Womens Empowerment
-
పింక్ జెర్సీతో బరిలోకి దిగిన రాజస్తాన్.. ఎందుకంటే?
ఐపీఎల్-2024లో భాగంగా జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ పింక్ జెర్సీతో బరిలోకి దిగింది. గ్రామీణ మహిళా సాధికారతకు మద్దతు తెలియజేస్తూ ఈ స్పెషల్ జెర్సీని రాజస్తాన్ ఆటగాళ్లు ధరించారు. సవాయ్ మాన్సింగ్ స్టేడియం పింక్ కలర్‌తో నిండిపోయింది. అదే విధంగా ఈ మ్యాచ్ కోసం అమ్ముడైన ఒక్కో టికెట్టుపై రూ.100ను మహిళల వృద్ధికి ఆ ప్రాంచైజీ విరాళంగా ఇవ్వనుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో తమ జట్టు కొట్టే ఒక్కో సిక్సర్‌కు.. రాజస్థాన్‌లోని ఆరు కుటుంబాలకు సొలార్ పవర్‌ను ఆ ఫ్రాంచైజీ అందించనుంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సౌరవ్ చౌహాన్, రీస్ టోప్లీ, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, నాండ్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్ Tonight, we’re walking out to play for the women of Rajasthan… 💗#PinkPromise pic.twitter.com/ZPulqvGBI5 — Rajasthan Royals (@rajasthanroyals) April 6, 2024 -
మహిళా సాధికారతే మా లక్ష్యం
తిరువనంతపురం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేరళలో పర్యటించారు. రాజధాని తిరువనంతపురంలో బీజేపీ ఆధ్వర్యంలో ‘మహిళా శక్తి మోదీ వెంటే’ పేరిట నిర్వహించిన మహిళల బహిరంగ సభలో ప్రసంగించారు. కేంద్రంలో గత పదేళ్లలో మహిళల సంక్షేమం, సాధికారత కోసం తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రస్తావించారు. ‘మోదీ గ్యారంటీ’ల్లో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించామని చెప్పారు. మహిళల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఉజ్వల పథకం, మంచినీటి కుళాయి కనెక్షన్లు, మరుగుదొడ్ల నిర్మాణం, ముద్రా రుణాల పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేశామని ఉద్ఘాటించారు. త్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలకు స్వేచ్ఛ ప్రసాదించామని పేర్కొన్నారు. ఇచి్చన మాట నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. మహిళా సాధికారతే తమ లక్ష్యమని అన్నారు. పేదలు, మహిళలు, యువత, రైతుల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని తేలి్చచెప్పారు. మహిళల జీవన నాణ్యతను పెంచడమే లక్ష్యంగా మోదీ గ్యారంటీలను అమలు చేస్తున్నామని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. నారీశక్తి వందన్ అధినియమ్ ఇప్పుడు చట్టంగా మారిందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించే విషయంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు విపరీతమైన జాప్యం చేశాయని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో మంచి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
జెండర్ ఈక్వాలిటీ అంటే అది!'దటీజ్ జపాన్'
ఇటీవల జూన్ 24, 25 తేదీల్లో లింగ సమానత్వం, మహిళ సాధికారతపై జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. దీనికి జపాన్ ఆతిధ్య ఇచ్చింది. ఈ సదస్సులో ఏడుగురు మంత్రుల బృందం సమావేశమై ప్రతిజ్ఞ చేసింది. ఆ మంత్రులంతా మహిళా కార్యనిర్వాహకులకు మద్దతు ఇస్తామని, నిర్వాహక పాత్రలలో మహిళల ప్రాతినిధ్యాన్ని విస్తరింపజేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అయితే ఆ మంత్రుల సదస్సు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల దృష్టిని తెగ ఆకర్షించింది. అసాధారణరీతిలో లింగ సమానత్వ మహిళా మంత్రులు సదస్సులో ఒకే ఒక్క మగ మంత్రి తన దేశం తరుపున ప్రాతినిధ్య వహించడం విశేషం. ఈ సమావేశానకి ఆతిధ్యమిచ్చిన జపాన్ దేశమే మహిళ సాధికారతపై జరగుతున్న సదస్సుకు తన దేశం తరుఫు నుంచి ఓ ఫురుషుడిని పంపి అందర్నీ ఆశ్చర్యపర్చింది. జెండర్ ఈక్వాలిటీ అంటే అర్థం ఏమిటో చెప్పకనే చెప్పింది. పైగా చెప్పడం కాదు చేసి చూపడం లేదా ఆచరించి చూపడం అని చాచిపెట్టి కొట్టినట్లు చెప్పింది. "దటీజీ జపాన్" అని సగర్వంగా ఎలుగెత్తి చెప్పింది. ఇక ఆ సమావేశంలో తన దేశం తరుఫున పాల్గొన్న జపాన్‌కు చెందిన రాజకీయ ప్రముఖుడు, కేబినేట్ మంత్రి మసనోబు ఒగురా మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఆ సమావేశంలో ఏకైక పురుష డెలిగేట్ అయ్యినందుకు ఎలా భావిస్తున్నారని అడుగగా..లింగ సమానత్వం కోసం పురుషులు ఇంకాస్త చొరవ తీసుకుని ముందుకొచ్చి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాడు. ఇతర దేశాల సహకారంతో మహిళల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా పని చేస్తున్నట్లు చెప్పాడు. అలాగే లింగ సమానత్వమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పాడు. ఇదిలా ఉండగా, టైమ్ మ్యాగ్జైన్ ప్రకారం..వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన తాజా వార్షిక గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌ను విడుదల చేసిన కొద్ది రోజులకే జపాన్‌లో నిక్కోలో ఈ జీ7 శిఖారాగ్ర సమావేశం జరగడం గమనార్హం. కాగా, ఈ ఎకనామిక్ ఫోరం ఆర్థిక భాగస్వామ్యం, అవకాశం, విద్యాసాధన, ఆరోగ్యం, మనుగడ, రాజకీయ సాధికారత తదితర కీలక కొలమానాల ఆధారంగా ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌ని అంచనా వేస్తుంది. (చదవండి: ఎవరి ఆలోచనో అది!..'స్నేహితుల బెంచ్') -
లండన్ నుంచి పేదోళ్ల ఇంటి వరకు...
బ్రిటీష్–ఇండియన్ మోడల్‌గా ప్రసిద్ధురాలైన డీన వాపో లండన్–ఇండియాల మధ్య సంచరిస్తూ ఉంటుంది. ‘మల్టీ టాలెంటెడ్’గా పేరు తెచ్చుకున్న డీన మన దేశ పేదల కోసం పనిచేస్తోంది. అబుదాబిలో జరిగిన ‘గ్లోబల్ సమ్మిట్ ఆఫ్ ఉమెన్’లో స్త్రీసాధికారతకు సంబంధించి కీలక ఉపన్యాసం చేసింది... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో జరిగిన ‘గ్లోబల్ సమ్మిట్ ఆఫ్ ఉమెన్’లో వందదేశాల నుంచి వివిధరంగాల మహిళలు పాల్లొన్నారు. ప్రధాన వక్తల్లో డీన వాపో (మిస్ ఇండియా, యూకే విన్నర్ 2012) ఒకరు. ‘భిన్నరంగాలకు చెందిన నిష్ణాతులు, మేధావులతో కలిసి ఈ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉంది. లింగ సమానత్వం, మహిళా సాధికారత, మహిళల నాయకత్వం...మొదలైన అంశాలపై విస్తృతమైన చర్చ జరిగింది. ఎన్నో రకాల విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది’ అంటుంది డీన. భారతీయ మూలాలు ఉన్న డీన వాపో బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘కొత్త విద్య నేర్చుకున్నప్పుడల్లా నీకు నువ్వు కొత్తగా కనిపిస్తావు. కొత్త శక్తి నీలోకి వచ్చి చేరుతుంది’ అంటున్న డీన చిన్న వయసులోనే పాటలు పాడడంలో ప్రావీణ్యం సంపాదించింది. నటన, నృత్యాలలో భేష్ అనిపించుకుంది. కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించింది. మోడల్ రంగంలోకి అడుగు పెట్టి సక్సెస్ అయింది.2012లో ‘మిస్ ఇండియా యూకే’ కిరీటంతో ప్రపంచదృష్టిని ఆకర్షించింది. మన బాలీవుడ్‌తో సహా ఎన్నో సినిమాల్లో నటించిన డీన ‘డీకెయూ వరల్డ్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయకేతనం ఎగరేసింది....ఇదంతా ఒక కోణం అయితే ‘డీకేయూ కైండ్‌నెస్’ ట్రస్ట్ అనేది మరో కోణం. సామాజిక కోణం. అట్టడుగు వర్గాల ప్రజలకు విద్య, వైద్యం, లైఫ్‌స్కిల్స్...మొదలైన వాటికి ఉపకరించే ట్రస్ట్ ఇది. ఈ ట్రస్ట్ తరపున రెండు సంవత్సరాల క్రితం రాజస్థాన్‌లోని వివిధ ప్రాంంతాలకు వెళ్లి స్కూల్లో చదివే బాలికలతో, వారి తల్లిదండ్రులతో మాట్లాడింది. ట్రస్ట్ తరఫున ఎడ్యుకేషనల్ కిట్స్ పంచింది. ‘మీకు సహాయం చేయడానికి డీకేయూ ట్రస్ట్ ఉందనే విషయం ఎప్పుడూ మరవద్దు. ఇది మా ట్రస్ట్ కాదు. మనందరి ట్రస్ట్’ అని చెప్పి పిల్లలు, తల్లిదండ్రులలో ధైర్యాన్ని నింపింది డీన. గత సంవత్సరం దీపావళి పండగను రాజస్థాన్‌లోని జహొర అనే గ్రామంలో జరుపుకుంది. స్వీట్లు, ఎడ్యుకేషనల్ టూల్స్ పంచడమే కాదు తమ ట్రస్ట్ గురించి వారికి వివరించింది. ‘క్షేత్రస్థాయిలోకి వెళ్లడం ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. మన ప్రపంచం విస్తృతం అవుతుంది. చేయాలనుకున్న మంచి పనుల జాబితాలో మరి కొన్ని పనులు వచ్చి చేరుతాయి’ అంటుంది డీన. ఇంగ్లాండ్‌లోని బ్రాగటి నగరంలో పుట్టింది డీన. తన పన్నెండవ యేట తండ్రి క్యాన్సర్‌తో చనిపోయాడు. ఆతరువాత తల్లితో కలిసి మిడ్లాండ్స్(సెంట్రల్ ఇంగ్లాండ్)కు వెళ్లింది. ఒక విషాదానికి సంబంధించిన జ్ఞాపకాలకు దూరంగా, గాలి మార్పు కోసం తల్లి తనను కొత్త ప్రదేశానికి తీసుకు వెళ్లింది. అయితే డీనకు కొత్త ప్రదేశాలే కాదు కొత్త విద్యలు నేర్చుకోవడం అంటే కూడా ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే తనను పదిమందిలో ప్రత్యేకంగా కనిపించేలా చేసింది. ‘ఇండియాస్ ఫర్గాటెన్ పీపుల్’ (నెట్ఫిక్స్)లో నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది డీన. అయితే విస్మరణ వర్గాల గురించి ఆమె తపన కాల్పనిక చలన చిత్రానికే పరిమితం కావడం లేదు. ట్రస్ట్ కార్యకలాపాల ద్వారా తన ఆదర్శలు, ఆలోచనలు వాస్తవ రూపం దాల్చుతున్నాయి. -
Hoovu Fresh: పువ్వుల వ్యాపారం.. 10 లక్షల పెట్టుబడితో ఆరంభం.. కోట్లలో లాభాలు!
మన అవసరమే మనకో దారి చూపుతుంది. ఎరుకతో ముందడుగు వేస్తే విజయం సుగమమం అవుతుంది. అందుకు ఉదాహరణే ఈ బెంగళూరు సిస్టర్స్. అమ్మకు పూజ చేసుకోవడానికి సరైన పూలు దొరకడం లేదని గ్రహించిన ఈ తోబుట్టువులు ఇదే సమస్య అన్ని చోట్లా ఉందని తెలుసుకున్నారు. పది లక్షల రూపాయలతో పూల వ్యాపారాన్ని ప్రారంభించారు. కోట్లలో లాభాలను ఆర్జిస్తున్నారు. యశోద కరుటూరి, రియా కరుటూరి ఈ ఇద్దరు తోబుట్టువులు పువ్వుల లోకంలో విహరిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. కేవలం ప్రారంభించిన మూడేళ్లలోనే పూల పరిశ్రమలో పెద్ద బ్రాండ్‌గా తమ కంపెనీని నిలబెట్టారు. యశోద, రియా 14 ఫిబ్రవరి 2019న బెంగళూరులో ‘హువు’ ఫ్రెష్ని ప్రారంభించారు. 28 ఏళ్ల రియా మాట్లాడుతూ ‘హువు’ అంటే కన్నడ భాషలో పువ్వు అని చెప్పింది. కంపెనీ ప్రారంభించిన కొన్ని నెలల్లోనే కోవిడ్ కారణంగా వ్యాపారం నిలిచిపోయిందంటూ తాము ఎదుర్కొన్న సమస్యనూ వివరించింది. తల్లి ప్రేరణ కంపెనీ తొలినాళ్ల గురించి ఈ తోబుట్టువులు ప్రస్తావిస్తూ –‘దేశ పుష్పాల రాజధాని బెంగళూరు లో నివాసముంటున్నా సరైన పూలు దొరకడం లేదని, ఆ పువ్వులు కూడా తాజాగా లేవని మా అమ్మ ఆవేదన చెందేది. అప్పుడే పువ్వుల వ్యాపారం ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చింది..’ అంటూండగానే రియా అక్క యశోద అందుకుని మాట్లాడుతూ ‘మా చిన్నతనంలో మా నాన్న ఇథియోపియా, కెన్యాలో గులాబీ తోట సాగు చేసేవారు. విదేశాలకు కూడా ఎగుమతి చేసేవారు. కొన్ని కారణాల వల్ల ఆ వ్యాపారం తగ్గిపోయింది. మేం స్వదేశానికి వచ్చేశాం. మహిళలకు ఉపాధి ‘భారతదేశంలో సాధారణంగా పూజా పుష్పాలను దేవాలయాల చుట్టూ మాత్రమే విక్రయిస్తుంటారు. అలాగే, బండిపైనో, రోడ్డు పక్కనో కూర్చొని మహిళలు పూజాపుష్పాలను అమ్ముతుంటారు. ఈ విధానం అస్తవ్యస్తంగా ఉందని గ్రహించాం. మేము ఈ పూలవ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు, పరిశ్రమలో చేరడానికి మహిళలు చాలా ఆసక్తి చూపారు. కంపెనీ మొదలైనప్పుడు పాతిక మంది మహిళలు ఉండగా నేడు వారి సంఖ్య వందల్లో పెరిగింది. ఉపాధి వల్ల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. వారి పిల్లలు మంచి పాఠశాలల్లో చదువుతున్నారు. నెలకు లక్షన్నర ఆర్డర్లు ప్రతి నెలా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, మైసూర్, పూణె, ముంబై, గురుగ్రామ్, నోయిడా తదితర ప్రాంతాల నుంచి... ఒకటిన్నర లక్ష ఆర్డర్లు అందుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది నెలవారీ సబ్స్క్రిప్షన్ ఉన్న కస్టమర్లే కావడం విశేషం. ఇది కనిష్టంగా రూపాయి నుండి ప్రారంభమవుతుంది. 25 రూపాయల పూల ప్యాక్‌లో వివిధ రకాల పూలు ఉంటాయి. పువ్వులు రెండు వారాల పాటు తాజాగా ఉండే విధంగా ప్యాక్ చేస్తాం. దీన్ని తాజాగా ఉంచడానికి ఇథిలీన్ బ్లాకర్స్, ఇతర టెక్నాలజీని ఉపయోగిస్తాం. ప్యాకేజింగ్‌లో జీరో టచ్ ఫ్లవర్ టెక్నిక్ కూడా ఉంది. ఈ ప్యాకెట్లు పర్యావరణ అనుకూలమైనవి, ఇవి సులభంగా మట్టిలో కలిసిపోతాయి. మా కంపెనీ వాడినపూలతో అగరుబత్తులను కూడా తయారు చేస్తుంది. ఇవి పూర్తిగా సేంద్రీయమైనవి. బొగ్గు, రసాయనాలు ఏ మాత్రమూ ఉండవు. రైతులతో అనుసంధానం గతంలో రైతులు మండీలో పూలు విక్రయించేవారు, అక్కడ తరచుగా నష్టపోయేవారు. అక్కడ పూలకు సరైన ధర లభించేది కాదు. సకాలంలో పూలు అమ్మకపోతే సగానికిపైగా వృథా అయ్యేవి. పూలకు సరైన ధర రైతులకు అందేలా వందలాది మంది రైతులను కంపెనీతో అనుసంధానం చేశాం. ఈ విధానంలో పూలు కూడా వృథా కావు. మా కంపెనీకి వివిధ రాష్ట్రాల్లోని వందలాది మంది రైతులతో టై అప్లు ఉన్నాయి. దీనితోపాటు, డెలివరీ చైన్ సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేశాం. ఆర్డర్లు వచ్చిన కస్టమర్లకు సకాలంలో డెలివరీ ఇస్తున్నాం. కొన్ని ఇ–కామర్స్ కంపెనీల ప్లాట్‌ఫారమ్‌లోనూ మా ఉత్పత్తులు లభిస్తున్నాయి’ అని వివరించారు ఈ తోబుట్టువులు. -
మహిళా సాధికారత అంటే ఇదీ..
సాక్షి, అమరావతి: మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకనుగుణంగా తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలతో మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధిస్తున్నారు. పార్టీలు, పైరవీలు, కులమతాలతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా రాష్ట్రంలో వెల్లువలా అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో మహిళలు దేశంలో ఎక్కడాలేని విధంగా తమ కాళ్ల మీద తామే ధైర్యంగా నిలబడగల్గుతున్నారు. నాటి పాలకులు నమ్మించి మోసం చేస్తే నేటి పాలకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో మహిళా సాధికారత సాకారమవుతోంది. రాష్ట్రంలో మొత్తం 1.03 కోట్ల మంది మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 2019 ముందు వరకు పట్టాలు తప్పిన ఆ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ప్రస్తుత ప్రభుత్వం వాటిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా.. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట రాష్ట్రవ్యాప్తంగా 78.76 లక్షల మంది మహిళలకు బ్యాంకుల్లో ఉన్న రూ.25,517 కోట్లను అప్పును వైఎస్సార్ ఆసరా పథకం పేరుతో నాలుగు విడతల్లో నేరుగా ఆ మహిళలకు అందజేయడానికి ప్రభుత్వం ముందుకొ చ్చింది. ఇప్పటికే రెండు విడతలుగా అందులో 12,758.28 కోట్లను చెల్లించింది. ఈ పథకంలో మహిళలకు ఇచ్చే డబ్బును వారు తిరిగి చెల్లించక్కర్లేదు. వాటిని వారు ఏ అవసరానికైనా ఉపయోగించుకునే స్వేచ్ఛనిచ్చింది. మరోవైపు 45–60 ఏళ్ల వయస్సు ఉండే 25 లక్షల మంది మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేల చొప్పున అందజేసేందుకు 2020 ఆగస్టు 12న వైఎస్సార్ చేయూత పేరుతో మరో పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీరికీ రెండు విడతలుగా రూ.9,179.69 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. ఇక రాష్ట్రంలో 18 ఏళ్లు, ఆ పైబడి వయస్సు ఉండే మహిళలు దాదాపు రెండు కోట్ల మంది ఉంటారని ఒక అంచనా. వీరిలో ఈ రెండు పథకాల ద్వారా దాదాపు కోటి మంది మహిళలు రూ.24,938 కోట్లు ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందారు. రుణాల మంజూరు, చెల్లింపుల్లోనూ మనమే టాప్ రాష్ట్రంలో 80 శాతానికి పైగా మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వివిధ పథకాల పేరుతో వీరికి ప్రభుత్వపరంగా ఒకవైపు ఆర్థిక చేయూత అందుతుండగా.. మరోవైపు బ్యాంకుల ద్వారా పొదుపు సంఘాల పేరుతో వారికి పెద్దఎత్తున రుణాలు అందజేసే ప్రక్రియ ఊపందుకుంది. దీంతో దాదాపు 9 లక్షల పొదుపు సంఘాలకు 2019 మే తర్వాత 33 నెలల కాలంలో రూ.61,106.38 కోట్ల రుణాలు అందాయి. అలాగే, గత ఏడాది ఏప్రిల్ నుంచి 2022 జనవరి మధ్య దాదాపు 45 లక్షల మంది మహిళలు రూ.19,095 కోట్లు రుణాలు పొందారు. దీంతో దేశవ్యాప్తంగా పొదుపు సంఘాల పేరుతో బ్యాంకులిచ్చే రుణాలలో దాదాపు 30 శాతం మన రాష్ట్రంలోని మహిళలకే అందుతున్నాయని గ్రామీణ పేదిరిక నిర్మూలన సంస్థ అధికారులు వెల్లడించారు. ఇలా రుణాలను ప్రభుత్వం ఇప్పించడంతోపాటు ఆ రుణాలను మహిళలు ఎప్పటికప్పుడు చెల్లించడంలోనూ మన రాష్ట్రమే దేశంలో అగ్రస్థానంలో ఉంది. రూ.2,354 కోట్ల వడ్డీని చెల్లించిన సర్కారు గతంలో పొదుపు సంఘాలకు బ్యాంకులు 13.50 శాతం వార్షిక వడ్డీకి రుణాలు ఇచ్చేవి. మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు వీలైనంత తగ్గించాలని సీఎం వైఎస్ జగన్ పలుమార్లు బ్యాంకర్ల సమావేశంలో చేసిన విజ్ఞప్తి ఫలితంగా ఇప్పుడు 9.50 శాతం వడ్డీకే ఇస్తున్నాయి. పొదుపు సంఘాల పేరుతో మహిళలు తీసుకున్న రుణాలపై వడ్డీని ప్రభుత్వమే ఏటా ఎప్పటికప్పుడు చెల్లిస్తోంది. ఇలా గత రెండేళ్లలో రూ.2,354 కోట్లు చెల్లించింది. ఎంఎన్సీ కంపెనీలతో అదనపు తోడ్పాటు ఇదిలా ఉంటే.. సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక తోడ్పాటుతో పాటు బ్యాంకు రుణాల ద్వారా అందజేసిన డబ్బుతో వారికి శాశ్వత జీవనోపాధి కల్పనకూ ప్ర త్యేక ఏర్పాట్లుచేసింది. మహిళలు వారి గ్రామాల్లో కిరాణా షా పులు వంటి చిరువ్యాపారాలను ప్రారంభించుకోవడానికి ముందుకొస్తే, వారికి హోల్‌సేల్ మార్కెట్లో దొరికే ధర కన్నా తక్కువకే సరుకులను సరఫరా చేసేందుకు వీలుగా మల్టీ నేషనల్ కంపెనీ (ఎంఎన్సీ)లతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. హిందూస్థాన్ యూనిలీవర్, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, ఐటీసీ, రిలయన్స్ వంటి సంస్థలతో పాటు.. పాడి పశువుల పెంపకం చేçపట్టే వారికి అధిక ధర దక్కేలా అమూల్ సంస్థతోనూ ఒప్పందం చేసుకుంది. అలాగే, పొట్టే ళ్లు, మేకలు, గొర్రెల పెంపకం చేపట్టే వారికి సైతం అధిక ధర దక్కేలా ప్రపంచ స్థాయిలో మాంసం వ్యాపారం చేసే అలానా సంస్థతోనూ ఒప్పందం చేసుకుంది. ఫలితంగా 4,77,851 కుటుంబాలు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాయి. నాడు విలవిల.. నేడు మిలమిల తెలుగుదేశం హయాంలో నాటి సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా రుణాలను మాఫీ చేయకపోవడంతో పొదుపు సంఘాల వ్యవస్థ కుప్పకూలిపోయింది. వాటి రుణాలపై అమలులో ఉన్న జీరో వడ్డీ పథకానికీ నిధులు ఇవ్వలేదు. దీంతో ప్రతినెలా కోట్ల రూపాయలను పొదుపు చేసుకునే మహిళలు ఒకానొక దశలో రూ.ఐదారు లక్షలు కూడా దాచుకోలేని పరిస్థితికి దిగజారాయి. 18.36 శాతం సంఘాలు రుణాలు చెల్లించలేక నిరర్థక ఆస్తులుగా మిగిలాయి. ఫలితంగా ఏ, బీ గ్రేడ్ల్లోని సంఘాలు సీ, డీ గ్రేడ్‌లోకి పడిపోయాయి. ఈ నేపథ్యంలో.. 2019లో వైఎస్సార్సీపీ సర్కారు వచ్చాక ప్రవేశపెట్టిన వైఎస్సార్ ఆసరా పథకంతో పాటు జీరో వడ్డీ పథకానికి ఎప్పటికప్పుడు నిధుల విడుదలతో పొదుపు సంఘాలన్నీ మళ్లీ జీవం పోసుకున్నాయి. ఎంతలా అంటే.. నిరర్థక ఆస్తులుగా ఉన్న 18.36% సంఘాలు 0.73 శాతానికి పరిమితమయ్యాయి. అంతేకాదు.. 99.27 శాతం మంది సకాలంలో రుణాలు చెల్లించేస్తున్నారు. అలాగే, గతంలో 40శాతం సంఘాలు ఏ, బీ గ్రేడ్లలోను, 60శాతం సంఘాలు సీడీ గ్రేడ్లలోనూ ఉండగా.. ప్రస్తుతం 90శాతం సంఘాలు ఏ, బీ గ్రేడ్ల స్థాయికి ఎదిగాయి. ► గుంటూరు జిల్లా రేపల్లె మండలం ఊలుపాలెం గ్రామానికి చెందిన కారుమూరు సుధాకరమ్మ ఆర్నెల్ల క్రితం వరకు వ్యవసాయ కూలీ. చదివించే స్థోమతలేక ఇంటర్ చదివిన ఒక్కగానొక్క కొడుకును పనిలో పెట్టింది. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఇచ్చిన ఆర్థిక తోడ్పాటుతో పాటు పొదుపు సంఘం పేరిట బ్యాంకు నుంచి వచ్చిన రుణంలో తన వాటాను కలిపి చిల్లరకొట్టు పెట్టుకుంది. దీంతో ఇప్పుడామె రోజూ రూ.రెండు, రెండున్నర వేల వరకు వ్యాపారం చేసుకుంటోంది. తద్వారా నాలుగైదు వందలు ఆదాయం వస్తోంది. అంతకుముందు ఏడాదిలో ఎక్కువ రోజులు డబ్బులకు కటకటలాడే సుధాకరమ్మ ఇప్పుడు మారిన పరిస్థితులతో తన కొడుకును డిగ్రీలో చేర్పించాలనుకుంటోంది. ► ఈమె పేరు ఇప్పిలి కళావతి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం రామచంద్రాపురం గ్రామం. ఈమె భర్త మరణించాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఒకరు మానసిక దివ్యాంగురాలు. రోజూ కూలీకి వెళ్తే వచ్చే డబ్బే ఈమెకు జీవనాధారం. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ సర్కారు అమలుచేసిన వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాలు ఆమె జీవితాన్ని మార్చాయి. ఆసరా పథకం ద్వారా రూ.37,642లు, వైఎస్సార్ చేయూత ద్వారా రెండు విడతల్లో రూ.37,500 జమకావడంతో ఆమె ఊరిలోనే టైలరింగ్ చేసుకుంటూ కిరాణాషాపు పెట్టుకుని గౌరవంగా జీవిస్తోంది. స్త్రీనిధి ద్వారా అదనంగా మరో రూ.50 వేలు మంజూరు కావడంతో వ్యాపారాభివృద్ధికి వినియోగించుకుంటోంది. ఇప్పుడు ప్రతినెలా ఖర్చులు పోను రూ.15 వేలు వరకు ఆదాయం వస్తోంది. ► ఈమె పేరు రేష్మ. ఊరు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు. పొదుపు సంఘంలో సభ్యురాలు కావడంతో ఇంట్లోనే చీరల వ్యాపారం ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో భర్త సలీం సహకారంతో శారీ మ్యాచింగ్ సెంటర్‌నూ ప్రారంభించారు. పొదుపు సంఘం ద్వారా రూ.50వేల బ్యాంకు రుణం వచ్చింది. అలాగే, సున్నా వడ్డీ కింద రూ.2వేలు మాఫీ అయ్యింది. అంతేకాక.. పొదుపు రుణ మాఫీ ద్వారా రెండేళ్లలో రూ.30 వేలు మాఫీ అయింది. మరోవైపు టైలరింగ్ చేస్తుండడంతో టైలర్లకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయం కింద రెండేళ్లలో రూ.20వేలు వచ్చింది. ఇలా.. వైఎస్ జగన్ సర్కారు తోడ్పాటుతో రెండేళ్లలో ఈ కుటుంబానికి రూ.లక్ష వరకు లబ్ధి చేకూరింది. ఇద్దరు పిల్లలు చదువుకుంటుండడంతో ‘అమ్మఒడి’ కూడా వచ్చింది. -
మహిళా సాధికారతకు ప్రతీక.. పాకిస్తాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఆయేషా మాలిక్
సంప్రదాయ ముస్లిం మెజారిటీ గల పాకిస్థాన్ దేశ న్యాయ చరిత్రలో ఒక మహిళ న్యాయమూర్తిగా జస్టిస్ ఆయేషా మాలిక్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం కోర్టులోని సెరిమోనియల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ ఆహ్మద్ 55 ఏళ్ల జస్టిస్ మాలిక్‌తో ప్రమాణం చేయించారు. దీనికి పెద్ద సంఖ్యలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అటార్నీ జనరల్, లాయర్లు, లా అధికారులు.. హాజరయ్యారు. జస్టిస్ మాలిక్ 2012లో లాహోర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పుడు మొట్టమొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ విధంగా పాకిస్థాన్ న్యాయవ్యవస్థలో చరిత్ర సృష్టించారు ఆయేషా మాలిక్. జూన్ 2031లో పదవీ విరమణ పొందేవరకు ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతారు. జస్టిస్ మాలిక్ పదోన్నతిని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ గత శువ్రారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జూన్ 2030లో పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం కూడా ఆయేషా మాలిక్‌కు ఉంది. ఆ విధంగా ఆమె మళ్లీ పాకిస్థాన్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి గా చరిత్రలో నిలిచిపోనున్నారు. ఆమె ఘనతను చెప్పే స్థాయి.. వేడుక ముగిసిన తర్వాత చీఫ్ జస్టిస్ అహ్మద్ విలేకరులతో మాట్లాడుతూ ‘జస్టిస్ మాలిక్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యేంత సమర్ధురాలు, ఆమె ఘనతను చెప్పేంత స్థాయి ఎవరికీ లేదు’ అన్నారు. సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి, జస్టిస్ మాలిక్ సాధించిన ‘మైలు రాళ్ల’కు అభినందనలు తెలిపారు. శ్రీ ఫవాద్ ట్వీట్ చేస్తూ ‘ఒక శక్తిమంతమైన చిత్రం. పాకిస్థాన్‌లో మహిళా సాధికారతకు ప్రతీక’ అని ప్రమాణ స్వీకారోత్సవ చిత్రంతో పాటు, జస్టిస్ ఆయేషా దేశ ‘న్యాయ వ్యవస్థ’కు ఒక ఆస్తిగా ఉంటారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. మహిళ అనే ఆశ్చర్యమా! లాహోర్ హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నప్పటికీ జస్టిస్ మాలిక్ అత్యుత్తమ స్థానానికి ఎంపికైనప్పుడు చాలామంది తమ కనుబొమలను పైకెత్తారు. ఆమె నామినేషన్‌ను పాకిస్థాన్ జ్యుడీషియల్ కమిషన్ (జేసీపీ) గతేడాది తిరస్కరించింది. కానీ, కమిషన్ ఈ నెల ప్రారంభంలో ఆమె పేరును రెండోసారి పరిశీలనకు తీసుకురాగా స్వల్ప మెజారిటీతో ఆమెదించింది. అత్యున్నత న్యాయవ్యవస్థకు న్యాయమూర్తులను నామినేట్ చేసే అత్యున్నత సంస్థ జెసీపీ సమావేశానికి చీఫ్ జస్టిస్ అహ్మద్ అధ్యక్షత వహించారు. సుపీరియర్ జ్యూడీషియరీ నియామకంపై జేసీపీ తర్వాత ద్వైపాక్షిక పార్లమెంటరీ కమిటీ ఆమోదం కోసం మాలిక్ నామినేషన్ ముందుకు వచ్చింది. మాలిక్ లాహోర్ హైకోర్ట్‌కి మొదటి మహిళా అత్యున్నత న్యాయమూర్తి కావడం వల్ల సీనియారిటీ సూత్రాన్ని పక్కన పెట్టి, కమిటీ ఆమె నామినేషన్‌ను ఆమోదించింది. సాధారణంగా హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. సుప్రీంకోర్టుకు వారి పదోన్నతిని ఆమోదించేటప్పుడు, గత సంవత్సరం ఆమె పేరును జేసీపీ తిరస్కరించడానికి ఇదీ ఓ కారణం. 1966లో జన్మించిన మాలిక్ పారిస్, న్యూయార్క్, కరాచీలోని పాఠశాలల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆమె లాహోర్‌లోని పాకిస్థాన్ కాలేజ్ ఆఫ్ లా లో ‘లా’ చదివారు. హార్వర్డ్ లా స్కూల్ నుండి ఎల్ఎల్ఎమ్ చేశారు. జూన్ 2021లో లైంగిక వేధింపుల నుండి బయటపడిన వారి పరీక్ష కోసం కన్యత్వ పరీక్షలు ‘చట్ట విరుద్ధం, పాకిస్థాన్ రాజ్యాంగానికీ వ్యతిరేకం’ అని ఆమె ఇచ్చిన తీర్పు ఒక మైలురాయి. సోమవారం ఇస్లామాబాద్‌లోని సుప్రీంకోర్టు భవనంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేస్తున్న ఆయేషా మాలిక్. -
ఎన్డీఏ ప్రవేశ పరీక్షలో మహిళలకూ అవకాశం
న్యూఢిల్లీ: లింగ వివక్షను రూపుమాపడంతోపాటు మహిళా సాధికారత దిశగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 5న జరుగబోయే నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ) ప్రవేశ పరీక్ష రాసేందుకు మహిళకు సైతం అవకాశం కల్పించాలని యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్సీ)ను బుధవారం ఆదేశించింది. ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను తుది తీర్పును బట్టి విడుదల చేయొచ్చని పేర్కొంది. ఎన్డీఏతోపాటు నావల్ అకాడమీ ప్రవేశ పరీక్షలను రాసే అవకాశాన్ని మహిళలకు సైతం కల్పించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వాలని కోరుతూ కుశ్ కాల్రా గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం దీనిపై విచారణ చేపట్టింది. ఎన్డీఏలో మహిళలకు ప్రవేశం కల్పించాలన్న పిటిషనర్ వినతి పట్ల ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. మహిళలకు ఎన్డీఏ అడ్మిషన్ టెస్టు రాసేందుకు అవకాశం ఇవ్వాలని, అందుకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేయాలని, దీని గురించి ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని యూపీఎస్సీని ఆదేశించింది. సైన్యం, నావికా దళంలో మహిళల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలని తాము గతంలో తీర్పులిచ్చామని, అయినా ప్రభుత్వ ఎందుకు స్పందించడం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీని ధర్మాసనం ప్రశ్నించింది. మహిళలు సైన్యంలోకి అడుగు పెట్టేందుకు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, ఇండియన్ మిలటరీ అకాడమీ వంటి మార్గాలు ఉన్నాయని ఐశ్వర్య భాటీ చెప్పారు. మరి ఎన్డీఏ ద్వారా మహిళలు సైన్యంలోకి ఎందుకు ప్రవేశించవద్దు, కో–ఎడ్యుకేషన్ ఏమైనా సమస్యా? అని ధర్మాసనం నిలదీసింది. ఎన్డీఏలోకి మహిళలను అనుమతించకూడదు అనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని భాటీ బదులిచ్చారు. -
Falguni Nayar: నైకా నాయిక
నైకా... సౌందర్య సాధనాల దిగ్గజం.. అందంతో పాటు మహిళా సాధికారత కూడా ఈ కంపెనీ లక్ష్యం... చిన్నస్థాయిలో ఆన్లైన్ వ్యాపారం ప్రారంభించి, కొన్ని కోట్ల టర్నోవర్ స్థాయికి ఎదిగారు నైకా సిఈవో ఫల్గుణీ నాయర్. ‘పెద్దగా ఆలోచించు, చిన్నగా ప్రారంభించు’ అనే వ్యాపార సూత్రాన్ని ఆచరించి చూపారు నైకా కంపెనీ సిఈవో ఫల్గుణీ నాయర్. బ్యూటీ ప్రాడక్ట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు. ‘మంచి శిక్షణ, ఉన్నత విద్య, అండగా నిలిచేవారు... ఈ మూడు అంశాలు ఒక స్త్రీని ఉన్నత స్థానం మీద కూర్చోబెడతాయి’ అంటారు ఫల్గుణీ నాయర్. చిన్న స్థాయిలో వ్యాపారం ప్రారంభించిన ఫల్గుణీ, అతి తక్కువ కాలంలోనే కొన్ని కోట్ల టర్నోవర్ స్థాయికి తీసుకువెళ్లారు. ఫల్గుణీ నాయర్ ఐఐఎం అహ్మదాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాక, 19 సంవత్సరాల పాటు కొటక్ మహీంద్రా గ్రూప్‌కి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా పనిచేశారు. 2005లో ఆ బ్యాంక్‌కి మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టి, 2012లో తన 50వ ఏట ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇందుకు రెండు కారణాలు చెబుతారు ఫల్గుణీ నాయర్. ‘‘నాకు మేకప్ అంటే చాలా ఇష్టం. అలాగే ఆన్లైన్ మార్కెట్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోవాలనే కోరిక బలంగా ఉంది. ఈ రెండు కారణాల వల్లే నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను’’ అంటున్న ఫల్గుణీ నాయర్ తల్లిదండ్రులు గుజరాతీలు. కాని ముంబైలో పుట్టి పెరిగారు. ఆమె తండ్రి వ్యాపారవేత్త. ‘‘మా నాన్న గారి నుంచే నాకు చిన్నతనంలోనే వ్యాపారం చేయాలనే వచ్చింది. మా ఇంట్లో అందరూ స్టాక్ మార్కెట్, ట్రేడ్ గురించి మాట్లాడుకునేవాళ్లం. అలా నాకు వ్యాపారం మీద అవగాహన కలిగింది’’ అంటారు. బ్యూటీకి సంబంధించిన ఉత్పత్తులకు భారతదేశంలో మంచి మార్కెట్ ఉందనీ, ఆ వ్యాపారం ప్రారంభించటం వల్ల తన కల నెరవేరుతుందని భావించారు. యుటీవీకి చెందిన రోనీ స్క్రూవాలా, పీవీఆర్ సినిమాస్‌కి చెందిన అజయ్ బిజిలీల నుంచి నాయకత్వ లక్షణాలతో పాటు, ఒడిదుడుకులను ఎదుర్కోవటానికి కావలసిన ఆత్మవిశ్వాసం అలవర్చుకున్నారు. విజయగాథ... ఎవరు ఏ ఉత్పత్తులు వాడితే మంచిదనే విషయాన్ని వివరిస్తూ 2012లో నైకా స్థాపించారు ఫల్గుణీ నాయర్. ఈ ఆలోచన రావటానికి కారణం... పలురకాల ఉత్పత్తులు తయారుచేస్తున్న సెఫోరా కంపెనీ. ఎన్నడూ సౌందర్య సాధనాలు ఉపయోగించని ఫల్గుణీ, వారి ఉత్పత్తులను వాడటం ప్రారంభించారు. అప్పుడే తను కూడా ఒక కంపెనీ ప్రారంభించి, భారతదేశ సౌందర్య సాధనాలను ప్రపంచానికి చూపాలనుకున్నారు. అదేవిధంగా భారతీయ మహిళలు ఆత్మవిశ్వాసంతో వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చూడాలని కలలు కన్నారు. ‘‘ఉత్తమ సౌందర్య సాధనాలు తయారుచేస్తూ, భారతదేశాన్ని సౌందర్య సాధనాలకు ప్రతిరూపంగా చూపుతూ, వినియోగదారులకు వాటి మీద అవగాహన కలిగించాలనుకున్నాను’’ అంటారు ఫల్గుణీ నాయర్. అందంగా కనిపించాలనే కోరిక ఉన్న మహిళలకు ఈ సాధనాలు ఉపయోగపడాలనుకున్నారు. అలా వారంతా నైకాకి అతి త్వరగా కనెక్ట్ అయ్యారు. మహిళలంతా ధైర్యంగా ముందుకు దూసుకుపోవాలి.. అంటారు ఫల్గుణీ నాయర్. నైకా ప్రారంభించినప్పుడు అదొక ఈ కామర్స్ వెబ్సైట్ మాత్రమే. ఇప్పుడు ఈ కంపెనీ మహిళా సాధికారతకు కావలసిన అంశాలను వివరించటం మీద దృష్టి పెట్టింది. ‘బ్యూటీ అండ్ వెల్నెస్’ మీద ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. వీటి వల్ల బ్యూటీ అడ్వైజర్ కావటానికి అవకాశం ఉంటుంది... అంటారు ఫల్గుణీ నాయర్. -
కొత్త అవకాశాలను అందుకున్నారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ పథకాలను ఔత్సాహిక మహిళలకు చేరవేయడంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (కోవె) శాయశక్తులా కృషి చేస్తోంది. మారుమూల ప్రాంతాల్లోని మహిళలకూ లబ్ధి చేకూర్చేందుకు పలు కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. నైపుణ్య శిక్షణ, ఉత్పత్తుల తయారీ మెళకువలు, మార్కెటింగ్‌లో సాయం, బ్యాంకుల నుంచి రుణం మంజూరులో కీలక పాత్ర పోషిస్తోంది. అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకూ వెన్నంటి ఉంటున్నామని కోవె నేషనల్ ప్రెసిడెంట్ సౌదామి ని ప్రొద్దుటూరి తెలిపారు. సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఆమె మాటల్లోనే.. ఆసరా లేని వారికీ.. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేస్తున్నాం. శిక్షణ ఇవ్వడమేగాక తదుపరి స్థాయికి వారు చేరేందుకు చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. 100 మందికిపైగా అంతర్జాతీయంగా ఎదిగారు. ఎటువంటి ఆసరా లేని వారూ కోవె తలుపు తడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వారి చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. కోవె సభ్యులే ఆర్థిక సాయం చేసి అండగా నిలుస్తున్నారు. వ్యాపార రుణం కో సం బ్యాంకుల వద్దకు వెళ్తున్న దరఖాస్తుల్లో 10% మాత్రమే సఫలం అవుతున్నాయి. నిబంధనల పేరుతో తిరస్కరించకుండా మిగిలిన 90% దరఖాస్తుదార్లకూ రుణం అందితేనే మరింత మంది మహిళలు వ్యాపారం చేసేందుకు ముందుకు వస్తారు. అవకాశాలుగా మల్చుకున్నారు.. కోవిడ్–19 మహమ్మారి వేళ చాలా మంది తమ వ్యాపారాలను మూసివేశారు. అయితే వారికి ధైర్యం చెప్పి దారి చూపించాం. నైపుణ్యాన్ని అవకాశాలుగా మల్చుకుని ఆహారోత్పత్తుల తయారీలోకి చాలా మంది ప్రవేశించారు. పశ్చిమ బెంగాల్లో రసోయి క్వీన్ పేరుతో చేసిన ఓ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. వంటల్లో చేయి తిరిగినవారిని ప్రోత్సహించి ఫుడ్ ప్రాసెసింగ్‌లో శిక్షణ ఇచ్చాం. బేకరీ, కర్రీ పాయింట్స్, క్యాటరింగ్, స్నాక్స్ తయారీతోపాటు హోటల్స్‌ను ప్రారంభించారు. ప్రముఖ హోటళ్లలో చెఫ్‌లుగా మారిన వారూ ఉన్నారు. రసోయి క్వీన్ కార్యక్రమాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ నిర్వహించనున్నాం. శాశ్వతంగా కోవె మార్ట్.. మహమ్మారి విస్తృతి నేపథ్యంలో మహిళా వ్యాపారులకు అండగా నిలిచేందుకు సిడ్బి సాయంతో కోవె మార్ట్ పేరుతో ఆన్లైన్ వేదికను కొన్ని నెలలపాటు నిర్వహించాం. ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగాయి. ఈ కార్యక్రమం సక్సెస్ కావడంతో కోవె మార్ట్‌ను శాశ్వత ప్రాతిపదికన త్వరలో ప్రారంభించనున్నాం. కోవె ఫుడ్ పార్క్ ఏర్పాటుకు 50 ఎకరాలు కేటాయించాల్సిందిగా టీఎస్ఐఐసీకి దరఖాస్తు చేశాం. ఇక్కడ 60 కంపెనీలు నెలకొల్పాలన్నది ఆలోచన. అలాగే పలు రాష్ట్రాల్లోనూ కోవె పారిశ్రామిక పార్కులను స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ నెల 6–8 తేదీల్లో జరిగే బిజినెస్ వుమెన్ ఎక్స్‌పోలో వినూత్న ఉత్పత్తులు కొలువుదీరనున్నాయి. 200 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. -
ధైర్యము నీవే కదా
భయంలో పిల్లాడు ‘అమ్మా’ అని వెళ్లి అమ్మ పొట్టలో తల దూరుస్తాడు. తండ్రిపులికి సిఫారసు కోసం ‘అక్కా’ అని వెళ్లి అక్కను ఆశ్రయిస్తాడు తమ్ముడు. అధైర్యంలో, అగమ్యంలో.. ఆలోచన కోసం భార్య వైపు చూస్తాడు భర్త. ‘జాబ్ వచ్చాక ఇస్తాలే’ అని గర్ల్‌ఫ్రెండ్‌ని చేబదులు అడుగుతాడు నిరుద్యోగి. కష్టాల్లో యావత్ మానవాళి ప్రత్యక్ష దైవం స్త్రీ. ‘ఆ చేత్తోనే మాకూ ఇంత అభయం ప్రసాదించమని’ ఇప్పుడీ కరోనా సంక్షోభంగా పెద్ద పెద్ద కంపెనీలు మహిళల్ని రిక్రూట్ చేసుకుంటున్నాయి. ‘వర్క్‌ఫ్రమ్ హోమ్’ ఇస్తున్నాయి. ఆకాశంలో సగంగా ఉన్న మహిళ.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆఫీస్‌లలోనూ సగంగా ఉండబోతోంది. ఎత్తులో సన్నటి తాడుపై పడిపోకుండా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు నిరంతరం నడుస్తూ ఉండటమే స్త్రీకి ఇల్లూ ఆఫీస్. ఇంటిని చూసుకునేవారు ఎవరైనా ఉంటే, ఇంటిని తను కూడా చూసుకోవాలన్న తపన భర్తకూ ఉంటే ఆమె మరింత మెరుగ్గా తన ఉద్యోగ బాధ్యతల్ని నెరవేర్చగలదు. ఈ విషయం లాక్డౌన్ కాలంలో రుజువైంది కూడా. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో మహిళలు అత్యుత్తమమైన ఫలితాలను తమ కంపెనీలకు సాధించి పెట్టాయి. వారి పని తీరు మెరుగైంది. వేగవంతం అయింది. ఎక్కువ పని కూడా జరిగింది. పురుషులు మాత్రం ఆఫీస్‌లో ఎంత పని చేశారో ఇంట్లోనూ అంతే పని, లేదంటే అంతకు తక్కువ పని చేసినట్లు కొన్ని సర్వేల్లో వెల్లడైంది కూడా. అందుకే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ప్రస్తుత కరోనా సంక్షోభ కాలాన్ని నెగ్గుకు రావడానికి, మునుపటి లాభాల్లోకి త్వరితంగా వెళ్లిపోడానికి మహిళల్ని ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. అదీ వర్క్ ఫ్రమ్ హోమ్‌లోకి! దీనివల్ల మహిళల శక్తి సామర్థ్యాలకు, నైపుణ్యాలకు డిమాండ్ పెరిగింది. మగవాళ్లు ఆఫీస్‌లో వర్క్ చేస్తుంటే.. వాళ్ల కన్నా మిన్నగా, మెరుగ్గా మహిళలు ఇంటి నుంచి చేస్తున్నారు. ∙∙ ఒక రంగం అని కాదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, మాన్యుఫాక్చరింగ్, హెల్త్‌కేర్, మెటల్ అండ్ మైనింగ్ మహిళా శక్తిని ఆలంబనగా చేసుకుంటున్నాయి! యాక్సిస్ బ్యాంకు, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, వేదాంత, ఆర్పీజీ గ్రూప్, దాల్మియా సిమెంట్, టాటా కెమికల్స్ వంటి సంస్థలు మహిళల్ని చేర్చుకోడానికి ఆసక్తి చూపుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనడంతో మహిళలూ ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. యాక్సిస్ బ్యాంకు వచ్చే ఏడాది తమ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, చార్టర్డ్ అకౌంటెన్సీ విభాగాలకు దేశంలోని రెండు వేల క్యాంపస్‌ల నుంచి ఉద్యోగుల్ని ఎంపిక చేసుకోవాలని నిర్ణయించింది. అందులో 40 శాతం వరకు మహిళా అభ్యర్థులకే కేటాయించింది! ఇక ఇన్ఫోసిన్ కంపెనీ 2021–22 ఆర్థిక సంవత్సరంలో ‘అప్పుడే కాలేజీ నుంచి బయటపడిన’ (ఫ్రెష్ బ్యాచ్) పట్టభద్రులకు 17 వేల ఉద్యోగాలను ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేసి పెట్టుకుంది. అందులో సగం పూర్తిగా యువతులకే. దాల్మియా సిమెంట్స్ కూడా ప్రత్యేకంగా మహిళల కోసమే నియామకాల్ని చేపట్టనుంది. అందుకోసం మహిళా కళాశాలల్లో, మహిళా విశ్వ విద్యాలయాలలో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. టాటా స్టీల్స్‌లో కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మేనేజ్మెంట్ విభాగంలో నలభై శాతం వరకు మహిళలే ఉండబోతున్నారు. పనివేళల్ని సులభతరం చేస్తే మహిళల పని సామర్థ్యం పెరిగి మంచి ఫలితాలు వస్తాయని ఈ కంపెనీల అనుభవంలోకి వచ్చింది కనుకనే మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తున్నాయని ప్రముఖ ‘జాబ్స్ ఫర్ హయర్’ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేహా బగారియా చెబుతున్నారు. ‘‘అంతేకాదు.. స్త్రీ, పురుషుల నియామకాలలో ప్రస్తుతం ఉన్న అంతరం తగ్గి, జెండర్ డైవర్సిటీ వృద్ధి చెందుతుంది’’ అని కూడా ఆమె అంటున్నారు. నేహా బగారియా, ‘జాబ్స్ ఫర్ హయర్’ సంస్థ సీఈవో. -
మహిళా సాధికారతే ముఖ్యం
కోల్‌కతా: మహిళల భద్రత, సాధికారతకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ నిర్వహించిన నవరాత్రి ఉత్సవాల్లో వర్చువల్ విధానంలో గురువారం ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘మహాషష్టి రోజు దుర్గామాత పూజలో పాల్గొనే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. కరోనా సంక్షోభం నెలకొన్న సమయంలో ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాం. దుర్గామాత భక్తులు, మండపాల నిర్వాహకులు, ప్రజలు గొప్ప సంయమనం పాటిస్తున్నారు. కరోనా కారణంగా స్వల్పస్థాయిలోనే అయినా, స్ఫూర్తిదాయకంగా, భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించారు. కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులకు సూచించారు. ‘దుర్గామాత పూజలో గొప్ప శక్తి ఉంటుంది. ఇంత దూరంలో ఢిల్లీలో ఉన్నప్పటికీ.. నాకు అక్కడ కోల్‌కతాలో మీతో ఉన్నట్లే ఉంది’ అని వ్యాఖ్యానించారు. ప్రసంగాన్ని బెంగాలీలో ప్రారంభించిన ప్రధాని మోదీ.. ముగించే సమయంలోనూ బెంగాలీలో రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని ప్రసంగానికి పశ్చిమబెంగాల్ బీజేపీ శాఖ భారీ ప్రచారం కల్పించింది. సాల్ట్‌లేక్ వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 10 మండపాల్లో ప్రధాని ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. 78 వేల పోలింగ్ బూత్‌ల్లోనూ మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఏప్రిల్– మే నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకు గానూ 18 సీట్లను బీజేపీ గెలుచుకుంది. దుర్గామాత ఉత్సవాల్లో ప్రధాని పాల్గొనడంపై అధికార టీఎంసీ స్పందించింది. దుర్గామాత పూజను కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించింది. ‘బెంగాలీలో మాట్లాడి బెంగాల్ ప్రజలతో కనెక్ట్ కావాలని ప్రధాని విఫలయత్నం చేశారు’ అని టీఎంసీ నేత, ఎంపీ సౌగత రాయ్ వ్యాఖ్యానించారు. -
పల్లె ఆర్థికంగా బలపడితేనే.. మహిళా సాధికారత
సాక్షి, అమరావతి: మహిళల స్వయం సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వారి జీవితాలను మార్చే క్రమంలో ఇటీవలే గుజరాత్‌కు చెందిన అమూల్‌తో ఒప్పందం చేసుకోగా.. తాజాగా సోమవారం మరో నాలుగు ప్రఖ్యాత కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఈనెల 12న ‘వైఎస్సార్ చేయూత’ను సర్కారు ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ ఒప్పందాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ఇచ్చే తోడ్పాటును మహిళలందరూ సద్వినియోగం చేసుకునేలా ఈ కంపెనీలు సహకరిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో తమ ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారా ఈ కంపెనీలు వారికి తోడ్పాటునందిస్తాయి. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గాంబిల్ కంపెనీలతో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలను చేసుకుంది. సెర్ప్ సీఈఓ రాజాబాబు, ఆయా కంపెనీల ప్రతినిధులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. – అణగారిన వర్గాల వారికి చేయూతనివ్వకుండా, వారి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేయకుండా ఎలాంటి మార్పులను తీసుకురాలేం. అలాగే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయకుండా ఎలాంటి ఫలితాలు సాధించలేం. – అందుకే మా ప్రభుత్వం మహిళా సాధికారతపై దృష్టిపెట్టింది. వారి జీవితాలను మార్చేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. – ఇందులో భాగంగా ఈనెల 12న ‘వైఎస్సార్ చేయూత’ను ప్రారంభిస్తున్నాం. – దీని ద్వారా రూ.4,500 కోట్లను మహిళలకు అందజేస్తాం. – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45–60 ఏళ్లలోపు అర్హత ఉన్న మహిళలకు ఈ ‘చేయూత’ను అందిస్తున్నాం. – దీనికింద ఎంపికైన మహిళలకు ఏటా రూ.18,750లు చొప్పున నాలుగేళ్లలో రూ.75వేల ఇస్తాం. – చేయూత పథకం అందుకుంటున్న మహిళల్లో చాలామందికి ‘వైఎస్సార్ ఆసరా’ కూడా వర్తిస్తుంది. – ఏటా దాదాపు రూ.6,700 కోట్లను ‘ఆసరా’ కింద ఇస్తాం. సెప్టెంబరులో దీనిని కూడా అమలుచేస్తాం. – ఇలా ఈ రెండు పథకాలకు ఏటా రూ.11వేల కోట్ల చొప్పున నాలుగేళ్లపాటు రూ.44వేల కోట్లను దాదాపుగా కోటి మంది మహిళల చేతికి ఇస్తున్నాం. – ఈ సహాయం.. వారికి స్థిరమైన ఉపాధి, ఆదాయం ఇచ్చేదిగా ఉండాలి. – ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, మహిళల జీవితాలను మారుస్తుంది. – ప్రభుత్వం చేయూతనిస్తుంది.. బ్యాంకు రుణాలకు గ్యారంటీ ఇస్తుంది. – మహిళల స్వయం సాధికారత కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రఖ్యాత కంపెనీలైన హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గాంబిల్ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలను చేసుకుంది. – ఈ కంపెనీలన్నీ ముందుకు వచ్చి మహిళలు వారి కాళ్లమీద వాళ్లు నిలబడగలిగేలా సహకారం అందించాలి. అనంతరం ఆయా కంపెనీల ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సీఎం అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాం మహిళలు సాధికారిత సాధించడం అంటే.. కుటుంబం వృద్ధిలోకి వస్తున్నట్లే. ముఖ్యమంత్రి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మాకు చాలా ముఖ్యమైనది. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం సంతోషకరం. మహిళలకు చేయూతనిచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. చేయూత పథకం మైలురాయిగా నిలిచిపోతుంది. సమగ్రాభివృద్ధి కోసం సీఎం చేస్తున్న ప్రయత్నాలు ముందుకుసాగాలని ఆకాంక్షిస్తున్నాం. – సంజీవ్ మెహతా, హెచ్‌యూఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏడాదిలో సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలు ఏడాది కాలంగా సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలను తీసుకువచ్చారు. ఆర్థిక సామాజిక రంగాల్లో ఈ సంస్కరణలు పెనుమార్పులు తీసుకువస్తాయి. మహిళల సాధికారత ద్వారా అభివృద్ధి సాధించాలన్న సీఎం ఆలోచన మంచి మార్పులకు నాంది. వైఎస్సార్ చేయూత కార్యక్రమం పేదరికాన్ని నిర్మూలించడంలో కీలకమైనది. సామాజిక రంగంలో ఏపీ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోంది. మేం కూడా ఆ దిశగా కార్యకలాపాలు చేస్తున్నాం. – సంజీవ్ పూరి, ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సీఎం దార్శినికత బాగుంది ముఖ్యమంత్రి దార్శినికత బాగుంది. శిక్షణ కార్యక్రమం ద్వారా 20 లక్షల మంది విద్యార్థులకు మా కంపెనీ సహాయ సహకారాలు అందిస్తోంది. వైఎస్సార్ చేయూత పథకం గొప్ప అవకాశాలను కల్పిస్తోంది. మేం భాగస్వామి అవుతున్నందుకు సంతోషంగా ఉంది. మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ఈ విషయంలో మా అనుభవాలను పంచుతాం. మీతో కలిసి ముందుకు సాగుతాం. – మధుసూదన్ గోపాలన్, ప్రోక్టర్ అండ్ గాంబిల్ సీఈఓ, ఎండీ సీఎం జగన్ సమక్షంలో ఒప్పందాలు అనంతరం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో సెర్ప్ సీఈఓ రాజాబాబు, ప్రొక్టర్ అండ్ గాంబిల్ సీనియర్ మేనేజర్ జోసెఫ్ వక్కీ, ఐటీసీ డివిజనల్ సీఈఓ రజనీకాంత్ కాయ్, హెచ్‌యూఎల్ జీఎస్ఎం చట్ల రామకృష్ణారెడ్డితో వేర్వేరుగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐటీసీ గ్రూప్ హెడ్ సంజీవ్ రాంగ్రాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, వీడియో కాన్ఫరెన్స్‌లో మహ్మద్ అన్సారి, క్లస్టర్ సీఈఓ, ఏపీ–తెలంగాణ.. జెబాఖాన్, వైస్‌ప్రెసిడెంట్, ప్రోక్టర్ అండ్ గాంబిల్ పాల్గొన్నారు. -
శ్వేత ఐపీఎస్
‘నాలెడ్జ్ ఈజ్ పవర్.. స్కిల్ ఈజ్ ఎనర్జీ’ అంటారు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత. టెక్నాలజీని పూర్తి స్థాయిలో వాడుకోవడం, మహిళల భద్రత, ఉద్యోగాల ప్రయత్నాల్లో యువతకు ప్రోత్సాహం, పోలీసు పాలనలో నూతన ఆవిష్కరణలు.. ఇలా అనేక కార్యక్రమాలను స్వచ్ఛందంగా చేపడుతూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారు శ్వేత. తెలంగాణలో జిల్లాల పునర్విభజనలో భాగంగా రెండున్నర యేళ్ల క్రితం కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా శ్వేత వచ్చారు. కొద్ది కాలంలోనే సాంకేతికతను ఆయుధంగా చేసుకుని ఎన్నో కొత్త విధానాలను తీసుకువచ్చారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం కల్పించారు. జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలో షీ టీం బృందాలను ఏర్పాటు చేశారు. ఆకతాయిలను గుర్తిస్తూ వారికి మహిళలను గౌరవించడం పట్ల కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మహిళా పోలీసు సిబ్బంది పురుషులతో సమానంగా ఉండాలంటే వారికి అన్ని పనులు తెలిసి ఉండాలని అందరికి డ్రైవింగ్ నేర్పించారు. విధుల్లో మహిళా సిబ్బంది ఇతరులపై ఆధారపడకుండా ఉండాలనేది శ్వేత ముఖ్యోద్దేశం. కొత్తగా విధుల్లో చేరిన మహిళా కానిస్టేబుళ్లకు మహిళలపై జరిగే దాడులను తిప్పికొట్టడంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఆత్మరక్షణ పద్ధతులను నేర్పించారు. అంతేకాకుండా మహిళల్లో ఆత్యస్థైర్యాన్ని నింపడం కోసం స్వయంగా వారితో మాట్లాడడం, అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం చేస్తున్నారు. ఎస్పీ శ్వేత 2017 డిసెంబర్ 31న 13 జిల్లాలకు సంబంధించిన సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సెంటర్‌ను కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేయించారు. ఇందుకోసం ఆమె ఎంతగానో శ్రమించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ ఫీడ్‌బ్యాక్ సెంటర్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. దీని ద్వారా ఇప్పటి వరకు 10,802 ఫిర్యాదులు, 33,318 ఎఫ్ఐఆర్లు, 27,251 పాస్‌పోర్టు ఎంక్వైరీలకు సంబంధించిన విచారణ జరిగింది. కామారెడ్డి పట్టణ, దేవునిపల్లి పోలీస్స్టేషన్లను మోడల్ పోలీస్స్టేషన్లుగా తీర్చిదిద్దారు. 5 ఎస్ విధానాన్ని (సార్ట్, సెట్ ఇన్ ఆర్డర్, షైన్, స్టాండరై్డజ్, సస్టెయిన్) అమలు చేస్తూ రికార్డులను, వసతులను, సౌకర్యాల నిర్వహణను అత్యాధునికంగా మెరుగుపర్చారు. మహిళా సిబ్బందికి ప్రత్యేక గదులు, సదుపాయాలు కల్పించారు. ఎస్పీ శ్వేత మొదటి నుంచి సీసీ కెమెరాల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజలకు సీసీ కెమెరాల ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 1342 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. నేరాల నియంత్రణ కోసం క్రమం తప్పకుండా జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ కార్డన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా సీసీటీఎన్ఎస్ (క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్) విధానం శ్వేత ఆధ్వర్యంలోనే ప్రారంభమైంది. మరోవైపు నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్య శిక్షణలను అందించడానికి ఆమె ఎంతగానో కృషి చేశారు. ‘యువ నేస్తం’ కార్యక్రమం ద్వారా జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు వెళ్తున్న యువతీ, యువకులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయించారు. ఐదు వందల మందికి శిక్షణ ఇప్పించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెంట్ పోలీసు క్యాడెట్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అన్ని చోట్ల ఈ బృందాలు కొనసాగుతున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం డేటా చోరీ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లోని తొమ్మిది మంది సభ్యులలో శ్వేత కూడా ఒకరు. – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి చదువు.. చొరవ.. కాన్ఫిడెన్స్ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. దీన్ని దూరం చేసేందుకు ప్రతీ మహిళ ఉన్నత చదువుల వైపు దృష్టి సారించాలి. ఏదైనా సాధిస్తామన్న ఆత్మవిశ్వాసంతో ఉండాలి. నమ్మకానికి తగినట్లుగా శ్రమించాలి. నైపుణ్యం, విషయ పరిజ్ఞానం ఉంటే ఏదైనా సాధ్యమే. మంచి స్నేహితులు కూడా అవసరమే. తోటి వారికి ధైర్యాన్ని ఇవ్వాలి. కుల, మత వివక్షలు ఉండకూడదు. – శ్వేత, ఎస్పీ, కామారెడ్డి -
స్త్రీలోక సంచారం
ఇంత మంచి గుడ్ వరల్డ్‌లో ఉన్నాం కదా.. ‘కన్యత్వ పరీక్ష’ అనే బ్యాడ్ వర్డ్ ఇంకా వినిపిస్తూనే ఉంది! ఒక ఆడపిల్ల కన్యా, కాదా? అని తెలుసుకోడానికి చేసే అనాగరికమైన పరీక్ష ఇది. ఇందులోనే ఇంకా అనాగరికం.. కొందరు డాక్టర్లు చేసే ‘టూ–ఫింగర్ టెస్ట్’. సాధారణంగా.. ఒక యువతి, లేదా బాలికపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణల్లో నిజముందా లేదా నిర్థారించడానికి చేసే పరీక్షల్లో టూ–ఫింగర్ టెస్ట్ ఒకటి. బాధితురాలి జననావయవంలోకి రెండు వేళ్లు చొప్పించి, ఆ వేళ్లు సులువుగా లోపలికి ప్రవేశించగలిగితే ఆమె కన్య కాదనీ, వేళ్ల ప్రవేశం కష్టం అయితే ఆమె కన్య అని ఒక కంక్లూజన్‌కి వస్తారు! ఈ టెస్ట్‌లోనే వేళ్లకు కన్నెపొర (జననావయవ అంతర్ ముఖద్వారంలో ఉండే పొర) అడ్డుపడితే ఆమె కన్య అయినట్లు, పొర అడ్డుపడకపోతే ఆమె కన్య కానట్లు భావిస్తారు. ఇదొక అర్థం లేని పరీక్ష అని నికార్సైన వైద్య నిపుణులు ఏనాడో తేల్చి పారేసినప్పటికీ.. ఇప్పటికీ చాలాచోట్ల అత్యాచారం కేసులలో అధికారికంగా, నూతన వరుడు సందేహపడిన సందర్భంలో అనధికారికంగా ఈ ‘టూ–ఫింగర్ టెస్ట్’ చేస్తున్నారు. కన్నెపొర లేకపోవడానికి, జననాంగ గోడలు వదులుగా ఉండడానికి కన్యత్వాన్ని కోల్పోవడమే కారణమవక్కర్లేదు. పొర, వదులు అన్నవి ఆటల్లో పోవచ్చు. ఇప్పుడీ బ్యాడ్ టాపిక్ ఎందుకొచ్చిందంటే.. ఓ గుడ్ డాక్టర్ ఈ ‘టూ–ఫింగర్ టెస్ట్’ను వైద్య పాఠ్యాంశాలలోనే లేకుండా తొలగించాలని కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారు. ఆ డాక్టరు గారి పేరు ఇంద్రజిత్ ఖండేకర్. మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌లో ఉన్న ‘మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ లో ఫోరెన్సిక్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. అయినా ‘టూ–ఫింగర్ టెస్ట్’ అనే ఈ పరీక్ష.. వైద్యపుస్తకాల్లో ఎందుకు ఉన్నట్లు? మొదట ఎవరో చేర్చారు. తర్వాత ఎవరూ మార్చలేదు. డాక్టర్ ఖండేకర్ ఆరోగ్య శాఖకు మాత్రమే రాయలేదు. భార త వైద్య మండలికి, కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖకు, మహారాష్ట్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కూ.. ఈ టూ–ఫింగర్ టెస్ట్ ప్రస్తావనను పుస్తకాల్లోంచి తొలగించాలని విజ్ఞప్తులు పంపారు. ‘ఇదొక బుద్ధిలేని, అసంబద్ధమైన పరీక్ష’ అని ఆయన ‘టూ–ఫింగర్ టెస్ట్’ను వర్ణించారు. ఆడపిల్లను ఫిజికల్‌గా బాధ పెట్టి, అవమానించే ఈ పరీక్ష మహిళపై జరిగే హింస కంటే కూడా ఎక్కువే అని అంటారు ఖండేకర్. 2018 అక్టోబర్‌లో ఐక్యరాజ్యసమితి విభాగం అయిన ‘యు.ఎన్. ఉమెన్’ కూడా ఇదే మాట చెప్పింది. అయితే మొత్తం అన్ని రకాలైన కన్యత్వ పరీక్షల గురించి చెప్పింది. ఇలాంటి పరీక్షలకు ముగింపు పలకాలని సభ్య దేశాలకు పిలుపునిచ్చింది. ‘ది క్వింట్’ భారతదేశంలో పేరున్న న్యూస్ వెబ్సైట్. ఇంగ్లిష్, హిందీ భాషల్లో వస్తోంది. క్వింట్ ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన ‘మి, ది ఛేంజ్’ క్యాంపెయిన్ని ప్రారంభించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయబోతున్న 18–23 ఏళ్ల మధ్య వయసు గల యువతులలోంచి ‘ఉమన్ అచీవర్’ని ఎంపిక చేయడం కోసం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. సైట్లోకి వెళ్లి, నామినేషన్ ఫారమ్‌లో మీకు తెలిసిన యంగ్ ఉమెన్ అచీవర్ వివరాలను పొందుపరిస్తే చాలు. మీరు నామినేట్ చేస్తున్నప్పుడు మీ పేరును వెల్లడించడం తప్పనిసరేం కాదు. మీ ఇ–మెయిల్, మీ కాంటాక్ట్, మీరు సూచిస్తున్న యువతి పేరు, ఆమె వయసు, ఆమె సాధించిన విజయం, ఆమె వివరాలు ఇస్తే సరిపోతుంది. మీ ఫ్రెండ్స్, మీ సోదరి.. వారెవరైనా సరే మీరు నామినేట్ చెయ్యొచ్చు. ‘మి, ది ఛేంజ్’ కాంపెయిన్‌కి ప్రముఖ మలయాళీ నటి పార్వతి తన సహకారం అందిస్తున్నారు. -
స్త్రీలోక సంచారం
‘ఇప్పుడే వస్తాను బిడ్డను పట్టుకో’ అని చెప్పిన వెళ్లిన తల్లి మళ్లీ తిరిగి రాలేదు. బిడ్డ ఏడుస్తోంది. బిడ్డను ఎత్తుకున్న ఆ మగ మనిషికి ఏం చేయాలో పాలుపోలేదు. ఇంటికి తీసుకెళ్లాడు. ప్యాకెట్ పాలు పట్టబోయాడు. పాప తాగలేదు. దగ్గరల్లో ఉన్న పోలీస్ స్టేషన్లో పాపను అప్పగించి తనూ వెళ్లిపోయాడు. పాప ఏడుపు ఆపడం లేదు. డ్యూటీలో ఉన్న కాదిస్టేబుల్కు ఏం చేయాలో తోచలేదు. ఇంటికి ఫోన్ చేశాడు. ‘పాల కోసం ఏడుస్తున్నట్లుంది. ఇంటికి తీసుకురండి’ అంది ఆయన భార్య. ‘ఆ పాపను మనమే మన సొంత కూతురిలా పెంచుకుందాం’ అని కూడా చెప్పింది. అప్పటికే ఆ దంపతులకు ఒక మగబిడ్డ. ‘‘అలా చేయలేం’’ అని చెప్పాడు. వెంటనే ఆమె తన బిడ్డను చంకనేసుకుని భర్త పని చేస్తున్న పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. చంకలోని బిడ్డను భర్తకు ఇచ్చి, స్టేషన్లో ఉన్న బిడ్డను చంకేసుకుని తన పాలు పట్టించింది. కడుపులో పాలు పడగానే పాప ఏడుపు మానింది. పాలు పట్టిన ఆ తల్లి కూడా కాన్స్టేబులే! పాప తల్లి చిత్తుకాగితాలు ఏరుకునే మనిషి అని పాపను పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చి వెళ్లినతను చెప్పినదాన్ని బట్టి తెలుస్తోంది. పోషణలేక పాప బలహీనంగా ఉంది. ఆ పసికందుకు ఒక సురక్షితమైన ఆశ్రయం కల్పించే ప్రయత్నాల్లో ఉన్నారు ఇప్పుడా కానిస్టేబుల్ దంపతులు. ఈ సంఘటన ఏడాది చివరి రోజు హైదరాబాద్‌లో జరిగింది. కేరళ ప్రభుత్వం జనవరి 1 సాయంత్రం తలపెట్టిన 630 కిలోమీటర్ల పొడవైన ‘మహిళాహారం’ (వనితామతిల్) విజయవంతం అయింది. ఉత్తర కేరళలోని కాసర్గడ్ జిల్లా నుంచి దక్షిణ కేరళలోని తిరువనంతపురం వరకు జాతీయ రహదారి వెంబడి దాదాపు 20 లక్షల మంది మహిళలు చేయీచేయి కలిపి మహిళాహారాన్ని నిర్మించారు. ‘‘లైంగిక సమానత్వ సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చాటి చెప్పేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేపట్టిన ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా సామాజిక కార్యకర్తలంతా మద్దతు ఇస్తున్నట్లు ప్రముఖ నటి, యాక్టివిస్టు మాలా పార్వతి తెలిపారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో జనవరి 1 నుంచి వస్త్రధారణ నిబంధన అమల్లోకి వచ్చింది. ప్రధానంగా మహిళా భక్తుల కోసం ఉద్దేశించిన ఈ నిబంధన ప్రకారం దర్శనానికి, ఆర్జిత సేవలకు వచ్చేవారు చీర, లెహంగా వంటి సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించవలసి ఉంటుంది. ఆలయ పవిత్రతను, సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాల కార్యనిర్వాహక అధికారి కోటేశ్వరమ్మ తెలిపారు. అయితే ఈ నిబంధన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, వ్యక్తి స్వేచ్ఛను హరించేలా ఉందని ‘నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్’ ఎ.పి. శాఖ కార్యదర్శి పి.దుర్గాభవాని వ్యాఖ్యానించారు. -
స్త్రీలోక సంచారం
గుజరాత్ పదహారేళ్ల నీలాంశీ పటేల్ 5 అడుగల 7 అంగుళాల జుట్టుతో 2018 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది. పశ్చిమ బెంగాల్ మిసెస్ ఎన్.సి.సేన్‌గా మాత్రమే వందేళ్ల క్రితం నాటి పాత రికార్డులలో ఉన్న మృణాళినీ దేవి భారతదేశంలో విమాన ప్రయాణం చేసిన తొలి మహిళగా ‘టైమ్స్’ పత్రిక చేసిన పరిశోధనలో నిర్థారణ అయింది. న్యూఢిల్లీ కొత్త విషయాలను కనిపెట్టిన మహిళల పేటెంట్ దరఖాస్తులను సత్వరం పరిశీలించి వారిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే ఈ ఏడాది కేబినెట్లో క్రిస్మస్ వేడుకల సమయాన్ని కుదించి, మిగతా సమయాన్ని పాలనా వ్యవహారాలకు కేటాయించారు. పుస్తకం నటి మనీషా కొయిరాలా రాసిన ‘హౌ క్యాన్సర్ గేవ్ మి ఎ లైఫ్’ పుస్తకం ఈ నెల 28న మార్కెట్లోకి విడుదల అవుతోంది. -
స్త్రీలోక సంచారం
చదువులోను, పరిశుభ్రతను పాటించడంలోనూ ముస్లిం బాలికలు ముందుంటున్నారని ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్ అన్నారు. అభివృద్ధి ఆర్థికవేత్త, ‘సుధీర్ కమిషన్’ సభ్యుడు అయిన ఖాన్ హైదరాబాద్‌లో జరిగిన ‘అనాథలకు ఆర్థిక సహాయం’ అనే కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ విషయం తెలిపారు. ‘హైదరాబాద్ జకాత్ అండ్ చారిటబుల్ ట్రస్ట్’ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘‘ఇండియాలో ముస్లిం బాలికలు చదువులో వెనుకబడి ఉంటారన్న ఒక అపోహ ఉంది. అది నిజం కాదు. దేశంలో చదువు అందుబాటులో ఉన్న 80 శాతం మంది బాలికల్లో 90 శాతం మంది ముస్లిం బాలికలే. ఈ తొంభై శాతం అంతా కూడా జీవించడానికి అత్యవసరమైన ప్రాథమిక విద్యను పూర్తి చేస్తున్నవారే. ఆరోగ్యం, వ్యక్తిగత శుభ్రత విషయంలోనూ వీళ్లు ముందున్నారు. ‘శుద్ధీకరణ’ (అబ్లూషన్) ఆచారంలో భాగంగా ముస్లిం బాలికలు రోజుకు ఐదుసార్లు చేతులు శుభ్రపరచుకుంటారు’’ అని అమీరుల్లా ఖాన్ వివరించారు. ‘‘చదువుకున్న అమ్మాయిల్ని ముస్లిం సమాజం గౌరవిస్తుంది. అయితే ఆర్థిక కారణాల వల్ల ఎక్కువమంది బాలికలు ఉన్నతస్థాయి విద్యకు నోచుకోలేకపోతున్నారు’’ అని ఖాన్ అన్నారు. ‘సుధీర్ కమిషన్’ రాష్ట్రంలోని ముస్లింల విద్య, ఆర్థిక, సామాజిక స్థితిగతులను అధ్యయనం చేస్తుంటుంది. ఈ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మెక్సికో నుంచి యు.ఎస్.కి శరణార్థులుగా వచ్చే వారిని నిరోధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘వలస శరణార్థుల నియంత్రణ’ బిల్లుకు వ్యతిరేకంగా మహిళా న్యాయమూర్తి రూత్ బాడర్ గిన్స్బర్గ్.. ఆసుపత్రి పడక మీద నుంచే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైద్యులు ఆమె ఎడమ ఊపిరితిత్తిలోని రెండు క్యాన్సర్ కణుతులను తొలగించిన అనంతరం, వైద్య సేవల కోసం ఆమె ఆసుపత్రిలోనే ఉండిపోవలసి వచ్చింది. ఆ సమయంలో వచ్చిన బిల్లు ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఐదుగురిలో నలుగురు జడ్జీలు ఓటు వేయగా, మిగిలిన ఒక ఓటు కూడా వ్యతిరేకంగా పడితే ప్రతిపాదన వీగిపోయే కీలకమైన స్థితిలో గిన్స్బర్గ్ తన ఓటును నిరర్థకం చేసుకోదలచుకోలేదు. సన్నిహితులు చుట్టూ ఉండగా, ఆసుపత్రి కుర్చీలో కూర్చుని 85 ఏళ్ల వయసులోఎంతో ఉత్సాహంగా ట్రంప్ కోరుకుంటున్న బిల్లుకు వ్యతిరేకంగా ఆమె ఓటు వేశారు. ప్రస్తుతం గిన్స్బర్గ్ ఆరోగ్యంగా ఉన్నారు. తిరిగి జనవరి ఆరంభంలో మొదలయ్యే కోర్టు వాదోపవాదాలకు హాజరవుతారు. ‘టైమ్’ మ్యాగజీన్ 2013లో ఎంపిక చేసిన ‘అత్యంత ప్రభావశీలురైన 100 మంది’ జాబితాలో మలాలా యూసఫ్‌జాయ్ కూడా ఒకరు. ‘కూడా ఒకరు’ కాదు. ఆ జాబితాలో ఒబామాకు 51వ స్థానం వస్తే, మలాలా 15వ స్థానంలో ఉన్నారు! ఆ సంచిక విడుదల అయినప్పుడు మలాలా ఆసుపత్రిలో ఉన్నారు. తాలిబన్ల హెచ్చరికలను ఖాతరు చేయకుండా తను బడికి వెళ్లడమే కాకుండా, బాలికలకు చదువు ఎంత అవసరమో ఆమె చెప్పడం తప్పయింది. తాలిబన్లు ఆమెపై కాల్పులు జరిపారు. తల వెనుక భాగంలో బులెట్ గాయంతో ప్రాణాపాయ స్థితిలో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ కోలుకుంటుండగానే టైమ్ జాబితాలో మలాలా పేరు వచ్చింది. ఆ సంగతిని మలాలా తండ్రి జియావుద్దీన్‌కి ఆయన డ్రైవర్ ద్వారా తెలిసింది. వెంటనే తన ఫోన్లోకి ఫార్వర్డ్ చేయించుకుని టైమ్ కవర్ పేజీపై ఉన్న మలాలా ముఖచిత్రాన్ని కూతురుకి చూపించాడు. అప్పుడు మలాలా స్పందన ఆయన్ని ఆశ్చర్యపరిచింది. ‘మనుషుల్ని ప్రత్యేకంగా చూపించే ఇలాంటి విభజనలపై నాకు నమ్మకం లేదు నాన్నా’ అని ఆ వయసులోనే మలాలా అన్నారట. ఈ విషయాన్ని తన తాజా పుస్తకం ‘లెట్ హర్ ఫ్లయ్ : ఎ ఫాదర్స్ జర్నీ అండ్ ది ఫైట్ ఫర్ ఈక్వాలిటీ’ అనే పుస్తకంలో రాసుకున్నారు జియావుద్దీన్. లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన ‘డబ్లు్య.హెచ్. అలెన్ అండ్ కంపెనీ’ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. -
డిగ్నిటీ మార్చ్ ముంబయి టూ ఢిల్లీ!
‘మీ టూ ’ ఉద్యమం ఏమైంది? మగవాళ్ల దాష్టీకాలు ఇలాగే ఉంటాయని సరిపెట్టుకుంటున్నారా ఆడవాళ్లు. కొన్నేళ్ల కిందట బీజం పడిన ఈ ఉద్యమం, ఏడాది కిందట మొలకెత్తింది. హాలీవుడ్ డైరెక్టర్ హార్వీ వైన్‌స్టీన్ దురాగతాలతో ఒక్కొక్కరుగా బయటకొచ్చారు బాధిత మహిళలు. హార్వీ నుంచి లైంగిక వేధింపులను ఎదుర్కొన్న వాళ్లు గళమెత్తినప్పుడు ప్రపంచం.. ‘నిజమే కదా పాపం’ అని నిట్టూర్చింది. అదే ‘మీటూ’ ఈ ఏడాది మనదేశాన్ని కూడా కుదిపేసింది. సినిమా, రాజకీయ, మీడియా రంగాల్లో చాలామంది మగవాళ్లు తొడుక్కున్న పెద్ద మనిషి ముసుగును ఆమాంతం లాగి పడేసింది. ఆఫీసుల్లో మగ ఉన్నతాధికారులు గుండెల్లో పరుగెత్తుతున్న రైళ్ల మోత బయటకు వినిపించకుండా ఛాతీని చిక్కబట్టుకున్నారు. అంత ఉధృతంగా విస్తరించిన ఈ లైంగిక వేధింపు నివారణోద్యమం కొద్ది రోజులుగా ఒక రూపుదిద్దుకున్నట్లే, ఒక మలుపు తిరుగుతున్నట్లే కనిపించింది. నిజానికి ఏమైంది? ఏమై ఉంటుంది? అనే ప్రశ్నలు అనేక మెదళ్లను తొలుస్తూనే ఉన్నాయి. ‘మీటూ’కి మద్దతు పలికిన మహిళలకు తెర వెనుక వేధింపులు మొదలయ్యాయా? అందుకే వాళ్లు తెరమరుగయ్యారా... అనే సందేహాలూ వచ్చాయి. మహిళా ఉద్యమకారులూ మిన్నకుండి పోయారేంటని అనేక నుదుళ్లు ముడివడ్డాయి. వాళ్ల మగవాళ్లు కూడా ఈ పంకిలంలో ఉన్నారా అనే సందేహాలూ పురుడుపోసుకున్నాయి. వీటన్నింటì పై ఆలోచన రేకెత్తించేందుకు ‘డిగ్నిటీ మార్చ్ ముంబయి టూ ఢిల్లీ’ అంటూ కదం తొక్కనున్నారు భారతీయ మహిళలు. పదివేల కిలోమీటర్లు ఇంతకాలం ఒక నిశ్శబ్ద విప్లవమే నడిచింది. వేధింపులకు గురైన మహిళలు సోషల్ మీడియాలో తమకు ఎదురైన లైంగిక దాడుల గురించి షేర్ చేసుకున్నారు. బాధితులు సంఘటితమయ్యారు. చాప కింద నీరులా ప్రవహించింది ఉద్యమం. పాదం పాదం కలుపుతూ ఒక మహా ప్రస్థానానికి నాంది పలుకుతోందిప్పుడు. ఈ రోజు (డిసెంబర్ 20వ తేదీ) ముంబయిలో మొదలయ్యే ఈ ప్రయాణం వచ్చే ఏడాది ఫిబ్రవరి 22తో ముగుస్తుంది. ముంబయిలో మొదలయ్యే ఈ పాదయాత్ర దేశంలోని 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా ఢిల్లీకి చేరుతుంది. పదివేల కిలోమీటర్ల దూరం సాగే ఈ యాత్ర... ముంబయి, పుణే, షోలాపూర్, పనాజి, బెంగళూరు, త్రివేండ్రం, వెల్లూరు, నెల్లూరు, చెన్నై, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, విజయవాడ, రాయ్‌పూర్, భువనేశ్వర్, కోల్‌కతా, డార్జిలింగ్, పాట్నా, లక్నో, భోపాల్, ఉదయ్‌పూర్, అహ్మదాబాద్, అజ్మీర్, జైపూర్, శ్రీనగర్, సిమ్లా, చండీగఢ్, డెహ్రాడూన్ వంటి ప్రధాన నగరాలు మీదుగా ఢిల్లీకి చేరుతుంది. మొత్తం రెండు వందల జిల్లాల మీదుగా సాగుతుందీ మార్చ్. ‘అడుగడుగునా’ సంఘీభావం అరవై రోజుల పాటు సాగే ఈ పాదయాత్ర నిర్వహణలో రాష్ట్రీయ గరిమా అభియాన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రధాన భూమిక పోషిస్తోంది. రాష్ట్రీయ గరిమా అభియాన్ సంస్థ ఈ డిగ్నిటీ మార్చ్‌ను దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న మూడు వందల చిన్నచిన్న ఎన్జీవోలతో కలిసి నిర్వహిస్తోంది. ఈ యాత్రలో ప్రధానంగా కొంతమంది బాధిత మహిళలు, నిర్వాహకులు మొదటి నుంచి చివరి వరకు కొనసాగుతారు. మిగిలిన వాళ్లు పాదయాత్రికులకు సంఘీభావంగా వారి వారి నగరాల్లో వచ్చి కలిసి, సమావేశాలను విజయవంతం చేస్తారు. ట్రాఫికింగ్‌కి గురై రక్షింపబడిన మహిళలు కూడా మీటూకి కొనసాగింపుగా జరుగుతోన్న డిగ్నిటీ మార్చ్‌కు మద్దతిస్తున్నారు. ఇకపై సహించం ముంబయిలో మొదలై ఢిల్లీకి చేరే ఈ డిగ్నిటీ మార్చ్‌లో పాల్గొనే మహిళల మధ్య సామాజిక, ఆర్థిక సరిహద్దులుండవు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురైన వాళ్లతో పాటు, వ్యవస్థీకృతం అయిన రంగాలతోపాటు వ్యవస్థీకృతం కాని రంగాల మహిళలకు కూడా ఇది వేదికే. బాధిత మహిళలు, వారి కుటుంబీకులు, న్యాయవాదులు, పోలీసులు అందరినీ ఒక వేదిక మీద తీసుకువస్తున్న ప్రయత్నమిది. లైంగిక వేధింపుకు, లైంగిక దోపిడీకి గురైన మహిళలు సంఘటితం కావాలి, తమకు ఎదురైన చేదు అనుభవాన్ని బిడియ పడకుండా ధైర్యంగా బయటపెట్టాలి. ఇలాంటి దురాగతాలను ‘ఇకపై సహించేది లేద’ని సమాజాన్ని ఎలుగెత్తి చాటాలి. పురుష సమాజంలో పరివర్తన వచ్చే వరకు నినదిస్తూనే ఉండాలి, గళం వినిపిస్తూనే ఉండాలి. మహిళ సెకండ్ సిటిజెన్‌గా ఉన్న ఈ సమాజంలో ఉమెన్ ఫ్రెండ్లీ వాతావరణం నెలకొనే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలి. లైంగికవేధింపులు, బాడీ షేమింగ్‌కు పాల్పడే ఆలోచనలు చెరిగిపోయేవరకు పోరాడాలనేదే ఈ డిగ్నిటీ మార్చ్ లక్ష్యం. నివారించాలంటే నోరు విప్పాలి వయొలెన్స్ అగైనెస్ట్ ఉమెన్... ఈ అంశం మీద ఎంత ఎక్కువ మాట్లాడితే అంత త్వరగా సమస్య పరిష్కారమవుతుంది. మౌనంగా భరిస్తూ ఉన్నంత కాలం ఈ దురాచారం మరింతగా వేళ్లూనుకుంటుంది. అందుకే వేధింపుకు గురైన ప్రతి ఒక్కరూ ప్రతిచోటా గొంతెత్తాలి. ఈ హింసను నిరసిస్తూ అంతర్జాతీయస్థాయిలో గడచిన నవంబర్ 25 నుంచి డిసెంబర్ పది వరకు పదహారు రోజులు సదస్సులు జరిగాయి. స్త్రీలపై హింసను వ్యతిరేకిస్తూ రాబోయే జనవరి 15 నుంచి 25 వరకు జరిగే వన్ బిలియన్ ర్యాలీలో శతకోటి ప్రజాదళం పాల్గొంటుంది. మహిళలు, పిల్లల మీద జరుగుతున్న లైంగిక దాడులను నిరసిస్తూ గళమెత్తే ఉద్యమాల్లో ‘మీటూ’ ఒకటి. మీటూ ఎంతటి విజయవంతమైన ఉద్యమమంటే.. కేంద్రమంత్రి ఎం.జె అక్బర్, తరుణ్ తేజ్‌పాల్ వంటి సీనియర్ జర్నలిస్టులను ఎడిటర్స్ గిల్డ్ నుంచి తొలగించే వరకు వెళ్లింది. ఇప్పుడు వార్తల్లో కనిపించడం లేదనే కారణంతో అంతటి పతాకస్థాయికి వెళ్లిన ఉద్యమం చల్లారిపోయిందనుకుంటే పొరపాటే. సమాజంలో లింగ వివక్ష, లైంగిక దోపిడీ ఉన్నంత కాలం ఈ ఉద్యమాలన్నీ ఉంటాయి. ఈ డిగ్నిటీ మార్చ్ కూడా అందులో భాగమే. ఈ రోజు ముంబయిలో మొదలయ్యే మార్చ్ జనవరి ఐదవ తేదీకి హైదరాబాద్‌కి వస్తుంది. మేము (భూమిక స్వచ్ఛంద సంస్థ, ఇతర భావసారూప్యం కలిగిన సంస్థలు, వ్యక్తులు) పాదయాత్ర బృందానికి స్వాగతం పలికి, ఇక్కడ సమావేశాలు నిర్వహించిన తర్వాత పోచంపల్లి, సూర్యాపేట వరకు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌లోకి సాగనంపుతాం. ఈశాన్య రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాలూ పాల్గొంటున్నాయి. – కొండవీటి సత్యవతి, రచయిత్రి, భూమిక స్వచ్ఛంద సంస్థ నిర్వహకురాలు – వాకా మంజులారెడ్డి -
ప్రియాంక గాంధీ పుస్తకం.. కాంగ్రెస్ పార్టీ హోప్స్!
కష్టాలు, కడగండ్లలో ఉన్న మహిళల విజ్ఞప్తులను స్వీకరించి ఆర్థికంగా చేయూతను ఇచ్చేందుకు, అవస రమైతే వారికి ఆశ్రయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ‘స్వాధార్ గృహ్’ షెల్టర్ హోమ్‌లలో తక్షణం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. పశ్చిమ బెంగాల్లో ఐదు, ఒడిస్సాలో ఎనిమిది, కర్ణాటకలో ఎనిమిది, ఉత్తర ప్రదేశ్‌లోని ఐదు స్వాధార్ హోమ్‌లను తనిఖీలు జరిపించిన అనంతరం మేనక ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. స్వాధార్ గృహ్ పథకం కింద ఏర్పాటైన షెల్టర్ హోమ్‌లలో అసహాయ మహిళల్ని భౌతికంగా వేధిస్తున్నారని, అనారోగ్యంగా ఉన్నవారికి వైద్య సేవలు అందడం లేదని తనిఖీ అధికారులకు ఫిర్యాదు అందడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి వస్తారా, రారా అనే విషయంపై ఇప్పటికింకా స్పష్టత రానప్పటికీ, ప్రస్తుతం ఆమె రాస్తున్న ఒక పుస్తకం కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చే అవకాశాలు లేకుండా పోవని అంతా భావిస్తున్నారు. ‘అగైన్స్ట్ అవుట్రేజ్’ అనే టైటిల్‌తో రాబోతున్న 300 పేజీల ఆ పుస్తకానికి ప్రచురణకర్తలు ఇప్పటికే కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఒప్పందం ప్రకారం 2019 మార్చి లోపు ప్రియాంక ఆ పుస్తకం స్క్రిప్టును అందజేయవలసి ఉంటుంది. ఇంగ్లిషు, హిందీ, మిగతా కొన్ని ప్రాంతీయ భాషలతో పాటు, ఆడియో బుక్‌గానూ అందుబాటులోకి రానున్న ‘అగైన్స్ట్ అవుట్రేజ్’.. ఎన్నికలకు నెల ముందుగా విడుదల అయ్యే అవకాశం ఉంది. బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీకి, ఆయన ఆమెరికన్ ప్రియురాలు మేఘన్ మార్కెల్‌కు ఈ ఏడాది మే నెలలో వివాహం జరిగింది. అనంతరం మార్కెల్ యు.ఎస్.తో తన భవబంధాలనన్నింటినీ తెంచేసుకుని రాజప్రాసాదంలోకి అడుగు పెట్టారు. అలా ఆమె తెంచుకున్న బంధాలలో ఆమె తండ్రి థామస్ కూడా ఒకరు. ఆయన రాస్తున్న ఉత్తరాలకు ఆమె స్పందించడం లేదు. ఇస్తున్న మెసేజ్‌లకు రిప్లయ్ ఇవ్వడం లేదు. దీంతో దుఃఖితుడైన థామస్ ‘నా కూతురికి దూరంగా ఉండలేకపోతున్నానని’ ఏకంగా బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్నే ఆశ్రయించారు. ‘కనీసం క్రిస్మస్కైనా నా కూతురు నా దగ్గరకు వచ్చేలా ఒప్పించండి’ అని ఒక అమెరికన్ టీవీ షో లో కన్నీరు మున్నీరవుతూ రాణిగారిని అభ్యర్థించారు. థామస్ గతంలో టీవీ లైటింగ్ డైరెక్టర్. ప్రస్తుతం రిటైర్మెంట్లో ఉన్నారు. నెత్తిపై అప్పులు ఉన్నాయి. కూతురు మంచి పొజిషన్లో ఉంది కనుక తనకు చెడు కాలం తప్పుతుందని ఆయన ఆశిస్తున్నట్లు అనిపిస్తోంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా 2015 జూలై 9న ప్రదర్శన జరుపుతున్న 300 మంది సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులపై చైనా ప్రభుత్వం ‘దేశ విద్రోహులు’గా ముద్ర వేసి వారిపై విరుచుకుపడింది. వారిలో నలుగురిని కారాగారంలో బంధించి ఇప్పటి వరకు వారి ‘నేరం’పై విచారణ జరిపించడం గానీ, శిక్ష విధించడం గానీ చేయలేదు. తక్షణం వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ నలుగురి భార్యలు శిరోజాలు తీయించుకుని హైకోర్టు ఎదుట ప్రదర్శన జరిపారు. ‘ఇదెక్కడి న్యాయం?’ అని ప్రశ్నించారు. చైనాలో ‘ఊఫా’ అనే మాటకు రెండు అర్థాలు ఉన్నాయి. న్యాయం ధర్మం లేకపోవడం ఒక అర్థం కాగా, తలపై జుట్టు లేకపోవడం ఇంకో అర్థం. ఈ రెండు అర్థాలనూ సం++గురు మహిళలు ఇలా శిరోజాలు తీయించుకుని న్యాయం కోసం పోరాడుతున్నారు. -
స్త్రీలోక సంచారం
అరవై ఐదేళ్ల ఆమ్రాదేవి నలభై ఏడేళ్ల నిరీక్షణ ఈ ఆదివారం ‘విజయ్ దివస్’ రోజున ఫలించింది. ఆమె నిరీక్షిస్తున్నది తన భర్తను చూడడం కోసం. ఆమ్రాదేవి ఉత్తరకాశీ అమ్మాయి. పద్దెనిమిదేళ్ల వయసులో పెళ్లయింది. అప్పటికి ఆమె భర్త వయసు ఇరవై ఏళ్లు. అతడి పేరు సుందర్. పెళ్లయ్యే నాటికి సుందర్ భారత సైన్యంలో ‘బ్రిగేడ్ ఆఫ్ ద గార్డ్స్’ రెజిమెంట్‌లో సైనికుడు. పెళ్లయ్యాక ఫొటో దిగడం కోసం దగ్గరలోని దుండా పట్టణానికి పెద్దవాళ్లు ఈ దంపతుల్ని తీసుకెళ్లబోతుండగా సుందర్‌కి కబురొచ్చింది, తక్షణం వచ్చి యుద్ధంలో చేరమని! భార్య చెయ్యి వదిలి అప్పటికప్పుడు యుద్ధక్షేత్రంలోకి దుమికాడు సుందర్. 1971 ఇండో–పాక్ వార్ అది. అయితే యుద్ధానికి వెళ్లాక అతడు మళ్లీ తిరిగి రాలేదు. అతడి మృతదేహం తూర్పు పాకిస్తాన్ భూభాగంలో ఎక్కడో గుర్తు తెలియని చోట ఖననం అయింది. ఇన్నేళ్లలోనూ భర్త ఎలా ఉంటాడో మర్చిపోయింది కానీ, భర్తతో తన బంధాన్ని మర్చిపోలేదు ఆమ్రాదేవి. మళ్లీ పెళ్లి కూడా చేసుకోలేదు. సైన్యంలో ఉండగా అతడు తీయించుకున్న ఫొటోనైనా (ఒకవేళ తీయించుకుని ఉంటే) చూడకపోతానా అని ఎదురుచూస్తూ ఉంది. అందుకోసం ప్రయత్నాలు కూడా చేసింది. జిల్లా యంత్రాంగంలోని అధికారులను సంప్రదిస్తూనే ఉంది. ఎట్టకేలకు డిసెంబర్ 16న.. ఆ యుద్ధంలో పాకిస్తాన్‌పై ఇండియా గెలిచిన ‘విజయ్ దివస్’ రోజు ఆమ్రాదేవి చేతికి ఆమె భర్త ఫొటో అందింది. సైనికుల గ్రూప్ ఫొటోలోంచి సుందర్‌ని వేరు చేసి, అతడి ఫొటోను పెద్దదిగా చేసి, దానికి ఫ్రేమ్ కట్టించి జిల్లా అధికారులు ఆమెకు కానుకగా అందజేశారు! లక్కీ కదా! ‘‘అయితే ఆమె కాదు, మేము లక్కీ’’ అంటున్నారు సైనిక్ వెల్ఫేర్ బోర్డు డి.డి.పంత్. ‘‘ఆమ్రాదేవి అభ్యర్థన మేరకు సిపాయి సుందర్ ఫొటో ఎక్కడైనా దొరుకుతుందా అని మావాళ్లు కూడా చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక దొరకదని అనుకున్నాక సుందర్ బొమ్మను వేయించి ఆమ్రాదేవికి అందజేశాం. అయితే పోలికలు గుర్తుపట్టలేకపోతున్నానని ఆమె అన్నారు!. మళ్లీ వెతుకులాట ప్రారంభించాం. చివరికి అతడు పని చేసిన రెజిమెంట్ ప్రధాన కార్యాలయం ఉన్న మహారాష్ట్రలో రికార్డులన్నీ గాలించాం. మొత్తానికి ఓ గ్రూప్ ఫొటోలో సుందర్ దొరికాడు’’ అని పంత్ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ఆయన ఎలా ఉండేవారో, ఎలా మాట్లాడేవారు మర్చేపోయాను. కానీ ఆయన స్వరూపం లీలగా నేటికీ నా కళ్లలో కదలాడుతూనే ఉంది. యుద్ధంలో శత్రువుతో పోరాడుతూ ఆయన చనిపోయారని తెలుసుకోగానే గర్వంగా అనిపించినప్పటికీ, నా శరీరంలోని ఒక భాగాన్ని కోల్పోయినట్లుగా బాధపడ్డాను’’ అన్నారు ఆమ్రాదేవి, ఫొటోలో తన భర్తను కళ్ల నిండా చూసుకుంటూ. ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఎంపీలు, పార్లమెంటు అధికారులతో పాటు ఒక సాధారణ మహిళ కూడా ఆ ప్రాంగణంలో కనిపిస్తున్నారు! ఆమె పేరు పూర్ణిమా గోవిందరాజులు. వయసు 54. చేతిలో కాగితాల కట్ట పెట్టుకుని, స్పష్టతనిచ్చే ఒక ప్రజాప్రతినిధి కోసం ఆమె వెదుకుతున్నారు. అది ఆమె జీవిత సమస్యకు అవసరమైన స్పష్టత. ఈ ఏడాది అక్టోబర్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ ఒక ప్రకటన చేశారు. బాధితులెవరైనా, ఏ వయసులో లైంగిక వేధింపులకు గురైనా ‘పోక్సో’ చట్టం (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్)– 2012 కింద ఎప్పుడైనా నిందితుడిపై ఫిర్యాదు చేయవచ్చుననీ, అందుకు కాలపరిమితి అంటూ ఏమీ లేదన్నది ఆ ప్రకటన సారాంశం. పూర్ణిమ ప్రస్తుతం కెనడాలో కన్సర్వేషన్ బయాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆమె కుటుంబం చెన్నైలో ఉన్నప్పుడు పదేళ్ల వయసులో సమీప సన్నిహితుడొకరు పూర్ణిమను లైంగికంగా వేధించి, కొన్నాళ్లపాటు నరకం చూపించాడు. అతడింకా జీవించే ఉన్నాడు. ఇప్పుడు అతడిపై పోక్సో చట్టం కింద కేసు వేసేందుకు కెనడా నుంచి ఇండియా వచ్చారు పూర్ణిమ. అయితే పోక్సో చట్టం అమల్లోకి రావడానికి ముందు జరిగిన సంఘటన కనుక దానిపై పోక్సో చట్టం ప్రకారం కేసు వేయవచ్చా అన్న స్పష్టత వచ్చే వరకు కేసును స్వీకరించడం కుదరక పోవచ్చునని పూర్ణిమ న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ఆ స్పష్టత కోసమే పూర్ణిమ పార్లమెంటు ప్రాంగణంలో మంత్రులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. మేనకాగాంధీని సంప్రదించే ఆలోచనలోనూ ఉన్నారు. శుక్రవారం నాడు పార్లమెంటులో ఒక ఎంపీ.. ‘బాధితులెవరైనా, ఏ వయసులో లైంగిక వేధింపులకు గురైనా’ అని స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఇచ్చిన ప్రకటనపై స్పష్టతను కోరడంతో పూర్ణిమలో ఆశలు చిగురించాయి. 2019 జనవరి 11న పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు తన సమస్యకొక పరిష్కారం దొరకొచ్చని ఆమె భావిస్తున్నారు. -
స్త్రీలోక సంచారం
చెన్నైలోని అంబూర్‌లో హనీఫా జారా అనే ఏళ్ల బాలిక తన తండ్రి మరుగుదొడ్డి కట్టించడం లేదని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ‘‘మా నాన్నగారు రెండేళ్ల క్రితమే ఇంట్లో టాయ్‌లెట్ కట్టిస్తానని నాకు మాట ఇచ్చారు. ఇప్పటికీ కట్టించలేదు. నేను పెద్దదాన్ని అవుతున్నాను. ఆరు బయటికి వెళ్లాలంటే సిగ్గుగా ఉంటోంది’’ అని హనీఫా తన ఫిర్యాదులో రాసింది. ప్రస్తుతం ఆ బాలిక రెండో తరగతి చదువుతోంది. ఎల్.కె.జి.లో ఉన్నప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తే టాయ్‌లెట్ కట్టిస్తానని తన తండ్రి మాట ఇచ్చి మోసం చేశాడని, మాట తప్పినందుకు ఆయన్ని అరెస్ట్ చెయ్యడం గానీ, టాయ్‌లెట్ కట్టిస్తానని లిఖితపూర్వకమైన హామీ ఇప్పించడం గానీ చెయ్యాలని హనీఫా పోలీసులకు కోరింది. అంబూర్ ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చెయ్యడం కోసం వెళ్లినప్పుడు హనీఫా తనతోపాటు స్కూల్లోను, ఆటల్లోనూ తనకు వచ్చిన 20 పతకాలను, సర్టిఫికెట్లను తన ప్రతిభకు రుజువుగా తీసుకెళ్లింది. హనీఫా సంకల్పబలానికి ముగ్ధురాలైన ఎస్సై ఎ.వలమర్తి పారిశుద్ధ్య అధికారులతో మాట్లాడి టాయ్‌లెట్ నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హనీఫా తండ్రి ఎసానుల్లా (31)కి సోమవారం మధ్యాహ్నం 3.30కి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడంతో ఆందోళనగా బయల్దేరి వెళ్లాడు. విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నాడు. అయితే ఇది ఊపిరి పీల్చుకునే విషయం కాదని ఎస్సై అతడిని సున్నితంగా మందలించారు. ఇదిలా ఉంటే ఈ వార్త తెలియగానే అంబూరు మున్సిపాలిటీ హనీఫాను ‘స్వచ్ఛ భారత్’ స్కీమ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది! ‘ఫియర్లెస్ గర్ల్’గా ప్రఖ్యాతి చెందిన కాంస్య విగ్రహాన్ని న్యూయార్క్‌లోని వాల్‌స్ట్రీట్ నుంచి న్యూయార్క్ స్టాక్ ఎక్సే్ఛంజి భవనం ఆవరణకు తరలించారు. స్త్రీ సాధికారతకు ప్రతీకగా ఈ విగ్రహాన్ని ‘స్టేట్ స్ట్రీట్ గ్లోబర్ అడ్వైజర్స్’ సంస్థ 2017 మార్చి 7న మహిళా దినోత్సవానికి ముందు రోజు వాల్‌స్ట్రీట్‌లో ‘చార్జింగ్ బుల్’ విగ్రహానికి అభిముఖంగా ఆ బుల్‌ని సవాల్ చేస్తున్నట్లుగా ప్రతిష్టించింది. స్టాక్ మార్కెట్లో మహిళా భాగస్వామికి, నాయకత్వానికి సూచికగా ఉంచిన ఈ విగ్రహం కింద ఫలకంపై ‘‘స్త్రీల నాయకత్వపు శక్తిని తెలుసుకోండి. తనేమిటో చూపించగలదు’’ అని రాసి ఉంటుంది. విగ్రహాన్ని అక్కడ ఉంచేందుకు మొదట 30 రోజుల వ్యవధిని మాత్రమే అనుమతి ఇచ్చిన నగరపాలక సంస్థ, ఆ తర్వాత ఆ ‘ఫియర్లెస్ గర్ల్’కు విశేష ఆదరణ లభించడంతో ప్రముఖుల అభ్యర్థనపై వ్యవధి గడువును పెంచుతూ వచ్చింది. అది కూడా ముగియడంతో చివరికి అక్కడి నుంచి తొలగించి, స్టాక్ ఎక్చ్సేంజి భవనం దగ్గరికి చేర్చారు. విగ్రహాన్ని తొలగించిన ప్రదేశంలో బాలిక పాదాల జాడల్ని మాత్రం అలాగే ఉంచుతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ‘స్విఫ్ట్ ఇండియా’ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ‘సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్‌బ్యాంక్ ఫైనాన్షియల్ టెలీకమ్యూనికేషన్స్’ (స్విఫ్ట్)కు ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న ఎం.వి.నాయర్ ఐదేళ్ల పదవీకాలం పూర్తి కావస్తుండడంతో అరుంధతిని బోర్డ్ చైర్మన్‌గా ఎంపిక చేసుకున్నట్లు స్విఫ్ట్ ఇండియా సీఈవో కిరణ్ శెట్టి తెలిపారు. 62 ఏళ్ల అరుంధతి ఎస్.బి.ఐ. తొలి మహిళా చైర్మన్‌గా గుర్తింపు పొందారు. 2016 ఫోర్బ్స్ ‘100 మోస్ట్ పవర్ఫుల్ ఉమన్ ఇన్ ది వరల్డ్’జాబితాలో 25వ స్థానంలో నిలిచారు. -
స్త్రీలోక సంచారం
దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన యు.పి.లోని ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఎ.ఎం.యు.) తొలిసారిగా బాలికల హాకీ టీమ్‌ని జాతీయ స్థాయి పోటీలకు పంపించబోతోంది! ఇందుకోసం క్యాంపస్ పరిధిలోని పది స్కూళ్ల నుంచి బాలికల్ని ఎంపిక చేసి వారితో హ్యాకీ టీమ్‌ని సిద్ధం చేస్తోంది. అంతా సవ్యంగా జరిగితే కనుక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఇంటర్–స్కూల్ కాంపిటిషన్‌కి ఎ.ఎం.యు. బాలికల తొట్టతొలి హాకీ జట్టు పోటీ పడుతుంది. సర్ సయ్యద్ హాల్ సమీపంలోని యూనివర్సిటీ క్రీడా మైదానంలో భారత అంతర్జాతీయ హాకీ జట్టు మాజీ క్రీడాకారుడు అనీస్ ఉర్ రెహ్మాన్ కోచింగ్‌లో ఈ జట్టు శిక్షణ పొందుతోంది. మైదానంలో వీళ్ల ప్రాక్టీస్‌ను చూసి సీనియర్ విద్యార్థినులు (డిగ్రీ) కూడా తరగతులు అయ్యాక సరదాగా హాకీ ఆడేందుకు హాస్టల్ వార్డెన్ నుంచి అనుమతి తీసుకోవడంతో క్యాంపస్ మునుపెన్నడూ లేని విధంగా బాలికలు, యువతుల హాకీ ఆటతో కళకళలాడుతోంది. ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ 1920లో ప్రారంభం అయింది. మహిళలకు లోక్‌సభలో, రాష్ట్రాల అసెంబ్లీలలో మూడింట ఒక వంతు స్థానాలలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించి భారతీయ జనతా పార్టీపై ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశంలోని అన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు, కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న సంకీర్ణ రాష్ట్రాలకు లేఖలు పంపారు. 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ అసెంబ్లీ సమావేశాలలోనే రిజర్వేషన్లను తీర్మానించి, ఆమోదం పొందాలని ఆయా రాష్ట్రాలను ఆయన కోరారు. ఇప్పటికే ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఈ విధమైన తీర్మానాలు చేశాయని ఆ లేఖలో ఆయన గుర్తు చేశారు. ‘‘193 దేశాలలోని పార్లమెంట్లలో ఉన్న మహిళల శాతంతో పోలిస్తే మన దేశం 148వ స్థానంలో ఉంది. అసెంబ్లీలలోనైతే ఈ స్థానం ఇంకా తక్కువ. స్థానిక సంస్థల్లో నయం. మహిళలు ఎక్కువమంది కనిపిస్తున్నారు. స్త్రీలకు సమాజపరంగా ఎదురయ్యే సవాళ్లకు కూడా వెరవకుండా గ్రామ సమస్యల్ని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. రాజకీయాల్లో స్త్రీలకు సముచిత స్థానం లేకుండా ఏప్రజాస్వామ్య దేశమూ పూర్తిగా అభివృద్ధి చెందలేదు’’ అని డిసెంబర్ 6న రాసిన ఆ లేఖలో రాహుల్ అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ లోక్‌సభలో పెండింగులో ఉంది. 2010లో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాక 15వ లోక్‌సభ రద్దయి 2014 ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత కొత్త లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చే జరగలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ చిన్న కూతుర్నని చెప్పుకున్న యువ డ్యాన్సర్ క్యాథరీనా తిఖోనోవా తొలిసారి రష్యా అధికార టీవీ చానల్లో ప్రత్యక్షమయ్యారు. గత గురువారం ఆ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన తండ్రి ఉక్కు సంకల్పం వెనుక ఉన్న మృదువైన కోణాల్ని ఆవిష్కరించారు. ‘‘పైకి కఠినంగా కనిపిస్తారు. కానీ ఆయన మనసు మెత్తనైనది’’ అని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. క్యాథరీనా ఇలా టీవీలో కనిపించడం, రష్యా అధ్యక్షుడి వ్యక్తిగత విషయాలను వెల్లడించడంతో గత ఇరవై ఏళ్లుగా మీడియాపై ఉన్న ఆంక్షలు కొద్దిగానైనా సడలినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పుతిన్ ఆంతరంగిక జీవితం గురించి ఆ దేశంలోనే చాలామందికి తెలియదు. ‘పుతిన్ తాతగారు అయ్యారు’ అన్న వార్త మాత్రం గత ఏడాది దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వార్త అయినా ఆయనకై ఆయనే ఏదో సందర్భంలో బహిర్గతం చెయ్యడం వల్లనే బయటికి వచ్చింది. పుతిన్‌కి ఎందరో భార్యలు, మరెందరో ప్రియురాళ్లు ఉన్నారని ఒక వదంతి. పుతిన్ గతంలో గూఢచారి. తన కుటుంబ జీవితాన్ని కూడా ఆయన నిగూఢంగా ఉంచదలిచారేమో! ఇక క్యాథరీనా ఆయన సొంత కూతురేనా అనే దానిపై ఆ దేశంలో సందేహాలు ఇంకా మిగిలే ఉన్నాయి. -
నిరాపరాధిగా బయటపడ్డ సిద్ధూ భార్య
నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ భార్య నవ్‌జ్యోత్ కౌర్.. అమృత్సర్ రైలు దుర్ఘటన కేసు నుంచి నిరపరాధిగా బయపడ్డారు. దసరా సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ 19న అమృత్సర్ సమీపంలోని రైల్వేట్రాక్ మీద గుంపుగా నిలబడి రావణకాష్టాన్ని తిలకిస్తున్న వారి మీదుగా లోకల్ ట్రైన్ దూసుకెళ్లడంతో 60 మంది మరణించారు. ఆ ఘటనలో.. రావణుడి దిష్టిబొమ్మను దగ్ధం చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తూర్పు అమృత్సర్ అసెంబ్లీ నియోజవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ్‌జ్యోత్ కౌర్‌తో పాటు, ఇతర నాయకుల పైన కేసులు నమోదయ్యాయి. నిర్వాహకుల అలక్ష్యం తప్ప, ఇందులో కౌర్ బాధ్యతారాహిత్యం ఏమీ లేదని తాజా నివేదిక తేల్చింది. కౌర్ భర్త సిద్ధూ కాంగ్రెస్ పాలనలోని పంజాబ్‌లో రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎం.పి. సావిత్రీబాయి ఫూలె పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేశారు. బీజేపీ అనుసరిస్తున్న దళిత వ్యతిరేక ధోరణికి, విభజన రాజకీయాలకు విసిగి వేసారి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. ఎంపీగా మాత్రం పదవీకాలం పూర్తయ్యే వరకు ఆమె కొనసాగుతారు. ఫూలే బి.ఎస్.బి. సెక్టార్ కోఆర్డినేటర్‌గా 2002లో రాజకీయాల్లోకి వచ్చారు. 2012లో బి.జె.పి.లో చేరారు. ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బల్హా ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు. 2014లో బారైచ్ ఎంపీగా విజయం సాధించారు. రెండు రోజుల క్రితం డిసెంబర్ 6న అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విగ్రహాలకు, ఆలయాలకు ప్రభుత్వ ఆర్థిక వనరుల్ని దుబారా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దళితున్న సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని సావిత్రీబాయి ఫూలే విమర్శించారు. అంటార్కిటిక్ సముద్రంలో చెలరేగిన తుఫాను వల్ల దారి తప్పిన ఒంటరి బ్రిటిష్ నావికురాలు ఒకరిని చిలీ అధికారులు రక్షించారు. సూసీ గుడ్‌ఆల్ అనే ఆ సాహస యాత్రికురాలిని కేప్ హార్న్‌కు 2000 నాటికల్ మైళ్ల దూరంలో గుర్తించి సురక్షితంగా, భద్రంగా దక్షిణమెరికా ఒడ్డుకు చేర్చారు. అప్పటికి రెండు రోజులుగా ఆ కల్లోల సముద్రంలో ధైర్యంగా నిలదొక్కుకుని ప్రపంచంతో ఆమె కమ్యూనికేషన్ ఏర్పచుకోగలిగారు. -
స్త్రీలోక సంచారం
భారతీయ సంతతి అమెరికన్ సెనెటర్ కమలాహ్యారిస్ 2020లో జరిగే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసేదీ లేనిదీ ఒకటీ రెండు రోజుల్లో తేలిపోనుంది. ఏదైనా తన కుటుంబ నిర్ణయం ప్రకారం జరుగుతుందని ‘మాణింగ్ జో’ అనే టీవీ కార్యక్రమంలో కమల వెల్లడించారు. 54 ఏళ్ల కమలకు డెమొక్రటిక్ పార్టీలో ప్రత్యేకమైన ఇమేజ్‌తో పాటు, ప్రజాదరణ కూడా ఉంది. కమల కాలిఫోర్నియాలో జన్మించారు. ఆమె తల్లి డాక్టర్ శ్యామలా గోపాలన్ చెన్నై నుంచి 1960లో అమెరికా వలస వచ్చారు. కమల తండ్రి జమైకన్ ఆఫ్రికన్. ఒమాబా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సెనెట్‌లో ఆమెనంతా ‘ఫిమేల్ ఒబామా’ అనేవారు. హాస్టల్లో ఉంటున్న అమ్మాయిలు కాలేజ్‌కి వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు రోడ్డు మీద అబ్బాయిలతో మాట్లాడకూడదని ఒడిశాలోని వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (వి.ఎస్.ఎస్. యు.టి.) లోని ఐదు గర్ల్స్ హాస్టళ్లలో ఒకటైన ‘రోహిణి హాల్ ఆఫ్ రెసిడెన్స్’ ఆంక్షలు విధించింది! ‘గౌరవనీయులైన వైస్ చాన్స్‌లర్ సూచనల మేరకు.. రోహిణి హాస్టల్లో ఉంటున్న అమ్మాయిలు రోడ్డు మీద అబ్బాయిలతో మాట్లాడ్డం నిషేధించడమైనది కనుక, నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకోబడుతుంది’ అని డిసెంబర్ 1న హాస్టల్ నోటీస్ జారీ చేసింది. హాస్టల్ వార్డెన్ సంతకం చేసిన ఆ నోటీసును హాస్టల్ బోర్డులో పెట్టడంతో పాటు నోటీస్ కాపీలను స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్‌కు, వైస్ చాన్స్‌లర్ పి.ఎ.కు పంపించారు. విద్యార్థినుల రక్షణ కోసమే ఈ విధమైన ఆంక్షలు విధించవలసి వచ్చినట్లు యూనివర్సిటీ పబ్లిక్ రిలేషన్స్ ఇన్చార్జి ప్రొఫెసర్ సి.సి. స్వెయిన్ వివరణ ఇచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని మరో కేంద్ర మంత్రి (కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖలు) ఉమా భారతి వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రాజకీయాల నుంచి బయటికి వచ్చేసి పూర్తి ఆధ్యాత్మిక జీవితం గడపడంలో భాగంగా తీర్థయాత్రలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ఆమె తెలిపారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, గంగా నదీ కాలుష్య ప్రక్షాళనలో పాలు పంచుకోవాలని ఉందని కూడా ఆమె అన్నారు. రెండు వారాల క్రితం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా వచ్చే ఎన్నికల్లో తాను నిలబడటం లేదని, ఆరోగ్య కారణాల వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకోవలసి వస్తోందనీ ప్రకటించారు. గర్భంతో ఉన్నప్పుడు తల్లులు వాడే టూత్పేస్ట్లు, మేకప్ క్రీములు, సబ్బులు, ఇతర వ్యక్తిగత సంరక్షణ లేపనాలు, పౌడర్లలోని రసాయనాల వల్ల.. వారికి పుట్టే ఆడ శిశువులు సమయానికన్నా ముందే యవ్వనదశకు (ప్యూబర్టీ) చేరుకునే ప్రమాదం ఉన్నట్లు కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఆ రసాయనాలలోని డీథిల్ ఫాలేట్, ట్రైక్లోజన్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్ల ప్రభావమే ఇందుకు కారణమని వారు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ మహిళల జాతీయ ఫుట్‌బాల్ టీమ్‌లోని క్రీడాకారిణులను ఆ దేశ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సహా అధికారులు కొందరు లైంగికంగా వేధించి, వారిని లోబరుచుకున్నట్లు ‘గార్డియన్’ పత్రికలో వచ్చిన సంచలనాత్మక కథనంలోని ఆరోపణలపై తక్షణం విచారణ జరపాలని ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఆదేశించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన అత్యున్నతస్థాయి అధికారుల బెదిరింపులకు భయపడి దేశం వదిలి పారిపోయిన నేషనల్ ఫుట్‌బాల్ టీమ్ మాజీ కెప్టెన్ ఖలీదా పోవల్ను ఉటంకిస్తూ గార్డియన్ ఈ వార్తా కథనాన్ని కొన్ని రోజుల క్రితమే ప్రచురించింది.