ఈ ఏడాది చోటుచేసుకున్న కీలకాంశాలు | REWIND 2019: SPECIAL STORY ON INDIABN MARKETS IN BUSSINESS | Sakshi
Sakshi News home page

షాక్‌..,జోష్‌.. ప్చ్‌!

Published Tue, Dec 31 2019 4:33 AM | Last Updated on Tue, Dec 31 2019 12:43 PM

REWIND 2019: SPECIAL STORY ON INDIABN MARKETS IN BUSSINESS - Sakshi

దేశ విదేశాల్లో కొంగొత్త ఆవిష్కరణలు... కార్పొరేట్‌ దిగ్గజాల అస్తమయం... దివాలా కోరల్లో చిక్కుకున్న కంపెనీలు...  కొత్త బాధ్యతలతో తళుకులు...  ఇలా ఆద్యంతం వ్యాపార రంగంలో ఊపిరిసలపని పరిణామాలతో పయనం సాగించిన 2019 మరికొద్ది గంటల్లో మనకు గుడ్‌బై చెప్పేస్తోంది. ఎన్నో మలుపులు.. మరెన్నో ఊహించని సంఘటనలను తన మదిలో నింపుకున్న సంవత్సరం ఇది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చోటుచేసుకున్న కీలకాంశాలను ఒక్కసారి అవలోకనం చేసుకునే ‘బిజినెస్‌ రివైండ్‌’ సాక్షి పాఠకులకు ప్రత్యేకం...

జనవరి...
► బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విజయ, దేనా బ్యాంక్‌ల విలీనానికి కేంద్రం ఓకే. దీనితో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ తర్వాత దేశంలోనే మూడవ అతిపెద్ద బ్యాంకుగా బీఓబీ అవతరించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండవ అతిపెద్ద బ్యాంకుగా నిలిచింది.  
► బంధన్‌ బ్యాంక్‌ చేతికి గృహ్‌ ఫైనాన్స్‌.  
► వీడియోకాన్‌ క్విడ్‌ప్రోకో వ్యవహారంలో చందా కొచర్‌పై సీబీఐ కేసు.

ఫిబ్రవరి
► ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ఆరోగ్యం బాగోలేకపోవడం తో, తాత్కాలిక బాధ్యతల్లో మధ్యంతర వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన పీయూష్‌ గోయెల్‌. ఆదాయాలపై రూ. 5 లక్షల వరకూ పన్ను రిబేట్‌ కీలక నిర్ణయం.

మార్చి
► ఎరిక్‌సన్‌కు ఇవ్వాల్సిన రూ.458.77 కోట్ల బకాయిలు చెల్లించకపోతే... జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఆర్‌కామ్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి ఫిబ్రవరి 20న సుప్రీంకోర్టు హెచ్చరిక. నెల గడువు. ఆదుకున్న అన్నయ్య ముకేశ్‌.  గడువుకు ఒకరోజు ముందు మార్చి 18న మొత్తం డబ్బు చెల్లించిన ఆర్‌ఐఎల్‌.

ఏప్రిల్‌
► ఇండియా బుల్స్‌ చేతికి లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌. షేర్‌ బదలాయింపు ద్వారా ఆర్థిక లావాదేవీ.  
► దాదాపు రూ.8,000 కోట్ల రుణ భారంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ క్రాష్‌ ల్యాండింగ్‌.   

మే
► జాగరణ్‌ ప్రకాశన్‌ చేతికి అనిల్‌ అంబానీ రేడియో బిగ్‌ఎఫ్‌ఎం. డీల్‌ విలువ రూ.1,050 కోట్లు. అడాగ్‌ కంపెనీల రుణ భారం తగ్గించుకునే ప్రయత్నం.

జూన్‌
► మూడేళ్ల పదవీకాలంలో ఆరు నెలల ముందుగానే వ్యక్తిగత అంశాలను కారణంగా చూపుతూ ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ డాక్టర్‌ విరాల్‌ ఆచార్య రాజీనామా. వ్యక్తిగత కారణాలే కారణంగా చూపుతూ ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజీనామా చేసిన ఉర్జిత్‌ పటేల్‌ తర్వాత, ఆర్‌బీఐ ఉన్నత పదవికి రాజీనామా చేసిన వ్యక్తిగా విరాల్‌ ఆచార్య.  

జూలై
► 2019–2020 ఆర్థిక సంవత్సరానికి రూ.27,86,349 కోట్ల పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌.
► బ్యాంకుల జాతీయీకరణకు  50 సంవత్సరాలు పూర్తి


ఆగస్టు
► హైదరాబాద్‌లో అమెజాన్‌ అతిపెద్ద క్యాంపస్‌ ప్రారంభం
► ప్రభుత్వ బ్యాంకుల మెగా విలీనానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం. మొత్తం 10 బ్యాంకులు 4 బ్యాంకులుగా కుదింపు.

సెప్టెంబర్‌
► దేశ వ్యాప్తంగా 1600 నగరాల్లో జియో హైస్పీడ్‌– ఫైబర్‌ నెట్‌ సేవలు ప్రారంభం.
► కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటును కంపెనీలకు 30 శాతం నుంచి 22 శాతానికి, కొన్ని కొత్త తయారీ సంస్థలకు 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన.   
► బ్రిటిష్‌ పర్యాటక సంస్థ.. 178 ఏళ్ల చరిత్ర ఉన్న థామస్‌ కుక్‌ దివాలా.

అక్టోబర్‌
► బ్యాంకింగ్‌ రుణ రేట్లు అన్నీ రెపో రేటుకు, ఇతర ఎక్న్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేట్లకు అనుసంధానం. ఆర్‌బీఐ రేట్ల కోత ప్రయోజనాన్ని బ్యాంకులు తక్షణం కస్టమర్‌కు బదలాయించేలా చూడటమే దీని లక్ష్యం.
 

నవంబర్‌
► తీవ్రమైన రుణ సంక్షోభంలో చిక్కుకున్న దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌)పై ఆర్‌బీఐ కొరడా. కంపెనీ డైరెక్టర్ల బోర్డు రద్దు. దివాలా చర్యలు షురూ.
 

డిసెంబర్‌  
► ఇన్సాల్వెన్సీ, దివాలా  కోడ్‌ ప్రక్రియతో రూ.42,000 కోట్లకు ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలు ద్వారా దేశంలోకి ప్రవేశించిన ప్రపంచ స్టీల్‌ దిగ్గజం– ఆర్సిలార్‌మిట్టల్‌.  


కొత్త బాధ్యతలు
ఆర్థికమంత్రిగా నియమితులైన నిర్మలా సీతారామన్‌. గతంలో ఇందిరాగాంధీ తాత్కాలికంగా ఆర్థికశాఖను నిర్వహించినా, పూర్తి స్థాయి ఆర్థికమంత్రిగా నియమితులైన తొలి భారత మహిళగా సీతారామన్‌కు గుర్తింపు. బలమైన కంపెనీగా ఐటీసీని మలచిన శిల్పి,  పద్మ భూషన్‌ అవార్డు గ్రహీత యోగేష్‌ చందన్‌ దేవేశ్వర్‌ (72) కన్నుమూత.

అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌) సంస్థ చీఫ్‌ ఎకనమిస్ట్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా గీతా గోపీనాథ్‌.

విప్రో చైర్మన్‌ ప్రేమ్‌జీ పదవీ విరమణ. కుమారుడు రిషద్‌కు బాధ్యతలు.
 
దిగ్గజాల అస్తమయం...

బిర్లా మూల పురుషుడు
బీకే బిర్లా (98) మరణం.

మాజీ ఆర్థిక మంత్రి, దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన బీజేపీ నేత అరుణ్‌ జైట్లీ అనారోగ్యంతో అస్తమయం.

తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయి... ఆత్మహత్య చేసుకున్న కాఫీ డే అధినేత సిద్ధార్థ. రెండు రోజుల అదృశ్యం తర్వాత కర్ణాటకలోని నేత్రావతి నది ఒడ్డున మృతదేహం గుర్తింపు. ఐటీ అధికారులు, పీఈ ఇన్వెస్టర్లు వేధించారంటూ వెలువడిన ఆయన లేఖ సంచలనం.


ఆటో ‘మొబైల్‌’...
దక్షిణకొరియా కార్ల దిగ్గజం కియా ‘మేడిన్‌ ఆంధ్రా’ సెల్టోస్‌ విడుదల. అనంతపురం ప్లాంట్‌లో  తొలి కారు ఆవిష్కరణ.  

దేశీ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ .. కొత్త కాంపాక్ట్‌ ఎస్‌యూవీ హారియర్‌ వాహనాన్ని ప్రవేశపెట్టింది.

ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూసిన అత్యాధునిక ఐఫోన్లు 11, 11 ప్రోలను ఆవిష్కరించిన యాపిల్‌.

ధరల స్పీడ్‌
ధరలూ సామాన్యునిపై భారాన్ని మోపుతున్నాయి. మొత్తంగా గణాంకాలు దేశంలో మందగమన పరిస్థితులను ప్రతిబింబిస్తుండగా, నిత్యావసరాల ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి.  రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 శాతం ఉండాలన్నది ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్‌ 2’ లేదా ‘మైనస్‌ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే అక్టోబర్‌ (4.62 శాతం), నవంబర్‌ (5.54 శాతం) ద్రవ్యోల్బణం అదుపుతప్పింది. ఇక నవంబర్‌ టోకు ద్రవ్యోల్బణం  వ్యవస్థలో మందగమన స్థితికి (0.58 శాతం) అద్దం పట్టింది.  


చిక్కుల్లో కార్వీ
క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందన్న ఆరోపణలతో  స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ కార్వీ తీవ్ర సంక్షోభంలోకి జారింది.  దాదాపు రూ. 2,300 కోట్ల విలువ చేసే క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి రూ. 600 కోట్ల దాకా రుణాలు తీసుకుందని, క్లయింట్ల నిధులను సొంత అవసరాలకు వాడుకుందని కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ (కేఎస్‌బీఎల్‌) ఆరోపణలు ఎదుర్కొంటోంది. దీంతో కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా, పాత క్లయింట్ల పవర్‌ ఆఫ్‌ అటార్నీలను (పీవోఏ) ఉపయోగించుకోకుండా కార్వీపై నవంబర్‌ 22న సెబీ నిషేధం విధించింది. ఎక్సే్ఛంజీల నిబంధనలను ఉల్లంఘించినందుకు అన్ని విభాగాల్లో ట్రేడింగ్‌ లైసెన్సును సస్పెండ్‌ చేస్తున్నట్లు ఎక్సే్ఛంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ  ప్రకటించాయి.

‘మిస్త్రీ’కి ఊరట...
2016 అక్టోబర్‌ 24న టాటా సన్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ సమావేశంలో మిస్త్రీకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు చట్టవిరుద్ధమని నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) స్పష్టం చేసింది. మళ్లీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టవచ్చని,  అలాగే, టాటా కంపెనీల్లో డైరెక్టరుగా కూడా ఉండవచ్చని పేర్కొంది.  ఈ నేపథ్యంలో మిస్త్రీ స్థానంలో చంద్రశేఖరన్‌ నియామకం చట్టవిరుద్ధం అవుతుందని కూడా జస్టిస్‌ ఎస్‌జే ముఖోపాధ్యాయ్‌ సారథ్యంలోని ద్విసభ్య బెంచ్‌ తుది ఉత్తర్వులిచ్చింది. ఈ ఆదేశాలు నాలుగు వారాల్లో అమల్లోకి వస్తాయి.

తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు బిలియనీర్లు
ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌లో రూ.3,80,700 కోట్లతో రిలయన్స్‌ చీఫ్‌ ముకేశ్‌ అంబానీ భారత్‌లో అపర కుబేరుడుగా నిలిస్తే, ఇదే జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు బిలియనీర్లకూ స్థానం దక్కింది. అరబిందో ఫార్మా చైర్మన్‌ పీవీ రాంప్రసాద్‌ రెడ్డికి(రూ.14,800 కోట్లు) 51వ స్థానం లభించగా, ఎంఈఐఎల్‌ చైర్మన్, ఎండీలు పి. పిచ్చిరెడ్డి (రూ.13,400),  పీవీ కృష్ణారెడ్డి (రూ12,900 కోట్లు)లు 57, 63 స్థానాల్లో నిలిచారు. ఇక దివీస్‌ ల్యాబ్స్‌– దివి సత్చంద్ర కిరణ్‌ (రూ.10,200 కోట్లు) , నీలిమ మోటపర్తి (రూ.9,800 కోట్లు) 83, 89 స్థానాల్లో ఉన్నారు. మరో విశేషం ఏమిటంటే... ప్రతిష్టాత్మక ఫోర్బ్స్‌ ఇండియా మేగజైన్‌..  ‘కలెక్టర్స్‌ ఎడిషన్‌ 2019’లో ఎంఈఐఎల్‌ చైర్మన్‌ పీపీ రెడ్డికి విశిష్ట గౌరవం లభించింది. పీపీ రెడ్డితో సంస్థ ఎండీ పీవీ కృష్ణా రెడ్డి కలిసి ఉన్న ఫొటోతో ‘మేఘా బిల్డర్‌’ పేరుతో ప్రచురించిన ఈ వ్యాసంలో సంస్థ పురోగతిని వివరించింది.

పరిశ్రమలు నిరాశ...
పారిశ్రామిక ఉత్పత్తి వరుసగా మూడవనెల– అక్టోబర్‌లోనూ వృద్ధిలేకపోగా ‘క్షీణత’లో నిలిచింది. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌తో ప్రారంభం నుంచీ అక్టోబర్‌ వరకూ ఏడు నెలల కాలాన్ని చూస్తే, వృద్ధి రేటు 5.7 శాతం నుంచి (2018 ఇదే కాలంలో) 0.5 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది జూలై తర్వాత ఈ రంగంలో అసలు వృద్ధిలేదు.

ఇన్ఫీకి విజిల్‌బ్లోయర్స్‌ షాక్‌
భారీ ఆదాయాలు చూపించడం కోసం ఇన్ఫీ సీఈవో సలిల్‌ పరీఖ్, సీఎఫ్‌వో నీలాంజన్‌ రాయ్‌ ’అనైతిక’ విధానాలకు పాల్పడుతున్నారంటూ పేరు వెల్లడించని కొందరు ఉద్యోగుల(విజిల్‌బ్లోయర్స్‌)  ఫిర్యాదులతో ఇన్ఫోసిస్‌ ఇబ్బందుల్లో చిక్కుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement