ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు బిగ్ షాక్ తగిలింది. అల్ ఖాదిర్ కేసులో ఇమ్రాన్‌ఖాన్ దంపతులు దోషులుగా తేలారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్‌కు 14ఏళ్లు, ఆయన భార్య బుష్రా బీబీకి ఏడేళ్ల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. దీంతో, ఇమ్రాన్ పీటీఐ పార్టీకి కోలుకులోని దెబ్బ తగిలినట్టు అయ్యింది.
పాకిస్తాన్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అల్ ఖాదిర్ కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ దంపతులను కోర్టు దోషులుగా తేల్చింది. అడియాలా జైలులో కట్టుదిట్టమైన భద్రత నడుమ తుది తీర్పును న్యాయమూర్తి నాసిర్ జావేద్ రానా వెల్లడించారు. ఈ కేసులో ఇమ్రాన్‌ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి 14 ఏళ్లు, ఏడేళ్లు జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. ఇదే సమయంలో ఇమ్రాన్, బుష్రాకు రూ.10 లక్షలు, రూ.5 లక్షలు జరిమానా సైతం విధించింది. ఇక, పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికలు ముగిసిన వెంటనే 2024 ఫిబ్రవరి 27న ఇమ్రాన్‌ఖాన్ దంపతులపై నేరాభియోగాలు మోపిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. ఇమ్రాన్ ఖాన్ దంపతులు అల్ ఖాదిర్ ట్రస్ట్ అనే ఫౌండేషన్ 1996లో స్థాపించారు. పేదరిక నిర్మూలన, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి వాటి కోసం ఈ ట్రస్ట్ పనిచేస్తుంది. అయితే, ఈ ఫౌండేషన్ చాటున అక్రమాలు జరిగినట్టు పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) కేసు దాఖలు చేసింది. ఈ క్రమంలో కేసులో ఇమ్రాన్ ఖాన్, అతని భార్య బుష్రా బీబీ నిందితులుగా చేర్చింది. బిలియన్ల రూపాయల విలువైన భూమిని, డబ్బును కాజేసినట్టు ఆరోపించారు. వీటిపై కోర్టు తాజాగా విచారణ జరిపిన అనంతరం తీర్పును వెల్లడించింది. తాజా కోర్టు తీర్పుతో ఇమ్రాన్ మరికొన్నేళ్ల పాటు జైలుల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో, పీటీఐ పార్టీ నాయకత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment