E-Commerce Business
-
ఎకానమీకి అమెజాన్ చేసిందేమీ లేదు
న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారం కొనసాగించడానికే అమెజాన్ తాజా పెట్టుబడులు చేస్తుందని, ఇందులో సంబరపడాల్సిందేమీ లేదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెజాన్ తన పెట్టుబడులతో భారత్‌లోని సేవల రంగానికి, ఆర్థిక వ్యవస్థకు చేసిందేమీ లేదన్నారు. పనిలో పనిగా ఈ–కామర్స్ పరిశ్రమ లక్షలాది రిటైలర్ల ఉపాధిని దెబ్బతీస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,300 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అమెజాన్ చేసిన ప్రకటన పట్ల సంతోషించాల్సిందేమీ లేదన్నారు. భారత వ్యాపారంలో నష్టాలను పూడ్చుకోవడానికే తాజా పెట్టుబడులను తీసుకొస్తున్నట్టు వ్యాఖ్యానించారు. కొల్లగొట్టే ధరల విధానాన్ని ఈ నష్టాలు సూచిస్తున్నాయంటూ.. ఇది భారత్‌కు ఎంత మాత్రం మేలు చేయబోదని, చిన్న వర్తకులను దెబ్బతీస్తుందన్నారు. ‘ఉపాధి అవకాశాలు, వినియోగదారుల సంక్షేమంపై ఈ–కామర్స్ రంగం చూపించే నికర ప్రభావం’ పేరుతో ఓ నివేదికను మంత్రి బుధవారం ఢిల్లీలో విడుదల చేశారు. దేశంలో చిన్న రిటైలర్ల ఉపాధిని దెబ్బతీసే ఈ–కామర్స్ కంపెనీల వ్యాపార నమూనాను మంత్రి ప్రశ్నించారు.ఈ–రిటైలర్లతో 1.58 కోట్ల ఉద్యోగాలు ఆన్లైన్ వర్తకులు దేశంలో 1.58 కోట్ల మందికి ఉపాధి కల్పించినట్టు మంత్రి గోయల్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇందులో 35 లక్షల మంది మహిళలు ఉన్నట్టు, 17.6 లక్షల రిటైల్ సంస్థలు ఈ –కామర్స్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ నివేదికను పహలే ఇండియా ఫౌండేషన్ (పీఐఎఫ్) విడుదల చేసింది. భారత్‌లో ఉపాధి కల్పన పరంగా, కస్టమర్ల సంక్షేమం పరంగా (మెరుగైన అనుభవం) ఈ–కామర్స్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ–కామర్స్ తృతీయ శ్రేణి పట్టణాల్లోకి విస్తరిస్తున్నట్టు వెల్లడించింది. టైర్–3 పట్టణాల్లోని వినియోగదారులు నెలవారీగా రూ.5,000కు పైనే ఆన్లైన్ షాపింగ్‌పై ఖర్చు చేస్తున్నట్టు వివరించింది. ఉపాధిపై ఈ–కామర్స్ రంగం చూపిస్తున్న ప్రభావాన్ని తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా 2,062 మంది ఆన్లైన్ వర్తకులు, 2,031 ఆఫ్‌లైన్ వర్తకులు, 8,209 మంది వినియోగదారుల అభిప్రాయాలను పీఐఎఫ్ తెలుసుకుంది. -
అనైతిక డిస్కౌంట్లను ప్రభుత్వం కట్టడి చేయాలి
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ రంగంలో రేట్లను పెంచేసి ఆపైన భారీగా డిస్కౌంట్లు ప్రకటించడం లాంటి అనైతిక ధోరణులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం, సంబంధిత నియంత్రణ సంస్థలు తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీయూటీఎస్ ఇంటర్నేషనల్ సంస్థ ఒక నివేదికలో అభిప్రాయపడింది. అసలు రేటు ఎక్కువే ఉన్నప్పటికీ తాము తక్కువకే కొంటున్నామనే తప్పుడు భావనను వినియోగదారుల్లో కలిగించే ఇలాంటి పద్ధతులు .. మోసం కిందకే వస్తాయని పేర్కొంది. ఫ్లాష్ అమ్మకాలపై ఎకాయెకిన నిషేధం విధించడం కాకుండా వినియోగదారుల హక్కుల పరిరక్షణను పటిష్టం చేయడంపైనా, మార్కెట్లో విక్రేతలందరికీ సమాన అవకాశాలు లభించేలా చూడటంపైనా ప్రభుత్వం మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సీయూటీఎస్ వివరించింది. భారీగా డిస్కౌంటునివ్వడం, పోటీ సంస్థలను దెబ్బతీసే ఉద్దేశంతో అత్యంత చౌకగా అమ్మడం అనే రెండు విధానాలకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాలను నిర్దేశించాలని పేర్కొంది. ప్రస్తుతం ఈ రెండింటినీ ఒకదానికొకటి పర్యాయపదాలుగా ఉపయోగిస్తుండటం వల్ల గందరగోళం నెలకొందని తెలిపింది. -
విక్రేతల మధ్య సమాన పోటీ ఉండాలి
జైపూర్: ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఈ–కామర్స్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అదే సమయంలో ఈ రంగంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో చిన్న, పెద్ద విక్రేతల మధ్య సమాన పోటీ ఉండేలా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. గురువారం రాజస్తాన్‌లోని జైపూర్‌లో జరిగిన జీ20 దేశాల వాణిజ్య, పెట్టుబడి శాఖ మంత్రుల సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ధరలు, ఫిర్యాదుల విషయంలో వినియోగదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. డిజిటలీకరణ ద్వారా ఈ–కామర్స్ రంగంలో దేశాల మధ్య కార్యకలాపాలు సులభతరం అవుతాయని తెలిపారు. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ) అనేది ఒక గేమ్–చేంజర్ అని మోదీ అభివరి్ణంచారు. దీనిద్వారా డిజిటల్ మార్కెట్‌ప్లేస్ వ్యవస్థను సృష్టిస్తున్నట్లు వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని, సానుకూలతను ప్రపంచదేశాలు గుర్తిస్తున్నాయని పేర్కొన్నారు. -
ఈ-కామర్స్ వ్యాపారంలోకి ఫోన్‌పే.. కొత్త యాప్ పేరు ఏంటంటే..
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే తాజాగా ఈ–కామర్స్ వ్యాపారంలోకి ప్రవేశించింది. పిన్‌కోడ్ పేరిట షాపింగ్ యాప్‌ను రూపొందించింది. తొలుత బెంగళూరులో ఈ యాప్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఫోన్‌పే వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ తెలిపారు. రోజుకు 10,000 పైచిలుకు లావాదేవీలు సాధించిన తర్వాత ఇతర నగరాలకు కూడా దీన్ని విస్తరిస్తామని చెప్పారు. డిసెంబర్ నాటికి రోజుకు లక్ష లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వినియోగదారులకు సంబంధించి గత ఏడేళ్లలో ఫోన్‌పే నుంచి ఇది రెండో యాప్ అని చెప్పారు. కేంద్రం తీర్చిదిద్దిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ప్లాట్‌ఫాం ఆధారంగా పిన్‌కోడ్ యాప్‌ను రూపొందించారు. -
Hoovu Fresh: పువ్వుల వ్యాపారం.. 10 లక్షల పెట్టుబడితో ఆరంభం.. కోట్లలో లాభాలు!
మన అవసరమే మనకో దారి చూపుతుంది. ఎరుకతో ముందడుగు వేస్తే విజయం సుగమమం అవుతుంది. అందుకు ఉదాహరణే ఈ బెంగళూరు సిస్టర్స్. అమ్మకు పూజ చేసుకోవడానికి సరైన పూలు దొరకడం లేదని గ్రహించిన ఈ తోబుట్టువులు ఇదే సమస్య అన్ని చోట్లా ఉందని తెలుసుకున్నారు. పది లక్షల రూపాయలతో పూల వ్యాపారాన్ని ప్రారంభించారు. కోట్లలో లాభాలను ఆర్జిస్తున్నారు. యశోద కరుటూరి, రియా కరుటూరి ఈ ఇద్దరు తోబుట్టువులు పువ్వుల లోకంలో విహరిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. కేవలం ప్రారంభించిన మూడేళ్లలోనే పూల పరిశ్రమలో పెద్ద బ్రాండ్‌గా తమ కంపెనీని నిలబెట్టారు. యశోద, రియా 14 ఫిబ్రవరి 2019న బెంగళూరులో ‘హువు’ ఫ్రెష్ని ప్రారంభించారు. 28 ఏళ్ల రియా మాట్లాడుతూ ‘హువు’ అంటే కన్నడ భాషలో పువ్వు అని చెప్పింది. కంపెనీ ప్రారంభించిన కొన్ని నెలల్లోనే కోవిడ్ కారణంగా వ్యాపారం నిలిచిపోయిందంటూ తాము ఎదుర్కొన్న సమస్యనూ వివరించింది. తల్లి ప్రేరణ కంపెనీ తొలినాళ్ల గురించి ఈ తోబుట్టువులు ప్రస్తావిస్తూ –‘దేశ పుష్పాల రాజధాని బెంగళూరు లో నివాసముంటున్నా సరైన పూలు దొరకడం లేదని, ఆ పువ్వులు కూడా తాజాగా లేవని మా అమ్మ ఆవేదన చెందేది. అప్పుడే పువ్వుల వ్యాపారం ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చింది..’ అంటూండగానే రియా అక్క యశోద అందుకుని మాట్లాడుతూ ‘మా చిన్నతనంలో మా నాన్న ఇథియోపియా, కెన్యాలో గులాబీ తోట సాగు చేసేవారు. విదేశాలకు కూడా ఎగుమతి చేసేవారు. కొన్ని కారణాల వల్ల ఆ వ్యాపారం తగ్గిపోయింది. మేం స్వదేశానికి వచ్చేశాం. మహిళలకు ఉపాధి ‘భారతదేశంలో సాధారణంగా పూజా పుష్పాలను దేవాలయాల చుట్టూ మాత్రమే విక్రయిస్తుంటారు. అలాగే, బండిపైనో, రోడ్డు పక్కనో కూర్చొని మహిళలు పూజాపుష్పాలను అమ్ముతుంటారు. ఈ విధానం అస్తవ్యస్తంగా ఉందని గ్రహించాం. మేము ఈ పూలవ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు, పరిశ్రమలో చేరడానికి మహిళలు చాలా ఆసక్తి చూపారు. కంపెనీ మొదలైనప్పుడు పాతిక మంది మహిళలు ఉండగా నేడు వారి సంఖ్య వందల్లో పెరిగింది. ఉపాధి వల్ల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. వారి పిల్లలు మంచి పాఠశాలల్లో చదువుతున్నారు. నెలకు లక్షన్నర ఆర్డర్లు ప్రతి నెలా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, మైసూర్, పూణె, ముంబై, గురుగ్రామ్, నోయిడా తదితర ప్రాంతాల నుంచి... ఒకటిన్నర లక్ష ఆర్డర్లు అందుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది నెలవారీ సబ్స్క్రిప్షన్ ఉన్న కస్టమర్లే కావడం విశేషం. ఇది కనిష్టంగా రూపాయి నుండి ప్రారంభమవుతుంది. 25 రూపాయల పూల ప్యాక్‌లో వివిధ రకాల పూలు ఉంటాయి. పువ్వులు రెండు వారాల పాటు తాజాగా ఉండే విధంగా ప్యాక్ చేస్తాం. దీన్ని తాజాగా ఉంచడానికి ఇథిలీన్ బ్లాకర్స్, ఇతర టెక్నాలజీని ఉపయోగిస్తాం. ప్యాకేజింగ్‌లో జీరో టచ్ ఫ్లవర్ టెక్నిక్ కూడా ఉంది. ఈ ప్యాకెట్లు పర్యావరణ అనుకూలమైనవి, ఇవి సులభంగా మట్టిలో కలిసిపోతాయి. మా కంపెనీ వాడినపూలతో అగరుబత్తులను కూడా తయారు చేస్తుంది. ఇవి పూర్తిగా సేంద్రీయమైనవి. బొగ్గు, రసాయనాలు ఏ మాత్రమూ ఉండవు. రైతులతో అనుసంధానం గతంలో రైతులు మండీలో పూలు విక్రయించేవారు, అక్కడ తరచుగా నష్టపోయేవారు. అక్కడ పూలకు సరైన ధర లభించేది కాదు. సకాలంలో పూలు అమ్మకపోతే సగానికిపైగా వృథా అయ్యేవి. పూలకు సరైన ధర రైతులకు అందేలా వందలాది మంది రైతులను కంపెనీతో అనుసంధానం చేశాం. ఈ విధానంలో పూలు కూడా వృథా కావు. మా కంపెనీకి వివిధ రాష్ట్రాల్లోని వందలాది మంది రైతులతో టై అప్లు ఉన్నాయి. దీనితోపాటు, డెలివరీ చైన్ సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేశాం. ఆర్డర్లు వచ్చిన కస్టమర్లకు సకాలంలో డెలివరీ ఇస్తున్నాం. కొన్ని ఇ–కామర్స్ కంపెనీల ప్లాట్‌ఫారమ్‌లోనూ మా ఉత్పత్తులు లభిస్తున్నాయి’ అని వివరించారు ఈ తోబుట్టువులు. -
సెకండ్ వేవ్ ఎఫెక్ట్: వెయిటింగ్లో ఆన్లైన్ ఆర్డర్స్
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ ద్వారా నిత్యావసరాలకు ఆర్డర్ చేశారా? గతంలో మీరు ఆర్డర్ ఇచ్చిన రోజే డెలివరీ చేసిన సంస్థలు ఇప్పుడు చేతులెత్తేశాయి. సెకండ్ వేవ్ ఉధృతి ఒకవైపు, లాక్డౌన్లు మరోవైపు.. వెరశి ఆన్లైన్ ఆర్డర్లు ఊహించనంత పెరగడంతో కస్టమర్లు తమ వంతు కోసం వేచి చూడక తప్పడం లేదు. ఈ–కామర్స్ కంపెనీలు కొన్ని చెన్నైలో డెలివరీకి వారం రోజుల సమయం కూడా తీసుకుంటున్నాయని సమాచారం. ఈ నగరంతో పోలిస్తే ఢిల్లీ, ముంబైలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. కోవిడ్–19 కారణంగా స్థానికంగా నియంత్రణలు ఉండడంతో డెలివరీ ఆలస్యం అవుతుంది అంటూ బిగ్‌బాస్కెట్ తన కస్టమర్లకు చెబుతోంది. డిమాండ్ విపరీతంగా ఉంది. ఆర్డర్ చేసేందుకు వీలుగా టోకెన్లను అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. అలాగే హైజీన్‌ను దృష్టిలో పెట్టుకుని ప్యాకింగ్ చేయడమూ డెలివరీల ఆలస్యానికి మరొక కారణం. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఉత్పత్తులను 2 గంటల్లో చేరవేస్తున్నట్టు గ్రోఫర్స్ తెలిపింది. ఇతర ఆర్డర్లను ఒకట్రెండు రోజుల్లో పూర్తి చేస్తున్నట్టు వెల్లడించింది. డెలివరీ బాయ్స్ కావలెను.. పరిశ్రమకు డెలివరీ బాయ్స్ కొరత కూడా సమస్యగా పరిణమించింది. ఉద్యోగులు లేదా వారి కుటుంబీకులు వైరస్ బారిన పడుతున్నారని ఓ కంపెనీ ప్రతినిధి తెలిపారు. కొత్తగా డెలివరీ బా య్స్ని నియమించుకున్నప్పటికీ, కరోనా నెగెటివ్ వచ్చిన తర్వాతే కంపెనీలు విధుల్లోకి తీసుకుంటున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఈ నియామకాలు మూడు రెట్లు పెరిగాయని తెలుస్తోంది. అంతరాయాలను తగ్గిం చడానికి డెలివరీ భాగస్వాములకు రెండింతల వేతనాలు, ప్రోత్సాహకాలతో పరిహారం చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటికే 2,000 పైచిలుకు నియామకాలను చేపట్టినట్టు వెల్లడించింది. మరో 7,000 మందిని చేర్చుకుంటామని వివరించింది. 2 గంటల్లో డెలివరీ సేవలు అందించిన అమెజాన్ ఫ్రెష్ సర్వీస్ ఢిల్లీలో ఒకరోజు సమయం తీసుకుంటోంది. అన్ని రకాల ఉత్పత్తులనూ హోమ్ డెలివరీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని అమెజాన్ కోరుతోంది. -
ఈ–కామర్స్‌కు కరోనా జోష్..!
న్యూఢిల్లీ: కరోనా మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో ఈ–కామర్స్ సంస్థల వ్యాపారం జోరందుకుంటోంది. కోవిడ్ కేసుల కట్టడికి కొన్ని ప్రాంతాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించడం వంటి చర్యలతో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ షాపింగ్ సైట్లకు వచ్చే ఆర్డర్ల సంఖ్య సాధారణ పరిస్థితులతో పోలిస్తే దాదాపు రెట్టింపయిందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఎక్కువగా నిత్యావసరాలకు డిమాండ్ ఉంటోందని తెలిపాయి. కేసులు అత్యధికంగా ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి ఆర్డర్లు ఎక్కువగా ఉంటున్నాయని వివరించాయి. సరఫరా పెంపునకు ఎఫ్ఎంసీజీల కసరత్తు గతేడాది లాక్డౌన్ నేర్పిన పాఠాలతో ఐటీసీ, పార్లే ప్రోడక్ట్స్, మారికో, ఇమామి, సీజీ కార్ప్ గ్లోబల్ వంటి ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఉత్పత్తుల సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తపడుతున్నాయి. ‘గతేడాది నేర్చుకున్న పాఠాలతో ఈసారి పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కొనగలుగుతున్నాం. ఇలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలన్నది కంపెనీలు నేర్చుకున్నాయి. అలాగా ప్రభుత్వాలు కూడా లాక్డౌన్ ప్రకటించినప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుసుకున్నాయి. సరఫరాపరంగా ఇప్పుడు అన్ని వర్గాలకు మరింత స్పష్టత ఉంది‘ అని పార్లే ప్రోడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా తెలిపారు. అన్ని మాధ్యమాల ద్వారా ఉత్పత్తులన్నీ అందుబాటులో ఉండేలా తగు చర్యలన్నీ తీసుకున్నట్లు ఐటీసీ ప్రతినిధి వివరించారు. వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేసేందుకు ఆరు మెట్రో నగరాల్లో ఐటీసీ ఈ–స్టోర్స్ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘గతేడాది దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలైనప్పుడు సఫోలా స్టోర్ అనే మా పోర్టల్ ద్వారా వినియోగదారులందరికీ మా ఉత్పత్తులు నేరుగా అందేలా కొన్ని చర్యలు అమలు చేశాం. మరిన్ని వినూత్న ప్రయోగాలు కొనసాగిస్తాం‘ అని మారికో వర్గాలు తెలిపాయి. ఇబ్బందులూ ఉన్నాయ్.. సరఫరాకు ఆటంకాలు లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నప్పటికీ ఇంకా కొన్ని అడ్డంకులు తప్పడం లేదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. కార్మికుల కొరత కారణంగా ఫ్యాక్టరీలు పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేయడం లేదని, కొత్తగా కరోనా కట్టడికి పలు ప్రాంతాల్లో విధిస్తున్న ఆంక్షల కారణంగా రవాణా వ్యయాలూ పెరుగుతున్నాయని సీజీ కార్ప్ గ్లోపల్ ఎండీ వరుణ్ చౌదరి తెలిపారు. ఈ నేపథ్యంలో తయారీని పెంచుకునేందుకు, సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేసుకునేందుకు, ఆకస్మికంగా అవాంతరాలు ఎదురైనా నిల్వలకు సమస్య ఎదురవకుండా చూసుకునేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు చౌదరి చెప్పారు. ‘గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (తొలి ఆరు నెలల్లో) ఆన్లైన్ అమ్మకాలు ఏకంగా మూడు రెట్లు పెరిగాయి. ఆ తర్వాత మిగతా రెండు క్వార్టర్లలో ఆ జోరు కాస్త తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది‘ అని మయాంక్ షా తెలిపారు. అయితే, తయారీ నుంచి పంపిణీ దాకా వివిధ దశల్లో ఉన్న వారు కరోనా సెకండ్ వేవ్ ప్రతికూల పరిణామాల బారిన పడకుండా చూసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో ఏకైక సవాలుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
ఎఫ్ఎంసీజీ అమ్మకాల్లో ఆన్లైన్ జోరు!
న్యూఢిల్లీ: దేశీయ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు రూటు మార్చేశాయి. కొనుగోలుదారులు ఈ–కామర్స్ బాటపట్టడంతో ఎఫ్ఎంసీజీలు కూడా అదే బాటపట్టాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో మొదలైన ఎఫ్ఎంసీజీల ఈ–కామర్స్ సేల్స్ క్రమంగా పెరుగుతున్నాయి. ఆయా కంపెనీల మొత్తం అమ్మకాల్లో ఆన్లైన్ వాటా 2–8 శాతం వరకున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ కంపెనీల ఆన్లైన్ అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరిగాయి. 2020లో 3 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీయ ఈ–గ్రాసరీ మార్కెట్ 2024 నాటికి 18.2 బిలియన్ డాలర్లకు చేరుతుందని రెడ్‌సీర్, బిగ్‌బాస్కెట్ నివేదిక అంచనా వేసింది. ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలైన నెస్లే, హిందుస్తాన్ యూనిలివర్, పార్లే ప్రొడక్ట్స్, అమూల్, మారికో వంటి సంస్థల ఆన్లైన్ అమ్మకాలు క్యూ2లో అధిక స్థాయిలో జరిగాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేసినా సరే కొనుగోలుదారులు ఈ–కామర్స్ కొనుగోళ్ల మీదే మక్కువ చూపించడమే ఈ వృద్ధికి కారణం. గతేడాది హెచ్‌యూఎల్ మొత్తం అమ్మకాల్లో 3 శాతంగా ఉన్న ఆన్లైన్ అమ్మకాలు ఈ ఏడాది క్యూ2 నాటికి 6 శాతానికి పెరిగింది. నెస్లే కంపెనీ ఈ–కామర్స్ సేల్స్ కూడా సెప్టెంబర్ నాటికి రెట్టింపయింది. ‘గతేడాదితో పోలిస్తే నెస్లే ఆన్లైన్ సేల్స్‌లో 97 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం మొత్తం అమ్మకాల్లో ఈ–కామర్స్ వాటా 4 శాతంగా ఉందని’’ నెస్లే చైర్మన్ సురేష్ నారాయనన్ తెలిపారు. ప్యాకేజ్ ఫుడ్స్‌కు డిమాండ్.. కొనుగోలుదారులు ఇంట్లో ఉంటూ ప్యాకేజ్డ్ ఫుడ్స్‌ను ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. అందుకే మ్యాగీ నూడుల్స్, మంచ్, కిట్‌క్యాట్ చాక్లెట్స్ అమ్మకాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. లాక్డౌన్ సమయంలో ఈ–గ్రాసరీ షాపింగ్ జోరుగా సాగింది. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేసినా సరే ఈ–కామర్స్‌దే హవా నడుస్తుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి ఈ–కామర్స్ అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయని, తొలిసారి ఆన్లైన్ కొనుగోలుదారులు ఎక్కువగా గ్రాసరీలను కొంటున్నారని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా తెలిపారు. గతేడాది 2.3 శాతంగా ఉన్న ఐటీసీ కంపెనీ ఆన్లైన్ అమ్మకాలు గత 12 నెలల్లో 4.2 శాతానికి పెరిగింది. ఐటీసీ ఉత్పత్తులైన సన్‌ఫీస్ట్ బిస్కెట్లు, ఆశీర్వాద్ పిండి ఆన్లైన్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఏడాదిక్రితం డాబర్ అమ్మకాల్లో 1.5 శాతంగా ఉన్న ఆన్‌ౖ లెన్ సేల్స్ వాటా ప్రస్తుతం 6 శాతానికి పెరిగింది. 2–8 శాతం ఆన్లైన్ వాటా.. దేశంలోని అన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాల్లో ఆన్లైన్ వాటా కనీసం 2–8 శాతం మధ్య ఉన్నాయి. ఈ–కామర్స్ వృద్ధిలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి ఎక్కువగా జరుగుతున్నాయి. లక్షలాది స్థానిక కిరాణా స్టోర్లు కూడా ఆన్లైన్లో ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. గ్రాసరీ మార్కెట్లో ఆన్లైన్ వాటా 0.5 శాతంగా మాత్రమే ఉంది. ఆరు నెలల వ్యవధిలో అమూల్ డెయిరీ ఉత్పత్తుల అమ్మకాలు 3 శాతం నుంచి 7–8 శాతానికి పెరిగిందని కంపెనీ ఎండీ ఆర్ఎస్ సోధి తెలిపారు. రాబోయే కాలంలో మరింత వృద్ధి కనబరుస్తుందని పేర్కొన్నారు. ఈ–కామర్స్ అమ్మకాలు దీర్ఘకాలిక వృద్ధిని నమోదు చేస్తాయని మారికో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజయ్ మిశ్రా తెలిపారు. మారికో ఉత్పత్తులైన పారాచ్యూట్ హెయిర్ ఆయిల్, సఫోలా ఓట్స్ ఉత్పత్తులు సెప్టెంబర్ త్రైమాసికంలో 39 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కంపెనీ మొత్తం టర్నోవర్‌లో ఆన్లైన్ వాటా 8 శాతంగా ఉంది. -
అమెజాన్‌తో దోస్తీ?
న్యూఢిల్లీ: రిటైల్ వెంచర్లో పెట్టుబడులు సమీకరించడం ప్రారంభించిన పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఈ–కామర్స్‌లో పోటీ సంస్థ అమెజాన్‌డాట్‌కామ్‌తో కూడా చేతులు కలిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్)లో 40 శాతం దాకా వాటాలను అమెజాన్‌కు విక్రయించేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తా కథనాలు వచ్చాయి. ఈ డీల్ విలువ సుమారు 20 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్ఆర్వీఎల్లో ఇన్వెస్ట్ చేయడంపై అమెజాన్ ఆసక్తిగా ఉందని, దీనిపై చర్చలు కూడా జరిపిందని పేర్కొన్నాయి. కుదిరితే ఇది దేశంలోనే అత్యంత భారీ డీల్ కాగలదని తెలిపాయి. అయితే, అమెజాన్ ఇంకా పెట్టుబడుల పరిమాణంపై తుది నిర్ణయం తీసుకోలేదని, చర్చలు ఫలవంతం కాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నాయి. మరోవైపు, ఈ కథనాలపై వ్యాఖ్యానించేందుకు రిలయన్స్, అమెజాన్ నిరాకరించాయి. మీడియా ఊహాగానాలపై తాము వ్యాఖ్యానించలేమని స్టాక్ ఎక్సే్చంజీలకు రిలయన్స్ తెలియజేసింది. పరిస్థితులను బట్టి వివిధ వ్యాపార అవకాశాలు పరిశీలిస్తూ ఉంటామని పేర్కొంది. పాఠకులు.. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఊహాగానాల ఆధారంగా నిరాధార/తప్పుడు వార్తలను ప్రచురించవద్దని ఒక ప్రకటనలో మీడియాకు విజ్ఞప్తి చేసింది. రిలయన్స్ రిటైల్‌లో అమెరికాకు సంస్థ సిల్వర్ లేక్ పార్ట్నర్స్ 1.75% వాటా కోసం రూ. 7,500 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెజాన్‌కి వాటాల విక్రయం తెరపైకి వచ్చింది. రిలయన్స్ ఇటీవలే ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారాన్ని రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేసింది. ఫ్యూచర్ రిటైల్ వ్యాపారంలో అమెజాన్ ఇన్వెస్టరుగా ఉంది. రిలయన్స్ రిటైల్‌లో వాటాలు విక్రయించడం ద్వారా 21–29 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు సమీకరించవచ్చని క్రెడిట్ సూసీ పేర్కొంది. ‘రిలయన్స్’ లాభాలు ► బ్లూచిప్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు ►స్వల్పంగా పుంజుకున్న రూపాయి ►రెండు రోజుల నష్టాలకు బ్రేక్ ►646 పాయింట్లు ఎగసి 38,840కు సెన్సెక్స్ ►171 పాయింట్లు ఎగసి 11,449కు నిఫ్టీ ►ఇన్వెస్టర్ల సంపద రూ.2.2 లక్షల కోట్లు అప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల జోరుతో గురువారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. అంతర్జాతీయ సంకేతా లు సానుకూలంగా ఉండటం కలసివచ్చింది. భారత్–చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతల సమస్యను ప్రస్తుతానికి పక్కనబెట్టిన ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరిపారు. సెన్సెక్స్ 646 పాయింట్లు లాభపడి 38,840 పాయింట్ల వద్ద, నిఫ్టీ 171 పాయింట్లు ఎగసి 11,449 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 1.69%, నిఫ్టీ 1.52% చొప్పున లాభపడ్డాయి. దీంతో రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు పుంజుకొని 73.46 కు చేరడం సానుకూల ప్రభావం చూపించింది. రోజంతా లాభాలు... ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా, మన మార్కెట్ లాభాల్లోనే ఆరంభమైంది. నిఫ్టీ వీక్లీ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగింపు రోజు కావడంతో ఒడిదుడుకులకు లోనైనా రోజం తా లాభాల్లోనే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత లాభాలు మరింతగా పుంజుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్684 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. యూరప్ కేంద్ర బ్యాంక్ సమావేశం నేపథ్యంలో యూరప్ మార్కెట్లు పరిమిత శ్రేణి రేంజ్లో ట్రేడయి మిశ్రమంగా ముగిశాయి. ►రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 7 శాతం లాభంతో రూ.2,315 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో అత్యధికంగా పెరిగిన షేర్ ఇదే. సెన్సెక్స్ మొత్తం 646 పాయింట్లు లాభపడితే, దీంట్లో రిలయన్స్ షేర్ వాటాయే 558 పాయింట్ల మేర ఉంది. ►స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద గురువారం ఒక్కరోజులోనే రూ.2.20 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2,20,928 కోట్లు ఎగసి రూ.155.21 లక్షల కోట్లకు చేరింది. ఈ పెరుగుదలలో మెజారిటీ వాటా రిలయన్స్‌దే కావడం విశేషం. ►మార్కెట్ జోరు నేపథ్యంలో దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. కార్పొరేట్ ‘బాహుబలి’ ►ఆల్‌టైమ్ హైకి ఎగసిన రిలయన్స్ షేరు.. ►20,000 కోట్ల డాలర్లకు మార్కెట్ క్యాప్ ►ఈ స్థాయికి చేరిన తొలి భారతీయ కంపెనీ ►అమెజాన్ పెట్టుబడి వార్తలతో పరుగులు పెట్టిన షేరు భారతీయ కార్పొరేట్ ‘బాహుబలి’ రిలయన్స్ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. అనుబంధ విభాగం రిలయన్స్ రిటైల్‌లో 40 శాతం వరకూ వాటాను అంతర్జాతీయ ఆన్లైన్ దిగ్గజం అమెజాన్‌కు విక్రయించనున్నదన్న వార్తల కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ దూసుకెళ్లింది. దీంతో తొలిసారిగా కంపెనీ మార్కెట్ విలువ 20,000 కోట్ల డాలర్ల మైలురాయిని అధిగమించింది. దేశంలో ఈ స్థాయిని చేరిన మొట్టమొదటి కంపెనీగా రికార్డు సృష్టించింది. రిలయన్స్ షేర్ ఇంట్రాడేలో 8.4 శాతం లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.2,344ను తాకింది. చివరకు 7 శాతం లాభంతో రూ.2,315 వద్ద ముగిసింది. 20,000 కోట్ల డాలర్లకు మార్కెట్ క్యాప్... కాగా కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.14.91 లక్షల కోట్లకు(20,000 కోట్ల డాలర్లు) ఎగసింది. ఈ స్థాయి మార్కెట్ క్యాప్ సాధించిన తొలి భారత కంపెనీ ఇదే. ఇంట్రాడేలో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.15,84,908 కోట్లకు చేరింది. ఒక్క గురువారం రోజే రూ.97,000 కోట్ల మేర మార్కెట్క్యాప్ పెరిగింది. ఆ 13 సంస్థలకు అంబానీ ఆఫర్...! రిలయన్స్ రిటైల్‌లో 1.75 శాతం వాటాను అమెరికా ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ పార్ట్నర్స్ రూ.7,500 కోట్లకు కొనుగోలు చేయనున్నదని బుధవారమే రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే రిలయన్స్ జియోలో 13 విదేశీ సంస్థలు భారీగా ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థలన్నింటికీ, రిలయన్స్ రిటైల్‌లో కూడా ఇన్వెస్ట్ చేసే ఆఫర్ లభించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక అమెజాన్ తర్వాత కేకేఆర్ సంస్థ పెట్టుబడి వార్తలు వస్తాయని అంచనా. రిలయన్స్ రిటైల్‌లో వాటా విక్రయం ద్వారా రూ.60,000–రూ.1.5 లక్షల కోట్ల మేర సమీకరించే అవకాశాలున్నాయని సమాచారం. -
టాటా.. ఆన్ లైన్ బాట!
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ తాజాగా ఈ–కామర్స్ విభాగంలో అమెజాన్, రిలయ¯Œ ్సకు గట్టి పోటీనిచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని రకాల వినియోగ ఉత్పత్తులు, సర్వీసులను డిజిటల్ మాధ్యమం ద్వారా కస్టమర్లకు చేరువ చేసే దిశగా ప్రత్యేక ఈ–కామర్స్ యాప్‌ను రూపొందించుకుంటోంది. ఇప్పటికే దీని నమూనా సిద్ధమైంది. ఈ ఏడాది ఆఖర్లో లేదా వచ్చే ఏడాది తొలినాళ్లలో ఆవిష్కరించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆల్–ఇన్ –వన్ ..: టాటా గ్రూప్ కంపెనీలు ప్రస్తుతం.. కార్లు, ఎయిర్‌కండీషనర్లు, స్మార్ట్ వాచీలు, టీ మొదలైన అనేక ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. అలాగే లగ్జరీ హోటల్స్, ఎయిర్‌లై¯Œ్స, బీమా వ్యాపారం, డిపార్ట్మెంటల్ స్టోర్స్, సూపర్‌మార్కెట్ చెయిన్ మొదలైనవి నిర్వహిస్తున్నాయి. టెట్లీ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి ప్రతిష్టాత్మక బ్రాండ్లు టాటా పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. రిటైల్ వినియోగదారులతో నేరుగా సంబంధాలు నెరపే ఈ వ్యాపార విభాగాల ఉత్పత్తులు, సర్వీసులన్నింటికీ ఈ ఆల్–ఇన్–వన్‌యాప్ ఉపయోగపడనుంది. టా టా డిజిటల్ విభాగం సీఈవో ప్రతీక్ పాల్ ఈ యాప్ రూపకల్పనకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పాల్‌కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో 3 దశాబ్దాల అనుభవం ఉంది. రిటైల్ విభాగం గ్లోబల్ హెడ్‌గా వ్య వహరించిన సమయంలో వాల్‌మార్ట్, టెస్కో, ఆల్డి, టార్గెట్, బెస్ట్ బై, మార్క్స్ అండ్ స్పెన్సర్ గ్రూప్ వంటి అంతర్జాతీయ రిటైల్ దిగ్గజాలు డిజిటల్ బాట పట్టడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. -
‘అన్‌లాక్’తో ఇ–కామర్స్ టేకాఫ్
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ప్రభుత్వం క్రమంగా సడలిస్తూ అన్‌లాక్ చేస్తున్న నేపథ్యంలో ఇ–కామర్స్ వ్యాపారం పుంజుకుంటోంది. షాపింగ్ కోసం బైటికెళ్లడాన్ని తగ్గించుకుంటూ ఆన్లైన్ మాధ్యమానికి వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తుండటం ఇందుకు తోడ్పడుతోంది. ఇక, పెరుగుతున్న వ్యాపారంతో పాటు ఇ–కామర్స్ విభాగంలో కొత్తగా మరింత మందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దేశంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత ఇ–కామర్స్ వ్యాపారం దాదాపు 80 శాతం పెరిగింది. దాదాపు 10 కోట్లమంది క్రియాశీలంగా ఉండే వినియోగదారులతో ఇ–కామర్స్ రంగం అంతకంతకూ వృద్ధి చెందుతోందని నివేదిక పేర్కొంది. లాక్డౌన్ ముందటి పరిస్థితి కంటే కూడా ప్రస్తుతం ఇ–కామర్స్ వ్యాపారం ఎక్కువగా ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అన్ని రకాల వస్తువులను విక్రయించే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఇ–కామర్స్ సంస్థలే కాదు... కిరాణా సరుకులు, వ్యాయామ పరికరాలు వంటి ప్రత్యేక కేటగిరీ వస్తువులను విక్రయించే సంస్థల వ్యాపారం కూడా జోరందుకుంది. ఐఏఎంఏఐ నివేదిక ప్రకారం దేశంలో ఇ–కామర్స్ వ్యాపారం ఇలా ఉంది... లాక్డౌన్ రోజుల్లో 80 శాతం వ్యాపారం డౌన్ దేశంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలులో ఉన్న ఏప్రిల్, మేలో ప్రభుత్వం కేవలం నిత్యావసర వస్తువుల విక్రయానికే అనుమతించింది. దాంతో ఇ–కామర్స్ వ్యాపారం దాదాపు 80 శాతం తగ్గిపోయింది. మార్చి చివరి వారం నుంచి జూన్ మొదటివారం వరకూ దేశీయంగా ఇ–కామర్స్ సంస్థలు దాదాపు రూ.7,520 కోట్ల వ్యాపారాన్ని కోల్పోయారని అంచనా. ఉపాధికీ ఊతం.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇతర రంగాల్లో ఉద్యోగాల్లో కోత విధిస్తుంటే ఇ–కామర్స్ రంగం కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా వినియోగదారులకు సకాలంలో సరఫరా చేసేందుకు ఇ–కామర్స్ సంస్థలు కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. అమెజాన్ ఇండియా తమ పంపిణీ వ్యవస్థలో కొత్తగా 50వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అటు బిగ్ బాస్కెట్ ఇటీవల కొత్తగా 12వేలమంది సిబ్బందిని నియమించుకుంది. గ్రోఫర్స్ సంస్థ ఇప్పటికే కొత్తగా 2,500 మందిని రిక్రూట్ చేసుకోగా ...మరో 5వేలమంది ఉద్యోగులను త్వరలో తీసుకుంటామని చెప్పింది. అటు ఇ–కామ్ ఎక్స్‌ప్రెస్ సంస్థ ఇటీవల కొత్తగా 7,500 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. అన్‌లాక్‌తో జోరందుకున్న వ్యాపారం మే మూడో వారం నుంచి లాక్డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తున్న ప్రభుత్వం జూన్ నుంచి మరింత వెసులుబాటు కల్పించడం ఇ–కామర్స్ సంస్థలకు అనుకూలంగా మారింది. ఇ–కామర్స్ సంస్థలు దేశంలోని దాదాపు 19వేల పిన్‌కోడ్ ప్రాంతాల్లో ప్రస్తుతం సరుకులు అందిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో రోజుకు 30లక్షల వరకు షిప్మెంట్లను డెలివరీ చేస్తున్నాయి. మరికొంతకాలం పాటు వినియోగదారులు షాపింగ్ కోసం ఎక్కువగా బయటకు వెళ్లే పరిస్థితి లేనందున రాబోయే రెండు నెలల్లో ఈ వ్యాపారం మరింత పెరుగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సంస్థలవారీగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఉత్పత్తుల విషయం చూస్తే.. అమెజాన్ ఇండియా పోర్టల్‌లో ప్రధానంగా ఉద్యోగుల ‘వర్క్ ఫ్రం హోం’, విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు సంబంధించిన వస్తువుల విక్రయం విపరీతంగా పెరిగింది. మొత్తం మీద అమెజాన్ వ్యాపారం 50 శాతం పెరిగింది. ఇక, మరో దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వ్యాపారం 90 శాతం ఎగిసింది. ఈ పోర్టల్ ద్వారా వ్యాయామ పరికరాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, గృహ అలంకరణ వస్తువుల విక్రయాలు గణనీయంగా ఉంటున్నాయి. -
కరోనా సంక్షోభం: స్నాప్‌డీల్ డెలివరీ హామీ
సాక్షి, ముంబై: కోవిడ్ -19 లాక్ డౌన్ కారణంగా ఇ-కామర్స్ మార్కెట్లు అవసరమైన వస్తువులను పంపిణీ చేయడానికి చాలా కష్టపడుతున్నాయి. ప్రారంభ రోజుల్లో నిత్యావసరాల సరఫరాపై స్పష్టత లేకపోవడంతో, ఎక్కువ మంది గిడ్డంగులను మూసివేయవలసి వచ్చింది. అలాగే డెలివరీల సమయంలో ఉద్యోగులకు కూడా పెద్ద కొరత ఏర్పడింది. చాలా ఆర్డర్లను నిరాకరించాయి. వస్తువులను రవాణా చేయలేకపోయిన ఫలితంగా చాలా ఇ-కామర్స్ కంపెనీ గిడ్డంగుల్లో నిల్వలు పేరుకు పోయాయి. అయితే తాజాగా ఇ-కామర్స్ మార్కెట్, స్నాప్‌డీల్ 6-10 రోజులలోపు అవసరమైనవాటిని పంపిణీ చేస్తామని వినియోగదారులకు హామీ ఇస్తోంది. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి, అత్యవసరాలను స్థానికంగా (నగరంలో మాత్రమే) పంపిణీ చేయడం ప్రారంభించినట్లు స్నాప్‌డీల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ వ్యవహారాలు కమ్యూనికేషన్స్) రజనీష్ వాహి చెప్పారు. ప్రారంభంలో మూసివేయాల్సి వచ్చిందని, కాని వేగంగా తిరిగి సేవల్లోకి ప్రవేశించామన్నారు. అయితే వివిధ నగరాల మధ్య పంపిణీ కాకుండా, ఇంట్రా-సిటీ మాత్రమే తమ సేవల అందిస్తున్నామని అందుకే వేగంగా బట్వాడా చేయగలుగుతున్నామని ఆయన చెప్పారు. గత 10 రోజులలో స్నాప్‌డీల్ స్థానిక ధాన్యం మార్కెట్లలోని డీలర్లతో, ఎఫ్ఎంసిజి హోల్‌సేల్ వ్యాపారులతో (వారిలో చాలా మందికి స్టాక్ ఉంది, కాని వాటిని మూసివేయవలసి వచ్చింది) ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితులలో వైద్య పరికరాలు కూడా చాలా అవసరం కాబట్టి సంబంధిత డీలర్లతో కూడా ఒప్పందం చేసుకున్నామన్నారు. నిత్యావసరాల సేకరణపై మాత్రమే దృష్టి పెట్టామని తమ వ్యాపార బృందాన్ని కోరామని వాహి వివరించారు. కేవలం పది రోజుల్లో తమ సామర్థ్యాన్ని పెంచుకున్నామని, సాధారణ పరిస్థితులలో ఇందుకు ఐదు-ఆరు నెలలు పట్టేదని ఆయన చెప్పారు. అలాగే ఈ సంక్షోభ సమయం దేశవ్యాప్తంగా అనేక చిన్న అమ్మకందారులు, చిన్న చిన్న గిడ్డంగులున్న దుకాణాదారులు ప్రయోజనాలకు ఉపయోగపడిందని ఆయన చెప్పారు. మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కరోనా వైరస్ ను అడ్డుకునే క్రమంలో అమలవుతున్న లాక్ డౌన్ ఇంటికే పరిమితమైన తమ వినియోగదారులకు ఇ-కామర్స్ సేవలు అందించే క్రమంలో మరో అడుగు ముందు కేశామని. అన్ని వనరులను సమీకిస్తూ అవసరమైన అత్యవసర సామాగ్రిని పంపిణీ చేయడానికి, డెలివరీ సామర్థ్యాన్ని పెంచుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని సీనియర్ ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి వెల్లడించడం గమనార్హం. చదవండి : కరోనా కాటు : 36 వేల మంది ఉద్యోగులు సస్పెన్షన్ -
ఫ్లిప్‌కార్ట్‌కు ఊరట
న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ)లో ఊరట లభించింది. సంస్థపై దివాలా పక్రియ ప్రారంభానికి సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇచ్చిన రూలింగ్‌ను అప్పిలేట్ ట్రిబ్యునల్ కొట్టేసింది. ఎన్సీఎల్టీ నియమించిన తాత్కాలిక రిజల్యూషన్ ప్రొఫెషనల్‌కి కీలక ఆదేశాలిస్తూ, కేసు రికార్డులను, కంపెనీ అసెట్స్‌ను తక్షణం ప్రమోటర్‌కు స్వాధీనం చేయాలంది. ఫ్లిప్‌కార్ట్‌కు ఆపరేషనల్ క్రెడిటార్‌గా ఉన్న క్లౌండ్‌వాకర్ స్ట్రీమింగ్ టెక్నాలజీస్ సెక్షన్ 9 కింద దాఖలు చేసిన ఇన్సాల్వెన్సీ పిటిషన్‌ను ఎన్సీఎల్టీ బెంగళూరు బెంచ్ గతేడాది అక్టోబర్ 24న అనుమతించింది. (సీసీఐపై సంచలన ఆరోపణలు, హైకోర్టుకు ఫ్లిప్‌కార్ట్) దీనిపై ఫ్లిప్‌కార్ట్ ఇండియా డైరెక్టర్ నీరజ్ జైన్ అప్పీల్ చేశారు. దిగుమతి చేసుకున్న ఎల్ఈడీ టీవీల సరఫరాల లావాదేవీకి సంబంధించి రూ.26.95 కోట్లు ఫ్లిప్‌కార్ట్ బకాయి పడినట్లు క్లౌండ్‌వాకర్ స్ట్రీమింగ్ టెక్నాలజీస్ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. దీనిని ఎన్సీఎల్టీ ఆమోదించడాన్ని అప్పిలేట్ ట్రిబ్యునల్ కొట్టివేస్తూ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్రప్సీ కోడ్ (ఐబీసీ) సెక్షన్ 8 (1) కింద పంపిన నోటీసు ‘‘తగిన విధంగా లేదు. అసంపూర్తిగానూ ఉంది’’ అని తన ఉత్తర్వులో పేర్కొంది. రుణ చెల్లింపులకు సంబంధించి తగిన డాక్యుమెంట్లనూ క్లౌండ్‌వాకర్ స్ట్రీమింగ్ టెక్నాలజీస్ సమర్పించలేకపోయినట్లు తెలిపింది. తగిన ఇన్వాయిస్లు, దివాలా పిటిషన్లో పేర్కొన్న డాక్యుమెంట్ నకళ్లనూ ట్రిబ్యునల్ ముందు ఉంచలేకపోయినట్లు పేర్కొంది. -
ఫుడ్ డెలివరీలోకి అమెజాన్
న్యూఢిల్లీ: అమెరికన్ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ .. భారత్‌లో కార్యకలాపాలను జోరుగా విస్తరిస్తోంది. కేవలం ఆన్లైన్ షాపింగ్ పోర్టల్‌కే పరిమితం కాకుండా కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. తాజాగా ఫుడ్ డెలివరీ సేవలను కూడా ప్రారంభించనుంది. తద్వారా ఈ విభాగంలో దిగ్గజాలైన స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని మార్చిలో ప్రకటించవచ్చని, ప్రైమ్ నౌ యాప్ ద్వారా ఈ సర్వీసులు అందించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. íస్విగ్గీ, జొమాటోలు డిస్కౌంట్లలో కోత పెట్టి, కఠిన వ్యయ నియంత్రణ చర్యలు అమలు చేస్తున్న పరిస్థితుల్లో అమెజాన్ ఎంట్రీ ఇవ్వబోతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ ఈమధ్యే తమ ఉబెర్‌ఈట్స్ ఇండియాను జొమాటోకు విక్రయించేసిన సంగతి తెలిసిందే. సమగ్ర వ్యాపార వ్యూహం.. ‘ప్రైమ్’ పెయిడ్ చందాదారులకు.. నిత్యావసరాలు, ఆహారం మొదలుకుని ఎలక్ట్రానిక్స్, ఇతరత్రా గృహావసరాల ఉత్పత్తుల శ్రేణిని కూడా అందించే వ్యూహంలో భాగంగానే అమెజాన్ ఈ కొత్త విభాగంలోకి ప్రవేశిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్కెట్లోకి ప్రవేశించేందుకు అమెజాన్ మీనమేషాలు లెక్కబెడుతూ కూర్చోదని.. మార్కెట్లోకి ఎప్పుడొచ్చామన్నది కాకుండా.. చివర్లో వచ్చినా కూడా గెలవొచ్చన్నది ఆ సంస్థ సిద్ధాంతమని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ఫుడ్ బిజినెస్‌నే అమెజాన్ ఎందుకు ఎంచుకున్నది వివరిస్తూ.. కన్జూమర్ టెక్నాలజీతో ముడిపడి ఉన్న వ్యాపార విభాగాల్లో ఫుడ్ డెలివరీకి అత్యధికంగా ఆదరణ ఉంటుందని .. తర్వాత స్థానాల్లో నిత్యావసరాలు, ఎఫ్ఎంజీసీ, సాధారణ ఈ–కామర్స్ లావాదేవీలు ఉంటాయని ఓ ఇన్వెస్టర్ వివరించారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కాస్త ఎక్కువ ఖర్చు పెట్టే వినియోగదారులు, మళ్లీ మళ్లీ కొనుగోళ్లు చేసే వారిని ఆకర్షించాలన్నది అమెజాన్ వ్యూహం. ప్రస్తుతానికి అమెజాన్ ఫుడ్ డెలివరీ సర్వీసులను సొంత ఉద్యోగులకే అమెజాన్ అందిస్తోంది. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్, బెల్లందూరు, హరలూరు, మరతహళ్లి, వైట్‌ఫీల్డ్ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. హోటళ్లతో ఒప్పందాలు .. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తికి చెందిన కాటమారన్ వెంచర్స్, అమెజాన్ ఇండియా కలిసి ఏర్పాటు చేసిన ప్రైవన్ బిజినెస్ సర్వీసెస్ సారథ్యంలో ఈ కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ డైరెక్టర్ (ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగం) రఘు లక్కప్రగడ ఈ వ్యూహానికి సారథ్యం వహిస్తున్నారు. పోటీ సంస్థలతో పోలిస్తే తక్కువ కమీషన్ కోట్ చేస్తూ హోటళ్లు, రెస్టారెంట్లతో ప్రైవన్ బిజినెస్ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. సుమారు 10–15 శాతం కమీషన్‌ను అమెజాన్ ప్రతిపాదిస్తోంది. స్విగ్గీ, జొమాటోలతో పోలిస్తే ఇది దాదాపు సగం. లాజిస్టిక్స్‌పై భారీగా పెట్టుబడులు ఫుడ్ డెలివరీ వ్యాపారం విజయవంతం కావాలంటే అమెజాన్ ఎక్కువగా లాజిస్టిక్స్, రెస్టారెంట్ వ్యవస్థ, టెక్నాలజీ, మార్కెటింగ్‌పై గణనీయంగా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందని నిపుణులు తెలిపారు. అలాగే, స్విగీ.. జొమాటోలను ఢీకొనాలంటే.. కొరియన్, జపనీస్ మొదలైన వంటకాలు కూడా అందించే రెస్టారెంట్లతో అమెజాన్ ప్రత్యేక ఒప్పందాలు కూడా కుదుర్చుకునే అవకాశముందని వివరించారు. ఇటీవలే 350 మిలియన్ డాలర్లతో ఉబెర్‌ఈట్స్‌ను జొమాటో కొనుగోలు చేసింది. అటు స్విగ్గీ కూడా ఇటీవలే ప్రస్తుత ఇన్వెస్టరు, దక్షిణాఫ్రికా దిగ్గజం నాస్పర్స్ సారథ్యంలో మరికొందరు ఇన్వెస్టర్ల నుంచి సుమారు 113 మిలియన్ డాలర్లు సమీకరించింది. -
దేశీ మార్కెట్లోకి అమెజాన్ ఫైర్ టీవీలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా తమ ఫైర్ టీవీ బ్రాండ్ స్మార్ట్ టీవీలను భారత్‌లో ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ఒనిడా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 32 అంగుళాల ఒనిడా ఫైర్ టీవీ స్మార్ట్ టీవీ ధర రూ.12,999 కాగా, 43 అంగుళాల టీవీ ధర రూ.21,999. డిసెంబర్ 20 నుంచి అమెజాన్‌డాట్‌ఇన్ పోర్టల్‌లో వీటి విక్రయం ప్రారంభమవుతుంది. ఈ ఫుల్ హెచ్డీ టీవీల్లో బిల్టిన్ వైఫై, 3 హెచ్డీఎంఐ పోర్టులు, 1 యూఎస్బీ పోర్టు, 1 ఇయర్‌ఫోన్ పోర్టు తదితర ఫీచర్స్ ఉంటాయి. ఫైర్ టీవీ స్మార్ట్ టీవీలను 2018లో అమెరికా, కెనడాలో అమెజాన్ పవ్రేశపెట్టింది. ఈ ఏడాది బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రియా తదితర దేశాల్లోకి విస్తరించింది. ఇందుకోసం డిక్సన్స్ కార్‌ఫోన్, మీడియామార్కెట్ శాటర్న్, గ్రండిగ్ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. భారత్‌లో ఒనిడాతో లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇతర సంస్థలతో కూడా కలిసి పనిచేసే అవకాశాలున్నాయని ఫైర్ టీవీ డివైజెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ విభాగం వైస్ ప్రెసిడెంట్ సందీప్ గుప్తా తెలిపారు. అమ్మకాల లక్ష్యాలను మాత్రం వెల్లడించలేదు. నాణ్యమైన పిక్చర్, సౌండ్ ఫీచర్స్‌తో అందుబాటు ధరల్లో ఒనిడా ఫైర్ టీవీ ఎడిషన్ లభిస్తుందని మిర్క్ ఎలక్ట్రానిక్స్ (ఒనిడా) బిజినెస్ హెడ్ సునీల్ శంకర్ తెలిపారు. అమెజాన్ ప్రస్తుతం భారత్‌లో ఫైర్ టీవీ స్ట్రీమింగ్ స్టిక్‌లు, ఎకో (స్మార్ట్ స్పీకర్స్), కిండిల్ (ఈ–బుక్ రీడర్) వంటి ఉత్పత్తులు విక్రయిస్తోంది. -
చిన్న నగరాల నుంచీ ఆన్‘లైన్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘నా చిన్నప్పుడు ఊర్లో వస్తువులు ఏవీ దొరికేవి కావు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవి కావు. వచ్చినా ఖరీదెక్కువగా ఉండేవి. ఇప్పుడు ఈ–కామర్స్ రాకతో ప్రపంచంలో లభించే ఏ వస్తువైనా ఆర్డరు చేయవచ్చు’ అని అమెజాన్ ఇండియా కేటగిరీ మేనేజ్మెంట్ డైరెక్టర్ షాలిని పుచ్చలపల్లి అన్నారు. అమెజాన్ ఫెస్టివ్ యాత్రలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఆమె సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. పారదర్శక ధర కారణంగానే భారత్‌లో ఈ–కామర్స్ విజయవంతం అయిందన్నారు. దేశ జనాభాలో 10 శాతం మంది ఈ–కామర్స్ వేదికగా ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు. ఒక ఉత్పాదనను విక్రయించేందుకు బెస్ట్ ప్రైస్‌తో విక్రేతలు పోటీపడతారని, ఇది కస్టమర్‌కు కలిసి వచ్చే అంశమని వివరించారు. చిన్న నగరాల నుంచే..: కొత్తగా అమెజాన్‌కు జతకూడుతున్న కస్టమర్లలో 91 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచే ఉన్నారని షాలిని వెల్లడించారు. ‘99.6% పిన్‌కోడ్స్‌కు చేరుకున్నామంటే ఈ–కామర్స్ పట్ల పెరిగిన అవగాహనే ఉదాహరణ. అమెజాన్ పోర్టల్‌లో 20 కోట్లకుపైగా ఉత్పత్తులు విక్రయిస్తున్నాం. రోజూ 2 లక్షల ప్రొడక్టులు జోడిస్తున్నాం. 5 లక్షల మంది సెల్లర్లున్నారు. ఆర్డర్లలో 40% ఒక రోజులోనే డెలివరీ చేస్తున్నాం. ప్రైమ్ కస్టమర్ల సంఖ్య 18 నెలల్లో రెండింతలైంది. కొనుగోలు నిర్ణయంపై కస్టమర్ రేటింగ్స్‌దే కీలక పాత్ర. నచ్చకపోయినా, నాసిరకంగా ఉన్నా ఉత్పాదనను 30 రోజుల్లో వెనక్కి ఇచ్చే అవకాశం ఉండడం వినియోగదార్లకున్న వెసులుబాటు’ అన్నారు. ఆన్‌లైన్‌కు పెద్ద బ్రాండ్లు..: ఆఫ్‌లైన్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న పెద్ద బ్రాండ్లను ఆన్‌లైన్‌కు తీసుకొచ్చామని అమెజాన్ ఫ్యాషన్ ఇండియా బిజినెస్ హెడ్ అరుణ్ సిర్దేశ్‌ముఖ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ బ్రాండ్లు కొన్ని ఉత్పాదనలను తొలిసారిగా అమెజాన్‌లో ప్రవేశపెట్టాయన్నారు. ఇవి రెండు రోజుల్లోనే తమ ఉత్పత్తులను డెలివరీ ఇస్తున్నాయని గుర్తు చేశారు. ఏడాదిలో కొత్తగా 1.20 లక్షల మంది సెల్లర్లు తోడయ్యారని కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్, మార్కెటింగ్ డైరెక్టర్ కిషోర్ తోట పేర్కొన్నారు. కాగా, ఫెస్టివ్ యాత్రలో భాగంగా ట్రక్కులపై నిర్మించిన నమూనా ఇంటిని కంపెనీ ప్రదర్శించింది. అమెజాన్ పోర్టల్‌లో లభించే ఉత్పత్తులతో ఈ ఇల్లును అందంగా తీర్చిదిద్దారు. ఫస్ట్ సేల్ అదుర్స్.. : సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 4 వరకు నిర్వహించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫస్ట్ సేల్ గ్రాండ్ సక్సెస్ అని అమెజాన్ ప్రకటించింది. రిసెర్చ్ ఏజెన్సీ నీల్సన్ ప్రకారం.. సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 4 మధ్య దేశంలో జరిగిన ఆన్లైన్ సేల్స్‌లో కస్టమర్లు, కొనుగోళ్ల పరంగా అమెజాన్ అధిక వాటా సొంతం చేసుకుంది. 500లకుపైగా సిటీస్ నుంచి 65,000ల కంటే ఎక్కువ సెల్లర్లకు ఆర్డర్లు లభించాయి. మిలియనీర్, క్రోర్‌పతి సెల్లర్స్ సంఖ్య 21,000 దాటింది. స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో 15 రెట్లు, పెద్ద ఉపకరణాలు 8 రెట్ల వృద్ధి నమోదైంది. ఎకో డివైసెస్ 70 రెట్ల వృద్ధి సాధించాయి. -
ఈ–కామర్స్ @ మేడిన్ ఇండియా
భారీ దిగుమతి సుంకాల బెడద తప్పించుకునేందుకు, మేకిన్ ఇండియా నినాద ప్రయోజనాలను పొందేందుకు ఈ–కామర్స్ దిగ్గజాలు క్రమంగా భారత్‌లో తయారీపై దృష్టి పెడుతున్నాయి. ఇప్పటిదాకా సొంత బ్రాండ్స్ కోసం చైనా, మలేసియాపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్ కొన్నాళ్లుగా మేడిన్ ఇండియా ఉత్పత్తులవైపు మొగ్గుచూపుతోంది. దీంతో తమ ప్లాట్‌ఫాంపై విక్రయించే దాదాపు 300 కేటగిరీల ఉత్పత్తుల ధరలను గణనీయంగా తగ్గించగలిగామని కంపెనీ వెల్లడించింది. ‘‘రెండేళ్ల క్రితం దాకా దాదాపు 100 శాతం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు చైనా నుంచే వచ్చేవి. ప్రస్తుతం ఇది 50 శాతానికన్నా తక్కువకి పడిపోయింది. ఇక మా ఫర్నిచర్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టినప్పుడు మొత్తం శ్రేణిని మలేసియా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇది 50 శాతం కన్నా తక్కువే ఉంది’’ అని ఫ్లిప్‌కార్ట్ ప్రైవేట్ లేబుల్ బిజినెస్ విభాగం హెడ్ ఆదర్శ్ మీనన్ చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం మార్క్యూ, పర్ఫెక్ట్ హోమ్స్, బిలియన్, స్మార్ట్ బై మొదలైన ప్రైవేట్ బ్రాండ్స్‌ను విక్రయిస్తోంది. ఇవి కంపెనీ మొత్తం అమ్మకాల్లో 8 శాతం దాకా ఉంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, టెక్స్టైల్స్, ఆండ్రాయిడ్ టీవీలు, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషీన్స్, చిన్న స్థాయి ఉపకరణాలు మొదలైనవాటిని దేశీయంగా సోర్సింగ్ చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దాదాపు 50–60 శాతం యాక్సెసరీలను కూడా భారత్ నుంచే సోర్సింగ్ చేస్తోంది. అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజాలను భారత్‌లో తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఆహ్వానిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చిన్న వ్యాపారస్తుల నిరసనలు.. స్మార్ట్‌ఫోన్స్ దిగుమతులపై భారీగా సుంకాల వడ్డన ఉండటంతో యాపిల్ వంటి టెక్ దిగ్గజాలు తమ ఐఫోన్స్ తదితర ఖరీదైన ఉత్పత్తులను భారత్‌లోనే తయారు చేయడంపై దృష్టి పెడుతున్నాయి. ఫాక్స్‌కాన్, విస్ట్రన్ వంటి సంస్థలు వీటిని తయారు చేస్తున్నాయి. అమెజాన్ కూడా చాలా మటుకు ప్రైవేట్ లేబుల్స్‌ను భారత్‌లోనే రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. ఏసీలు, మొబైల్‌ఫోన్ యాక్సెసరీలు, నిత్యావసరాలు, గృహోపకరణాలు, ఆహారోత్పత్తులు తదితర ప్రైవేట్ లేబుల్స్ అమెజాన్‌కు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ దాదాపు 150 ఫ్యాక్టరీల నుంచి ఉత్పత్తులు సేకరిస్తుండగా.. వీటిలో 100 ఫ్యాక్టరీలు భారత్‌కి చెందినవేనని సంస్థ ప్రైవేట్ లేబుల్ వ్యాపార విభాగం హెడ్ మీనన్ పేర్కొన్నా రు. అయితే, విలువపరంగా చైనా, మలేసియాతో పోలిస్తే భారత ఉత్పత్తుల వాటా ఎంత ఉంటోందనేది మాత్రం తెలపలేదు. ఇలా సొంత ప్రైవేట్ లేబుల్స్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ప్రవేశపెడుతుండటాన్ని గత రెండేళ్లుగా చిన్న వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల వీటితో పోటీపడేందుకు తాము అసంబద్ధ స్థాయిలో ధరలను తగ్గించుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్ వంటి సంస్థలు సొంత ప్రైవేట్ లేబుల్స్ ఏర్పాటు చేసుకోకుండా నియంత్రిస్తూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను కేంద్రం గతేడాది డిసెంబర్లో మార్చినప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ వివరణనివ్వడంతో ప్రైవేట్ లేబుల్స్‌కు కొంత వెసులుబాటు లభిస్తోంది. చిన్న సంస్థలకు తోడ్పాటు.. ధరలపరంగానో నాణ్యతపరంగానో చాలా వ్యత్యాసాలు ఉన్న ఉత్పత్తులకు సంబంధించి మాత్రమే ప్రైవేటు లేబుల్స్‌ను ప్రవేశపెడుతున్నామని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పేర్కొన్నాయి. మరోవైపు, వాల్‌మార్ట్‌కి చెందిన పలు ప్రైవేట్ లేబుల్స్ కూడా భారత్‌లో తయారవుతున్నాయని, ఇది తయారీ భాగస్వామ్య సంస్థలకు తోడ్పాటుగా ఉంటోందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ప్రైవేట్ బ్రాండ్స్ వ్యాపారం ద్వారా ఇటు దేశీ తయారీ సంస్థలు, ఉత్పత్తిదారులు .. ముఖ్యంగా లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల వృద్ధికి, నవకల్పనల ఆవిష్కరణలకు మరింత మద్దతు లభిస్తోందని ఫ్లిప్‌కార్ట్ వర్గాలు తెలిపాయి. -
ధరాభారానికి ఆన్లైన్ ‘ఔషధం’!
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, గ్రోసరీలు, ఇతర వస్తువుల విషయంలో ఈ–కామర్స్ లావాదేవీలు పెరుగుతున్నట్టే... ఫార్మసీ రంగంలోనూ ఆన్లైన్ లావాదేవీలు మెల్లగా ఊపందుకుంటున్నాయి. వచ్చే నాలుగేళ్లలో... అంటే 2023 నాటికి దేశీయంగా ఈ–ఫార్మసీల మార్కెట్ 18.1 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుందనేది కన్సల్టెన్సీ సంస్థ ఈవై (ఎర్నస్ట్ అండ్ యంగ్) అంచనా. స్మార్ట్‌ఫోన్స్ ద్వారా ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండటం, ప్రాణాంతక వ్యాధులు.. వైద్య చికిత్స వ్యయాలు ఎక్కువవుతుండటం తదితర అంశాలు ఇందుకు కారణం కానున్నాయని ఈవై అభిప్రాయపడింది. ఈ నివేదిక మేరకు... ప్రస్తుతం ఈ–ఫార్మా సంస్థలకు అందు బాటులో ఉన్న మార్కెట్ పరిమాణం సుమారు 9.3 బిలియన్ డాలర్లు. ఇది వార్షికంగా 18.1% వృద్ధి చెందుతోంది. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరుగుతుండటం.. ఈ–కామర్స్ ప్లాట్‌ఫాం ద్వారా ఔషధాలను సులభతరంగా ఆర్డరు చేయగలుగుతుండటం వంటి అంశాలు ఈ–ఫార్మా మార్కెట్ వృద్ధికి దోహదపడుతున్నాయి. ప్రాణాంతక వ్యాధులు, తలసరి ఆదాయం, వైద్య చికిత్స వ్యయాలు పెరుగుతుండటం సైతం ఈ–ఫార్మసీ మార్కెట్‌కు తోడ్పడుతోంది. ‘మొబైల్స్ వినియోగం పెరగటం, డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలు మెరుగుపడటం వంటి అంశాలతో భారత్‌లో ఈ–కామర్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది. దీంతో ఈ–కామర్స్‌లో భాగమైన ఆన్లైన్ ఫార్మసీలకు క్రమంగా ప్రాచుర్యం పెరుగుతోంది. వీటికి గణనీయమైన వృద్ధి అవకాశాలున్నాయి‘ అని ఈవై ఇండియా పార్ట్నర్ (ఈ–కామర్స్ అండ్ కన్జూమర్ ఇంటర్నెట్ విభాగం) అంకుర్ పహ్వా చెప్పారు. ప్రభుత్వ వ్యయాల తోడ్పాటు.. వైద్యంపై ఇటు ప్రభుత్వం అటు ప్రజలు చేసే వ్యయాలు గణనీయంగా పెరుగుతుండటం వచ్చే నాలుగేళ్లలో ఈ–ఫార్మసీ మార్కెట్ మరింతగా విస్తరించేందుకు దోహదపడనుందని ఈవై తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా 35 శాతం ఫార్మా మార్కెట్ ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఔషధాలది కాగా మిగతా 65 శాతం.. తీవ్ర అనారోగ్యాలకు సంబంధించినదిగా ఉంటోంది. ప్రాణాంతక వ్యాధుల ఔషధాల మార్కెట్లో 85 శాతం వాటాను, తీవ్ర అనారోగ్యాల ఔషధాల మార్కెట్లో 40 శాతాన్ని ఈ– ఫార్మసీలు లక్ష్యంగా చేసుకోవచ్చని నివేదిక సూచించింది. స్థానిక ఫార్మసీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుని నేరుగా ఇంటి దగ్గరకే ఔషధాలను అందించగలగడం ఈ– ఫార్మసీలకు దోహదపడవచ్చని పేర్కొంది. ఈ–ఫార్మా కంపెనీలు భారీమొత్తంలో డిస్కౌంట్లు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. లాభనష్ట రహిత స్థితికి రావాలన్నా, అర్థవంతమైన లాభాలు చూడాలన్నా డిస్కౌంట్లు సముచిత స్థాయిలకు రావాల్సిన అవసరం ఉందని నివేదిక వివరించింది. అంతర్జాతీయ సంస్థల దూకుడు.. రాబోయే రోజుల్లో ఈ–ఫార్మా వ్యాపార విభాగంలో అంతర్జాతీయ ఈ–కామర్స్ సంస్థలు మరింత దూకుడుగా కార్యకలాపాలు విస్తరించవచ్చని ఈవై నివేదిక వివరించింది. అంతర్జాతీయ అనుభవం, దేశీయంగా వివిధ విభాగాల్లో కార్యకలాపాలు ఉండటం వాటికి తోడ్పడగలదని పేర్కొంది. ఫిన్‌టెక్, హెల్త్‌టెక్ సంస్థలు కూడా ఈ విభాగంలోకి ప్రవేశించి తమ సేవల పరిధిని మరింతగా విస్తరించడానికి వీలుందని వివరించింది. డెలివరీ వ్యవస్థను మరింత మెరుగ్గా వినియోగించుకునేందుకు హైపర్‌లోకల్ సంస్థలు (ఫుడ్ టెక్, నిత్యావసరాల విక్రయ సంస్థలు, కేవలం డెలివరీ మాత్రమే చేసే సంస్థలు) కూడా ఈ–ఫార్మా విభాగంపై దృష్టి పెట్టొచ్చని పేర్కొంది. -
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ ఈ కామర్స్ రంగంలో భారీ పెట్టుబడులతో దూసుకొస్తున్న విదేశీ కంపెనీలకు షాకిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కామర్స్ నిబంధనలను కఠినతరం చేస్తూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో మార్పులను తీసుకొచ్చింది. ఈ నిర్ణయం దేశీయ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మేజర్ వాటానుసొంతం చేసుకున్న వాల్‌మార్ట్‌కు, అమెరికా ఆన్లైన్ రీటైలర్ అమెజాన్‌కు భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా భారీ ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఈ కంపెనీలకు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి. అలాగే పండుగ సీజన్లో తక్కువ ధరకే వస్తువులను సొంతం చేసుకోవాలను కునే వినియోగదారుడికి భారీ నిరాశే. చిన్న వ్యాపారస్తులనుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, ఆన్లైన్ రిటైల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి సవరించిన కొత్త విధానంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పుష్కలంగా నిధులున్న ఈ-కామర్స్ సంస్థల తీవ్ర పోటీ నుంచి దేశీ వ్యాపార సంస్థల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఈ నిబంధనలు రూపొందించినట్లు వివరించింది. తాజా నిబంధనలు ఫిబ్రవరి 1నుంచి అమల్లోకి రానున్నాయి. నిబంధనలు తమకు వాటాలున్న కంపెనీల ఉత్పత్తులను ఈ-కామర్స్ సంస్థలు తమ సొంత పోర్టల్స్‌లో విక్రయించడం కుదరదు. ధరను ప్రభావితం చేసేలా ఏ ఉత్పత్తులను ఎక్స్‌క్లూజివ్‌గా తమ పోర్టల్స్‌లోనే విక్రయించేలా ఈ-కామర్స్ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకోకూడదు. తమ షాపింగ్ పోర్టల్స్‌లో విక్రయించే విక్రేతలకు సర్వీసులు అందించడంలో ఈ-కామర్స్ సంస్థలు పక్షపాతం, వివక్ష చూపించకూడదు. లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, అడ్వర్టైజ్మెంట్, మార్కెటింగ్, పేమెంట్స్, ఫైనాన్సింగ్ మొదలైన సర్వీసులు ఇందులో ఉంటాయి. ఈ-కామర్స్ సంస్థకు చెందిన గ్రూప్ కంపెనీలు.. కొనుగోలుదారులకు అందించే క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్ల విషయంలో న్యాయబద్ధంగా, వివక్ష లేకుండా వ్యవహరించాల్సి ఉంటుంది. తమ దగ్గరున్ననిల్వల్లో 25శాతం ఉత్పత్తులకు మించి విక్రయించరాదు. నిబంధనలన్నింటినీ పాటిస్తున్నట్లుగా ప్రతి ఆర్థిక సంవత్సరం ఆడిట్ సర్టిఫికెట్‌ను ఈ- కామర్స్ కంపెనీలు ఆ పై ఏడాది సెప్టెంబర్ 30లోగా రిజర్వ్ బ్యాంక్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుత విధానం ప్రకారం విక్రేత, కొనుగోలుదారుకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించే మార్కెట్‌ప్లేస్ తరహా ఈ-కామర్స్ సంస్థల్లో మాత్రమే ప్రస్తుతం 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులు ఉన్నాయి. ఇలాంటి సంస్థలు తాము స్వయంగా కొనుగోళ్లు జరిపి, ఉత్పత్తులను నిల్వ చేసుకుని, విక్రయించడానికి లేదు. కొనుగోలుదారులకు ఈ-కామర్స్ కంపెనీలు భారీ డిస్కౌంట్లిస్తూ తమ వ్యాపారాలను దెబ్బ తీస్తున్నాయంటూ దేశీ వ్యాపార సంస్థల నుంచి పెద్ద యెత్తున ఫిర్యాదులు రావడంతో ఈ-కామర్స్ సంస్థలను నియంత్రించే క్రమంలో కేంద్రం తాజా చర్యలు ప్రకటించింది. అయితే దీనిపై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. పెట్టుబడులకు ప్రతికూలం కొత్త నిబంధనలపై పరిశ్రమవర్గాలు మిశ్రమంగా స్పందించాయి. కొత్తగా మరింత మంది విక్రేతలను ఆన్లైన్ ప్లాట్‌ఫాం వైపు ఆకర్షించే దిశగా పెడుతున్న పెట్టుబడులపై ఇవి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ-కామర్స్ రంగంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వ్యాఖ్యానించారు. సర్క్యులర్‌ను పరిశీలిస్తున్నామని అమెజాన్ ఇండియా ప్రతినిధి వెల్లడించగా, స్పందించేందుకు ఫ్లిప్‌కార్ట్ నిరాకరించింది. స్వాగతించిన సీఏఐటీ తాజా నిబంధనలను ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ స్వాగతించింది. ఈ-కామర్స్ రంగాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని, ఈ-కామర్స్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని కోరింది. "సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న విజయం ఇది. దీన్ని సక్రమంగా అమలు చేస్తే..ఈ-కామర్స్ కంపెనీలు పాటించే అనుచిత వ్యాపార విధానాలు, పోటీ లేకుండా చేసే ధరల విధానాలు, భారీ డిస్కౌంట్లు మొదలైనవి ఇకపై ఉండబోవు" అని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ వ్యాఖ్యానించారు. స్నాప్‌డీల్, ఫ్యూచర్స్ గ్రూపు హర్షం అటు తాజా నిబంధనలపట్ల ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ హర్షం వ్యక్తం చేసింది. "మార్కెట్‌ప్లేస్‌లనేవి నిఖార్సయిన, స్వతంత్ర వెండార్ల కోసం ఉద్దేశించినవి. వీటిలో చాలా సంస్థలు చిన్న, మధ్యస్థాయి కోవకి చెందినవే. కొత్త మార్పులతో.. అందరికీ సమాన అవకాశాలు లభించగలవు" అని స్నాప్‌డీల్ సీఈవో కునాల్ బెహల్ వ్యాఖ్యానించారు. ఇదొక గేమ్ ఛేంజర్‌లాంటిదని ఫ్యూచర్ గ్రూప్ ఛైర్మన్ కిషోర్ బియానీ వ్యాఖ్యానించారు. ఈ విధానానికి ప్రతీ రీటైలర్ కట్టుబడి ఉండాలి. వినియోగదారుడి ప్రయోజనాలకు నష్టం అయితే తాజా నిబంధనలు అంతిమంగా వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తాయని మరికొంతమంది వాదిస్తున్నారు. టెక్నోపాక్ వ్యవస్థాపకుడు ఫౌండర్ అరవింద్ సింఘాల్ మాట్లాడుతూ కొత్త విధానంలో అనేక పాయింట్లకు అర్థంలేదన్నారు. అసలు భారీ డిస్కౌంట్ అంటే ఏమిటీ? ప్రతి విక్రయదారుడికి సమాన అధికారులుంటాయా? వారి వారి వ్యూహాత్మక కారణాల ఆధారంగా ప్రతి సరఫరాదారుడు, కొనుగోలుదారిడి సంబంధాలు ఉంటాయి. ఇది చాలామంది వ్యాపార్తసులకు ప్రయోజనాలకు హానికరమైందని వ్యాఖ్యానించారు. కాగా ‘ఈ–కామర్స్ వ్యాపార నిర్వహణ ఇటు రిటైలర్లకు, అటు వినియోగదారులకు ఇది ప్రయోజనకరంగా ఉండేలా కొత్త విధానాన్ని తీసుకురానున్నామని ఇటీవల కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. .ఈ కామర్స్ వ్యాపారంలో ధరలు, డిస్కౌంట్ల విషయంలో పూర్తి పారదర్శకత ఉండాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. .@Snapdeal welcomes updates to FDI policy on e-commerce. Marketplaces are meant for genuine, independent sellers, many of whom are MSMEs. These changes will enable a level playing field for all sellers, helping them leverage the reach of e-commerce. @rabhishek1982 @DIPPGOI https://t.co/tWojv3gXA7 — Kunal Bahl (@1kunalbahl) December 26, 2018 -
క్లిక్ చేస్తే ఇంటికే మందులు..
⇒ ఆన్లైన్ బాటపట్టిన ఫార్మసీలు ⇒ అగ్రస్థానంలో అపోలో, మెడ్‌ప్లస్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దుస్తులు, ఎలక్ట్రానిక్స్, పుస్తకాలు.. ఇవే కాదు ఈ-కామర్స్ వ్యాపారంలోకి ఇప్పుడు మందులూ వచ్చి చేరాయి. క్లిక్ చేస్తే చాలు ఎంచక్కా ఇంటికే వచ్చి చేరుతున్నాయి. అదీ కొన్ని గంటల వ్యవధిలోనే. ఇంటర్నెట్ విస్తరణతో ఈ-కామర్స్ వ్యాపారం భారత్‌లో జోరు మీద ఉంది. ఏది కావాలన్నా అర చేతిలోని స్మార్ట్‌ఫోన్‌లో కస్టమర్లు ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. ఈ అంశమే ఫార్మసీ రిటైల్ కంపెనీలకు కలిసి వచ్చింది. ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, సౌందర్య సాధనాలే కాదు నిత్యావసర ఔషధాలనూ ఆన్లైన్లో విక్రయిస్తున్నాయి. ఇక్కడ మరో విశేషమేమంటే ఇతర కంపెనీల (సబ్‌స్టిట్యూట్) మందులూ, వాటి ధరలు తెలుసుకునే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి. క్యాష్ ఆన్ డెలివరీ.. అపోలో ఫార్మసీ, మెడ్‌ప్లస్ మార్ట్, గార్డియన్ ఫార్మసీ ప్రస్తుతానికి ఈ-కామర్స్ బాట పట్టాయి. అపోలో, మెడ్ప్లస్లు ఒక అడుగు ముందుకేసి నిత్యావసర మందులనూ ఆన్లైన్లో విక్రయిస్తున్నాయి. ఈ-కామర్స్ కంపెనీల మాదిరిగానే క్యాష్ ఆన్ డెలివరీ (ఇంటి వద్దే చెల్లింపు) విధానాన్ని ఈ కంపెనీలు అనుసరిస్తున్నాయి. ఆర్డరు ఇచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఉత ్పత్తులను ఇంటికి చేరవేస్తున్నాయి. స్కిన్ కేర్, హెయిర్ కేర్, వ్యక్తిగత సంరక్షణ, విటమిన్లు, సప్లిమెంట్లు, పిల్లల ఉత్పత్తులు.. ఇలా వేలాది రకాలు ఆన్లైన్లో కొలువుదీరాయి. ఆయుర్వేద, విదేశీ ఉత్పత్తులనూ ఇక్కడి కస్టమర్ల కోసం ఆఫర్ చేస్తున్నాయి. ప్రైవేట్ లేబుల్ ప్రొడక్టులూ విక్రయించుకునేందుకు ఫార్మసీలకు ఈ-కామర్స్ చక్కని వేదికగా నిలుస్తోంది. పేరు నమోదు అయితేనే..: ఆన్లైన్లో మందులను ఆర్డరు ఇవ్వాలనుకుంటే ఫార్మసీల్లో ప్రత్యక్షంగా, లేదా వెబ్సైట్ ద్వారా కస్టమర్లు తమ పేరు నమోదు చేసుకోవాలి. వైద్యులు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ (మందుల చీటీ) నకలును వెబ్‌సైట్‌కు అప్లోడ్ చేయాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను సరఫరా చేయరు. కంపెనీని బట్టి రూ.500-600 ఆపై విలువ చేసే ఉత్పత్తులు ఆర్డరు చేస్తే ఎటువంటి అదనపు చార్జీ లేకుండా ఉచితంగా డెలివరీ చేస్తున్నాయి. అంతేకాదు డిస్కౌంట్లూ ఆఫర్ చేస్తున్నాయి. అపోలో ఫార్మసీ ద్వారా అయితే కనీసం రూ.200 విలువ చేసే మందులను ఆర్డరు చేయాలి. ఉత్పత్తుల విలువ రూ.600 దాటితే ఉచిత డెలివరీ. రూ.600 లోపు ఉంటే డెలివరీ చార్జీ రూ.55 చెల్లిం చాలి. డబ్బులు ముందుగా చెల్లిస్తే కస్టమర్ కోరిన ప్రదేశంలో డెలివరీ చేస్తోంది అపోలో ఫార్మసీ. నచ్చిన బ్రాండ్.. నిత్యావసర మందులను భారత్‌లో ఆన్లైన్లో తొలుత పరిచయం చేసింది హైదరాబాద్‌కు చెందిన మెడ్‌ప్లస్. ఈ కంపెనీ మెడ్‌ప్లస్‌మార్ట్.కామ్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో విక్రయాలు చేపడుతోంది. స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల కోసం అప్లికేషన్(యాప్)ను కూడా అందుబాటులోకి తెచ్చింది. వెబ్సైట్ ప్రత్యేకత ఏమంటే ప్రతి మందుకు సబ్‌స్టిట్యూట్(ప్రత్యామ్నాయ) మందులనూ తెరపై చూపిస్తుంది. ఒక్కో ఔషధం ధర కంపెనీని(బ్రాండ్) బట్టి మారుతుంది. ధర, కస్టమర్ అడిగిన మందుకు, ఇతర బ్రాండ్ల మందులకుగల ధర వ్యత్యాసం, తయారు చేసిన కంపెనీ వివరాలూ పొందుపరిచింది. ఉదాహరణకు జీఎస్కే కంపెనీ తయారు చేసిన క్రోసిన్ను తీసుకుంటే అందులో ఉండే మందు ప్యారాసిటమాల్. ఇతర కంపెనీల ప్యారాసిటమాల్ మందులూ తెరపై ప్రత్యక్షమవుతాయి. తక్కువ ధరలో లభించే మంచి బ్రాండ్‌ను కస్టమర్ ఎంచుకోవచ్చు.