Confederation of Women Entrepreneurs
-
అవసరం నుంచి ఆకాంక్ష వరకు
మహిళల పురోగతికి ఆకాశమే హద్దు. నిజమే... మరి! మహిళ పురోగతి ఎక్కడ మొదలవుతుంది? ఒక ఆకాంక్ష నుంచి మొదలు కావచ్చు... అలాగే... ఒక అవసరం నుంచి కూడా మొదలు కావచ్చు. అవును... అవసరమే ఆమెను జాతీయస్థాయిలో నిలిపింది. ఆమె... మహిళలకు చేయూతనిచ్చే స్థానంలో నిలిచింది. ఆలూరి లలిత మహిళాపారిశ్రామికవేత్త. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ చేశారు. పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో వ్యాపార కుటుంబంలో అడుగుపెట్టారు. ఉమ్మడి కుటుంబం కూడా కావడంతో తన మీద పెద్ద బాధ్యతలేవీ లేవు. నాలుగేళ్లు అలా గడిచిపోయాయి. తమ కంపెనీ ఒడిదొడుకుల్లో ఉందని, భాగస్వాములు దూరం జరిగారని తెలిసిన తర్వాత భర్తకు తోడుగా బాధ్యత పంచుకోవడానికి భుజాన్నివ్వాల్సి వచ్చింది. అలా మొదలైన పారిశ్రామిక ప్రస్థానం ఆమెను విజేతగా నిలపడంతోపాటు జాతీయ స్థాయిలో సంఘటితమైన మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య (కోవె)కు అధ్యక్షురాలిని చేసింది. ఆ వివరాలను సాక్షితో పంచుకున్నారు లలిత. ‘అవసరం’తో పోరాటం ‘‘గృహిణిగా ఉన్న నేను పరిశ్రమ నిర్వహణలోకి అడుగుపెట్టింది 1998లో. అప్పటికే మనుగడ సమస్య మాది. తీరా అడుగు పెట్టిన తర్వాత తెలిసింది బ్యాంకు వాళ్లు మా పరిశ్రమను ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్) కేటగిరీలో లిస్ట్ చేశారని. మూడు క్వార్టర్లు బకాయి పడి ఉన్నాం. మరో క్వార్టర్ సమయం కావాలని అడిగాను. మొదట్లో ససేమిరా అన్నారు. ‘మీరు హ్యాండోవర్ చేసుకుని మీ డబ్బు ఎలా జమ చేసుకుంటార’ని అడిగాను. మెషినరీ అమ్మేస్తామన్నారు. ఈ మెషీన్లతో పని చేయడానికి మా వారు సింగపూర్‌లో శిక్షణ తీసుకుని వచ్చారు, హైదరాబాద్‌లో ఈ టెక్నాలజీ చాలామందికి తెలియదు. మీరు స్క్రాప్ కింద అమ్మాల్సిందే, రెండు లక్షలు కూడా రావు. మాకు టైమిస్తే మీ లోన్ మొత్తం తీర్చేస్తామని చెప్పాను. ఆ తర్వాత అక్కచెల్లెళ్లు, అన్నదమ్ముల సహాయంతో పది లక్షలు ఎదురు పెట్టి కొత్త టెక్నాలజీతో పరిశ్రమను నడిపించాం. రెండేళ్లపాటు రోజుకు 18 గంటలు పనిచేశాం. మొత్తానికి గట్టెక్కాం. 2005లో పరిశ్రమ విస్తరించాలనే ఆలోచనతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ నెట్వర్క్ – జేఎన్టీయూ తో కలిసి నిర్వహించిన ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో శిక్షణ తీసుకున్నాను. అప్పటి నుంచి ఈ సంస్థలో భాగస్వామినయ్యాను. లైఫ్ మెంబర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్, జాతీయ స్థాయి కమిటీలో జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టాను. ఈ రాష్ట్రాలు ముందున్నాయి! మహిళా పారిశ్రామిక వేత్తల విషయంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, యూపీ, ఢిల్లీ రాష్ట్రాలు ముందువరుసలో ఉన్నాయి. వెస్ట్‌బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్రతోపాటు కొన్ని రాష్ట్రాలు చేయి పట్టి నడిపించాల్సిన దశలోనే ఉన్నాయి. మా సంస్థలో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్‌లో ఎక్కువ మంది బాగా చదువుకున్న వాళ్లే. ఐఐటీ, బిట్స్, ఐఐఎమ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్లు ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. మా చదువు, పరిశ్రమ నిర్వహణలో మేము నేర్చుకున్న మెళకువలతో కొత్తగా పరిశ్రమల రంగంలోకి వచ్చిన వాళ్లకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాం. ఈశాన్య రాష్ట్రాల మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నాం. అలాగే కాలేజ్‌లకెళ్లి విద్యార్థులకు వర్క్‌షాపులు నిర్వహించడం, నగరాల్లోని అల్పాదాయ వర్గాలు నివసించే కాలనీల్లోనూ, గ్రామాల్లోనూ మహిళలకు శిక్షణతోపాటు ఇన్క్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. మహిళలు మారారు! మహిళల్లో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు మహిళలు ఉద్యోగం చేసుకుంటే చాలన్నట్లు, భర్త సంపాదనకు తోడు మరికొంత అన్నట్లు ఉండేవారు. ఇప్పుడు ఆ ధోరణి పూర్తిగా మారిపోయింది. తన ఐడెంటిటీని తామే రాసుకోవాలనే ఆకాంక్ష పెరిగింది. అలాగే విజయవంతం అవుతున్నారు. ఉద్యోగం చేసి పిల్లల కారణంగా కెరీర్లో విరామం వచ్చిన మహిళలకు (35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారికి) వారి సామర్థ్యం, ఆసక్తిని బట్టి ‘రీ ఇగ్నైట్’ ప్రోగ్రామ్ కింద సపోర్ట్ చేస్తున్నాం. పదివేల మంది విద్యార్థులను, 30 వేల మంది గ్రామీణ మహిళలను సాధికారత దిశలో నడిపించాలనేది ప్రస్తుతం మా కోవె ముందున్న లక్ష్యం’’. ఇలా చేయండి ఒక మహిళ వ్యాపారం కానీ పరిశ్రమ కానీ పెట్టినప్పుడు అది నిలదొక్కుకుని లాభాల బాట పట్టే వరకు దాదాపుగా మూడు నాలుగేళ్లు జీవితం మనది కాదు మన పరిశ్రమది అనుకుని శ్రమించాలి. మార్కెట్‌ని విశ్లేషించుకోవాలి. రెవెన్యూ మీద అవగాహన ఉండాలి. పెట్టుబడి, రాబడి మాత్రమే కాదు. రాబడికి ఆదాయానికి మధ్య తేడా తెలుసుకోవాలి. ► కౌంటర్లోకి వచ్చిన ప్రతిరూపాయి మనది కాదు. ఉద్యోగుల వేతనాలు, అద్దె, కరెంటు, పెట్టుబడి కోసం మనం ఇంటి నుంచి పెట్టిన డబ్బుకు కొంత జమ వేసుకోవడం, బ్యాంకు లేదా ఇతర అప్పులు అన్నీ పోగా మిగిలినదే ఆదాయం. అదే మనం సంపాదించినది, మన కోసం ఖర్చు చేసుకోగలిగినది. ► పరిశ్రమ కోసం ఒక మూలనిధి ఏర్పాటు చేసి ఏటా పదిశాతం లాభాలను మూలనిధిలో జమ చేయాలి. యంత్రాల రిపేరు వంటి అనుకోని ఖర్చులకు, పరిశ్రమ విస్తరణకు ఆ నిధి పనికొస్తుంది. కోవిడ్ దెబ్బకు తట్టుకుని నిలబడినవన్నీ మూలనిధి ఉన్న పరిశ్రమలే. ► మహిళలు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే... పరిశ్రమ నిర్వహణ బరువైనప్పుడు అది లాభాల బాట పట్టడం కష్టం అని నిర్ధారించుకున్నప్పుడు దాని నుంచి వెంటనే మరొక దానికి మారిపోవాలి. ► మొదట్లో కష్టపడినన్ని గంటలు పదేళ్లు, పాతికేళ్లు కష్టపడలేరు. కాబట్టి ఇంట్లోనూ, పరిశ్రమలోనూ సపోర్టు సిస్టమ్‌ని అభివృద్ధి చేసుకోవాలి. ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్ -
Jyotsna Cheruvu: స్థిరత్వమే సక్సెస్ సూత్రం
హైదరాబాద్ నగరం... దుర్గం చెరువు వంతెనకు సస్పెండెడ్ రోప్ ప్లాట్‌ఫామ్. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో ఓ వలయాకారపు షాఫ్ట్. బహుళ అంతస్తుల నిర్మాణంలో పాసెంజర్ అండ్ మెటీరియల్ హాయిస్ట్. ఇవన్నీ సాంకేతికరంగం రూపొందించుకున్న అద్భుతమైన ఆవిష్కరణలు. వీటి రూపకల్పన... తయారీలో కీలకమైన మహిళ... జ్యోత్స్న చెరువు. ‘ఇండిపెండెంట్‌గా నిలబడాలంటే ఇండిపెండెంట్‌గా ఆలోచించాలి, ఇండిపెండెంట్‌గా నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మీరు పదిమంది నడిచే దారిలో పదకొండవ వ్యక్తిగా మిగలకుండా మీదైన కొత్త çపథాన్ని నిర్మించుకోగలుగుతా’ రంటూ మహిళలకు సందేశమిస్తుంటారు... సీఎమ్ఏసీ, మెకనైజేషన్ అండ్ ఆటోమేషన్ ఇన్ కన్స్ట్రక్షన్ కంపెనీ డైరెక్టర్ జ్యోత్స్న చెరువు. ‘ప్రౌడ్ టు మేక్ ఇన్ ఇండియా, ఎక్స్పోర్ట్ దెమ్ యాజ్ మేడ్ ఇన్ ఇండియా’ నినాదంతో పరిశ్రమను విజయవంతంగా నిర్వహిస్తున్న జ్యోత్స్న చెరువు తన వైవిధ్యభరితమైన పారిశ్రామిక ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు. ► సీబీఐటీ స్టూడెంట్‌ని! ‘‘నేను పుట్టింది నెల్లూరు జిల్లా బిట్రగుంటలో. తాత అప్పుడు అక్కడ రైల్వే ఉద్యోగి. అలా అది మా అమ్మమ్మగారి ఊరైంది. నాన్న బ్యాంకు ఉద్యోగరీత్యా మేము పెరిగిందీ, చదువు, కెరీర్ అంతా హైదరాబాద్‌లోనే. మా కాలేజ్ రోజుల్లో అమ్మాయిలు సివిల్ ఇంజనీరింగ్‌ని పెద్దగా తీసుకునేవాళ్లు కాదు. నాకు సీబీఐటీలో సివిల్ ఇంజనీరింగ్ సీటు వచ్చింది. చేరిన తర్వాత సబ్జెక్ట్‌లో ఉన్న అందం తెలిసి వచ్చింది. ఆనందంగా ఆస్వాదిస్తూ కోర్సు పూర్తి చేశాను. ఆ తర్వాత ఉస్మానియాలో ఎంబీఏ చేశాను. మా వారు మెకానికల్ ఇంజనీర్. పెళ్లి తర్వాత కొంతకాలం ఇద్దరమూ ఉద్యోగం చేశాం. మా వారి ఉద్యోగరీత్యా పూనాకి వెళ్లాం. అప్పుడు పిల్లలు చిన్నవాళ్లు. నేనక్కడ ఉద్యోగంలో చేరలేదు, కానీ హోమ్ బ్యూటిఫికేషన్ వంటి సర్వీస్ ప్రాజెక్టులు మొదలుపెట్టాను. మార్కెట్ అవగాహన ఉంది కాబట్టి నిర్మాణ రంగం మీద దృష్టి పెట్టమని ఓ రిటైర్డ్ పర్సన్ చెప్పిన మాట నన్ను పారిశ్రామికవేత్తగా నిలిపాయి. ► నిర్మాణరంగంలో సాంకేతిక వేగం! పిల్లలు పెద్దవుతున్నారు, హైదరాబాద్‌కి వెళ్లిపోదామనే ఆలోచన వచ్చిన నాటికి హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణరంగం కొత్త రూపు సంతరించుకుంటోంది. 25–30 అంతస్తుల భవనాల నిర్మాణం మొదలైన రోజులవి. అది నాకు బాగా కలిసి వచ్చింది. నిర్మాణరంగంలో అవసరమైన కొత్త టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్ తయారీని ప్రారంభించాం. ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ని అప్పటివరకు చైనా, యూరప్ నుంచి దిగుమతి చేసుకుంటూ వచ్చిన నిర్మాణసంస్థలకు అవన్నీ ఇండియాలోనే దొరకడం మంచి సౌలభ్యం కదా. అలా 2006లో మొదలైన మా కంపెనీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మూడు వందలకు పైగా సంస్థలకు సేవలందిస్తోంది. వ్యాపారం అంటే... సమాజం లోని అవసరాన్ని గుర్తించి ఆ అవసరాన్ని తీర్చడం, ఒక సమస్యకు పరిష్కారం చూపించడం. అప్పుడే బిజినెస్ విజయవంతమవుతుంది. మా కంపెనీ సిద్ధాంతం నాలుగు ‘ఎస్’లు... స్పీడ్, సేఫ్టీ, సేవింగ్స్, స్ట్రెంగ్త్. పని వేగంగా జరగాలి, పనిలో పాల్గొనే కార్మికులకు రక్షణ కల్పించాలి, ప్రాజెక్టు వ్యయం తగ్గాలి, పని చేసే కార్మికుని శక్తిని ఇనుమడింప చేయాలి. మా క్లయింట్ అవసరానికి తగినట్లు కస్టమైజ్డ్ ఎక్విప్మెంట్ను డిజైన్ చేయడం, తయారు చేయడం, ఇన్స్టాల్ చేయడం, యాన్యుయల్ మెయింటెనెన్స్ సర్వీస్ ఇవ్వడం, ఆ కంపెనీ ప్రాజెక్టు మరో చోటకు మారినప్పుడు ఎక్విప్మెంట్ని ఆ ప్రదేశానికి తీసుకువెళ్లి అమర్చడం... ఇలా ఉంటుంది మా పని. ఇప్పుడు దేశం ఎల్లలు దాటి విదేశాలకు కూడా విస్తరించాం. నా రంగంలో నేను లక్ష్యంగా పెట్టుకున్న శిఖరానికి చేరాననే చెప్పాలి. నా వంతు బాధ్యతగా మహిళా సమాజానికి, యువతకు కెరీర్ ప్లానింగ్ గురించి చెబుతున్నాను. కోవె (కన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్) తెలంగాణ అధ్యక్షురాలిగా వేలాది మహిళలకు, యువతకు ఎంటర్‌ప్రెన్యూరల్ మైండ్‌సెట్ క్లాసులు చెప్తున్నాను. కంపెనీ నిర్వహణలో ఉద్యోగులను కలుపుకుపోవడం చాలా అవసరం. పని వరకే చేయించుకుని మిగిలిన విషయాల్లో వాళ్లను డార్క్‌లో ఉంచరాదు. కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలను వారితో చర్చించాలి. ఈ కంపెనీతో కొనసాగితే కెరీర్లో పైకి ఎదగగలమనే భరోసా కలిగితేనే ఉద్యోగులు మనతో కొనసాగుతారు. ఇలాంటి అనేక విషయాలను చెబుతుంటాను. ఈ జర్నీ నాకు సంతోషంగా ఉంది. ఏటా ఈ ఏడాది ఎంతమంది మహిళలకు దిశానిర్దేశం చేశానని లెక్కచూసుకున్నప్పుడు కనిపించే పెద్ద సంఖ్య నాకు ఆత్మసంతృప్తి కలిగించే విషయం ’’ అని వివరించారు జ్యోత్స్న చెరువు. లీడర్‌గా ఎదిగేది కొందరే! మా దగ్గరకు ట్రైనింగ్‌కు వచ్చిన మహిళలకు నేను చెప్పే తొలిమాట ‘మీ స్ట్రెంగ్త్ ఏమిటో మీరు తెలుసుకోండి’ అని. వాళ్లకు ఏం వచ్చో తెలిసిన తర్వాత వాళ్లకు ఎటువంటి కెరీర్ సౌకర్యంగా ఉంటుందో సూచిస్తాను. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలంటే... మొదటగా ఉండాల్సింది స్థిరత్వం. చిన్న ఉదాహరణ చెబుతాను... ఒక ఇస్త్రీ షాపు వ్యక్తి రోజూ కచ్చితంగా షాపు తెరవకపోతే మనం దుస్తులు ఇవ్వం కదా! రోజూ ఠంచన్‌గా పని చేసే వ్యక్తికి మాత్రమే ఇస్తాం. ఇంటి ముందుకు వచ్చే వాళ్ల దగ్గర కూరగాయలు కొనాలన్నా అంతే. మన సర్వీస్ అందుకునే క్లయింట్ ప్రత్యామ్నాయాన్ని వెతుక్కునే పరిస్థితిని కల్పించకూడదు. ఎందరు వచ్చినా, ఎవరూ రాకపోయినా సరే వర్క్‌ప్లేస్‌ని మూతవేయరాదు. నేను నా రంగంలో సంపాదించుకున్న నమ్మకం అదే. ఏ సమయంలో ఫోన్ వచ్చినా సరే... ఎవరో ఒకరు హాజరవుతారనే భరోసా కల్పించడంలో విజయవంతం అయ్యాం. మా దగ్గరకు కోర్సులో చేరిన పాతిక మందిలో చివరకు ఆ కోర్సును ఉపయోగపెట్టుకునేవాళ్లు పదికి మించరు. కోర్సు సమయంలో ‘ఇంటికి బంధువులు వచ్చార’ని క్లాసు మానేసే వాళ్లు ఎంటర్ ప్రెన్యూర్‌గా కూడా కొనసాగలేరు. బిజినెస్ రంగంలో ఉన్న ఇద్దరు మగవాళ్లు కలిస్తే తమ వ్యాపారం గురించి, ఇతరుల వ్యాపారం గురించి, విస్తరణకు ఉన్న అవకాశాల గురించి మాట్లాడుకుంటారు. అదే ఇద్దరు మహిళలు రిలేషన్ షిప్ మీద మాట్లాడినంతగా తమ ప్రొఫెషన్ గురించి చర్చించరు. ప్రొఫెషన్ గురించి మాట్లాడగలిగిన మహిళలే లీడర్లుగా ఎదుగుతారు, ఫీల్డ్‌లో విజయవంతంగా నిలబడగలుగుతారు. – జ్యోత్స్న చెరువు, డైరెక్టర్, సిఎమ్ఏసీ, ప్రెసిడెంట్, కోవె తెలంగాణ – వాకా మంజులారెడ్డి ఫొటోలు : మోహనాచారి -
కొత్త అవకాశాలను అందుకున్నారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ పథకాలను ఔత్సాహిక మహిళలకు చేరవేయడంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (కోవె) శాయశక్తులా కృషి చేస్తోంది. మారుమూల ప్రాంతాల్లోని మహిళలకూ లబ్ధి చేకూర్చేందుకు పలు కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. నైపుణ్య శిక్షణ, ఉత్పత్తుల తయారీ మెళకువలు, మార్కెటింగ్‌లో సాయం, బ్యాంకుల నుంచి రుణం మంజూరులో కీలక పాత్ర పోషిస్తోంది. అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకూ వెన్నంటి ఉంటున్నామని కోవె నేషనల్ ప్రెసిడెంట్ సౌదామి ని ప్రొద్దుటూరి తెలిపారు. సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఆమె మాటల్లోనే.. ఆసరా లేని వారికీ.. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేస్తున్నాం. శిక్షణ ఇవ్వడమేగాక తదుపరి స్థాయికి వారు చేరేందుకు చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. 100 మందికిపైగా అంతర్జాతీయంగా ఎదిగారు. ఎటువంటి ఆసరా లేని వారూ కోవె తలుపు తడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వారి చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. కోవె సభ్యులే ఆర్థిక సాయం చేసి అండగా నిలుస్తున్నారు. వ్యాపార రుణం కో సం బ్యాంకుల వద్దకు వెళ్తున్న దరఖాస్తుల్లో 10% మాత్రమే సఫలం అవుతున్నాయి. నిబంధనల పేరుతో తిరస్కరించకుండా మిగిలిన 90% దరఖాస్తుదార్లకూ రుణం అందితేనే మరింత మంది మహిళలు వ్యాపారం చేసేందుకు ముందుకు వస్తారు. అవకాశాలుగా మల్చుకున్నారు.. కోవిడ్–19 మహమ్మారి వేళ చాలా మంది తమ వ్యాపారాలను మూసివేశారు. అయితే వారికి ధైర్యం చెప్పి దారి చూపించాం. నైపుణ్యాన్ని అవకాశాలుగా మల్చుకుని ఆహారోత్పత్తుల తయారీలోకి చాలా మంది ప్రవేశించారు. పశ్చిమ బెంగాల్లో రసోయి క్వీన్ పేరుతో చేసిన ఓ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. వంటల్లో చేయి తిరిగినవారిని ప్రోత్సహించి ఫుడ్ ప్రాసెసింగ్‌లో శిక్షణ ఇచ్చాం. బేకరీ, కర్రీ పాయింట్స్, క్యాటరింగ్, స్నాక్స్ తయారీతోపాటు హోటల్స్‌ను ప్రారంభించారు. ప్రముఖ హోటళ్లలో చెఫ్‌లుగా మారిన వారూ ఉన్నారు. రసోయి క్వీన్ కార్యక్రమాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ నిర్వహించనున్నాం. శాశ్వతంగా కోవె మార్ట్.. మహమ్మారి విస్తృతి నేపథ్యంలో మహిళా వ్యాపారులకు అండగా నిలిచేందుకు సిడ్బి సాయంతో కోవె మార్ట్ పేరుతో ఆన్లైన్ వేదికను కొన్ని నెలలపాటు నిర్వహించాం. ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగాయి. ఈ కార్యక్రమం సక్సెస్ కావడంతో కోవె మార్ట్‌ను శాశ్వత ప్రాతిపదికన త్వరలో ప్రారంభించనున్నాం. కోవె ఫుడ్ పార్క్ ఏర్పాటుకు 50 ఎకరాలు కేటాయించాల్సిందిగా టీఎస్ఐఐసీకి దరఖాస్తు చేశాం. ఇక్కడ 60 కంపెనీలు నెలకొల్పాలన్నది ఆలోచన. అలాగే పలు రాష్ట్రాల్లోనూ కోవె పారిశ్రామిక పార్కులను స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ నెల 6–8 తేదీల్లో జరిగే బిజినెస్ వుమెన్ ఎక్స్‌పోలో వినూత్న ఉత్పత్తులు కొలువుదీరనున్నాయి. 200 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. -
పెట్టుబడులతో మహిళా పారిశ్రామికవేత్తలు రెడీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త రాష్ట్రాలతోపాటు అంతర్జాతీయంగా వ్యాపారావకాశాలను అందుకోవడానికి మహిళా పారిశ్రామికవేత్తలు సిద్ధమయ్యారు. హైదరాబాద్ సమీపంలోని జడ్చర్ల పారిశ్రామికవాడలో 10 ఎకరాల్లో ప్లాస్టిక్, మెటల్ షీట్ల తయారీ యూనిట్లు ఏర్పాటుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ వుమన్ ఎంట్రప్రెన్యూర్స్‌కు(కోవె) చెందిన 25 మంది సభ్యులు రెడీ అయ్యారు. ఒక్కో యూనిట్‌కు స్థలం, మెషినరీకి కలిపి తొలుత రూ.25 లక్షలు వెచ్చించనున్నారు. ఒక్కో ఎకరా ఎంత ధరకు ఇచ్చేది ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. చేతిలోకి స్థలం రాగానే 6 నెలల్లో యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని కోవె ప్రెసిడెంట్ సౌదామిని తెలిపారు. సోమవారమిక్కడ జరిగిన కోవె అవార్డుల కార్యక్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మొత్తం 26 కంపెనీలు కోవె అవార్డు అందుకున్నాయి. ఆటోమోటివ్ పార్క్‌లో..: తూప్రాన్ మండలం కాలకల్ వద్ద ఉన్న కోవె ఇంజనీరింగ్, ఆటోమోటివ్ పార్కులో త్వరలోనే 10 కంపెనీలు రానున్నాయని సౌదామిని వెల్లడించారు. ఇప్పటికే 4 కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించాయని, పార్కులో మొత్తం 23 కంపెనీలు వస్తాయన్నారు. ఒక్కో యూనిట్ కనీస పెట్టుబడి రూ.3 కోట్లకు పైగా ఉంటుందని పేర్కొన్నారు. తూప్రాన్ మండలం కూచారం వద్ద కోవె ఫుడ్ పార్కు ఏర్పాటవుతోందని, 12 ఎకరాల్లో రానున్న ఫుడ్ పార్క్‌లో యూనిట్ల ఏర్పాటుకు 30 మంది సభ్యులు ముందుకొచ్చారని వివరించారు. కళాశాలల స్థాయి నుంచే..: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు అపార అవకాశాలు ఉన్నాయని కోవె సీమాంధ్ర శాఖ చైర్పర్సన్, హోలీమేరీ, నలంద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సెక్రటరీ ఎ.విజయశారద రెడ్డి తెలిపారు. వ్యాపార రంగంలో అడుగిడేలా కళాశాలల స్థాయి నుంచే విద్యార్థులను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఇందుకోసం కళాశాలల్లో ప్రత్యేకంగా ఎంట్రప్రెన్యూర్ డెవలప్మెంట్(ఈడీపీ) కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా మలిచే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేస్తున్నామని కోవె కర్నాటక శాఖ చైర్పర్సన్ రూపారాణి తెలిపారు. అన్నా యూనివర్సిటీతో చేతులు కలిపామని కోవె తమిళనాడు శాఖ సెక్రటరీ కళ్యాణి చెప్పారు. యూనివర్సిటీలో 3 వేల మంది విద్యార్థులున్నారని, ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నామని వివరించారు. కోవె వుమెన్స్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఎంట్రప్రెన్యూర్షిప్-2014 హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో అక్టోబరు 18-20 తేదీల్లో జరగనుంది. మహిళా పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులు, సేవలను వివిధ దేశాలకు విస్తరించేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని కోవె ప్రతినిధి జ్యోత్స చెరువు తెలిపారు.