
పాక్ స్వాతంత్య్ర దినమైన ఆగస్టు 14న గానీ, అంతకంటే ముందు గానీ ఆ దేశ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో ఆయన నేతృత్వంలోని పి.టి.ఐ. (పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్) పార్టీలో చేరిన ఇమ్రాన్ ఖాన్ మూడో భార్య బుష్రా మనేకా కూతురు మెహ్రు హయత్.. మహిళల సమస్యలపై పని చేయాలని తనకు ఆసక్తిగా ఉందని వెల్లడించారు. తన ఆధ్యాత్మిక గురువు, నలుగురు పిల్లల తల్లి అయిన బుష్రాను ఈ ఏడాది ఫిబ్రవరిలో అతి గోప్యంగా వివాహమాడిన ఇమ్రాన్ ఖాన్, ఆమెకన్నా ముందు రెహమ్ ఖాన్‌ను, రెహమ్ ఖాన్‌కు ముందు జెమీమా గోల్డ్ స్మిత్‌ను పెళ్లి చేసుకున్నారు.
► బుర్ఖా ధరించిన మహిళలు ఉత్తరాల డబ్బాల్లా (లెటర్ బాక్సెస్) కనిపిస్తారని బ్రిటన్ విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి బోరిస్ జాన్సన్ చేసిన వ్యాఖ్యలపై ‘ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిటన్’ మండిపడుతోంది. ‘ది డెయిలీ టెలిగ్రాఫ్’ పత్రికలో క్రమం తప్పకుండా కాలమ్ రాస్తుండే బోరిస్ జాన్సన్ తన తాజా వ్యాసంలో ముస్లిం మహిళల తరఫున మాట్లాడుతూ.. ‘బుర్ఖా వేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. నేనూ మీతో కలిసి బుర్ఖాకు వ్యతిరేకంగా పోరాడతాను. ఈ అణచివేత ఏంటి? బుర్ఖాలు వేసుకుని లెటర్ బాక్సుల్లా కనిపించాల్సిన అగత్యం ఏంటి?’ అని రాయడం వివాదాస్పదం అయింది.
► మానవ హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారిణి సమర్ బదావీ సహా.. అనేక మంది మహిళా సామాజిక కార్యకర్తలను సౌదీ అరేబియా అరెస్టు చేసి, నిర్బంధించడంపై కెనడా తీవ్రమైన భయాందోళనలు వ్యక్తం చేయడంతో ఆగ్రహించిన సౌదీ అరేబియా.. కెనడాతో వాణిజ్య సంబంధాలను తెంచుకోవడంతో పాటు ఆ దేశంలోని తమ దౌత్య అధికారిని వెనుక్కు పిలిపించి, ఈ దేశంలోని కెనడా దౌత్య అధికారికి.. ఇరవై నాలుగు గంటలలోపు దేశం విడిచి పోవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఏమాత్రం స్పందించని కెనడా.. ‘మానవ హక్కుల్ని, ప్రధానంగా మహిళల హక్కుల్ని పరిరక్షించేందుకు కెనడా దేనికైనా సిద్ధమేనని’ విదేశీ మంత్రిత్వశాఖ మహిళా ప్రతినిధి మేరీ పియర్ బరిల్ పేరుతో ఒక ప్రకటనను విడుదల చేసింది.
► పన్నెండేళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేసిన వారికి కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష, అంతకంటే ఎక్కువగా మరణశిక్ష విధించే బిల్లును సోమవారం పార్లమెంటు ఆమోదించింది. జమ్ము కశ్మీర్‌లోని కతువాలో ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మరొక బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటనలు దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలల్ని రేపడంతో తక్షణ చర్యగా ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 21న ప్రకటించిన అత్యవసర ఆదేశం (ఆర్డినెన్స్) స్థానంలో ఇప్పుడీ బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చింది.
► టీ షర్టులను, సిగ్గు బిడియాలను విసిరిపారేసి స్వేచ్ఛగా స్పోర్ట్స్ బ్రాతో ఫిట్‌నెస్ కోసం పరుగులు తీయండని మహిళల్ని ఉద్యమపరిచే ‘స్పోర్ట్స్ బ్రా రన్ స్క్వాడ్’ ఢిల్లీలో వేగం పుంజుకుంటూ, దేశంలోని మిగతా మెట్రోలకూ మెల్లమెల్లగా వ్యాపిస్తోంది. ఎన్.సి.ఆర్. (నేషనల్ క్యాపిటర్ రీజియన్) లోని మహిళలు ఎందువల్ల నిర్బిడియంగా స్పోర్ట్ బ్రాను ధరించి రన్నింగ్ చేయలేకపోతున్నారన్న అంశంపై ఢిల్లీ, గోర్‌గావ్‌లలోని మహిళా రన్నర్‌ల మధ్య అనేక సమావేశాలు, చర్చలు జరిగిన అనంతరం ఈ ‘స్పోర్ట్స్ బ్రా రన్ స్క్వాడ్’ ఒక ఉద్యమంలా ఆవిర్భవించింది.
► భారత ప్రధాని దివంగత ఇందిరాగాంధీకి దశాబ్దకాలం పాటు ‘మ్యాన్ ఫ్రైడే’గా (విధేయుడిగా, విశ్వసనీయుడిగా) ఉన్న ఆర్.కె.ధావన్ తన 81వ యేట సోమవారం కన్నుమూసిన అనంతరం.. పాలనా వ్యవహారాల విషయమై ప్రధాని ఇందిర ఆయనపై ఎంతగా ఆధారపడిందీ వెల్లడించే వాస్తవ కథనాలు అనేకం బయటికి వస్తున్నాయి. ఇందిర జీవితంలోనే అత్యంత కీలకమైన ఎమర్జెన్సీ విధింపు సమయంలో, ఇందిర చిన్న కొడుకు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందినప్పుడు హాస్పిటల్ దగ్గర.. ధావన్ తన వెంట నిలిచిన కారణంగానే ఆమె స్థిమితంగా ఉండగలిగారని సీనియర్ మహిళా జర్నలిస్టు, ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కంట్రిబ్యూటింగ్ ఎడిటర్ అయిన కూమీ కపూర్ రాశారు.
► చెన్నైలో లివింగ్ స్మైల్ విద్యగా ప్రసిద్ధురాలైన రంగస్థల నటి, ట్రాన్స్‌జెండర్ హక్కుల కార్యకర్త, రచయిత్రి, కుల వ్యతిరేక ఉద్యమకారిణి, స్వయంగా తనే ట్రాన్స్‌జెండర్ అయిన విద్య.. కరడుకట్టిన సంప్రదాయవాదుల నుంచి తన ప్రాణానికి హానీ ఉందనీ, ఇప్పటికే తనపై ఒకసారి హత్యాయత్నం జరిగిందని వివరిస్తూ పంపిన ‘శరణు వేడుకోలు’ను స్విట్జర్లాండ్ తిరస్కరించింది. అక్కడితో ఊరుకోకుండా.. ‘నాలుగువేల ఏళ్ల హిజ్రాల ఘన చరిత్ర కలిగిన భారతదేశాన్ని మించిన సురక్షిత స్థలం హిజ్రాలకు మరెక్కడా ఉండదు. కనుక మీరు అక్కడే ఉండండి. పైగా మీరు చదువుకున్న అమ్మాయి కూడా..’ అని ప్రత్యుత్తరం పంపిందని విద్య తన ఆవేదనను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
► ముంబైలోని జుహు ప్రాంతంలో శినా శివ్ దాసానీ అనే మహిళ తను నివాసం ఉంటున్న చిన్న గదిలోనే 70 పిల్లులతో (క్యాట్స్) సహజీవనం చేస్తున్న విషయం నేడు (ఆగస్టు 8) అంతర్జాతీయ మార్జాల దినోత్సవం కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. తల్లితో కలిసి ఉంటున్న శివ్‌దాసానీ తను తెచ్చి పెంచుకుంటున్న అనాథ పిల్లుల కోసమని ఇప్పటి వరకు మ«ద్, ఒషివారా, తలోజా, ఖార్గర్‌లలో అద్దెకున్న ఇళ్ల యజమానులతో గొడవ పడి జుహు లోని ఇంటికి మారినప్పటికీ, ఇక్కడ కూడా ఆ ఇంటిని అద్దెకు ఇచ్చినవారు.. ‘పిల్లుల బాధ మరీ ఇంత ఎక్కువగా ఉంటుందని ఊహించలేదు. దయచేసి ఖాళీ చెయ్యండి’ అని పోరు పెట్టడంతో శివ్ దాసాని ఇప్పుడు మరో ఇంటికోసం వెదకులాట మొదలుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment