అమెజాన్‌తో దోస్తీ? | Reliance Industries offers Amazon 20 billion dollars stake in retail | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ @ 15 లక్షల కోట్లు

Published Fri, Sep 11 2020 5:19 AM | Last Updated on Fri, Sep 11 2020 5:27 AM

Reliance Industries offers Amazon 20 billion dollars stake in retail - Sakshi

న్యూఢిల్లీ: రిటైల్‌ వెంచర్లో పెట్టుబడులు సమీకరించడం ప్రారంభించిన పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా ఈ–కామర్స్‌లో పోటీ సంస్థ అమెజాన్‌డాట్‌కామ్‌తో కూడా చేతులు కలిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌)లో 40 శాతం దాకా వాటాలను అమెజాన్‌కు విక్రయించేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తా కథనాలు వచ్చాయి. ఈ డీల్‌ విలువ సుమారు 20 బిలియన్‌ డాలర్ల మేర ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్‌ఆర్‌వీఎల్‌లో ఇన్వెస్ట్‌ చేయడంపై అమెజాన్‌ ఆసక్తిగా ఉందని, దీనిపై చర్చలు కూడా జరిపిందని పేర్కొన్నాయి.

కుదిరితే ఇది దేశంలోనే అత్యంత భారీ డీల్‌ కాగలదని తెలిపాయి. అయితే, అమెజాన్‌ ఇంకా పెట్టుబడుల పరిమాణంపై తుది నిర్ణయం తీసుకోలేదని, చర్చలు ఫలవంతం కాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నాయి. మరోవైపు, ఈ కథనాలపై వ్యాఖ్యానించేందుకు రిలయన్స్, అమెజాన్‌ నిరాకరించాయి. మీడియా ఊహాగానాలపై తాము వ్యాఖ్యానించలేమని స్టాక్‌ ఎక్సే్చంజీలకు రిలయన్స్‌ తెలియజేసింది. పరిస్థితులను బట్టి వివిధ వ్యాపార అవకాశాలు పరిశీలిస్తూ ఉంటామని పేర్కొంది. పాఠకులు.. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఊహాగానాల ఆధారంగా నిరాధార/తప్పుడు వార్తలను ప్రచురించవద్దని ఒక ప్రకటనలో మీడియాకు విజ్ఞప్తి చేసింది.  

రిలయన్స్‌ రిటైల్‌లో అమెరికాకు సంస్థ సిల్వర్‌ లేక్‌ పార్ట్‌నర్స్‌ 1.75% వాటా కోసం రూ. 7,500 కోట్లు ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే అమెజాన్‌కి వాటాల విక్రయం తెరపైకి వచ్చింది. రిలయన్స్‌  ఇటీవలే ఫ్యూచర్‌ గ్రూప్‌  రిటైల్‌ వ్యాపారాన్ని రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేసింది. ఫ్యూచర్‌ రిటైల్‌ వ్యాపారంలో అమెజాన్‌ ఇన్వెస్టరుగా ఉంది.   రిలయన్స్‌ రిటైల్‌లో వాటాలు విక్రయించడం ద్వారా 21–29 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు సమీకరించవచ్చని క్రెడిట్‌ సూసీ పేర్కొంది.

‘రిలయన్స్‌’ లాభాలు
► బ్లూచిప్‌ షేర్లలో జోరుగా కొనుగోళ్లు  
►స్వల్పంగా పుంజుకున్న రూపాయి  
►రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌  
►646 పాయింట్లు ఎగసి 38,840కు సెన్సెక్స్‌
►171 పాయింట్లు ఎగసి 11,449కు నిఫ్టీ
►ఇన్వెస్టర్ల సంపద రూ.2.2 లక్షల కోట్లు అప్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  లాభాల జోరుతో గురువారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడింది. అంతర్జాతీయ సంకేతా లు సానుకూలంగా ఉండటం కలసివచ్చింది. భారత్‌–చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతల సమస్యను ప్రస్తుతానికి పక్కనబెట్టిన ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరిపారు.  సెన్సెక్స్‌ 646 పాయింట్లు లాభపడి 38,840 పాయింట్ల వద్ద, నిఫ్టీ 171 పాయింట్లు ఎగసి 11,449 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ 1.69%, నిఫ్టీ 1.52% చొప్పున లాభపడ్డాయి. దీంతో రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌ పడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు పుంజుకొని 73.46 కు చేరడం సానుకూల ప్రభావం చూపించింది.  

రోజంతా లాభాలు...
ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా, మన మార్కెట్‌ లాభాల్లోనే ఆరంభమైంది. నిఫ్టీ వీక్లీ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ముగింపు రోజు  కావడంతో ఒడిదుడుకులకు లోనైనా రోజం తా లాభాల్లోనే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత లాభాలు మరింతగా పుంజుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌684 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. యూరప్‌ కేంద్ర బ్యాంక్‌ సమావేశం నేపథ్యంలో యూరప్‌ మార్కెట్లు పరిమిత శ్రేణి రేంజ్‌లో ట్రేడయి మిశ్రమంగా ముగిశాయి.  

►రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 7 శాతం లాభంతో రూ.2,315 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో అత్యధికంగా పెరిగిన షేర్‌ ఇదే. సెన్సెక్స్‌ మొత్తం 646 పాయింట్లు లాభపడితే, దీంట్లో రిలయన్స్‌ షేర్‌ వాటాయే 558 పాయింట్ల మేర ఉంది.  

►స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద గురువారం ఒక్కరోజులోనే రూ.2.20 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.2,20,928 కోట్లు ఎగసి రూ.155.21 లక్షల కోట్లకు చేరింది.  ఈ పెరుగుదలలో మెజారిటీ వాటా రిలయన్స్‌దే కావడం విశేషం.

►మార్కెట్‌ జోరు నేపథ్యంలో దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి.

కార్పొరేట్‌ ‘బాహుబలి’
►ఆల్‌టైమ్‌ హైకి ఎగసిన రిలయన్స్‌ షేరు..
►20,000 కోట్ల డాలర్లకు మార్కెట్‌ క్యాప్‌
►ఈ స్థాయికి చేరిన తొలి భారతీయ కంపెనీ
►అమెజాన్‌ పెట్టుబడి వార్తలతో పరుగులు పెట్టిన షేరు


భారతీయ కార్పొరేట్‌ ‘బాహుబలి’ రిలయన్స్‌ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. అనుబంధ విభాగం రిలయన్స్‌ రిటైల్‌లో 40  శాతం వరకూ వాటాను అంతర్జాతీయ ఆన్‌లైన్‌ దిగ్గజం అమెజాన్‌కు విక్రయించనున్నదన్న వార్తల కారణంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ దూసుకెళ్లింది. దీంతో తొలిసారిగా కంపెనీ మార్కెట్‌ విలువ 20,000 కోట్ల డాలర్ల మైలురాయిని అధిగమించింది. దేశంలో ఈ స్థాయిని చేరిన మొట్టమొదటి కంపెనీగా రికార్డు సృష్టించింది. రిలయన్స్‌ షేర్‌ ఇంట్రాడేలో 8.4 శాతం లాభంతో జీవిత  కాల గరిష్ట స్థాయి,  రూ.2,344ను తాకింది. చివరకు 7 శాతం లాభంతో రూ.2,315 వద్ద ముగిసింది.  

20,000 కోట్ల డాలర్లకు మార్కెట్‌ క్యాప్‌...
కాగా కంపెనీ మార్కెట్‌ క్యాప్‌  రూ.14.91 లక్షల కోట్లకు(20,000 కోట్ల డాలర్లు) ఎగసింది. ఈ స్థాయి మార్కెట్‌ క్యాప్‌ సాధించిన తొలి భారత కంపెనీ ఇదే. ఇంట్రాడేలో ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.15,84,908 కోట్లకు చేరింది. ఒక్క గురువారం రోజే రూ.97,000 కోట్ల మేర మార్కెట్‌క్యాప్‌ పెరిగింది.

ఆ 13 సంస్థలకు అంబానీ ఆఫర్‌...!  
రిలయన్స్‌ రిటైల్‌లో 1.75 శాతం వాటాను అమెరికా ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం సిల్వర్‌ లేక్‌ పార్ట్‌నర్స్‌ రూ.7,500 కోట్లకు కొనుగోలు చేయనున్నదని బుధవారమే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే రిలయన్స్‌ జియోలో 13 విదేశీ సంస్థలు భారీగా ఇన్వెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థలన్నింటికీ, రిలయన్స్‌ రిటైల్‌లో కూడా ఇన్వెస్ట్‌ చేసే ఆఫర్‌ లభించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక అమెజాన్‌ తర్వాత కేకేఆర్‌ సంస్థ పెట్టుబడి వార్తలు వస్తాయని అంచనా. రిలయన్స్‌ రిటైల్‌లో  వాటా విక్రయం  ద్వారా రూ.60,000–రూ.1.5 లక్షల  కోట్ల మేర సమీకరించే అవకాశాలున్నాయని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement