సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కోరుట్ల: తీగ లాగితే పాస్‌పోర్టుల డొంకంతా కదులుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్లతోపాటు కరీంనగర్, వేములవాడ, సిరిసిల్లలోనే ఈ రాకెట్‌కు ప్రధాన ఏజెంట్లు ఉన్నారు. ఇక్కడి చిరునామాలతో పలువురు రోహింగ్యాలు విదేశాలకు వెళ్లారన్న విషయాన్ని గుర్తించిన సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వారికి పలు నిర్ఘాంతపోయే విషయాలు తెలుస్తున్నాయి.
స్థానికులు, విదేశీయులు అన్న తేడా లేకుండా.. ఎవరికి పాస్‌పోర్టులు కావాలన్నా.. కేవలం కొన్నిరోజుల్లోనే వచ్చేలా చేయడంలో వీరిది అందెవేసిన చేయి. ఇప్పటివరకూ 92 మందిని దేశం దాటించగలిగారు. ఇలా వెళ్లిన వారిలో విదేశీయులు ఉండటంతో విషయాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పైగా ఈ దందాకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సహకరించారన్న విషయాన్నీ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.
నాంపల్లి టు జగిత్యాల
ఈ రాకెట్‌కు నాంపల్లికి చెందిన అబ్దుల్ సత్తార్ ఒస్మాన్ అల్ జవహరీ ప్రధాన సూత్రధారి. ఇతను నాంపల్లిలోని బడే మజీదు వద్ద నివసించే ఇతను డీటీపీ గ్రాఫిక్స్‌లో సిద్ధహస్తుడు. ఈ పనితోపాటు పాస్‌పోర్టు బ్రోకర్‌గాను పనిచేసేవాడు. నకిలీ విద్యార్హతలు, ఆధార్, పాన్‌కార్డు ఇలా కీలక నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తూ గల్ఫ్ ఏజెంట్ల సర్కిల్‌లో బాగా పాపులర్ అయ్యాడు. వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లోని బ్రోకర్లకు పాస్‌పోర్ట్‌లకు కావాల్సిన సర్టిఫికెట్లు సమకూర్చేవాడు. ఈ గ్యాంగ్ వద్ద దగ్గర దొరకని పత్రం అంటూ ఏదీ ఉండదు.
విద్యార్హత, ధ్రువీకరణ పత్రం, ఆధార్, పాన్ ఏది కావాలన్నా నిమిషాల్లో రెడీ చేస్తాడు. కొందరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా వీరికి సహకరించడంతో వీరి పని మరింత సులువై, పాస్‌పోర్టులు ఇప్పించి విదేశీయులను భారతీయులుగా దేశం దాటించగలిగారు. వీరు ఇప్పించిన పాస్‌పోర్టుల్లో అత్యధిక పాస్‌పోర్టులకు ఒకే ఆధార్, ఒకే ఫోన్ నంబరు ఉండటంతో విషయం వెలుగుచూసింది.
ఈసీఎన్‌ఆర్ కేటగిరీలోనే..
ఇమిగ్రేషన్‌లో దొరికిపోకుండా తనిఖీలు అవసరం లేని ఈసీఎన్‌ఆర్ (ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్) కేటగిరీలోనే పాస్‌పోర్టులు ఇప్పించారు. ఇందుకు వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారు. చాలా పాస్‌పోర్టులకు ఒకే ఆధార్ కార్డు ఉండటం, కస్టమర్లందరికీ ఏజెంట్లు తమ ఫోన్ నంబరునే అటాచ్ చేసి ఉంచడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా సోదాలు చేసిన సీఐడీ అధికారులు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 12 మంది నిందితులను అరెస్టు చేసి, ఫారినర్స్ యాక్ట్ 1946, పాస్‌పోర్ట్ యాక్ట్‌తోపాటు పలు సెక్షన్ల కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా నుంచి ఏజెంట్లు
రాకెట్ సూత్రధారి అబ్దుల్ సత్తార్ తన నెట్‌వర్క్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాడు. అబ్దుల్ సత్తార్ ఉస్మాన్ అల్ జవహరీ నాంపల్లి (హైదరాబాద్)కి చెందినవాడు కాగా.. మిగిలిన మహ్మద్ ఖమ్రుద్దీన్, చాంద్‌ఖాన్, దేశోపంతుల అశోక్ రావు (కోరుట్ల), పెద్దూరి శ్రీనివాస్ (తిమ్మాపూర్, కరీంనగర్), గుండేటి ప్రభాకర్ (జగిత్యాల), పోచంపల్లి దేవరాజ్ (వేములవాడ, సిరిసిల్ల), అబ్దుల్ షుకూర్ (రాయికల్, జగిత్యాల). వీరంతా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం.
వీరంతా కలిసి ఎంతమందికి నకిలీ సర్టిఫికెట్లు ఇప్పించారు..? ఎంతమంది విదేశీయులకు పాస్‌పోర్టులు ఇప్పించారు..? అన్న విషయంపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక్కడి చిరునామాలతో పలువురు కెనడా, మలేసియా, దుబాయ్, గల్ఫ్ దేశాలు, స్పెయిన్, ఫ్రాన్స్, థాయ్‌లాండ్, ఇరాక్ తదితర దేశాలకు వెళ్లినట్టు గుర్తించారు. వారంతా అక్కడ ఏం చేస్తున్నారు..? ఏ కంపెనీలో పనిచేస్తున్నారు..? అన్న విషయాన్ని కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు.
పదేళ్ల తర్వాత మళ్లీ...
2014లోనే డబుల్ పాస్‌పోర్ట్‌లు, వాటికి అవసరమైన నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేస్తున్నారన్న ఆరోపణలతో కోరుట్లకు చెందిన ఖమరోద్దీన్, అశోక్‌రావు, చాంద్‌పాషాపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కొంతకాలం ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. శుక్రవారం సీఐడీ అధికారుల దాడులతో వీరంతా పాస్‌పోర్ట్ దందా ఆపలేదని రుజువైంది.
Comments
Please login to add a commentAdd a comment