ఫిఫా వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ గెలుపుపై ఆనందం వ్యక్తం చేస్తూ పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ ‘వియ్ వన్’ అని ట్వీట్ చెయ్యడంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగుతోంది. ‘పుదుచ్చేరి సోదరసోదరీమణులకు అభినందనలు. మనం గెలిచాం. గ్రామాల మధ్య, పట్టణాల మధ్య, నగరాల మధ్య ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లను నిర్వహించడం ద్వారా మన కేంద్రపాలిత ప్రాంతంలో ఫుట్‌బాల్ స్పిరిట్‌ను నింపవచ్చు. సమైక్యంగా ఉండడానికి ఒక్క బంతి చాలు’ అని మొదట ట్వీట్ చేసిన బేడీ, తర్వాతి ట్వీట్‌లో.. ‘మన పుదుచ్చేరీలం (ఒకప్పటి ఫ్రెంచి భూభాగం) ప్రపంచ కప్పును గెలిచాం’ అని పోస్ట్ చెయ్యడంతో దానినొక వేళాకోళంగా భావించిన వారు ఆమెపై నెట్‌లో నిరవధికంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
హరియాణాలో మున్సిపల్ సమావేశాలకు మహిళా కౌన్సెలర్లు తరచు గైర్హాజరవుతూ, తమ ప్రతినిధులుగా భర్తలను, బంధువులను పంపడంపై రాష్ట్ర స్థానిక సంస్థల మంత్రి కవితాజైన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం ద్వారా ప్రజలకు మెరుగైన పాలన అందివ్వాలని కేంద్ర ప్రభుత్వం ఒక వైపున ప్రయత్నిస్తుంటే, ఎన్నికైన మహిళా ప్రతినిధులు కనీసం సమావేశాలకు హాజరుకాకపోవడం విచారకరమని అంటూ, ఇక మీదట మహిళా కౌన్సెలర్లు వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరైతే వారిని తొలగించడం జరుగుతుందని ఆమె తెలిపారు ::: మహిళా సంక్షేమాన్ని, సాధికారతను సాధించకుండా సామాజిక అభివృద్ధిని కనీసం ఊహించను కూడా ఊహించలేమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ అన్నారు. మహిళా చట్టాలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమానికి హాజరైన జైరామ్.. మహిళలపై జరుగుతున్న నేరాలకు అడ్డుకట్టు వేసేందుకు ఎన్ని చట్టాలను తెస్తున్నా జరగవలసింది ఇంకా ఎంతో ఉందనీ, మొదటైతే మహిళలు తమకున్న హక్కులు, చట్టాల గురించి తెలుసుకుని ఉండాలని అన్నారు
‘మీరింకా సినిమాల్లోకి రాకముందు, అంత చిన్న వయసులోనే తొందరపడి మీరు గౌరీని ఎందుకు పెళ్లి చేసుకున్నారని సోషల్ మీడియాలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది! ‘భాయ్.. ప్రేమ, అదృష్టం ఎప్పుడైనా రావచ్చు. కానీ గౌరీతో పాటు ఆ రెండూ ఒకేసారి నా జీవితంలోకి వచ్చేశాయి’ అని షారుక్ జవాబు చెప్పారు ::: బాలీవుడ్ తారలు దీపికా పదుకోన్, కత్రీనా కైఫ్‌ల మధ్య.. దీపిక పూర్వపు బాయ్‌ఫ్రెండ్ రణబీర్ కపూర్ విషయంలో ‘ఇంకా కొనసాగుతూనే ఉంది’ అనుకుంటున్న ఏళ్లనాటి శత్రుత్వం.. (జూలై 16న కత్రీనా బర్త్‌డే ఇన్‌స్టాగ్రామ్ ఫొటోకు దీపిక పెట్టిన ‘ఫీల్‌గుడ్’ కామెంట్‌తో) సమసిపోయిందని ఇద్దరి అభిమానులు ఆనందిస్తున్నారు. ఆ ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలో కత్రీనా తన 21 ఏళ్ల వయసు నాటి ఫొటోను పెట్టి, ట్వంటీ వన్ ప్లస్ మరికొన్ని సంవత్సరాలు.. క్రెడిట్ మై మామ్’ అని పెట్టిన పోస్టుకు స్పందనగా.. ‘హ్యాపీ బర్త్‌డే! విషింగ్ యు గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఆల్వేస్..’ అని కామెంట్ పెట్టడంతో పాటు ఒక హార్ట్ సింబల్‌ను కూడా దీపిక ఇన్‌సర్ట్ చేశారు.
స్త్రీలోక సంచారం
Published Wed, Jul 18 2018 12:16 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment