సాక్షి, హైదరాబాద్, సాక్షిప్రతినిధి, కరీంనగర్: నివాస ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు ఇలా అన్నింటినీ నకిలీవి సృష్టించి విదేశీయులకు స్థానికంగా పాస్‌పోర్టులు జారీ చేయిస్తున్న ఓ ముఠా గుట్టురట్టు చేశారు తెలంగాణ సీఐడీ పోలీసులు. ఈ మొత్తం ముఠాలో కీలక నిందితుడు అబ్దుస్ సత్తార్ ఉస్మాన్ అల్ జహ్వరీతో పాటు నకిలీ పాస్ పోర్టుల జారీకి పనిచేస్తున్న తొమ్మిది మంది ముఠా సభ్యులు, వీరికి సహకరిస్తున్న ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులు.. మొత్తం 12మందిని శుక్రవారం అరెస్టు చేశారు.
విదేశాల నుంచి వచ్చిన శరణార్థులు, అక్రమ చొరబాటు దారులకు నిబంధనలకు విరుద్ధంగా పాస్‌పోర్టులు జారీ అవుతున్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ సీఐడీ రంగంలోకి దిగింది. హైదరాబాద్, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో సీఐడీ అధికారుల 12 ప్రత్యేక బృందాలు ఈనెల 18న ఏక కాలంలో సోదాలు జరిపాయి.
ఈ సోదాల్లో 108 పాస్‌పోర్టులు, 15 మొబైల్ ఫోన్లు, ఐదు ల్యాప్‌టాప్‌లు, మూడు ప్రింటర్లు, 11 పెన్‌డ్రైవ్‌లు, ఒక స్కానర్, పాస్‌పోర్టు దరఖాస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐడీ ఎకనమిక్ అఫెన్స్ వింగ్ ఎస్పీ కే వెంకట లక్ష్మి నేతృత్వంలో చేపట్టిన ఈ ఆపరేషన్ వివరాలను సీఐడీ అడిషనల్ డీజీ శిఖాగోయల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
నకిలీ పత్రాల తయారీ నుంచి పాస్‌పోర్టుల వరకు
హైదరాబాద్‌కు చెందిన అబ్దుస్ సత్తార్ స్థానికంగా గ్రాఫిక్ డిజైనింగ్, ప్రింటింగ్ వర్క్‌లో పనిచేసేవాడు. 2011నుంచి ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్, డిగ్రీ సర్టిఫికెట్లు, జనన ధ్రువీకరణ పత్రాలు సృష్టించడం ప్రారంభించాడు. చెన్నైకి చెందిన ఓ పాస్‌పోర్టు బ్రోకర్‌తో టచ్‌లోకి వెళ్లిన సత్తార్..రూ.75 వేల కమీషన్‌కు ఒక్కో పాస్‌పోర్టు జారీ చేసేలా.. ఇందుకు అవసరమైన నకిలీ పత్రాలు కూడా సృష్టించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ముందుగా నకిలీ ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన తర్వాత సత్తార్ హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోని పాస్‌పోర్టు కార్యాలయాల్లో స్లాట్‌లు బుక్ చేయించి ఇక్కడి నుంచి పాస్‌పోర్టులు జారీ చేయించేవాడు. పోలీస్ వెరిఫికేషన్‌కు వచ్చే స్పెషల్ బ్రాంచ్ అధికారులకు సైతం లంచాలు ఇస్తూ ఈ దందా కొనసాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు కీలక నిందితులతోపాటు ఈ ముఠాలో చెన్నై ఏజెంట్‌ను సైతం బెంగళూరులో అరెస్టు చేసి అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
ఈ ముఠా నుంచి పాస్‌పోర్టులు పొందిన వారిలో 92 మంది విదేశీ ప్రయాణాలు చేసినట్టు సీఐడీ అధికారుల దర్యాప్తులో తెలిసింది. మొత్తం 12 మంది నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్టు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు వారు పేర్కొన్నారు.
స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు లంచాల ఎర!
నకిలీ పాస్‌పోర్టుల కుంభకోణంలో సీఐడీ అధికారులు తవ్విన కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన ఈ ముఠా.. కేవలం నకిలీ పత్రాలతో పాస్‌పోర్టులను సంపాదించడమే కాకుండా.. విదేశీయులు, దేశంలోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు కూడా భారతీయత ఉండేలా తప్పుడు ఐడీలు సృష్టించి, పాస్‌పోర్టులు, వీసాలు ఇప్పించి సాగనంపారని తెలుస్తోంది.
స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సైతం లంచాలిచ్చి భారతీయులు కాని వారికి సైతం ఇక్కడి జనన, విద్యార్హత, ఇతర ధ్రువీకరణ పత్రాలు ఇప్పించి విదేశాలకు విమానాలెక్కించారని విచారణలో తెలిసింది. చాలా పాస్‌పోర్టులకు ఒకే ఆధార్ కార్డు ఉండటం, కస్టమర్లందరికీ ఏజెంట్లు తమ ఫోన్‌నెంబరునే అటాచ్ చేసి ఉంచడంతో అనుమానం వచ్చిన పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా సోదాలు చేపట్టడంతో ముఠా గుట్టు బయటపడింది.
అరెస్టు అయింది వీరే!
అబ్దుస్ సత్తార్ ఉస్మాన్ అల్ జవహరీ నాంపల్లి.. హైదరాబాద్, మహ్మద్ ఖమ్రుద్దీన్ కోరుట్ల, చాంద్ ఖాన్ కోరుట్ల, దేశోపంతుల అశోక్ రావు కోరుట్ల, పెద్దూరి శ్రీనివాస్ తిమ్మాపూర్.. కరీంనగర్, గుండేటి ప్రభాకర్ జగిత్యాల, పోచంపల్లి దేవరాజ్ వేములవాడ, చెప్పాల సుభాష్ భీంగల్.. నిజామాబాద్, అబ్దుల్ షుకూర్ రాయికల్.. జగిత్యాల, సయ్యద్ హాజీ (కాలాపత్తర్) తోపాటు వీరికి సహకరించిన మరో ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులు అరెస్టయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment