నటి సన్నీ లియోన్ పేరును ఉపయోగించుకుని ప్రభుత్వం నుంచి నెలకు వెయ్యి రూపాయలు పొందుతున్న వ్యక్తిని అధికారులు గుర్తించారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలలో ఇలాంటి మోసం జరిగిందని తెలియడంతో అందరూ షాక్ అయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లో అర్హత కలిగిన వివాహిత మహిళల కోసం ఆర్థిక సహాయ చేసేందుకు 'మహతారీ వందన్ యోజన'పథకాన్ని ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారులకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. అయితే, కొందరు దీనిని ఆసరా చేసుకుని తప్పుడు పత్రాలు అందించి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలోని తాలూర్ గ్రామానికి చెందిన వీరేంద్ర జోషి ఈ మోసానికి పాల్పడ్డాడు. సన్నీ లియోన్ పేరు మీద బ్యాంక్ ఖాతా తెరిచి, అందులో జమ అయ్యే 1,000 మొత్తాన్ని తన జేబులో వేసుకున్నాడు. తాజాగా మహిళల ఖాతాలను అధికారులు పరిశీలిస్తుండగా అందులో సన్నీలియోన్ పేరు ఉండడాన్ని గుర్తించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై లోతుగా విచారణ జరిపి బ్యాంకు ఖాతాను కలెక్టర్ హరీస్ సీజ్ చేశారు. అతను అందుకున్న డబ్బు రికవరీ చేయాలని మహిళా శిశు అభివృద్ధి శాఖను కలెక్టర్ ఆదేశించారు. మహిళలందరికీ వర్తించే మహతారీ వందన్ యోజన పథకంలో అతను మోసానికి పాల్పడ్డాడని పోలీసులు కేసు నమోదు చేశారు. సన్నీ లియోన్ పేరుతో బ్యాంకు ఖాతాకు అనుమతి ఇచ్చిన బ్యాంక్ అధికారులతో పాటు ప్రభుత్వ పథకం మంజూరు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
ఈ వార్త వెలుగులోకి రావడంతో అధికార బీజేపీపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఇరు పార్టీల మధ్య వాగ్వాదానికి దారితీసింది. 'మహతారీ వందన్ యోజన'పథకం కింద సుమారు 50 శాతం మంది లబ్ధిదారులు నకిలీలే అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ దీపక్ బైజ్ ఆరోపించారు. సన్నీ లియోన్ పేరుతో నెలకు వెయ్యి రూపాయలు అందుకున్న ఈ కేటుగాడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment