
బనశంకరి: బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యా రావు, ఆమె సన్నిహితుల ఇళ్లలో గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేపట్టింది. బెంగళూరులోని ల్యావెల్లి రోడ్డులోని రన్యా రావు ఇల్లు, కోరమంగళ, జయనగర, బసవనగుడి తదితర ప్రాంతాల్లోని ఆమె బంధుమిత్రుల నివాసాల్లో అధికారులు సోదాలు జరిపారు. రన్యా రావు విదేశాలకు వెళ్లడానికి విమానం టికెట్లు బుక్ చేసింది ఎవరు, ఈ టూర్లకు సాయం చేసిందెవరు, ఆమె వ్యవహారాల్లో ఎవరెవరి పాత్ర ఎంత? అనే విషయాలను తేల్చడానికి ఈ సోదాలు జరిపిన అధికారులు కొన్ని ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం.
బంగారం దందా చాలా పెద్దస్థాయిలో, దేశవ్యాప్తంగా ఉండి ఉండొచ్చని ఈడీ అనుమానిస్తోంది. రన్యా రావును కస్టడీలో విచారించిన డీఆర్‌ఐ అధికారులు ఆమె ఆప్తుడు, పారిశ్రామికవేత్త తరుణ్ రాజ్‌ను ప్రశ్నిస్తున్నారు. ఆమెపై డీఆర్‌ఐ కేసు నమోదుచేసి విచారిస్తుండగా, సీబీఐ రంగంలోకి దిగడం తెలిసిందే. ఈ రెండింటి ఆధారంగా తాజాగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ నెల 3న దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి వచి్చన రన్యా రావు వద్ద డీఆర్‌ఐ అధికారులు రూ.12.56 కోట్ల విలువైన బంగారం కడ్డీలను స్వాధీనం చేసుకోవడం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment