ప్రముఖ సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాకు కేరళ ముస్లిం జమాత్ కౌన్సిల్ మత బహిష్కరణ విధించింది! శబరిమలకు అన్ని వయసుల స్త్రీలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా స్త్రీ, పురుష భేదం లేకుండా కేరళలోని హిందూ మతస్థులందరూ ఒక వైపు నిరసన ప్రదర్శనలు జరుపుతుండగా.. ఆలయంలోకి ప్రవేశించేందుకు రెహానా ప్రయత్నించడాన్ని తీవ్రంగా పరిగణించిన ముస్లిం కౌన్సిల్ ఆమెపై ఈ విధమైన చర్యను తీసుకుంది. అంతేకాదు, ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను ‘మహల్లు’ సభ్యత్వం నుంచి తొలగించాలని ‘ఎర్నాకుళం సెంట్రల్ ముస్లిం జమాత్’ ను కూడా కేరళ కౌన్సిల్‌ను ఆదేశించింది. ‘‘ఆమె చర్య లక్షలాది మంది హైందవ భక్తుల మనసులను బాధించింది. వారి ఆచారాలను అగౌరవపరిచింది. ‘కిస్ ఆఫ్ లవ్’ ఆందోళనలో పాల్గొని, నీలి చిత్రంలో నటించి, ఇప్పుడు మతవిశ్వాసాలకు భంగకరంగా ప్రవర్తించిన ఈ మనిషికి ముస్లింగా ఉండే అర్హత లేదు’’ అని కేరళ ముస్లిం కౌన్సిల్ అధ్యక్షుడు ఎ.పూన్కుంజు ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. మరోవైపు, రెహానా శుక్రవారం శబరిమలను ఎక్కే ప్రయత్నం చేశారన్న విషయం తెలిసి కోపోద్రిక్తులైన ముస్లింలు ఆమె ఇంటిని ధ్వంసం చేశారు.
జమ్మూలోని కఠువాలో ఈ ఏడాది ఆరంభంలో ఎనిమిదేళ్ల ముస్లిం బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య ఘటనలో బాలిక తరఫున న్యాయ పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త తాలిబ్ హుస్సేన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టిన కేసును విచారిస్తున్న సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఆ కేసు నుంచి ఉపసంహరించుకున్నారు. ‘‘నాకు ఏ విధంగానూ తాలిబ్ హుస్సేన్ వైపు వాదించాలని లేదు. నేనీ నిర్ణయం తీసుకోవడానికి అతడి గురించి నాకు తెలిసిన విషయాలు చాలు’’ అని జైసింగ్ అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థినిపై బాట్లా హౌస్ ఏరియాలోని ఆమె అపార్ట్‌మెంట్‌లో హుస్సేన్ అత్యాచారం జరిపినట్టు ఒక పత్రికలో వచ్చిన వార్తాకథనాన్ని చదివిన అనంతరం జైసింగ్ కేసు నుంచి తప్పుకున్నారు. ఆ వార్తా కథనంలో బాధితురాలు జరిగిన ఘటనలనన్నిటినీ వివరంగా పేర్కొన్నారు. ‘‘ఈ ఏడాది ఏప్రిల్లో నాపై అత్యాచారం చేసిన హుస్సేన్ అంతకు ముందు నుంచే తనను పెళ్లి చేసుకోవాలని నన్ను వేధిస్తున్నాడు. అందుకు నేను ఒప్పుకోకపోవడంతో తను అందరిలాంటి మగాణ్ణి కాదని నమ్మించే ప్రయత్నం చేశాడు. అప్పటికీ వినకపోవడంతో బలప్రయోగంతో అనుభవించాడు’’ అని ఆమె వివరించారు.
ప్రముఖుల్ని వెంటాడి రహస్యంగా వారి ఫొటోలు తీసుకునే ఫొటోగ్రాఫర్‌లను ‘పాప్పరాజ్జీ’ అంటారు. అలాంటి ఒక పాప్పరాజ్జీ తీసిన తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి.. పాప్పరాజ్జీల అనుచిత ప్రవర్తనతో తనలాంటి వారు ఎంతగా ఇబ్బంది పడతారో తెలియజేస్తూ ఓ పొడవాటి పోస్ట్ పెట్టిన 23 ఏళ్ల అమెరికన్ సూపర్ మోడల్ జిజీ హదీద్‌పై ఓ ఫొటో ఏజెన్సీ కేసు పెట్టింది. ‘ఫొటోలు తీసుకోవాలనుకునే వాళ్ల కోసం వీలైనంత వరకు మేము ఓపిగ్గానే చిరునవ్వులు చిందిస్తూనే ఉంటాం. అయితే ప్రతిసారీ అలా కుదరదు. అయినప్పటికీ ఫొటోల కోసం బలవంతం చేస్తుంటారు. ఇవ్వకపోతే.. మేము ఎక్కడికి వెళితే అక్కడికి మమ్మల్ని వెంటాడి, వేటాడి ఫొటోలు తీసుకుని, వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటుంటారు. మాలో ఏం స్పెషల్ ఉంటుంది? ఏ సందర్భమూ లేకుండానే ఓ ఆరడుగుల మనిషి కారు ఎక్కడాన్ని, కారు దిగడాన్ని, పని చేస్తున్నచోట ఆఫీస్ బిల్డింగ్‌లోకి వెళ్లడాన్ని, మళ్లీ బయటికి రావడాన్ని నిరంతరం షూట్ చేస్తూనే ఉంటారు. అందుకోసం వారు మూర్ఖంగా, నిర్దాక్షిణ్యంగా కూడా ప్రవర్తిస్తుంటారు. అది మమ్మల్నే కాదు, మా పక్కన ఉన్న సాధారణ వ్యక్తులను కూడా ప్రమాదంలో పడేసేలా, ప్రాణాంతక స్థితిలోకి నెట్టేసేలా ఉంటుంది. మరీ వ్యక్తిగత జీవితంలోకి కూడా ప్రవేశిస్తే ఎలా? పాప్పరాజ్జీలు తమ స్వార్థాన్ని, ధనార్జన ధ్యేయాన్ని పక్కన పెట్టి.. కనీస మానవత్వంతో బిహేవ్ చేయాలి’’ అని ఆ పోస్టులో పెట్టిన హదీద్ ఆ తర్వాత కొన్ని గంటలకే దానిని తొలగించారు!
ఐదు రోజుల మాస పూజల కోసం తెరుచుకున్న శబరిమల ఆలయ ద్వారాలు పూజల అనంతరం సోమవారం మూత పడ్డాయి. అయితే ఆలయంలోకి స్త్రీల ప్రవేశంపై కేరళలో జరుగుతున్న రభస మాత్రం పూర్తి కాలేదు. మరోవైపు.. శబరిమల ఆలయంలోకి స్త్రీలను అనుమతించడం సబబా కాదా అన్నదానిపైనా సోషల్ మీడియాలో వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ‘‘ఒక మలయాళీగా, ఒక హిందువుగా ఈ పరిణామాలు నన్నెంతో బాధించాయి. అంతా చదువుకున్న వారే అయిన కేరళలో స్త్రీ, పురుషులు ఎందుకని ఇలా దురుసుగా, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. శబరిమలను దర్శించుకోవాలని నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. కానీ దర్శించుకోవాలని ఆశపడుతున్న మహిళలను నేను వ్యతిరేకించను’’ అని మాయా మీనన్ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో మలయాళీ నేపథ్య గాయని అంజూ జోసెఫ్ తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. ‘‘మహిళలకు హక్కులు లేని కాలానికి తిరోగమించడం కోసం పోరాడుతూ ఆ క్రమంలో పురోగమనం కోసం పోరాడిన మన ముందు తరం వారి ప్రయత్నాలను, ప్రయాసను వృథా చేస్తున్నాం. వాళ్లు మనకు ఓటు హక్కు తెచ్చారు. సతీ సహగమన దురాచారాన్ని నిర్మూలించారు. బాల్య వివాహాల నిషేధ చట్టం తెచ్చారు. ఇప్పుడు ఆలయంలోకి మహిళల ప్రవేశానికి మార్గం ఏర్పరిచారు. అయినప్పటికీ మనమింకా వెనకే ఉండిపోతాం అంటున్నాం’’ అని అంజు ఆవేదన చెందారు. యు.ఎస్.లోని హోండురాన్ వలస గుంపుల (మైగ్రెంట్ క్యారవాన్స్) నుంచి మహిళలను, చిన్నారులను దేశంలోకి అనుమతించే కార్యక్రమాన్ని మెక్సికో ప్రారంభించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ ‘దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి. డెమోక్రాట్‌లు వలస గుంపుల్ని కోరుకుంటున్నారు. అసలీ వలస గుంపులేంటీ అని అనేకమంది ఆశ్చర్యపోతున్నారు’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment