
బెంగళూరులో ఇప్పటికే ఇంటి అద్దెలు సామాన్యుడికి అందనిరీతిలో ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాంటిది సమీప భవిష్యత్తులో అద్దెలు మరింత పెరుగుతాయని అంచనాలు వెలువడుతున్నాయి. అందుకు ఇటీవల అక్కడి స్థానిక ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంటిలోని వ్యర్థాల తొలగింపు కోసం యూజర్ ఛార్జీలు వసూలు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో ఏప్రిల్ 1 నుంచి బెంగళూరు నివాసితుల ఆస్తి పన్నులు గణనీయంగా ప్రభావితం చెందే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే దీనిపై అధికారిక ఉత్తర్వులు ఇంకా జారీ కాలేదు.
గృహ వ్యర్థాల నిర్వహణ కోసం నివాసితులకు కర్ణాటక ప్రభుత్వం యూజర్ ఛార్జీలు ఆమోదించడంతో ఏప్రిల్ 1 నుంచి బెంగళూరు ప్రాపర్టీ యజమానుల ప్రాపర్టీ ట్యాక్స్‌లు పెరుగనున్నాయి. బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (బీఎస్‌డబ్ల్యూఎంఎల్) గత ఏడాది నవంబర్‌లో ఈ ఫీజును ప్రతిపాదించింది. అయితే అధికారిక ఉత్తర్వులు ఇంకా జారీ కాలేదు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని పట్టణాభివృద్ధి శాఖ యూజర్ ఫీజును మంజూరు చేసింది. ఈ పద్ధతులు అశాస్త్రీయంగా ఉన్నాయని స్థానికంగా విమర్శలు ఎదురవుతున్నా, ఇంటింటికీ చెత్త సేకరణ, దాని నిర్వహణ సేవలకు నిధులు సమకూర్చే సాధనంగా ఈ ఫీజు తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఛార్జీల వల్ల ఏటా సుమారు రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని బీఎస్‌డబ్ల్యూఎంఎల్ అంచనా వేస్తోంది.
ఇదీ చదవండి: ట్రంప్ ప్రభుత్వానికి ఓపెన్ ఏఐ హెచ్చరిక
ప్రభుత్వం విధించాలని తలపెట్టిన యూజర్ ఫీజును ఆస్తి పన్నులో జోడించనున్నారు. భవనం వైశాల్యాన్ని బట్టి ఇది మారుతుంది. నెలకు రూ.10 నుంచి రూ.400 వరకు ఫీజులు ఉండేలా ఆరు శ్లాబులను నిర్ణయించారు. 600 చదరపు అడుగుల వరకు ఉన్న భవనాలకు అతి తక్కువ రుసుము, 4,000 చదరపు అడుగులకు పైబడిన భవనాలకు గరిష్టంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో బెంగళూరు వాసులకు వార్షిక ఆస్తి పన్ను గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. పెద్ద అపార్ట్‌మెంట్ సముదాయాలు, వాణిజ్య సంస్థలు వంటి అధిక వ్యర్థాలు ఉత్పత్తి చేసే భవనాలు వీటి ప్రాసెసింగ్ కోసం వేస్టేజ్ ఎంప్యానెల్డ్ ఏజెన్సీ(వర్థాల నిర్వహణకు కేటాయించిన ప్రత్యేక సంస్థలు)ని ఉపయోగించకపోతే కిలో వ్యర్థానికి అదనంగా రూ.12 వసూలు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment