మహిళల్ని ప్రత్యక్ష యుద్ధ విధుల్లోకి తీసుకునేందుకు భారత సైన్యం పూర్తి సన్నద్ధంగా లేదని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. శుక్రవారం పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ ‘పాసింగ్ అవుట్ పరేడ్’లో పాల్గొన్న రావత్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. సైన్యం మాత్రమే సిద్ధంగా లేకపోవడం కాదు, సైన్యంలో చేరేందుకూ మహిళలు సిద్ధం కావలసిన అవసరం ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే కొన్ని దేశాలలో మహిళల్ని యుద్ధ విధుల్లోకి తీసుకున్నారు కదా అన్న ప్రశ్నకు.. ‘‘వారితో పోల్చడం సరికాదు. మహిళలకు ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించాలి. సైన్యంలోకి వచ్చే మహిళలు కూడా ధీమాగా ఉండాలి. అవి రెండూ జరిగినప్పుడు మన దగ్గర కూడా యుద్ధంలోకి దుమికే మహిళల్ని చూడవచ్చు’’ అని రావత్ అన్నారు. భారత ఆర్మీలో ప్రస్తుతం యుద్ధేతర ఉద్యోగాలకు మాత్రమే మహిళలకు ప్రవేశం ఉంది.
ఫోర్బ్స్ మ్యాగజీన్ తాజాగా విడుదల చేసిన ‘యు.ఎస్.లోని 50 మంది అగ్రస్థాయి మహిళా టెక్ మొఘల్స్’ జాబితాలో భారతీయ సంతతికి చెందిన నలుగురు మహిళలకు చోటు దక్కింది. సిస్కో కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పద్మశ్రీ వారియర్, యాప్ బేస్డ్ క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీ ‘ఉబర్’కి సీనియర్ డైరెక్టర్‌గా ఉన్న కోమల్ మంగ్తానీ, డేటా స్ట్రీమింగ్ కంపెనీ ‘కాన్‌ఫ్లూయెంట్’ సహవ్యవస్థాపకురాలు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ నేహా నర్ఖేడ్, ఐడెంటిటీ మేనేజ్‌మెంట్ కంపెనీ ‘డ్రాబ్రిడ్జ్’ సీఈవో కామాక్షీ శివరామకృష్ణన్ ఈ జాబితాలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment