తోబుట్టువులు యశోద, రియా
మన అవసరమే మనకో దారి చూపుతుంది. ఎరుకతో ముందడుగు వేస్తే విజయం సుగమమం అవుతుంది. అందుకు ఉదాహరణే ఈ బెంగళూరు సిస్టర్స్. అమ్మకు పూజ చేసుకోవడానికి సరైన పూలు దొరకడం లేదని గ్రహించిన ఈ తోబుట్టువులు ఇదే సమస్య అన్ని చోట్లా ఉందని తెలుసుకున్నారు. పది లక్షల రూపాయలతో పూల వ్యాపారాన్ని ప్రారంభించారు. కోట్లలో లాభాలను ఆర్జిస్తున్నారు.
యశోద కరుటూరి, రియా కరుటూరి ఈ ఇద్దరు తోబుట్టువులు పువ్వుల లోకంలో విహరిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. కేవలం ప్రారంభించిన మూడేళ్లలోనే పూల పరిశ్రమలో పెద్ద బ్రాండ్‌గా తమ కంపెనీని నిలబెట్టారు. యశోద, రియా 14 ఫిబ్రవరి 2019న బెంగళూరులో ‘హువు’ ఫ్రెష్‌ని ప్రారంభించారు. 28 ఏళ్ల రియా మాట్లాడుతూ ‘హువు’ అంటే కన్నడ భాషలో పువ్వు అని చెప్పింది. కంపెనీ ప్రారంభించిన కొన్ని నెలల్లోనే కోవిడ్ కారణంగా వ్యాపారం నిలిచిపోయిందంటూ తాము ఎదుర్కొన్న సమస్యనూ వివరించింది.
తల్లి ప్రేరణ
కంపెనీ తొలినాళ్ల గురించి ఈ తోబుట్టువులు ప్రస్తావిస్తూ –‘దేశ పుష్పాల రాజధాని బెంగళూరు లో నివాసముంటున్నా సరైన పూలు దొరకడం లేదని, ఆ పువ్వులు కూడా తాజాగా లేవని మా అమ్మ ఆవేదన చెందేది. అప్పుడే పువ్వుల వ్యాపారం ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చింది..’ అంటూండగానే రియా అక్క యశోద అందుకుని మాట్లాడుతూ ‘మా చిన్నతనంలో మా నాన్న ఇథియోపియా, కెన్యాలో గులాబీ తోట సాగు చేసేవారు. విదేశాలకు కూడా ఎగుమతి చేసేవారు. కొన్ని కారణాల వల్ల ఆ వ్యాపారం తగ్గిపోయింది. మేం స్వదేశానికి వచ్చేశాం.
మహిళలకు ఉపాధి
‘భారతదేశంలో సాధారణంగా పూజా పుష్పాలను దేవాలయాల చుట్టూ మాత్రమే విక్రయిస్తుంటారు. అలాగే, బండిపైనో, రోడ్డు పక్కనో కూర్చొని మహిళలు పూజాపుష్పాలను అమ్ముతుంటారు. ఈ విధానం అస్తవ్యస్తంగా ఉందని గ్రహించాం. మేము ఈ పూలవ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు, పరిశ్రమలో చేరడానికి మహిళలు చాలా ఆసక్తి చూపారు. కంపెనీ మొదలైనప్పుడు పాతిక మంది మహిళలు ఉండగా నేడు వారి సంఖ్య వందల్లో పెరిగింది. ఉపాధి వల్ల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. వారి పిల్లలు మంచి పాఠశాలల్లో చదువుతున్నారు.
నెలకు లక్షన్నర ఆర్డర్లు
ప్రతి నెలా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, మైసూర్, పూణె, ముంబై, గురుగ్రామ్, నోయిడా తదితర ప్రాంతాల నుంచి... ఒకటిన్నర లక్ష ఆర్డర్లు అందుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఉన్న కస్టమర్లే కావడం విశేషం. ఇది కనిష్టంగా రూపాయి నుండి ప్రారంభమవుతుంది. 25 రూపాయల పూల ప్యాక్‌లో వివిధ రకాల పూలు ఉంటాయి. పువ్వులు రెండు వారాల పాటు తాజాగా ఉండే విధంగా ప్యాక్ చేస్తాం. దీన్ని తాజాగా ఉంచడానికి ఇథిలీన్ బ్లాకర్స్, ఇతర టెక్నాలజీని ఉపయోగిస్తాం. ప్యాకేజింగ్‌లో జీరో టచ్ ఫ్లవర్ టెక్నిక్ కూడా ఉంది. ఈ ప్యాకెట్లు పర్యావరణ అనుకూలమైనవి, ఇవి సులభంగా మట్టిలో కలిసిపోతాయి. మా కంపెనీ వాడినపూలతో అగరుబత్తులను కూడా తయారు చేస్తుంది. ఇవి పూర్తిగా సేంద్రీయమైనవి. బొగ్గు, రసాయనాలు ఏ మాత్రమూ ఉండవు.
రైతులతో అనుసంధానం
గతంలో రైతులు మండీలో పూలు విక్రయించేవారు, అక్కడ తరచుగా నష్టపోయేవారు. అక్కడ పూలకు సరైన ధర లభించేది కాదు. సకాలంలో పూలు అమ్మకపోతే సగానికిపైగా వృథా అయ్యేవి. పూలకు సరైన ధర రైతులకు అందేలా వందలాది మంది రైతులను కంపెనీతో అనుసంధానం చేశాం. ఈ విధానంలో పూలు కూడా వృథా కావు. మా కంపెనీకి వివిధ రాష్ట్రాల్లోని వందలాది మంది రైతులతో టై అప్‌లు ఉన్నాయి. దీనితోపాటు, డెలివరీ చైన్ సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేశాం.
ఆర్డర్లు వచ్చిన కస్టమర్లకు సకాలంలో డెలివరీ ఇస్తున్నాం. కొన్ని ఇ–కామర్స్ కంపెనీల ప్లాట్‌ఫారమ్‌లోనూ మా ఉత్పత్తులు లభిస్తున్నాయి’ అని వివరించారు ఈ తోబుట్టువులు.
Comments
Please login to add a commentAdd a comment