జార్జి క్లూనీ అమెరికన్ నటుడు. నిర్మాత. బిజినెస్‌మ్యాన్. మూడుసార్లు గోల్డెన్‌గ్లోబ్ అవార్డు, రెండుసార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ప్రతిభావంతుడు. ఇవన్నీ అలా ఉంచితే.. వయసులో పెద్దవాడు. 57 ఏళ్లు. యాభై ఏడేళ్లంటే పెద్ద వయసేం కాదు కానీ, 40 ఏళ్ల వయసుతో పోల్చి చూస్తే పెద్దవాడే. ఆయన భార్య అమల్ క్లూనీ వయసు నలభై ఏళ్లు. జార్జిలా ఆమె సెలబ్రిటీ కాదు. మానవహక్కుల కార్యకర్త. లాయర్. నాలుగేళ్ల క్రితమే వీళ్లకు పెళ్లయింది. జార్జిక్లూనీ మొదటి భార్య తాలియా బల్సామ్ వయసు జార్జి కన్నా రెండేళ్లు ఎక్కువ. 1989లో పెళ్లి చేసుకున్నారు. 1993లో విడిపోయారు. అమల్ క్లూనీకి ఇది మొదటి పెళ్లే. జార్జికీ, అమల్‌కి మధ్య పదిహేడేళ్ల వయసు దూరం ఉన్నా, ఇద్దరి మనసుల మధ్య మిల్లీమీటరు దూరం కూడా లేదు. మొదటే అమల్ తనకు దొరికితే బాగుండుని చాలాసార్లు అనుకున్నాడు క్లూనీ. ఆయనలోని ఈ ఫీలింగ్ తరచు బయటపడుతుంటుంది. రెండు రోజుల క్రి తం మళ్లీ బయటపడింది. ‘వెరైటీ’ పత్రిక ‘పవర్ ఆఫ్ ఉమెన్’ లాస్ ఏంజెలిస్ ఈవెంట్‌లో జార్జి క్లూనీ తనని తను పరిచయం చేసుకున్న తీరు అక్కడి వచ్చిన మహిళల్ని ముగ్ధుల్ని చేసి, చెంపకు చెయ్యి ఆన్చుకునేలా చేసింది. ‘‘హాయ్.. అయామ్ జార్జ్. అయామ్ అమల్ క్లూనీస్ హస్బెండ్’ అని స్టేజి మీద జార్జి క్లూని తనని తను పరిచయం చేసుకోగానే చప్పట్లే చప్పట్లు. అంత పెద్దాయన తన భార్యను తనకన్నా ‘పెద్ద’ మనిషినిగా పరిచయం చెయ్యడం ముచ్చటైన సంగతే కదా.
ఇంటిపనుల్లో తల్లికి సహాయం చేసే పిల్లలు, భార్యకు చేదోడుగా ఉండే జీవిత భాగస్వామి దాదాపుగా కనిపించరు. పాపం ఆమె ఒక్కటే ఇంటిల్లపాదికీ పనులు చేసి పెడుతూ రోజంతా సతమతం అవుతుంటుంది. ఎవరు చెబితే వింటారు ఈ పిల్లలు, భర్తలు?! అయినా ఒకళ్లు చెప్పే విషయమా ఇది! కళ్ల ముందు సాటి మనిషి రెక్కలు ముక్కలవుతుంటే చూస్తూ ఎలా ఉండగలం? ‘మన మనిషే కదా’ అనే కదా! ఇక ఇప్పుడైతే కళ్లముందు మనకు స్మార్ట్‌ఫోన్ తప్ప ఏమీ ఉండడం లేదు. సాధ్యం కాక కానీ, బాత్రూమ్‌కి వెళ్లడం, స్నానం చెయ్యడం కూడా సెల్‌ఫోన్‌లోనే చేసేలా ఉన్నారు ఈ జనరేషన్ పిల్లలు, వారి తండ్రులు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు, శోధన సైట్లు వచ్చాక మనుషులు మరీ ఎంతగా మనుషులు కాకుండా పోతున్నారో సునీల్ అగర్వాల్, అజిత్ నైనన్ అనే కార్టూనిస్టులు జంటగా ప్రతిరోజూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో కార్టూన్స్ వేస్తుంటారు. సోమవారం ఒక కార్టూన్ వచ్చింది. మదర్స్‌డే పై వచ్చిన కార్టూన్ అది. అయితే 365 డేస్‌కీ సరిపోయేలా ఉంది. ఓ తల్లి.. తనకున్న రెండుచేతుల్తోనే ఇంటిపనులన్నీ చేస్తుంటుంది. ఆమె ప్రయాసను అర్థం చేసుకున్న పెంపుడు కుక్క ఆమె వెంటే ఉండి, నోటితో క్లీనింగ్ క్లాత్ పట్టుకుని ఆమెకు అందించడం కోసం సిద్ధంగా ఉంటుంది. ఆ ఇంట్లోని తండ్రీ కొడుకులు కూడా ఆమెకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటారు! ఇద్దరూ బీన్ బ్యాగ్‌లో కూర్చొని ‘ఇంటి పనుల్లో సహాయం చెయ్యడం ఎలా?’ అని ల్యాప్‌టాప్‌లో వెదుకుతుంటారు! సామాజిక, కుటుంబ ధోరణుల్ని సుతిమెత్తగా విమర్శించిన ఈ కార్టూన్‌ను చూస్తే వచ్చే నవ్వు కన్నా, వెంటనే లేచి ఏదైనా హెల్ప్ చెయ్యాలన్న ప్రేరణే ఎక్కవగా కలుగుతుంది.
గంగానది సంరక్షణకు ఉద్యమించి, ఈ ఏడాది జూన్ 22 నుంచి ఆమరణ దీక్ష చేస్తూ 112 వ రోజైన అక్టోబర్ 11న (గురువారం) మరణించిన 86 ఏళ్ల కాన్పూర్ ఐ.ఐ.టి. ప్రొఫెసర్ జి.డి. అగర్వాల్ (స్వామి జ్ఞానస్వరూప్ సనంద్) దీక్షాస్ఫూర్తిని.. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రీపాల్ అందుకున్నారు. గంగానదిలో అక్రమ తవ్వకాలకు, జలవిద్యుచ్ఛక్తి ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా జ్ఞానస్వరూప్ నిరశనకు కూర్చుంటే.. బచేంద్రీపాల్ 40 మంది వలంటీర్లతో కలిసి ‘మిషన్ గంగ’ పేరిట గంగానది ప్రక్షాⶠన కోసం ముప్పై రోజులపాటు గంగానది ఉపరితల జలాలపై పడవల్లో సాహసయాత్ర (రాఫ్టింగ్ ఎక్స్‌పెడిషన్) నిర్వహించబోతున్నారు. జలశుద్ధి, నీటి వృథా నివారణలపై భక్తులకు అవగాహన కల్పించడం కోసం జరుగుతున్న ఈ యాత్ర.. దేశవ్యాప్తంగా గంగానది ప్రవహించే ఎనిమిది ప్రధాన నగరాలను కలుపుకుంటూ సాగుతుంది. ‘‘మొత్తం 1500 కి.మీ.ల రాఫ్టింగ్ చేయబోతున్నాం. ఆగిన ప్రతి నగరంలోనూ మూడు రోజులు ఉంటాం. అక్కడి యువతీయువకులను, పాఠశాల విద్యార్థులను గంగానదిని కాలుష్యం నుండి కాపాడుకోవలసిన అవసరంపై చైతన్యపరిచి ముందుకు సాగుతాం’’ అని బచేంద్రీపాల్ వివరించారు. 64 ఏళ్ల పాల్ 1954 మే 24న ‘బంపా’లో (ప్రస్తుత ఉత్తరాంచల్) జన్మించారు. తన ముప్పవయ యేట 1984లో సరిగ్గా తన పుట్టిన రోజుకు ముందు రోజు (మే 23) మధ్యాహ్నం 1.7 నిముషాలకు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు.
Comments
Please login to add a commentAdd a comment