
ఐర్లండ్‌లోని ప్రార్థనాస్థల నివాస ప్రాంగణాలలో, అనాధ ఆశ్రమాలలో, మతపరమైన విద్యాలయాలలో దశాబ్దాలుగా జరుగుతున్నట్లు వచ్చిన లైంగిక అకృత్య ఆరోపణలపై స్పందించిన పోప్ ఫ్రాన్సిస్.. డబ్లిన్‌లో కొందరు బాధితులను ప్రత్యక్షంగా కలుసుకుని.. వారిని, వారి తల్లులను క్షమాపణ వేడుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఐర్లండ్ వచ్చిన ఫ్రాన్సిస్.. పర్యటన ముగింపు కార్యక్రమంగా డబ్లిన్‌లోని ఫీనిక్స్ పార్క్‌లో కనీసం లక్షమంది హాజరైన బహిరంగ సభలో మాట్లాడుతూ, ‘‘క్యాథలిక్ మత విలువలు, విశ్వాసాలు పరిఢవిల్లిన ఒకప్పటి ఐర్లండ్‌లో ఈ విధమైన క్షీణతను జీర్ణించుకోలేకపోతున్నాను’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో ఆగస్టు 26న జరిగిన ఎనిమిదవ ఫుల్, హాఫ్ మారథాన్‌లలో వయసుతో నిమిత్తం లేకుండా మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొనగా, వారిలో జయంతి సంపత్‌కుమార్ అనే మహిళ.. చీరలో 42 కి.మీ పరుగులు తీసి ప్రత్యేక స్ఫూర్తిగా నిలిచారు. ఈ రెండు మారథాన్‌ల కోసం దేశంలోని వివిధ నగరాల నుంచి వచ్చిన 3 వేల మంది రన్నర్‌లతో కలిపి మొత్తం 22 వేల మంది పాల్గొన్న 42,195 కి.మీ ఫుల్ మారథాన్ మహిళల గ్రూపులో కెన్యా యువతి పాస్కలియా చెప్కాచ్, జ్యోతి గౌహతి, సీమ మొదటి మూడు స్థానాల్లో నిలవగా, 21,095 కి.మీ. హాఫ్ మారథాన్‌లో స్వాతీగద్వే, వర్షాదేవీ, నవ్యా వడ్డె కొన్ని నిమిషాల వ్యత్యాసంతో తొలి మూడు స్థానాలు గెలుచుకున్నారు.
‘టాసా’ (తెలంగాణ అండ్ ఆంధ్రా సబ్ ఏరియా) ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్‌లోని టాసా ప్రధాన కార్యాలయంలో ‘ఆర్మీ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ (అవ్వ) వీక్.. వేడుకలు జరిగాయి. సైన్యంలో పని చేస్తున్న వారి జీవిత భాగస్వాములు, పిల్లలు, వారిపై ఆధారపడి జీవిస్తున్న ఇతరుల సంక్షేమం కోసం ఢిల్లీలో 1966 ఆగస్టు 23 న ఈ సంస్థ ఆవిర్భవించిన నాటి నుండీ జరుగుతున్న ఈ ‘అవ్వ’ వీక్.. ఈ ఏడాది థీమ్ (‘ఇయర్ ఆఫ్ ది డిజేబుల్డ్ సోల్జర్’) కి అనుగుణంగానే తన కార్యక్రమాలు రూపొందించుకుంది.
హార్ట్ సర్జరీ కోసం ఫ్రాన్స్‌కు వెళుతున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ (80) ను ఆమె ఇంటికి వెళ్లి మరీ పరామర్శించిన ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ట్విట్టర్‌లో ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఆమె చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అయోటిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ నిమిత్తం వైద్యుల సలహా మేరకు ఫ్రాన్స్‌లోని లీల్ ప్రాంతంలో ఉన్న ‘యూనివర్సిటీ హాస్పిటల్’లో షీలా దీక్షిత్ అడ్మిట్ అవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చూసుకోవడం కోసం ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే నలుగురు సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని నియమించింది.
స్త్రీశక్తి పాత్రలకు ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ నటి ఎమ్మా థాంప్సన్ (59), తన 18 ఏళ్ల కుమార్తె గయా వైజ్ గత ఏడాది లండన్ అండర్‌గ్రౌండ్ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఏ విధంగా లైంగిక వేధింపునకు గురైందో ‘సన్’ పత్రికకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ, ‘‘అంతమంది మధ్యలో ప్రయాణిస్తున్నప్పటికీ, తనపై చేతులు వేసినవాడికి భయపడటం తప్ప, వాడినేమీ అనలేకపోవడమే నా కూతుర్ని చాలాకాలం పాటు బాధించింది’’ అని తెలిపారు. ‘‘వేధింపునకు గురైన స్త్రీకి ఆ వేధింపు కన్నా కూడా, ‘ఎందుకిలా చేస్తున్నావ్?’ అని అడగలేకపోవడం, తిరిగి మాటకు మాట అనలేకపోవడమే పెద్ద అవమానం’’ అని భావించిన తన కూతురు ఆ ఘటనను మర్చిపోవడానికి చాలా ప్రయత్నం చేయవలసి వచ్చిందని చెప్పిన ఎమ్మా.. మతపరమైన విశ్వాసాల కారణంగా రక్తమార్పిడికి తిరస్కరించిన ఒక చిన్నారి చుట్టూ అల్లిన కథాంశంతో ‘చిల్డ్రన్ యాక్ట్’ అనే చిత్రంలో త్వరలోనే నటించబోతున్నారు.
చైనాలో కార్ పూలింగ్ సర్వీస్‌కు ప్రఖ్యాతిగాంచిన ‘దీదీ చాషింగ్’.. గతవారం రైడ్–షేరింగ్ సర్వీస్‌లో ఒక ప్రయాణీకురాలిపై అత్యాచారం, ఆ పై ఆమె హత్య జరిగిన ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ తక్షణం తమ సేవలన్నీ రద్దు చేయడమే కాకుండా, కంపెనీ జనరల్ మేనేజర్‌ను, వైస్ ప్రెసిడెంట్‌ను ఆ పదవుల నుంచి తొలగించింది. అనంతరం, కార్‌పూలింVŠ సర్వీసులో మహిళల భద్రతా ప్రమాణాలపై చైనా పోలీస్, రవాణా శాఖలకు వివరణ ఇస్తూ, ఆ శాఖల ఆదేశం మేరకు సెప్టెంబర్ 1 కల్లా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో సేవలను పునఃప్రారంభిస్తామని తెలిపింది.
దేశద్రోహ నేరారోపణపై రెండేళ్ల క్రితం 2016 ఏప్రిల్ 3న టెహ్రాన్ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేసి, ఐదేళ్ల శిక్ష విధించి, అక్కడి ఎవిన్ జైల్లో పెట్టిన ‘థాంప్సన్ రాయిటర్స్ ఫౌండేషన్’ (బ్రిటన్) ప్రతినిధి, బ్రిటన్ సంతతి ఇరాకీ మహిళ.. నజానిన్ జఘారి రాట్‌క్లిఫ్‌కు అనూహ్యంగా మూడు రోజుల ‘విముక్తి’ని ప్రసాదించి, కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం ఇచ్చిన ఇరాన్ ప్రభుత్వం.. ఆ తర్వాత ఏమాత్రం పొడిగింపు లేకుండా తిరిగి ఆమెను అరెస్టు చేయడంపై ఆమె పేరుతో ట్విట్టర్‌లో ఉన్న ‘ఫ్రీ నజానిన్’ అకౌంట్‌లో దిగ్భ్రాంతి వ్యక్తమౌతోంది. ప్రభుత్వం ఇచ్చిన విరామ సమయంలో నజానిన్ తన నాలుగేళ్ల కూతురు గాబ్రియేలాను ఎత్తుకుని ఉల్లాసంగా ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో చూసిన వారు భావోద్వేగాలకు లోనై, నజానిన్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నట్లు ఆమె భర్త రిచర్డ్ రాట్‌క్లిఫ్ ట్విట్టర్‌లో ఆవేదనగా ఒక కామెంట్‌ను పోస్ట్ చేశారు.
గర్భం వచ్చిన తొలి వారాలలో గర్భవిచ్ఛిత్తి (అబార్షన్) కోరుకునేవారు ఇక నుంచి ఇంట్లో కూడా ‘అబార్షన్ పిల్’ వేసుకునేందుకు అనుమతించే కొత్త చట్టం ఒకటి ఇంగ్లండ్‌లో ఈ ఏడాది ఆఖరులో అమలులోకి రానుంది. ప్రస్తుతం పదో వారం లోపు అబార్షన్ చేయించుకునేందుకు చట్టపరమైన ఆమోదం ఉన్న ఇంగ్లండ్‌లో.. అబార్షన్‌ను క్లినిక్‌లో మాత్రమే 24 నుంచి 48 గంటల మధ్య విరామంతో వేసుకోవలసిన రెండు పిల్స్‌తో చేస్తుండగా, మొదటి పిల్ వేసుకున్న తర్వాత, ఇంటికి వెళ్లిపోయి, రెండో పిల్ కోసం మళ్లీ క్లినిక్‌కు వెళ్లే సమయంలో దారి మధ్యలో గర్భస్రావం జరిగేందుకు ఉన్న ప్రమాదాన్ని ఈ ‘హోమ్ పిల్’ తో నివారించవచ్చునని కొత్త చట్టాన్ని సమర్థించేవారు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment