెంట్లయితే బఫేపై వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఇస్తున్నాయి. కొన్నిచోట్ల అన్లిమిటెడ్ ఫుడ్, బేవరేజ్‌ను ఆఫర్ చేస్తున్నారు. పేరుగాంచిన హోటళ్లు పాశ్చాత్య వంటకాలు, కాక్టైల్స్, మాక్‌టైల్స్‌ను రుచి చూపించనున్నాయి. నాన్ వెజ్ ఆఫర్లు.. ఆదివారం వచ్చిందంటే ముక్క లేనిది ముద్ద దిగదు. అలాంటిది వేడుకల్లో నాన్ వెజ్ లేకుంటే.. నో నో తప్పకుండా ఉండాల్సిందే అంటున్నారు హైదరాబాదీలు. మరీ నాన్ వెజ్ లవర్స్ వారి కోసం ప్రముఖ రెస్టారెంట్లు ఇస్తున్న ఆఫర్లు ఏంటో తెలుసుకుందాం. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు... ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్బంలో బిర్యాని లాంగించేస్తూ ఉంటారు. వీటిలో చికెన్, మటన్, మష్రూమ్,ఫిష్ బిర్యానీలు ప్రత్యేకం. ఈ సారి ఈ బిర్యానిపైలపై ఆఫర్లు ఆశించిన స్థాయిలో లేనట్లు కన్పిస్తోంది. సాధారణ రోజుల్లో బిర్యాని ధర రెస్టారెంట్లను బట్టి 150 నుంచి 300 వరకు ఉండగా... న్యూ ఇయర్ సందర్భంగా ఈ ధరను 100 నుంచి 250 లోపు తగ్గించారు. అదేవిధంగా కొన్ని రకాల ఐటమ్‌లపై 10 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. ఇక స్టాటర్లు, సూప్‌లు ధరలు అదేవిధంగా కొనసాగుతున్నాయి. ఆన్లైన్ ఫుడ్ సర్వీసింగ్.... ఆన్లైన్ ఫుడ్ సర్వీస్‌లు వచ్చాక నగరంలో తిండికి కొదవే లేకుండా పోయింది. యాంత్రిక టెక్నాలజీ వచ్చాక బిజీ సిటీ లైఫ్‌లో అటు ఉద్యోగం ఇటు జీవితాన్నిసమన్వయం చేయలేక నానా తాంటాలు పడుతున్న కుటుంబాలు ఎన్నో. అలాంటి వారికి ఆన్లైన్ ఫుడ్ డెలీవరీ యాప్‌లు ఎంతగానో దోహదపడుతున్నాయి. కేవలం తినాలనుకున్న సమయానికి అరగంట ముందు కావాల్సిన ఫుడ్‌ను ఆర్డర్ చేసుకుంటే సరి. దీనికి కావాల్సింది. కేవలం సంబంధిత యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడమే. హోటల్ కు వెళ్లి తినేవారు తగ్గడంతో ఆన్లైన్ ఫుడ్ సర్వీస్‌లను డిమాండ్ పెరిగింది. ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించడంతో ఫుడ్డీస్ రెస్టారెంట్లకు క్యూ కడుతున్నారు. వెజ్, నాన్‌వెజ్, ఫాస్ట్‌ఫుడ్ ఐటమ్ ఏదైనా సరే మనీ ఉంటే చాలు. మీ దరికి విచ్చేస్తుంది. అంతేగాక 10 శాతం నుంచి 50 శాతం వరకు డిస్కౌంటు లభిస్తుంది. పైగా డెలివరీ కూడా ఫ్రీ... అర్థరాత్రి అపరాత్రి అన్న తేడా కూడా లేదు. ఎప్పుడంటే అప్పుడు.. ఎక్కడంటే అక్కడ మీరు కోరుకున్న ఆహారం.. మీ చెంతకు చేరుతుంది. దీంతో ఫుడ్ ఆర్డరింగ్ అనేది చాలామంది జీవితాలలో ఓ ఫ్యాషన్‌లో మారిపోయింది. ఫేమస్ ఫుడ్ యాప్‌లు ఆన్లైన్ ఫుడ్ యాప్‌లో స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్, ఫుడ్ పాండా వంటివే అధికం. సిటీలో నిత్యం అమ్ముడయ్యే ఫుడ్‌లో 60శాతం మేర ఆన్ లైన్ డెలివరీలే ఉంటాయి. ఒక్క స్విగ్గీ ఫుడ్ డెలివరీ సంస్థనే నగరంలో రోజూ 80వేల ఆర్డర్ల వరకు యాప్ ద్వారా విక్రయిస్తోంది. ఇలా మిగతా ఫుడ్ డెలివరీ సంస్థలు అన్ని కలిసి దాదాపు ప్రతి నెల 10లక్షలకు పైనే ఆర్డర్లను చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే తమ వద్దకు ఫుడ్ వస్తుండటంతో ఈ యాప్‌లకు క్రేజ్ పెరిగిపోయింది. దీంతో ప్రత్యేక ప్యాకేజీల రూపంలో తమ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. భోజన ప్రియులను కట్టిపడేస్తున్నాయి. ఇంకేముంది ఆర్డర్ చేసిన అరగంటలో నోరూరించే వంటకాలు మన ముంగిట ప్రత్యక్షమవుతున్నాయి. ప్రమోషన్ ఆఫర్లు, డిస్కౌంట్ల వర్షాలు.. కొద్ది తేడాతో దాదాపు అన్ని సంస్థలు ఒకే విధమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా బిర్యానీలు, పిజ్జాలు, మిల్క షేక్‌లు,ఫ్యామిలీ ప్యాక్ వంటివి అధికంగా ఉన్నాయి. ఈ న్యూ ఈయర్‌కు మరీ ఏ సంస్థ ఏ ఆర్డర్‌ను అందిస్తోందో ఓ లుక్కేద్ధాం... జొమాటో...న్యూ యూజర్లకు 40 శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. అంతేగాక ప్రోమో కోడ్లు అందిస్తుంది. అలాగే పేటీఎం యూపీఐ ద్వారా రూ. 350 మించి కొనుగోలు చేస్తే 30 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇందుకు ZOMATO300 కోడ్‌ను ఆప్లై చేయాలది. అదే విధంగా స్నాక్స్‌పై 50 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. టాప్ రెస్టారెంట్లలో రూ. 99 కంటే కొనుగోలు చేస్తే 50 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇందుకు ZOMATO కోడ్‌ను అప్లై చేయాలి. కోటక్ మహీంద్ర కార్డు ద్వారా రూ. 250 కంటే ఎక్కు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్‌ను అధికంగా రూ75 వరకు అందిస్తోంది. ప్రత్యేక పార్టీ ఆఫర్ పేరుతో రూ .500 విలువైన ఆహార ఆర్డర్లలో రూ .1000 వరకు ఆదా ఇస్తుంది. ఇది కేవలం ఎంచుకున్న రెస్టారెంట్లలో మాత్రమే. స్విగ్గీ.. కొత్త యూజర్లకు 33 శాతం డిస్కౌంట్‌ను ఇస్తుంది. దీంతోపాటు ఫ్రీ డెలివరీ లభిస్తుంది. ఫుడ్ డెలివరీ యాప్స్ అన్నీ కొత్త యూజర్లను ఆకట్టుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తాయి. ఆఫర్లు కూడా వారికే ఎక్కువ ఉంటాయి. సంబంధిత రెస్టారెంట్ల ద్వారా WELCOME50... ద్వారా 50 శాతం డిస్కౌంట్‌ను ఇస్తుంది. 150LPAYNEW ద్వారా 150 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. రెండు మీడియం పిజ్జాలను ఒక పిజ్జా ధరకే పిజ్జా హట్ ద్వారా ఇస్తోంది. ఉబర్ ఈట్స్.. ఉబర్ రైడ్లతోపాటు ఉబర్ ఈట్స్ ఆహార డెలివరీ యాప్ ప్రముఖంగా నిలుస్తోంది అన్ని రకాల పదార్థాలపై 30 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. సెలక్టెడ్ రెస్టారెంట్ల నుంచి 50 శాతం బిర్యానిపై డిస్కౌంట్‌ను అందిస్తోంది. సంబంధిత రెస్టారెంట్లపై30,40, 50 శాతం వరకు కూడా తగ్గింపును అందిస్తోంది. వీటికి ఎలాంటి ప్రోమో కోడ్ అవసరం లేదు. నేచురల్ ఐస్ క్రీం నుంచి కప్ ఐస్ క్రీమ్నుఒకటి కొంటే ఒకటి ఉచితంగా అందిస్తోంది. మిల్క్ షేక్‌లను కేవలం 99 రూపాయలకే అందిస్తోంది. HYDFEAST50, HYDFEAST30, HYDFEAST20 ద్వారా 50,30, 20 శాతం డస్కౌంట్ను ఇస్తుంది బేకరీల్లో బారులు.. న్యూయర్ దగ్గర పడుతుండటంతో బేకరీలలో కేకుల తయారీలు జోరందుకున్నాయి. కేకుల్లో వెజ్, నాన్ వెజ్, పేస్ట్రీస్ వంటివి.. విభిన్న రకాల ఆకృతిలో అందుబాటులో ఉన్నాయి.. ఒక్కో బేకరీలలో దాదాపు 500 నుంచి 1000 కేకుల వరకు తయారీ చేస్తున్నారు. నూతన సంవత్సర సందర్భంగా కేక్‌లు కొనుగోలు చేసేందుకు బేకరీ నిర్వాహకులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారు. బేకరీలలో అయితే. కేజీ కేకు 400 రూపాయలు, అర కేజీ కేకు 200 రూపాయలకే అందిస్తున్నాయి. అంతేగాక వీటికి 500 ఎంఎల్ కూల్‌డ్రింక్, మిక్చర్ వంటివి ఉచితంగా అందజేస్తున్నాయి. వీటితోపాటు పిజ్జా, బర్గర్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బేకరీలు ఆఫర్లను జోరుగా అందిస్తున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే న్యూ ఇయర్ ఆఫర్లను ఆరగించండి.. - గుండా భావన (వెబ్ డెస్క్ ప్రత్యేకం) -
జాబిల్లిని చేరుకున్నాం.. కానీ!!
భారత శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాలు ఈ ఏడాది ఘనవిజయాలే నమోదు చేశాయి. ప్రతిష్టాత్మక చంద్రయాన్–2 ప్రయోగం చివరి క్షణంలో వైఫల్యం ఎదుర్కోవడాన్ని మినహాయిస్తే ఇస్రో ఈ ఏడాది అభివృద్ధివైపు పురోగమించిందనే చెప్పాలి. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో సిద్ధం చేసుకున్న నావిగేషన్ మైక్రో ప్రాసెసర్లతో రాకెట్లు నడవడం ఒక విజయమైతే... పీఎస్ఎల్వీ తన 50వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేయడం, వివిధ దేశాలకు చెందిన 50 వరకూ ఉప గ్రహాలను కక్ష్యల్లోకి ప్రవేశపెట్టడం ఇస్రో కీర్తి కిరీటంలో కలికి తురాయిలే. చెన్నై సాఫ్ట్వేర్ ఇంజినీర్ షణ్ముఖ సుబ్రమణియన్ విక్రమ్ ల్యాండర్ అవశేషాలను గుర్తించి నాసా ప్రశంసలు అందుకోవడం ఈ ఏడాది హైలైట్!. ఇక చంద్రయాన్ –2 గురించి... జాబిల్లిపై ఓ రోవర్‌ను దింపేందుకు, మన సహజ ఉపగ్రహానికి వంద కిలోమీటర్ల దూరంలో ఓ ఆర్బిటర్‌ను ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన చంద్రయాన్ –2 ప్రయోగం జూలై 22న జరిగింది. జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా 3840 కిలోల బరువున్న చంద్రయాన్–2 పలుమార్లు భూమి చుట్టూ చక్కర్లు కొట్టి.. జాబిల్లి కక్ష్యలోకి చేరింది. ఆ తరువాత క్రమేపీ జాబిల్లిని చేరుకుంది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విజయవంతంగా విడి పోయినప్పటికీ జాబిల్లిపైకి దిగుతున్న క్రమంలో కొంత ఎత్తు లోనే సంబంధాలు తెగి పోయాయి. ఆ తరువాత కొద్ది కాలానికి ల్యాండర్ జాబిల్లి ఉపరితలాన్ని ఢీకొట్టి కుప్పకూలిపోయింది. భారతీయ శాస్త్రవేత్త పేరుతో నక్షత్రం ► సౌర కుటుంబానికి ఆవల ఉన్న ఒక గ్రహం తిరుగుతున్న నక్షత్రా నికి ఈ ఏడాది భారత శాస్త్రవేత్త బిభా ఛౌదరీ పేరు పెట్టారు. ► ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోపుగా పేరొందిన థర్టీ మీటర్ టెలిస్కోపు ద్వారా పరిశీలనలు జరిపేందుకు భారతీయ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిందీ ఈ ఏడాదే. ► ప్రభుత్వ రంగ సీఎస్ఐఆర్కు చెందిన సంస్థ కాలుష్యం వెదజల్లని టపాసులను సిద్ధం చేయగా, బొగ్గును మండించడం ద్వారా వచ్చే కాలుష్యాన్ని తగ్గించే పరిశోధ నలు చేపట్టేందుకు బెంగళూరులో ఓ కేంద్రం ఏర్పాటైంది. ► కేంద్ర బయోటెక్నాలజీ విభాగం ఈ ఏడాది మానవ అట్లాస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ‘మానవ్’పేరుతో జరుగుతున్న ఈ ప్రయత్నంలో శరీరంలోని కణస్థాయి నెట్వర్క్ తాలూకూ వివరాలు ఉంటాయి. ► వెయ్యి మంది భారతీయుల జన్యుక్రమ నమోదును ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. -
యావద్దేశానికీ... ఒక ‘దిశ’
ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన పురుషులను చీల్చి చెండాడిన ‘మీటూ’ ఉద్యమం ఈ ఏడాది మహి ళలకు కొత్త శక్తినిచ్చింది. ఈ చైతన్యమే మహిళా ఉద్యమంలో 2019ని మైలురాయిగా నిలిపింది. అక్రమాలపై, అత్యాచారాలపై నిర్భ యంగా గళమెత్తేలా చేసింది. మరోవంక ఇన్ని జరిగినా మృగాళ్లు మాత్రం చెలరేగిపోతూనే వచ్చారు. యావద్దేశానికీ... ఒక ‘దిశ’ నవంబర్ 27, 2019న తెలంగాణలోని శంషాబాద్ టోల్‌ప్లాజా దగ్గర వెటర్నరీ వైద్యురాలిని నలుగురు యువకులు దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన యావద్దేశాన్నీ అట్టుడికించింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ దుర్మార్గులను తక్షణం ఉరితీయాలంటూ ప్రాంతాలకతీతంగా యావ ద్దేశం ఒక్కటైంది. ఆ తరువాత ఈ దారుణానికి పాల్పడిన నలుగురు యువకులను పోలీసులు ఎదురు కాల్పుల్లో కాల్చి చంపడం వేగంగా జరిగిపోయింది. యువతుల్లో, మహిళల్లో చైతన్యాన్ని నింపే అనేక కార్యక్రమాలకు ఈ ఘటన దారితీసింది. ‘దిశ’పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని కూడా తెచ్చింది. అత్యాచార బాధితురాలిని కాల్చేశారు ఉత్తరప్రదేశ్‌లోని ‘ఉన్నావ్’లో తనపై అత్యాచా రానికి పాల్పడిన వారిని శిక్షించాలంటూ కోర్టుకెళ్లిన ఓ మహిళ... వారి దౌర్జన్యానికి బలైపోయింది. ఐదుగురు నిందితుల్లో బెయిల్‌పై వచ్చిన ఇద్దరి తోపాటు మరో ముగ్గురు బాధితురాలిని సజీవ దహనం చేసే యత్నం చేశారు. అగ్ని కీలల్లో దగ్ధమ వుతూనే ఆసరా కోసం చుట్టుపక్కల జనాన్ని ప్రా«థేయపడిన బాధితురాలు... చివరకు పోలీసు లకు స్వయంగా ఫోన్ చేసి సాయం కోరడం అందర్నీ కలచి వేసింది. ఈ కేసులో నిందితుడు శుభం త్రివేదీ ఆమెను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి, తన సోదరుడితో కలసి ఆమెపై 2018లో అత్యాచారానికి పాల్పడ్డాడు. బా«ధితు రాలు తన మరణ వాంగ్మూలంలో ఇదే చెప్పింది. చివరికామె ఆసుపత్రిలో కన్నుమూసింది. -
ఆ సిత్రాలు.. ‘సోషల్’.. వైరల్!
సెకన్లు, నిమిషాల వ్యవధిలో కార్చిచ్చులా వ్యాపించి అందరినీ చేరుకునే సత్తా ఉండటం సోషల్ మీడియాలో కొత్త పోకడలకు ఆస్కారమిస్తోంది. ఆ సిత్రాలు కొన్ని చూస్తే... బాటిల్ క్యాప్ చాలెంజ్ సీసా మూతను కాలితో తీసే చాలెంజ్ పేరే బాటిల్ క్యాప్ చాలెంజ్. టైక్వాండో ఇన్స్ట్రక్టర్ ఫరాబీ డవ్లెట్చిన్ దీన్ని ప్రారంభించారు. నేలపైనగానీ, బల్లపైన గానీ ఒక సీసాని ఉంచి, దాని మూతను వదులుగా పెట్టాలి. కాలితో సీసా మూత ఊడిపోయి కిందపడేలా చేయాలి. సీసా మాత్రం పడకూడదు. బాలీవుడ్ నటులు అక్షయ్‌కుమార్, గోవింద, పరిణీతి చోప్రా, సుస్మితా సేన్ లాంటి ప్రముఖులు ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు. కికీ చాలెంజ్ కదులుతున్న కారులోంచి దిగడం.. పాటకు తగ్గట్టు డ్యాన్స్ చేయడం... ఇదీ కికీ ఛాలెంజ్!!. యువత ఈ చాలెంజ్‌ను క్షణాల్లో వైరల్‌గా మార్చేసినా.. చాలా చోట్ల ఈ చేష్టలు ప్రమాదాలకూ కారణమ య్యాయి. దేశంలోని ప్రధాన నగరాల్లోనూ ఇలాంటి ఘటనలు నమోదు కావడంతో పోలీసులు.. ఈ చాలెంజ్‌లో పాల్గొనవద్దంటూ హెచ్చరికలు జారీచేయాల్సిన పరిస్థితులొచ్చాయి. ఫిట్నెస్ చాలెంజ్ ఈ చాలెంజ్ ప్రకారం యోగా చేస్తున్న దృశ్యాల వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవాలి. ప్రధాని మోదీ యోగా వీడియోలూ మథ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. క్రీడాకారులూ, బాలీవుడ్ నటులు ఇంకా ఎందరో ఇందులో పాల్గొన్నారు. -
ఎన్నికలు.. ఆందోళనలు
2019 రాజకీయంగా, సామాజికంగా జరిగిన మార్పులు మామూలువి కావు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరున్న భారతదేశంలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల క్రతువు ముగిసింది. 543 లోక్‌సభ స్థానాలతో పాటు కొన్ని అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగ్గా భారతీయ జనతా పార్టీ 303 లోక్‌సభ స్థానాలతో కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఒక రాజకీయ పార్టీ సొంతంగా పూర్తిస్థాయి మెజారిటీ సాధించడం 30 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి కూడా. ఆర్థికంగా వెనుకబడ్డ వారికి రిజర్వేషన్లు.. విద్యా, ఉపాధి రంగాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాజ్యాంగాన్ని 124వ సారి మార్చారు కూడా. ఏడాదికి రూ.8 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉండి... ప్రభుత్వమిచ్చే ఇతర రిజర్వేషన్లు (ఎక్స్ సర్వీస్ మెన్, వికలాంగులు తదితరాలు) ఉపయోగించుకోని అగ్రవర్ణాల వారికి ఈడబ్ల్యూఎస్ కోటా వర్తిస్తుంది. ఏడాది మొదట్లో, లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం ఎన్డీయేపై కొన్ని విమర్శలు వచ్చేందుకూ కారణమైంది. పౌరసత్వ చట్ట సవరణ.... దేశాద్యంతం ఆందోళనలకు, హింసాత్మక ఘటనలకు తావిచ్చిన చట్ట సవరణ ఇది. 1955 నాటి చట్టం ప్రకారం భారతీయ పౌరులయ్యేందుకు ఉన్న ఐదు అవకాశాల్లో కొన్ని సవరణలు చేయడం మొత్తం వివాదానికి కారణమైంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన హిందు, సిక్కు, పార్శీ, క్రైస్తవ, జైన, బౌద్ధ మతాల వారు ఆయా దేశాల్లో మతపరమైన హింస ఎదుర్కొంటే వారికి భారతీయ పౌరసత్వం కల్పించేందుకు ఈ సవరణ వెసులుబాటు కల్పించింది. ఈ జాబితాలో ముస్లింల ప్రస్తావన లేకపోవడం, ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి వచ్చే ముస్లిమేతరుల పరిస్థితీ అగమ్యగోచరంగా మారడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి. ఈ ఆందోళనపూరిత వాతావరణం కొనసాగుతుండగానే కేంద్రం జాతీయ జనాభా పట్టిక తయారీకి ఏర్పాట్లు చేయడంతో పరిస్థితి ఇంకా సద్దుమణగలేదు. కాంగ్రెస్‌లో నేతల కరవు సార్వత్రిక ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. గాంధీ కుటుంబానికి చెందని వారినెవరినైనా పార్టీ అధ్యక్షుడిగా నియమించుకోవాలని రాహుల్ స్వయంగా విజ్ఞప్తి చేసినప్పటికీ కొన్ని నెలల పాటు అధ్యక్ష ఎన్నికపై తర్జనభర్జనలు కొనసాగాయి. చివరకు సోనియాగాంధీ మరోసారి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రాంతానికి ఇన్చార్జ్గా ప్రియాంక గాంధీ నియమితులవడం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగానూ ఆమెకు పదవి దక్కడం ఆ పార్టీలో జరిగిన ముఖ్యపరిణామాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కశ్మీర్, లద్దాఖ్... జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతోపాటు జమ్మూ కశ్మీర్ నుంచి లద్దాఖ్‌ను వేరు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం ఈ ఏడాది జరిగిన అత్యంత కీలకమైన రాజకీయ ఘట్టాల్లో ఒకటి. దశాబ్దాలుగా దేశంలో ఒకరకమైన అసంతృప్తికి కారణమైన ఆర్టికల్ 370ని ఈ ఏడాది ఆగస్టు 5న రద్దు చేశారు. ఆ తరువాత అక్కడ పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడం, 145 రోజుల వరకూ ఇంటర్నెట్పై నిషేధం విధించటం వంటి అంశాలు ప్రపంచదేశాలు దృష్టి పెట్టేలా చేశాయి. పుల్వామా దాడులు... పాకిస్తాన్ ప్రేరిపిత ఉగ్రవాద చర్యలకు తాజా తార్కాణంగా చెప్పుకునే పుల్వామా దాడులు ఈ ఏడాది దాయాది దేశాలు మరోసారి కత్తులు నూరేందుకు కారణమయ్యాయి. ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్లో ఓ మిలటరీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేయగా అందులో సుమారు 40 మంది భారతీయ సైనికులు మరణించారు. ఈ ఘటనకు ప్రతీకారంగా అదే నెల 26న భారత సైన్యం పాకిస్తాన్ లోపలికి చొరబడి బాలాకోట్ వద్ద ఉగ్రవాద స్థావరాలపై బాంబులు వేసింది. ఈ క్రమంలో భారతీయ యుద్ధ విమాన పైలెట్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ చేతికి చిక్కాడు. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ కొన్ని రోజుల వ్యవధిలోనే అభినందన్‌ను సగౌరవంగా భారత్‌కు అప్పగించింది. -
రివైండ్ 2019: గ్లోబల్ వార్నింగ్స్
అంతర్జాతీయంగా 2019 ఎన్నెన్నో ప్రభావవంతమైన ఘటనలకు వేదికయింది. ఆ వివరాలు చూస్తే... అమెరికా – ఉత్తర కొరియా అణు సంక్షోభం ఉత్తర కొరియాను అణ్వస్త్ర రహిత దేశంగా మార్చాలని అగ్రరాజ్యం భావి స్తూ ఉంటే, దేశ అధ్యక్షుడు కిమ్ మరి న్ని అణు పరీక్షలు నిర్వహిస్తూ ఉద్రిక్త తల్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియాలో జూన్ 30న అడుగు పెట్టడం ఈ ఏడాది అతి పెద్ద విశేషం గా చెప్పుకోవాలి. ఉత్తర కొరియాకు వెళ్లిన తొలి అమెరికా అధ్యక్షుడిగానూ ఆయన రికార్డు సృష్టించారు. ఉత్తర కొరియాలో జరిగిన సమావేశంలో ఇరు దేశాధినేతలు అణు చర్చలు జర పాలని నిర్ణయించారు. కానీ అక్టోబర్ 1 వరకు అది సాధ్యం కాలేదు. అయితే ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ఉల్లం ఘించి మరీ ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. దీంతో ఇరు దేశాల ప్రతినిధులు అక్టోబర్ 5న సంప్రదింపులు జరిపారు. అవి కూడా ముందుకు వెళ్లలేదు. అంతర్జాతీయంగా ఈ ఏడాది ఎన్నెన్నో ప్రభావవంతమైన ఘటనలకు వేదికయింది. ఆ వివరాలు చూస్తే... ట్రంప్ అభిశంసనకు ఓకే! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనని ఎదుర్కొ న్నారు. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి పోటీదారు అయిన జో బైడెన్‌పై ఉన్న అవినీతి ఆరోపణలకు తగు ఆధారాలు సంపాదించి, విచారణ జరపాలని... తనకు రాజకీయంగా సహకరించాలని ఉక్రెయిన్‌పై ట్రంప్ ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలున్నాయి. ట్రంప్ తన అధికారాన్ని దుర్విని యోగం చేస్తున్నారని, కాంగ్రెస్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొంటూ ప్రతినిధుల సభలో విచారణ సాగింది. ప్రతినిధుల సభ అభిశంసనకి అనుకూలంగా ఓటు కూడా వేసింది. ఈ అభిశంసన తీర్మానం కొత్త ఏడాది జనవరిలో సెనేట్‌లో చర్చకు రానుంది. హాంగ్‌కాంగ్ భగ్గు హాంగ్‌కాంగ్‌లో భగ్గుమన్న నిరసనలు ఈ ఏడాది ప్రపంచ దేశాల్లో మరెన్నో పోరాటాలకి స్ఫూర్తిగా నిలిచాయి. చైనా చేసిన నేరస్తుల అప్పగింత బిల్లుపై హాంగ్‌కాంగ్‌లో అగ్గి రాజుకుంది. ఈ బిల్లు నిందితుల్ని చైనాలో విచారించడానికి వీలు కల్పిస్తుంది. చైనా ప్రభుత్వ విధానాలపై కొన్నేళ్లుగా పేరుకుపోయిన అసంతృప్తి అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. హాంగ్‌కాంగ్ ప్రత్యేక ప్రతిపత్తిని నిర్వీర్యం చేసేలా చైనా ప్రభుత్వం వ్యవహరిస్తోందని నిరసిస్తూ రోడ్డెక్కారు. ప్రభుత్వం కూడా పోలీసు బలగాలతో నిరసనలు అణచివేయాలని అనుకుంది కానీ అంతకంతకూ అవి తీవ్రమయ్యాయి. బ్రెగ్జిట్ గెలుపు.. బోరిస్ జాన్సన్ 2019 చివరలో బ్రిటన్ ఒక స్పష్టమైన వైఖరిని కనబరిచింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియను (బ్రెగ్జిట్) 2020 మార్చి 29 నాటికి పూర్తి చేయాలని డెడ్‌లైన్ కూడా విధించుకుంది. దీనికి తగ్గట్టుగా దేశంలో రాజకీయంగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బ్రిటన్ ప్రధానిగా మూడు సార్లు బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో విఫలమైన థెరెస్సా మే... తన పదవికి రాజీనామా చేయగా అప్పటికే కన్జర్వేటివ్ పార్టీలోని బోరిస్ జాన్సన్ ఈయూతో ఏ ఒప్పందం లేకుండా బ్రిటన్ నుంచి వైదొలుగుతామని చెప్పారు. దీంతో పార్టీ ఆయన్ను ప్రధానిని చేసింది. అయితే సభలో బ్రెగ్జిట్‌ను వ్యతిరేకించే సంప్రదాయవాదులు కూడా ఉండడంతో జాన్సన్ సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. అఖండ మెజార్టీతో నెగ్గారు. జనవరి 31లోగా బ్రెగ్జిట్‌కు అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందిస్తానని జాన్సన్ వెల్లడించారు. అమెజాన్ చిచ్చు పుడమికి ఊపిరితిత్తులుగా పేరొందిన బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో ఏర్పడిన కార్చిచ్చు ప్రపంచవ్యాప్తంగా గుబులు పుట్టించింది. ఇక్కడ కార్చిచ్చులు సర్వ సాధారణమైనా 2019లో 80 వేల చోట్ల చెలరేగిన కార్చిచ్చులు రికార్డు సృష్టించాయి. -
మంటలు రేపిన మాటలు..
రాజకీయాలంటేనే ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం... నోటికి ఏదొస్తే అది మాట్లాడటంగా మారిపోయింది. 2019 సంవత్సరం ఎన్నికల ఏడాది కూడా కావడంతో ఎందరో నేతలు నోరు జారారు. దిగజారుడుకు హద్దుల్లేవని నిరూపించారు. అలాంటి మాటలు కొన్ని చూస్తే... మేకిన్ ఇండియా కాదు రేపిన్ ఇండియా – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముస్లింలీగ్ గ్రీన్ వైరస్ – యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం గాడ్సే దేశభక్తుడు – ప్రజ్ఞాఠాకూర్, బీజేపీ ఎంపీ జయప్రద లోదుస్తులు ఖాకీ – ఆజంఖాన్, ఎస్పీ నాయకుడు తీరైన తీర్పులు దశాబ్దాలే కాదు... కొన్ని శతాబ్దాల సందిగ్ధానికి కూడా సర్వోన్నత న్యాయస్థానం తెరదించిన సంవత్సరమిది. శ్రీరాముడి జన్మభూమిగా భావించే అయో«ధ్య అంశం మొదలుకొని... రాజకీయ యవనికను కుదిపేసిన రాఫెల్ డీల్ వరకు ఎన్నెన్నో కీలకమైన తీర్పులు వెలువడ్డాయి. వీటిలో మత ప్రాధాన్యమైనవే కాదు!!. మహిళల హక్కులకు సంబంధించినవి... ఆఖరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువచ్చే తీర్పులూ ఉన్నాయి. ఆ మేటి తీర్పులు సంక్షిప్తంగా... జన్మభూమి... రాముడిదే! దేశ చరిత్రలోనే సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అయోధ్యలోని రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్‌గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం నవంబర్ 9న తుది తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిలో హిందువులు రామ మందిరాన్ని నిర్మించుకోవడానికి అనుమతిం చింది. ముస్లింలకు మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని వేరొకచోట కేటాయించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్‌ని ఏర్పాటు చేయాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. శబరిమలకు మహిళలు... కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లను ఏడుగురు సభ్యుల విస్త్రుత ధర్మాసనానికి బదిలీచేస్తూ 3:2 మెజారిటీతో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే వయసు రీత్యా కొన్ని వర్గాలకు చెందిన మహిళల ప్రవేశంపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేస్తూ 2018 సెప్టెంబర్ 28న ఇచ్చిన తీర్పుపై మాత్రం కోర్టు ఎలాంటి స్టే విధించలేదు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం నవంబర్ 14న ఈ తీర్పుని వెలువరించింది. న్యాయమా! నువ్వు ‘ఉన్నావ్’... ఢిల్లీలో నిర్భయ ఘటన అనంతరం ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మైనర్ బాలికపై ఘోర అత్యాచారం జరగటంతో దేశం నిర్ఘాంతపోయింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి అధికార బీజేపీ ఎమ్మెల్యే కావటంతో కేసు ఎన్నెన్నో మలుపులు తిరిగింది. పార్టీ అతన్ని బహిష్కరించింది. అయితేనేం!! నేరాన్ని కప్పిపుచ్చే యత్నాలు ఆగలేదు. బాధిత మహిళను కిడ్నాప్ చేయటం... ఆమె తండ్రి లాకప్ హత్య... బాధితురాలు సహా బంధువులను యాక్సిడెంట్ రూపంలో చంపే ప్రయత్నాలు... ఇలా ఎన్నో ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజకీయ నాయకుడు నిందితుడైతే కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్ని మలుపులూ తిరిగింది. దీంతో ఈ కేసుపై యావద్దేశం ఒక్కటయింది. చివరికి సర్వోన్నత న్యాయ స్థానం జోక్యం చేసుకుంది. 45 రోజుల్లో విచారణ పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఫలితం... బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఢిల్లీ తీస్ హజారీ కోర్టు తీర్పునిచ్చింది. డిసెంబర్ 19న సెంగార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రాఫెల్... విచారణకు నో! రాఫెల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయటానికి ఆ కంపెనీతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిన గత తీర్పులను పునఃపరిశీలించాలన్న డిమాండ్‌ని కోర్టు తోసిపుచ్చింది. న్యాయవాది ప్రశాంత్ భూషణ్, కేంద్ర మంత్రులు యశ్వంత్ సింగ్, అరుణ్ శౌరి దాఖలు చేసిన పిటిషన్లపై మే 10న కోర్టు విచారణ ముగించి తన ఉత్తర్వులను రిజర్వులో ఉంచింది. నవంబరు 14న తీర్పు వెలువరించింది. -
సినిమా సూపర్ హిట్ కలెక్షన్లు ఫట్
జనం పెట్టే ఖర్చులు తగ్గాయంటే... ఓలా, ఉబెర్ బుకింగులు పెరిగాయంటారు ఆర్థిక మంత్రి!!. మరి అదే నిజమైతే కార్ల విక్రయాలు కూడా పెరగాలి కదా? అనేది సామాన్యుడి సందేహం. వీటి మధ్య సంబంధం ఉందనుకుంటే ఉంది!. లేదనుకుంటే లేదు!!. 2019లో మన ఆర్థిక వ్యవస్థ తీరు చూసినా ఇలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఎకానమీ మందగమనంతో నత్తనడకన నడుస్తోంది. విక్రయాలు తగ్గిపోయాయని ఆటోమొబైల్, వినియోగ వస్తువుల కంపెనీలు మొత్తుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్లు మాత్రం రోజుకో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అటు సంస్కరణల ఊతంతో సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకుల్లో భారత్ భారీగా ఎగబాకినా.. ఇటు పారిశ్రామిక దిగ్గజాలు మాత్రం వ్యాపార వర్గాల నోరు నొక్కేస్తోందంటూ ప్రభుత్వంపై బాహాటంగానే విరుచుకుపడుతున్నారు. మందగమనం సమస్యకు చికిత్స చేసేందుకు ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించినా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో 2019 సింహావలోకనంతో పాటు కొత్త సంవత్సరంపై నెలకొన్న అంచనాల సమాహారమిది... స్టాక్ మార్కెట్లు.. ‘రికార్డ్’ల పరుగు ఎకానమీ పరిస్థితి ఎలా ఉన్నా.. స్టాక్ మార్కెట్లు మాత్రం రయ్‌మని ఎగిశాయి. నిఫ్టీ సుమారు 13 శాతం, సెన్సెక్స్ దాదాపు 15 శాతం పెరిగాయి. 2017 తర్వాత దేశీ సూచీలకు 2019 బాగా కలిసొచ్చింది. ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.10.2 లక్షల కోట్లు ఎగిసింది. ఈ ఏడాది జనవరి 1న 36,162 పాయింట్లుగా ఉన్న సెన్సెక్స్ 5,000 పాయింట్లు పైగా పెరిగి తాజాగా 41,000 పైకి చేరింది. ఎకానమీతో సంబంధం లేనట్లుగా స్టాక్ మార్కెట్లు అలా పెరుగుతూ పోవడంపై ఆర్థికవేత్తలు కూడా అయోమయంలో పడ్డారు. స్టాక్ మార్కెట్ల ర్యాలీ కొన్ని షేర్లకే పరిమితం కావడం గమనార్హం. 2018 జనవరిలోని ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలతో పోలిస్తే మిడ్ క్యాప్ సూచీ 19 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 33 శాతం పడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన తొలి దేశీ కంపెనీగా రికార్డు సృష్టించింది. కార్పొరేట్ ట్యాక్స్ రేటును తగ్గించడం, ఆఖరు దశలో నిల్చిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఊతమిచ్చేందుకు రూ. 25,000 కోట్ల నిధి ఏర్పాటు చేయడం, విదేశీ ఇన్వెస్టర్లపై పన్ను ప్రతిపాదనలను ఉపసంహరించడం వంటి అంశాలు మార్కెట్ల పరుగుకు దోహదపడ్డాయి. 2019లో రూ.లక్ష కోట్లకు పైగా విదేశీ నిధులు వచ్చాయి. ఇది క్రితం ఏడాదితో పోలిస్తే 7.5 శాతం అధికం. వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందని స్టాక్ ఇన్వెస్టర్లతో పాటు వ్యూహాత్మక ఇన్వెస్టర్లు కూడా బుల్లిష్‌గా ఉన్నారనడానికి ఇది నిదర్శనంగా పరిశీలకులు భావిస్తున్నారు. టెల్కోలకు షాక్ ట్రీట్మెంట్.. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కింపు విషయంలో కేంద్రం ఫార్ములానే సమర్ధి స్తూ సుప్రీం కోర్టు ఆదేశాలివ్వడంతో పాత ప్రైవేట్ టెల్కోల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈ దెబ్బతో టెల్కోలు ఏకంగా రూ. 1.47 లక్షల కోట్లు కేంద్రానికి చెల్లించాల్సి వస్తోంది. వీటికి కేటాయింపులు జరపడంతో వొడాఫోన్ ఐడియా సంస్థ దేశ కార్పొరేట్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో రూ. 50,921 కోట్ల పైచిలుకు నష్టాలను సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రకటించింది. ఎయిర్టెల్ కూడా రూ. 23,045 కోట్ల నష్టాలు నమోదు చేసింది. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే కంపెనీని మూసేయక తప్పదని వొడాఫోన్ ఐడియా ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తానికి రంగంలోకి దిగిన కేంద్రం.. టెల్కోలకు ఊరటనిచ్చేలా స్పెక్ట్రం బాకీల చెల్లింపుపై రెండేళ్ల మారటోరియం ప్రకటించింది. ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జీల వివాదం కూడా తెరపైకి వచ్చింది. ఈ చార్జీలను కొనసాగించాలంటూ పాత టెల్కోలు, ఎత్తివేయాలని కొత్త టెలికం సంస్థ జియో వాదించాయి. చివరికి 2021 దాకా దీని గడువును ట్రాయ్ పొడిగించింది. ఈలోగా టెల్కోలన్నీ కలిసికట్టుగా చార్జీలను పెంచేశాయి. రేటు పెరిగినా డేటా వినియోగానికి డిమాండ్ తగ్గదని, ఆదాయాలు గణనీయంగా మెరుగుపడతాయని కంపెనీలు ఆశిస్తున్నాయి. కనీస చార్జీల ప్రతిపాదనను ట్రాయ్ పరిశీలిస్తోంది. అటు ప్రభుత్వ రంగ టెల్కోలకు కాస్త ఊరట లభించింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. రూ.69,000 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది. ఇరు సంస్థల్లో 92,000 మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ఎంచుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్ కొనసాగిన జోష్.. 2019లో మ్యూచువల్ ఫండ్స్ అసెట్స్ భారీగా పెరిగాయి. 2019 నవంబర్ నాటికే ఏయూఎం 18 శాతం (సుమారు రూ. 4.2 లక్షల కోట్లు) ఎగిసి రూ.27 లక్షల కోట్లకు చేరింది. ఇన్వెస్టర్ల ధీమాను పెంచేందుకు సెబీ తీసుకుంటున్న చర్యలు, డెట్ స్కీముల్లోకి భారీగా పెట్టుబడుల రాకతో.. కొత్త ఏడాది కూడా ఇదే ధోరణి కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. 2020లో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ 17–18 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చని, ఎకానమీ పుంజుకుంటే ఈక్విటీ ఫండ్స్‌లోకి కూడా భారీగా పెట్టుబడులు రావొచ్చని ఫండ్ సంస్థల సమాఖ్య యాంఫీ అంచనా వేస్తోంది. బీమా రంగం... ధీమాగా వృద్ధి బీమా పరిశ్రమ వృద్ధి స్థిరంగా కొనసాగింది. నవంబర్ దాకా చూస్తే కొత్త ప్రీమియం వసూళ్లు వార్షికంగా సుమారు 37 శాతం వృద్ధితో రూ. 1.7 లక్షల కోట్లుగా నమోదైనట్లు కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. రాబోయే రోజుల్లో పరిశ్రమ 15% వృద్ధి రేటు సాధించవచ్చని అంచనా వేసింది. కుటుంబాలు చేసే పొదుపు మొత్తాలు.. బంగారం వంటి వాటి వైపు కాకుండా ఇతరత్రా ఆర్థిక అసెట్స్‌వైపు మళ్లుతుండటం, ప్రభుత్వ విధానాలు, బీమా విస్తృతికి సంస్థల ప్రయత్నాలు ఇందుకు దోహదపడగలవని పరిశ్రమవర్గాలు పేర్కొ న్నాయి. ఎకానమీ అస్తవ్యస్తం.. అంతర్గత, అంతర్జాతీయ సవాళ్లతో ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థకు కష్టంగానే గడిచింది. వినియోగం, ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతులు.. అన్నీ మందగించాయి. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అగ్రగామి దేశం హోదాను భారత్ కోల్పోయింది. సెప్టెంబర్ క్వార్టర్లో జీడీపీ వృద్ధి.. ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి పడిపోయింది. 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం దిశగా దూసుకెళ్లాల్సిన ఎకానమీ... మందగమనం దెబ్బతో కుంటినడకలు నడుస్తోంది. ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు దేశ వృద్ధి రేటు అంచనాలకు భారీగా కోతలు పెట్టాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం పలు సంస్కరణలు ప్రవేశపెడుతోంది. కార్పొరేట్ ట్యాక్స్ రేటును పాతిక శాతానికి తగ్గించడం, ఆర్థిక రంగ పునర్వ్యవస్థీకరణ, వడ్డీ రేట్ల కోత వంటివి వీటిలో కీలకం. కార్పొరేట్ ట్యాక్స్ కోత వల్ల సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీలు కాస్త మెరుగైన ఫలితాలు ప్రకటించగలిగాయి. సులభతరంగా వ్యాపారాలు నిర్వహించడానికి అనువైన దేశాల జాబితాలో భారత్ 77వ స్థానం నుంచి 63వ స్థానానికి వచ్చింది. మరోవైపు, ఆర్బీఐ కీలక పాలసీ రేట్లను తగ్గించినా.. ఆ ప్రయోజనాలను ఖాతాదారులకు బ్యాంకులు పూర్తిగా బదలాయించకపోతుండటంతో దేశీయంగా వినియోగానికి ఊతం లభించడం లేదు. దీంతో వచ్చే సంవత్సరం కూడా పరిస్థితి పెద్దగా మెరుగుపడేలా కనిపించడం లేదనేది పరిశీలకుల మాట. అయితే, ఇన్ఫ్రాపై వచ్చే అయిదేళ్లలో రూ.100 లక్షల కోట్లు వెచ్చించాలన్న ప్రభుత్వ ప్రణాళికతో ఎకానమీకి కొంత ఊతం లభించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. రియల్టీ అంతంతమాత్రం... రియల్టీ రంగంపైనా ఆర్థిక మందగమన ప్రభావం గణనీయంగా పడింది. టాప్ 7 నగరాల్లో రిటైల్ లీజింగ్ కార్యకలాపాలు క్రితం ఏడాదితో పోలిస్తే 35 శాతం తగ్గాయి. 2018లో 5.5 మిలియన్ చ.అ. లీజింగ్ నమోదు కాగా 2019లో ఇది 3.6 మి.చ.అ.లకు పరిమితమైందని రియల్టీ సేవల సంస్థ అనరాక్ నివేదికలో వెల్లడైంది. ఆటోమొబైల్, జ్యుయలరీ, ఎలక్ట్రానిక్స్, హైపర్మార్కెట్లు మొదలైన విభాగాల్లో లీజింగ్ తగ్గగా.. ఫుడ్ అండ్ బెవరేజెస్, సినిమా, సౌందర్య సంరక్షణ సేవల విభాగాల్లో పెరిగింది. అయితే, వచ్చే ఏడాది రిటైల్ లీజింగ్ మళ్లీ పుంజుకోవచ్చని అంచనాలున్నాయి. పసిడి.. జిగేల్ జిగేల్ పసిడి మెరుపులు ఈ ఏడాది మరింత కాంతివంతమయ్యాయి. అంతర్జాతీయంగా ఔన్సు (31.1 గ్రాములు) బంగారం ధర 1,400 డాలర్ల శ్రేణిని ఛేదించింది. 2013 తర్వాత మళ్లీ తొలిసారి ఈ ఏడాది ఆగస్టులో 1,500 డాలర్ల మార్కును అధిగమించింది. దేశీయంగా రేటు ఏకంగా 25 శాతం పెరిగింది. సంవత్సరం తొలినాళ్లలో రూ.31,500 స్థాయిలో ఉన్న పది గ్రాముల బంగారం ధర దాదాపు రూ.8,000 పెరిగి ఒక దశలో రూ. 40,000 స్థాయిని కూడా తాకింది. సాధారణంగా.. అనిశ్చితి, ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారాన్ని పరిగణిస్తారు. ఈ కారణాలే ఈ ఏడాది పసిడి పరుగుకు దోహదపడ్డాయి. అంతర్జాతీయంగా భౌగోళిక.. రాజకీయ... వాణిజ్య అనిశ్చితి, అమెరికా – చైనా మధ్య సుదీర్ఘంగా కొనసాగిన టారిఫ్‌ల యుద్ధం వంటివన్నీ ఇన్వెస్టర్లను పసిడివైపు మొగ్గేలా చేశాయి. ప్రపంచ ఎకానమీపై కమ్ముకున్న నీలినీడలతో.. షేర్ల వంటి రిస్కీ సాధనాల కన్నా బంగారం, ఇతరత్రా సురక్షిత సాధనాలే ఆకర్షణీయంగా ఉంటాయని 2019 రెండో త్రైమాసిక నివేదికలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. సాధారణ ఇన్వెస్టర్ల తరహాలోనే సెంట్రల్ బ్యాంకులు కూడా పసిడిని భారీగా కొని నిల్వలు పెంచుకుంటున్నాయి. వచ్చే ఏడాది కూడా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి, కనిష్ట స్థాయిల్లో వడ్డీ రేట్లు, డాలరు బలహీనపడే అవకాశాల నేపథ్యంలో బంగారం పరుగు కొనసాగుతుందని భావిస్తున్నారు. కీలకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికలతో మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో 2020లో ఔన్సు బంగారం ధర 1,620 డాలర్ల స్థాయిని తాకవచ్చని అంచనాలున్నాయి. అయితే, ఇప్పటికే పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరిపేసిన స్పెక్యులేటివ్ ఇన్వెస్టర్లు.. 2020లో అమ్మకాలకు దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫలితంగా పసిడి రేటు తగ్గే చాన్సు కూడా ఉందనేది నిపుణుల అంచనా. ఆటోమొబైల్ రివర్స్ గేర్‌లోనే... డిమాండ్ లేక అమ్మకాలు తగ్గడం మొదలుకుని ప్లాంట్ల మూసివేతలు, ఉద్యోగాల కోతలు, వందల మంది డీలర్ల దివాలా.. కొత్త కాలుష్య ప్రమాణాలు, ఎలక్ట్రిక్ వాహనాల విధానాలు.. ఇలా వివిధ కారణాలు ఆటోమొబైల్ పరిశ్రమను తెరిపిన పడనివ్వకుండా చేశాయి. ఎకానమీలో మందగమనం, ధరల పెంపుతో ప్యాసింజర్ వాహన విక్రయాలు క్షీణించగా, అధిక నిల్వలు పేరుకుపోయి.. ఫైనాన్స్ అవకాశాలు తగ్గిపోయి వాణిజ్య వాహన అమ్మకాలు పడిపోయాయి. ఉద్యోగ కల్పన, డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటంతో ద్విచక్ర వాహన విక్రయాలు భారీగా తగ్గాయి. అయితే, వాహనాల కొనుగోళ్లకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తుండటం, రుణ లభ్యతను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటూ ఉండటం తదితర చర్యలు రాబోయే రోజుల్లో ప్యాసింజర్ వాహనాలకు సానుకూలంగా ఉండగలవన్న అంచనాలు నెలకొన్నాయి. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో సెంటిమెంటు మెరుగుపడుతుండటం .. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ల అమ్మకాలకూ సానుకూలంగా ఉండవచ్చని అంచనా. డీల్ స్ట్రీట్ .. కార్పొరేట్లు డీలా కార్పొరేట్లు రుణ సంక్షోభాల్లో కూరుకుపోవడంతో 2019లో విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్ఏ) డీల్స్ ఒక మోస్తరు స్థాయికే పరిమితమయ్యాయి. లిక్విడిటీ కొరత, విదేశీ ఇన్వెస్టర్లు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడం, అంతర్జాతీయంగా అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం వంటి అంశాలతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అవలంబించారు. న్యాయసేవల సంస్థ బేకర్ మెకెంజీ నివేదిక ప్రకారం 2019లో మొత్తం మీద సుమారు రూ. 52.1 బిలియన్ డాలర్ల విలువ చేసే డీల్స్ జరిగాయి. 2019లో సగటు ఎంఅండ్ఏ డీల్ పరిమాణం 81 మిలియన్ డాలర్లుగా నమోదైంది. గడిచిన మూడేళ్లతో పోలిస్తే ఇదే అత్యల్పం. తయారీ, ఇంధనం, స్టార్టప్, ఫార్మా, బ్యాంకింగ్, ఐటీ, ఇన్ఫ్రా, రిటైల్, ఈ–కామర్స్ రంగాల్లో గణనీయంగా ఒప్పందాలు కుదిరాయి. వ్యాపారాలకు అనువైన సంస్కరణలు, అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు తిరిగొస్తుండటం వంటి అంశాల ఊతంతో 2020, 2021 సంవత్సరాల్లో డీల్స్ పరిస్థితి మళ్లీ పుంజుకోగలదని బేకర్ మెకెంజీ ఒక నివేదికలో తెలిపింది. బ్యాంకింగ్... ఫైనాన్స్ సవాళ్లమయం ఐఎల్అండ్ ఎఫ్ఎస్ దివాలా ప్రభావాలతో 2019 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం కష్టాలు కొనసాగాయి. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్, అల్టికో క్యాపిటల్ వంటి సంస్థలు దివాలా తీశాయి. ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభంతో రుణ లభ్యత కొరవడి ఆటోమొబైల్ వంటి ఇతర రంగాలపైనా ప్రభావం పడింది. మొండిబాకీలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం 10 బ్యాంకులను నాలుగు కింద విలీనం చేసింది. యూనియన్ బ్యాంకులో విలీనంతో తెలుగువారి ఆంధ్రా బ్యాంకు కనుమరుగు కానుంది. నెఫ్ట్ సేవలు ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులోకి వచ్చాయి. ఎట్టకేలకు దివాలా కోడ్ ప్రయోజనాలు కనిపించడం ప్రారంభమైంది. ఎస్సార్ స్టీల్ వంటి కేసులు పరిష్కారం కావడంతో బ్యాంకులకు వేల కోట్ల మేర మొండిబాకీల రికవరీ సాధ్యపడింది. అయితే, ఇంకా చాలా కేసుల పరిష్కారానికి సుదీర్ఘ సమయం పట్టేస్తుండటం ఆందోళనకర విషయం. మొండిబాకీల (ఎన్పీఏ) భారం ఈసారి కాస్త తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ ఆఖరు నాటికి స్థూల ఎన్పీఏలు రూ. 8.94 లక్షల కోట్లకు తగ్గాయి. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో స్థూల మొండిబాకీలు రూ. 10.18 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇక, సుదీర్ఘ వివాదానికి ఫుల్స్టాప్ పెడుతూ బిమల్ జలాన్ సిఫార్సుల మేరకు రిజర్వ్ బ్యాంక్ .. 2018–19 కేంద్రానికి గాను తన వద్ద ఉన్న మిగులు నిధుల్లో రూ. 1.76 లక్షల కోట్లు కేంద్రానికి బదలాయించేందుకు అంగీకరించింది. మందగమనంతో కొట్టుమిట్టాడుతున్న ఎకానమీకి ఊతమిచ్చేలా కీలక వడ్డీ రేట్లను 135 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు .. దశాబ్ద కనిష్ట స్థాయి 5.15 శాతానికి దిగివచ్చింది. అయితే, ద్రవ్యోల్బణం ఎగియడంతో డిసెంబర్లో రేట్ల కోతకు కాస్త విరామమిచ్చింది. -
హిట్.. ఫేవరెట్
2019... ప్రేక్షకులకు తెలుగు సినిమా చాలానే ఇచ్చింది. కొత్త దర్శకులు, హీరోలు, హీరోయిన్లను పరిచయం చేసింది. కొత్త తరహా చిత్రాలను తీసుకొచ్చింది. పనిలో పనిగా ప్రేక్షకుల ‘ఫేవరేట్ కాంబినేషన్’ని మళ్లీ సెట్ చేసింది. 2019లో ఇలా మళ్లీ సెట్ అయిన సక్సెస్ఫుల్ కాంబినేషన్ సినిమాలు 2020లో విడుదలవుతాయి. ఇక ఈ ఫేవరెట్ హిట్ కాంబినేషన్ల గురించి తెలుసుకుందాం.. మాస్ కాంబినేషన్ ఆడియన్స్ మాస్ పల్స్ పట్టిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. ప్రేక్షకులకు మాస్ కిక్ ఎక్కించే హీరో బాలకృష్ణ. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అది డబుల్మాసే. బాలకృష్ణ–బోయపాటి కాంబినేషన్లో ఆల్రెడీ వచ్చిన ‘సింహా’ (2010), ‘లెజెండ్’ (2014) చిత్రాల మాస్ సక్సెస్‌లే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో మరో మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ ఏడాది ముగిశాయి. జనవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను డబుల్ హ్యాట్రిక్ అల్లు అర్జున్‌ని (బన్నీ) ‘జులాయి’ (2012)గా చూపించి ప్రేక్షకులను మెప్పించారు దర్శకుడు త్రివిక్రమ్. ‘జులాయి’ వచ్చిన మూడేళ్ల తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’గా బన్నీతో త్రివిక్రమ్ చెప్పించిన కుటుంబ విలువల లెక్కలు ప్రేక్షకులకు బాగా కిక్ ఇచ్చాయి. దీంతో వీరిద్దరూ హాట్రిక్ హిట్ కోసం 2018లో ‘అల... వైకుంఠపురములో..’కి వెళ్లిపోయారు. ఈ చిత్రం జవనరి 12న విడుదల కానుంది. ఇక 2004లో దర్శకునిగా సుకుమార్ తెరకెక్కించిన తొలి చిత్రం ‘ఆర్య’. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటించారు. ఈ సినిమా విజయం ఇద్దరి కెరీర్‌కు మంచి మైలేజ్‌ని ఇచ్చింది. ‘ఆర్య’ సక్సెస్ క్రేజ్‌ను రిపీట్ చేయడానికి వీరిద్దరూ కలిసి ‘ఆర్య 2’ (2009) చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఈ ఏడాదిలో ప్రకటించారు. సో.. కొత్త ఏడాది అల్లు అర్జున్ అభిమానులకు డబుల్ ధమాకాయే. సుకుమార్, అల్లు అర్జున్, త్రివిక్రమ్ హిట్ కోసం క్రాక్ దర్శకునిగా గోపీచంద్ మలినేని ఇప్పటివరకు ఐదు సినిమాలు తెరకెక్కిస్తే అందులో రెండు (‘డాన్ శీను’ (2010), ‘బలుపు’ (2013)) చిత్రాలు రవితేజ హీరోగా వచ్చినవే. తాజాగా గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్లో మూడో చిత్రంగా ‘క్రాక్ ’ తెరకెక్కుతోంది. డాన్ శీను, బలుపుతో హిట్ సాధించి, ఇప్పుడు మరో హిట్ కోసం వీరు చేస్తున్న ‘క్రాక్’ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. గోపీచంద్ మలినేని, రవితేజ రూట్ మారింది రామ్ కెరీర్లో ‘నేను..శైలజ...’ (2016) సూపర్‌హిట్ మూవీ. దీంతో ఈ సినిమా దర్శకుడు కిశోర్ తిరమలతో 2017లో ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా చేశారు రామ్. ఈ ఏడాది రామ్–కిశోర్ తిరుమల కలిసి ‘రెడ్’ అనే సినిమా చేస్తున్నారు. ‘నేను...శైలజ, ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాల్లో రామ్‌ను లవర్ బాయ్‌గా చూపించిన కిశోర్ ఈసారి రూట్ మార్చి ‘రెడ్’ రామ్‌ను ఫుల్ మాస్ క్యారెక్టర్లో చూపించబోతున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. రామ్–కిశోర్ తిరుమల హీరో విలనయ్యాడు! దాదాపు పదేళ్ల క్రితం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అష్టా చమ్మా’ అనే చిత్రం ప్రేక్షకులకు నాని అనే మంచి నటుడిని పరిచయం చేసింది. ఈ చిత్రం తర్వాత నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ‘జెంటిల్మన్’ (2016) కూడా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇప్పుడు ఇంద్రగంటి దర్శకత్వంలో నాని నటిస్తున్న మూడో చిత్రం ‘వి’. ఇందులో సుధీర్‌బాబు మరో హీరో. ఈ సినిమాలో నానీది విలన్ రోల్. అలాగే నాని తొలిసారి విలన్ పాత్ర చేస్తున్న చిత్రం కూడా. అలా నానీని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటే ఇప్పుడు తనను విలన్‌గా చూపించబోతుండటం విశేషం. సమ్మోహనం(2018) తర్వాత సుధీర్‌బాబు, ఇంద్రగంటి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం కూడా ఇదే. ఇంద్రగంటి మోహనకృష్ణ , నాని లవ్ కాంబినేషన్ ‘ఊహలు గుసగుసలాడే...’(2014) చిత్రంతో హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు నాగశౌర్య. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించిన అవసరాల శ్రీనివాసే ఈ సినిమాను తెరకెక్కించారు. రెండేళ్ల తర్వాత అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన ‘జ్యో అచ్యుతానంద’(2016) సినిమాలో ఒక హీరోగా నటించారు నాగశౌర్య. నారా రోహిత్ మరో హీరో. తాజాగా నాగశౌర్య–అవసరాల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ‘ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి’. వీరి కాంబినేషన్లో వచ్చిన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం కూడా మరో లవ్‌స్టోరీ కావడం విశేషం. అవసరాల శ్రీనివాస్, నాగశౌర్య ఈ థర్డ్ కాంబినేషన్సే కాకుండా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (2013) సినిమా తర్వాత తమిళ హిట్ ‘అసురన్’ తెలుగు రీమేక్ కోసం హీరో వెంకటేష్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రెండోసారి సెట్టయ్యారు. ‘గౌతమ్‌నంద’ (2017) తర్వాత గోపీచంద్‌ని కబడ్డీ కోచ్‌గా మార్చి, ఆయనతో రెండో సినిమా తీస్తున్నారు సంపత్‌నంది. ‘నిన్నుకోరి’(2017) హిట్ కిక్‌తో ‘టక్‌జగదీష్’ కోసం మరోసారి కలిసి సెట్స్‌కు వెళ్లడానికి రెడీ అయ్యారు హీరో నాని, దర్శకుడు శివనిర్వాణ. ‘గూఢచారి’(2018)వంటì సూపర్‌హిట్ తర్వాత ‘మేజర్’కోసం మళ్లీ కలిశారు హీరో అడవి శేష్, దర్శకుడు శశి కిరణ్ తిక్క. గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’ (2015) చిత్రంలో రానా ఓ కీలకపాత్ర చేశారు. ఇప్పుడు రానా–గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చే ఏడాది చివర్లో ‘హిరణ్యకశ్యప’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హిట్ దిశగా తమను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ డైరెక్షన్లో యాక్ట్ చేయడానికి మరికొందరు హీరోలు కూడా రెడీ అయ్యారు. మరికొందరు అవుతున్నారు. ఇండియన్ సినిమా దృష్టంతా ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పైనే ఉంది. ఈ సినిమాకు ముందు రాజమౌళి దర్శకత్వంలో రెండు భాగాలుగా విడుదలైన ‘బాహుబలి’ చిత్రం సృష్టించిన ప్రభంజనం ప్రభావమే ఇందుకు ఓ కారణం. అలాగే ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలసి నటిస్తున్న చిత్రం కావడంతో స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. అయితే గతంలో ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెం 1 (2001), సింహాద్రి (2003), యమదొంగ (2007)’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి–ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న నాలుగో చిత్రం ఇది. అలాగే రామ్‌చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో మగధీర (2009) అనే సూపర్‌హిట్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ రాజమౌళి–రామ్‌చరణ్ కాంబినేషన్ పరంగా రెండోది. ఇలా ఆల్రెడీ సోలోగా రాజమౌళితో హిట్ అందుకున్న ఎన్టీఆర్–రామ్‌చరణ్ ‘ఆర్ఆర్ఆర్’తో కలసి హిట్ అందుకోవడం ఖాయం అనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న పది భాషల్లో విడుదల కానుంది. –ముసిమి శివాంజనేయులు. -
టాలీవుడ్ @ 2020
గడిచిన పదేళ్ల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ.. ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. మరెన్నో శిఖరాలను అందుకుంది. గొప్ప గొప్ప విజయాలను సాధించింది. తన మార్కెట్ వ్యాల్యూనూ అనూహ్యంగా పెంచుకుంది. ఇవాళ జాతీయంగా, అంతర్జాతీయంగా తెలుగు సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేశవ్యాప్తంగానే కాదు.. ఓవర్సీస్లోనూ భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇందుకు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి. తెలుగు సినిమాను అంతర్జాతీయంగా నిలబెట్టడంలో, టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయంగా విస్తరింపజేయడంలోనూ బాహుబలి సినిమాలది ప్రత్యేకమైన స్థానం. కానీ అంతకుముందు నుంచి టాలీవుడ్ సినిమాలు వడివడిగా ఎదుగుతూ ఎంతో పేరుప్రఖ్యాతలు పొందాయి. ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ దిశదిశలా వ్యాపించింది. ఇప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగానే క్రేజ్ నెలకొంది. అంతర్జాతీయంగానూ గుర్తింపు లభిస్తోంది. ఈ నేపథ్యంలో విస్తరించిన మార్కెట్‌ను అందిపుచ్చుకోవడం.. పెరిగిపోయిన అంచనాలకు దీటుగా సత్తా ఉన్న సినిమాలు నిర్మించడం తెలుగు చిత్రసీమకు కత్తిమీద సాములాంటిదే. పెరిగిన బడ్జెట్.. అంచనాలు! బాహుబలి ఇచ్చిన జోష్‌తో భారీ సినిమాలు తెరకెక్కించేందుకు ఇప్పుడు దర్శకనిర్మాతలు ముందుకొస్తున్నారు. ఒకప్పుడు 30, 40కోట్ల బడ్జెట్‌తో సినిమాలను తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు వెనుకాముందు అయ్యేవారు. సినిమా హిట్టయినా అంత బడ్జెట్ తిరిగొస్తుందా? అన్న సందేహాలు వెంటాడేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతిష్టాత్మక సినిమాల కోసం, క్రేజీ కాంబినేషన్ల కోసం వందల కోట్లు పెట్టేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు సాహసిస్తున్నారు. ఈ కోవలో వచ్చిన సినిమాలే సాహో, సైరా, మహర్షి, వినయవిధేయ రామ. ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలు. ఇందులో సాహో, సైరాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు 200 కోట్లకుపైగా బడ్జెట్‌తో భారీ అంచనాలతో, కళ్లుచెదిరే విజువల్స్, స్టంట్లతో ఈ సినిమాలు తెరకెక్కాయి. ఈ సినిమాలకు టాలీవుడ్లోనే కాదు దేశవ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. అయితే, భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఏమాత్రం కథ, కథనాలు ఏమాత్రం ప్రేక్షకుడి అంచనాలకు మించి లేకపోతే.. కథ మొదటికి వచ్చే ప్రమాదం ఉందని ఈ ఏడాది వచ్చిన సినిమాలు నిరూపించాయి. బాహుబలి తర్వాత భారీ అంచనాలతో, దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సాహో’. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విడుదలైనప్పటికీ.. అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలమైంది. దర్శకుడు సినిమాలోని స్టంట్ల మీద పెట్టిన ఫోకస్లో కొంతమేరకైనా కథ, స్క్రీన్‌ప్లే మీద పెట్టి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదేమోనని వినిపించింది. మొత్తానికి హిందీలో తప్ప మిగతా అన్ని భాషల్లో సాహో సినిమా భారీ పరాభవాన్నే ముటగట్టుకుంది. హిందీలో వందకోట్లకుపైగా వసూళ్లు రావడం, ప్రభాస్ స్టార్డమ్ కలిసిరావడంతో ఈ సినిమా నిర్మాతలకు కొంత ఊరటనిచ్చే విషయం. ఇక, చారిత్రక నేపథ్యంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సైరానరసింహారెడ్డి సినిమా కూడా అంచనాలకు దూరంగానే ఉండిపోయింది.రేనాటి సూరీడు, స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాంచరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులో హిట్టైనప్పటికీ.. అంచనాలను అందుకోలేకపోయింది. ఇతర భాషల్లో ఓ మోస్తరు వసూళ్లే రాబట్టింది. మహేశ్‌బాబు 25వ సినిమా మహర్షి కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే, ఈ సినిమా హిట్ అయినప్పటికీ.. ప్రిన్స్ మహేశ్ స్టామినాకు తగ్గట్టు వసూళ్లు రాబట్టంలో సక్సెస్ కాలేదు. ఇక, రాంచరణ్ హీరోగా తెరకెక్కిన వినయవిధేయ రామ సినిమా గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. రంగస్థలం లాంటి పర్ఫార్మెన్స్ ఒరియంటెడ్ పాత్ర చేసిన చరణ్.. ఆ వెంటనే రోటిన్ ఫార్ములా సినిమాలో నటించడం.. ఫైట్లు, రక్తపాతంతో దర్శకుడు బోయపాటి శ్రీను ప్రేక్షకులను బెంబెలెత్తించడంతో ఈ సినిమా బోల్తా కొట్టింది. మారిన బాక్సాఫీస్ సరళి! తెలుగు చిత్రపరిశ్రమ మార్కెట్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశీయంగానూ పొరుగు రాష్ట్రాల్లోనూ మంచి మార్కెట్ ఏర్పడింది. అంతేకాదు ఓవర్సీస్లోనూ గణనీయంగా వసూళ్లు రాబట్టే సత్తా ఉన్నట్టు తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో సినిమా జయాపజయాల ప్రమాణాలూ మారిపోయాయి. ఒకప్పడు 50 రోజులు ఆడితే బొమ్మ హిట్టు అనేవారు. వందరోజులు ఆడితే సూపర్‌హిట్టు.. 175, 200 రోజులు ఆడితే బ్లాక్‌బస్టర్ హిట్టు, ఆల్‌టైమ్ హిట్టు అని కొనియాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. డిజిటల్ స్ట్రీమింగ్ అందుబాటులోకి రావడంతో 40రోజుల్లోనే కొత్త సినిమా ప్రేక్షకుల చెంతకు చెరిపోతోంది. టీవీల్లోనూ, ఇంకా వీలైతే యూట్యూబ్‌లోనూ వీలైనంత త్వరగా కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల నడుమ ఎన్ని థియేటర్లలో విడుదలైంది.. ఏ స్థాయిలో ప్రారంభ వసూళ్లు సాధించింది.. ఎన్ని వారాలపాటు నిలకడగా వసూళ్లు రాబట్టగలిగిందనేని సినిమా విజయానికి ఇప్పుడు ప్రమాణంగా మారింది. ప్రారంభ వసూళ్ల ఆధారంగా సినిమా జయాపజయాలు బేరిజు వేసే పరిస్థితి వచ్చింది. మొదటి మూడు రోజులు బంపర్ వసూళ్లు సాధిస్తే బొమ్మ హిట్టు, సూపర్‌హిట్టు ఖాతాలోకి వెళ్లిపోతోంది. మొదటి రెండు వారాల వసూళ్లు సినిమా విజయానికి ప్రాణపదంగా మారిపోయాయి. థియేటర్లలో లాంగ్రన్ అనేది చాలావరకు కనుమరుగవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బాహుబలి, రంగస్థలం లాంటి బలమైన కథాచిత్రాలే చాలాకాలంపాటు ప్రేక్షకులను థియేటర్లకు లాక్కొచ్చాయి. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ఎంత మంచి టాక్ వచ్చిన సినిమా అయినా, స్టార్ హీరో మూవీ అయినా మూడు, నాలుగు వారాలకు మించి థియేటర్లలో నిలబడని పరిస్థితి. మారిన పరిస్థితులకు అనుగుణంగా టాలీవుడ్ కూడా తన పద్ధతలను మార్చుకుంది. ప్రారంభ వసూళ్లపైనే ఇప్పుడు దర్శక నిర్మాతలు, సినీ తారలు ఫోకస్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున విడుదల చేసి మొదటి ఒకటిరెండు వారాల్లోనే దండిగా వసూళ్లు రాబడట్టంపై దృష్టి పెట్టారు. ఆన్లైన్లో వరుసగా ఫస్ట్‌లుక్, టీజర్లు, పాటలు, ట్రైలర్లు విడుదల చేస్తూ.. ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచుతూనే.. క్షేత్రస్థాయి పర్యటనలతో సినిమా విడుదలకు ముందే ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లి.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు కొత్త కొత్త వ్యూహాలు పన్నుతున్నారు. ఈ పరిణామాలు కొంతమేరకు సక్సెస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా సినిమాలోబలమైన కథకథనాలు, భావోద్వేగాలు, వినోదం ఉంటే.. ఆటోమేటిక్‌గా ప్రేక్షకులు థియేటర్ వైపు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కథకథనాలు బాగుండి.. స్టార్ బలం లేకపోయినా, అంతగా ప్రచారం లేకపోయినా హిట్టు కొట్టవచ్చునని ఈ ఏడాది వచ్చిన బ్రోచేవారెవురా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఎవరు, మల్లేశం వంటి సినిమాలు నిరూపించాయి. మొత్తానికి కళ్లుచెరిరే స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్ మాత్రమే సినిమాను ప్రేక్షకులకు చేరువచేయలేదని, ప్రేక్షకుడిని రంజింపజేసే కథ, స్క్రీన్‌ప్లే, బలమైన భావోద్వేగాలు ఉంటే తప్ప బొమ్మ హిట్టు కావడం అంత ఈజీ కాదని 2019 బాక్సాఫీస్ హిస్టరీ చాటుతోంది. మూస సినిమాలకు కాలం చెల్లిపోయిందని, రొటీన్ ఫార్మూలాలతో తెరకెక్కించే మసాలా సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ దొరకడం కష్టమేనని తాజా పరిణామాలు చెప్పకనే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే, పెరిగిన మార్కెట్ అంచనాలకు దీటుగా.. మారిన ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని.. ఫ్రెష్ కంటెంట్‌నూ, క్రియేటివ్ కథలను అన్వేషించి తెరకెక్కించాల్సిన అవసరముందని టాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కమర్షియల్ సినిమా పేరిట ఇన్నాళ్లు అవలంబించిన రోటిన్, మూస ఫార్ములా చిత్రాలను పక్కనబెట్టి.. ఒరిజినాలిటీ ఉన్న కథలను, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో వినూత్నంగా తెరకెక్కిస్తే ప్రేక్షకుల హృదయాలు గెలుచుకోవడం ఈజీ అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సంక్రాంతికి రాబోతున్న టాలీవుడ్ పందెకోళ్లు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురం సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. సరికొత్త కథాకథనాలతో కొత్త సంవత్సరంలో రాబోయే సినిమాలు ప్రేక్షకులను ఆదరిస్తాయని, నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తాయని ఆశిద్దాం. - శ్రీకాంత్ కాంటేకర్ -
దివికేగిన సినీ దిగ్గజాలు
-
మాంద్యం మింగేసింది
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక మాంద్యం నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత.. ఇంటర్ ఫలితాల్లో లోపాలపై తీవ్ర వివాదం... న్యాయ చిక్కులతో బెడిసికొట్టిన కొత్త సచివాలయం, శాసనసభ భవన సముదాయాల నిర్మాణం, ఆర్టీసీ కార్మికుల సుదీర్ఘ సమ్మె... దిశ హత్యాచారం, నలుగురు నిందితుల ఎన్కౌంటర్.. వెరసి ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం కొన్ని ఒడిదుడుకులకు, సంచలనాలకు వేదికైంది. అదే సమయంలో ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభం కావడం ప్రభుత్వ అతిపెద్ద విజయంగా, తీపిగుర్తుగా మిగిలింది. 2019 సంవత్సరం మరో మూడు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్రంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలు, రాష్ట్రానికి ఎదురైన క్లిష్ట పరిస్థితులపై కథనం. ఆర్థిక మాంద్యం దెబ్బ ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పడింది. ఫిబ్రవరిలో రూ. 1,82,087 కోట్ల భారీ అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఆర్థిక మాంద్యం దెబ్బకు పూర్తిస్థాయి బడ్జెట్‌ను సెప్టెంబర్‌లో రూ. 1,46,492.30 కోట్లకు తగ్గించుకుంది. అయినా ఇప్పటికే అమల్లో ఉన్న రైతుబంధు వంటి ప్రతిష్టాత్మక పథకాలకు తీవ్ర నిధుల కొరత ఏర్పడింది. పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్ల బిల్లులు పేరుకుపోయాయి. గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన కొత్త హామీల అమలు కూడా ఆర్థిక మాంద్యం వల్ల ప్రశ్నార్థకమైంది. రైతులకు రూ. లక్షలోపు రుణ మాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు పీఆర్సీ, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు వంటి హామీల అమలు కోసం రాష్ట్ర ప్రజలు ఏడాదంతా నిరీక్షించాల్సి వచ్చింది. రైతుబంధు ఆర్థిక సాయం, ఆసరా పెన్షన్ల పెంపు హామీలను అమల్లోకి తెచ్చినా సకాలంలో పంపిణీ చేయలేకపోయింది. గత ఖరీఫ్‌లో 45 లక్షల మంది రైతులకు రైతుబంధు కింద రూ. 5,460 కోట్లు చెల్లించగా 8 లక్షల మందికి రూ. 1,500 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఇక రబీకి సంబంధించి చెల్లింపులు ఇంకా ప్రారంభం కాలేదు. నిధుల కొరత వల్ల కొత్తగా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సవరించిన అంచనాల్లో రూ. 10 వేల కోట్లను భూముల అమ్మకం ద్వారా సమీకరించుకోవాలని నిర్ణయించినా కోకాపేట భూముల అమ్మకంపై హైకోర్టు స్టే విధించడంతో అది నెరవేరట్లేదు. ఇంటర్ ఫలితాల్లో ‘ఫెయిల్’ ఇంటర్మీడియెట్ ఫలితాల ప్రకటనలో దొర్లిన తప్పులు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. రిజల్ట్స్ ప్రాసెసింగ్ కాంట్రాక్టు దక్కించుకున్న గ్లోబరీనా సంస్థ చేసిన తప్పిదాల కారణంగా పాసైన విద్యార్థులు సైతం ఫెయిలైనట్లు ఫలితాలొచ్చాయి. దీంతో తీవ్ర మానసిక వేదనకు 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపింది. ఈ విషయంలో ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదనే విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితాలపై విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు ఆందోళనలు నిర్వహించడం, ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల సంఘం, సుప్రీంకోర్టు స్పందించడం ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేసింది. ‘కాళేశ్వరం’ జాతికి అంకితం.. రాష్ట్రంలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ జూన్ 21న ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి ఆయకట్టుకు నీరు అందించేలా యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. 52 రోజుల పాటు.. అక్టోబర్ 5 నుంచి 52 రోజులపాటు సాగిన ఆర్టీసీ సమ్మె యావత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. సమ్మె విరమణకు కార్మిక సంఘాల జేఏసీ, డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభు త్వం నిరాకరించడంతో 50 వేల మంది కార్మికులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఐదుగురు కార్మికుల బలవన్మరణాలతో కలిసి మొత్తం 38 మంది కార్మికులు సమ్మె కాలంలో మరణించారు. చివరకు కార్మిక జేఏసీ సమ్మె విరమించడం, కార్మికులను ప్రభుత్వం బేషరతుగా విధుల్లో చేర్చుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. సమ్మె విరమించిన కార్మికులపై సీఎం కేసీఆర్ హామీల వర్షం కురిపించడం ఊరట కలిగించింది. ఆర్టీసీ పరిరక్షణ కోసం కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున చార్జీల పెంపును ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. సచివాలయం లేని రాష్ట్రం కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయాల నిర్మాణం కోసం ప్రభుత్వం చారిత్రక ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చేసి అక్కడే రూ. 400 కోట్లతో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలనితీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చి రూ. 100 కోట్లతో కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని తీసుకున్న నిర్ణయంపై స్టే విధించింది. ప్రభుత్వం హుటాహుటిన సచివాలయ భవనాలను ఖాళీ చేయించడంతో పాలనపరంగా కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. సచివాలయ శాఖల్లో కొన్నింటిని సమీపంలోని బీఆర్కేఆర్ భవన్‌కు తరలించగా మిగిలిన శాఖలను వేర్వేరు చోట్లలో ఉన్న ప్రభుత్వ భవనాలకు చేర్చారు. చెట్టుకొకరు పుట్టకొకరు అన్న చందంగా సచివాలయ శాఖల పరిస్థితి తయారైంది. -
ఆడ బిడ్డల ఆర్తనాదాలు
సాక్షి, హైదరాబాద్: నేరం..ఈ ఏడాది రాష్ట్రంపై పడగ విప్పింది. ప్రశాంత జీవనాన్ని తన ఉనికితో ఉలికిపాటుకి గురిచేస్తూ మానవత్వాన్ని మృగ్యం చేసింది. మానవ సంబంధాల విలువల్ని తుంచు తూ వికృత చేష్టలతో మనిషంటే ఓ భరోసా అన్న నమ్మకాన్ని సడలించింది. అవినీతి కేసులు, వివాహేతర సంబంధాలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు, ఎన్కౌంటర్లు, హత్యలతో అన్ని రకాల నేరాలకూ రాష్ట్రం ఆలవాలమైంది. రాజధానిలో చోటుచేసుకు న్న కొన్ని నేరాలు దేశం దృష్టిని ఆకర్షించాయి. వరుసగా వెలుగుచూసిన అత్యాచారాలు, హత్యలతో ఒక దశలో మహిళలు, చిన్నారుల రక్షణ సందేహం లో పడింది. ముఖ్యంగా ‘దిశ’కేసులో నిందితులు ఆమెను చంపిన తీరు..దేశవ్యాప్త ఉద్యమానికి దారి తీసింది. అదేరోజు వరంగల్‌లో మానస, అదేవారంలో ఆసిఫాబాద్‌లో ‘సమత’ అత్యాచారం అ నంతరం దారుణహత్యలకు గురయ్యారు. జూన్‌లో వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై లైంగికదాడి హత్య తో ప్రజలు కోపంతో రగిలిపోయారు. మరోవైపు యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హా జీపూర్లో శ్రీనివాసరెడ్డి.. ముగ్గురు మైనర్లపై అ త్యాచారం జరిపి, తన వ్యవసాయబావిలో పూడ్చి న ఘటన కలకలం రేపింది. ఈ ఏడాది జరిగిన నేరాలన్నింటినీ సింహావలోకనం చేసుకుంటే... ► కోస్టల్‌బ్యాంక్ డైరెక్టర్, ఎన్ఆర్ఐ, ప్రముఖ వ్యాపార వేత్త చిగురుపాటి జయరాం (55) జనవరి 31న హత్యకు గురయ్యారు. తెలంగాణలో హత్యచేసి మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్‌లో వదిలివేశారు. తెలంగాణకు కేసు బదిలీఅయ్యాక ప్ర ధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి, అతని అ నుచరులను అరెస్టు చేశారు. సహకరిం చిన ఇద్దరు పోలీసులపై వేటుపడింది. ► డేటా చౌర్యం కేసులో మాదాపూర్‌లోని ఐటీ గ్రీడ్ కార్యాలయాన్ని మార్చి 8న పోలీస్ లు సీజ్ చేశారు. ఈ కేసు తెలంగా ణ, ఏపీలో సంచలనం సృష్టిం చింది. రెండు తెలుగు రా ష్ట్రాల రాజకీయ పార్టీల తో ముడిపడి ఉన్న కేసు దర్యాప్తునకు ప్రభుత్వం ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ ఏర్పాటు చే సింది. దర్యాప్తు కొనసాగుతోంది. ► యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో సైకో శ్రీనివాస్ రెడ్డి ముగ్గు రు బాలికలను అపహరించి అత్యాచారం చేసి న విషయం ఏప్రిల్ 26న వెలుగుచూసింది. ఊరికి రవాణా సదుపాయం లేకపోవడంతో లిఫ్ట్ ఇస్తానని చెప్పి, బాలికలను తన వ్యవసా య బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేసి అక్కడే మృతదేహాల్ని పాతిపెట్టాడు. ► టీవీ9 యాజమాన్య బదిలీ విషయంలో పలు అడ్డంకులు సృష్టించిన కేసులో ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాశ్‌పై మే 9న పోలీసులు కేసు లు నమోదు చేశారు. టీవీ9 చానల్‌ను ఏబీసీఎల్ నుంచి అలందా మీడియాకు బదిలీ కా కుండా నటుడు శివాజీతో ప లు నకిలీ పత్రాలు సృష్టించారని రవిప్రకాశ్, శివాజీలపై కేసు నమోదైంది. ఈ కేసులో నిం దితులిద్దరూ పోలీసులకు చిక్కకుండా పరారవడం, అపుడప్పుడూ వీడియోలు విడుదల చేయడం సంచలనం రేపింది. ► హన్మకొండ కుమార్‌పల్లిలో తల్లిపక్కనే నిద్రపోతున్న 9 నెలల పసిపాపను ప్రవీణ్ అనే యువకుడు జూన్ 30న ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి, చంపేశాడు. పోలీసులు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు లో 48 రోజుల్లో నిందితుడి నేరం నిరూపిం చారు. అతనికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆపై దాన్ని హైకోర్టు జీవితఖైదుగా మార్చింది. ► కుమరంభీం జిల్లా సార్సాల అటవీ అధికారిణి అనితపై కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీటీ సీ సభ్యుడు కోనేరు కృష్ణారావు తన అనుచరులతో జూన్ 30న దాడి చేశారు. ► పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో టీఆర్ ఎస్ ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టు లు జూలై9న అపహరించి కాల్చిచంపారు. కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బెస్తకొత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ► జూలై 10న ఏసీబీ దాడుల్లో కేశంపేట తహసీల్దార్ వి.లావణ్య వద్ద ఏకంగా రూ.93 లక్షల నగదు 40 తులాల బంగారం లభించింది. ► ఎంసెట్ పేపర్ లీకేజీలో సీఐడీ పోలీసులు జూలై 16న చార్జిషీటు దాఖలు చేశారు. ► భద్రాద్రి జిల్లా గుండాలలో జూలై 31న ఎన్కౌంటర్లో న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి లింగన్న మరణించాడు. ► ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య,కుటుంబ సమస్యల కారణంగా కోడెల హైదరాబాద్‌లోని సొంతింట్లో ఆగస్టు 16వ తేదీన ఉరేసుకుని మరణించారు. ► ఈఎస్ఐలోని ఐఎంఎస్ కుంభకోణంలో 700 కోట్ల మేరకు అవతవకలు ఆరోపణల నేపథ్యంలో ఆగస్టు 29న మాజీ డైరెక్టర్ దేవికారా ణి, మాజీ జేడీ పద్మలను ఏసీబీ అరెస్టు చేసిం ది. ఇప్పటిదాకా 21 మంది అరెస్టయ్యారు. ► హయత్‌నగర్‌లో..ప్రియుడు శశికుమార్ బ్లాక్‌మెయిలింగ్‌కు తలొగ్గిన కీర్తి అనే యువతి అక్టోబరు 28న తల్లి రజితను చంపి, శవాన్ని మాయం చేసిన ఘటన వెలుగుచూసింది. ► అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని భూవివాదంలో కూర సురేశ్ నవంబరు 4న పెట్రోల్ పోసి నిప్పంటించాడు. విజయారెడ్డి అక్కడికక్కడే మరణించగా, నిందితుడు సురేశ్, డ్రైవర్ గురునాథం, అ టెండర్ చంద్రయ్య తరువాత మరణించారు. ► కాచిగూడలో హంద్రీనీవా– ఎంఎంటీఎస్ రైళ్లు కాచిగూడలో నవంబరు 11న ఎదురెదురుగా ఢీకొన్నాయి. 8 మంది గాయపడ్డారు. లోకోపైలెట్ చంద్రశేఖర్ చికిత్స పొందుతూ మరణించాడు. ► ఆసిఫాబాద్ జిల్లాలో సమతపై ముగ్గురు టేకు చెక్కల స్మగ్లర్లు నవం బరు 24న లైంగికదాడి చేసి, కత్తితో గొంతుకోసి చంపారు. దీనిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ► రాష్ట్రంలో ఒకేరోజు వెటర్నరీ వైద్యురాలు దిశ, వరంగల్‌లో డిగ్రీ విద్యార్థిని మానసలు నవం బరు 27 అపహరణకు గురై అత్యాచారం అనంతరం హత్యకు గురయ్యారు. ► దిశ కేసులో నిందితులు నలుగురు ఎన్కౌంటర్లో మరణించారు. డిసెంబరు 6న చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో నిందితు లు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీ న్, చింతకుంట చెన్నకేశవులు పోలీసులపై దాడి చేసి, తుపాకులు లాక్కున్నారు. పోలీ సుల ఎదురుకాల్పుల్లో నలుగురు హతమయ్యారు. దీనిపై సిట్ విచారణ నడుస్తోంది. -
గులాబీనామ సంవత్సరం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో వరుసగా ఆరో ఏడాది కూడా టీఆర్ఎస్ హవా కొనసాగింది. రాజకీయంగా ఆ పార్టీకి 2019 అన్ని రకాలుగా కలిసొచ్చింది. ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ను కుదేలు చేయడంతోపాటు స్థానిక సంస్థలను క్లీన్‌స్వీప్ చేసుకోవడం ద్వారా అధికార టీఆర్ఎస్ ఈ ఏడాది పూర్తిస్థాయి రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఓ ఎమ్మెల్సీ సీటు, మూడు లోక్‌సభ స్థానాల్లో విజయం మినహా రాజకీయంగా ఈ ఏడాది అన్నీ ఒడిదుడుకులే ఎదురయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రం నుంచి నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకోవడం, ఎంపీగా గెలిచిన కిషన్‌రెడ్డి ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు చేపట్టడం ఆ పార్టీలో కాస్త జోష్ నింపాయి. అధికార టీఆర్ఎస్కు మిత్రపక్షంగా ఉంటున్న ఎంఐఎంకు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కగా తెలంగాణ జన సమితి, లెఫ్ట్ పార్టీలు ఈ ఏడాది ఉనికి చాటుకునేందుకు తంటాలు పడ్డాయి. 32 జిల్లా పరిషత్‌లు గులాబీ ఖాతాలోకి... ఈ ఏడాది జనవరిలో మూడు విడతల్లో 12,732 గ్రామ పంచాయతీలు, 1.13 లక్షల వార్డులకు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ పదవులను అధికార టీఆర్ఎస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ‘కారు’ జోరు తగ్గింది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకుగాను తొమ్మిది చోట్లే టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. పార్టీ కీలక ఎంపీలైన కవిత, బోయినపల్లి వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, నగేశ్ ఓటమి పాలయ్యారు. మార్చిలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతోపాటు వరంగల్–నల్లగొండ–ఖమ్మం, కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ టీచర్ల నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ మద్దతుదారులు ఓటమిపాలయ్యారు. శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), తేరా చిన్నపరెడ్డి (నల్లగొండ) విజయం సాధించారు. ఎమ్మెల్యే కోటాలో నవీన్‌రావు శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 32 జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. 5,659 ఎంపీటీసీ స్థానాలకుగాను 3556, 534 జెడ్పీటీసీ స్థానాలకుగాను 445 చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. రెండో పర్యాయం సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ 2019లో రెండు విడతల్లో కేబినెట్‌ను విస్తరించారు. ఫిబ్రవరిలో జరిగిన తొలి విడత విస్తరణలో ఈటెల రాజేందర్, జి.జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు చోటు దక్కింది. సెప్టెంబర్‌లో జరిగిన రెండో విడత మంత్రివర్గ విస్తరణలో హరీశ్‌రావు, కేటీఆర్, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లకు అవకాశం లభించింది. అక్టోబర్ 21న జరిగిన హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలవడం ద్వారా తొలిసారిగా ఈ నియోజకవర్గం టీఆర్ఎస్ ఖాతాలో చేరింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన 13 మంది అధికారికంగా టీఆర్ఎస్లో చేరగా సీఎల్పీని విలీనం చేసుకోవడం ద్వారా కాంగ్రెస్‌ను టీఆర్ఎస్ కోలుకోలేని దెబ్బతీసింది. కుదేలవుతూ... కోలుకుంటూ కాంగ్రెస్ పయనం అధికార టీఆర్ఎస్ రాజకీయ వ్యూహాలకు కుదేలవుతూనే ఈ ఏడాది కాంగ్రెస్ పయనాన్ని కొనసాగించింది. పార్టీ నుంచి గెలిచిన 13 మంది ఎమ్మెల్యేలను చేజార్చుకొని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోవడం ఈ ఏడాది కాంగ్రెస్‌కు ఘోర పరాజయంగా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 3 ఎంపీ సీట్లతోనే సరిపెట్టుకున్న కాంగ్రెస్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 30 శాతం స్థానాల్లో గెలిచినా ఒక్క జడ్పీ పీఠాన్ని కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. ఈ ఏడాది ఆసాంతంలో కాంగ్రెస్‌కు లభించిన పెద్ద ఊరట అంటే ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి గెలుపే. గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఆయన గెలవడమే కాంగ్రెస్‌లో కొంత ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు పార్టీ కురువృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ ఈ ఏడాది మరణించడం పార్టీకి తీరని లోటుగా మారింది. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే వ్యాఖ్యలు చేసినా ఆ తర్వాత సర్దుకొని పార్టీతో కలసి పనిచేస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాటాల విషయానికి వస్తే ఎప్పటిలాగే కాంగ్రెస్ తాబేలు యాత్ర చేసింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో ఎంపీ రేవంత్‌రెడ్డి కొంత హడావుడి చేసినా ఆర్టీసీ సమ్మె, దిశ హత్య లాంటి కీలకాంశాల్లో తగిన రీతిలో స్పందించలేదనే భావన వ్యక్తమైంది. ప్రభుత్వ ఆసుపత్రులు, కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన, అక్కడక్కడా యాత్రలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నేతల్లో ఇంకా సమన్వయ లేమి కనిపిస్తోంది. హుజూర్నగర్ ఉప ఎన్నికలో ఓటమితో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ను మారుస్తారనే ప్రచారం జరిగినా 2019లో అది జరగలేదు. ఈ ఏడాది చివర్లో ఎన్నార్సీ అంశంతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్‌కు 2020లో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారనున్నాయి. పోరాటాలు చేస్తున్నారు కానీ...! గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది తాము ప్రజల్లోకి వెళ్లామని బీజేపీ అంచనా వేసుకుంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం కమలదళంలో కొత్త ఉత్సాహం నింపింది. ఇదే జోష్‌తో రాష్ట్రంలో 11 లక్షలుగా ఉన్న పార్టీ సభ్యత్వాన్ని 30 లక్షలకు పెంచుకుంది. అయితే స్థానిక నేతల మధ్య సమన్వయం, వ్యూహాల అమలులో కొంత వెనుకబడింది. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిరం లాంటి అంశాలు తమకు మేలు చేశాయన్న అంచనాలో ఆ పార్టీ నేతలు ఉన్నా ప్రజల్లోకి వెళ్లడంలో ఈ ఏడాది స్ఫూర్తిదాయక పోరాటం చేసినట్టు కనిపించలేదు. పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఈ ఏడాదిలోనే హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులవగా మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన విద్యాసాగర్‌రావు మళ్లీ పార్టీ కార్యక్రమాల్లోకి వచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఆ తరువాత ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షా సహా 80 మందికిపైగా పార్టీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించడం, టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్ చేరడం, టీ టీడీపీ నేతలు గరికపాటి రామ్మోహన్రావు, పెద్దిరెడ్డి, సురేశ్‌రెడ్డి, వీరేందర్‌గౌడ్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వంటి నేతలను చేర్చుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో కొంత పట్టు సాధించగలిగింది. అయితే ‘స్థానిక’ ఎన్నికల్లో కనీస స్థాయిలోనూ గెలవలేకపోవడంతో రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అంటున్న కమలనాథులకు కొత్త ఏడాది పద్మవ్యూహం లాగానే కనిపిస్తోంది. విస్తరణ బాటలో ఎంఐఎం... ఎంఐఎంకు ఈ ఏడాది అనుకోని అవకాశం లభించింది. టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనం కావడంతో అసెంబ్లీలో ఏడుగురు సభ్యుల బలంతో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ఈ హోదాతోనే ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మరోవైపు ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల గెలవడం ద్వారా ఎంఐఎం ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీని విస్తరించుకుంది. తెలంగాణ జన సమితి, లెఫ్ట్ పార్టీలు తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే ఈ ఏడాది పరిమితమయ్యాయి. ప్రజాసమస్యలపై తమదైన స్థాయిలో ఉద్యమాలు చేస్తూ పార్టీ కార్యకలాపాలను కొనసాగించాయి. అయితే ఈ ఏడాది టీటీడీపీ దాదాపు కనుమరుగు కావడం గమనార్హం. -
గ్రేట్ ఇండియన్ క్రికెట్ సిరీస్
భారత క్రికెట్‌కు 2019 ‘గుడ్’గా సాగి ‘బైబై’ చెప్పింది. ఆటలో మేటి జట్టుగా టీమిండియా దూసుకెళ్లగా... వ్యక్తిగతంగానూ క్రికెటర్లు ఎన్నో మైలురాళ్లను అందుకున్నారు. కొన్ని సిరీస్‌లలో అయితే ఒకరిని మించి ఒకరు దంచేశారు. గాయాల మరకలు, కీలక ఆటగాళ్ల లోటు ఏ సిరీస్‌లోనూ కనబడలేదంటే అతిశయోక్తి కాదు. బ్యాటింగ్ ఇండియాలో బౌలింగ్ గ్రేట్ అయ్యింది ఈ ఏడాదే. కోహ్లి ‘టన్’లకొద్దీ పరుగులు, రోహిత్ ప్రపంచకప్ శతకాలు, కొన్ని మచ్చుతునకలైతే... టెస్టుల్లో మయాంక్, వన్డేల్లో రాహుల్ రెగ్యులర్ ఓపెనర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఎదిగారు. 2019లో కోహ్లి సేన జోరు టెస్టుల్లో అయితే భారత్‌కు ఓటమన్నదే లేదు. రెగ్యులర్ ఓపెనర్ ధావన్ లేని భారత్‌కు మయాంక్ అగర్వాల్ రూపంలో మరో నిలకడైన బ్యాట్స్‌మన్ జతయ్యాడు. పరిమిత ఓవర్ల క్రికెటర్ రోహిత్‌కు ఐదురోజుల ఆట కలిసొచ్చింది కూడా ఈ ఏడాదే. ఆ్రస్టేలియా పర్యటనలోని ఆఖరి టెస్టును డ్రా చేసుకున్న భారత్... ఆ తర్వాత ఆడితే గెలుపు తప్ప మరో ఫలితం ఎరుగదు. విండీస్ దీవుల్లో ఆడిన రెండు టెస్టుల్ని భారీతేడాతో గెలిచింది. అక్టోబర్‌లో ఇక్కడికొచ్చిన దక్షిణాఫ్రికాను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. సఫారీ జట్టుపై రెండు టెస్టులైతే ఇన్నింగ్స్‌తేడాతో గెలుపొందడం విశేషం. ఓపెనర్లుగా మయాంక్, రోహిత్ సెంచరీలు, డబుల్ సెంచరీలతో మెరిశారు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ (2–0)లో భారత్‌కు రెండో ఇన్నింగ్స్ ఆడే అవకాశమే రాలేదు. రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ దెబ్బకు బంగ్లా కునారిల్లింది. వరల్డ్ చాంపియన్íÙప్లో భాగంగా ఆడిన మూడు సిరీస్‌లూ గెలిచి అందుబాటులో ఉన్న 360 పాయింట్లను తమ ఖాతాలో వేసుకుంది. ఇంటా గెలిచి... రచ్చా గెలిచి... ఏడాది ప్రత్యేకించి వన్డేల్లో టీమిండియా గర్జించింది. ఎక్కడికెళ్లినా ఎదురేలేని జట్టుగా తిరిగొచి్చంది. ఇంటా బయటా కలిపి ఐదు ద్వైపాక్షిక సిరీస్‌లాడిన భారత్ నాలుగింటిని వశం చేసుకుంది. ప్రపంచకప్‌లో 10 మ్యాచ్‌ల్లో ఒకటి రద్దయితే ఏడు గెలిచింది. ఓవరాల్‌గా ఏ జట్టుకూ సాధ్యం కానీ 70 శాతం విజయాలు నమోదు చేసింది. మొదట ఆ్రస్టేలియా గడ్డపై కంగారూ పెట్టించి మరీ వన్డే క్రికెట్లో భారత్ విజయ శాసనానికి శ్రీకారం చుట్టింది. అక్కడ మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకొని కొత్త ఏడాదికి గెలుపు రుచిని చూపించింది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ధోని ఆట అదరహో! తొలుత ఓడిన మ్యాచ్ సహా... వరుస వన్డేల్లో మిస్టర్‌కూల్ (51, 55 నాటౌట్, 87 నాటౌట్) అర్ధసెంచరీలతో అదరగొట్టాడు. ఆ వెంటే న్యూజిలాండ్‌కెళ్లి చితగ్గొట్టింది. ఐదు వన్డేల్లో ఒకే ఒక్క మ్యాన్ మినహా ప్రతి పోరులో పరాక్రమం చూపింది. 4–1తో కివీరెక్కలు విరిచింది. ఈ సిరీస్‌లో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు చూపించిన తెగువ క్రికెట్ విశ్లేషకుల్ని ఆకర్షించింది. ముఖ్యంగా ఆఖరి వన్డేలో రోహిత్, ధావన్, ధోనిలాంటి హేమాహేమీలు సైతం విలవిలలాడిన చోట మన రాయుడు (113 బంతుల్లో 90; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగాడు. 18 పరుగులకే 4 వికెట్లను కోల్పోయిన భారత్‌కు పెద్దదిక్కయ్యాడు. మొత్తానికి విజయగర్వంతో ఉన్న కోహ్లి సేనకు సొంతగడ్డపై ఆసీస్ చేతిలో అనూహ్య పరాజయం ఎదురైంది. ఈ యేడు భారత్ కోల్పోయిన సిరీస్ (2–3తో) ఇదొక్కటే! అనంతరం వరల్డ్‌కప్ ముగిశాక కరీబియన్ దీవులకెళ్లి మళ్లీ జయకేతనం ఎగరేసింది. అక్కడ 3వన్డేల సిరీస్‌లో తొలి వన్డే రద్దవగా తర్వాత రెండు వన్డేల్ని సునాయాసంగా గెలుచుకుంది. మళ్లీ ఇటీవల ఇక్కడికొచ్చాక కూడా వెస్టిండీస్‌ను విడిచిపెట్టలేదు. భారీస్కోర్లు చేసిమరీ 2–1తో నెగ్గింది. అయితే విండీస్ ఓడినా ఆకట్టుకుంది. ఈ క్యాలెండర్‌ను కోహ్లి రోహిత్‌లు అసాధారణ ఫామ్‌తో ముగించారు. రోహిత్ 28 మ్యాచ్‌ల్లో 57.30 సగటుతో 1490 పరుగులు చేశాడు. 7 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు బాదాడు. 26 వన్డేలాడిన కెపె్టన్ 59.86 సగటుతో 1377 పరుగులు చేశాడు. 5 సెంచరీలు, 7 ఫిఫ్టీలు కొట్టాడు. మెరుపుల్లో వెనుకబడింది పొట్టి ఫార్మాట్లో మాత్రం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. న్యూజిలాండ్ పర్యటనలో ఆతిథ్య జట్టు చేతిలో 2–1తో ఓడిన టీమిండియా... స్వదేశంలో ఆసీస్ చేతిలో 2–0తో కంగుతింది. గట్టి జట్లపై మన మెరుపులు మెరవలేదు. అయితే విండీస్ పర్యటనలో భాగంగా అమెరికాలో జరిగిన మ్యాచ్‌ల్లో మాత్రం కోహ్లి సేన చెలరేగింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. సొంతగడ్డపై సఫారీతో జరిగిన మూడు మ్యాచ్‌ల పొట్టి ఆటను 1–1తో సమం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ రద్దయింది. తర్వాత బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లతో సిరీస్‌లను 2–1తో గెలిచినప్పటికీ ఒక్కో మ్యాచ్‌లో ఎదురుదెబ్బలు తిన్నది. సెమీస్‌లో చెదిరిన ‘ప్రపంచ’కల కోహ్లిసేన ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగింది. విదేశీ దిగ్గజాలు, వ్యాఖ్యాతలు సైతం కప్ భారత్‌దే అని జోస్యం చెప్పారు. అయితే భారత్ కూడా ఫేవరెట్ హోదాకు సెమీస్ దాకా న్యాయం చేసింది. 9 లీగ్ మ్యాచ్‌లకు గాను ఒక్క ఆతిథ్య జట్టు చేతిలోనే ఓడింది. ఒక వన్డే రద్దయింది. ఆసీస్, దక్షిణాఫ్రికాలాంటి మేటి జట్లను అవలీలగా మట్టికరిపించి... లీగ్ టాపర్‌గా నాకౌట్ బరిలో దిగిన టీమిండియాకు ఊహించని విధంగా న్యూజిలాండ్ చేతిలో చుక్కెదురైంది. ఈ టోరీ్నలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఐదు శతకాలతో రికార్డులకెక్కాడు. -
ఉన్నత శిఖరాలు.. సాటిలేని సామర్థ్యాలు
శిఖరానికి కిరీటం పెడితే ఎలా ఉంటుంది? అత్యున్నతమైన పదవిలో ఒక మహిళ కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది! వీళ్లెవరూ పదవుల కోసం ప్రయత్నించలేదు. పదవులే వీళ్ల కోసం ప్రయత్నించాయి. పనిలో సామర్థ్యం.. అంకితభావం.. నిబద్ధత ఉంటే.. ‘మీరే మమ్మల్ని లీడ్ చెయ్యాలి మేడమ్’ అని గొప్ప గొప్ప సంస్థలే అప్లికేషన్ పెట్టుకుంటాయి. అలా ఈ ఏడాది ‘లీడింగ్’లోకి వచ్చిన మహిళలు వీరు. 1. గీతా గోపీనాథ్, ఐఎంఎఫ్ చీఫ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ ఎకనమిస్టుగా ప్రముఖ ప్రవాస భారతీయ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ జనవరిలో బాధ్యతలు స్వీకరించారు. ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్టుగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. 2. సుమన్ కుమారి, పాకిస్తాన్లో సివిల్ జడ్జి పాకిస్తాన్ సివిల్ న్యాయమూర్తిగా సుమన్ కుమారి జనవరిలో నియమితులయ్యారు. ఖంబర్–షాదద్కోట్ జిల్లాకు చెందిన కుమారి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఒక హిందూ మహిళ పాకిస్తాన్లో జడ్జి కావడం ఇదే మొదటిసారి. 3. ఇంద్రా నూయి, అమెజాన్ డైరెక్టర్ అమెజాన్ కంపెనీ డైరెక్టర్‌గా భారత సంతతి మహిళా ఇంద్రానూయి ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించారు. అమెజాన్‌లో డైరెక్టర్ అయిన రెండో మహిళగా ఇంద్రా నూయి గుర్తింపు పొందారు. ఆమెకన్నా ముందు 2019 ఫిబ్రవరి మొదటివారంలో స్టార్‌బక్స్ ఎగ్జిక్యూటివ్ రోసలిండ్ బ్రెవర్ అమెజాన్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. 4.జీసీ అనుపమ, ఏఎస్ఐ తొలి మహిళా ప్రెసిడెంట్ ఆస్టన్రామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తొలి మహిళా ప్రెసిడెంట్‌గా డాక్టర్ జీసీ అనుపమ ఎన్నికయ్యారు. అనుపమ సూపర్‌నోవాపై పరిశోధనలు చేశారు. 5. నీలా విఖేపాటిల్, స్వీడన్ ప్రధాని సలహాదారు స్వీడన్ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో రాజకీయ సలహాదారురాలిగా భారత సంతతికి చెందిన మహిళ, మహారాష్ట్రకు చెందిన ప్రముఖ విద్యావేత్త అశోక్ విఖే పాటిల్ కుమార్తె నీలా విఖేపాటిల్ నియమితులయ్యారు. స్వీడన్లో జన్మించిన నీలా గుజరాత్‌లోని అహ్మద్‌నగర్‌లో తన బాల్యాన్ని గడిపారు. 6. నియోమీ జహంగీర్ రావు, యూఎస్‌లో డీసీ కోర్టు జడ్జి అమెరికాలోని ప్రఖ్యాత డిస్టిక్ర్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ కోర్టు (డీసీ కోర్టు) జడ్జిగా ప్రముఖ భారతీయ అమెరికన్ న్యాయవాది నియోమీ జహంగీర్రావు ఎన్నికయ్యారు. 7. పద్మాలక్ష్మి , యూఎన్డీపీ అంబాసిడర్ ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) నూతన గుడ్‌విల్ అంబాసిడర్‌గా టెలివిజన్ రంగానికి చెందిన భారత సంతతి అమెరికన్, ప్రముఖ ఆహార నిపుణురాలైన పద్మాలక్ష్మి మార్చిలో నియమితులయ్యారు. 8. దియామీర్జా, ఐరాస ఎస్డీజీ ప్రచారకర్త ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) ప్రచారకర్తగా బాలీవుడ్ నటి దియామీర్జా ఎంపికయ్యారు. పేదరికాన్ని రూపుమాపడం; అందరికీ ఆరోగ్యసంరక్షణ తదితర లక్ష్యాల సాధనకు కృషి చేస్తుంది. 9. అనితా భాటియా, యూఎన్–ఉమెన్ డిప్యూటీ డెరైక్టర్ మహిళా సాధికారత, స్త్రీ–పురుష సమానత్వంపై కృషి చేసే ఐక్యరాజ్యసమితి సంస్థ యూఎన్–ఉమెన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా భారత సంతతికి చెందిన మహిళ అనితా భాటియా మేలో నియమితులయ్యారు. కలకత్తా లో బీఏ చదివిన అనిత వనరుల సమీకరణ, నిర్వహణలో నిష్ణాతురాలు. 10. ప్రమీల జయపాల్, అమెరికా తాత్కాలిక స్పీకర్ అమెరికా ప్రతినిధుల సభ తాత్కాలిక స్పీకర్‌గా ప్రమీల జయపాల్ జూన్‌లో సభా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పదవిని చేపట్టిన తొలి దక్షిణాసియా అమెరికన్ మహిళగా ప్రమీల నిలిచారు. 11. షలీజా ధామీ, తొలి మహిళా ఫ్లయిట్ కమాండర్ వింగ్ కమాండర్ షలీజా ధామీ భారత వాయుసేనలో తొలి మహిళా కమాండర్‌గా నిలిచారు. హెలికాప్టర్లను నడపడంలో ధామీకి 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. 12. అంజలీ సింగ్, తొలి మహిళా సైనిక దౌత్యాధికారి విదేశాల్లో భారత సైనిక దౌత్యాధికారిగా నియమితులైన తొలి మహిళగా వింగ్ కమాండర్ అంజలి సింగ్ రికార్డు నెలకొల్పారు. రష్యాలోని మాస్కోలో భారత రాయబార కార్యాలయంలో ‘డిప్యూటీ ఎయిర్ అటాచీ’గా అంజలి సెప్టెంబరులో బాధ్యతలు స్వీకరించారు. -
కొత్త శిఖరాలకు...
ఒకప్పుడు ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనడమే ఘనతగా భావించే భారత క్రీడాకారులు ఇప్పుడు ఏకంగా పతకాలు కొల్లగొడుతున్నారు. క్రీడల్లో అగ్రరాజ్యాల ఆటగాళ్లకు దీటుగా తమ ప్రదర్శన ఇస్తున్నారు. ఆశల పల్లకీని మోస్తూ అసలు సమరంలోనూ ఔరా అనిపిస్తున్నారు. విశ్వ వేదికపై భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది భారత క్రీడారంగం కొత్త శిఖరాలకు చేరింది. బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజం పీవీ సింధు విశ్వవిజేతగా అవతరించి గతంలో ఏ భారత షట్లర్కూ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుంది. బాక్సింగ్‌లో అమిత్ పంఘాల్, మనీశ్ కౌశిక్ రజత, కాంస్య పతకాలు గెలిచి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఒకేసారి భారత్‌కు రెండు పతకాలు అందించారు. షట్లర్లు, బాక్సర్లకు తోడుగా షూటర్లు, రెజ్లర్లు, ఆర్చర్లు కూడా అత్యున్నత వేదికపై అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఈ సంవత్సరం అదరగొట్టిన భారత క్రీడాకారులు వచ్చే ఏడాది విశ్వ క్రీడా సంరంభం టోక్యో లింపిక్స్లోనూ తమ అది్వతీయ విజయ విన్యాసాలను పునరావృతం చేయాలని ఆకాంక్షిద్దాం... ఆశీర్వదిద్దాం..! సాక్షి క్రీడావిభాగం విజయాల బాటలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ... తమకంటే మెరుగైన ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ... ఈ ఏడాది భారత క్రీడాకారుల ప్రస్థానం సాగింది. ఈ క్రమంలో మనోళ్లు కొత్త రికార్డులు సృష్టించారు. భవిష్యత్‌పై కొత్త ఆశలు రేకెత్తించారు. మెరుపుల్లేని టెన్నిస్ రాకెట్... ఈ సంవత్సరం భారత టెన్నిస్‌కు గొప్ప ఫలితాలేవీ రాలేదు. పురుషుల సింగిల్స్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించినా... ఒక్క దాంట్లోనూ తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. యూఎస్ ఓపెన్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌తో భారత యువతార సుమీత్ నాగల్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్ ఆడాడు. ఫెడరర్‌పై తొలి సెట్ గెలిచిన సుమీత్ ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు కోల్పోయి ఓడిపోయాడు. డబుల్స్‌లో దివిజ్ శరణ్ రెండు ఏటీపీ టోర్నీ టైటిల్స్ (పుణే ఓపెన్, సెయిట్ పీటర్స్బర్గ్ ఓపెన్) సాధించగా... రోహన్ బోపన్న (పుణే ఓపెన్) ఒక టైటిల్ గెలిచాడు. భారత దిగ్గజం, 46 ఏళ్ల లియాండర్ పేస్ 19 ఏళ్ల తర్వాత ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్–100 నుంచి బయటకు వచ్చాడు. తటస్థ వేదిక కజకిస్తాన్‌లో పాకిస్తాన్‌తో జరిగిన డేవిస్ కప్ ఆసియా ఓసియానియా మ్యాచ్‌లో భారత్ 4–0తో గెలిచి వచ్చే ఏడాది వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత సాధించింది. ‘పట్టు’ పెరిగింది... ఈ ఏడాది రెజ్లింగ్‌లో భారత్‌కు మంచి ఫలితాలు లభించాయి. కజకిస్తాన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు ఏకంగా ఐదు పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో బజరంగ్ పూనియా (65 కేజీలు), రవి దహియా (57 కేజీలు), రాహుల్ అవారే (61 కేజీలు) కాంస్యాలు గెలుపొందగా... దీపక్ పూనియా (86 కేజీలు) రజతం సాధించాడు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో వినేశ్ ఫొగాట్ (53 కేజీలు) కాంస్య పతకం దక్కించుకుంది. ప్రపంచ జూనియర్ చాంపియన్íÙప్లో దీపక్ పూనియా (86 కేజీలు) స్వర్ణం నెగ్గి 18 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్‌లోని ఓ విభాగంలో భారత్‌కు పసిడి పతకం అందించిన రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. ఈ సంవత్సరం ఉత్తమ ప్రపంచ జూనియర్ రెజ్లర్‌గా కూడా దీపక్ పూనియా ఎంపిక కావడం విశేషం. సస్పెన్షన్ ఉన్నా... భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) అంతర్గత రాజకీయాల కారణంగా ప్రపంచ ఆర్చరీ సంఘం భారత్‌పై సస్పెన్షన్ విధించింది. దాంతో భారత ఆర్చర్లు భారత పతాకం కింద కాకుండా ప్రపంచ ఆర్చరీ సంఘం పతాకంపై పోటీ పడాల్సి వచి్చంది. జూన్‌లో నెదర్లాండ్స్‌లో జరిగిన ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రాయ్ బృందం రికర్వ్ టీమ్ విభాగంలో రజతం నెగ్గడంతోపాటు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇదే ఈవెంట్ కాంపౌండ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించింది. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా చాంపియన్íÙప్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ జంట కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణం సొంతం చేసుకుంది. ఇదే ఈవెంట్లో దీపిక కుమారి మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను సంపాదించింది. జగజ్జేత... గత పదేళ్లుగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో తమదైన ముద్ర వేస్తున్న భారత షట్లర్లు ఈసారి అద్భుతమే చేశారు. పూసర్ల వెంకట (పీవీ) సింధు రూపంలో భారత బ్యాడ్మింటన్‌కు తొలిసారి ప్రపంచ చాంపియన్ లభించింది. ఆగస్టులో స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధు మహిళల సింగిల్స్ విభాగంలో విశ్వవిజేతగా నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ఇక పురుషుల సింగిల్స్‌లో మరో తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ప్రకాశ్ పదుకొనే (1983లో) తర్వాత ప్రపంచ చాంపియన్íÙప్ పురుషుల సింగిల్స్‌లో కాంస్యం గెలిచిన భారత క్రీడాకారుడిగా సాయిప్రణీత్ ఘనత వహించాడు. వీరిద్దరి ప్రతిభ కారణంగా 42 ఏళ్ల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు తొలిసారి మహిళల, పురుషుల సింగిల్స్ విభాగాల్లో పతకాలు లభించాయి. ప్రపంచ చాంపియన్íÙప్లో ప్రదర్శనను మినహాయిస్తే వరల్డ్ టూర్ సూపర్ టోర్నమెంట్లలో ఈసారి భారత అగ్రశ్రేణి క్రీడాకారులెవరూ ఆకట్టుకోలేకపోయారు. పురుషుల డబుల్స్ విభాగంలో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట థాయ్‌లాండ్ ఓపెన్‌లో టైటిల్ సాధించి మేటి జోడీకి ఉండాల్సిన లక్షణాలు తమలో ఉన్నాయని చాటిచెప్పింది. సీజన్ చివర్లో యువతార లక్ష్య సేన్ ఐదు సింగిల్స్ టైటిల్స్ సాధించి ఊరటనిచ్చాడు. ఏడాది ఆరంభంలో జరిగిన ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో బెంగళూరు రాప్టర్స్ జట్టు టైటిల్ దక్కించుకుంది. ఫైనల్లో బెంగళూరు 4–3తో ముంబై రాకెట్స్‌పై గెలిచింది. మరింత ‘ఎత్తు’కు... భారత చెస్‌కు ఈ ఏడాది కలిసొచ్చింది. ఈ సంవత్సరం ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా పొందారు. ఈ జాబితాలో విశాఖ్ (తమిళనాడు), గుకేశ్ (తమిళనాడు), ఇనియన్ (తమిళనాడు), స్వయమ్స్ మిశ్రా (ఒడిశా), గిరిశ్ కౌశిక్ (కర్ణాటక), ప్రీతూ గుప్తా (ఢిల్లీ) ఉన్నారు. 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయస్సులో డి.గుకేశ్ గ్రాండ్‌మాస్టర్ హోదా పొంది భారత్ తరఫున ఈ ఘనత సాధించిన పిన్న వయసు్కడిగా... ప్రపంచంలో రెండో పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. 2002లో సెర్గీ కర్యాకిన్ (రష్యా) 12 ఏళ్ల 10 నెలల వయస్సులో జీఎం హోదా సాధించాడు. ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి టూర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి రష్యా గ్రాండ్‌ప్రిలో టైటిల్ సాధించి... మొనాకో గ్రాండ్‌ప్రిలో రన్నరప్‌గా నిలిచింది. ‘పంచ్’ అదిరింది... బాక్సింగ్‌లోనూ ఈ సంవత్సరం భారత క్రీడాకారులు అదరగొట్టారు. రష్యాలో జరిగిన పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్íÙప్లో అమిత్ పంఘాల్ (52 కేజీలు) రజతం సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బాక్సర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. మనీశ్ కౌశిక్ (63 కేజీలు) కాంస్యం గెలవడంతో ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్‌కు తొలిసారి ఒకేసారి రెండు పతకాలు లభించాయి. సీనియర్ మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగు పతకాలు దక్కాయి. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు)తోపాటు జమునా బోరో (54 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు) కాంస్యాలు సాధించగా... మంజు రాణి (48 కేజీలు) రజత పతకం గెల్చుకుంది. సూపర్ ‘గురి’... షూటింగ్లో మనోళ్లు గురి చూసి పతకాల పంట పండించారు. ఫిబ్రవరిలో న్యూఢిల్లీ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అపూర్వీ చండేలా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో... సౌరభ్ చౌధరీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ప్రపంచ రికార్డులు సృష్టించి పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో సౌరభ్–మను భాకర్ జోడీ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఏప్రిల్‌లో చైనాలో జరిగిన రెండో ప్రపంచకప్ టోర్నీలోనూ భారత షూటర్లు మెరిశారు. మూడు స్వర్ణాలు, ఒక రజతం సాధించి ‘టాప్’ ర్యాంక్‌ను సంపాదించారు. ఆసియా చాంపియన్íÙప్లోనూ భారత షూటర్లు అదుర్స్ అనిపించారు. ఓవరాల్‌గా ఈసారి భారత్ నుంచి అత్యధికంగా 15 మంది షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. చలాకీ... హాకీ సొంతగడ్డపై జరిగిన టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో తమ ప్రత్యర్థులను ఓడించిన భారత పురుషుల, మహిళల జట్లు ఒలింపిక్ బెర్త్‌లను సంపాదించాయి. క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో రష్యాపై భారత పురుషుల జట్టు... అమెరికాపై భారత మహిళల జట్టు గెలుపొందాయి. అంతకుముందు సీజన్ ఆరంభంలో భారత పురుషుల జట్టు అజ్లాన్ షా హాకీ టోరీ్నలో రన్నరప్‌గా నిలిచింది. అదే మందగమనం... ‘ఆసియా’ స్థాయి మినహాయిస్తే అంతర్జాతీయంగా భారత అథ్లెట్స్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు తెచ్చే సత్తా ఉన్న అథ్లెట్స్‌గా నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో), హిమ దాస్ (మహిళల 400 మీటర్లు)లపై భారీ ఆశలు పెట్టుకున్నా వారిద్దరూ గాయాల బారిన పడ్డారు. సెపె్టంబర్లో దోహాలో జరిగిన ప్రపంచ చాంపియన్íÙప్‌కు దూరమయ్యారు. ఇటలీలో జూలైలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో ద్యుతీ చంద్ మహిళల 100 మీటర్ల విభాగంలో స్వర్ణం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. అయితే ప్రపంచ చాంపియన్íÙప్లో ద్యుతీ చంద్ విఫలమైంది. ఆమె హీట్స్ దాటి ముందుకెళ్లలేకపోయింది. ఇప్పటివరకు టోక్యో ఒలింపిక్స్ అర్హత సమయాన్ని (11.15 సెకన్లు) ఆమె అందుకోలేకపోయింది. దీటుగా... టీటీ... టేబుల్ టెన్నిస్‌లో భారత స్టార్ సత్యన్ జ్ఞానశేఖరన్ అద్భుత పురోగతి సాధించాడు. ఈ ఏడాది అతను ప్రపంచ టాప్–20 ర్యాంకింగ్స్‌లోని పలువురు ఆటగాళ్లను ఓడించాడు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ 24వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్ తరఫున పురుషుల సింగిల్స్ ఆటగాడు ఐటీటీఎఫ్ టాప్–25 ర్యాంకింగ్స్‌లో రావడం ఇదే ప్రథమం. సత్యన్, శరత్ కమల్, హర్మీత్ దేశాయ్‌లతో కూడిన భారత జట్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా ఎనిమిదో ర్యాంక్‌కు చేరుకుంది. -
ప్రతిభా మూర్తులు పోరాట యోధులు
అవార్డు గుర్తింపును తెస్తుంది. అవార్డుకే గుర్తింపు తెచ్చారు ఈ మహిళలు. దాదాపు ప్రతి రంగంలోనూ.. ఈ ఏడాది నారీ శక్తి ప్రతిఫలించింది. పోరాట పటిమ ప్రస్ఫుటించింది. వీళ్ల స్ఫూర్తి కదిలిస్తుంది. ముందు తరాలనూ నడిపిస్తుంది. 1. దీపికారెడ్డి, నృత్యకారిణి ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డికి ప్రతిష్టాత్మకమైన సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. రాష్ట్రపతి భవన్లో ఫిబ్రవరి 6న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి ఆమె ఈ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన దీపికారెడ్డి గత 47 సంవత్సరాలుగా కూచిపూడి నాట్య రంగంలో సేవలను అందిస్తున్నారు. ‘దీపాంజలి’ పేరుతో నృత్య పాఠశాలను కూడా ప్రారంభించారు. 2. ప్రియాంక దూబే, పాత్రికేయురాలు బీబీసీ ఢిల్లీ బ్యూరో ద్విభాషా వ్యాఖ్యాత, ప్రముఖ పాత్రికేయురాలు ప్రియాంక దూబే ప్రతిష్టాత్మక చమేలీదేవి జైన్ అవార్డు–2018కు ఎంపికయ్యారు. పరిశోధనాత్మక జర్నలిజంలో ఉత్తమప్రతిభ కనబరిచినందుకుగాను ప్రియాంకకు ఈ అవార్డు దక్కింది. 3. రాధా దేవి, మున్నుస్వామి శాంతి టీటీడీ మహిళా క్షురకుల సంఘం అధ్యక్షురాలు కగ్గనపల్లి రాధాదేవి, ఇస్రో మహిళా శాస్త్రవేత్త మున్నుస్వామి శాంతిలకు ‘నారీశక్తి పురస్కారం’ లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8న ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీరికి ఈ అవార్డులను ప్రదానం చేశారు. మహిళా సాధికారతకు, లింగ సమానత్వానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా వీరికి ఈ అవార్డు దక్కింది. 4. జోఖా అల్హార్తి, రచయిత్రి ఒమన్ రచయిత్రి జోఖా అల్హార్తి (40) మాన్ బుకర్ ప్రైజ్–2019 గెలుపొందారు. ఆమె రాసిన ‘సెలస్టియల్ బాడీ’ నవలకు ఈ ప్రైజ్ దక్కింది. ఈ అవార్డును గెలుచుకున్న తొలి అరబ్ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. బ్రిటన్ నుంచి 1951లో స్వాతంత్య్రం పొందాక ఒమన్‌లో చోటుచేసుకున్న మార్పులను, బానిసత్వ పరిస్థితులను ఈ నవలలో అల్హార్తి వర్ణించారు. 5. గ్రెటా థన్‌బర్గ్, ఉద్యమకారిణి స్వీడన్‌కు చెందిన టీనేజ్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌కు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మక మానవ హక్కుల పురస్కారం ‘అంబాసిడర్ ఆఫ్ కన్సైన్స్’ లభించింది. అలాగే ఆమె ‘రైట్ టు లైవ్లీహుడ్’ అవార్డుకు ఎంపికైంది. నోబెల్ శాంతి బహుమతికి కూడా నామినేట్ అయింది. 6. పి.టి. ఉష, అథ్లెట్ భారత మాజీ అథ్లెట్, దిగ్గజ ఒలింపియన్ పి.టి. ఉష అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) ప్రతిష్టాత్మక ‘వెటరన్ పిన్’ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో సుదీర్ఘ కాలం పాటు చేసే సేవలకు గుర్తింపుగా ఐఏఏఎఫ్ వెటరన్ పిన్ అవార్డును అందజేస్తారు. పి.టి. ఉష పూర్తి పేరు పిలావుళ్లకండి తెక్కేపఱంబిల్ ఉష. 7. అస్కా సలోమీ, ప్రిన్సిపాల్ ప్రభుత్వ వైద్యంలో నర్సింగ్ వృత్తిలో విశేష సేవలందించినందుకు అస్కా సలోమీకి ‘జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ అవార్డు–2019’ లభించింది. అస్కా సలోమీ 2009లో గాంధీ నర్సింగ్ కళాశాల నుంచి ప్రధానాచార్యులుగా పదవీ విరమణ పొందారు. 8. పాయల్ జంగిడ్, సామాజిక కార్యకర్త బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేసిన పాయల్ జంగిడ్‌కి బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఇచ్చే ‘ఛేంజ్మేకర్–2019’ అవార్డు లభించింది. రాజస్థాన్‌లోని హిన్‌స్లా గ్రామానికి చెందిన 17 ఏళ్ల పాయల్.. బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు, ఆడపిల్లలు చదువుకునేందుకు కృషి చేస్తోంది. 9. ఓల్గా, పర్యావరణవేత్త సాహితీ రంగంలో విశేషంగా చేసిన ప్రముఖ పర్యావరణ వేత్త, స్త్రీవాది, మేధావి, నవలా రచయిత్రి ఓల్గా టోర్కార్క్విజ్కు (పోలెండ్) నోబెల్ బహుమతి లభించింది. ఆమె రాసిన ‘ద బుక్స్ ఆఫ్ జాకోబ్‘ అనే నవలకు గానూ 2018 సంవత్సరానికి ఈ బహుమతి లభించింది. (గత ఏడాది అవార్డును ఈ ఏడాది ప్రకటించారు) -
మందగమనమా? 5 ట్రిలియన్ డాలర్లా?
దేశీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో వుందనేది దాచేస్తే దాగని సత్యం. జీడీపీ వృద్దిరేటు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కూడా అంచనా వేయలేనంతగా దిగజారి పోయింది. మరోవైపు తాజాగా అసోచామ్ వందేళ్ల ఉత్సవాల్లో 5 ట్రిలియన్ల డాలర్ల ఎకానమీ సాధన దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందనీ, ఈ లక్ష్యం ఎంతో దూరంలో లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా వుందని పలువురి అంచనా. దేశీయ ఆర్థిక వ్యవస్థ "తీవ్ర మందగమనాన్ని" ఎదుర్కొంటుందని, అతిపెద్ద సంక్షోభం ఎదుర్కోక తప్పదని రేటింగ్ సంస్థలతోపాటు పలువురు ఆర్థిక నిపుణులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత ఆర్థికవ్యవస్థ ఐసీయూలో ఉందని, తక్షణమే గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థికశాఖ మాజీ ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఇటీవల వ్యాఖ్యానించారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒక ముఖ్య శక్తిగా ఎదిగిన భారతదేశ ఆర్థికచిత్ర పటం క్రమేపీ మసకబారుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది తీవ్రమైన వృద్ధి తిరోగమనం అంతర్జాతీయ ద్రవ్య నిధిని కూడా ఆశ్చర్యపరిచింది. వినిమయ డిమాండ్ క్షీణత, ప్రైవేటు పెట్టుబడులు లేకపోవడం, దీర్ఘకాలిక సంస్కరణలు లోపించడం ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రతికూలతలుగా అభివర్ణించింది. టైమ్స్ నెట్వర్క్ నిర్వహించిన ఇండియా ఎకనామిక్ కాన్క్లేవ్లో ఐఎమ్ఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ మాట్లాడుతూ, గణనీయమైన తిరోగమన సంకేతాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. (2019 లో భారతదేశానికి 6.1 శాతం వృద్ధి నమోదవుతుందని ఐఎంఎఫ్ అంచనావేసింది) ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2019-20 వృద్ధి అంచనాను అంతకుముందు 6.1 శాతం నుండి ఐదు శాతానికి సవరించడం గమనార్హం. రేటింగ్ ఏజెన్సీ మూడీస్ వృద్ధి అంచనాను 4.9 శాతానికి తగ్గించింది. జపనీస్ బ్రోకరేజ్ సంస్థ నోమురా కూడా ఇదే అంచనాలను వెల్లడించింది. ఐఎంఎఫ్ సవరించిన అంచనాల ప్రకారం ఈ ఏడాది మొత్తం వృద్ధి 5శాతం దిగువకు వెళితే, భవిష్యత్తు మరింత నిరాశాజనకమేనని ఆర్థిక విశ్లేషకులు పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి వేగం మందగించిన నేపథ్యంలో 2019 మొదటి త్రైమాసికంలోనే జీడీపీ 5 శాతంనమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 8 శాతం. ఈ నెగిటివ్ సంకేతాలు రెండవ త్రైమాసికంలో కొనసాగి జీడీపీ 4.5 శాతానికి పడిపోయింది. ఇది గత 25 త్రైమాసికాల కంటే అత్యంత నెమ్మదిగా ఉన్న త్రైమాసిక వృద్ధి. మూడవ త్రైమాసికంలో జీడీపీ దూసుకెళ్తుందని ప్రభుత్వం భరోసా ఇచ్చినప్పటికీ 4.3 శాతానికి పరిమితమవుతుందని అంచనా. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో చూస్తే ఈ వృద్ధిరేటు 5.8 శాతంగా ఉంది. ఉత్పాదక రేటు మందగించింది. ఉపాధి పరిస్థితులు వినియోగదారుల డిమాండ్ దారుణంగా క్షీణించింది. జనవరి-మార్చి 2019 త్రైమాసికంలో భారతదేశంలో పట్టణ నిరుద్యోగిత రేటు నాలుగు త్రైమాసికాలలో 9.3 శాతం కనిష్ట స్థాయికి పడిపోయిందని ఇటీవల జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) సర్వేలో తేలింది. అక్టోబరులో ఫ్యాక్టరీ ఉత్పత్తి వరుసగా మూడవ త్రైమాసికంలో 3.8 శాతం వద్ద బలహీనంగా ఉంది. ఆర్థిక మందగమనానికి కారణం ఏమిటి? ప్రస్తుత తిరోగమనానికి దీర్ఘకాలిక, స్వల్పకాలిక కారణాలు రెండూ ఉన్నాయి. అంతకుముందు కూడా ఆర్థిక మాంద్య పరిస్థితులున్నప్పటికీ ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ చేపట్టిన సంస్కరణలు, అమెరికా-చైనా మధ్య ఎడతెగని ట్రేడ్‌వార్ (అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు) కూడా ఆర్థికవ్యవస్థను దెబ్బ తీసాయి. ప్రధానంగా 2016లో మోదీ సర్కార్ చేపట్టిన అతిపెద్ద సంస్కరణ నోట్ల రద్దు మరింత ఆజ్యం పోసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ తొందరపాటు చర్య ఆర్థిక వ్యవస్థ మందగమన వేగం పెంచింది. చలామణిలో ఉన్న అధిక విలువ కలిగిన నోట్ల (రూ. 500, రూ.1000) రద్దు నగదు సరఫరాను విచ్ఛిన్నం చేసింది. క్షీణించిన నగదు చలామణి ప్రజల వినిమయ శక్తిని దెబ్బ తీసింది. ఇక ఆ తరువాత ఒకే దేశం ఒకే పన్ను అంటూ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తో మరిన్ని కష్టాలొచ్చాయి. అనేక చిన్న చితకా వ్యాపారాలు మూతపడ్డాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో దేశం పైకి ఎగబాకినప్పటికీ ప్రైవేటు పెట్టుబడుల ప్రవాహం ఆశించినంతగా లేదు. దీనికి తోడు ప్రభుత్వం చేపట్టిన నష్ట నివారణ చర్యలేవీ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వలేదు. ఆర్థికవ్యవస్థను తిరిగి వృద్ధి మార్గంలోకి తీసుకెళ్లడానికి, ముఖ్యంగా వినిమయ డిమాండ్‌ను పునరుద్ధరించడానికి, భూమి, కార్మిక రంగాల్లో నూతన సంస్కరణలకోసం సమగ్రమైన రోడ్‌మ్యాప్ రూపకల్పనలో మోదీ ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ప్రతిపక్షాలతో పాటు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులంటున్నమాట. మూడవ త్రైమాసిక ఆర్థిక గణాంకాలు ఈ వారం రానున్నాయి. ఆటోరంగ సంక్షోభం, యువకులు, ఓలా, ఉబెర్ అటు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఆటో, రియల్టీ, టెలికాం, బ్యాంకింగ్ రంగాలు తీవ్ర సంక్షోభాన్నిఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఆటో మొబైల్ పరిశ్రమ గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస త్రైమాసికాల్లో సంక్షోభంలోకి కూరుకుపోయింది. వాహనాలు అమ్మకాలు క్షీణించి, ఉత్పత్తిని నిలిపివేసాయి. మారుతి సుజుకి, అశోక్ లేలాంటి సంస్థలు ప్లాంట్లను కొంతకాలంగా మూసివేసిన పరిస్థితులు. అంతేకాదు వేలాది కార్మికులు ఉపాధి కోల్పోయారు. దీనికి తోడు ఆటో పరిశ్రమకు అనుబంధంగా ఉండే విడిభాగాల కంపెనీల సంక్షోభం కూడా తక్కువేమీ కాదు. లక్షలాది ఉద్యోగులకు ఉద్వాసన పలకక తప్పని స్థితికి చేరాయి. ఆటో మందగమనానికి ఓలా, ఉబెర్ లాంటి క్యాబ్ సర్వీసులు కారణమంటూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కొత్త భాష్యం సోషల్ మీడియాలో దుమారం రేపింది. కొత్త కార్లపై యువత ఆసక్తి చూపడం లేదనీ, ఈఎంఐల భారం భరించడానికి ఇష్టపడడం లేదని ఇది కూడా కార్ల అమ్మకాల పతనానికి కారణమన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తద్వారా జీఎస్టీ పన్ను భారం తగ్గించాలన్న ఆటోమొబైల్ పరిశ్రమ డిమాండ్ తోసిపుచ్చారు. ఆటో ఒడిదుడుకులకు కారణం పన్నులు భారం కానే కాదని తేల్చిపారేశారు.అయితే తాజాగాజీఎస్టీ తగ్గించే యోచనలో ఉన్నామన్న సంకేతాలిచ్చినప్పటికీ మొత్తానికి మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉన్న ఆటోమొబైల్ రంగాన్ని కేంద్రం ఎలా ఆదుకుంటుందో చూడాలి. మరోవైపు 2020 ఏప్రిల్ నుంచి కొత్త ఉద్గార నిబంధనలు అమలుకానున్నాయి. జెట్ ఎయిర్వేస్ మూత అప్పుల ఊబిలో చిక్కుకున్న ప్రైవేటు రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ మూతకు 2019 ఏడాది మౌన సాక్ష్యంగా నిలిచింది. దేశీయ విమానయాన రంగంలో విశిష్ట సేవలందించిన జెట్ ఎయిర్వేస్ విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఈ ఏడాది ఏప్రిల్‌మాసంలో ప్రకటించింది. మరోవైపు విమానయాన రంగానికే మణిమకుటం ప్రభుత్వరంగ సంస్థ ఎయిరిండియా ప్రైవేటీకరణకు కేంద్రప్రభుత్వం చేస్తున్న కసరత్తు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఎయిరిండియా విక్రయం త్వరలో పూర్తికాకపోతే.. మూసివేయక తప్పదన్న సంకేతాలివ్వడం గమనార్హం. ప్రభుత్వ బ్యాంకుల మెగా మెర్జర్ కుదేలువుతున్న ప్రభుత్వ బ్యాంకింక్ రంగానికి ఊతమిచ్చదిశగా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. తద్వారా పంజాబ్ నేషనల్‌బ్యాంకు రెండవ బ్యాంకుగా అవతరించ నుంది. మొత్తం 10 బ్యాంకులను 4 బ్యాంకులుగా కుదించనుంది. తద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంకు రెండవ అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు, ప్రైవేటు బ్యాంకులు మొండి బాకీలు, అక్రమాలు, భారీ స్కాంలతో అతలాకుతలమవుతున్నాయి. టెల్కోల భవితవ్యం? దేశీయ టెలికాం రంగంలో సునామీలా దూసుకొచ్చిన రిలయన్స్ జియో ప్రత్యర్థుల కోలుకోలేని దెబ్బతీసింది. దీనికితోడు సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు నష్టాలతో కుదేలైన టెలికాం కంపెనీలకు అశనిపాతంలా తగిలింది. వడ్డీ, జరిమానాతో సహా టెలికాం సంస్థలు ప్రభుత్వానికి దాదాపు 90,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం దీన్ని సమీక్షించక పోతే, తమ వ్యాపారాన్ని నిలిపివేయడం తప్ప మరోమార్గం లేదని స్వయంగా దిగ్గజ కంపెనీ వొడాఫోన్ ఐడియా స్వయంగా ప్రకటించడం గమనార్హం. ఇక అమ్మకాలు లేక దిగ్గజ రియల్టీ కంపెనీలకు చెందిన భారీ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రియల్టీ రంగానికి ఊతమిచ్చేలా ప్యాకేజీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అటు ప్రపంచ ఆర్థిక అననుకూలతలు ఇటు దేశీయంగా వివిధ రంగాల్లో నమోదైన వరుస క్షీణత, మందగమనాన్ని అధిగమించి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ మిలియన్ డాలర్ క్వశ్చన్ అని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు దేశంలో రోజుకు రోజుకు ముదురుతున్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులను మరుగుపర్చాలనే ఉద్దేశంతోనే జమ్ము కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని అందించే ఆర్టికల్ 370 రద్దు చేసిందనేది మరో వాదన. ఈ విమర్శలకు తోడు పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. ఆర్థిక మందగమనం ఆందోళనలనుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ చర్యలని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. -
ఎన్నో అనుకుంటాం.. కానీ కొన్నైనా చేస్తామా?
సాక్షి, హైదరాబాద్ : కొత్త సంత్సరం వస్తుందంటే చాలు ఓ నెల ముందునుంచే తెగ హైరానా పడిపోతుంటాం. ఈ సంవత్సరం నుంచి ఇవి మానేయాలి, అవి నేర్చుకోవాలి, కొన్ని అలవాటు చేసుకోవాలి, మరికొన్ని మానుకోవాలి.. ఇలా బోలెడు లిస్టు రెడీగా ఉంటుంది. కానీ సూర్యుడు పడమరన ఉదయించడం, చంద్రుడు పట్టపగలు కనిపించడం ఎంత అసాధ్యమో మనం రాసుకున్న లిస్టు ఫాలో అవడం కూడా జరగని పని అని చాలామంది ముందే డిసైడ్ అయిపోతారు. ఆ లిస్టులో మీరు కూడా ఉండే ఉంటారు. కొంతమంది మాత్రం పూర్తిగా కాకపోయినా అనుకున్నదాంట్లో ఒక్కటి పూర్తి చేసినా చాలు ఆస్కార్ గెలిచినంత సంబరపడిపోతారు. మరికొందరు ఏదో మొక్కుబడిగా కొత్త సంవత్సరం తొలినాడు మాత్రమే ఆచరించి తర్వాత మమ అని వదిలేస్తారు. కొందరు అపసోపాలు పడీ ఆచరిస్తారు. కానీ ఏడాది మొత్తం ముందు అనుకున్న మాటపై నిలబడేవారు చాలా తక్కువ మందే ఉంటారు. ఇంతకీ అసలు కొత్త సంవత్సరం అనగానే మనకొచ్చే కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలేంటో చూద్దాం.. మద్యపానం, ధూమపానం, మాంసాహారం మానేయడం క్రమశిక్షణ, సమయపాలన పాటించడం డైరీ రాయడం పెళ్లి చేసుకోవడం ఇల్లు కట్టుకోవడం ఉద్యోగం సంపాదించడం ఏదైనా టూర్‌కి వెళ్లడం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం సెల్ఫోన్లో గడిపే సమయాన్ని తగ్గించడం వాహనాలు కొనుగోలు చేయడం బంగారం, ప్లాట్లు కొనుగోలు చేయడం పిల్లల భవిష్యత్తుపై ప్రణాళిక వేసుకోవడం డబ్బు పొదుపు చేయడం సెల్ఫీలు, టిక్‌టాక్‌లు, పబ్జీలకు దూరంగా ఉండాలనుకోవడం ఆలయాలు సందర్శించటం వ్యాయామం చేయడం కొత్త వ్యాపకాలు పెంచుకోవడం.. ఇలా ఎన్నో అనుకుంటూ ఉంటారు. సో, మీరు ఊహల్లోనే గడిపేయకుండా నిజజీవితంలోనూ వాటిని సాధించేందుకు ప్రయత్నం చేయండి. కొన్నింటినైనా జయించండి. -
దివికేగిన సినీ దిగ్గజాలు
2019లో సైరా నరసింహారెడ్డి, మహర్షి, ఓ బేబీ లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో కళకళలాడిన టాలీవుడ్ వెండితెర... పలువురు సినీ దిగ్గజాలు కన్నుమూయడంతో శోకసంద్రంలో మునిగిపోయింది. వారిలో తెలుగు పరిశ్రమలో గ్రాఫిక్స్ ట్రెండ్ సృష్టించిన కోడి రామకృష్ణ, తన ప్రతిభతో గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నతెలుగు దర్శకురాలు విజయనిర్మల, హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వేణుమాధవ్...ఇలా ఎందరో ప్రముఖులు కన్నుమూశారు. సినీ పరిశ్రమలో 2019 నింపిన విషాదాలను ఓసారి గుర్తుచేసుకుందాం. -కోడి రామకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో గ్రాఫిక్స్‌తో కొత్త ట్రెండ్ సృష్టించిన దర్శకుడు కోడి రామకృష్ణ. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పలు సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఆయన ఫిభ్రవరి 22న తుదిశ్వాస విడిచారు. 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమాతో దర్శకునిగా ప్రస్థానం మొదలుపెట్టి ఎన్నో వందల సినిమాలకు దర్శకత్వం వహించారు. ఓ వైపు కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కిస్తూనే మరోవైపు ‘అమ్మోరు’, ‘దేవి’, ‘దేవీపుత్రుడు’, ‘అంజి’, ‘అరుంధతి’ లాంటి గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే చిత్రాలు తీసి కోడి రామకృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా కెరీర్ ఆరంభంలో కొన్ని చిత్రాల్లో నటించారు. చివరిగా కన్నడలో ‘నాగరహవు’ అనే చిత్రాన్ని తీసారు. -రాళ్లపల్లి విలక్షణ నటన, హాస్యంతో సినిమా తెరపై నాలుగు దశాబ్దాలకుపైగా అలరించిన విలక్షణ నటుడు రాళ్లపల్లి నరసింహారావు. రైల్వేలో ఉద్యోగం వచ్చినా..నటనపై ఉన్న ఆసక్తి ఆయన్ని సినిమారంగం వైపు నడిపించింది. తెలుగులో 1973లో వచ్చిన ‘స్త్రీ’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. హాస్యనటుడిగా, క్యారెక్టర్ నటుడిగా, ప్రతినాయకుడిగా 850కిగా పైగా సినిమాల్లో నటించి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలపై తనదైన ముద్ర వేశారు. దాదాపు 8 వేల నాటకాల్లో నటించిన రాళ్లపల్లి.. చాలా నాటకాలకు స్వయంగా దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు, కవి, రచయిత తనికెళ్ల భరణికి గురువు రాళ్లపల్లి. రంగస్థలమైనా, వెండితెర అయినా, టెలివిజన్ రంగం అయినా తన నటనతో ఆ పాత్రలకి ప్రాణం పోస్తారు. హాస్యానికి కొత్త మెరుగులు, విలనిజానికి వ్యంగాన్ని జోడించడం, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలకు కొత్త విరుపులు, విచిత్రమైన చమత్కారాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. తన నటనతో, డైలాగులతో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్న రాళ్లపల్లి మే 17న కన్నుమూశారు. -గిరీశ్ కర్నాడ్ భాషతో సంబంధం లేకుండా బహుభాషా నటుడిగా చిత్రపరిశ్రమల ప్రజలకు గుర్తుండిపోయే నటుడు గిరీశ్ కర్నాడ్. అనారోగ్యంతో జూన్ 10న కన్నుమూశారు. చారిత్రక, జానపద ఇతిహాసాలను సమకాలీన సామాజిక రాజకీయ అంశాలతో మిళితంచేస్తూ వైవిధ్యభరిత నాటకాలు రచించిన అపూర్వమైన కలం కర్నాడ్‌ది. దాదాపు ఐదు దశాబ్దాలపాటు నటుడిగా, దర్శకుడిగా, సామాజిక వేత్తగా, రాజకీయ నాయకుడిగా తనదైన ముద్రవేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. 1998లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ్ 1974లో పద్మశ్రీ, 1992లో పద్మ భూషణ్ అవార్డులు ఆయన్ని వరించాయి. ఇవి కాకుండా ఏడు ఫిలింఫేర్ అవార్డులు, 10 జాతీయ అవార్డులు అందుకున్నారు. -విజయనిర్మల వెండితెరపై ‘విజయ’కేతనం ఎగురవేసిన తెలుగింటి వనిత విజయనిర్మల. చిన్నతనం నుంచే వెండితెర ప్రస్థానం మొదలుపెట్టిన ఆమె ప్రయాణం ఎంతో సుధీర్ఘమైనది, ఘనమైనది కూడా. అత్యధిక సినిమాలు చేసిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నారు. ‘సాక్షి’ సినిమాతో మెదటిసారి కృష్ణతో జతకట్టి 47 సినిమాల్లో కలిసి నటించారు మెప్పించారు. అలా కృష్ణ- విజయనిర్మల జోడీ హిట్ పెయిర్‌గా నిలిచింది. అతి సాధారణ కుటుంబం, అంతంత మాత్రం చదువు కలిగిన ఆమె.. జీవితాన్ని ఎంతో సమర్థంగా, విజయవంతంగా నడిపించారు. సినిమారంగంలో ఎందరో నటీమణులకు ఆమె ధైర్యం, మార్గదర్శి. జూన్ 27న ఈ లోకాన్ని వదిలివెళ్లినా..ప్రజల గుండెల్లో ఆమె ఎప్పటికీ ధీర ‘విజయ’గానే గుర్తుంటుంది. - దేవదాసు కనకాల ఎంతో మందికి నటనలో శిక్షననిచ్చి తీర్చిదిద్దిన నట శిక్షకుడు దేవదాస్ కనకాల. వందకి పైగా చిత్రాల్లో సహ నటుడిగా, ప్రతినాయకుడిగా, హస్యనటుడిగా నటించారు. రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, సహాసిని లింటి అప్పటితరం నటులనే కాకుండా శివాజీరాజా, సూర్య, రామ్‌చరణ్, మంచుమనోజ్, అల్లరి నరేష్ లాంటి ఈతరం నటుల వరకు ఎంతోమంది దేవదాస్ దగ్గరే శిష్యరికం చేసినవాళ్లే. సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించడంతోపాటు.. దర్శకత్వం కూడా వహించారు. హైదరాబాద్‌లో యాక్టింగ్ స్కూల్ స్థాపించి ఎంతో మందికి నటనలో మెళకువలు నేర్పించి తీర్చిదిద్దిన దేవదాస్ కనకాల ఆగస్టు 2న కన్నుమూశారు. -వేణుమాధవ్ హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వేణుమాధవ్..అనారోగ్యంతో సెప్టెంబర్ 25న కన్నుమూశారు. ఏ పాత్ర చేసినా అందులో లీనమై తానో నవ్వుల వేణువై ఎన్నో కితకితలు పెట్టేవారు. కానీ 39 ఏళ్ల వయస్సులోనే ఆయన నవ్వుల ప్రయాణం అర్థాంతరంగా ఆగిపోయింది. మిమిక్రీ ఆర్టిస్టు నుంచి కథానాయకుడి మారి నవ్వుల రాజుగా అందరి మనసులు చూరగొన్నారు వేణుమాధవ్. ‘సంప్రదాయం’ సినిమాతో నటుడిగా మొదటిసారి వెండితెరకు పరిచయమై దాదాపు 600 సినిమాల్లో నటించారు. వేణుమాధవ్‌కి నటుడిగా అవకాశం ఇచ్చిన ఎస్వీ కృష్ణారెడ్డి దర్వకత్వంలోనే ‘హంగామా’ సినిమాలో హీరోగా నటించారు. ఎన్నో చిత్రాల్లో పేరడీ సన్నివేశాలతో వినోదం పంచి..ఆయన మరణంతో అందర్నీ ఏడిపించారు. -గీతాంజలి ప్రముఖ నటి గీతాంజలి అక్టోబర్ 31న తుదిశ్వాస విడిచారు. 14 ఏళ్ల ప్రాయంలోనే సీతారామ కళ్యాణం సినిమాతో తెరంగేట్రం చేసి వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ అయ్యారు. ‘మణి’ పేరుతో పరిచయమైన ఆమె.. గీతాంజలిగా కథానాయుకగా, చెల్లిలిగా, డాన్స్ టీచర్‌గా ఇలా ఎన్నో పాత్రలు పోషించారు. వివాహం అనంతరం సినిమాలకి దూరం అయిన గీతాంజలి.. పెళ్లైన కొత్తలో సినిమాతో బామ్మగా రీ ఎంట్రీ ఇచ్చారు. 72 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో కన్నుమూశారు. -గొల్లపూడి మారుతీరావు నటుడు, రచయిత, సంపాదకుడు, వ్యాఖ్యాత, బహుముఖ ప్రఙ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు క్యాన్సర్‌తో బాధపడుతూ డిసెంబర్ 12న కన్నుమూశారు. మధ్యతరగతి తండ్రి పాత్రలతో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నారు. తెలుగు తెరపై కొత్త తరహా విలనిజాన్ని ఆవిష్కరించిన ఘనత ఆయనది. 290 చిత్రాల్లో నటించిన ఆయన.. ఆరు నంది పురస్కారాలను అందుకున్నారు. 14 ఏళ్ల వయసులోనే ‘ఆశాజీవి’ అనే కథను రాశారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు పలు వర్సిటీల్లో పాఠ్యాంశాలయ్యాయి. చేసింది చాలు అని ఏనాడు అనుకోకుండా చేయాల్సింది చాలా ఉంది అనే ఆయన తత్వం ఎందరికో ఆదర్శం. గొల్లపూడి మారుతీరావు అనే నూరు కెరటాల హోరు ఇక మీదట కనపడకపోవచ్చు, కానీ ఆయన వదిలి వెళ్లిన గుర్తులు ఎప్పటికీ చెరిగిపోవు, చెదిరిపోవు. -
దిశ నుంచి ఢిల్లీ వరకు సంచలనాలు
పౌర ఆగ్రహం పొగలు సెగలు కక్కింది. రేపిస్టులపైనా, అక్కరకు రాని చట్టాలపైనా.. పాలకులపైనా, ప్రమాదకరంగా మారిన పర్యావరణంపైనా.. అవినీతి, అసమానతలపైనా... యువతరం పిడికిలి బిగించి కదం తొక్కింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి.. భారత్ నుంచి హాంకాంగ్ వరకు ఈ ఏడాది నిరసనలు మిన్నంటాయి. అలాగే దేశంలో సార్వత్రిక ఎన్నికలపై చర్చకు తెరలేపుతూ ప్రారంభమైన 2019వ ఏడాది అనేక సంచలన సంఘటనలకూ వేదికగా నిలిచింది. భారత ప్రజానికంతో పాటు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు దశాబ్దాల నుంచి ఎటూ తెగని వివాదంగా మిగిలిపోయిన అయోధ్య రామమందిర స్థల వివాదానికి కూడా ఈ ఏడాదిలో పూర్థిస్థాయి పరిష్కారం దొరికింది. కశ్మీర్ అంశంతో పాటు ఎన్ఆర్సీ, పౌరసత్వ సవరణ చట్టం వంటి పార్లమెంట్ చట్టాలకు 2019 చోటిచ్చింది. నిర్భయ ఉదంతాన్ని మరోసారి జ్ఞాపకం చేసేలా హైదరాబాద్‌లో అత్యంత దారుణంగా జరిగిన దిశ సంఘటన ఈ ఏడాదిలో అత్యంత సంచలనంగా మారింది. కేంద్రంలో రెండోసారి బీజేపీ ఈ ఏడాది ప్రథమార్థంలో అత్యధికంగా చర్చనీయాంశమైన అంశం సార్వత్రిక ఎన్నికలు. భారత్‌తో పాటు పలు ప్రపంచ దేశాలు సైతం భారత్ ఎన్నికలను ఆసక్తికరంగా గమనించాయి. మార్చి, ఏప్రిల్ మాసాల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మే 23న విడుదల అయ్యాయి. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఏకంగా 303 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. ఎన్డీయే కూటమి మొత్తం 352 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. దీంతో రెండోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. ప్రధాన పత్రిపక్షం కాంగ్రెస్ కేవలం 52 స్థానాలకు పరిమితం కాగా.. రెండు సీట్ల తేడాతో ప్రతిపక్ష హోదాకు దూరమయ్యింది. యూపీఏ కూటమికి 91 సీట్లు దక్కగా ఇతరులు 99 స్థానాల్లో విజయం సాధించారు. పార్టీలవారీగా చూస్తే.. డీఎంకే 23, వైఎస్సార్సీపీ, టీఎంసీ 22, శివసేన 18, జేడీయూ 16 సీట్లలో విజయం సాధించాయి. ఎస్పీకి 5, బీఎస్పీకి 10 సీట్లు మాత్ర మే దక్కాయి. ఇక సీపీఎం 3, సీపీఐ 2 స్థానాల్లో గెలుపొందాయి. అయోధ్య.. రాముడిదే దేశంలో సరికొత్త రాజకీయ చర్చకకు కేంద్రబిందువైన వివాదస్పద అయోధ్య రామమందిర, బాబ్రీ మసీదు స్థలంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదేనని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందని నవంబర్ 9న ఇచ్చిన తీర్పులో తేల్చిచెప్పేసింది. వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రం ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మసీదు నిర్మాణానికి అయోధ్యలో సున్నీ వక్ఫ్‌బోర్డుకు 5 ఎకరాల స్థలం కేంద్రం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పలువురు ముస్లిం సంఘాల ప్రతినిధిలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును సవాలు చేస్తూ ముస్లిం పర్సనల్ లాబోర్డుతో సహా, పలువురు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారించిన సీజే ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధార్మాసనం వాటన్నింటినీ కొట్టివేసింది. సుప్రీం తీర్పే అంతిమమైనదని స్పష్టంచేసింది. పుల్వామా ఉగ్రదాడి.. జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలకు ఈ ఏడాది గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్‌ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఫిబ్రవరి 14 న మధ్యాహాం 3.30 గంటలకు జరిగిన ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ఓ బస్సు తునాతునకలు కాగా, కాన్వాయ్‌లోని పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో దేశం ఒక్ససారిగా ఉలిక్కిపడింది. జవాన్ల మృతికి కారణమైన పాక్‌కు తగిన బుద్ది చెప్పాలని యావత దేశం ముక్త కంఠంతో నినదించింది. విధుల్లో చేరేందుకు 2,547 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు దాదాపు 78 వాహనాల్లో శ్రీనగర్‌కు బయలుదేరిన సమయంలో ఈదారుణ ఘటన చోటుచేసుకుంది. సర్జికల్ స్ట్రైక్ 2. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి. భారత నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై తెల్లవారు ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 3.30 గంటలకు భీకర దాడులు జరిపాయి. బాలాకోట్, చాకోటి, ముజఫరాబాద్ ప్రాంతాల్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలకు చెందిన కంట్రోల్ రూంలను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. 12 మిరాజ్-200 యుద్ధ విమానాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. సర్జికల్ స్ట్రైక్ 2ను విజయవంతంగా పూర్తి చేసి పుల్వామా ఉగ్రదాడి జవాన్లకు ఘన నివాళులర్పించింది. దీనిపై దేశవ్యాప్తంగా భారత ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. అజిత్ దోవల్‌కి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. భారత వైమానిక దాడులను ధృవీకరించిన పాక్.. ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటించింది. ఎమ్మెల్యేనే ఉన్నావ్ దోషి.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు జీవితఖైదు శిక్షను విధించింది. తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని కుల్దీప్ సింగ్ సెంగార్‌పై ఓ మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బాలిక కిడ్నాప్.. అత్యాచారం.. బాధితురాలి తండ్రి లాకప్ మరణం.. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం.. వంటి మలుపులతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఏడాది జూలై 28న బాధితురాలు, ఆమె బంధువులు, న్యాయవాది ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితురాలు గాయపడగా, ఆమె బంధువులిద్దరూ మరణించారు. న్యాయవాది కూడా తీవ్రంగా గాయపడ్డారు. సుప్రీంకోర్టు జోక్యంతో అన్ని కేసులను లక్నో నుంచి ఆగస్టు 1వ తేదీన ఢిల్లీకి బదిలీ చేశారు. మహారాష్ట్రలో సరికొత్త చరిత్ర.. దేశంలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు మహారాష్ట్ర వేదికగా నిలిచింది. పార్టీలో చీలికలు, గవర్నర్ అర్థరాత్రి ప్రకటనలు, తెల్లవారుజామున ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల ప్రమాణస్వీకారాలు, దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం వంటి ఆసక్తికర పరిణామాలతో మహారాష్ట్ర రాజకీయాలు సంచలనం సృష్టించాయి. బాలీవుడ్ సినిమా స్థాయి ట్విస్ట్‌లను ఛేదించుకుంటూ హిందుత్వ పార్టీగా పేరొందిన శివసేన.. లౌకిక భావాజాలం గల కాంగ్రెస్, ఎన్సీపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఠాక్రే కుటుంబం నుంచి సీఎం పీఠం అధిరోహించిన తొలి వ్యక్తిగా ఉద్ధవ్ చరిత్ర సృష్టించారు. అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించలేదు. ఎన్నికల ముందు కూటమి కట్టిన బీజేపీ-శివసేన మధ్య పదవుల పంపకాలతో విభేదాలు ఏర్పాడ్డాయి. దీంతో తన దారి తనదంటూ 30 ఏళ్ల మిత్రబంధానికి ముగింపు పలికిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ను మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో సరికొత్త రాజకీయ అధ్యాయానికి పునాది వేసింది. కన్నడలో కూలిన కుమార సర్కార్.. దేశమంతా ఎంతో ఉత్కంఠరేపిన కర్ణాటక రాజకీయ సంక్షోభం ఈ ఏడాది రాజకీయపరంగా అత్యంత చర్చనీయాశంగా మారింది. అసెంబ్లీ బలపరీక్షలో జేడీఎస్- కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి పాలవడంతో కుమారస్వామి సర్కార్ కుప్పకూలింది. జూలై 23న జరిగిన విశ్వాస పరీక్షలో 15 మంది రెబల్స్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో కుమారస్వామి ఓటమిపాలైంది. ఓటింగ్ జరిగిన సమయంలో సభలో మొత్తం 204 మంది సభ్యులున్నారు. 15 రెబల్స్ తిరుగుబాటుతో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల సంఖ్య 99కి పడిపోయింది. మరోవైపు బీజేపీ సభ్యులు 105 మంది సభకు హాజరయ్యారు. దీంతో 14 నెలల సంకీర్ణ ప్రభుత్వ పాలన ముగిసింది.ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చక్రంతిప్పన 15 మంది రెబల్స్‌పై స్పీకర్ రమేష్ కుమార అనర్హత వేటు వేయడం సంచలనం సృష్టించింది. అనంతరం గవర్నర్ ఆహ్వానం మేరకు బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడియూరప్ప కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. డిసెంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగానే ప్రజలు తీర్పును వెలువరించారు. 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా 12 స్థానాలను అధికార బీజేపీ కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని సుస్థిరపరుచుకుంది. చంద్రయాన్-2 విఫలం చంద్రుడి భూ ఉపరితలంపై పరిశోధనలు జరిపేందుకు అక్కడికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పంపించిన ఉపగ్రహం ‘చంద్రయాన్–2’ చివరి నిమిషంలో విఫలమైంది. జులై 22న జీఎస్ఎల్వీ మార్క్ III-M1 వాహక నౌక ద్వారా చంద్రుడిపై పంపారు... తర్వాత దీని కక్ష్యను ఐదుసార్లు పెంచుకుంటూ పోయి 276 x 1,42,975 కిలోమీటర్లకు చేర్చారు. తర్వాత ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయింది.. సెప్టెంబరు 7 అర్ధరాత్రి చంద్రుడి ఉపరితలంపై దిగుతూ 500 మీటర్ల దూరంలో ఉండగా ల్యాండర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పూర్తిగా సంబందాలు తెగిపోయాయి. ఈ ప్రాజెక్టు మొత్తానికి రూ.978కోట్లు ఖర్చయింది. ఆర్టికల్ 370.. రద్దు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం రెండోసారి అధికారం చేపట్టిన 90 రోజుల్లోనే అత్యంత సంచలన, సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది. దశాబ్దాల సంఘ్ పరివార్ కలను, ఎన్నికల హామీని నెరవేరుస్తూ, కశ్మీర్లో 72 ఏళ్ల నుంచి నలుగుతున్న వేర్పాటువాదం, ఉగ్రవాదం సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులేస్తూ.. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35ఏ అధికరణాలను రద్దు చేసింది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కూడా తొలగిస్తూ, దానిని అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. లదాఖ్ ప్రాంతాన్ని కూడా జమ్మూ కశ్మీర్ నుంచి పూర్తిగా వేరు చేసి, ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. పౌరసత్వ ప్రకంపనలు.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ దేశ వ్యాప్తంగా నిరసలనకు కేంద్రబిందువుగా నిలిచింది. చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి.. పోలీసుల తూటాలు ఆందోళనకారుల గుండెల్లో దిగాయి. పౌరుల ప్రాణాలు పోయినా.. జనం రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ముఖ్యంగా దీని ప్రభావం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్‌లో ఎక్కువగా కనిపించింది. ఆందోళన సందర్భంగా యూపీలో 16 మంది పౌరులు మరణించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులకు, సిక్కులకు, జైనులకు, బౌద్ధులకు, పార్శీలకు, క్రైస్తవులకు దేశంలో పౌరసత్వం కల్పించడం ఈ చట్టం ముఖ్య సారాంశం. అస్సాం ఎన్నార్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రకటించిన ఎన్ఆర్సీని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. తొలుత ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో జాతీయ పౌర గుర్తింపు (ఎన్నార్సీ) తుది ముసాయిదాను విడుదల చేసింది. మొత్తం 3.29 కోట్ల దరఖాస్తుదారుల్లో 2,89,83,677 మందిని భారతీయులుగా గుర్తిస్తున్నట్లు వెల్లడించింది. దరఖాస్తుదారుల్లోని 40.07లక్షల మంది తమ అస్సామీ గుర్తింపును చూపించడంలో విఫలమయ్యారని పేర్కొంది. దీంతో తుది ముసాయిదాతో 40 లక్షల మందికి పైగా ప్రజల భవితవ్యం అనిశ్చితిలో పడింది. కాగా దేశ వ్యాప్తంగా కూడా ఎన్నార్సీని అమలు చేస్తామని బీజేపీ పదేపదే ప్రకటిస్తోంది. దీనిపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కాఫీ డే వీజీ సిద్ధార్థ మృతి.. సౌమ్యుడు, వివాదరహితునిగా పేరుపొందిన కేఫె కాఫీ డే (సీసీడీ) అధినేత వీజీ సిద్ధార్థ మరణించారు. నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కాఫీ ఎస్టేట్ల సామ్రాజ్యాన్ని విస్తరించి ఆరంగంలో మేటిగా నిలిచారు. జూలై 29న సిద్ధార్థ అదృశ్యమయ్యారు. తాను కొద్దిదూరం నడిచి వస్తానని చెప్పి, డ్రైవర్‌ను బ్రిడ్జి సమీపంలో కారు ఆపమని చెప్పిన తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. అరగంట గడిచినా సిద్ధార్థ కారు దగ్గరకు రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో డ్రైవర్ బెంగళూరులోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం జూలై 31న నదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో తేలింది. చిన్మయి శ్రీపాద (మీటూ) పెద్ద మనుషుల ముసుగులో చలామణీ అవుతున్న వివిధ రంగాలకు చెందిన ‘మగానుభావుల’ నిజ స్వరూపాన్ని.. ‘మీటూ’ ఉద్యమం ద్వారా పలువురు బాధితులు బట్టయలు చేశారు. ఇండియాలో బాలీవుడ్ నటితనుశ్రీ దత్తా ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని గాయని చిన్మయి దక్షిణాదిన ముందుండి నడిపించారు. 18 ఏళ్ల వయసులో... ప్రముఖ గేయ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించారంటూ ఆమె పలు సంచలన విషయాలు బయటపెట్టారు. చిన్మయి స్ఫూర్తితో మరికొంత మంది కూడా వైరముత్తు వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ సినీ ఇండస్ట్రీ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా... పలువురు ‘ప్రముఖులు’ చిన్మయిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. అంతేకాదు పబ్లిసిటీ కోసమే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలతో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. హాంగ్.. కాగుతోంది.. ఒక దేశం రెండు వ్యవస్థలు ఉంటే ఎన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఏడాది హాంకాంగ్‌లో ఎగిసిన నిరసనలు. తమ దేశంపై సుదీర్ఘకాలంగా సాగుతున్న చైనా పెత్తనాన్ని హాంకాంగ్‌వాసులు సహించలేకపోతున్నారు. చైనాలో హాంకాంగ్ భాగమైనప్పటికీ అక్కడ ప్రజలు తమను చైనీయులు అనడానికి ఎంత మాత్రమూ ఇష్టపడరు. అలాంటిది నేరస్తుల అప్పగింతకు సంబంధించిన ఒక బిల్లుపై వచ్చిన ప్రతిపాదనలతో హాంకాంగ్‌లో నిరసనల అగ్గి రాజుకుంది. ఈ బిల్లుతో హాంకాంగ్‌లో నిందితుల్ని చైనాలో విచారించే అవకాశం కలుగుతుంది. దీంతో రైట్ వింగ్ యాక్టివిస్టులు భగ్గుమన్నారు. హాంకాంగ్ ప్రత్యేక ప్రతిపత్తిని నిర్వీర్యం చేసేలా చైనా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ రోడ్డెక్కారు. జూన్ నుంచి ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా పోలీసు బలగాలతో నిరసనలు అణచివేయాలని అనుకుంది కానీ అంతకంతకూ అవి తీవ్రరూపం దాల్చాయి. మొత్తానికి బిల్లుపై చైనా ప్రభుత్వం వెనక్కి తగ్గినా ఆ ఆందోళనలిప్పుడు హాంకాంగ్ స్వాతంత్య్ర పోరాటానికి దారి తీశాయి. అమెజాన్ ఆడవుల్లో కార్చిచ్చు అమెజాన్ అడవుల మంటలపై ప్రపంచస్థాయి ఆగ్రహం..! ప్రపంచంలోని అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యం అగ్నికి ఆహుతి అవుతుండటంపై ప్రపంచ స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. అమెజాన్ అడవులు కాలిపోతున్నాయనే వార్తలు ప్రపంచ మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తిలో అధిక భాగం అంటే 20 శాతం ఆక్సిజన్ మనకు అమెజాన్ అడవుల నుంచే లభిస్తోంది. అమెజాన్ అడవులు కాలిపోవడం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంపై కొత్త చర్చకు దారి తీసింది. పర్యావరణవేత్తలు, మేధావులు ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో అమెజాన్ అడవుల్లో చెలరేగిన మంటలను ఆర్పేందుకు యుద్ద విమానాలను ఫ్రాన్స్ అధికారులు రంగంలోకి దించారు. శ్రీలంక మారణహోమం క్రెస్తవులకు ప్రధానమైన ఈస్టర్ పండుగనాడు ద్వీపదేశం శ్రీలంకలో నరహంతకులు మారణహోమం సృష్టించారు. శ్రీలంక రాజధాని కొలంబోతోపాటు నెగొంబో, బట్టికలోవా పట్టణాల్లో బాంబుల మోత మోగించారు. చర్చిలు, విలాసవంతమైన హోటళ్లు లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. ఏప్రిల్ 21న జరిగిన మొత్తం 8 వరుస పేలుళ్లలో 215మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మందికిపైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లలో మొత్తం 33 మంది విదేశీయులు మరణించగా వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. మిగిలిన 21 మంది విదేశీయుల మృతదేహాలను గుర్తించేపనిలో ఉన్నామని శ్రీలంక అధికారులు వెల్లడించారు. ఈస్టర్ సందర్భంగా చర్చిల్లో సామూహికంగా ప్రార్థనలు చేసుకుంటుండగా ఈ పేలుళ్లు సంభవించాయి. మొత్తం 3 చర్చిలు, మూడు హోటళ్లు, జూ వద్ద, మరో ఇంట్లో దుండగులు పేలుళ్లకు పాల్పడ్డారు. దిశా.. తూటా చెప్పిన తీర్పు రేపిస్టులకు వ్యతిరేకంగా మన తెలుగు గడ్డపై జరిగిన ఉద్యమం యావత్ దేశానికి పాకింది. డాక్టర్ దిశ అత్యాచారం, హత్య ఈ ఏడాది దేశంలో ప్రకంపనలు రేపింది. నవంబర్ 27 రాత్రి షాద్‌నగర్‌లో ఒక అమాయకురాలిపై వలపన్ని టోల్ ప్లాజాకు కూతవేటు దూరంలో నలుగురు మృగాళ్లు అత్యాచారం చేయడమే కాకుండా, బతికుండగానే పెట్రోల్ పోసి తగులబెట్టడం సామాన్యుల్ని దహించి వేసింది. జనం స్వచ్ఛందంగా రోడ్డెక్కారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు రేపిస్టులకి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. 2012లో నిర్భయ ఉదంతం తర్వాత అత్యాచారాలకు వ్యతిరేకంగా యువతరం స్వచ్ఛందంగా కదిలిరావడం ఇదే. దిశపై అఘాయిత్యం జరిగి వారం తిరక్కుండానే డిసెంబర్ 6న నిందితులు పోలీసుల ఎన్కౌంటర్లో మరణించారు. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా అక్కడక్కడ నిరసన స్వరాలు వినిపించినప్పటికీ సామాన్యులు శభాష్ అన్నారు. మన న్యాయవ్యవస్థలో జరిగే జాప్యం పట్ల ప్రజలు ఎంత విసిగిపోయారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అమ్మాయిల భద్రత గాల్లో దీపంలా మారడంతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి.. అత్యాచార కేసుల్లో సత్వర న్యాయం జరిగేలా దిశ చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం అత్యాచారం కేసుల్లో 21 రోజుల్లో విచారణ పూర్తి చేసి దోషులకు శిక్ష విధిస్తారు. తహసీల్దార్ సజీవ దహనం రాష్ట్ర రాజధాని శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి ఆమె కార్యాలయంలోనే హత్యకు గురయ్యారు. పట్టాదారు పాసుపుస్తకాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో కూర సురేశ్ అనే రైతు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు మూడు రోజులపాటు విధుల్లోకి రాకుండా నిరసనలు చేపట్టారు. మంటల్లో తీవ్రంగా గాయ పడిన కారు డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్యలు ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు. రైతు కూర సురేశ్ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు ఆర్టీసీ సమ్మె.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ.. 2011లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సకలజనుల సమ్మె తరువాత మరోసారి అంతటి మహా ఉద్యమాన్ని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టారు. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత వారు చేపట్టిన తొలి సమ్మె ఇది. డిమాండ్లను నెరవేర్చాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 52 రోజుల పాటు చేపట్టిన ఆర్టీసీ సమ్మె మహా ఉద్యమంగా సాగింది. కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం ఏమాత్రం తగ్గకపోగా, విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. అంతేకాదు ఉద్యమం సందర్భంగా దాదాపు 30 మంది కార్మికులు వివిధ రూపాల్లో ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత్యంతరం లేక సమ్మెను విరమిస్తున్నట్లు కార్మికులు ప్రకటించారు. వారి విజ్ఞప్తి మేరకు కార్మికులందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. కార్మికుల ఉద్యమం తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచనంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో నూతన శకం.. ఆంధ్రప్రదేశ్‌లో నూతన శకం మొదలైంది. ‘ప్రజాసంకల్ప యాత్ర’ సుదీర్ఘ పాదయాత్ర అనంతరం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను 151 స్థానాల్లో గెలిచి కొత్త చరిత్రను సృష్టించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 30 గురువారం మధ్యాహ్నం 12:23 నిమిషాలకు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ నరసింహన్.. వైఎస్ జగన్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. సంక్షేమ పథకాలే ప్రధానం ఎజెండాగా ప్రచారం చేసిన వైఎస్ జగన్.. ఇచ్చిన మాటకు కట్టుబడి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరునెల్లలోనే హామీలను అమలు చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. చరిత్ర ఎన్నడూ లేని విధంగా ప్రధాన ప్రతిపక్ష టీడీపీ ఈ ఎన్నికల్లో కేవలం 21 సీట్లకు పరిమితమైంది. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో సైతం వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 25 స్థానాల్లో 22 ఎంపీ సీట్లు కైవలం చేసుకుంది. టీడీపీ మూడు స్థానాలు దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా అమరావతిలో శాసన రాజధాని(లెజిస్లేటివ్ క్యాపిటల్), విశాఖలో పరిపాలన రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్), కర్నూలులో న్యాయ రాజధాని(జ్యుడీషియల్ క్యాపిటల్) ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ తన నివేదికలో సూచించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని, పరిపాలన వికేంద్రీకరణపై ఏర్పాటైన ఈ నిపుణుల కమిటీ డిసెంబర్ 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి 125 పేజీలతో కూడిన నివేదికను సమర్పించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధి ప్రతిబింబించేలా నివేదికలో పలు సూచనలు చేసింది. విశాఖపట్నంలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, వేసవిలో అక్కడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పేర్కొంది. అమరావతిలో అసెంబ్లీ, గవర్నర్ కార్యాలయం, సీఎం క్యాంపు కార్యాలయం.. కర్నూలులో హైకోర్టు ఉండాలని సూచించింది. వరద ముంపులేని ప్రాంతం రాష్ట్రానికి రాజధానిగా ఉండాలని.. రాజధాని కార్యకలాపాల్ని వికేంద్రీకరించాలని సలహానిచ్చింది. కమిటీ మొత్తం సుమారు 10,600 కిలోమీటర్లు రాష్ట్రమంతా పర్యటించి రాజధాని, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసింది. -సురేష్ అల్లిక (వెబ్‌డెస్క్ ప్రత్యేకం) -
బ్లాక్ హోల్.. 8వ ఖండం.. కొత్త దేశం..
ప్రపంచంలో ప్రతి ఏటా ఎన్నో వింతలు, విశేషాలు, అద్భుతాలు, ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటాయి. మనం రోజు చూసే పరిసరాలు కూడా ఒక్కోసారి వింతగా కనిపిస్తూ ఉంటాయి. ఓ సినీ రచయిత చెప్పినట్టు అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు.. జరిగిన తరువాత గుర్తించాల్సిన పని లేదన్నది అక్షర సత్యం అనిపిస్తుంది. అది ఈ ఏడాది కూడా రుజువైంది. కాలానుగుణంగా ఎన్నో అద్భుతాలు 2019లో చోటుచేసుకున్నాయి. అలాంటి కొన్ని విశేషాలను ఓ సారి గమనిస్తే.. 14 కోట్ల ఏళ్ల కిందట అమెరికా నుంచి విడిపోయి.. నెదర్లాండ్ శాస్త్రవేత్తలు 8వ ఖండాన్ని కనిపెట్టారు. గ్రేటర్ ఆడ్రియా అని దీనికి పేరు పెట్టిన శాస్త్రవేత్తలు.. 14 కోట్ల ఏళ్ల కిందట ఇది అమెరికా నుంచి విడిపోయి దక్షిణ ఐరోపా కిందకు చేరిపోయిందన్నారు. మధ్యధరా ప్రాంతంలోని భౌగోళిక శాస్త్ర పరిణామక్రమాన్ని శోధిస్తుండగా.. ఈ ఖండం కనిపించగా, ఆడ్రియాటిక్ సముద్రం నుంచి ఇటలీ వరకూ విస్తరించి ఉండగా, ఈ ప్రాంతాన్ని భూగర్భశాస్త్రవేత్తలు ఆడ్రియగా పిలుస్తున్నారు. అకలి ఎంత పనైనా చేయిస్తుంది.. అకలి ఎంత పనైనా చేయిస్తోందంటారు. అందుకు నిదర్శనంగా ఓ ఆర్కిటిక్ నక్క.. మంచుగడ్డల్లో ఆహారం కోసం 3500 కి.మీ దూరాన్ని 76 రోజుల్లో ప్రయాణించి రికార్డు సాధించింది. నార్వే లోని స్వాల్బార్డ్ అనే ద్వీప సమూహం నుంచి బయలుదేరి కెనడా లోని ఉత్తర నునవట్ ద్వీపాల్లో ఒక దానికి చేరుకోడంతో దాని ప్రయాణం ముగిసింది. ఈ పరిణామం 2018లో జరిగినప్పటికీ.. ఈ ఏడాది శాస్త్రవేత్తలు అధికార ప్రకటనతో వెలుగులోకి వచ్చింది. నెల రోజుల్లోనే రెండు కాన్పులు.. ఓ మహిళ నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. బంగ్లాదేశ్‌కు చెందిన అరీఫా సుల్తానా ఫిబ్రవరి నెలలు నిండని మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో వైద్యులు ఇంటికి పంపారు. అయితే 26 రోజుల తర్వాత అరీఫా మళ్లీ నొప్పులు రావడంతో.. కుటుంబ సభ్యులు ఆమెను ఇంకొక హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ అరీఫాను పరీక్షించిన వైద్యులు.. ఆమె గర్భంలో ఇద్దరు కవలలు ఉన్నట్టు గుర్తించి ఆమె సిజేరియన్ చేశారు. ఆ పిల్లలు ఎలాంటి సమస్యలు లేకుండా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు వైద్యులు తెలిపారు. చంద్రయాన్-2 విఫలమైనప్పటికీ.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) పత్రిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ జాబిల్లి ఉపరితలంపై దిగుతుండగా చివరి క్షణాల్లో కుప్పకూలిపోయింది. అయితే ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతం కాకపోయినప్పటికీ మంచి ఫలితాల్నే ఇచ్చిందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, విక్రమ్ ల్యాండర్ జాడ కోసం అంతరిక్ష శాస్త్రవేత్తలు, సంస్థలు శోధనలు జరిపినప్పటికీ.. నాసా ఎల్ఆర్వో పంపిన ఫోటోల ఆధారంగా చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ షణ్ముగం సుబ్రమణ్యం (33) జాబిల్లిపై దాని శకలాలను విశేషం. పండటి బిడ్డలకు జన్మనిచ్చిన వృద్ధురాళ్లు.. 70 ఏళ్లలో పండంటి బిడ్డలకు జన్మనివ్వడం ద్వారా భారత్‌కు చెందిన ఇద్దరు భామ్మలు అందరి దృష్టిని ఆకర్షించారు. 75 ఏళ్ల వయసులో రాజస్తాన్‌కు చెందిన ప్రభాదేవి అనే బామ్మ గర్భం దాల్చి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌లో ఓ వృద్ధురాలు మంగాయమ్మ 73 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఐవిఎఫ్ ప్రక్రియ ద్వారా వీరు పిల్లలకు జన్మనిచ్చారు. ఫొటోకు చిక్కిన బ్లాక్ హోల్ ఖగోళ చరిత్రలో సంచలన ఆవిష్కరణ చోటుచేసుకుంది. శాస్త్రవేత్తలు తొలిసారిగా ఓ కృష్ణ బిలాన్ని(బ్లాక్ హోల్‌ని) ఫొటో తీశారు. భూమికి 5.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఎమ్87 గెలాక్సీలో ఈ కృష్ణ బిలం ఉంది. బ్రిడ్జి కింద చిక్కుకున్న విమానం.. చైనాలోని హార్బిన్లో ట్రక్కుపై తరలిస్తున్న ఓ విమానం బ్రిడ్జి కింద చిక్కుకుపోయింది. రోడ్డుపై ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా విమానం రెక్కలు తొలగించినప్పటికీ.. దురదృష్టవశాత్తూ ఆ వాహనం వంతెన కింద ఇరుక్కుపోయింది. ఆ తర్వాత ట్రక్కు టైర్లలో గాలిని తగ్గించి.. ఆ తర్వాత నెమ్మదిగా వాహనాన్ని ముందుకు కదిలించారు. దీంతో విమానం బ్రిడ్జి కింది నుంచి బయటికి వచ్చింది. ఉత్తర కొరియా గడ్డపై ట్రంప్.. ఉత్తర, దక్షిణ కొరియా దేశాల రిహద్దుల మధ్య ఉన్న నిస్సైనిక మండలం(డీఎంజెడ్)లోని పన్‌మున్‌జొమ్ గ్రామంలో ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్‌తో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమావేశమయ్యారు. పదవిలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఉత్తర కొరియా రావడం ఇదే మొదటిసారి. కొత్త దేశంగా బౌగెన్విల్లే! ప్రపంచ పటంలో కొత్త దేశం ఏర్పడనుంది. దక్షిణ పసిఫిక్ రీజియన్‌లోని బోగన్‌విల్లె ద్వీపం త్వరలోనే స్వతంత్ర దేశంగా అవిర్భనుంచనుంది. పపువా న్యూ న్యూగినియా నుంచి స్వాతంత్య్రం కోరుతూ ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించిన రిఫరెండంలో 98 శాతం మంది స్వతంత్ర దేశానికే ఓటు వేశారు. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం పంజాబ్‌లోని డేరా బాబా నానక్‌ను పాకిస్తాన్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్ కారిడార్ నవంబర్ 9న ప్రారంభమైంది. సిక్కులు పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే కర్తార్‌పూర్ మందిరం.. 1947లో భారత్‌ను రెండు విభజించిన సమయంలో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిపోయింది. ఒకే కాన్పులో ఏడుగురు జననం ఓ మహిళ ఒకే కాన్పులో ఏడుగురు శిశువులకు జన్మనిచ్చారు. ఈ అరుదైన ఘటన తూర్పు ఇరాక్‌లో చోటుచేసుకుంది. వారిలో ఆరుగురు ఆడపిల్లలు కాగా, ఒక మగ పిల్లాడు ఉన్నారు. ఇరాక్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే తొలిసారి అని అక్కడి వైద్యులు తెలిపారు. టెస్లా సైబర్ ట్రక్.. ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా.. సైబర్‌ట్రక్ పేరుతో ఎలక్ట్రిక్ పికప్‌ట్రక్‌ను పరిచయం చేసింది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ వాహనానికి కేవలం నాలుగు రోజుల్లోనే 1.87 లక్షల ఆర్డర్లు వచ్చాయి. సైబర్‌ట్రక్ లాంఛ్ సందర్భంగా పనితీరును పరీక్షిస్తున్న సమయంలో రాయి వెహికల్ గ్లాస్ అద్దాలు బద్దలైనా రికార్డుస్ధాయిలో ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఈ ట్రక్ త్వరలోనే త్వరలోనే దుబాయ్ పోలీసుల వాహన శ్రేణిలో చేరనుంది. -కనుకుల సుమంత్, సాక్షి వెబ్‌డెస్క్ -
వారి కుటుంబాల్లో వేదనే మిగిలింది
వరుస ప్రమాదాలు ఈ ఏడాది ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. గతేడాదితో పోల్చుకుంటే 2019లో ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగి దేశవ్యాప్తంగా వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. పుల్వామా దాడి యావత్ భారతాన్ని శోక సంద్రంలో ముంచింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో పదుల సంఖ్యలో అభాగ్యులు ఆహూతయ్యారు. గోదావరి బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదన్ని మిగిల్చింది. ఇక రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్‌గా నిలిచిన నల్గొండ రహదారి ప్రజల రక్తం తాగేసింది. ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ప్రమాదాలను ఓ సారి పరిశీలిద్దాం..! అయ్యప్ప దర్శనం కోసం వెళ్లి.. తమిళనాడులో జనవరి 6న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుదుకోట్టై జిల్లా తిరుమయం వద్ద అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్న వ్యాన్, మరో కంటెయినర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన 10 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. శబరిమలై అయ్యప్పను దర్శించి, రామేశ్వరంలో పవిత్ర స్నానాలు ముగించుకుని తిరుగు పయనంలో ఉన్న ఈ భక్తులు ప్రయాణిస్తున్న వ్యానును ఎదురుగా, అతివేగంగా దూసుకొచ్చిన ట్రాలీ లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి మంటల్లో ఎగ్జిబిషన్ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జనవరి 30 రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో రేగిన నిప్పురవ్వలు.. చూస్తుండగానే దావానలంలా మారి క్షణాల్లో అక్కడున్న400 స్టాళ్లను బూడిద చేశాయి.ఈ ఘటన జరిగిన సందర్భంలో సుమారు యాభైవేలకు పైగా సందర్శకులు ఎగ్జిబిషన్లో వివిధ స్టాళ్లలో ఉన్నప్పటికీ.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్తి నష్టం మాత్రం రూ. వందల కోట్లలో జరిగింది. పూర్తి వార్తకోసం క్లిక్ చేయండి పట్టాలు తప్పిన రైలు.. ఏడుగురు మృతి బీహార్‌లో ఫిబ్రవరి 3న ఘోర రైలు ప్రమాదం జరిగింది. వైశాలి జిల్లాలో సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఏడుగురు మృతి చెందారు. దాదాపుగా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాట్నాకు 30కి.మీ దూరంలో ఫిబ్రవరి 3న ఈ ప్రమాదం జరిగింది. రైలు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు రైల్వే శాఖ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది. అలాగే గాయపడిన వారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందజేసింది. నకిలీ మద్యానికి 34 మంది బలి (ఫిబ్రవరి 8) : ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ర్టాల్లోని ఇరుగుపొరుగు జిల్లాల పరిధిలో కల్తీ మద్యం తాగి 34 మంది మృతి చెందారు. ఉత్తరాఖండ్‌లో 16 మంది, ఉత్తర్‌ప్రదేశ్‌లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా ఝాబ్రెరా ప్రాంతం బాలుపూర్ గ్రామస్తులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహారన్ పూర్ జిల్లాలో మరణించిన ఒక వ్యక్తి అంత్యక్రియలకు ఫిబ్రవరి 7న వెళ్లారు. ఆతర్వాత కల్తీ మద్యం తాగారు. ఈ ఘటనలో 16మంది మృతి చెందారు. హోటల్లో మంటలు.. 17 మృతి రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్లో ఫిబ్రవరి 12న ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్న ఈ దుర్ఘటనలో 17 మంది చనిపోయారు. అందులో ఇద్దరు ప్రాణాలు కాపాడుకునేందుకు హోటల్ భవంతి నుంచి దూకి మృతిచెందారు. మృతుల్లో ఓ చిన్నారితో పాటు విశాఖపట్నం హెచ్‌పీసీఎల్ రిఫైనరీ ఉద్యోగి కూడా ఉన్నారు. కరోల్‌బాగ్‌లోని హోటల్ అర్పిత్ ప్యాలెస్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఉలిక్కిపడ్డ భారతావని (ఫిబ్రవరి 14-26) : జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఫిబ్రవరి14న ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్‌ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి దెబ్బకు దెబ్బ పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ను చావు దెబ్బతీసింది. . 2016 నాటి సర్జికల్ దాడుల్ని గుర్తుకు తెస్తూ, పాక్ భూభాగంలోని బాలాకోట్‌లో జైషే నిర్వహిస్తున్న అతిపెద్ద శిక్షణా శిబిరాన్ని భారత వైమానిక దళం ధ్వంసం చేసింది. బాంబుల్ని జారవిడిచి సుమారు 350 మంది ఉగ్రవాదులు, సీనియర్ కమాండర్లు, వారి శిక్షకుల్ని మట్టుపెట్టింది. నెత్తురోడిన నల్లగొండ రహదారి నల్లగొండ జిల్లాలో రహదారి నెత్తురోడింది. మార్చి 6న హైదరాబాద్ నుంచి దేవరకొండ వైపు వెళ్తున్న టాటా ఏసీ మ్యాజిక్ ఎక్స్‌ప్రెస్ వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. బస్సు కూడా వేగంగా ఉండటంతో టాటాఏసీ వాహనాన్ని 20అడుగుల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషాదం మిగిల్చిన విమానం ఇథియోపియాలో మార్చి10న జరిగిన ప్రమాదంలో విమానం కూలిపోయింది. ఆ దేశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం..బయలుదేరిన కాసేపటికే కుప్పకూలింది. 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది.. మొత్తం 157 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కెన్యా, ఇథియోపియా, కెనడా, చైనా, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఈజిప్టు, నెదర్లాండ్, స్లొవేకియా, భారత్‌కు చెందినవారు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి పాదాచారులను మింగిన వంతెన ముంబైలో ఘోర ప్రమాదం సంభవించింది. ఛత్రపతి శివాజీ టెర్మినస్(సీఎస్టీ) నుంచి అంజుమన్ కాలేజీ, టైమ్స్ ఆప్ ఇండియా భవనంవైపు వెళ్లే పాదచారుల వంతెనలో కొంతభాగం మార్చి 12న రాత్రి కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలుసహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. కసబ్ బ్రిడ్జిగా పిలిచే ఈ వంతెనపై పాదచారులు వెళుతుండగా వంతెనలో కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పలువురు బ్రిడ్జిపై నుంచి కిందపడ్డారు. 2008 ముంబై ఉగ్రదాడుల సందర్భంగా ఉగ్రవాది కసబ్ ఈ బ్రిడ్జిపై వెళుతూ సీసీటీవీ కెమెరాలకు చిక్కడంతో ఆ వంతెనకి కసబ్ బ్రిడ్జి అనేపేరు స్థిరపడిపోయింది. ఛత్తీస్‌లో మావోల ఘాతుకం (ఏప్రిల్ 9) : ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు రెచ్చి పోయారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దంతెవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవికి చెందిన కాన్వాయ్ లక్ష్యంగా ఐఈడీ పేల్చారు. వెంటనే చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ దుర్భటనలో ఎమ్మెల్యే మాండవి(40)తో పాటు నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి మట్టిదిబ్బ కూలి 10 మంది మృతి (ఏప్రిల్ 9) : నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేర్ శివార్లో మట్టిదిబ్బ కూలి 10 మంది మృతి చెందారు. వీరంతా ఉపాధి హామీ కూలీలు. ఎండ ఎక్కువ ఉండడంతో నీళ్లు తాగేందుకు గుట్ట నీడ కిందికి వెళ్లారు. అదే సమయంలో ఓ చిన్న మట్టిపెళ్ల బోయిని మణెమ్మ అనే కూలీ మీద పడింది. వెంటనే తేరుకున్న ఆమె గుట్ట కూలేటట్టు ఉందని మిగతా కూలీలను అప్రమత్తం చేస్తుండగానే.. ప్రమాదం ఉప్పెనలా వచ్చింది. ఒక్కసారిగా మట్టిదిబ్బ కూలడంతో పది మంది మట్టికింద సమాధి అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయడం రాములవారి కల్యాణానికి వెళ్లి.. (ఏప్రిల్ 14) : సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని ఆటో ఢికొట్టి ఏడుగురు దుర్మరణం చెందారు. కోదాడ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ్మర సీతారామ దేవాలయంలో ప్రతి ఏటా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లి వస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అకాల వర్షాలకు 53 మంది బలి రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలనే భారీ అకాల వర్షాలు కుదిపేశాయి. ఏప్రిల్ 16న కురిసిన భారీ వర్షాలకు నాలుగు రాష్ట్రాలతో కలిపి 53 మంది మరణించారు. వర్షం కారణంగా అత్యధికంగా రాజస్తాన్‌లో 25 మంది, మధ్యప్రదేశ్‌లో 15 మంది, గుజజరాత్లో 10 మంది, మహారాష్ట్రలో ముగ్గురు చనిపోయారు. ఈస్టర్ ప్రార్థనలపై ఉగ్రదాడులు.. 215 మంది మృతి ఈస్టర్ పండుగరోజు(ఏప్రిల్ 21) శ్రీలంకలో ఉగ్రవాదులు దాడి చేశారు. రాజధాని కొలంబోతోపాటు నెగొంబో, బట్టికలోవా పట్టణాల్లో బాంబుల మోత మోగించారు. ఈ ప్రమాదంతో 215మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 500మందికితీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు సహా 33మంది విదేశీయులు మృతి చెందారు. ఇదే నెల 27న మరోసారి ఉగ్రవాదు రెచ్చి పోయారు. శ్రీలంక భద్రతాబలగాలపై కాల్పులు జరిపి తమనుతాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనలో ఆత్మహుతి బాంబర్లతో సహా 15మంది మృతి చెందారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి రెచ్చిపోయిన మావోలు.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్తులు విసిరిన పంజాలో 15 మంది పోలీసులు మృతిచెందారు. కూబింగ్‌కు బయలుదేరిన పోలీసుల వాహనం లక్ష్యంగా శక్తిమంతమైన ఐఈడీ మందుపాతరను పేల్చారు. మే1న జరిగిన ఈ దుర్ఘటనలో మహారాష్ట్ర పోలీసు విభాగం క్విక్‌రెస్పాన్స్ టీం యూనిట్‌కు చెందిన 15 మంది కమాండోలతో పాటు ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. పేలుడు ధాటికి పోలీసుల వాహనం తునాతునకలైంది. కాగా 2018 ఏప్రిల్‌లో క్యూఆర్టీ కమాండోలు ఓ ఆపరేషన్‌లో భాగంగా 40 మంది మావోయిస్టులను హతమార్చారు. ఇందుకు ప్రతిగానే మావోలు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. విషాదం మిగిల్చిన పెళ్లి చూపులు కర్నూల్ జిల్లా వెల్దుర్తి వద్ద మే11న జరిగిన ఘోర ప్రమాదంలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. వేగంగా వచ్చిన బస్సు ఎదురుగా వచ్చిన బైకును తప్పించబోయి అవతలివైపు వెళ్తున్న తుఫాన్ వాహనాన్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన బంధువులు. ఓ పెళ్లి సంబంధం కుదుర్చుకొని తిరిగివస్తుండగా ఈ ఘటన చోటుచేసకుంది. మృతులంతా 25-40 ఏళ్లలోపే వారే. 15 మంది దుర్మరణం మహారాష్ట్రలోని పుణెలో గోడకూలి 15 మంది దుర్మరణం పాలయ్యారు. కుంద్వా ప్రాంతంలోని బడాతలావ్ మసీదు సమీపంలో అపార్ట్మెంట్ నిర్మాణ పనులు జరుగుతుండగా.. ఎడతెరపి లేని కుండపోత వర్షాలకు నేల కుంగడంతో దాదాపు 22 అడుగుల రక్షణ గోడ కూలి షెడ్లపై పడింది. అక్కడే కార్లు పార్క్ చేయడంతో తీవ్రత మరింత పెరిగింది. అక్కడే నిద్రిస్తున్న 15 మంది కార్మికులు సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. కార్మికుంతా బిహార్ నుంచి వలస వచ్చినవారే. జూన్ 31న ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన బస్సు.. జమ్మూకాశ్మీర్‌లో జులై1న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. కేశవాన్ నుంచి కిష్టావర్ ప్రాంతానికి బయలుదేరిన మినీ బస్సు సిర్గ్వారి ప్రాంతంలో బస్సు మలుపు తీసుకుంటుండగా అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంతో పాటు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి అగ్నికి ఆహుతి పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 23 మంది మృతిచెందగా, మరో 27 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. బటాలా ప్రాంతంలో ఓ టపాసుల ఫ్యాక్టరీలో సెప్టెంబర్ 4న భారీ పేలుడు సంభవించింది. బటాలా-జలంధర్ రహదారిలోని హన్సాలీ పుల్ వద్ద ఉన్న రెండస్తుల ఫైర్‌క్రాకర్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ దుర్ఘటనలో ఫ్యాక్టరీ భవంతి పేకమేడలా కూలిపోయింది. నానక్ దేవ్ పెండ్లి మహోత్సవంతో పాటు పలు పండుగల నేపథ్యంలో కర్మాగారంలో కొన్ని రోజులుగా టపాసులు నిల్వ చేశారు. భారీగా నిల్వచేసిన పటాసులు పేలడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. పేలుడు ధాటికి చుట్టుపక్కల నివాసాలకు కూడా మంటలు వ్యాపించాయి. విషాదం మిగిల్చిన విహార యాత్ర తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని కచ్చులూరు వద్ద సెప్టెంబర్ 15న పెను విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో 77 మందితో ప్రయాణిస్తున్న బోటు నదిలో బోల్తా పడడంతో 51 మంది మరణించారు. మరో 26 మందిని స్థానికులు రక్షించారు. ధర్మాడి సత్యం బృందం రంగంలోకి దిగి 38 రోజుల తీవ్రంగా శ్రమించి బోటును, బోటులో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి పుణ్యక్షేత్రాలకు వెళ్లి.. తూర్పుగోదావరి జిల్లా మన్యంలో అక్టోబర్15 న జరిగిన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మారేడుపల్లి- చింతూరు ఘాట్రోడ్లో వాల్మీకి కొండ వద్ద వీరు ప్రయాణిస్తున్న టెంపో వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. రెండు ప్రైవేట్ టెంపో ట్రావెల్స్ వాహనాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన 24 మంది తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు బయలుదేరారు. భద్రాచలం నుంచి అన్నవరం దైవ దర్శనానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న టెంపో వాహనం ప్రమాదకర మలుపులో అదుపుతప్పి బోల్తాపడింది. 25 అడుగుల ఎత్తు నుంచి వ్యాన్ కిందపడడంతో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. భారీ పేలుడు.. మృతదేహాలు ఛిద్రం మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో అక్టోబర్31 న భారీ పేలుడు సంభవించింది. శిరపూర్ సమీపంలోని వాఘూడీ గ్రామ సమీపంలో ఉన్న రుమిత్ కెమికల్ కంపెనీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది చనిపోగా, 65 మంది గాయపడ్డారు. పేలుడు శబ్దాలు సుమారు 10 కిలోమీటర్ల దూరం వినిపించాయి. పేలుడు తీవ్రతకు కొన్ని మృతదేహాలు కూడా ఛిద్రం అయ్యాయి. భారీ అగ్ని ప్రమాదం దేశ రాజధాని ఢిల్లీలోని అనాజ్‌మండీలో ఉన్న ఫాక్టరీలో డిసెంబర్ 8న జరిగిన అగ్నిప్రమాదంలో 43 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. 25 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే జరగరాని నష్టం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భవనం రెండో అంతస్తు నుంచి మంటలు చెలరేగి దట్టమైన పొగ కమ్ముకుంది. పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వస్తువులు నిల్ల ఉండడంతో మంటలు వెనువెంటనే వ్యాపించాయి. - శెట్టె అంజి, సాక్షి వెబ్ డెస్క్ -
2019ని ఏలిన సినిమాలివే..
సినిమా.. ప్రేక్షకుడు కాసేపు నవ్వుకోడానికి కొత్త అనుభూతిలో తేలడానికి, ప్రస్తుత రోజుల్లో అయితే టైంపాస్ కోసం థియేటర్‌కు వెళ్తున్నారు. అయితే ఎన్నో అంచనాలతో కొన్ని పెద్ద సినిమాలకు వెళ్తే ఆశలు అడియాశలే అవుతున్నాయి. దీంతో రొటీన్‌గా కాకుండా కొత్తగా ట్రై చేస్తున్న చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. పైగా పెద్ద హీరోలు పుష్కరానికోసారి చేసే సినిమా కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా మౌత్ టాక్‌తో క్రేజ్ తెచ్చుకున్న సినిమాలను ఆదరించడానికి థియేటర్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది చిత్రంగా.. పెద్ద సినిమాలు కొన్ని చతికిలపడగా చిన్న సినిమాలు ప్రశంసలు దక్కించుకున్నాయి. సినిమా చిన్నది.. ఆదరణ పెద్దది ఈ ఏడాది హిట్ అయిన సినిమాల పరంపరను గమనిస్తే ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారని కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కథలో దమ్ముంటే చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకోవచ్చని నిరూపించాయి. కాన్సెప్ట్ బేస్డ్గా వచ్చిన మల్లేశం చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మిస్ మ్యాచ్, ఫలక్‌నుమాదాస్, బ్రోచేవారెవరురా, కొబ్బరిమట్ట, కౌసల్య కృష్ణమూర్తి, రాజ్‌దూత్ సినిమాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. కోట్లల్లో కలెక్షన్లు కొల్లగొట్టకపోయినా అందరిచేత అదుర్స్ అనిపించుకున్నాయి. భయపెట్టించి వసూలు చేశాయి.. థ్రిల్ జానర్లో తెరకెక్కిన చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. కళ్యాణ్ రామ్ ‘118’, అనసూయ ‘కథనం’, అడవి శేషు ‘ఎవరు’, నిఖిల్ ‘అర్జున్ సురవరం’ సినిమాలు బాగున్నాయి. హారర్ జానర్లో జెస్సీ, రాక్షసుడు, నిను వీడని నీడను నేనే, గేమ్ ఓవర్ కొత్త కథాకథనంతో ప్రేక్షకులకు భయపెట్టించి మరీ కలెక్షన్లు వసూలు చేశాయి. ఇక ‘కాంచన 3’ సినిమాకు తిరుగేలేదని భావించినప్పటికీ పేలవమైన కథ థియేటర్లలో పేలలేదంటూ విశ్లేషకులు బాహాటంగానే విమర్శించారు. ఇక ఎప్పటిలానే ఈసారి కూడా పెద్ద హీరోలు హారర్ జానర్‌ను టచ్ చేయడానికి కూడా ఆసక్తి చూపించలేదు. బయోపిక్‌ల ట్రెండ్.. బాలీవుడ్‌తో పోలిస్తే బయోపిక్ సక్సెస్ రేటు టాలీవుడ్లో తక్కువగానే ఉంది. తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్‌ల సినిమాలు అరుదుగా వస్తుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం బయోపిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. స్వాతంత్ర్యోద్యమ నాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డిలో మెగాస్టార్ చిరంజీవి నటన అద్భుతమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా సునాయాసంగా విజయ శంఖారావాన్ని పూరించింది. మహానాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవితకథ ఆధారంగా వచ్చిన ‘యాత్ర’ అందరి నోట కీర్తించబడింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవితకథ వెండితెరపై పూర్తిస్థాయిలో ఆవిష్కరించలేదన్న వాదనలున్నాయి. బాలకృష్ణ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలు పూర్తిగా కాకపోయినా నట సార్వభౌమ ఎన్టీ రామారావు జీవితాన్ని కాస్తైనా కళ్ల ముందుంచే ప్రయత్నం చేశాయి. వీటికి దీటుగా రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. పెద్ద సినిమాల హవా... బాహుబలితో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ సుమారు రూ.300కోట్ల బడ్జెట్‌తో సాహో సినిమా చేసి సాహసమే చేశాడని చెప్పుకోవాలి. తెలుగు వాళ్లకు ఈ సినిమా పెద్దగా నచ్చకపోయినా మిగతా భాషల్లో బాగానే ఆదరించడంతో కలెక్షన్ల పరంగా హిట్టయింది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు ‘మహర్షి’ చిత్రంతో ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. ఎనర్జిటిక్ హీరో రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’, నాగచైతన్య ‘మజిలి’, నాని ‘జెర్సీ’, ‘గ్యాంగ్‌లీడర్’, వరుణ్‌తేజ్ ‘గద్దలకొండ గణేశ్’(వాల్మీకి) కలెక్షన్లు కురిపించాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ‘ఓ బేబీ’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మల్టీస్టారర్ మూవీకి తిరుగే ఉండదన్న విషయం ఈ ఏడాది మరోసారి రుజువైంది. విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్ ‘ఎఫ్ 2’ సినిమాతో 2019 సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అదే విధంగా అదుర్స్ అనేలా కలెక్షన్లు రాబడుతున్న వెంకీ, నాగచైతన్యల ‘వెంకీమామ’ ఈ ఏడాదికి గుడ్‌బై చెబుతోంది. -
‘చిత్రం’గా చతికిలపడ్డాయి..
సినిమాకోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడట్లేదు నేటితరం నిర్మాతలు. కానీ కొన్ని సినిమాలు అంతే భారీమొత్తంలో నష్టాలను తీసుకుచ్చి నిర్మాతలకు ఊహకందని విధంగా చేదు అనుభవాల్ని మిగిల్చాయి. ఈ ఏడాది కొంతమంది హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకోలేకపోయాయి. ఎంత ప్రచారం చేసినా, ఎంత హైప్ క్రియేట్ చేసినా ప్రేక్షకుల్ని థియేటర్‌కు రప్పించడంలో కొన్ని చిత్రాలు ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. అవేంటో చూద్దాం.. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన రూలర్ భారీ అంచనాలతో విడుదలైంది. దీనికోసం విపరీతమైన పబ్లిసిటీ కూడా చేశారు. కానీ విడుదలైన తొలినాడే ఈ సినిమా తేలిపోయింది. కానీ అభిమానులు మాత్రం ఈ సినిమాను ఎగబడి మరీ చూస్తున్నారనుకోండి అది వేరే విషయం. ఇక థియేటర్ దాకా వెళ్లిన ప్రేక్షకులకు అనవసరంగా వచ్చాం అన్న ఫీలింగ్ రాకమానదు. వెరసి ఈ సినిమా ఒక పాత చింతకాయ పచ్చడి. కలెక్షన్లు బాగున్నా ఫ్లాఫ్‌తో 2019కు బాలయ్య గుడ్‌బై చెప్పక తప్పలేదు. 17 ఏళ్ల క్రితం వచ్చిన మన్మథుడు ఎంత సూపర్ హిట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఆ సినిమాకు సీక్వెల్ కాకపోయినప్పటికీ అదే టైటిల్‌తో మన్మథుడు2 ద్వారా అభిమానులను పలకరించాడు. ఇప్పటికీ తను గ్రీకువీరుడినే అంటూ వచ్చిన మన్మథుడు 2 అట్టర్ ఫ్లాఫ్గా నిలిచింది. ఈ సినిమాతో నిర్మాతలు ఘోరంగా నష్టపోయారు. ఆయన కెరీర్లోనే పెద్ద ఫ్లాఫ్గా నిలిచిపోయింది. గతేడాది రంగస్థలం సినిమాతో టాలీవుడ్‌ను షేక్ చేసిన మెగా హీరో రామ్‌చరణ్ ఈ ఏడాది మాత్రం ఘోర ఓటమిని చవిచూశాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘వినయ విధేయ రామ’ బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. బలహీనమైన కథకు బోలెడు ఫైట్ సీన్లు జోడించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేదు. కొత్త దర్శకుడు భరత్ కమ్మ రౌడీతో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అంచనాలు ఘనం, ఫలితం శూన్యం అన్న మాదిరిగా తయారైంది ఈ సినిమా పరిస్థితి. వరుసగా అపజయాలను చవిచూస్తున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా ఆశాదీపంగా కనిపించినా చివరికి నిరాశనే మిగిల్చింది. ఆర్ఎక్స్100 సినిమాతో టాలీవుడ్‌ను తనవైపుకు తిప్పుకున్న హీరో కార్తికేయ. కానీ తర్వాత వచ్చిన అవకాశాలను వచ్చినంటూ ముందూ వెనకా చూసుకోకుండా చేసుకుంటూ పోయాడు. అదే అతనికి పెద్ద మైనస్‌గా మారింది. గుణ 369 దారుణంగా దెబ్బ తీసినా 90ఎమ్‌ఎల్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ ఏడాది హారర్ చిత్రాలు ఏమంత మెప్పించలేకపోయాయి. సుధీర్‌బాబు, నందిత కలిసి నటించిన కామెడీ హారర్ ఫిల్మ్ ‘ప్రేమకథా చిత్రం’ అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో సప్తగిరి కామెడీతో చెలరేగిపోయాడు. ఈ చిన్న సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. దీంతో హీరో సుమంత్ దానికి సీక్వెల్ ట్రై చేశాడు. కానీ రోత పుట్టించే కామెడీతో, నాసిరకమైన కథతో ప్రేక్షకులను నిరాశపరిచింది. విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ తర్వాత హీరోగానూ రాణించాడు. కానీ ఆయనకు హిట్ రావడమే గగనమైపోయింది. తాజాగా ఆయన నటించిన 26వ చిత్రం ‘చాణక్య’ కూడా బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. పాత కథను తిప్పి తిప్పి చూపించడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. గోపీచంద్ మాత్రమే ఫుల్ ఎఫర్ట్ పెట్టినట్టు కనిపించింది. మిగతావాళ్లందరూ పేలవ ప్రదర్శన కనబర్చారు. కనీసం పాటలు కూడా బాగోలేవు. అలా చాణక్య మరో ఫ్లాఫ్గా మిగిలిపోయింది. సందీప్ కిషన్‌కు ఈ ఏడాది కూడా అపజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. నిను వీడని నీడను నేనేతో మళ్లీ సక్సెస్‌బాట పట్టాడనుకునే లోపే తెనాలి రామకృష్ణతో డిజాస్టర్ బాట పట్టాడు. గతంలో కామెడీ సినిమాలతో మంచి విజయాలందుకుని.. ఆ తర్వాత ట్రాక్ తప్పిన దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డితో కలిసి ‘తెనాలి రామకృష్ణ ఎల్ఎల్బీ’తో పలకరించాడు. కానీ ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేకపోవడంతో ప్రేక్షకులు కనీసం ఈ సినిమా వంక చూడనైనా చూడలేదు. జబర్దస్త్ జోకులతో సినిమా నెట్టుకొద్దామనుకున్నా అక్కడక్కడా తప్పితే ఆ హాస్యం కూడా పెద్దగా పండలేదు. రాజుగరి గదితో మంచి హిట్ అందుకున్న దర్శక నిర్మాత ఓంకార్ రాజుగారి గది3తో నిరాశపర్చాడు. తన తమ్ముళ్లకు మంచి హిట్ ఇస్తానని భీష్మ ప్రతిజ్ఞ చేసిన ఓంకార్ రాజుగారి గది3 రూపొందించాడు. కానీ ఈ సినిమా రొటీన్ కామెడీ హారర్ చిత్రంగా పేరు ముద్రించుకోయింది. అలా రాజుగారి గది3 ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. -
యూటర్న్ క్రికెటర్లు..
2019లో పలువురు క్రికెటర్లు తమ నిర్ణయాలపై పునరాలోచనలో పడ్డారు. తాము తీసుకున్న నిర్ణయాలు సరైనవి కాదనే భావించి కొందరు ముందస్తు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే, మరికొంతమంది ఆవేశంతో క్రికెట్‌కు వీడ్కోలు చెప్పి ఆపై యూటర్న్ తీసుకున్నారు. ఇలా క్రికెట్లో కొనసాగాలా.. వద్దా అనే డైలామాలో ఉన్న విదేశీ క్రికెటర్లలో వెస్టిండీస్ క్రికెటర్లు క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవోలతో పాటు దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌లు ఉండగా, భారత్ నుంచి అంబటి రాయుడు ఉన్నాడు. ఇక అంపైర్లతో వాగ్వాదానికి దిగిన ఎంఎస్ ధోని, కోహ్లిలు కూడా ఈ ఏడాది హాట్ టాపిక్‌గా నిలిచారు. క్రిస్ గేల్ వన్డే వరల్డ్‌కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతానంటూ ఆ మెగా టోర్నీ ఆరంభానికి ముందే వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్ ప్రకటించాడు.దాంతో అంతా గేల్ రిటైర్మెంట్ ఉంటుందనే అనుకున్నారు. కానీ మనోడు ఝలక్ ఇచ్చాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌కు విశ్రాంతి ప్రకటించడం లేదంటూ మరొకసారి వెల్లడించాడు. అదే సమయంలో తాను టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. భారత్‌తో సిరీస్ తర్వాత తన రిటైర్మెంట్పై నిర్ణయాన్ని ప్రకటిస్తానని అన్నాడు. అటు తర్వాత మళ్లీ మరొకసారి మాట్లాడాడు. తనకు మరిన్ని సిరీస్‌లు ఆడితే ఫిట్‌నెస్‌పై స్పష్టత వస్తుందని, ఆ తర్వాతే వీడ్కోలు నిర్ణయాన్ని ఆలోచిస్తానన్నాడు. డ్వేన్ బ్రేవో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఏడాదికి పైగా దాటిన తర్వాత వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో యూటర్న్ తీసుకున్నాడు. తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించాడు. ప్రత్యేకంగా టీ20 సెలక్షన్స్‌కు తాను కూడా అందుబాటులో ఉంటానంటూ వెల్లడించాడు. గతంలో తమ బోర్డు పెద్దల వ్యవహారం సరిగా లేని కారణంగానే తాను అప్పుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాల్సి వచ్చింది. ఇప్పుడు పాలన మారడంతో మనసు మార్చుఉన్నానని అన్నాడు. విండీస్ క్రికెట్ బోర్డు పెద్దలపై తిరుగుబాటు చేస్తూ వచ్చిన బ్రేవో తన రిటైర్మెంట్ను 2018 అక్టోబర్‌లో ప్రకటించాడు. ఈ ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా విండీస్ రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో బ్రేవోను చేర్చారు. కాకపోతే బ్రేవోకు ఆడే అవకాశం రాలేదు. 2012, 2016ల్లో విండీస్ గెలిచిన టీ20 వరల్డ్‌కప్‌లో బ్రేవో సభ్యుడు. 2016 సెప్టెంబర్‌లో విండీస్ జెర్సీలో బ్రేవో చివరిసారి కనిపించాడు. ఏబీ డివిలియర్స్ రీఎంట్రీ! గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ రీఎంట్రీ కోసం కసరత్తులు ముమ్మరం అయ్యాయి. వన్డే వరల్డ్‌కప్‌లో తాను ఆడతానని సఫారీ క్రికెట్ బోర్డుకు విన్నవించినా చివరి నిమిషంలో తాము ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. అప్పుడు దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ కూడా ఏబీ రీఎంట్రీపై ఏమీ చేయలేకపోయాడు. కాగా, ప్రస్తుతం ఏబీ రీ ఎంట్రీ కోసం కసరత్తులు ముమ్మరం చేశారు. దక్షిణాఫ్రికా క్రికెట్ సంధి దశలో ఉన్న కారణంగా ఏబీ డివిలియర్స్‌ను తిరిగి జట్టులోకి తేవాలనే యత్నంలో ఉన్నారు డుప్లెసిస్‌తో పాటు ఆ జట్టు కొత్త కోచ్ మార్క్ బౌచర్‌లు. దాంతో డివిలియర్స్ రీఎంట్రీ షురూ అయ్యేలా కనబడుతోంది. తనకు ఇంకా అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని ఉందని ఏబీ మాటను దృష్టిలో పెట్టుకుని అతని కోసం ఎదురుచూస్తున్నారు. ఏ క్షణంలోనైనా ఏబీ తన అంతర్జాతీయ పునరాగమనంపై నిర్ణయాన్ని వెల్లడించవచ్చు. అంబటి రాయుడు పునరాగమనం.. వన్డే వరల్డ్‌కప్‌కు తనను స్టాండ్ బై ఆటగాడిగా ఎంపిక చేసినా పిలుపు రాలేదనే కోపంతో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన భారత క్రికెటర్ అంబటి రాయుడు. విజయ్ శంకర్‌ను నాలుగో స్థానానికి తీసుకున్నారు. దాంతో సహజంగానే అసంతృప్తి చెందిన రాయుడు ‘ప్రపంచ కప్ చూసేందుకు ఇప్పుడే 3డి అద్దాలు కొన్నాను’ అంటూ ట్వీట్ చేయడం వివాదం రేపింది. మున్ముందూ తనను ఎంపిక చేయకపోవచ్చని భావించిన రాయుడు మొత్తానికే గుడ్‌బై చెప్పేశాడు. గత రెండేళ్లుగా భారత వన్డే ప్రపంచకప్ జట్టు ప్రణాళికల్లో ఉండి కూడా ప్రపంచకప్ ఆడలేకపోవడంతో రాయుడు ఆకస్మికంగా రిటైర్మెంట్ను ప్రకటించాడు. మళ్లీ అతను మనసు మార్చుకొని బ్యాట్ పట్టేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా కూడా రాయుడు ఎంపికయ్యాడు. కాగా, కొన్ని దేశవాళీ మ్యాచ్‌ల తర్వాత హెచ్‌సీఏలో రాజ్యమేలుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను హైదరాబాద్ జట్టు నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దాంతో రాయుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఫీల్డ్ అంపైర్‌తో ధోని వాగ్వాదం ఈ సీజన్ ఐపీఎల్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని వ్యవహరించిన తీరు అప్పట్లో దుమారం రేపింది. నిబంధనలకు విరుద్ధంగా..డగౌట్ నుంచి మైదానంలోకి వచ్చి అంపైర్‌తో వాగ్వాదానికి దిగడం ధోని సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో వేలెత్తి చూపే తొలి సంఘటనగా మిగిలింది. అంపైర్ ముందుగా నోబాల్ ఇచ్చి ఆ తర్వాత కాదనడం ధోనికి కోపం తెప్పించింది. అది నోబా.. కాదా అనే విషయంలో స్పష్టత లేదు. చివరికి అంపైర్లు దాన్ని నోబ్ కాదని తేల్చారు. ఆ క్రమంలోనే స్టేడియంలోకి వెళ్లిన ధోని అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ఫలితంగా నిబంధనలను అతిక్రమించిన ధోనిపై మ్యాచ్ రుసుములో 50 శాతం జరిమానాగా విధించారు. వరల్డ్‌కప్‌లో కోహ్లి రెండుసార్లు ఆగ్రహం ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ను టీమిండియా చెమటోడ్చి గెలిచింది. పసికూనలనుకున్న అఫ్గానిస్తాన్ క్రికెటర్లు .. కట్టుదిట్టంగా ఆడి కోహ్లి సేనకు చుక్కలు చూపించారు. చివరికి బౌలర్ల సత్తాతో ఆపసోపాలు పడి భారతజట్టు గెలిచినా.. ప్రశంసలు మాత్రం అఫ్గాన్‌కే దక్కాయి. అయితే ఆ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అంపైర్లతో కెప్టెన్ కోహ్లి వాగ్వాదానికి దిగాడు. షమీ బౌలింగ్‌లో హజ్రతుల్లాహ్ జజాయి ప్యాడ్‌ను తాకుతూ బాల్ వెళ్లింది. ఎల్బీడబ్ల్యూ కోసం కోహ్లి సేన అప్పీల్ చేసింది. అంపైర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో షమీ, ధోనిలతో మాట్లాడిన కోహ్లి.. డీఆర్ఎస్ కోరుతూ.. అంపైర్ల దగ్గరకు వెళ్లాడు. వాళ్లతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగాడు. అటు తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం కోహ్లి.. ఫీల్డ్ అంపైర్లతో వాదానికి దిగాడు. ఒక ఎల్బీ విషయంలో థర్డ్ అంపైర్ బాల్ ట్రాకర్‌ను వినియోగించకపోవడాన్ని కోహ్లి ప్రశ్నించాడు. థర్డ్ అంపైర్ అలా ఎందుకు చేశాడంటూ ఫీల్డ్ అంపైర్లతో వాగ్వాదం చేశాడు. విండీస్‌తో తొలి వన్డేలో సైతం కోహ్లినే.. రవీంద్ర జడేజా రనౌట్ వివాదం కోహ్లికి ఆగ్రహం తెప్పించింది. జడేజా పరుగు తీసే క్రమంలో రోస్టన్ ఛేజ్ నాన్ స్టైకింగ్ ఎండ్‌లో వికెట్లను డైరక్ట్ త్రో గిరటేశాడు. అయితే దానిపై అంపైర్ ఔట్ ఇవ్వలేదు. ఆ సమయంలో జడేజా క్రీజ్‌లోకి వచ్చాడని భావించిన ఫీల్డ్ అంపైర్ షాన్ జార్జ్ అది నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే అది ఔట్‌గా రిప్లేలో తేలడంతో పొలార్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. దాంతో చేసేది లేక థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించాడు ఫీల్డ్ అంపైర్. దాంతో థర్డ్ అంపైర్ పలు కోణాల్లో చెక్ చేసి అది ఔట్‌గా నిర్దారించడంతో జడేజా పెవిలియన్ చేరాడు. ఇలా చేయడంపై కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేస్తూ డగౌట్‌లోకి వచ్చేసి బౌండరీ లైన్ వద్ద మ్యాచ్ అధికారితో వాదనకు దిగాడు. ఒకసారి నాటౌట్‌గా ఫీల్డ్ అంపైర్ ప్రకటించిన తర్వాత మళ్లీ థర్డ్ అంపైర్‌కు ఎలా రిఫర్ చేస్తారంటూ కోహ్లి వాదించాడు. -
విరాట్ కోహ్లి మోత.. రోహిత్ ఊచకోత
ఈ ఏడాది టెస్టు ఫార్మాట్లో ఓపెనర్ పాత్రలో అరంగేట్రం చేసిన టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ పలు రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో ఓపెనర్‌గా దిగిన వరుస రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీల మోత మోగించి ఓపెనర్‌గా అరంగేట్రం టెస్టులోనే వరుసగా రెండు సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించిన రికార్డును కూడా లిఖించాడు.దక్షిణాఫ్రికాపై ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో రెండుసార్లు 150కిపైగా పరుగులు సాధించిన తొలి ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఫలితంగా ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్(16) ఇక భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది. 2010-11 సీజన్లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో హర్భజన్ సింగ్ 14 సిక్సర్లు కొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించి ఆ ఫీట్ నమోదు చేసిన ఐదో భారత ఓపెనర్‌గా అరుదైన ఘనతకు నమోదు చేశాడు. విండీస్‌తో రెండో వన్డేలో శతకం సాధించడం ద్వారా రోహిత్ శర్మ ఒక రికార్డును నమోదు చేశాడు. ఈ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ రికార్డు సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. 22 ఏళ్లుగా శ్రీలంక ఓపెనర్ సనత్ జయసూర్య (1997లో 2387 పరుగులు) పేరిట ఉన్న ఈ రికార్డును రోహిత్ విండీస్‌పై మూడో మ్యాచ్‌లో అధిగమించాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది రోహిత్ మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి 2442 పరుగులు సాధించాడు. ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఈ ఏడాది 28 వన్డేలు ఆడి 1490 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఒక క్యాలెండర్ ఇయర్ అత్యధిక అంతర్జాతీయ సిక్సర్లు సాధించిన రికార్డును రోహిత్ తిరగరాశాడు. 2018లో అంతర్జాతీయంగా 74 సిక్సర్లు సాధించిన రోహిత్.. ఈ ఏడాది 78 సిక్సర్లు కొట్టాడు. ఆసీస్ రికార్డు బ్రేక్.. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా టీమిండియా కొత్త రికార్డును లిఖించింది. టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న ఆస్ట్రేలియాను వెనక్కినెట్టింది. స్వదేశీ వరుస టెస్టు సిరీస్ విజయాల్లో టీమిండియా అగ్రస్థానానికి ఎగబాకింది. సఫారీలతో టెస్టు సిరీస్‌ను సాధించిన తర్వాత భారత్‌కు ఇది వరుసగా 11వ స్వదేశీ టెస్టు సిరీస్ విజయం. ఈ క్రమంలోనే ఆసీస్ రికార్డును టీమిండియా బద్ధలు కొట్టింది. 1994-95 సీజన్ మొదలు కొని 2000-01 సీజన్ వరకూ ఆసీస్ తమ దేశంలో సాధించిన వరుస టెస్టు సిరీస్ విజయాలు సంఖ్య 10. ఆపై 2004-09 సీజన్ మధ్యలో ఆసీస్ మరోసారి 10 వరుస స్వదేశీ టెస్టు సిరీస్ విజయాలు సాధించింది. అయితే ఆసీస్ పేరిట ఉన్న రికార్డును టీమిండియా తాజాగా బ్రేక్ చేసింది. 2012-13 సీజన్ నుంచి ఇప్పటివరకూ భారత్ వరుసగా 11 స్వదేశీ టెస్టు సిరీస్ విజయాల్ని నమోదు చేసింది. ఫలితంగా సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. కాగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను కూడా క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా భారత్ వరుసగా 12వ స్వదేశీ టెస్టు సిరీస్ విజయాన్ని సాధించిందింది. కోహ్లినే టాప్ ఐసీసీ టెస్టు, వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాప్‌లో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లి 928 రేటింగ్ పాయింట్లతో టెస్టుల్లో అగ్రస్థానంలో ఉండగా, 895 పాయింట్లతో వన్డేల్లో ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి 2455 పరుగులు చేసి టాప్‌లో నిలిచాడు. ఫలితంగా వరుసగా నాల్గో ఏడాదిని కూడా టాప్‌లోనే ముగించాడు కోహ్లి. ఈ ఏడాది కోహ్లి సాధించిన సెంచరీలు ఏడు కాగా, అత్యధిక స్కోరు 254 నాటౌట్. ఇక భారత్‌లో జరిగిన తొలి పింక్ బాల్ టెస్టులోనే శతకం సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు కోహ్లి. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు గెల్చుకున్న క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లి (57 సార్లు) ప్రస్తుతం జాక్వస్ కలిస్‌తో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. సచిన్ (76 సార్లు), జయసూర్య (58 సార్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మయాంక్ డబుల్ మోత.. టెస్టు ఫార్మాట్లోకి అడుగుపెట్టిన ఏడాది వ్యవధిలోనే టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ జట్టులో ప్రత్యేక ముద్ర వేశాడు. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై డబుల్ సెంచరీలు సాధించి ఓపెనర్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. తాజాగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో కూడా తన కెరీర్ బెస్ట్ ర్యాంకను సాధించాడు. ఇటీవల విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో మయాంక్ 11వ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా మయాంక్ నిలవడమే కాకుండా, బంగ్లాదేశ్‌తో టెస్టులో 243 పరుగులు చేసి కెరీర్ బెస్ట్ స్కోరు సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన మయాంక్ అగర్వాల్.. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ద్విశతకం సాధించాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌లో ఓవరాల్‌గా 22 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ద్విశతకం చేశాడు. ఇది మయాంక్ దూకుడుకు నిదర్శనం. కుల్దీప్ డబుల్ హ్యాట్రిక్.. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. వెస్టిండీస్‌తో రెండో వన్డేలో హ్యాట్రిక్ సాధించడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో రెండుసార్లు హ్యాట్రిక్ సాధించిన తొలి భారత బౌలర్‌గా నయా రికార్డును లిఖించాడు. 2017లో కోల్‌కతాలో ఆసీస్‌తో జరిగిన వన్డేలో కుల్దీప్ హ్యాట్రిక్ సాధించగా, మరొకసారి హ్యాట్రిక్‌ను ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరఫున వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన వారిలో చేతన్ శర్మ(1987లో న్యూజిలాండ్‌పై), కపిల్ దేవ్(1991లో శ్రీలంకపై), మహ్మద్ షమీ(2019లో అఫ్గానిస్తాన్‌పై)లు ఉన్నారు. వీరంతా ఒకేసారి హ్యాట్రిక్‌లు సాధిస్తే, కుల్దీప్ యాదవ్ మాత్రం రెండుసార్లు హ్యాట్రిక్‌లు సాధించడం విశేషం. ఇలా ఒకటికంటే ఎక్కువ సార్లు హ్యాట్రిక్‌లు సాధించిన వారిలో మలింగా(3సార్లు) తొలి స్థానంలో ఉండగా, రెండు సందర్భాల్లో హ్యాట్రిక్‌లు సాధించిన వారిలో వసీం అక్రమ్, సక్లయిన్ ముస్తాక్, చమిందా వాస్, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ యాదవ్‌లు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. నాలుగో స్థానంలో భరోసా దొరికిందా? చాలాకాలంగా టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్లో నాలుగో స్థానం కోసం అన్వేషణ సాగుతూనే ఉంది. అయితే దీనికి శ్రేయస్ అయ్యర్ ద్వారా సమాధానం దొరికినట్టే కనబడుతోంది. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్.. ఆ తర్వాత చాలాకాలం స్థానం కోల్పోయాడు. ఆడపా దడపా అవకాశాలు తప్పితే టీమిండియా జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా చోటు సంపాదించుకోవడంలో విఫలం అయ్యాడు. కాగా, ఈ ఏడాది మాత్రం శ్రేయస్ అయ్యర్ నాల్గో స్థానంలో సరిపోతాననే సంకేతాలు ఇస్తున్నాడు. వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో అయ్యర్ నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి హాఫ్ సెంచరీలు సాధించాడు. ఒకవైపు నిలకడగా ఆడుతూనే అవసరమైన సందర్భాల్లో భారీ హిట్టింగ్‌కు దిగి స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు అయ్యర్. , -
టీమిండియా @ 360
ఈ ఏడాది టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగించింది. ప్రధానంగా టెస్టుల్లో సత్తాను చాటుతూ దూసుకుపోయింది. ఐసీసీ టెస్టు చాంపియన్‌లో భాగంగా ఈ ఏడాది(2019) పలు సిరీస్‌లను ఆడిన టీమిండియా ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోలేదు. అసలు ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి చవిచూడలేదు. టెస్టు చాంపియన్ కోసం ద్వైపాక్షిక సిరీస్‌లు ఖరారైన తర్వాత ఈ ఏడాది జూలై-ఆగస్టు నెలల్లో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. అక్కడ కరీబియన్లను క్లీన్‌స్వీప్ చేసింది. తొలుతు రెండు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్..ఆపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. అదే ఊపును రెండు టెస్టుల సిరీస్‌లో కూడా కొనసాగించింది. ఫలితంగా ఆ రెండు టెస్టుల్లో విజయం సాధించి 120 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఇది భారత్‌కు తొలి అడుగు. అటు తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో సఫారీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వని టీమిండియా..హ్యాట్రిక్ విజయాలతో దుమ్ములేపింది. తొలి టెస్టును 203 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. రెండో టెస్టులో ఇన్నింగ్స్ 137 పరుగులతో విజయం సాధించగా, మూడో టెస్టును ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇది మూడు టెస్టుల సిరీస్ కాబట్టి మ్యాచ్‌కు 40 పాయింట్లు చొప్పున భారత్ మరో 120 పాయింట్లను సాధించింది. అటు తర్వాత నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో భాగంగా మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-1 గెలవగా, రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ రెండు టెస్టులను కూడా భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది. ఇండోర్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో గెలవగా, కోల్‌కతాలో జరిగిన డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్టులో ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది రెండు టెస్టులో సిరీస్ కాబట్టి మ్యాచ్‌కు 60 పాయింట్ల చొప్పున 120 పాయింట్లను దక్కించుకుంది. దాంతో ఓవరాల్‌గా 360 పాయింట్లతో టీమిండియా టాప్‌లో కొనసాగుతోంది. టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా.. టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలోనూ ప్రథమ స్థానంలో ఉండటం మన పటిష్టమైన బలగానికి అద్దం పడుతోంది. ఐసీసీ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత స్థానంలో ఆసీస్ ఉంది. ఆస్ట్రేలియా ప్రస్తుతం 216 పాయింట్లతో ఉంది. ఇప్పటివరకూ ఆసీస్ 8 మ్యాచ్‌లు ఆడి ఐదు గెలుపొందగా, రెండింట ఓటమి పాలైంది. ఒకటి డ్రాగా ముగిసింది.ఆసీస్ తర్వాత స్థానంలో శ్రీలంక 80 పాయింట్లతో ఉంది. 60 పాయింట్లతో కివీస్ నాల్గో స్థానంలోనూ, 56 పాయింట్లతో ఇంగ్లండ్ ఐదో స్థానంలో ఉన్నాయి. టెస్టు చరిత్రలో తొలిసారి.. వరుసగా నాలుగు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాల్ని సాధించడం ద్వారా టీమిండియా నయా రికార్డును నెలకొల్పింది. టెస్టు చరిత్రలో వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌లో సాధించడం ఇదే తొలిసారి. దక్షిణాఫ్రికా చివరి రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాలు సాధించగా, బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టులను కూడా ఇన్నింగ్స్ తేడాతోనే భారత్ గెలుచుకుంది. ఫలితంగా వరుసగా నాలుగు మ్యాచ్‌లను ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన తొలి జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది. అదే సమయంలో ఆ ఘనత సాధించిన కెప్టెన్‌గా కూడా విరాట్ కోహ్లి రికార్డు నమోదు చేశాడు. -
వన్ అండ్ ఓన్లీ రో‘హిట్’
రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే వేదికపై ఐపీఎల్ ఫైనల్లో స్వల్ప స్కోరును నమోదు చేసి ఒక్క పరుగుతో చాంపియన్‌గా నిలిచిన రోహిత్ సేన.. 2019 ఐపీఎల్లో కూడా మళ్లీ అదే అద్భుతాన్ని చేసి చూపించింది. బ్యాటింగ్ వైఫల్యంతో 149 పరుగులకే పరిమితమై... చెత్త ఫీల్డింగ్, క్యాచ్‌లు, రనౌట్లు వదిలేసి కూడా చివరకు చిరకాల ప్రత్యర్థి చెన్నైపై పైచేయి సాధించగలిగింది. ఐపీఎల్ ఫైనల్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ తమ అద్భుత రికార్డును కొనసాగించింది. మూడో సారి కూడా ధోని సేనను చిత్తు చేసి ఐపీఎల్ –2019 విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా నాలుగోసారి టైటిల్ నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. హైదరాబాద్‌లో జరిగిన టైటిల్ ఫైట్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (41 నాటౌట్; 25 బంతుల్లో), డీకాక్(29; 17 బంతుల్లో)లు రాణించారు. ఆపై చెన్నై 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 148 పరుగులు చేసే ఓటమి పాలైంది. వాట్సన్(80; 59 బంతుల్లో) బ్యాట్ ఝుళిపించినా చెన్నైను విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. ధోని రనౌటే మలుపు.. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ ధోని కీలక సమయంలో రనౌట్ కావడం చెన్నై శిబిరాన్ని ఒక్కసారిగా ఆందోళనలో పడేసింది. హార్దిక్ బౌలింగ్‌లో వాట్సన్ ఫైన్‌లెగ్ వైపు ఆడగా సింగిల్ వచ్చింది. బంతిని ఆపి మలింగ విసిరిన త్రో నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌కు దూరంగా వెళుతుండటంతో ధోని రెండో పరుగు తీసే ప్రయత్నం చేశాడు. అయితే అనూహ్యంగా దూసుకొచ్చిన ఇషాన్ కిషన్ నేరుగా వికెట్లపైకి కొట్టాడు. బంతి స్టంప్స్‌కు తగిలే సమయంలో బ్యాట్ క్రీజ్ గీతపైనే ఉంది. నిజానికి ధోని తనే ఔట్‌గా భావించి ముందే నడవటం మొదలు పెట్టినా ఫీల్డ్ అంపైర్లు అతడిని ఆపారు. సుదీర్ఘ సమయం పాటు పదే పదే రీప్లేలు చూసిన అనంతరం చివరకు అంపైర్ నైజేల్ లాంజ్ ధోనిని ఔట్‌గా ప్రకటించాడు. ఈ వికెట్ మ్యాచ్‌ను మలుపు తిప్పిందని చెప్పవచ్చు. చివరి 5 ఓవర్లలో... ధోని వికెట్ పడ్డాక వాట్సన్‌తో పాటు పెద్దగా ఫామ్‌లో లేని బ్రేవో క్రీజ్‌లో ఉన్నాడు. 30 బంతుల్లో 62 పరుగులు చేయాల్సిన స్థితి చెన్నైకి కష్టంగానే కనిపిస్తోంది. అయితే 16వ ఓవర్లో మళ్లీ ఆట మారిపోయింది. మలింగ వేసిన ఈ ఓవర్లో బ్రేవో సిక్స్ బాదగా, వాట్సన్ 3 ఫోర్లు కొట్టాడు. దాంతో 20 పరుగులు వచ్చాయి. అప్పటి వరకు అద్భుత బౌలింగ్‌తో ప్రశంసలు అందుకున్న రాహుల్ చహర్... బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లో వాట్సన్ ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను వదిలేసి ప్రత్యర్థికి మరో అవకాశం కల్పించాడు. ఆ తర్వాత కృనాల్ పాండ్యా వేసిన 18వ ఓవర్లో వరుసగా 6, 6, 6 బాది వాట్సన్ చెలరేగిపోయాడు. దాంతో ఒక్కసారిగా మ్యాచ్ చెన్నై వైపు తిరిగింది. బ్రేవో (15) ఔటైనా, వాట్సన్ గెలిపించే స్థితిలో నిలిచాడు. అయితే చివరకు అదృష్టం సూపర్ కింగ్స్ మొహం చాటేసింది. వన్ అండ్ ఓన్లీ రో‘హిట్’.. ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిల్స్ విజయాల్లో పాలుపంచుకున్న ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ.. 2013, 2015, 2017, 2019లలో ముంబై జట్టుకు సారథ్యం వహించాడు. కాగా, 2009లో చాంపియన్ అయిన డెక్కన్ చార్జర్స్ జట్టులో రోహిత్ సభ్యుడిగా ఉన్నాడు. దాంతో ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్లలో సభ్యుడిగా ఏకైక క్రికెటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇక ముంబై నెగ్గిన నాలుగు ఐపీఎల్ ఫైనల్స్‌లోనూ ఆ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయడం ఇక్కడ విశేషం. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన నాలుగు ఐపీఎల్ ఫైనల్స్‌లోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలుపొందడం ఇక్కడ మరో విశేషం. ఈ సీజన్లో డేవిడ్ వార్నర్(692 పరుగులు-సన్‌రైజర్స్ హైదరాబాద్) ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. అత్యధిక వికెట్లు సాధించే బౌలర్‌కు ఇచ్చే పర్పుల్ క్యాప్ అవార్డు ఇమ్రాన్ తాహీర్(26 వికెట్లు-సీఎస్కే) దక్కించుకున్నాడు. పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ అవార్డు కీరోన్ పొలార్డ్‌కు దక్కింది. ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును శుబ్‌మన్ గిల్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) అందుకోగా, ఫెయిర్ ప్లే అవార్డును సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎగరేసుకుపోయింది. -
పరుగుల మెషీన్-మరి ‘మెగా’ఎప్పుడో?
కొన్నేళ్ల క్రితం అతడి మాటలో మాత్రమే దూకుడెక్కువ అన్న వాళ్లకు బ్యాట్‌తోనే బదులిచ్చాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. క్రీజులోకి వచ్చి ప్రత్యర్థులకు దడ పుట్టించాడు.. ఎంతలా అంటే ‘మనం తప్పు చేయడానికి వీల్లేదు జాగ్రత్త... క్రీజ్‌లో కోహ్లి ఉన్నాడు..! అని ప్రతి కెప్టెన్ అనేంతా.. ఒకప్పుడు సచిన్.. ఇప్పుడు కోహ్లి అని అందరూ చెప్పుకునేంతా.. మూడు పదుల వయసులోనే అన్ని ఫార్మాట్లలో ఈ తరం చూసిన అత్యుత్తమ నాయకుడుగా అవతరించాడు. మైదానంలో తిరుగులేని శక్తిగా, భారత క్రికెట్ ముఖచిత్రంగా ఎదిగాడు. ఈ పరుగుల మెషీన్. సమకాలీన క్రికెట్లో బ్యాట్స్‌మెన్ అంతా ఒకవైపు.. విరాట్ కోహ్లి ఒక్కడే ఒక వైపు అనే మొత్తం ప్రపంచ క్రికెట్ చూసేంతగా రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. ప్రపంచంలో అత్యంత వేగంగా పాతిక శతకాలు బాదిన రికార్డూ అతడిదే. వన్డేల్లో సచిన్(49) తర్వాత అత్యధిక శతకాలు సాధించిన రెండో ఆటగాడు కోహ్లినే(43) . ఇప్పటివరకూ అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు సాధించాడు కోహ్లి. టెస్టుల్లో కెప్టెన్‌గా తొలి మూడు ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టిన ఒకేఒక్కడు. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్. భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్ కోహ్లి. 2013లో జైపూర్‌లో ఆసీస్‌తో జరిగిన వన్డేలో కోహ్లి 52 బంతుల్లో 7 సిక్స్‌లు, 8 ఫోర్లు సాయంతో సెంచరీ సాధించి అజేయంగా నిలిచాడు. వన్డేల్లో వేగంగా వెయ్యి, నాలుగువేలు, ఐదు వేలు, ఆరు వేలు, ఏడు వేలు, ఎనిమిది, తొమ్మిది వేల పరుగుల మైలురాళ్లను దాటిన భారత ఆటగాడూ కోహ్లినే. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా ఒక రికార్డును కోహ్లి తన పేరిట లిఖించుకున్నాడు. బంగ్లాపై రెండో టెస్టులో విజయంతో కోహ్లి వరుసగా ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా వరుసగా అత్యధిక విజయాలు సాధించిన టీమిండియా కెప్టెన్‌గా రికార్డు సాధించాడు. ఈ క్రమంలోనే ఎంఎస్ ధోని కెప్టెన్‌గా వరుసగా సాధించిన ఆరు టెస్టు విజయాల రికార్డు సవరించబడింది. దాదాపు ఆరేళ్లుగా ఎంఎస్ ధోని పేరిట ఉన్న రికార్డు బద్ధలైంది. టెస్టు ఫార్మాట్లో కెప్టెన్‌గా ఐదు వేల పరుగుల్ని వేగవంతంగా పూర్తి చేసిన రికార్డును కోహ్లి సాధించాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో కోహ్లి ఈ ఫీట్ సాధించాడు.కెప్టెన్‌గా 86వ ఇన్నింగ్స్‌లో ఐదువేల పరుగుల్ని సాధించాడు. కెప్టెన్‌గా ఆసీస్ మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ 97 ఇన్నింగ్స్‌లతో ఉన్న రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. ఇలా వరుస పెట్టి రికార్డులు సాధిస్తున్న కోహ్లికి ఒకటి మాత్రం ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. అది ఐసీసీ నిర్వహించే ఒక మేజర్ ట్రోఫీ. ఇప్పటివరకూ కోహ్లి నేతృత్వంలో భారత్ జట్టు చాంపియన్స్ ట్రోఫీని కానీ, వన్డే వరల్డ్‌కప్ కానీ గెలవలేకపోయింది. 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్‌కు చేరినప్పటికీ దాన్ని అందుకోవడంలో విఫలమైంది. పాకిస్తాన్ 180 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లి 5 పరుగులు చేసి విఫలమయ్యాడు. ఇక 2019లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో కోహ్లి సారథ్యంలోని టీమిండియా లీగ్ దశలో టేబుల్ టాపర్‌గా నిలిచినా ఆ మెగా ట్రోఫీని సాధించలేకపోయింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ నాకౌట్ మ్యాచ్‌లో కోహ్లి 1 పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దాంతో కోహ్లి మెగా టోర్నీలను సాధించడమే కాదు.. వాటిలో విఫలం అవుతుడానే అపవాదు కూడా ఉంది. దీన్ని కోహ్లి చెరిపివేసుకోవాలంటే వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో కోహ్లి దాన్ని సాధిస్తాడని భారత అభిమానులు ఆశగా ఉన్నారు. -
‘ఢీ’ఆర్ఎస్.. ‘వంద’లో సున్నా!
స్వదేశంలో ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఆసీస్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌లో వైట్‌వాస్ అయిన టీమిండియా.. ఐదు వన్డేల సిరీస్‌లో 3-2 తేడాతో ఓటమి చెందింది. తమ దేశంలో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో భారత పర్యటనకు వచ్చిన ఆసీస్ దాన్ని సాధించింది. ముందుగా జరిగిన రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది.కేఎల్ రాహుల్(50) హాఫ్ సెంచరీ సాధించగా, కోహ్లి(24), ఎంఎస్ ధోని(29 నాటౌట్)లు మోస్తరుగా ఆడారు. అనంతరం ఆసీస్ చివరి బంతికి విజయం సాధించింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్(56) అర్థ శతకం సాధించగా, డీఆర్సీ షార్ట్(37) కూడా ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక రెండో టీ20లో కూడా భారత్‌కు పరాభవం తప్పలేదు. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 190 పరుగులు చేసింది. కోహ్లి(72), రాహుల్ (47), ఎంఎస్ ధోని (40)లు రాణించారు. అనంతరం ఆసీస్ ఇంకా రెండు బంతులు ఉండగానే విజయం సాధించింది. మ్యాక్స్‌వెల్(113) సెంచరీతో కదం తొక్కగా, డీఆర్సీ షార్ట్(40) రాణించాడు. తొలి భారత క్రికెటర్‌గా ధోని.. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో ధోని మూడు సిక్సర్లు బాదాడు. దాంతో 352వ సిక్సర్‌ను ధోని సాధించాడు. ఈ క్రమంలోనే 350 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా ధోని గుర్తింపు సాధించాడు. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో 50 సిక్సర్ల మార్కును ధోని చేరాడు. అప్పటికి రోహిత్ శర్మ 349 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో క్రిస్ గేల్(534 సిక్సర్లు) అగ్రస్థానంలో ఉండగ, షాహిద్ ఆఫ్రిది (476 సిక్సర్లు) రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ(409) మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకూ అంతర్జాతీయ క్రికెట్లో ధోని కొట్టిన సిక్సర్లు 359. ‘వంద’లో సున్నా..! తొలి వన్డేలోఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్ మూడు బంతులు ఆడిన ఫించ్ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు.ఇది ఫించ్‌కు వందో వన్డే. ఈ మ్యాచ్‌లో ఫించ్ డకౌట్‌గా నిష్క్రమించడంతో ఆసీస్ తరఫున ఇలా వందో మ్యాచ్‌లో సున్నాకే ఔటైన మూడో ఆటగాడిగా నిలిచాడు. అంతకముందు డీన్ జోన్స్, క్రెయిగ్ మెక్‌డెర్మట్‌లు వందో వన్డేలో డకౌట్‌గా ఔటైన ఆసీస్ క్రికెటర్లు. వారి సరసర ఫించ్ చేరాడు. మరో ‘సెంచరీ’ కొట్టేశారు..! ఆస్ట్రేలియాతో నాల్గో వన్డేలో రోహిత్-ధావన్‌ల జంట సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. దాంతో వన్డే ఫార్మాట్లో 15వ సారి సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించినట్లయ్యింది. అదే సమయంలో వన్డేల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాల నమోదు చేసిన ఓపెనింగ్ జోడిల్లో గ్రీనిడ్జ్-డెస్మండ్ హేన్స్ సరసన రోహిత్-ధావన్‌ల జంట నిలిచింది. వన్డేల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాల నమోదు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ(21 సెంచరీ భాగస్వామ్యాలు) తొలిస్థానంలో ఉంది.ప్రస్తుతం రోహిత్-ధావన్‌ల జోడి మరో ఘనత టీమిండియా తరఫున వన్డేల్లో ఓవరాల్‌గా అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జాబితాలో రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌ల జోడి రెండో స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియాతో నాల్గో వన్డేలో ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్-ధావన్‌ల జంట.. సచిన్ టెండూల్కర్- సౌరవ్ గంగూలీల జోడి తర్వాత స్థానాన్ని ఆక్రమించింది. రెండో స్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్-వీరేంద్ర సెహ్వాగ్(4,387 పరుగులు) జోడిని వెనక్కినెట్టింది. డీఆర్ఎస్ వివాదాలు.. ఆసీస్‌తో రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో హాక్ఐ టెక్నాలజీ పని చేసే తీరు వివాదాస్పదంగా మారింది. కుల్దీప్ బౌలింగ్‌లో ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ ఎల్బీగా ఔటయ్యాడు. దానిపై డీఆర్ఎస్కు వెళ్లిన ఫించ్‌కు వ్యతిరేక నిర్ణయమే వచ్చింది. కుల్దీప్ వేసిన ఆ బంతిని ట్రాక్ చేయడానికి ఉపయోగించిన హాక్ఐ టెక్నాలజీ చర్చనీయాంశమైంది. ఆ బంతి పిచ్ అయ్యే క్రమంలో మిడిల్ స్టంప్ నుంచి మిడిల్ వికెట్‌ను గిరాటేస్తుండగా, బాల్ ట్రాకింగ్ టెక్నాలజీలో మాత్రం అది లెగ్ స్టంప్‌లో పడి మిడిల్ స్టంప్‌కు వెళుతున్నట్లు కనిపించింది. దాంతో డీఆర్ఎస్లో ఇంకా లోపాలు ఉన్నట్లు మరోసారి స్పష్టమైంది. అంతకుముందు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో సైతం ఇదే తరహా వివాదం నెలకొంది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో కృనాల్ పాండ్య బౌలింగ్‌లో మిచెల్ ఎల్బీగా వెనుదిరిగిన తీరు అనేక సందేహాలకు చోటిచ్చింది. బ్యాట్‌ను బంతి దాటే సమయంలో ఎటువంటి స్పైక్ కనిపించలేదు. దాంతో బాల్ ట్రాకింగ్ ఆధారంగా థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు. -
షమీ ‘సెంచరీ’.. రెండో క్రికెటర్‌గా కోహ్లి
ఈ ఏడాది జనవరిలో ఆసీస్ పర్యటన ముగిసిన తర్వాత నేరుగా న్యూజిలాండ్‌కు పయనమైంది టీమిండియా. తొలుత జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 4-1తో సాధించిన టీమిండియా.. టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కివీస్‌కు కోల్పోయింది. జనవరి 23వ తేదీన కివీస్‌తో ఆరంభమైన వన్డే సిరీస్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది.తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో(డక్‌వర్త్ లూయిస్) పద్ధతిలో టీమిండియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 38 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు, మహ్మద్ షమీలు మూడు వికెట్లు సాధించి కివీస్ పతనాన్ని శాసించారు.అనంతరం టీమిండియా 34.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేధించింది. ధావన్ అజేయంగా 75 పరుగులు, కోహ్లి 45 పరుగులు చేసిన విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక రెండో వన్డేలో భారత జట్టు 324 పరుగులు చేసి 90 పరుగుల తేడాతో గెలుపును అందకుంది. రోహిత్ శర్మ(87), ధావన్(66), కోహ్లి( 43), అంబటి రాయుడు(47), ఎంఎస్ ధోని(48 నాటౌట్)లు భారత్ భారీ విజయానికి బాటలువేశారు.మూడో వన్డేలో కివీస్ ముందుగా బ్యాటింగ్ చేసి 243 పరుగులు చేసింది. రాస్ టేలర్ 93 పరుగులతో ఆకట్టుకున్నాడు. భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ 62 పరుగులు, కోహ్లి 60 పరుగులు, అంబటి రాయుడు 40 నాటౌట్, దినేశ్ కార్తీక్ 38 నాటౌట్లు భారత్ ఘన విజయంలో సహకరించారు. ఈ సిరీస్‌కు సంబంధించి వివరాలను మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. ఏడో అత్యల్ప స్కోరు.. వరుసగా మూడు వన్డేలు గెలిచి సిరీస్‌ను ముందుగానే కైవసం చేసుకున్న టీమిండియా.. నాల్గో వన్డేలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. ముందుగా బ్యాటింగ్ చేసి 30. 5 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటైంది. తద్వారా వన్డేల్లో ఏడో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి విశ్రాంతి ఇవ్వగా, రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. ధావన్(13), హార్దిక్ పాండ్యా(16), కుల్దీప్ యాదవ్(15), చహల్(18)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటారు. ట్రెంట్ బౌల్ట్ ఐదు వికెట్లతో భారత్‌ను గట్టి దెబ్బకొట్టాడు. అతనికి జతగా గ్రాండ్ హోమ్ మూడు వికెట్లు సాధించాడు. మహ్మద్ షమీ ‘సెంచరీ’ ఐదువన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో షమీ వికెట్ల సెంచరీ సాధించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌ను షమీ గట్టి దెబ్బతీశాడు. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్(5), కొలిన్ మున్రో(8)లను వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చి షమీ 100 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. తద్వార అంతర్జాతీయ వన్డేల్లో అతి వేగంగా 100 వికెట్లు సాధించిన తొలి భారత పేసర్‌గా నిలిచాడు. 56 వన్డేల్లో ఈ ఘనతను అందుకొని ఇర్ఫాన్ పఠాన్ (59 వన్డేలు ) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. రెండో క్రికెటర్‌గా కోహ్లి.. భారత్-న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన వన్డేల పరంగా చూస్తే అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. రెండో వన్డేలో కోహ్లీ ఈ ఫీట్‌ను సాధించాడు. ఇరు జట్ల మధ్య జరిగిన ఓవరాల్ వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. న్యూజిలాండ్‌పై వన్డేల్లో కోహ్లి సాధించిన పరుగులు 1242. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ మాజీ ఆటగాడు నాధన్ ఆస్టల్(1207) రికార్డును కోహ్లి సవరించాడు. కాగా, ఇక్కడ సచిన్ టెండూల్కర్(1750) తొలి స్థానంలో ఉండగా, వీరేంద్ర సెహ్వాగ్(1157) నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు. నాల్గో ఓపెనింగ్ జోడిగా రోహిత్-ధావన్‌లు న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌లు అరుదైన రికార్డును నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(87), శిఖర్ ధావన్ (66) జోడీ తొలి వికెట్‌కి 154 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఫలితంగా వన్డే చరిత్రలో అత్యధిక సెంచరీల భాగస్వామ్యం నెలకొల్పిన నాలుగో ఓపెనింగ్ జోడీగా నిలిచారు. వన్డే ఫార్మాట్లో ధావన్-రోహిత్‌లకు ఇది 14వ సెంచరీ భాగస్వామ్యంగా నమోదైంది. ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్-వీరేంద్ర సెహ్వాగ్ జోడి నెలకొల్పిన రికార్డును రోహిత్-ధావన్‌ల జంట బ్రేక్ చేసింది. వన్డేల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఓపెనింగ్ జోడీలను పరిశీలిస్తే.. సచిన్ టెండూల్కర్- సౌరవ్ గంగూలీల జంట 21 సెంచరీల భాగస్వామ్యం తొలిస్థానంలో ఉండగా, ఆడమ్ గిల్‌క్రిస్ట్- మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా)ల జోడి 16 సెంచరీల భాగస్వామ్యంతో రెండో స్థానంలో ఉంది. ఇక గార్డెన్-హెన్స్(వెస్టిండీస్) జోడి 15 సెంచరీలతో మూడో స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాన్ని ధావన్-రోహిత్‌ల జోడి ఆక్రమించింది. -
ధోని @ 10వేలు.. చహల్ కొత్త రికార్డు!
గతేడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా తన సత్తాను చాటింది. మూడు టీ20ల సిరీస్‌లో ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి సిరీస్‌లో సమంగా నిలిచాయి. ఇక డిసెంబర్లో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను కోహ్లి నేతృత్వంలోని టీమిండియా 2-1తో గెలిచి ఆసీస్‌కు షాకిచ్చింది. ఆస్ట్రేలియా తొలిసారి టెస్ట్ సిరీస్ గెలవడం కోహ్లి అండ్ గ్యాంగ్ సరికొత్త ఉత్సాహంతో వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. అదే ఊపును మూడు వన్డేల సిరీస్‌లో కూడా టీమిండియా కొనసాగించింది. ఈ ఏడాది(2019)జనవరి నెలలో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచి ఆసీస్‌పై ఓవరాల్‌గా పైచేయి సాధించింది. తొలి వన్డేలో ఆసీస్ గెలిచినప్పటికీ, మిగతా రెండు వన్డేల్లో టీమిండియానే విజయం నమోదు చేసి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. ఈ వన్డే సిరీస్‌లో కోహ్లి, ధోనిలు రాణించడంతో భారత్ సిరీస్‌ను సునాయాసంగా చేజిక్కించుకుంది. వన్డే సిరీస్‌కు సంబంధించిన విశేషాలను మరొకసారి రిపీట్ చేసుకుందాం.. ధోని @ 10వేలు టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ విజయం సాధించినప్పటికీ, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్ తరపున అంతర్జాతీయ వన్డేల్లో పదివేల పరుగుల మార్కును ధోని చేరాడు. ఫలితంగా ఈ ఘనత సాధించిన ఐదో భారత క్రికెటర్‌గా ధోని గుర్తింపు పొందాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ధోని ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు 9,999 పరుగులతో ఉన్న ధోని.. పరుగు సాధించడంతో టీమిండియా తరఫున పదివేల పరుగుల మార్కును చేరుకున్నాడు. నిజానికి గతేడాదే ధోని 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 2007లో ఆఫ్రికా ఎలెవన్, ఆసియా ఎలెవన్ మధ్య జరిగిన ఆ టోర్నీలో మూడు వన్డేలాడిన ధోని 174 పరుగులు చేశాడు. దాంతో భారత్ తరఫున వన్డేల్లో పదివేల పరుగును మార్కును చేరుకోవడానికి ఆసీస్‌తో సిరీస్ వేదికైంది. తొలి వన్డేలో ఆసీస్ 289 పరుగుల్ని నిర్దేశించగా, భారత్ 254 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ధోని 51 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 133 పరుగులు చేసినప్పటికీ కోహ్లి, అంబటి రాయుడులు విఫలం కావడంతో భారత్ ఓటమి పాలైంది. రోహిత్ సెంచరీల రికార్డు ఆసీస్‌తో సిరీస్ తొలి వన్డే ద్వారానే టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సైతం ఒక మైలురాయిని నెలకొల్పాడు. ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. ఇది ఆసీస్‌పై వన్డేల్లో రోహిత్‌కు 7వ సెంచరీ కాగా, ఓవరాల్‌గా 22వ వన్డే శతకం. రోహిత్ కంటే ముందు ఆసీస్‌పై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ తొలి స్థానంలో ఉన్నాడు. ఆసీస్‌పై సచిన్ 9వన్డే సెంచరీలు సాధించాడు. ధోని ‘హ్యాట్రిక్’ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. తొలి వన్డేలో 51 పరుగులు చేసిన ఈ సీనియర్ వికెట్ కీపర్.. రెండో వన్డేలో 55 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. మెల్బోర్న్ వేదికగా సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ధోని 87 పరుగులు సాధించాడు. ఫలితంగా టీమిండియా వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. విజయ్ వన్డే అరేంగేట్రం.. చహల్ కొత్త రికార్డు ఈ సిరీస్ ద్వారా భారత్ ఆల్ రౌండర్ విజయ శంకర్ తెరపైకి వచ్చాడు. మెల్బోర్న్లో జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్‌లో విజయ్ శంకర్‌కు అవకాశం దక్కింది. దాంతో వన్డేల్లో విజయ్ శంకర్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో విజయ్ శంకర్‌కు బ్యాటింగ్‌కు చేసే అవకాశం రాలేదు. ఇక బౌలింగ్‌లో ఆరు ఓవర్లు పాటెఉ బౌలింగ్ వేసి 23 పరుగులు ఇచ్చాడు. కాగా, భారత్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ ఆరు వికెట్లు సాధించి ఆసీస్ నడ్డి విరిచాడు. ఈ క్రమంలోనే రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియా గడ్డపై 6 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. అదే సమయంలో అప్పటివరకూ టీమిండియా కోచ్ రవిశాస్త్రి పేరిట ఉన్న ఐదు వికెట్ల ఘనతను సైతం చహల్ సవరించాడు. పాండ్యా, రాహుల్‌లపై వేటు అంతర్జాతీయ క్రికెటర్లమనే సోయి మరిచిన హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఓ టీవీ షోలో మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలతో సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్నారు. విమర్శలే కాదు.. కెప్టెన్ కోహ్లి, బీసీసీఐ అధికారుల ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఈ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈ యువ ఆటగాళ్లపై బీసీసీఐ సస్పెన్షన్ వేటు వేసింది. దాంతో ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షోలో పాండ్యా, రాహుల్ ఇద్దరు అశ్లీల రీతిలో మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. -
ఈ ఏడాది వైరల్ అయింది వీళ్లే..
చూస్తుండగానే 2019 ముగిసిపోయింది. ఈ యేడు వైరల్ న్యూస్‌లు బాగానే క్లిక్ అయ్యాయి. పైగా అందులో మన తెలుగు వాళ్లు కూడా ఉండటం విశేషం. మొత్తంగా సోషల్ మీడియాలో వెలుగు వెలిగిన ఎనిమిది మంది గురించి తెలుసుకుందాం. 1. ఏడాది ప్రారంభంలో వచ్చిన ఈ వీడియోను చూసిన వారు నవ్వకుండా ఉండలేరు. అలా అని అక్కడేదో కామెడీ స్కిట్ చేయలేదు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిపిన్ సాహూ పారాగ్లైడింగ్ విన్యాసానికి పూనుకున్నాడు. అంతా సిద్ధం చేసుకుని గాల్లోకి ఎగిరాక ‘ఓరి దేవుడో, చచ్చిపోతాను బాబోయ్ దింపేయండి, నావల్ల కాదు’ అంటూ కాళ్లు పట్టుకున్నంత పని చేశాడు. ‘కావాలంటే డబ్బులు ఇస్తా, నన్ను కిందికి దింపేయండ్రా’ అని గగ్గోలు పెట్టాడు. విన్యాసం పూర్తి చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అతని భయాన్ని చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. 2. వైభవ్ వోరా జూలైలో చేసిన టిక్‌టాక్ వీడియోతో ఒక్కరోజులోనే స్టార్‌గా మారిపోయాడు. ఓ కంపెనీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం బ్యాగ్ కోసం ప్రచారం చేశాడు. కాలేజ్‌లో అందరినీ ఆకర్షించాలంటే మీరు ఈ బ్యాగ్ ధరించండి అంటూ మాటలతో ఆకట్టుకున్నాడు. బ్యాగ్ గురించి అతను ధారాళంగా చెప్పుకుపోవడమే కాక మెచ్యూర్ బ్యాగ్, స్పోర్ట్ బ్యాగ్‌లు వాడి అందరినీ ఇట్టే ఆకర్షించవచ్చు అని పేర్కొన్న ఈ వీడియోతో పాపులర్ అయిపోయాడు. 3. టిక్‌టాక్‌లో వచ్చే వీడియోలకు కొదవే ఉండదు. పాటలు, డ్యాన్సులు, క్రియేటివ్, జోకులు, కథలు చెప్పడం, కొత్త ఐడియాలు, వెర్రిపనులు ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. అయితే భోజన ప్రియులు మాత్రం తమకు నచ్చిన వంటకాలను తింటూ వాటిని వీడియో చిత్రీకరించి టిక్‌టాక్‌లో పోస్ట్ చేస్తుంటారు. అందరికీ నోరూరించే ఈ వీడియోలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు కొంతమంది జనాలు. అలా ఉల్హస్ కమతే అనే వ్యక్తి భోజనం చేస్తూ మధ్యలో చికెన్ లెగ్ పీస్‌ను ఒక్క గుటకలో తినేస్తాడు. దీన్ని చూసి ఆశ్చర్యపోయిన జనం ఆ వీడియోకు విశేషంగా ఆకర్షితులయ్యారు. అతని వీడియో పక్కన ఎన్నో డ్యూయెట్లు చేశారు కూడా! 4. జవాద్ బెందావుడ్. కోర్టు నుంచి సీరియస్‌గా బయటకు నడుచుకుంటూ వచ్చాడు. అతని కళ్లలో కోపం ఇట్టే తెలిసిపోతుంది. ఈ వీడియోలో పెద్ద విశేషమేమీ లేకపోయినా అతనికి గుర్తింపును తెచ్చిపెట్టింది. 2015 పారిస్ దాడుల్లో భాగమైన ఇద్దరు నిందితులకు జవాద్ తన ఇంట్లో ఆవాసం కల్పించాడు. దీంతో జవాద్ జైలుకు వెళ్లిరాక తప్పలేదు. 5. ఇండియా- పాకిస్తాన్ వరల్డ్‌కప్ సందర్భంగా పాక్ అభిమాని వార్తల్లో నిలిచాడు. పాక్ క్రికెటర్లు షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్ మ్యాచ్‌లపై విరుచుకుపడ్డాడు. వాళ్లు మ్యాచ్‌కు ముందురోజు బర్గర్, పిజ్జాలు తినడం వల్లే పాక్ ఓటమిపాలైందని విమర్శించాడు. ఇంకా అతనేమన్నాడో మీరే చూడండి. 6. ఫన్ బకెట్‌తో ఫేమస్ అయిన భార్గవ్, నిత్య ఇప్పటికీ తమదైన హాస్యంతో ఉనికిని చాటుకుంటున్నారు. వారి కామెడీకి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటారు. టిక్‌టాక్ పుణ్యమాని వీళ్లిద్దరూ ఈ యేడు సెన్సేషనల్ అయ్యారు. వీళ్ల వీడియోలు చూస్తే ‘ఓ మై గాడ్’ అనకుండా ఉండలేరు. 7. పాకిస్తాన్‌కు చెందిన రోజి ఖాన్ అనే వ్యక్తి కొత్తగా ఏమీ చేయలేదు. అయినా జనాలు అతని దగ్గరకు క్యూ కడతారు. ఎందుకంటే అతను ప్రముఖ అమెరికన్ నటుడు పీటర్ డింక్లేజ్ పోలికలతో ఉన్నాడు. ఈ పోలికే అతన్ని పాపులర్ చేసి పెట్టింది. చాలామంది అతని అసలు పేరు వదిలేసి పీటర్‌కు ప్రముఖ పాత్ర ‘టైరిన్ లాన్నిస్టర్’ పేరుతో పిలవడం మొదలుపెట్టారు. ఆయన కనిపిస్తే సెల్ఫీలు కావాలని వెంటపడేవారు కూడా! 8. మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. టిక్‌టాక్ వచ్చిన తర్వాత దాదాపు ప్రతి ఒక్కరూ దీన్ని నమ్మక తప్పటంలేదు. ఎందరో హీరోహీరోయిన్లకు డూప్‌లు పుట్టుకొచ్చారు. ఆ తర్వాత జూనియర్ విరాట్ కోహ్లి కూడా టిక్‌టాక్‌లో కనిపించాడు. 4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న గౌరవ్ అరోరా అనే వ్యక్తి విరాట్ కోహ్లి పోలికలతో ఉండటంతో అతని క్రేజ్అమాంతం పెరిగిపోయింది. ఈ ఏడాది అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన సోషల్‌మీడియా సెలబ్రిటీలు వీళ్లంతా. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో వీడియోలు, మరెంతమందో స్టార్లు నెట్టింట్లో మనకు తారసపడుతారు. -
ఈ సంవత్సరం వీరు మిస్సయ్యారు
2019 సిల్వర్ స్క్రీన్ కొంతమంది స్టార్స్‌ని మిస్ చేసింది. అభిమానులను నిరాశపరిచింది. ఒకప్పుడంటే ఏడాదికి ఏడెనిమిది సినిమాలు చేసేవాళ్లు. ఇప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి ఒకటి లేక రెండు. అంతే.. ఆ ఒక్క దర్శనం కోసం అభిమానులు ఎదురు చూపులు చూస్తుంటారు. కానీ ఈ ఏడాది కొందరు హీరోలు అసలు ఒక సినిమాలో కూడా కనిపించలేదు. మిస్ అయిన లిస్ట్‌లో హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే అభిమానులకు చిన్న ఊరట ఇస్తూ.. కొందరు ‘గెస్ట్’ రోల్స్‌లో కనిపించారు. కానీ రెండున్నర గంటలసేపు చూసినంత తృప్తి ఇలా వచ్చి అలా వెళ్లే అతిథి పాత్రలు చూసినప్పుడు దక్కదు కదా. మరి.. ఈ ఏడాది మిస్ అయిన ‘మిస్సింగ్ స్టార్స్’ ఎవరు? వచ్చే ఏడాదిని కూడా మిస్సవుతారా?.. తెలుసుకుందాం. రెండోసారి మిస్ తెలుగు సినిమా ప్రతిష్టను దేశవ్యాప్తంగా పెంచిన చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా రెండు భాగాలను తెరకెక్కించడానికి దర్శకుడు రాజమౌళికి ఐదేళ్ల సమయం పట్టింది. ఆ ఐదేళ్లలో రెండు సార్లు మాత్రమే ప్రభాస్ తెరపై కనిపించారు. అయితే ‘బాహుబలి’ వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో తమ హీరోను చూసిన తర్వాత ‘ఇలాంటి సినిమాకి ఇంత టైమ్ అవసరమే’ అనుకున్నారు ఫ్యాన్స్. రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎనీ్టఆర్, రామ్‌చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య నిరి్మస్తున్న చిత్రం ఇది. 1920 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ పీరియాడికల్ చిత్రానికి కాస్త సమయం పడుతుంది. అలా ఈ ఏడాది తెరపై ఎనీ్టఆర్‌ను చూసుకునే చాన్స్ ఆయన ఫ్యాన్స్‌కు లేకుండా పోయింది. 2009లో ఎనీ్టఆర్ ఒక్క సినిమాలోనూ కనిపించలేదు. మళ్లీ మిస్సయిన ఇయర్ ఇదే. గత ఏడాది దసరాకి ‘అరవింద సమేత వీరరాఘవ’లో కనిపించిన తర్వాత సెప్టెంబర్ నుంచి ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో పాల్గొంటున్నారు ఎన్టీఆర్. ఈ చిత్రం వచ్చే జూలై 30న రిలీజ్ కానుంది. గ్యాప్ ఇవ్వలా.. వచ్చింది ‘ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్..’ అని మురళీ శర్మ అంటే, ‘ఇవ్వలా.. వచి్చంది’ అని అల్లు అర్జున్ బదులు చెబుతారు. ఇది అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘అల..వైకుంఠపురములో’ టీజర్‌లోని సీన్. ఈ డైలాగ్ మాదిరిగానే ఈ ఏడాది వెండితెరకు అల్లు అర్జున్ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. 2018లో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో నటించిన అల్లు అర్జున్ కథల ఎంపికకు ఎక్కువ టైమ్ తీసుకున్నారు. అయితే వరుసగా మూడు సినిమాలను ప్రకటించి రన్నింగ్ ట్రాక్‌లోనే ఉన్నానని చెప్పకనే చెప్పారు. ‘అల..వైకుంఠపురములో’ జనవరి 12న రిలీజ్ కానుంది. నెక్ట్స్ సుకుమార్ దర్శకత్వంలో హీరోగా, ఆ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమాలు చేయబోతున్నారు. అనుకోని గాయం.. చేసింది దూరం అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘భీష్మ’గా నితిన్ ఈ ఏడాది వెండితెరపై సందడి చేయాల్సింది. కానీ నితిన్ గాయపడటం వల్ల వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా చిత్రీకరణ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఈ సినిమా విడుదల వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా పడింది. ఇలా అనుకోని గాయం నితిన్‌ను హీరోగా ఈ ఏడాది వెండితెరకు దూరం చేసింది. కానీ వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణే’లో అతిథిగా నితిన్ కనిపించారు. చంద్రశేఖర్ ఏలేటి, వెంకీ అట్లూరి (‘రంగ్ దే’ టైటిల్), కృష్ణచైతన్య దర్శకత్వాల్లో నితిన్ తర్వాతి చిత్రాలు తెరకెక్కనున్నాయి. రానా... రాలేదు ‘అరణ్య’, ‘1945’, ‘భుజ్: దిఫ్రైడ్ ఆఫ్ ఇండియా’ సినిమాల చిత్రీకరణలతో ఈ ఏడాది బిజీ బిజీగా గడిపారు రానా. ఈ ఏడాది హీరోగా తెలుగు వెండితెరపైకి రాలేదు రానా. నిజానికి ‘అరణ్య’ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. అయితే ‘ఎన్టీఆర్: కథానాయకుడు’ సినిమాలో రానా కొద్దిసేపు కనిపించిన సంగతి తెలిసిందే. ‘హౌస్‌ఫుల్ 4’తో హిందీ తెరపైనా కనిపించారు. గుణశేఖర్ దర్శకత్వం వహించనున్న ‘హిరణ్యకశ్యప’, ప్రముఖ మల్లయోధుడు కోడి రామ్మూర్తి బయోపిక్ .. నటుడిగా రానా నెక్ట్స్ ప్రాజెక్ట్స్. శ్రీలంక ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్కు రానా ఓ నిర్మాత. ఇలా హీరోగా, నిర్మాతగా రానా వచ్చే ఏడాది హల్చల్ చేస్తారు. వితో వస్తాడు ప్రస్తుతం ‘వి’ సినిమాలో పోలీసాఫీసర్‌గా చేస్తున్న సుధీర్‌బాబు ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించలేదు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాని మరో హీరో. ‘వి’ చిత్రం వచ్చే ఏడాది మే 25న విడుదల కానుంది. ఇది కాకుండా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో పుల్లెల గోపీచంద్ బయోపిక్‌తో పాటు ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్న సినిమాల చిత్రీకరణల్లో పాల్గొంటారు సుదీర్.సినిమాల్లో గ్యాప్ అనేది సహజం. మహా మహా స్టార్లకు కూడా గ్యాప్‌లు వచి్చన సందర్భాలున్నాయి. సో.. ఈ ఏడాది తమ అభిమాన తారలను వెండితెరపై చూసుకోలేకపోయామని ప్రేక్షకులు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఏడాదిని మిస్సయినవారందరూ షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్నవారే. కాబట్టి వచ్చే ఏడాది వీరి సందడి కాస్త ఎక్కువగానే ఉండొచ్చని ఊహించవచ్చు. – ముసిమి శివాంజనేయులు ►గత ఏడాది కథానాయికగా ‘భాగమతి’లో కనిపించిన అనుష్క ఈ ఏడాది ‘నిశ్శబ్దం’ చిత్రంలో వెండితెరపై కనిపించాల్సింది. కానీ ఈ ఏడాది చివర్లో విడుదల కావాల్సిన ‘నిశ్శబ్దం’ వచ్చే ఏడాది జనవరికి వాయిదా పడింది. దీంతో చిరంజీవి ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో అనుష్క అతిథి పాత్రలో కనిపించారు కదా అని అనుష్క ఫ్యాన్స్ సరిపెట్టుకోవాల్సి వచి్చంది. ‘మహానటి’ కీర్తీ సురేష్ ఈ ఏడాది ‘మిస్ ఇండియా, గుడ్‌లుక్ సఖి’ అనే రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు తమిళంలో ‘పెంగ్విన్’, మలయాళంలో ‘అరేబియన్ కడలింటే సింగమ్’, హిందీలో ‘మైదాన్’ సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. రజనీకాంత్ 168వ సినిమాకి ఇటీవల సైన్ చేశారు. ఈ ఏడాది ‘మన్మథుడు 2’లో అతిథిగా కనిపించడం మినహా కీర్తీ వేరే సిరిమాల్లో కనిపించలేదు. అయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ వచ్చే ఏడాది విడుదలవుతాయి కాబట్టి 2020లో కీర్తీ పలు మార్లు దర్శనమిస్తారు. ఇక ‘ఎన్టీఆర్: కథానాయకుడు’లో అతిథిగా నటించి, హాలీవుడ్ మూవీ ‘ఫ్రోజెన్ 2’ తెలుగు వెర్షన్‌కు తన గొంతును వినిపించిన నిత్యామీనన్ హీరోయిన్గా ఈ ఏడాది తెలుగు తెరపై కనిపించలేదు. నిత్యా నటించిన ‘ప్రాణ’ ఈ ఏడాది తెలుగులో విడుదల కావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. ‘దేవుడు చేసిన మనుషులు’ (2012) చిత్రంలో హీరోయిన్గా నటించిన తర్వాత దాదాపు ఆరేళ్లు హిందీ చిత్రాలు చేస్తూ గత ఏడాది ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమాతో తెలుగు తెరపైకి కమ్ బ్యాక్ ఇచ్చారు ఇలియానా. ఆ తర్వాత మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. ‘కాటమ రాయుడు’ (2017) తర్వాత శ్రుతీహాసన్ తెలుగు తెరకు దాదాపు రెండేళ్లు దూరంగా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు రవితేజ ‘క్రాక్’ సినిమాతో టాలీవుడ్ ట్రాక్‌లోకి వచ్చారు శ్రుతీ. 2017లో ‘కేశవ’లో నటించిన రీతూ వర్మ. ఇటీవలే నాని ‘టక్ జగదీ’లో ఒక హీరోయిన్గా నటించే చాన్స్ దక్కించుకున్నారు. దాదాపు రెండేళ్లు వెండితెరకు దూరమయ్యారు మంచు మనోజ్. ఇటీవలే మనోజ్ ఎమ్ఎమ్ ఆర్ట్స్ అనే ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. మనోజ్ తర్వాతి చిత్రం ఈ నిర్మాణ సంస్థలోనే తెరకెక్కుతుందని ఊహించవచ్చు. మనోజ్ హీరోగా నటించిన ‘ఒక్కడు మిగిలాడు’ 2017లో విడుదలైంది. దాదాపు రెండేళ్లుగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని సాయిరామ్ శంకర్ ఇటీవలే తన కొత్త చిత్రం ‘రీసౌండ్’కు కొబ్బరికాయ కొట్టారు. 2018లో ‘అజ్ఞాతవాసి’ చిత్రం విడుదల తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ మూవీ కెమెరా ముందుకు రాలేదు. ప్రస్తుతానికి సినిమాలేవీ కమిట్ అయిన దాఖలాలు కూడా లేవు. అయితే హిందీ ‘పింక్’ తెలుగు రీమేక్‌లో నటించనున్నారని టాక్.