![Womens empowerment :Cancellation of 25 NRI Husbandry Passports - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2018/11/21/2-Women-Health.jpg.webp?itok=8l2rW1vN)
పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లాక భార్యను వదిలించుకుని, ముఖం చాటేసి తిరుగుతున్నారన్న ఆరోపణలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవలి కొద్ది నెలల్లోనే 25 మంది ఎన్నారై భర్తల పాస్‌పోర్ట్‌లను రద్దు చేసి, వారిపై ‘లుకౌట్ సర్క్యులర్’ జారీ చేసినట్లు కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ తాజాగా విడుదల చేసిన సమాచారంలో వెల్లడైంది. భార్యకు, కుటుంబ సభ్యులకు తెలియకుండా, నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటుకూ దొరక్కుండా తిరిగే ఇటువంటి భర్తలను వలపన్ని పట్టేందుకు జారీ అయ్యే లుకౌట్ నోటీసు వల్ల నిందితులు దేశాలు దాటేందుకు అవకాశం ఉండదు. ఎక్కడిక్కడ తనిఖీ చేస్తారు కనుక, ఎక్కడివారు అక్కడే ఉండిపోవలసి వస్తుంది. మరోవైపు.. తప్పుడు ఎన్నారై భర్తల ఆగడాలను నియంత్రించేందుకు జాతీయ మహిళా కమిషన్ ఈ ఏడాది జనవరిలో చట్టాన్ని మరింత కట్టుదిట్టం చేయడంతో ఇంతవరకు 578 మంది మహిళలు ముందుకొచ్చి తమ భర్త పెడుతున్న గృహహింసపైన, ఇతర దుశ్చర్యల మీద కమిషన్‌కు ఫిర్యాదు చేయగలిగారు.
దీర్ఘకాలిక వ్యాధులకు నిత్యం మందులు వాడుతుండే మహిళల్లో ఔషధ దుష్ప్రభావాలను గణనీయంగా తగ్గించేందుకు పంజాబ్ ఆరోగ్యశాఖ ‘హార్మ్ రిడక్షన్ ప్రాజెక్టు’ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా మొదట పంజాబ్‌లోని కపుర్తల జిల్లాలో అమలు చేయబోతున్నారు. ‘హార్మ్ రిడక్షన్ అడ్వొకసీ ఇన్ ఏషియా’, ‘గ్లోబల్ ఫండ్ టు ఫైట్ ఎయిడ్స్, ట్యూబర్‌క్యులోసిస్ అండ్ మలేరియా’ సంస్థల భాగస్వామ్యంతో పంజాబ్ ఆరోగ్య శాఖ ఈ ప్రాజెక్టును చేపట్టింది. మందుల దుష్ఫ్రభావాలను తగ్గించడానికి మార్గాలను అన్వేషించడమే కాకుండా, మందుల వాడకం వల్ల సామాజికంగా, ఆర్థికంగా మహిళలకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను వెదికేందుకు పెట్టుబడులు రాబట్టి, పరిశోధనలు, అధ్యయనాలు చేయించడం; వాటి ఫలితాలను అనుసరించి మందులు వాడే మహిళలకు సూచనలు ఇవ్వడం ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశమని ‘ఇండియా హె.ఐ.వి./ఎయిడ్స్’ సంస్థ డైరెక్టర్ (పాలసీ) డాక్టర్ ఉమంగ్ చావ్లా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment