
పఠాన్ మూవీలోని పాటపై వివాదం మరింత ముదురుతోంది. ఈ సాంగ్‌లో దీపికా పదుకొణె ధరించిన డ్రెస్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. రోజు రోజుకు ఈ పాటను వ్యతిరేకించేవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా బేషరమ్ రంగ్ పాటపై బాలీవుడ్ నటుడు, శక్తిమాన్ పాత్రధారి ముకేశ్ కన్నా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ పాటను అత్యంత అసభ్యకరంగా చిత్రీకరించారని ఆయన మండిపడ్డారు. ఇతరుల ఫీలింగ్స్‌ను రెచ్చగొట్టేలా ఉన్న ఇలాంటి పాటలను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించిందని నిలదీశారు.
ముకేశ్ కన్నా మాట్లాడుతూ.. 'ప్రస్తుతం సినీ పరిశ్రమ గాడి తప్పింది. సినిమాల్లో అశ్లీలత ఎక్కువైంది. ఇప్పుడు కురచ దుస్తుల్లో నటీనటుల్ని చూపించిన ఫిల్మ్‌మేకర్స్.. భవిష్యత్తులో నగ్నంగా చూపిస్తారేమో. ఇలాంటి వాటిని అంగీకరించడానికి మనమేమీ స్పెయిన్, స్వీడన్‌లో లేము. ఏ ఒక్కరి వ్యక్తిగత భావాలు, నమ్మకాలకు కించపరచకుండా సినిమాలు ఉండేలా చూసుకోవడం సెన్సార్ బోర్డు పని. యువతను తప్పుదోవ పట్టించే చిత్రాలకు అనుమతివ్వకూడదు. ఇతరుల ఉద్దేశాలను రెచ్చగొట్టే విధంగా ఉన్న ఇలాంటి వస్త్రధారణను ఎలా అంగీకరించారు.' అని ప్రశ్నించారు.
షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం పఠాన్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్రంలోని బేషరమ్ రంగ్ సాంగ్ రిలీజ్ కాగా... దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినిమా నుంచి ఈ పాటను తొలగించాలని లేదంటే రిలీజ్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment