హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ పథకాలను ఔత్సాహిక మహిళలకు చేరవేయడంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (కోవె) శాయశక్తులా కృషి చేస్తోంది. మారుమూల ప్రాంతాల్లోని మహిళలకూ లబ్ధి చేకూర్చేందుకు పలు కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. నైపుణ్య శిక్షణ, ఉత్పత్తుల తయారీ మెళకువలు, మార్కెటింగ్‌లో సాయం, బ్యాంకుల నుంచి రుణం మంజూరులో కీలక పాత్ర పోషిస్తోంది. అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకూ వెన్నంటి ఉంటున్నామని కోవె నేషనల్ ప్రెసిడెంట్ సౌదామి ని ప్రొద్దుటూరి తెలిపారు. సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఆమె మాటల్లోనే..
ఆసరా లేని వారికీ..
మహిళా సాధికారత దిశగా ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేస్తున్నాం. శిక్షణ ఇవ్వడమేగాక తదుపరి స్థాయికి వారు చేరేందుకు చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. 100 మందికిపైగా అంతర్జాతీయంగా ఎదిగారు. ఎటువంటి ఆసరా లేని వారూ కోవె తలుపు తడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వారి చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. కోవె సభ్యులే ఆర్థిక సాయం చేసి అండగా నిలుస్తున్నారు. వ్యాపార రుణం కో సం బ్యాంకుల వద్దకు వెళ్తున్న దరఖాస్తుల్లో 10% మాత్రమే సఫలం అవుతున్నాయి. నిబంధనల పేరుతో తిరస్కరించకుండా మిగిలిన 90% దరఖాస్తుదార్లకూ రుణం అందితేనే మరింత మంది మహిళలు వ్యాపారం చేసేందుకు ముందుకు వస్తారు.
అవకాశాలుగా మల్చుకున్నారు..
కోవిడ్–19 మహమ్మారి వేళ చాలా మంది తమ వ్యాపారాలను మూసివేశారు. అయితే వారికి ధైర్యం చెప్పి దారి చూపించాం. నైపుణ్యాన్ని అవకాశాలుగా మల్చుకుని ఆహారోత్పత్తుల తయారీలోకి చాలా మంది ప్రవేశించారు. పశ్చిమ బెంగాల్‌లో రసోయి క్వీన్ పేరుతో చేసిన ఓ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. వంటల్లో చేయి తిరిగినవారిని ప్రోత్సహించి ఫుడ్ ప్రాసెసింగ్‌లో శిక్షణ ఇచ్చాం. బేకరీ, కర్రీ పాయింట్స్, క్యాటరింగ్, స్నాక్స్ తయారీతోపాటు హోటల్స్‌ను ప్రారంభించారు. ప్రముఖ హోటళ్లలో చెఫ్‌లుగా మారిన వారూ ఉన్నారు. రసోయి క్వీన్ కార్యక్రమాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ నిర్వహించనున్నాం.
శాశ్వతంగా కోవె మార్ట్..
మహమ్మారి విస్తృతి నేపథ్యంలో మహిళా వ్యాపారులకు అండగా నిలిచేందుకు సిడ్బి సాయంతో కోవె మార్ట్ పేరుతో ఆన్‌లైన్ వేదికను కొన్ని నెలలపాటు నిర్వహించాం. ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగాయి. ఈ కార్యక్రమం సక్సెస్ కావడంతో కోవె మార్ట్‌ను శాశ్వత ప్రాతిపదికన త్వరలో ప్రారంభించనున్నాం. కోవె ఫుడ్ పార్క్ ఏర్పాటుకు 50 ఎకరాలు కేటాయించాల్సిందిగా టీఎస్‌ఐఐసీకి దరఖాస్తు చేశాం. ఇక్కడ 60 కంపెనీలు నెలకొల్పాలన్నది ఆలోచన. అలాగే పలు రాష్ట్రాల్లోనూ కోవె పారిశ్రామిక పార్కులను స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ నెల 6–8 తేదీల్లో జరిగే బిజినెస్ వుమెన్ ఎక్స్‌పోలో వినూత్న ఉత్పత్తులు కొలువుదీరనున్నాయి. 200 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు.
కొత్త అవకాశాలను అందుకున్నారు
Published Fri, Mar 5 2021 5:23 AM | Last Updated on Fri, Mar 5 2021 5:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment