స్త్రీలోక సంచారం | Womens empowerment: Mamata Banerjee pens lyrics of Durga puja theme song | Sakshi
Sakshi News home page

స్త్రీలోక సంచారం

Published Wed, Sep 12 2018 12:16 AM | Last Updated on Wed, Sep 12 2018 12:16 AM

Womens empowerment: Mamata Banerjee pens lyrics of Durga puja theme song - Sakshi

2014 మే 5 – 2016 సెప్టెంబర్‌ 23 మధ్య కాలంలో తనపై అనేకసార్లు అత్యాచారం జరిపినట్లు కేరళ నన్‌ ఒకరు జలంధర్‌లోని క్యాథలిక్‌ చర్చి బిషప్‌ జేమ్స్‌ ఫ్రాంకో ములక్కల్‌పై చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందని విచారణలో నిర్ధారణ అయినప్పటికీ, ఇంతవరకు ఆయనను అరెస్టు చెయ్యకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతుండగా.. కేరళలోని పూంజర్‌ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే పి.సి.జార్జి ఒక ప్రెస్‌మీట్‌లో.. బాధితురాలైన ఆ నన్‌ను ‘వ్యభిచారి’ అని అంటూ.. ‘‘తనపై బిషప్‌ 13 పర్యాయాలు అత్యాచారం చేశాడని చెబుతున్న ఆ మనిషి.. పన్నెండుసార్లలో ఒక్కసారైనా ఫిర్యాదు చేయకుండా, పదమూడోసారి మాత్రమే పెదవి విప్పడాన్ని బట్టి చూస్తే ఆమె గుణం లేని మనిషి అని స్పష్టం అవుతోందని’’ అనడంపై ‘నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఉమెన్‌’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఈ నెల 20లోగా కమిషన్‌ ముందు హాజరుకావాలని అతడికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన కూడా స్పందించిన పి.సి.జార్జి, ‘ఎన్నికైన ప్రజా ప్రతినిధినైన నాకు ఎవరి ఎదుటా హాజరు కావలసిన అవసరం లేదు’ అని అనడం మరో వివాదం అయింది.

ఢిల్లీలోని తన ఫ్రెండ్‌తో వాట్సాప్‌ వీడియోలో చాట్‌ చేస్తూ, ఆ తర్వాత ‘రష్యన్‌ రౌలత్‌’ ఆడుతూ, తన టర్న్‌ వచ్చినప్పుడు తుపాకీని కణతలకు గురిపెట్టుకుని కాల్చుకోవడంతో కుప్పకూలిపోయిన కరిష్మా యాదవ్‌ అనే గ్వాలియర్‌ యువతి, ఆ తర్వాత ఆసుపత్రిలో మరణించింది. రివాల్వర్‌లోని ఆరు చాంబర్స్‌లో ఐదింటిని ఖాళీగా ఉంచి, ఒక దాంట్లో బులెట్‌ పెట్టి, చాంబర్‌ని గిర్రున తిప్పి కణతల దగ్గర పెట్టుకుని ట్రిగ్గర్‌ నొక్కే అతి ప్రమాదకరమైన ‘రష్యన్‌ రౌల™Œ ’ ఆటను ఆడుతుండగా, కర్మిషా తన వంతు రాగానే.. ‘‘దేఖ్తే హై కిస్మత్‌ మే క్యా లిఖా హై’’ (చూద్దాం ఏం రాసిపెట్టి ఉందో) అని తన ఫ్రెండ్‌తో అంటూ ట్రిగ్గర్‌ నొక్కడంతో కణతల్లోకి బులెట్‌ దిగి మరణించిందని పోలీసులు వెల్లడించారు.

1975లో ఒక స్థల వివాదంలో తన ఆస్తిని మీర్జాపూర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ జప్తు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, సివిల్‌ కోర్టులో రెండేళ్ల పాటు న్యాయపోరాటం చేసి, కేసు గెలిచిన గంగా దేవి అనే 27 ఏళ్ల మహిళ.. విచారణ సమయంలో కోర్టు ఫీజుగా చెల్లించిన 312 రూపాయల రసీదును కోర్టువారు పోగొట్టిన కారణంగా, రెండోసారి చెల్లించడానికి ఆమె నిరాకరించినందుకు వల్ల.. నిబంధనల ప్రకారం గెలుపు ఉత్తర్వుల జారీకి ఫీజు రసీదును జత చేసే పరిస్థితి లేకపోవడంతో.. తీర్పు అలా 41 ఏళ్ల పాటు గాలిలో ఉండి, చివరికి ఈ ఏడాది ఆగస్టు 31న మీర్జాపూర్‌ సివిల్‌ జడ్జి లవ్లీ జైస్వాల్‌ చొరవతో విముక్తి పొంది, గంగాదేవి ‘గెలుపు  తీర్పు’ కాపీ బయటికి వచ్చింది! అయితే.. ఇన్నేళ్లలోనూ 11 మంది జడ్జీ్జల చేతులు మారిన ఈ ‘తీర్పు’ ప్రతిని అందుకోడానికి లేకుండా, 2005లోనే గంగాదేవి మరణించిన విషయం ఆలస్యంగా కోర్టు దృష్టికి వచ్చింది.

కొత్తగా వచ్చే పేరు ప్రఖ్యాతుల వల్ల కళాకారులు మారిపోరని, వారి చుట్టూ ఉన్న ప్రపంచమే వారిని చూసే విధానాన్ని మార్చుకుంటుందని 32 ఏళ్ల అమెరికన్‌ పాప్‌ సింగర్‌ లేడీ గాగా అన్నారు. అక్టోబర్‌ 5న విడుదల అవుతున్న హాలీవుడ్‌ మ్యూజికల్‌ రొమాంటిక్‌ మూవీ.. ‘ఎ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌’తో నటిగా పరిచయం అవుతున్న లేడీ గాగా.. చిత్రం ప్రివ్యూ సందర్భంగా టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. పేరుప్రతిష్టల వంటి అసహజమైన విషయాలకు దూరంగా ఉండే క్రమంలో.. నిత్య జీవితంలో కళాకారులు చేసే పోరాటాన్ని సహృదయంతో అర్థం చేసుకుని ‘వారు కూడా మనలా సాధారణమైన వ్యక్తులే’ అన్న విధంగా ఈ ప్రపంచం తనను అక్కున చేర్చుకోవాలని విజ్ఞప్తి చేయడం విశేష ప్రశంసలు అందుకుంది. 

హాలీవుడ్‌ మూవీ మొఘల్‌.. హార్వీ వైన్‌స్టీన్‌ లైంగిక వేధింపులను సుప్రసిద్ధులైన కొందరు సీనియర్‌ నటీమణులు ధైర్యంగా బయటపెట్టడంతో ఏడాది క్రితం ఊపిరి పోసుకున్న ‘మీ టూ’ ఉద్యమం తాజాగా మరో ప్రముఖుడి లైంగిక అకృత్యాలను బట్టబయలు చేసింది. అమెరికన్‌ టెలివిజన్‌ దిగ్గజం ‘సి.బి.ఎస్‌. కార్పొరేషన్‌’ చైర్మన్‌ లెస్లీ మూన్వెస్‌ మొత్తం 12 మందితో మహిళలతో అనుచితంగా ప్రవర్తించాడని.. ముఖరతికి బలవంత పెట్టడం, దేహంలో గోప్యమైన ప్రదేశాలను తాకడం, నిరాకరించినవారిపై కక్ష కట్టి ప్రతీకారం తీర్చుకోవడం వంటì  ఆరోపణలు ఆయనపై ఉన్నాయని ‘న్యూయార్క్‌ర్‌’ మ్యాగజీన్‌ ఆదివారం నాడు ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన వెంటనే లెస్లీ మూన్వెస్‌ను చైర్మన్‌ పదవి నుంచి సి.బి.ఎస్‌. తొలగించింది. 

ఈజిప్టు నుంచి వలస వచ్చిన ఒక హోటల్‌ ఉద్యోగి.. మక్కాలోని గుర్తు తెలియని ఒక హోటల్లో తన సహోద్యోగి అయిన సౌదీ మహిళతో ఒకే టేబుల్‌పై కలిసి కూర్చొని ఉదయం అల్పాహారం తీసుకుంటున్న దృశ్యాన్ని.. వైరల్‌ అవుతున్న ఒక వీడియోలో చూసిన సౌదీ అరేబియా అధికారులు అతడు ఎక్కడున్నదీ కనిపెట్టి అరెస్టు చేశారు. వీడియోలో ఒక చోట ఆ మహిళ అతడికి తినిపించడం, కెమెరా వైపు చూస్తూ చేయి ఊపడం వంటి వాటిని కూడా తీవ్రంగా పరిగణించిన సౌదీ అధికారులు.. వారిపై తామేమి చర్యలు తీసుకుంటున్నదీ మీడియాకు బహిర్గతం చేయలేదు.

మిస్‌ అమెరికా’ నిర్వాహకులు.. స్విమ్‌ సూట్‌ రౌండ్‌ను రద్దు చేశాక తొలిసారి జరిగిన అందాల పోటీలలో.. ‘మిస్‌ అమెరికా 2019 టైటిల్‌’ను మిస్‌ న్యూయార్క్‌ నియా ఫ్రాంక్లిన్‌ గెలుచుకున్నారు. నిరుటి అందాల రాణి క్యారా మండ్‌ తన శిరస్సుకు కిరీటాన్ని తొడుగుతున్నప్పుడు ఉద్వేగానికి లోనైన నియా ఫ్రాంక్లిన్‌.. ‘స్విమ్‌సూట్‌ రౌండ్‌లో పాల్గొనకుండా తొలిసారి టైటిల్‌ గెలుచుకున్న సంతోషం తనను నిలవనివ్వడం లేదనీ, ఆ రౌండ్‌ లేకపోవడం వల్ల తను మరికాస్త ఎక్కువగా ఆహారాన్ని తీసుకునేందుకు వీలుకలిగిందని’ గలగలా నవ్వుతూ చెప్పారు. 

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఏడాది కూడా దుర్గామాత ఉత్సవాల కోసం ఒక థీమ్‌ సాంగ్‌ రాశారు. మంత్రివర్గ సహచరుడైన అరూప్‌ బిస్వాస్‌ అభ్యర్థన మేరకు, ఆయన నేతృత్వంలో యేటా ఉత్సవాలను నిర్వహిస్తుండే ‘సురుచి సంఘ్‌’ కోసం ‘జ దేవి సర్వభూతేశు’ అంటూ మమత రాసిన ఈ పాటను ప్రముఖ గాయకుడు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అయిన ఇంద్రనీల్‌ సేన్‌ ఆలపించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement