
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) తాజాగా ముంబైలో జియో వరల్డ్ సెంటర్‌ను ప్రారంభించింది. దీని విస్తీర్ణం దాదాపు 18.5 ఎకరాలు ఉంటుంది. జియో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో సాంస్కృతిక కేంద్రం, మ్యూజికల్ ఫౌంటెయిన్ మొదలైనవి ఉన్నాయి. ఇందులోని కన్వెన్షన్ సెంటర్ దేశంలోనే అతి పెద్దదిగా నిలవనుంది. 5జీ నెట్‌వర్క్ ఆధారిత కన్వెన్షన్ సెంటర్‌లో 1.61 లక్షల చ.అ. పైగా విస్తీర్ణం ఉండే మూడు ఎగ్జిబిషన్ హాల్స్, 1.07 లక్షల చ.అ. విస్తీర్ణం ఉండే రెండు కన్వెన్షన్ హాల్స్ ఉంటాయి. ఈ ఏడాది, వచ్చే ఏడాది దశలవారీగా ఇందులోని వివిధ విభాగాలను సంస్థ ఆవిష్కరించనుంది. నవ భారత ఆకాంక్షలకు ప్రతిరూపంగా జియో వరల్డ్ సెంటర్ ఉంటుందని ఆర్‌ఐఎల్ డైరెక్టర్, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ నీతా అంబానీ తెలిపారు.