బాధిత మహిళలకు అండగా రాష్ట్ర మహిళా భద్రత విభాగంలోని ఎన్‌ఆర్‌ఐ సెల్
2019 నుంచి ఈ ఏడాది జూలై వరకు 450 కేసులు నమోదు
68 మందిపై లుక్ అవుట్ నోటీసులు, 19 మంది పాస్‌పోర్టులు రద్దు
ఆరు జంటలను తిరిగి కలిపిన మహిళా భద్రత విభాగం
సాక్షి, హైదరాబాద్: అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతుళ్లు జీవితాంతం గొప్పగా బతకాలన్న కోరికతో కొందరు తల్లిదండ్రులు ఎన్‌ఆర్‌ఐలకు ఇచ్చి పెళ్లిళ్లు చేస్తుంటే.. దేశంకాని దేశంలో అడుగుపెట్టిన యువతుల్లో కొందరి పరిస్థితి దారుణంగా మారుతోంది. అదనపు కట్నం ఇవ్వట్లేదనో లేక ఇతర కారణాలను సాకుగా చూపించో భార్యలను కొందరు ఎన్‌ఆర్‌ఐ భర్తలు వేధిస్తున్నారు. అలా ఎన్‌ఆర్‌ఐ భర్తల చేతిలో దాడులు, గృహహింసకు గురవుతున్న అతివలకు రాష్ట్ర మహిళా భద్రత విభాగంలోని ఎన్‌ఆర్‌ఐ సెల్ అండగా నిలుస్తోంది.
వ్యూహాత్మక చర్యలు చేపడుతూ వేధింపులకు పాల్పడే ఎన్‌ఆర్‌ఐ భర్తల మెడలు వంచుతోంది. నేరుగా ఫిర్యాదులను స్వీకరించడంతోపాటు ఈ–మెయిల్, జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి వచ్చే ఫిర్యాదులు, షీ–టీమ్స్ వాట్సాప్, ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ఫిర్యాదులు తీసుకుంటూ బాధితులకు తగిన న్యాయం అందేలా చేస్తోంది. వీలైన కేసుల్లో యువతుల కాపురాలు తిరిగి నిలబెట్టేలా కృషి చేస్తోంది. అలాగే ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కలి్పస్తోంది. ఇప్పటివరకు ఎన్‌ఆర్‌ఐ సెల్‌కు వచ్చిన కేసుల్లో ఆరు జంటలను కలిపినట్లు అధికారులు తెలిపారు.
అవసరమైతే పాస్‌పోర్టు సీజ్..
వేధింపులకు పాల్పడే ఎన్‌ఆర్‌ఐ భర్తలను దారికి తెచ్చేందుకు వీలైన అన్ని మార్గాలను ఎన్‌ఆర్‌ఐ సెల్ ఉపయోగిస్తోంది. అవసరం మేరకు లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ)లు జారీ చేయించడం, వారి పాస్‌పోర్టులు రద్దు చేయించడం కూడా చేస్తోంది.
తెలంగాణ విమెన్ సేఫ్టీ వింగ్ ఎన్‌ఆర్‌ఐ సెల్ అందించే సాయం ఇదీ..
⇒ బాధిత మహిళలకు లీగల్ గైడెన్స్. గృహహింసకు సంబంధించి కేసుల నమోదు.
⇒ భార్యలను వేధించే ఎన్‌ఆర్‌ఐ భర్తలను స్వదేశానికి రప్పించేలా ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం, కేంద్ర హోంశాఖ, విదేశాంగశాఖ, జాతీయ మహిళా కమిషన్, విదేశాల్లోని కాన్సులేట్ కార్యాలయాలకు లేఖలు రాయడం. వారు కేసుల విచారణను ఎదుర్కొనేలా చేయడం.
⇒ఒకవేళ బాధితురాలు విదేశాల్లోనే ఉంటే వారికి తగిన సాయం అందేలా అక్కడి ఎన్‌జీవోల సహకారం తీసుకోవడం.
⇒ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్లకు సిద్ధపడే వారి కుటుంబాలకు ప లు అంశాలపై పోస్టర్లు, బ్రోచర్లు, సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించడం.
⇒నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్‌ఆర్‌ఐ) పెళ్లిళ్ల కేసుల దర్యాప్తులో అనుసరించాల్సిన పద్ధతులపై పోలీసులకు (స్టేషన్ హౌస్ ఆఫీసర్లు) శిక్షణ, కేసుల నిరంతర పర్యవేక్షణ.
2019 జూలై నుంచి ఈ ఏడాది జూలై 31 వరకు ఎన్‌ఆర్‌ఐ సెల్ పనితీరు ఇలా..
⇒మొత్తం ఫిర్యాదులు: 1,801
⇒నమోదు చేసిన కేసులు: 450
⇒రాజీ కుదిరిన, దర్యాప్తు పూర్తయిన కేసులు:150
⇒ఎల్‌ఓసీల జారీకి ప్రతిపాదించిన కేసులు:216
⇒జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్లు:68
⇒ఎన్‌ఆర్‌ఐ భర్తల పాస్‌పోర్టులు రద్దు ఉదంతాలు:19
⇒ఎన్‌ఆర్‌ఐ భర్తల పాస్‌పోర్టులు కోర్టు జప్తు చేసినవి: 23
⇒స్వదేశానికి వచ్చి కోర్టుల్లో విచారణ ఎదుర్కొన్న నిందితులు:47
Comments
Please login to add a commentAdd a comment