పదహారేళ్ల వయసులో తనపై తన బాయ్‌ఫ్రెండ్ అత్యాచారం చేసిన సంగతిని ప్రముఖ మోడల్, టీవీ హోస్ట్ పద్మాలక్ష్మి.. ‘వై ఐ డిడ్ నాట్ రిపోర్ట్’ (అప్పుడే ఎందుకు చెప్పలేదంటే) అనే ఒక కొత్త మహిళా ఉద్యమానికి మద్దతుగా బహిర్గతం చేశారు. యు.ఎస్. సుప్రీంకోర్టు ఆటార్నీగా నామినేట్ అయిన జస్టిస్ బ్రెట్ ఎం.కవానా తనను లైంగికంగా వేధించాడని ఒక మహిళ చేసిన ఫిర్యాదుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ‘అప్పుడే ఎందుకు చెప్పులేదు?’ అని అనడంతో మొదలైన ఈ ‘వై ఐ డిడ్ నాట్ రిపోర్ట్’ ఉద్యమానికి.. ఒక్కో మహిళా ముందుకొచ్చి ‘అప్పుడే ఎందుకు చెప్పలేదంటే..’ అంటూ తన జీవితంలోని లైంగిక అకృత్యపు చేదు అనుభవాన్ని పది మందికీ చెప్తున్న క్రమంలో పద్మాలక్ష్మి బయటికి వచ్చి, తనపై టీనేజ్‌లో జరిగిన అత్యాచారాన్ని లోకానికి వెల్లడిస్తూ... ‘‘బాధితురాలు తన బాధను పైకి చెప్పుకోడానికి కాలపరిమితి ఉంటుందా!’’ అని ప్రశ్నించారు.
బెంగళూరులోని మాన్యత టెక్ పార్క్‌లో ‘టైమ్స్ క్రియేషన్స్’ సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 3న జరుగనున్న ‘ప్యూరిటీ అండ్ ఎక్స్‌ప్రెషన్’ సంగీత కార్యక్రమంలో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ప్రదర్శన ఉండడంపై స్థానిక అతివాద సంస్థలు కొన్ని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో గత ఏడాది డిసెంబర్ 31 నాటి సన్నీ ప్రదర్శనలాగే ఇదీ రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అసభ్యతకు ప్రతీక అయిన సన్నీలియోన్‌ను ఈ కార్యక్రమానికి అనుమతించేది లేదని ‘కర్ణాటక రక్షణ వేదిక యువ సేన’ అంటుండగా, నిర్వాహకులు మాత్రం.. లియోన్ ప్రదర్శన వల్ల కన్నడ సంస్కృతికి జరిగే చేటు ఏమీ ఉండబోదని, అయినా లియోన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతారు తప్ప, మిగతా కార్యక్రమమంతా కన్నడ నేపథ్య సంగీతకారుడు రఘు దీక్షత్ మాత్రమే నడిపిస్తారని చెబుతున్నారు.
అమృత్‌సర్‌లోని షాదజా గ్రామ మాజీ సర్పంచ్ బల్వంత్ సింగ్‌ను రాజకీయ ప్రేరేపణలపై అరెస్టు చేయడానికి వెళ్లిన పంజాబ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పోలీసులు.. అతడు ఇంట్లో లేకపోవడంతో, అతడి కోడలు జస్వీందర్ కౌర్‌ను.. ‘‘ఏ కారణంతో మా మామగారిని అరెస్ట్ చేయడానికి వచ్చారు?’’ అని అడిగిందన్న ఆగ్రహంతో ఆమెను జీప్ బోనెట్‌పై వేసుకుని తీసుకెళుతుండగా.. మూడు కిలోమీటర్లు ఎలాగో పట్టు తప్పకుండా నిలదొక్కుకున్న కౌర్ ఓ మలుపులో రోడ్డుపై పడి.. గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనపై తక్షణ విచారణకు ఆదేశించిన పంజాబ్ హోం శాఖ.. ఆ మహిళపై దురుసుగా ప్రవర్తించిన పోలీసుల వెనుక ఏ పార్టీ నాయకులు ఉన్నారనే దాని పైనా దృష్టి సారించింది.
నోయిడాలోని అమిటీ యూనివర్సిటీలో చదువుతున్న కాంగో విద్యార్థిని ముకోకో మిసా ట్రెసార్ పై 2014 సెప్టెంబర్ 26న మూక దాడి జరిపిన కేసులో.. ఆ మూకల్ని రెచ్చకొట్టి, దాడికి పురికొల్పిన నేరారోపణలకు తగిన రుజువులు ఉండడంతో ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి, ఆప్ పార్టీ నాయకుడు సోమనాథ్ భారతిపై అభియోగ పత్రాలను దాఖలు చేయాలని ఢిల్లీ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన కొన్ని వారాల తర్వాత ఖిర్కీ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో మాదకద్రవ్యాలు విక్రయిస్తూ, వ్యభిచారం చేస్తున్నారన్న అనుమానంతో అక్కడి కొందరు ఆఫ్రికన్ మహిళలపై దాడి జరిపిన దుండగులు.. విద్యార్థిని అయిన ముకోకో మిసా ట్రెసార్‌పైన కూడా మూకుమ్మడి దాడికి పాల్పడగా.. ఆ ప్రాంతం ఉన్న మలావియా నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి హస్తం ఈ దాడుల వెనుక ఉందన్న ఆరోపణపై అప్పట్లోనే కేసు నమోదు అయింది.
రాఫెల్ డీల్‌పై ఓ వ్యంగ్యాస్త్రంగా ప్రధాని మోదీ ఫొటోను అనుచితంగా చిత్రీకరించి ట్విట్టర్‌లో పెట్టిన కాంగ్రెస్ సోషల్ మీడియా అండ్ డిజిటల్ కమ్యూనికేషన్స్ విభాగం ఇన్‌చార్జి, మాజీ ఎం.పి. దివ్య స్పందన అలియాస్ రమ్యపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. దివ్య స్పందన ట్వీట్ చేసిన ఆ ఫొటో దేశ ప్రధానిని కించపరచడమే కాకుండా, దేశ ప్రతిష్టను సైతం భంగపరిచేలా ఉందని లక్నోకు చెందిన సామాజిక కార్యకర్త, న్యాయవాది అయిన సయీద్ రిజ్వాన్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దివ్య స్పందనపై పోలీసులు సెక్షన్ 67 ఐటీ యాక్ట్, సెక్షన్ 124ఎ (దేశద్రోహం) ఐ.పి.సి. యాక్టు కింద కేసులు నమోదు చేశారు.
ఇంగ్లండ్ నవ రాకుమారి, ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ తన కారు డోరును తనే వేయడం బ్రిటన్ రాజప్రాసాదాన్ని, బ్రిటన్ దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది! మేఘన్ మంగళవారం నాడు లండన్‌లోని రాయల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్‌లో జరుగుతున్న ఎగ్జిబిషన్‌లోని ఒక కార్యక్రమానికి హాజరయేందుకు వచ్చినప్పుడు, తానొచ్చిన నల్ల రంగు సెడెన్ కారులోంచి దిగి, అక్కడి భద్రతా సిబ్బంది ఆమె దిగిన వైపు కారు డోరును వేసేలోపే, అసంకల్పితంగా ఆమే కారు డోరు వెయ్యడం.. సోషల్ మీడియాలో ఒక నివ్వెరపరిచే వార్తలా వైరల్ అవుతుండగా... ‘‘రాజకుటుంబ సంప్రదాయాలు తెలియక కాదు, అలవాటు కొద్దీ మేఘన్ అలా చేశారు’’ అని ఆమె ప్రతినిధి ఒకరు వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది.
అమన్‌దీప్ మాధుర్ అనే 26 ఏళ్ల భారతీయ సంతతి బ్రటిష్ మహిళ తన ప్రేమను కాదన్న మాజీ ప్రియుడిని, అతడి కుటుంబాన్ని గత ఐదేళ్లుగా వేధింపులకు గురి చేస్తూ, మత విశ్వాసాలు గాయపడేలా అతడి ఇంట్లోకి ఆవు మాంసాన్ని విసురుతూ.. అతడి చెల్లెళ్లపై, తల్లిపై అత్యాచారం జరుపుతామని మనుషుల్ని పెట్టి బెదిరిస్తూ, ఇంటిని బాంబులు పెట్టి పేల్చేస్తానని భయపెడుతూ.. ఇన్ని రకాలుగా చిత్ర హింసలు పెట్టిన నేరానికి యు.కె. కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఫోన్ కాల్స్ ద్వారా, సోషల్ మీడియాలోనూ అమన్‌దీప్ పెట్టిన టార్చర్‌కు బాధితుడు అన్ని విధాలా మానసికంగా కృంగిపోయాడని నిర్థారించుకున్న కోర్టు ఆమె శిక్ష విధించడంతో పాటు, కౌన్సెలింగు కూడా అవసరమని సూచించింది.
పరస్త్రీ, పరపురుష సంబంధాలు (అడల్టరీ) తప్పు కాదని గురువారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బాహాటంగా వ్యతిరేకించిన ఢిల్లీ ఉమెన్ పానెల్ చీఫ్ స్వాతీ మలీవాల్‌పై సోషల్ మీడియాలో దారుణాతి దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ‘‘మహిళలకు వ్యతిరేకంగా ఉన్న ఈ తీర్పు మన వివాహ వ్యవస్థ పవిత్రతనే పంకిలపరిచింది’’ అనే అర్థంలో ఆమె చేసిన ట్వీట్‌కు ప్రతి స్పందనగా సోషల్ మీడియాలో ముక్కూమొహం లేని అకౌంట్‌ల నుండి అమె మనసును గాయపరిచే కామెంట్‌లు అనేకం వెల్లువెత్తాయి.
స్త్రీలోక సంచారం
Published Fri, Sep 28 2018 12:18 AM | Last Updated on Fri, Sep 28 2018 12:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment